[‘నల్లమల వాలిమామ ప్రపంచం’ అనే ఐదు భాగాల పుస్తకాన్ని వెలువరించిన శ్రీ సురేశ్ వెలుగూరి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం సురేశ్ వెలుగూరి గారూ.
సురేశ్ వెలుగూరి: నమస్కారమండీ.
~
ప్రశ్న 1. ‘నల్లమల వాలిమామ ప్రపంచం’ పుస్తకాన్ని తెలుగులో ఇంతవరకూ ఇలాంటి పుస్తకం లేదన్న రీతిలో రూపొందించారు. శుభాకాంక్షలు. ఈ పుస్తకం ఇలాగే రూపొందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ స్థాయిలో పుస్తకం తీసుకురావటానికి ఎంత కష్టపడ్డారు?
జ: మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ‘నల్లమల వాలిమామ ప్రాజెక్టు’ను పూర్తిచేయడానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. “ఈ పుస్తకం ఇలాగే రాయాలి” అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, మారుతున్న వాతావరణ పరిస్థితులూ, ప్రకృతికి అవుతున్న గాయాల గురించి రాయాలని చాలాకాలంగా మనసులో బలంగా వుంది. దానిని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేయాలనే ఆలోచన పెరిగిపోతూవచ్చింది. ఇవ్వాళ్టి పిల్లలకు వాతావరణ పరిస్థితులు, పర్యావరణం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెద్దగా లేదు. ఇందుకు కారణం వారి అకడమిక్ సిలబస్‌లు బాగా పెరిగిపోవడమే. ఇక పెద్దవారికి ఈ మారుతున్న పరిస్థితుల గురించి అనుభవపూర్వకమైన అవగాహన వుండడం వల్ల వారి పిల్లలకు ఎంతోకొంత ప్రయోజనం కలుగుతోంది. కొందరు టీచర్లు కూడా ఈ బాధ్యతను తీసుకుంటున్నారు. ప్రయివేటు సెక్టార్‌లో చదువుకుంటున్న పిల్లలకు ఈ కొరత తప్పదు. సామాన్యశాస్త్రాల్లో లభిస్తున్న సమాచారాన్నిఇంకా విస్తృతం చేయాల్సివుంది.
పిల్లలకు పెద్దగా ఆసక్తి లేకపోవచ్చు. అయినా కూడా మన బాధ్యతలను మనం మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఇవ్వాళ్టి పరిస్థితులను మరింత ఘోరంగా ఎదుర్కోబోతున్నది మన ముందుతరాల పిల్లలే. కాబట్టి ఈ పరిణామాలు, వాటి పరిష్కార మార్గాల గురించి చెప్పితీరాలి. కానీ ఒక పాఠ్యపుస్తకపు పద్థతిలో చెప్తే వారి బుర్రలకెక్కదు. కానీ, వారికి ఆసక్తివుండే పద్ధతిలో చెప్తే ఆసక్తిగానే చదువుతారు. అందుకు అనువుగా నేను ‘కథ’ అనే ప్రక్రియను ఎంచుకున్నాను. కథల్ని నడిపించే పాత్ర ఒకటుండాలి కాబట్టి, ఇందుకోసం ‘వాలిమామ’ అనే పాత్రను సృష్టించాను. ఆయన జీవన ప్రయాణంలో అనేక సందర్భాలూ, సాహసాలూ, సంఘటనల్నీ జోడిస్తూ కథలు రాసుకుంటూపోయాను.
పిల్లలు ఇప్పటికిప్పుడు నేరుగా చదువుకోలేకపోయినా, తల్లిదండ్రులు వారికీ కథల్ని చెప్పాలి. కొంత వయసు వచ్చాక.. అంటే కనీసం పన్నెండేళ్లు దాటితే, పిల్లలే వాటిని చదువుకుంటారు. కథల కంటే ముందు ఫొటోలు, వర్ణచిత్రాలే వారిని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఈ కథల గురించి వారిలో మరింత ఆసక్తి పెంచడానికి ఇవి ఉపకరిస్తాయి.
అయితే, ఈ కథల్ని నేను కేవలం పిల్లల కోసమే రాయలేదు. అన్ని వయసులవారినీ ఆకర్షించేలా, పెద్దలు కూడా ఆసక్తిగా చదివేలా వీటిని రూపుదిద్దాను. అందువల్ల బహుముఖ ప్రయోజనం వుంటుంది.
ప్రశ్న 2. పుస్తకం చూస్తూంటే, మీరు పుస్తకం ప్రచురించకముందే పుస్తకం ఎలా వుండాలో స్పష్టమైన అవగాహన వుందనిపిస్తుంది. మీరు అనుకున్నట్టే వచ్చిందా? ఏదైనా విషయంలో రాజీ పడ్డారా? ఏ విషయంలో రాజీ పడ్డారు? మీరు రాజీపడకుండా అనుకున్నట్టు వచ్చివుంటే ఎలా వుండేది పుస్తకం?
జ: ఎక్కడా రాజీపడలేదు. పుస్తకం రచన పార్ట్ పూర్తిచేసిన తర్వాతే డిజైన్ గురించి ఆలోచించాను. అయితే ఈ పుస్తకం ఇలా ‘అంతర్జాతీయ స్థాయిలో రూపొందాలి’ అనిమాత్రం ముందే అనుకున్నదే. నేను అనుకున్నదానికంటే రెండుమూడు రెట్లు బాగా వచ్చింది. పుస్తకమంతా రంగుల్లో, మంచి ఆయిల్ పేపర్ మీద ప్రచురించాలన్న నిర్ణయం ఆరేళ్ల క్రితమే తీసుకున్నది.
ప్రశ్న 3. మీరు ఇంతకుముందేమయినా కాల్పనిక రచనలు చేశారా? ఈ కథ రాసేందుకు ఎలాంటి తయారీలు చేశారు?
జ: గతంలో కాల్పనికంగా రాసినవి పెద్దగా లేవు. వార్త దినపత్రికలో పనిచేస్తున్నప్పుడు కొన్ని కథలు, కొంత కవిత్వం మాత్రం రాశాను. విపుల పత్రికకి 12 కథల్ని తెలుగు లోకి అనువాదం చేశాను. ఆతర్వాత పదిహేనేళ్లకి ‘పహాడీ మందిర్’ అనే పేరుతో ఒక డిటెక్టివ్ నవలను రాశాను. ఇందుకు స్ఫూర్తి మధుబాబు గారు. సిరీస్ తొలి పుస్తకం బాగానే సక్సెస్ అయిందికానీ, దానిని కొనసాగించలేకపోయాను. 2వ భాగం సిద్ధంగా వుంది. పరిస్థితులు అనుకూలించినప్పుడు విడుదల చేస్తాను.
కథలు రాయడం విషయానికొస్తే.. నేను రెగ్యులర్ కథకుడిని కాను. ‘వాలిమామ ప్రపంచమే’ నా తొలి కథల పుస్తకంగా చెప్పుకుంటాను. ఈ కథలు కూడా ఒక కాజ్ కోసం, సామాజిక ప్రయోజనం కోసం రాసినవే. భవిష్యత్‌లో వాలిమామ కొడుకు ‘సీంబలి’ అడవిలో చేసిన సాహసాల కథల పుస్తకం ‘సైరా సీంబలి’ని విడుదల చేస్తాను. ఇప్పటికే పుస్తకం రచన పరంగా పూర్తయింది. ఆ తర్వాత ఈ సిరీస్ ఆగిపోయినట్టే. ఇంకా కొనసాగించే ఆలోచన లేదు. నేను రాసిన 53 పుస్తకాలన్నీ వేర్వేరు అంశాలమీద రాసినవి. వీటిలో అందుబాటులో వున్న పుస్తకాలు, ఈ వాలిమామ సిరీస్‌ల మార్కెటింగ్ మీదే ఎక్కువగా దృష్టిపెడుతున్నాను. అలాగే, వాలిమామ సిరీస్‌ను ఇంగ్లీష్‌లో తెచ్చే పని జరుగుతోంది. ఫ్రెంచ్ రచన సిద్ధంగా వుంది. అన్య భాషల్లో వీటిని అనువాదాలుగా కాకుండా.. వారి భాష పాఠకులను దృష్టిలో పెట్టుకుని రీరైట్ చేస్తున్నవి.
ప్రశ్న 4. పుస్తకంలో ఫోటోలేవి, చిత్రలేఖనాలేవి అన్నది గుర్తుపట్టటం కష్టం. ఈ ఎఫెక్ట్ ఎలా సాధించారు?
జ: ఇదంతా మా చిత్రకారులు శేషబ్రహ్మం గారి వల్లనే సాధ్యమైంది. ఈ పుస్తకానికి ఆయన గీసిన అద్భుతమైన బొమ్మలు కూడా ఎంతో దోహదపడ్డాయి. కొన్ని చిత్రాలు ఫొటోలేమో అని భ్రమపడతాం. కానీ అవన్నీ గీసిన చిత్రాలే. ఇక ఫొటోల క్రెడిట్ మువ ఫొటోగ్రాఫర్లు ఎ.వి. అరవింద్, మురళి ద్వయం వల్లనే సాధ్యమైంది.
ప్రశ్న 5. పేజీ మేకప్ విశేషాలు చెప్పండి.
జ: పేజ్‌మేకప్ మొత్తం నేనే చేసుకున్నాను. లేఅవుట్‌ను ముందే తయారుచేసిపెట్టుకున్నాను. కంటెంట్‌ని కూడా పెట్టేసుకున్నాను. చిత్రకారులు శేషబ్రహ్మం గారు పంపే బొమ్మలన్నీ ఎడమవైపు పేజీల్లో వుండాలనుకున్నాను. ఫొటోగ్రాఫర్లు నల్లమల అడవి నుంచి మంచి ఫొటోగ్రాఫ్‌లు తెచ్చారు. వీటిని పుస్తకంలో అనువైనచోట అమర్చాను. అయితే, వర్ణచిత్రాల్లాగే ఎక్కువ భాగం ఫొటోలు కూడా ఎడమవైపునే అమర్చాను. పక్షులు, కొన్ని ఇతర చిన్న చిత్రాల్ని చెన్నయికి చెందిన ‘సేతు ఇమేజెస్’ సంస్థ అందించింది.
ప్రశ్న 6. ఇప్పుడు చెప్పండి, వాలిమామ కథలకు ప్రేరణ ఏమిటి?
జ: వాలిమామ కథలకు ప్రేరణ ఇదీ అని చెప్పాలంటే నేను మా స్వగ్రామం ప్రకాశం జిల్లా (ఇప్పుడు నంద్యాల జిల్లా) గిద్దలూరు దాకా వెళ్లాలి. నేను ప్రకాశం జిల్లా మార్కాపురంలో పుట్టి, గిద్దలూరు లోనే పెరిగాను. గిద్దలూరు ఇటు పల్లే కాదు, అటు పట్నమూ కాదు. ఒక అడవిపల్లె అని చెప్పుకోవచ్చు. గిద్దలూరుకీ, అడవికీ మధ్య కేవలం ఏడు కిలోమీటర్ల దూరమే. నల్లమలంతా చెంచులదే. మా నాయనమ్మకు ఒక చిన్న అంగడి వుండేది. అక్కడికి నల్లమల నుంచి చెంచులు వచ్చి తమ ఉత్పత్తులు కొన్నిటిని మా నాయనమ్మకి ఇచ్చి, బదులుగా జొన్నలు, బియ్యం నూకలు, రాగులు వంటివి బార్టర్ పద్ధతిలో తీసుకువెళ్లేవారు. కొంత డబ్బు రూపంలో తీసుకునేవారు.
ఎందుకో తెలీదుకానీ, నాకు బడి కంటే వూరే బాగా నచ్చేది. నేను బడికి వెళ్లినదానికంటే బయట తిరిగిందే ఎక్కువ. ఈ ‘స్వేచ్ఛ’ వల్లనే నాకు ఒక కొత్త ప్రపంచం అర్థమవుతూ వచ్చింది. గాంధీగారి రైల్లో చాలాసార్లు బొగద స్టేషన్ దాకా వెళ్లి, తిరుగుబండికి వెనక్కివచ్చేవాడిని. అలా నాకు నల్లమల మా తట్టు అడవంతా బాగా తెలిసిపోయింది. మా అంగడికి వచ్చే చెంచులతో మాటలు కలిశాయి. వారి ఆచారాలు, పద్ధతులు అర్థమవుతూ వచ్చాయి. పదేళ్ల వయసులోఒక పెద్దచెంచు మనిషితో కలిసి సోమిగానిగుట్ట అనే చిన్న తండాకు వెళ్లాను. నన్ను కొంచెం లోతడివి లోకి తీసుకుపోయాడాయన. అంత దిట్టమైన అడవిని చూసి మొదట బాగా భయమేసింది. వాళ్లు పూజించుకునే దేవుడి రాళ్లను చూపించాడు. అదే లోతడవితో నాకు తొలి పరిచయం. ఆతర్వాత డిగ్రీ రోజుల దాకా అనేకమార్లు అడవిలో బాగా తిరిగాను. వాలిమామ ప్రపంచం పుస్తకానికి తొలి ముద్ర పడింది అక్కడే.
1992 ప్రాంతాల్లో.. నేను గుంటూరులో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఐఎఎస్ అధికారి ఫణికుమార్ గారు రాసిన ‘గోదావరి గాథలు’ పుస్తకాన్ని చదివాను. దానిని ఒకటికి పదిసార్లు ఏకబిగిన చదివిన రోజులున్నాయి. ఆ పుస్తకం ద్వారానే నాకు ఆదిలాబాద్ గోండుల గురించి తెలిసింది. అది చదువుతున్నప్పుడల్లా నాకు మా నల్లమలే గుర్తొచ్చేది. మా చెంచులే గుర్తుకొచ్చేవారు. చెంచులకు 10 శాతం వారి సొంత (లిపి లేని) భాష వుండగా, గోండులకు 90 శాతం వారి సొంత గిరిజన భాషే వుంది. ఆ పుస్తకం నాలో చాలా ఆలోచనలు రేపింది.
ఆ తర్వాత జీవన ప్రయాణంలో చాలా మార్పులు చోటుచేసుకున్నా, నా మనసు లోంచి ఏదైనా రాయాలనే కోరిక చెరిగిపోలేదు. 2014 ప్రాంతాల్లో తొలిసారి నల్లమలలో (అన్ని తట్లలో) ప్రభుత్వం యురేనియం నిక్షేపాల్ని గుర్తించింది. అప్పట్నుంచీ చెంచుల్ని అడవి నుంచి తరిమేసే ప్రక్రియ మొదలైంది. అయితే, యురేనియంను పెళ్లగించడం చాలా కష్టం. అణు విస్ఫోటనాలు జరిగే ప్రమాదం వుండడంతో ఇప్పటిదాకా ఆ ప్రయత్నం జరగలేదు కానీ, ఇతర ఖనిజాలను తవ్వుకుపోవడం మాత్రం నిరాఘాటంగా జరుగుతోంది. నేను 2012లో నల్లమల లోతులకు వెళ్లాను. అదే ఆఖరు. ఇప్పుడు అడవి పూర్తిగా అభయారణ్యం పరిధి లోకి వచ్చింది. చెంచులకు అడవి సంపద తెచ్చుకోవడాని వెళ్లిరావడానికి తప్ప లోపలి గూడేల్లో వుండే అవకాశం లేకుండాపోయింది. డిఎఫ్ఓలు కూడా బాగా కఠినంగా మారారు. ఈ పుస్తకం కోసం కావల్సిన ఫొటోల కోసం లోతడివి లోకి వెళ్లడానికి డిఎఫ్ఓ అనుమతి లభించలేదు. ఆయన మమ్మల్ని కనీసం కలవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ, రోడ్డు పక్కనుంచి ఒక కిలోమీటరు లోపలికి వెళ్లి కొన్ని మంచి ఫొటోలను మా ఫొటోగ్రాఫర్ మిత్రులు తీసుకురాగలిగారు.
2013లో ఈ ‘నల్లమల వాలిమామ ప్రాజెక్టు’కు బీజం వేస్తే 11 సంవత్సరాలకు సంపూర్ణంగా పూర్తి చేయగలిగాను. మొదటి 4 వాల్యూమ్‌లలో చెంచుల పదసంపదను అందించాను. ఆ తర్వాత కూడా కొన్ని కొత్త పదాలు దొరికాయి. వాటిని రెండవ ఎడిషన్‌లో చేరుస్తాం.
ప్రశ్న 7. వాలిమామ మొదటి పుస్తకంలోనే మీరు 117 కథలు అన్నారు. అంటే, మీరు మొత్తం ప్రణాళిక ముందే వేసుకుని రాయటం ఆరంభించారా? లేక అంతా రాసిన తరువాత ఒక్కో పుస్తకం ప్రచురించారా?
జ: ప్రణాళిక అంటూ ఏమీ పెట్టుకోలేదు. 1000 పేజీల పెద్ద పుస్తకం కావాలని మాత్రం కోరుకున్నాను. శేషబ్రహ్మం గారు ఒక్కో వాల్యూమ్‌కీ చిత్రాలు అందించడం ఆలస్యం, ఆ వాల్యూమ్‌ని సిద్ధం చేసి ప్రెస్‌కి పంపిస్తూ వచ్చాను. ఒక్కో పుస్తకాన్నీ కొంచెం అటూఇటూగా 45 రోజుల వ్యవధిలో విడుదల చేశాను. పుస్తకం లేఅవుట్ ముందే సిద్ధం చేసిపెట్టుకోవడం వల్ల నా పని కొంచెం సులభమైంది. శేషబ్రహ్మం గారు బొమ్మలు సిద్ధం చేస్తున్న సమయంలో కూడా.. కొన్ని కొత్త కథలు కలిపాను. మొదలుపెట్టినప్పుడు.. ఐదు వాల్యూమ్‌లుండాలని, ఒక్కో వాల్యూమ్‌కీ 20 కథలు, కొంత రిఫరెన్స్ సమాచారంతో 200 పేజీల్లో రావాలని నిర్ణయించుకున్నాను. కానీ, కథలన్నిటినీ ‘వాలిమామ వయసువారీగా’ క్రానలాజికల్ పద్ధతిలో రాయడం వల్ల మొత్తం 117 కథలయ్యాయి. ఇంకో వంద కథలు రాయడానికి కూడా అక్కడ స్కోప్ వుందని ప్రాజెక్టు పూర్తయ్యాక అర్థమైంది. ఆ సాహసం బహుశా ఇక నేను చేయలేకపోవచ్చు.
ప్రశ్న 8. ఒకవేళ పాత్రలన్నీ ముందే ఊహించుకుని కథ అంతా మీ మనసులో మొదలే తయారయివుంటే, మీరు పాత్రలను ఎలా రూపొందించారు? పాత్రలు మీకు తెలిసివున్నవారి ఆధారంగా రూపొందించారా? లేక పూర్తిగా స్వకల్పితమా?
జ: ఎక్కువ భాగం వాస్తవాలే. ‘వాలిమామ’ అనే పాత్ర కల్పితం. కానీ, ఆయన జీవితంలో జరిగిన సంఘటనల్లో చాలావరకూ వాస్తవాలే. గిరిజనులందరికీ జరుగుతున్న అనుభవాలే. వాలిమామ చుట్టూ వుండే మిత్రబృందం పాత్రలన్నీ కూడా కల్పితాలే. కానీ, అటువంటి సాహస గిరిపుత్రులుంటేనే కథలకు పటుత్వం దొరుకుతుంది. వాలిమామ ఈ కథల్లో ప్రధాన పాత్రే అయినా, వాలి మిత్రబృందంలో కొందరైనా ప్రతి సందర్భంలోనూ మీకు కనిపిస్తారు.
ఇక ‘చిత్తానూరు’ అనే పేరు ‘గిద్దలూరు’ది. ఐదారు వందల సంవత్సరాల క్రితం గిద్దలూరు పేరు చిత్తానూరే. ఆతర్వాత సిద్ధులు ఈ ప్రాంతాన్ని తపోభూమిగా మార్చుకోవడంతో అది సిద్ధుల వూరు.. సిద్దులూరు, కాలక్రమేణా గిద్దలూరుగా స్థిరపడిపోయింది. ఇక కల్దారి (కలదారి) అని ప్రస్తావించిన ప్రాంతం ఒకనాటి పేరు కలదారిపల్లె. బ్రిటిష్ మాన్యువల్స్‌లో దానిపేరు ‘దొరబావి వంతెన పల్లె’ అని వుంది. అయితే, ఆ ప్రాంతం పేరు ‘దొరబావి బ్రిడ్జి’గా పేరుపడింది. ఇందుకు కారణం.. కల్దారి రైల్వే వంతెన నిర్మాణం సమయంలో అక్కడుండి పర్యవేక్షించిన ఒక అధికారి అక్కడ పనిచేస్తున్నవారి కోసం ఒక బావిని నిర్మించారు. దాన్నే ‘దొరబావి’ అని పిలుస్తారు. దానిపైన నిర్మించిన వంతెన కాబట్టి దానికి ‘దొరబావి బ్రిడ్జి’ అని పిలుస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా ‘దొరబావి వంతెన’ అనేవుంటుంది. అక్కడికి ఒకటిన్నర మైలు దూరంలో శ్రామికుల నివాసం కోసం ఒక చిన్న గ్రామం వెలసింది. దాని పేరు ‘పచ్చర్ల పల్లె’. కాలక్రమంలో పల్లె పేరు పోయి పచ్చర్ల మిగిలింది. దాని గుట్టపైన ఏర్పడిన చెంచుగ్రామం కల్దారిగుట్ట. ఊరైతే ఇప్పుడు వుందో, అటవీశాఖ రికార్డుల్లోంచి తొలగించిందో తెలీదు. అదొక ఆర్ద్రమైన విషయం. నేను జీర్ణం చేసుకోలేని విషయం.
ప్రశ్న 9. ఈ కథలలో ఉపయోగించిన భాష గురించి చెప్పండి. ముందుమాటలో టూకీగా చెప్పారు. ఇప్పుడు విపులంగా చెప్పండి.
జ: చాలా మంచి ప్రశ్న. చెంచుల మాండలికంలో 90 శాతం తెలుగే వుంటుందని చెప్పానుకదా! ఆ కారణం ఈ పుస్తకం రచనలో నాకు చాలా సాయపడింది. ఒకవైపు అందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాషని వాడాలి. అదే సమయంలో వారి భాషా పదాల్నినిర్లక్ష్యం చేయకూడదు. మధ్యేమార్గం కావాలి. ఇందుకు అనువుగా ఒక పద్ధతిని అమలుచేశాను. కథనం పరంగా కథలన్నీ సులభమైన వ్యావహారిక భాషలో నడుస్తుంటాయి. ఎక్కడైతే సంభాషణలు, చర్చలు (Conversations అనుకోండి) నడుస్తున్నాయో అక్కడ పూర్తిగా చెంచుల భాషనే వాడాను. ఈ పద్ధతి నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇప్పుడీ పుస్తకాల్ని చదువుతున్న వారిలో కొందరితో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు వారు కూడా ఈ పద్ధతి బావుందన్నారు.
చెంచుల భాషా వినియోగం గురించి ఒక చిన్న ఉదాహరణ రాస్తాను. ఈ సంభాషణను చదవండి.
నంద్యాల నుంచి వచ్చిన సీనియర్ ఇంజనీరు అక్కడి పరిస్థితిని పరిశీలించాడు. “వెంటనే ఆ రాయిని ట్రాక్ పైనుంచి తొలగించకపోతే దక్షిణమధ్య రైల్వేలో ఒక పెద్ద పార్టు బ్రేక్‌డౌనయిపోతుంది” అన్నాడాయన.
“ముందు మనుకు ట్రాకుదక్కాలెగద సారూ” అన్నాడు వాలి. అతని మాటలు వారికర్థం కాలేదు.
“నాకరదమైన సంగతి నేనుజెప్త. మీకు నమ్మిక కుదిర్నా అడ్డువైనా నాదనక అది వాస్తవము. నా సెంకనుబట్టి ఆడ పట్టాలమీద పన్నది కొండరాయికాదుసారూ. కొండసిల ఎన్నడూ ఇట్ల సదురుమట్టంగుండదు. ఇది ఎవురో సీమెంటు, కంకరపు రాల్లతో కావాలని తయారీజేసినట్లు అవుపిస్తున్నది. ఆ రాయిలో పేల్చుడుసామగ్గిరిగూడ వుండే ప్రెమాదమున్నదిగూడ. ఆ పొగ యిప్పుడెట్లున్నదో తెలిసినగాని మనం ఇంగేం పనీ ముట్టలేం”.
వాలి మాటల్ని వినగానే రాజు బొగద వైపుకు పరిగెత్తాడు. తన రోజువారీ డ్యూటీ చలమ వైపు. కానీ ఇప్పుడు పరిగెత్తుతున్న దారి అతనికి కొంచెం కొత్తది. కానీ, పట్టాల మీద పరుగు అలవాటైనదే కదా! వేగంగా పరిగెత్తుకువెళ్లి మళ్లీ అంతే వేగంగా వెనక్కొచ్చాడు. ఆ పొగ ఇంకా పెరుగుతున్నదని చెప్పాడు.
అప్పుడు మళ్లీ వాలిమామ మాట్లాడాడు. “సారూ, యిసుమంటివాటిల్లో మాకేం అనుబవంలేదుగానీ, నేనైన యిదెవురో దుండగాల్లుజేసిన పనే అనుకుంటున్న. మన రైలుబండ్ల ముందు లైట్లు అగ్గువలో అగ్గువ మైలు దూరందనక ఎలుతురునిస్తయి. ఇప్పుడుబెట్టిన ఐ బీము ఎలుతురైన యింగో మైలుదనక ఎల్తుర్నిస్తయి. డ్రయివరన్నకు రైలాపను ఆ దూరంజాలు. కానీ ఆ రాయట్లా కనిపిచ్చకపోను కారనం.. అదిగూడ కొండసిల రంగులోనే వున్నది”.
పై సంభాషణను గమనిస్తే.. చెంచుల భాష తెలుగుకు ఎంత దగ్గరగా వుందో మీకర్థమవుతుంది. లోతడివిలో వుండేవారి యాస మరికాస్త తేడాగా వుంటుంది. వారి మాటల్లో కొన్ని చెంచుపదాలు అదనంగా కనిపిస్తాయి.
మరో సంభాషణను గమనించండి.
సరేనన్నట్టుగా తలూపాడు వాలిమామ. అతని చూపు మాత్రం పొట్టివాలి ముఖం మీదనుంచి ఏమాత్రం జారడంలేదు. నిటూరుగా అతన్నే చూస్తున్నాడు. మళ్లీ అరుగు మీద కూర్చున్నాడు.
“ఈ వొంతెనకూ నీకూ ఏంది సంబందం? ఎందుకీడగూర్సున్నవ్? నిండా రొండు మైల్లు నడిసేమాటికి సోలిపొయి కూర్సున్నవేం యీ పెద్దగట్టు మీన?” పొట్టివాలి ప్రశ్న అడిగాడు. పొడవు వాలి అప్పుడు తొలిసారిగా పొట్టివాలిని చూసి నవ్వాడు. ఇప్పుడతని భయం పూర్తిగా పోయింది.
“ఒరేయ్ పొట్టోడా. నీకు బుర్రకాయ సితికినట్లున్నది. నేనీ వంతెనకు కాపలాదారును. నాకు 60 ఏండ్లు వచ్చుదనక నేనీ వంతెన కొరకే పనిజేస్త. సర్కారిచ్చిన ఉజ్జోగం. జీయితకాలం దీనిమీద నడుసుకునే అక్కు నాకున్నది. ఐనా, నా వొంతెన మీదికి నా పరిమీసను లేకుండ నడిసొచ్చిందిగాక నన్నే ఎందుకీడ కూర్సున్నవని అడుగుతవా? ముందు నేనడిగినాటికి జఆబుజెప్పు. ఎవురు నువ్వు? నా ముకంకట్లు నీకెట్లొచ్చినయి?”
అప్పుడు మళ్లీ నవ్వాడు పొట్టివాలి. “నీకన్న ముందుగ నిన్ను పెసినెలడిగినది నేను. కన్క ముందు నేనడిగివాటికి బదులుజెప్పు, ఆతదూప నువ్వడిగిటోటికి నేను బదులుజెప్త” అన్నాడు. వాలిమామకిక నోరు తెరవక తప్పలేదు. బదులు చెప్పడం మొదలుపెట్టాడు. అలాగని ఇష్టపూర్వకంగా చెప్తున్నట్టూ లేదు.
ప్రశ్న 10. రాబర్ట్ దొర, హేలియాల గురించి చెప్పండి.
జ: గతంలో కల్దారి ఫారెస్టాఫీసర్‌గా పనిచేసిన ‘హీలో రాబర్ట్’ అనే నిజమైన వ్యక్తి పేరునే ఇక్కడ వాడాను. వారి వారసులు 20 ఏళ్ల తర్వాత అక్కడికి వచ్చినమాటా నిజమే. ఆ కథనానికి కొనసాగింపు తప్పనిసరి కాబట్టి, వారిని వాలిమామతో కలిపాను. రాబర్ట్ దొర దంపతుల పాత్రలకు వెనుక కూడా ఒక ప్రేరణ వుంది. ఫణికుమార్ గారు ఆదిలాబాద్ ఉట్నూరు ఐటిడిఎ అధికారిగా వున్న సమయంలో ఆ ప్రాంతంలో గిరిజనుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేసిన ప్రొఫెసర్ హైమండార్ఫ్ దంపతులను మననంలో పెట్టుకున్నాను. హైమండార్ఫ్ భార్య కూడా ఉట్నూరు అడవిలో పనిచేశారు. కానీ, హేలియాది వాలిమామ ప్రపంచంలో చాలా చిన్న పాత్ర. హైమండార్ఫ్ పిల్లలు కూడా ఉట్నూరును దర్శించారు.
ప్రశ్న11. మీరు కథల్లో చెంచుల పద్ధతులు, వంటకాలు, మనస్తత్వాలను నిజంగా వారితో కలసి ఎంతో సమయం గడిపినట్టో, లేక మీరే చెంచులలో ఒకరో అన్నట్టు వర్ణించారు. ఇదెలా సాధ్యమయింది?
జ: అసలు నేనెందుకు చెంచుల్లో ఒకరినని అనుకోకూడదు? అత్యంత ఆదిమజాతిలో పుట్టినవాడిగా నన్ను నేనెందుకు భావించుకోకూడదు? చెంచులతో నాకు డిగ్రీ రోజుల దాకా మంచి సంబంధాలే వున్నాయి. కాలగతిలో చాలావరకూ కొట్టుకుపోయాయి. కానీ, నన్ను నేను ఒక వాలిమామగా భావించుకోకపోతే అసలీ పుస్తకమే లేదు. నేను చెంచులతో కలిసి నడుస్తున్నవాడిననే భావన నా మనసులో ముద్రించుకుపోయివుంది కాబట్టి.. ‘నేనూ వాలిమామన’నే భావించుకుంటాను. ప్రకృతి కోసం, మంచి వాతావరణం కోసం; ఆఖరికి మొక్కల్ని పెంచి చెట్లుగా ఎదిగేదాకా కాపు కాసుకునే ప్రతి వ్యక్తీ నా దృష్టిలో వాలిమామే. అంటే ప్రకృతి ప్రేమికులందరూ వాలిమామలే.
ఇక చెంచుల వంటకాలు అంటూ పెద్దగా ఏమీ లేవు. ఇప్పుడు మనందరిలాగే మసూరి బియ్యం, కాయగూరలన్నీ వారూ తీసుకుంటున్నారు కానీ, గతంలో కేవలం అటవీ సంపద మీదే ఆధారపడేవారు. ప్రాచీన మానవుల ఉనికి, ఆనవాళ్లు ఇప్పటికీ చెంచుల్లో కొన్ని బతికేవున్నాయి. ఉడుతలు, దుప్పులు, కుందేళ్లు లాంటి జంతువులు ఒకప్పుడు వారి ప్రధాన ఆహారం. వాటిని కొరుక్కుతినడానికి అనువుగా వుండే వారసత్వపు దంతాలను ఇంకా చాలామంది గిరిజనుల్లో మనం చూడవచ్చు.
ఇక అడవి సంపద అంటే.. పలురకాల పండ్లు, ఆకులు, కాయలు, గడ్డలు తేనెలను ప్రధానంగా తీసుకోవచ్చు. నెమ్మదిగా అడవి తగ్గిపోతూవస్తున్నా, ఇవ్వాళ్టికీ అడవిలో ఇవన్నీ లభిస్తూనే వున్నాయి. కొన్ని తింటారు, కొన్నిటిని ఇంటికి తెచ్చుకుంటారు. ఇక్కడొక మంచి విషయం చెప్పుకోవడం సందర్భోచితంగా వుంటుంది. చెంచులు ఆహారాన్ని దాచుకోరు. ఏ రోజుటి ఆహారం ఆ రోజే. ఉదయం ఇంటి దగ్గర గట్టిగా తిని అడవిలోకి వెళ్తే ఇంకేమీ తినరు. మళ్లీ రాత్రికి ఇంటికి చేరేదాకా మధ్యలో మంచినీళ్లు మాత్రమే తాగుతారు. సీసాలు తీసుకుపోవడం కూడా అరుదే. అక్కడక్కడా కనపడే చలమల్లోని నీటిని తాగేస్తారు.
ప్రశ్న12. మీరు చారిత్రక విషయాలను కథల నేపథ్యంగా వాడేరు. ఈ విషయాలను కథలతో అనుసంధానం చేసేందుకు ఎంత పరిశోధన చేశారు?
జ. వాలిరాజస్వామి గురించే కదా మీరడుగుతున్నది? ఆ పాత్రను ప్రకృతి ప్రేమికుడిగా చూపాను. ఒక గిరిజన యుద్ధవీరుడిలా చూపాను. ఆయన వయసును కూడా 40 ఏళ్లకే పరిమితం చేశాను. ఆయన శివసామి అని వాడిన మాట కూడా ప్రకృతి గురించే. ఆయన తర్వాత వెయ్యేళ్ల తర్వాత ఆయన వారసుల్లో ఒకరిగా వాలిరాజు (వాలిమామ)ను చూపాను. బుధూకి దేవాలయాన్ని అప్పగించి, వాలిమామకు ప్రకృతిబడిని అందించడం కూడా.. వాలిరాజస్వామికి ఆలయం కంటే ప్రకృతే ముఖ్యమన్న బంధాన్ని రుజువు చేస్తుంది. వాలిమామ, వాలిరాజస్వామి రెండూ కృత్రిమ పాత్రలే. కానీ కథనాన్ని మరింత బిగువుగా నడపాలంటే అందుకు మరికాస్త కల్పనను జోడించాలి. కానీ వాటికీ ఒక ప్రాముఖ్యత, విలువ వుండడం తప్పనిసరి.
చారిత్రక విషయాలను రాయడానికి నేనే పరిశోధనా చేయలేదు. కథనంలో భాగంగా ఆ సంఘటనల్నీ కలిపాను. అయితే, బాల్యంలో చదువుకున్న చందమామ, బొమ్మరిల్లు, టింకిల్, అమర్‌చిత్ర కథల ప్రభావం కొంచెం మనసులో వుండివుండొచ్చు.
ప్రశ్న13. వాలిమామ పండిత నెహ్రూల ఉదంతం గురించి చెప్పండి.
జ: భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాత్రను ఒక కథ కోసం ఉపయోగించుకోవడం అనివార్యమని భావించాను. ఆధునిక భారతదేశానికి పారిశ్రామికీకరణ అవసరాన్ని గట్టిగా గుర్తించిన వ్యక్తి నెహ్రూ. నదుల ప్రవాహాల్ని నిలువరించి, ఆనకట్టల ద్వారా నీటిని పొదుపుచేస్తేనే దేశానికి నిలకడ ఏర్పడుతుందని నమ్మినవాడు. ఈ నేపథ్యం లోనే భారీ ప్రాజెక్టుల నిర్మాణం మీద ఆయన గట్టిగా దృష్టిపెట్టారు. ఈరోజు మనం అనుభవిస్తున్న నాగార్జునసాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, హీరాకుడ్, డాక్‌పథర్ వంటి పలు పెద్ద డ్యామ్‌లను ఆయన ఆధ్వర్యం లోనే నిర్మించారు. బ్రహ్మపుత్ర, సట్లెజ్ డ్యామ్‌ల నిర్మాణం వెనుకా ఆయనే వున్నారు. కల్లాని డ్యామ్ వంటి కొన్ని అప్పటికే వున్న కొన్ని ప్రాజెక్టుల ఆధునికీకరణ కూడా ఆయన హయాంలోనే జరిగింది. హీరాకుడ్ ఇప్పటికీ ఎక్కువ విద్యుత్‌ని ఉత్పత్తి చేసే ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల మధ్య వున్న ప్రాచీన జలాపూత్ డ్యామ్ ఆధునీకరణకూ నెహ్రూనే కారణం. అదే సమయంలో ఆయన రైల్వేల ఆధునీకరణ, కొత్త మార్గాల నిర్మాణం మీదా దృష్టిపెట్టారు.
ఇలాంటి వాస్తవ విషయాలను దృష్టిలో వుంచుకుని నెహ్రూ కల్దారి వంతెనను సందర్శించినట్లుగా ఒక ఆసక్తికరమైన కథకు రూపకల్పన చేశాను. నెహ్రూ వాలిమామను కలవడం కల్పితమే. కానీ, నెహ్రూ స్వాతంత్ర్యానికి పూర్వమే రాసిన ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో కూడా ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. తన కుమార్తె ‘ఇందిరా ప్రియదర్శిని’కి రాసిన ఒక లేఖలో.. నవీన భారతదేశ నిర్మాణానికి భారీ ప్రాజెక్టుల అవసరం గురించి రాశారు. నెహ్రూ పాత్రని ఉపయోగించుకోవడానికి ఇదీ ఒక కారణమే.
ప్రశ్న14. వాలిమామ కథలు కొన్ని దశాబ్దాల కాలాన్ని కవర్ చేస్తుంది. మారుతున్న కాలంతో మారుతున్న వాలిమామ జీవితాన్ని ఆలోచనలను ప్రదర్శించారు. కాలం చెంచుల జీవితాల్లోనూ, ఆలోచనల్లో, మనస్తత్వాలలో ఎలాంటి మార్పులు తెచ్చింది? మీ అనుభవాల అధారంగా చెప్పండి.
జ: ఆసక్తికరమైన, అవసరమైన ప్రశ్న. కాలం ఒక్క చెంచుల జీవితాలనే కాదు, ప్రపంచాన్నే మార్చింది. ఎప్పుడైతే ప్రభుత్వాలు చెంచులను అడవినుంచి తరిమికొట్టడం మొదలైందో అప్పుడే ఒక ప్రాచీన జాతిని నిర్మూలించే కుట్రకు శ్రీకారం చుట్టినట్లయింది. 1990ల దాకా బాగా బతికిన చెంచులు ఇప్పుడు దగ్గర్లోని వూర్లకు తరలించబడ్డారు. పొద్దున్నే అడవి లోకి వెళ్లి, కాస్త అడవి సంపదను సేకరించుకుని సాయంత్రం ఆరు గంటల్లోపు తిరిగి ఇంటికి చేరుకోవడం నిబంధనగా మార్చారు.
ఒక చెంచుమనిషి అడవికి బయట జీవించలేడు. క్రూరమృగాల మధ్యనైనా.. చావుకి అంచులదాకా నివసించాల్సివున్నా కూడా చెంచుమనిషి అక్కడే బతకడానికి ఇష్టపడతాడు. కానీ ఎప్పుడైతే అడవిని పూర్తిగా అభయారణ్యంగా మార్చారో అప్పుడే చెంచులందరూ గ్రామచెంచులుగా మారిపోయారు. వారికిప్పుడు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఉచిత తాయిలాలు వంటివన్నీ ఇచ్చి సద్దిబుచ్చింది. కాస్త రోడ్డుకు దగ్గరగా వున్న చెంచు గ్రామాలు కొన్ని అడవి నుంచి డీనోటిఫై వున్నవి మాత్రం బతికివున్నాయి. అభయారణ్యాలకు బయటే వున్నా, అడవి సంపద కోసం లోపలికి వెళ్లాల్సివస్తే మాత్రం అటవీశాఖ గేట్లనుంచే వెళ్లాలి.
కాలగమనంలో చెంచుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అడవిలో వున్నా కూడా కాస్త దూరదూరంగా ఒంటరిగా బతకడానికి ఇష్టపడతారు చెంచులు. అలాంటివారిని అడవికి బయట వదిలిపెడితే వాడి పరిస్థితేం కావాలి? ఇలా బయట జీవించడం మొదలుపెట్టిన చెంచుల్లో చాలామంది తక్కువ వయసు లోనే ఎందుకు మరణిస్తున్నారో ప్రభుత్వం ఎప్పుడైనా సర్వేలు చేసిందా? చేసివుంటే గణాంకాల్ని విడుదల చేసిందా? ఈ విషయం మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా మాట్లాడాలి.
చెంచులు తమ హక్కుల్ని సాధించుకోవాలంటే పోరాటమే శరణ్యమనే భావనను ఇప్పటి తరం చెంచులకు అర్థం కావాలనే ఆలోచనతోనే రెండు కథల్ని ఈ సిరీస్‌లో పొందుపరిచాను. తమ సొంతమైన అడవి నుంచి బయటికి వచ్చినవారు ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒక పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికే కష్టపడతారుకానీ, పోరాటాల దాకా వెళ్లగలిగలిగే శక్తి వారికెక్కడుంది?
ప్రశ్న15. బ్రిటీష్ వారి కాలంలో, స్వతంత్ర భారతంలో చెంచులు ఎవరి వల్ల ఎక్కువ లాభపడ్డారు? తమ ప్రత్యేకతను సంరక్షించుకున్నారనిపిస్తుంది మీకు?
జ: బ్రిటిష్ కాలంలో అడవిలో అత్యంత విలువైన చెట్ల దుంగల్ని వారు తమ దేశానికి ఓడల్లో తరలించుకుపోయారని చరిత్ర చెప్తోంది. కానీ చెట్లు కొట్టినచోట తిరిగి అడవి పెరిగింది. నల్లమలలో విస్తారంగా ఖనిజ సంపద వుందని ఇంగ్లీష్‌వారికి తెలిసినా, వాటిని తవ్వడానికి వారు సిద్ధపడలేదు. ఖనిజం కోసం తవ్వితే తమకు కలప దొరకదని వాళ్లు నమ్మారు. అందుకే వారి కాలంలో అడవి బతికేవుంది. కానీ మన ప్రభుత్వాలు వచ్చాకే.. ఇంకా చెప్పాలంటే 1990 తర్వాతే అడవిలో చెట్లను విపరీతంగా కొట్టేయడం, ఖనిజసంపదను దోచుకోవడం మొదలైంది. అదిప్పుడు ఏ స్థాయిలో వుందే నేను రాయాల్సిన అవసరం లేదు. నిజానికి అంతకుముందునుంచే అడవి నుంచి కట్టె సంపదను సేకరించడం వున్నప్పటికీ.. అది కేవలం ఇళ్ల నిర్మాణాలకు కావల్సిన దంతెలు, రైల్వే పట్టాల కింద అమర్చేందుకు ఉపయోగపడేవి మాత్రమే.. అదీ అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకున్నారు.
చెంచుల జీవితాలలో కాలానుగుణంగా వచ్చిన మార్పులు గమనించాలి. బ్రిటిష్ కాలంలో చెంచుల మీద ఆంక్షలు పెట్టినవారూ, వారి సంపదను దోచుకున్నవారూ వున్నారు; అదే సమయంలో వారి మనసుల్ని గెలిచినవారూ వున్నారు. మనుషుల్లో ఎలాగైతే మంచీచెడూ వుంటాయో అందుకు బ్రిటిష్ అధికారులు కూడా అతీతులు కాదు. కానీ, వారి పనులు మాత్రం ఉన్నత స్థానాల్లో వున్న అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే జరుగుతాయి కదా! విషయమంతా ఇక్కడే వుందికదా!
ప్రశ్న 16: మూడవ భాగంలో వాలిమామ నక్సల్స్‌ను కలుస్తాడు. వాలిమామ వారిని అసాంఘిక శక్తులుగా భావిస్తాడు. కానీ, మీరు నక్సల్స్‌ను చూపిన విధానం నిజంగా జరుగుతున్న సంఘటనలతో పోలిస్తే వాస్తవ దూరం అనిపిస్తుంది. నక్సల్స్‌ను చాలా మెత్తనివారిగా చూపారు. మీకు వారిపట్ల సానుభూతి వుందా? లేక ఎవరినీ బాధపెట్టదలచుకోలేదా?
జ: ఎవరినీ బాధపెట్టకూడదనే ఆలోచన నాలో వుంటే.. అసలు అటవీశాఖ అధికారుల గురించి ఎందుకు రాస్తాను? నక్సల్స్ కంటే బలమైన ప్రభుత్వ వ్యవస్థ కదా అటవీశాఖ? నాకటువంటి భయాలు, అభిప్రాయాలేమీ లేవు.
నాకు నక్సల్స్ పట్ల, కమ్యూనిస్టుల పట్ల 30 ఏళ్ల క్రితం వరకూ కొంత సానుభూతి వుండేది. తర్వాత తగ్గుతూ వచ్చింది. 1997లో నేను వార్త దినపత్రిక కోసం నల్లమలలో 8 మంది నక్సలైట్లతో చర్చలు జరిపి మూడు వ్యాసాలు రాశాను. ఆ తర్వాతే వారిపట్ల నా అభిప్రాయాలు ఒక్కటొక్కటిగా మాసిపోతూవచ్చాయి. ‘నల్లమలలో బాలసైన్యం’ అనే వార్త బాగా పేలింది. చిన్న పిల్లల స్వేచ్ఛకు అడ్డుపడుతూ వారిని బాల నక్సలైట్లుగా మారుస్తున్నారని రాశాను.
కానీ, మీరడిగిన ప్రశ్న వాలిమామ 45 ఏళ్ల వయసులో వున్నప్పటిది. ఆనాటి నక్సలైట్లు కూడా ‘తుపాకీకి జవాబు తుపాకీనే’ అని నమ్మినప్పటికీ.. సిద్ధాంతరీత్యా, ఆచరణరీత్యా జనం సంక్షేమం కోసమే పోరాటాలు చేశారు. కాబట్టి ఆనాటివారిపైన నాకు కొంత సానుభూతి వుంది. ఇప్పుడెవరిమీదా లేదు. 35 ఏళ్ల క్రితమే చలసాని ప్రసాద్ కమ్యూనిజం సిద్ధాంతాలు, పోరాటాలను వ్యతిరేకిస్తూ ‘ఇలా మిగిలేం’ అనే పుస్తకం రాశారు. అదిప్పటికీ ప్రింట్ రూపంలో దొరుకుతోంది.
ప్రశ్న 17: పోలీసులకు నక్సల్స్‌కు నడుమ నలిగారా గిరిజనులు?
జ: కొన్ని చోట్ల. ముఖ్యంగా దట్టమైన అడవుల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువ. నక్సల్స్‌కి అన్నం పెట్టారని పోలీసులు; పోలీసులకు సహకరించారని నక్సల్స్ గిరిజనులను ఇబ్బంది పెట్టిన మాటలో వాస్తవం వుంది. దండకారణ్యంలో జన్‌తన్ సర్కార్ పేరిట నక్సలైట్ల పాలనే కొనసాగుతోంది. గత 3, 4 నెలలుగా దండకారణ్యం నుంచి వారిని ఏరిపారేయడానికి కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా కూంబింగ్ జరుపుతున్నాయి. నక్సల్స్ వల్ల వారికి కొంత మంచే జరిగినా ఆ ప్రభావం పెద్దగా ఫలించలేదు. కొన్ని సంవత్సరాల నుంచి పోలీసులు, ఆర్మీ సిబ్బంది తమ పంథాను మార్చారు. అక్కడి ప్రజలలో మమేకం కావడం ద్వారా తాము వారికి ఉపయోగపడతామనే పాజిటివ్ సంకేతాల్ని వారికి పంపగలుగుతున్నారు. జనం కూడా అందుకు సహకరించడం మొదలైంది. నక్సల్ సీనియర్ నాయకులంగా వృద్ధాప్యం లోకి చేరడం, ఆరోగ్య సమస్యలు పెరుగుతుండడంతో యువ నాయకత్వానికి గెరిల్లా పోరాటాల గురించిన అవగాహన కల్పించే నేతలు తగ్గిపోయారు. నక్సల్ ఉద్యమం బలహీనపడడానికి ఇదీ ఒక కారణం. ప్రభుత్వాలు ఆ అటవీ భూముల్ని ఏం చేస్తారో భవిష్యత్ మనమిప్పుడే ఊహించలేం కదా!
ప్రశ్న 18: గిరిజన ఉద్యమకారుడిగా, ఉద్యోగిగా వాలిమామ వ్యక్తిత్వాన్ని ఎలా సమన్వయపరుస్తారు?
జ: వాలిమామ ఉద్యోగ జీవితాన్నీ, రిటైర్మెంట్ అనంతరం వాలిమామనీ భిన్న కోణాల నుంచి చూడాలి. 65 ఏళ్ల వయసులో వాలిమామ ప్రకృతిబడి మీదనే పనిచేశాడు. ఎప్పుడైతే అడవి మీద, గిరిజనుల మీద ప్రభుత్వ పెత్తనం పెరిగిందనే స్పృహ కలిగిందో అప్పుడే ఆయన గిరిజన ఉద్యమకారుడిగా మారాడు. తమ్ముడు బుధూ సాయంతో నంద్యాల పెద్ద లైబ్రరీలో చదివిన పలు పుస్తకాలు ఆయన ఆలోచనను ఎలా ప్రభావితం చేశాయో కథల్లో చెప్పాను. వాటి గురించి పుస్తకంలో చదివితేనే అర్థమవుతుంది. ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో రాసుకుంటూవచ్చిన ఈ కథల్లో ఒక కీలకమైన భాగాన్ని నేనిక్కడ రివీల్ చేయలేను. పుస్తకం కొని చదవడం ద్వారా పాఠకులే ఆ విషయాలు తెలుసుకోవాలి.
ప్రశ్న 19: కోవిడ్ సమయంలో పట్టణాల్లో చదువుకున్నవారే టీకాలంటే భయపడ్డారు. కానీ, మీ పుస్తకంలో గిరిజనులు టీకాల కోసం పోరాటం చేస్తారు. ఇందులో కల్పన ఎంత? నిజమెంత? కోవిడ్ సమయంలో చెంచులు ఎలా జీవించారో చెప్తారా?
జ: కోవిడ్ సమయంలో నిజంగానే ఏ ప్రాంతంలోనూ, ఏ తెగకు సంబంధించిన గిరిజనులకూ సరిగ్గా టీకాలు అందలేదు. ఆఖరికి ప్రభుత్వం అటవీ గ్రామాలుగా గుర్తించిన చోట్లకు కూడా ఆశా వర్కర్లు వెళ్లలేదు. ప్రభుత్వాలు దీనిని ఖండించినా వాస్తవమిదే. లోతడవి ప్రాంతాలకు ఆశా వర్కర్లు వెళ్లనేలేదు. ఆ వ్యథను వ్యక్తం చేయడానికే ఆ కథ రాశాను. వాలి, బుధూ, అనుముల ఆధ్వర్యంలో చిత్తానూరు ఫారెస్టాఫీసు దగ్గర ఒక ఆందోళన ఘటన జరిగినట్టుగా రికార్డ్ చేశాను. అదే కథలో వాలి ద్వారా చెప్పించిన ఒక మాటను మీరు గమనించాలి. చెంచులకు రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఎక్కువగా వుంటుందని, కాబట్టి వారికి వేక్సీన్ల అవసరమే లేదని ఆరోగ్యశాఖ సిబ్బంది చెప్తోందని వాలిమామ జిల్లా ఎస్పీ వివేక్‌కి ఫిర్యాదు చేస్తాడు. అప్పటికది హేతుబద్ధమైన విషయంగానే అనిపించినా, కొన్ని నెలల క్రితం కోవిషీల్డ్ కంపెనీ దీనిని ధృవీకరించింది.
ఇక్కడే ఇంకో రెండు విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలి. 2004లో సునామీ ముంచెత్తినప్పుడు అండమాన్, నికోబార్ తదితర దీవుల్లో అజ్ఞాతంగా నివసిస్తున్న ఆదిమానవ తెగకు సంబంధించినవారంతా అంతకు 45 రోజుల ముందే కనిపించకుండాపోయారు. సునామీ అనంతరం సుమారు నెల రోజుల తర్వాత వారంతట వారే బయటికొచ్చారు. వారంతా మరణించివుంటారని అటవీశాఖ అధికారులు ఇక అక్కడ కంచె తీసేద్దామనుకున్నారు. కానీ, తిరిగి వారంతా బయటికి రావడంతో మొత్తం ప్రపంచమే సంతోషించింది. ఫారెస్ట్ అధికారులు గోతం సంచుల్లో పెట్టి అందించిన సామగ్రిని వారే స్వయంగా తీసుకువెళ్లారు. అప్పటిదాకా అధికారులు సామగ్రి అక్కడ పెట్టి వెళ్లిపోతే.. తర్వాతెప్పుడో వచ్చి తీసుకుపోయేవారు. ఈసారి మాత్రం అటవీశాఖ గేట్లు తెరిస్తే నేరుగానే తీసుకుపోయారు. అటవీ సిబ్బందితో పాటు అక్కడ పర్యాటకులు కూడా వున్నా, వారేమీ కంగారుపడలేదు.
2వ విషయం.. కరోనా సమయంలో కూడా వారం పది రోజుల ముందే వారంతా అడవి లోకి వెళ్లిపోయారు. గతానుభవాలను గుర్తుంచుకుని అటవీ సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించారు. కరోనా తొలి దశ పూర్తయ్యాక కూడా వారు బయటికి రాలేదు. రెండవ దశ అనంతరం.. ఇక కరోనా భయం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తర్వాత రెండు వారాలకు వారంతా బయటికి వచ్చారు. వెంటనే అటవీసిబ్బంది అప్పటికే సిద్ధం చేసి వుంచిన ఆహారాన్ని పెద్దమొత్తంగా అందించారు. ఈసారి కొన్ని ఆహార పదార్థాల్ని అల్యూమినియం గిన్నెలలో పెట్టికూడా ఇచ్చారు. వారం తర్వాత ఆ గిన్నెలన్నీ అదే గేటు ముందు కనిపించాయి. ఈ రెండు ఘటనలూ మనల్ని కాలానికి కాస్త ముందు దృష్టితో ఆలోచించాల్సిన అవసరాల్ని తెలియజెప్పాయి. ఆదిమజాతివారైనా, ఎలా ఈ ఘటనల్ని ఊహించగలిగారో మానవశాస్త్ర (ఆంత్రోపాలజీ) నిపుణులు, అధ్యయనకర్తలూ చెప్పాలి.
ప్రశ్న 20: ఈ పుస్తక రచనలో ఒక లక్ష్యంగా పర్యావరణ స్పృహను పాఠకులలో కలిగించటం అన్నారు. ఈ అయిదు పుస్తకాలలో ప్రకృతి స్పృహను ఎలా ప్రదర్శించారు? మీ లక్ష్యం నెరవేరిందనిపిస్తోందా?
జ: మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రతి కథ లోనూ పర్యావరణ స్పృహ కనిపిస్తుంది. ఆఖరికి పోరాటాల సమయం నాటి కథల్లో కూడా! స్కూలు పిల్లల్ని అడవి లోకి తీసుకుపోవడం, వారికి అడవి జంతువులను చూపించడం, పలు రకాల అడవి సంపదను వారికి చూపడం, కానుకలుగా అందించడం వంటి నాలుగైదు కథల్లో పర్యావరణ స్పృహ ఇంకా లోతుగా కనిపిస్తుంది. ఇంకా, గుంటూరు నుంచి వచ్చిన వెటర్నరీ కాలేజీ విద్యార్థులకు ఎర్రచుట్టల పాముల్ని వాలి బృందం పట్టియిచ్చిన కథలో ఆఖరి పేరా చదివితే చాలు.. మీకీ పుస్తకం సారాంశమంతా అర్థమైపోతుంది.
నా లక్ష్యం నిరంతరాయంగా కొనసాగుతూవుండేది. ఒకచోట ఆపేది కాదు. అందరికీ పర్యావరణ స్పృహ ఏర్పడాలి. ఇందుకోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే వుండాలి. పల్లె, పట్నం, నగరం అనే పరిధుల్లేకుండా ప్రతి చోటా వనసంపద పెరగాలి. అందుకోసం వేల సంఖ్యలో వాలిమామలు తయారుకావాలి. ‘వాలిమామ ప్రపంచం’ చాలా విశాలమైనదని అందరూ అర్థం చేసుకోవాలి. ఆ దిశగా గట్టి అడుగులు వేయాలి. ఈ పుస్తకం రాయడం వరకూ అయితే నా లక్ష్యం తీరింది. దీని ప్రయోజనాల్ని అర్థం చేసుకోవాలంటే.. ప్రతి ఇంటా ఈ పుస్తకం వుండాలి. పాఠకులూ వాలిమామలుగా మారాలి.
ప్రశ్న 21: పుస్తకం ప్రచురణకు చాలా ఖర్చయివుంటుంది. మీకు అమ్మకాల ద్వారా కనీసం మీ పెట్టుబడి వాపస్ వస్తుందా?
జ: పుస్తక ప్రచురణకు భారీగానే ఖర్చయింది. పరిశోధనలకీ, అధ్యయనానికీ, ట్రాన్స్‌పోర్టేషన్‌కీ భారీగానే ఖర్చయింది. సుమారు 28 లక్షల ఖర్చుతో ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టడం.. అదీ తెలుగులో చేపట్టడం ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఈ ఖర్చులు, ఆథర్ రెమ్యూనరేషన్ రావాలంటే.. కనీసం ఐదు వేల కాపీలను విక్రయించాల్సివుంటుంది. అందుకు కొంత ఎక్కువ సమయమే పట్టొచ్చు. కానీ, నా గమ్యం చేరగలననే విశ్వాసం నాకుంది. ప్రతి ఇంటికీ అవసరమైన ‘ప్రకృతి బాలశిక్ష’గా దీనిని పరిగణించవచ్చు.
ప్రశ్న 22: ఒక మంచి పుస్తకం వున్నట్టు పాఠకులకు తెలియచెప్పే సరయిన వ్యవస్థ తెలుగులో లేదు. మరి మీ పుస్తకానికి ప్రచారం ఎలా చేస్తున్నారు? ఫలితాలెలావున్నాయి?
జ: మా వెబ్‌సైట్ www.vmrgbooks.com ద్వారా వాలిమామ ప్రపంచం పుస్తకాల్ని పాఠకులకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నేరుగా 9849970455 ఫోన్ నెంబరుకు UPI ద్వారా ₹ 2600 చెల్లించి, తమ అడ్రస్ తెలియపరిస్తే వారికి వెంటనే 5 పుస్తకాల సిరీస్ పోస్ట్ చేస్తాం. ఆమెజాన్ ద్వారా కూడా దీనిని అందుబాటు లోకి తేవాలనే ఆలోచన వుందికానీ, దానివల్ల ఎంత ప్రయోజనం వుందో, కొత్త షిప్పింగ్ అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం.
ప్రశ్న 23: మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? మళ్ళీ ఇలాంటి కథలు రాస్తారా? లేక, కాల్పనికేతర రచనలు చేస్తారా?
జ: మళ్లీ కొత్త కథలు రాసే ఆలోచన ఏమీ లేదండీ! ముందే చెప్పినట్లుగా నేను ఒక కాజ్ కోసం కథా రచయితనయ్యాను తప్ప, నేను సీరియస్ కథకుడిని కాను. ‘సైరా సీంబలి’ పుస్తకం మాత్రం ఏడాదీ రెండేళ్లలో ప్రింట్ చేస్తాను. ఇక నా రెగ్యులర్ పుస్తకాల క్రమం తప్పదు. ప్రస్తుతం ‘కృత్రిమమేథ’ అంశంపై 200 పేజీల పుస్తకం సిద్ధం చేస్తున్నాను. కంటెంట్‌ను ఒక క్రమంలో పేర్చుకుంటూపోతున్నాను. ఈ దశ ఇండెక్సింగ్ వరకూ సిద్ధమైపోయింది. ఇంకో మూడు నాలుగు నెలల్లో విడుదలవుతుంది.
ప్రశ్న 24: వాలిమామ ప్రపంచాన్ని తెరకెక్కించే అవకాశమేమైనా వుందా?
జ: ఉంది. పుస్తకం తొలి వాల్యూమ్ విడుదలైన రెండు వారాలకే ఒక ప్రముఖ దర్శకుని ఆఫీసు నుంచి ఆఫర్ అందింది. పూర్తి సిరీస్ విడుదలయ్యాక మళ్లీ కంటాక్ట్ చేశారు. నేనింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఏడాది క్రితమే 3 కథలనుంచి తీసుకున్న కంటెంట్‌తో 5 ఎపిసోడ్లకు సరిపడేలా స్క్రిప్ట్ వర్క్ చేశాను. గంట వ్యవధి వుండే ఐదు ఎపిసోడ్స్ ఇవి. ఇక వాలిమామ పూర్తి ప్రపంచాన్ని తెరకెక్కించాలంటే అది భారీ ఖర్చుతో కూడుకున్నది. ప్రింట్ ఎడిషన్ల అమ్మకాల గురించే ప్రస్తుతం దృష్టి పెడుతున్నాను.
ప్రశ్న 25: ఈ పుస్తకాన్ని ఎవ్వరూ పైరేట్ చేయకుండా, PDFలు ప్రచారంలోకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జ: పుస్తకాల పైరసీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ వచ్చాక ఈ సమస్యలింకా ఎక్కువయ్యాయి. సైబర్ చట్టాల మేరకు ఇండియాలో కొన్ని లీగల్ చర్యలు తీసుకోవచ్చు. కానీ, అందుకయ్యే ఖర్చుల్ని భరించడం కూడా కష్టమే.
గత పదేళ్లుగా నేనీ పైరసీని గమనిస్తున్నాను. అమెజాన్, కినిగె లాంటి వెబ్‌సైట్లనే హ్యాక్ చేశారు. కొన్ని వేల పుస్తకాలను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునేలా పెట్టేశారు. కానీ, ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న పుస్తకాలను సీరియస్‌గా చదివేవారి సంఖ్య కనీసం 1-2 శాతం మించదు. ఈ పుస్తకం పీడీఎఫ్ నాదగ్గరుంది అని చెప్పుకోవడానికీ, ఇంకో పదిమందికి షేర్ చేయడానికో పనికొస్తుంది తప్ప వేరే ప్రయోజనమంటూ ఏమీ వుండదని నా అభిప్రాయం. కినిగె నుంచి నా పుస్తకాలు కొన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ వారిలో చాలామంది ఈ విషయం నాకు చెప్తూనే ఫిజికల్ కాపీలకి ఆర్డర్ చేశారు. పుస్తకం చదివినంత అనుభూతిని ఇ-బుక్ ఇవ్వదని వాళ్లు అర్థం చేసుకున్నారు. నా పుస్తకాలన్నిటికీ ఇంటర్నేషనల్ కాపీరైట్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వుంది. కాబట్టి, ఏ దేశం నుంచి ఎవరు నా పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నా తెలుసుకోగలుగుతాను. చర్యలకు ఉపక్రమించగలుగుతాను.
ఇక వాలిమామ ప్రపంచం పుస్తకం పైరేట్ కాకుండా కాపీరైట్ యాక్ట్ అంశాల్ని గట్టిగానే తెలియజేశాను. ఒకవేళ ఎవరైనా పైరేట్ చేసినా, వెయ్యి పేజీలను పెట్టడం కొంచెం కష్టసాధ్యమే. పెట్టినా స్క్రీన్ మీద చదవడం కూడా కష్టమే. బ్లాక్ టెక్స్ట్ వున్న పుస్తకాలనైతే డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ మీద ఒక మేరకు కంఫర్టబుల్‌గా చదువుకోవచ్చు. కానీ, వాలిమామ సిరీస్‌ని స్క్రీన్ మీద చదవడం చాలా కష్టం. కంటెంట్ & పిక్టోరియల్ కలిపిన పుస్తకాలు కళ్లను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. రంగుల రెజల్యూషన్ కళ్లకు తీవ్ర ప్రమాదం. పుస్తకం డిజైన్ చేసేటప్పుడు నాకే కళ్లు బాగా అలసిపోయాయి. ఒకసారి వెబ్/టెలిగ్రామ్ లాంటి యాప్‌లలో చూడండి. ఎన్‌సైక్లోపీడియా వంటి పుస్తకాలు దొరుకుతాయేమో వెతకండి. అతి తక్కువగా కనిపిస్తాయి. ఉన్న కొన్ని కూడా చదవడానికి అనుగుణంగా వుండవు. కారణం ఈ రంగుల పుస్తకాలు చదవడం.
ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని నేను పైరసీ విషయాల్లో థీమాగా వున్నాను. వాలిమామ పుస్తకాల్లో ఇలస్ట్రేషన్స్ హై రిజల్యూషన్‌లో వుంటాయి. పైగా CMYK మోడ్‌లో డిజైన్ చేసిన పుస్తకాలను RGBలో నేరుగా చదవడం కూడా కష్టమే.
ఒకవేళ ఎవరైనా స్కాన్ చేసి ప్రింట్ తీసుకోవాలన్నా.. ఒక కలర్ పేజీకి మార్కెట్లో ప్రింటింగ్ ఖర్చు కనీసం 10 రూపాయలుంది. 1000 పేజీల పుస్తకానికి ప్రింటింగ్‌కే 10,000 రూపాయలు పెట్టాలి. ఇంకా.. బైండింగ్‌కి కనీసం 1000 రూపాయలవుతుంది. అందులో మూడో వంతు చెల్లిస్తే మేమే ఒరిజినల్ బుక్స్‌ని ఇస్తాం కదా! బ్లాక్ & వైట్‌లో ప్రింట్ చేయాలన్నా కూడా.. పేజీకి 2 రూపాయలకు తక్కువ లేదు. 1000 పేజీలకి 2000, బైండింగ్‌కో 1000 రూపాయలవుతుంది. ఈ 3000 ఖర్చుచేసే బదులు కొత్త పుస్తకాల్నే కొనుక్కోవచ్చు కదా! కాబట్టి, ప్రస్తుతానికి వాలిమామను పైరేట్ చేయడం కష్టం కాబట్టి ధీమాగా వున్నాను. సీరియస్ పరిస్థితులు ఎదురైతే మాత్రం అప్పుడు సీరియస్‌గా తీసుకుంటాను.
పైరసీకి సంబంధించి ఇంకో పరిణామాన్ని కూడా గమనిస్తున్నాను. బాగా అమ్ముడుపోతున్న పుస్తకాలను హైరిజల్యూషన్‌లో స్కాన్ చేసి, పీడీఎఫ్‌లుగా మార్చి, వాటిని ఫిజికల్ పుస్తకాలుగా ప్రింట్ చేసి అమ్ముతున్నారు. టాప్‌మోస్ట్ ఇంగ్లీష్ పుస్తకాల పైరసీ మామూలుగా లేదు. తిరుపతి, బెంగుళూరు, చెన్నయి, పూనే, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వచ్చివెళ్లే పలు మేజర్ రైళ్లలో నేరుగానే వీటిని అమ్మేస్తున్నారు. ఈ దుష్ట సంప్రదాయం పోవాలంటే అందుకు ఒక బలమైన చట్టం రావాలి. భవిష్యత్తులో వస్తుందేమో చూద్దాం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సురేశ్ వెలుగూరి గారూ.
సురేశ్ వెలుగూరి: ధన్యవాదాలు.
***
నల్లమల వాలిమామ ప్రపంచం
రచన: సురేశ్ వెలుగూరి
మొత్తం ఐదు పుస్తకాల పేజీలు: 1000
మొత్తం ఐదు పుస్తకాల వెల: ₹ 3000/-
ప్రతులకు:
విఎమ్‌ఆర్‌జి బుక్స్,
#403, అభి రెసిడెన్సీ, రోడ్ నెం.5,
మిథిలా నగర్,
ప్రగతి నగర్ ఎక్స్‌టెన్షన్,
హైదరాబాద్. 500090
ఫోన్: 098499 70455
vaalimaama@gmail.com
https://vmrgbooks.com/
~
‘నల్లమల వాలిమామ ప్రపంచం’ అనే ఐదు భాగాల పుస్తకం సమీక్ష:
https://sanchika.com/nallamala-vaali-maama-prapancham-book-review-js/