[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]అ[/dropcap]వును అప్పుడు నేనెక్కడున్నాను!
నిద్ర పట్టని ఏ అర్థరాత్రో నాకీ మాట గుర్తొచ్చి ఒక్కర్తినీ పిచ్చిదానిలా పక్కమీద దొర్లి నవ్వుకుంటాను.
ఈ మాట నా చిన్నతనంలో మా పార్వతమ్మ పెద్దమ్మ తరచూ వాడే మాట!
పార్వతమ్మ పెద్దమ్మ మా బంధువు కాదు. ఈ విషయం కొంచెం పెద్దయ్యాక తెలిసింది. మా వీధిలో మా యింటికి రెండిళ్ళవతల వారిల్లు. అది కూడ మా మామయ్యదే. వాళ్ళు అద్దెకుండే వారట. కాని మన కులం కాదని, అద్దెకున్నవారనే భేషజాలేమీ అప్పట్లో వుండేవి కావు. నిజానికి కులం పేరుతోనే కొందర్ని సంబోధించేవారు. కాని అందులో వాళ్ళు మనవాళ్ళు కాదని చెప్పడం కాని, వేరు చేసి మాట్లాడటం కాని వుండేది కాదు. అందరూ కలిసి మెలిసి వుండేవారు. డబ్బు జబ్బుతో విడిపోవడాలుండేవి కాదు.
“ఏమే వెళ్ళి పంతులుగారి భార్యని పిలుచుకురా” అంటే పరిగెత్తే వాళ్ళం.
“శిష్టికన్నాల దుర్గమ్మకిది ఇచ్చిరా” అంటే తీసుకెళ్ళేవాళ్ళం.
ఇలా సాగేవి మాటలు!
అందరం కలిసి పెరట్లో పొడుగాటి వరండాలో పిల్లలం కూర్చుని భోంచేసే వాళ్ళం. అత్తలు అందరికీ సమంగా వడ్డించే వాళ్ళు.
ఇప్పటిలా “నీ టిఫిన్ బాక్స్‌లోది వాంతి వస్తున్నా నువ్వే తిను. ఎవరితే పెట్టకు” అనే తల్లులు లేరు.
ఇక పార్వతమ్మ పెద్దమ్మ సంగతి కొద్దాం.
అప్పట్లో కాకినాడలో గణపతి నవరాత్రుల ఊరేగింపులు, చొల్లంగి అమావస్య ఊరేంగిపులు ఆర్భాటంగా జరిగేవి. ఆలాగే కొత్త సినిమా వస్తే కూడా. పెట్రేమాక్స్ లైట్లు పెట్టి భారంగా వూరేగించేవారు. ఎంత ఘోషాలో వున్న వారయినా మెల్లిగా గుమ్మాల్లోకి వచ్చి చూసేవారు.
చొల్లంగి తీర్థానికయితే రకరకాల రథాలు కట్టి అందులో దశవతారాల వేషాలు వేసి భలే నిలబడేవారు. ముందు కిరీటాలు, మేకప్పులు, ధగధగలాడే నగలు వెనుక నల్లటి మేకప్పులేని వీపులు, ఎండిపోయినట్లున్న విగ్గులు చూసి పిల్లలు మేం తెగ నవ్వేవాళ్ళం. ఒక్కోసారి ఆ వేషాలేసిన వాళ్ళే ఎవరో కనిపెట్టి “అరేయ్ శివుడు మన చెక్క సత్యం కొడుకురా!” అని అరిచేవాళ్ళు. వాళ్ళు కళ్ళు మిటకరించి ఇబ్బందిగా రథంలో ఏడవలేక నవ్వుతూ నిలబడేవారు.
అలా రథాలన్నీ వీధంతా సాగేక నేను వాటి కూడా కొంత దూరం వెళ్ళి తిరిగొచ్చే దాన్ని. వచ్చే దాన్ని ఇంటికి రాక పార్వతమ్మ పెద్దమ్మ వీధి తలుపు తట్టి పెద్దమ్మని పిలిచేదాన్ని.
పెద్దమ్మ తలుపు తెరిచేది.
“పెద్దమ్మా మన వీధిలో భలే వూరేగింపు వెళ్ళింది తెలుసా!” అని లొట్టలేసుకుంటూ చెప్పేదాన్ని.
“అవునా… అప్పుడు నేనెక్కడున్నాను” అని ఒక కనుబొమ్మ పైకెత్తి సీరియస్‌గా అడిగేది పెద్దమ్మ.
“పడుకున్నావేమో పెద్దమ్మా” అనే దాన్ని అమాయకంగా.
“ఇప్పుడేం పడకే… ఎక్కడున్నావంటావ్?” అనేది మళ్ళీ.
“భోంచేస్తున్నావేమో! అనేదాన్ని ఆవిడేం చేస్తుందో నాదే భారమయినట్లు.
“ఛ! ఇంకా వంటే కాందే!” అనేది.
నాకు దిక్కుతో చేది కాదు.
ఇప్పుడావిడ ఆ టైంలో ఏం చేస్తుందో నేను చచ్చినట్లు చెప్పి తీరాలని అది నా బాధ్యతనుకుని వస్తున్న ఏడుపు ఆపుకుని పారిపోలేక… “స్నానానికి వెళ్ళావేమో పెద్దమ్మా” అనే దాన్ని.
“స్నానం సాయింత్రాలు చెయ్యనే. నాకసలు వినపడనే లేదు అయితే నేనప్పుడు ఎక్కడున్నానంటావ్?” అనేది మళ్ళీ.
చూడ్డానికి హిందీనటి లలితా పవర్‌లా వుండేదావిడ.
నేనలానే నిస్సహయంగా నిలబడి దిక్కుతోచక దిక్కులు చూస్తూడంటం ఎవరో ఒకరు చూసి పరిస్థితి గ్రహించి “ఏంటే.. శారదా అక్కడేం చేస్తున్నావ్, మీ అమ్మ పిలుస్తోంది” అని నన్ను రక్షించేవారు.
అదే అదునుగా నేను తూనీగలా పరిగెత్తేదాన్ని.
అంతలో పెద్దమ్మకి మరెవరో కనపడేవారు.
“ఏరా, బాబూరావూ, మనీదిలో వూరేగింపెళ్ళిందట గదా… నాకు తెలియనే తెలియదురా… అప్పుడు నేనెక్కడున్నానంటావు” అనడిగేది.
ఇక కాసేపు వాడు బలయి పోయేవాడు.
వేసిన తలుపు కొట్టి మరీ ఆవిడని రంగంలో దింపినందుకు వాడు తిరిగొచ్చి నన్ను తన్నినంత పని చేసేవాడు.
చాల మంది ఆవిడ వీధిగుమ్మంలో నిలబడి వుందంటే మరో దారి చూసుకుని పారిపోయేవారు.
అలాంటి పెద్దమ్మ జీవితం విషాదంలో కూరుకుపోయినప్పుడు వీధిలో అందరూ బాధ పడ్డారు. అది కూడ ఆమె స్వయంకృతమే.
పెద్దమ్మకి ముగ్గురు కూతుళ్ళు.
పెద్ద కూతురు వాళ్ళు శ్రీకాకుళంలో వుండేవారు. అల్లుడు తాసిల్దారు.
ఇక్కడ ఇంకో కూతురు అల్లుడితో ఇక్కడ వుంటుంది పెద్దమ్మ. మరో పెళ్ళికాని కూతురు కూడ పెద్దమ్మతో వుండేది.
ఈ అల్లుడి పేరు నాకు గుర్తులేదు. అప్పుడు నా వయసు అయిదారేళ్ళే.
కాని పచ్చి తాగుబోతు.
తాగి వచ్చి అక్కని కొడుతుండే వాడు.
అక్కకి పిల్లల్లేరని చిన్నక్కని ఇచ్చి చేయమని లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు.
పెద్దమ్మ వద్దని ఎవరు చెప్పినా వినకుండా చిన్నక్కని కూడ యిచ్చి చేసిందట.
ఇక తాగి వచ్చి ముగ్గుర్నీ కొట్టేవాడు. వాళ్ళు ఏడుపులు మా పెరట్లోకి వినపడేవి.
అప్పటికీ మా మమయ్య, దొడ్డమ్మ, మా అమ్మగారు జోక్యం చేసుకునే వారు.
నేను మా యింటి దగ్గర చర్చి స్క్వేర్‌లో సాయంత్రాలు ఆడుకునేదాన్ని.
చర్చ్ స్క్వేర్ అంటే.. రెండు అది పెద్ద చర్చిలు వుండేవి. వాటికి ఎదురుగా ఒక పెద్ద ఖాళీ స్థలంలో ఇసుక పోసి బెంచీలు వేసుండేవి. రకరకాల వ్యాయమాలు చేసే పరికరాలు, పిల్లలు ఆడుకునేవి ఫిక్స్ చేసి వుండేవి. అక్కడ ఆడుతున్నా మా యింటి వైపు ఎవరు వెళ్ళినా రోడ్డుమీద వాళ్ళు మాకు కనపడేవారు.
నేను అడుతూనే మా మామయ్య కాని వస్తున్నాడేమోనని ఒక కన్ను వేసి చూస్తూండే దాన్ని. అయనంటే హడల్ మాకు.
అప్పుడు టాపులేని రిక్షాలో పుల్‌గా తాగేసి చేతిలో ఒక పేకట్టు అగరుబత్తి వెలిగించి ‘అమ్మా దుర్గమాతా, కాళీ’ అంటూ ఏవో స్తోత్రాలు చేస్తూ వస్తుండేవాడు. నేను వెంటనే ఆట వదిలేసి రిక్షా వెంబడి పరిగెత్తుతూ అతని వాలకం ఆసక్తిగా గమనిస్తూ ఇల్లు వస్తుందనగా స్పీడు పెంచేసి గబగబా తలుపు కొట్టి పెద్దమ్మని పిలిచి ఆ సంగతి చెప్పేసి మా పెరట్లోకి పరిగెత్తే దాన్ని.
ఎందుకంటే వాళ్ళ వెనుక కాంపవుండ్ వాల్ మా పెరట్లోకి వచ్చేది.
పది నిమషాల్లో రణరంగం మొదలయ్యేది.
అక్కల ఏడుపులు-పెద్దమ్మ అరుపులూ!
వెంటనే నేను మళ్ళీ పరిగెత్తి దొడ్డమ్మా, బావగారొచ్చి అక్కల్ని కొట్టేస్తున్నాడు అని చెప్పేదాన్ని.
‘దొడ్డమ్మ దరిద్రుడు… మళ్ళీ మొదలెట్టాడా’ అని పరిగెత్తేది. నేను కూడా వెళ్ళబోతే రావద్దనేది.
నిజానికి ఆ రోజుల్లో తాగుబోతులు చాలా అరుదుగా కనిపించేవారు. సినిమాల్లో ఆ సీన్లు చూసే వాళ్ళం.
చదువుకున్న యిళ్ళల్లో అలాంటి వ్యక్తులు వుండేవారు కాదు. నిజ జీవితంలో తారసపడితే… చూడాలన్న ఆసక్తి, చూడాలంటే భయం రెండూ వుండేవి.
చివరికతను కొన్ని నెలల్లోనే చనిపోవడం. ఒక నీచుడు కోసం ఇద్దరికి వైధవ్యం అందరూ పెద్దమ్మని తిట్టి పోశారు.
పెద్దక్క వాళ్ళని తీసుకెళ్ళి చదివించి ఉద్యోగాల్లో పెట్టిందట.
అదే పని ముందు చేస్తే ఎంత బాగుండేది!
నేను ఆఫీసులో చేరాక ఇలాంటి దురలవాట్లతో ఎంతో మంది అకాలంగా చనిపోవడం వారి భార్యలు వచ్చి సర్వీసుల్లో చేరుతుంటే చూసి బాధ కల్గేది.
ముందు అతని దురలవాట్లతో నరకం అనుభవించి తర్వాత వాళ్ళ రోగాలకి సేవ చేసి నలిగిపోయిన ఆడవారిని చూసినప్పుడు మనస్సు కలుక్కుమంటుంది.
నిజానికి ఏ రక్త సంబంధం లేకుండా పెళ్ళి పేరుతో తనింటికి వచ్చిన స్త్రీకి అండదండలు, ప్రేమ ఇవ్వక పోగా… ఇలా హింసించటం ఎంత వరకు ధర్మమో..!