అమరులం

0
3

[త్వరలో సంచిక ప్రచురించనున్న ‘సైనిక కథలు’ సంకలనం కోసం సూర్యదీప్తి గారు పంపిన కథ. కొత్తగా రాసి పంపిన కథలు ముందు సంచికలో ప్రచురితమవుతాయి. ప్రతిపాదిత సంకలనంలో, ఇప్పటికే ప్రచురితమైన కథలతో బాటు, సంపాదకుల ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం కొత్తగా రాసి పంపిన కథల్లోంచి కొన్ని స్వీకరించబడతాయి.]

[dropcap]“పం[/dropcap]డక్కి తమ్ముడు వస్తున్నాడా.. హిమా?” అంటూ పక్కింటి వదినగారడిగితే “లేదు వదినా”, అంటూనే “తానొచ్చినప్పుడే మాకు పండగ” అంటూ సమాధానమిచ్చింది హిమ.

అవును కదా.. సుధీర్ ఏదో చిన్నా చితకా ఉద్యోగం చేస్తూ ఇంటికి దూరంగా ఉంటే ప్రతీ పండక్కి వచ్చేవాడేమో!

కానీ బాధ్యత గల సైనికుడిగా దేశ సంరక్షణ బాధ్యతను భుజాలకెత్తుకొని సగర్వంగా భారతావని సేవలో నిమగ్నమయ్యాడు..

తనకు మూడుముళ్ళు వేసినప్పటినుండీ మువ్వన్నెల జెండాను రక్షించే బాధ్యతలో తానూ భర్తకు సహకరిస్తుంది హిమ..

చెప్పుకోలేనంత బాధ గుండెల్ని పిండేస్తున్నా, వెలకట్టలేని సుధీర్ దేశభక్తిని చూసి అర్థం చేసుకుని అతన్ని అనునయిస్తుంది..

గతేడాది పిల్లలనీ తనను చూసిపోదామని సెలవు దొరకగానే వచ్చిన సుధీర్‌తో హిమ కొంచం బేలగా

“చూస్తుండగానే సమయం గడిచిపోయింది.. రేపో మాపో మళ్ళీ మిలిటరీకి బయలుదేరతారు.. ఎందుకండీ ఇలా అవస్థలు పడడం.. మీరూ ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోండి. అవసరమైతే నేనూ ఎంతో కొంత నాకు చేతనైన పని చేస్తాను. అందరమూ కలిసే ఉందాము” అని బతిమిలాడింది భోజనాల వేళ.

“మీరు ఆ మంచు కొండల నడుమ గడ్డకట్టే చలిలో, కంటి మీద కునుకు లేకుండా కాపలా ఉంటే; యుద్ధం ముంచుకొస్తే మీ ప్రాణాల్ని పణంగా పెడుతుంటే మేము ఇక్కడ మూడు పూటలా తింటూ, ఆదమరచి నిద్ర పోతున్నాము.. మీ కష్టంలో పాలుపంచుకోలేము.. ఇక్కడే ఉంటే వేళకి వండి పెట్టయినా మీకు చేదోడు వాదోడుగా ఉంటాను” అని వాపోయింది.

హిమ మాటలు వింటున్న సుధీర్ తన మనసు కరిగేలోపే దృఢం చేసుకున్నాడు.. దేశసేవ చేసే అవకాశం అందరికీ రాదని, అది పూర్వజన్మ సుకృతం అనీ, తనతో పనిచేసే విక్రమ్ కథని భార్యకి చెప్పాడు.

“విక్రమ్ సరిహద్దుల్లో పహారా కాస్తున్నప్పుడు తన తల్లి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని ఫోన్ రాగానే గుండెలో రాయిపడ్డట్టు అయింది. వెంటనే లగేజీ సర్దుకుని టికెట్ బుక్ చేసుకున్నాడు. ఫ్లయిట్ ఎక్కాల్సిన పావుగంట ముందు గ్రౌండ్ ఫోర్స్‌ని తీవ్రవాదులు ఆక్రమించారని తెలుసుకుని తన ప్రయాణం వదిలి తన తల్లిని కాపాడాలని శతకోటి దేవుళ్ళకు మొక్కి యుద్దానికి సిద్ధమయ్యాడు.. వీరోచిత పోరాటం చేసాడు.. అందరం కలిసి తీవ్రవాదుల ముప్పు తప్పించాము.

అదృష్టవశాత్తు విక్రమ్ తల్లికి కూడా ప్రాణాపాయం తప్పింది. ఆ తరువాత మేమందరం విక్రమ్‌ని ‘కన్నతల్లి అలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నువ్ వెళ్లక యుద్ధానికొచ్చావు. నీ మనసు ఎలా ఒప్పుకుంది? అలా చేయడానికి’ అని అడిగాం. ‘నేనిలా యుద్ధంలో పాల్గొనకుండా తనకోసం వెళితే మా అమ్మ కూడా నన్ను క్షమించలేదు. నేనిలా సైన్యం వైపు రావడానికి నాలో దేశభక్తి నింపడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు’ అని చెప్పాడు. తెల్లవారి తల్లిని చూడ్డానికి వెళ్ళాడు.

అలాగే యుద్ధంలో దురదృష్టవశాత్తు ప్రాణాలర్పించిన ఒక్కో సహచర సైనికుని చివరిదశలో వారి మొఖంలో కనిపించే ఆత్మసంతృప్తిని ఎక్కడా ఎపుడూ చూడలేము” అని చెప్తూ,

“పిచ్చి హిమా.. అసలు మేము అలా లక్ష్యసాధనలో నిమగ్నం అవడానికి మమ్మల్ని సిద్ధం చేసేది కూడా నీవంటి ఇల్లాళ్ళు, విక్రమ్ తల్లి వంటి తల్లులే సుమా.. మీరు ఎంతో సహనంతో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు మమ్మల్ని అక్కడ నిర్రందిగా ఉంచుతుంది.. ఏ చిన్న సమస్యా మా దాకా రాకుండా చక్కదిద్దే మీ నేర్పు మాకు ఆదర్శం అవుతుంది..

రాత్రి పగలు కుటుంబం కోసం సమాజంతో మీరు చేసే జీవనపోరాటమే మాకూ యుద్ధరంగంలో స్ఫూర్తినిస్తుంది.

శత్రువు దాడి చేస్తున్నాడని తెలియగానే ముందుగా కళ్ళముందు కుటుంబం కదులుతుంది.

నీ వంటి గృహిణులు కుటుంబం కోసం దేశం కోసం మమ్మల్ని త్యాగం చేసి సరిహద్దులోకి పంపారని తల్చుకోగానే శత్రువును తరిమి భారతమాత ఋణం తీర్చుకోవాలని ఊపిరి తొందర పెడుతుంది..

యుద్ధం సమాప్తం అయి ఇంటికి వస్తే మీతో, లేక ఏదైనా అనుకోనిది జరిగితే అశేష భారతీయుల గుండెల్లో బతికే ఉంటాము.

మేము ‘అమరులము’ అవుతాము హిమా..” అంటూ సుధీర్ తనతో పాటు తనలాంటి సైనికవీరుల త్యాగమయ జీవితం గూర్చి తన్మయత్వంతో చెపుతుంటే,.

చిన్నప్పుడు తెలుగు మాస్టారు నేర్పించిన గురజాడ గారి గేయం లోని ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అనే వాక్యాలు గుర్తొచ్చి భర్తని మళ్ళీ సరిహద్దుకి పంపడానికి ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది హిమ కొంచెం గర్వంతో.. మరింత ఆత్మసంతృప్తితో..

పుడితే ఇలా పుట్టాలి కానీ దేశానికి సేవచేయని జన్మఎందుకని తనకు తానే సమాధాన పరుచుకుంది.. సహకారం అందించింది.

ఎంతైనా భారత సైనికుని భార్య కదా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here