[జి.ఎస్.ఎస్. కళ్యాణి గారు రచించిన ‘వైరాగ్యం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ది పురాతన శివాలయ ప్రాంగణం. అక్కడ ఎనభయ్యేళ్ళ చిదంబరనాథుడు ఆదిశంకరాచార్యలు రచించిన ‘నిర్వాణషట్కమ్’ పై ఆధ్యాత్మిక ప్రవచనం చెబుతున్నాడు. చిదంబరనాథుడు అనేక సంవత్సరాలుగా కఠోర నియమనిష్ఠలతో పరమేశ్వరుడి ఉపాసన చేస్తూ ఉండటంతో ఆ తపశ్శక్తి అతడి ముఖంలో దివ్యతేజస్సులా సుస్పష్టంగా కనపడుతోంది. అతడి ఆహార్యం, మాటతీరూ కూడా అందుకు తగ్గట్టే ఉండి, సాక్షాత్తూ ఆ శివుడే వచ్చి ప్రవచనం చెప్తున్నట్లుగా ఉంది! దాంతో అక్కడున్న జనమంతా మంత్రముగ్ధులై చిదంబరనాథుడు చెబుతున్నది వింటున్నారు. రెండు గంటల సమయం ఎలా గడిచిపోయిందో అక్కుడున్నవారెవ్వరికీ తెలియనే లేదు! ప్రవచనం ముగిసింది. అక్కడున్నవారంతా తాము విన్న విషయాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారేమో అన్నట్లు ఆ ప్రాంగణమంతా నిశ్శబ్దం ఆవరించుకుంది.
అంతలో జనం మధ్యలోంచీ సుందరం అనే ఇరవయ్యేళ్ళ యువకుడు లేచి, “శివోహం!”, అని అరుస్తూ వేదిక మీదున్న చిదంబరనాథుడి వద్దకు వెళ్లి నమస్కరించి, “స్వామీ! నాకు ఐహిక సౌఖ్యాల పట్ల వైరాగ్యం కలిగింది. నేను సన్యసించి, ఆ పరమేశ్వరుడి కృపను పొందాలని అనుకుంటున్నాను! అనుగ్రహించండి!”, అన్నాడు.
ఆ మాటలకు అక్కడున్న జనాలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చిదంబరనాథుడు ఇచ్చే సమాధానం కోసం వారంతా ఆతృతగా వేచి చూడసాగారు.
చిదంబరనాథుడు సుందరం ముఖంవంక తదేకంగా చూసి చిరునవ్వు నవ్వి, “దానికి నీకింకా సమయం ఉంది. ముందు నీకు పరమేశ్వరి మంత్రాన్ని ఉపదేశిస్తాను! ఆ జగన్మాత శివజ్ఞాన ప్రదాయిని! సమయం వచ్చినప్పుడు నీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగేలా ఆవిడే చేస్తుంది!”, అని అమ్మవారి మంత్రాన్ని సుందరానికి ఉపదేశించాడు.
ఉపదేశం పొందిన సుందరం చిదంబరనాథుడికి నమస్కరించి, “స్వామీ! మంత్రోపదేశం చేసినందుకు ధన్యుడిని. నేను నా శక్తికొద్దీ సాధన చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతాను! కానీ నేను సన్యాసాశ్రమం స్వీకరించకుండా ఏకాగ్రతను పొందలేను! కాబట్టి నాకెలాగైనా సన్యాస దీక్షను ఇప్పించండి!”, అంటూ బతిమలాడాడు.
“చెప్పాను కదా నాయనా నీకా అర్హత ఇంకా రాలేదనీ! నేనిచ్చిన మంత్రం జపిస్తూ ఉండు!”, అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు చిదంబరనాథుడు.
‘సరే! నా బాధ ఈయనకు అర్ధమైనట్లు లేదు! ఒక పని చేస్తా!’, అని అనుకుంటూ అక్కడే ఒక మూలగా నిద్రపోతున్న ఒక సాధువును లేపి అప్పటికప్పుడు తనకు సన్యాస దీక్షను ఇవ్వమని బలవంతం చేశాడు. ఆ సాధువు ఆలా కుదరదని ఎంత చెప్పినా సుందరం వినలేదు. దాంతో వేరే దారిలేక ఆ ఆలయ పుష్కరిణిలో స్నానం చేసి రమ్మని చెప్పి, సుందరానికి సన్యాస దీక్షను ఇచ్చి, సుందరం పేరును శంకరదాసుగా మార్చాడు ఆ సాధువు. శంకరదాసు ఆ ఆలయం నుండీ బయటకి వస్తూ ఉంటే ప్రవచన కార్యక్రమానికి వచ్చిన వారంతా అతడికి భక్తితో నమస్కారం చేయసాగారు. శంకరదాసుకి మనసులో ఎక్కడో రవ్వంత గర్వం కలిగింది.
అంతలో ఒక భక్తుడు, “స్వామీ! మీకు ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం కలిగింది. మీవంటి గొప్పవారు మా ఊరికి చెందినవారు అయి ఉండటం మా అదృష్టం. కాబట్టి మీరు ఈ ఊరు విడిచి ఎక్కడికీ వెళ్ళకండి. ఈ ఊరి చివరనున్న నా స్థలం మీకిస్తాను! అందులో మీరు ఆశ్రమము నిర్మించుకుని ఇక్కడే సాధన చేసుకోండి. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీ దర్శనం చేసుకుని మిమ్మల్ని సేవించుకుంటాం! కాదనకండి!”, అంటూ శంకరదాసు కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
తపస్సు చేసుకోవడానికి ఎక్కడికెళ్ళాలో అన్న చింత ఇంత సులభంగా తీరినందుకు సంతోషించి ఆ భక్తుడు అడిగినదానికి శంకరదాసు ఆనందంగా ఒప్పుకున్నాడు. ఆ మరుసటి రోజునుండీ చిదంబరనాథుడు ఇచ్చిన మంత్రాన్ని ఏకాగ్రతతో జపించడం మొదలుపెట్టాడు శంకరదాసు. రోజులు గడుస్తున్నకొద్దీ శంకరదాసు సాధన మెరుగుపడి పరమేశ్వరిపై తన చిత్తాన్ని నిలపగలిగాడు. అతడి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య కూడా మెల్లిగా పెరుగుతూ వచ్చింది. వారు తెచ్చే కానుకలూ, ధనమూ రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో ఆశ్రమానికి రాబడి విపరీతంగా పెరిగింది. ఆ వచ్చిన ధనాన్ని సద్వినియోగం చెయ్యాలని సంకల్పించాడు శంకరదాసు. ధర్మాన్ని ప్రచారం చేసేందుకు వివిధ ప్రదేశాలలో కేంద్రాలను ఏర్పాటు చేయించి, సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టి ఆ దేశంలోనే మంచి గుర్తింపును, పేరునూ సంపాదించాడు శంకరదాసు.
ఇదిలా ఉండగా శంకరదాసు ఉంటున్న ఊరికి పక్కనే ఉన్న ఊళ్ళో మరొక సాధువు కూడా ఆశ్రమం నిర్మించుకున్నాడన్న వార్త శంకరదాసుకి తెలిసింది. మొదట దాని గురించి అంతగా పట్టించుకోలేదు శంకరదాసు. కానీ నెలలు గడిచే కొద్దీ ఆ ఆశ్రమానికి భక్తులు ఎక్కువగా వెళ్ళటం మొదలయ్యింది. శంకరదాసు ఏర్పాటు చేసిన ఆశ్రమానికి రాబడి గణనీయంగా తగ్గిపోయింది. దాంతో శంకరదాసు కొన్ని ధర్మప్రచార కేంద్రాలను మూసివెయ్యాల్సివచ్చింది. తన ఆశ్రమానికి వేరొక ఆశ్రమం పోటీగా రావడం, దానివల్ల తన పరపతి తగ్గటం శంకరదాసును బాధపెట్టాయి. మిగిలిన ధర్మ ప్రచార కేంద్రాలను కూడా మూసేసి, ఆ వచ్చిన ధనంతో తన ఆశ్రమానికి పక్కనున్న స్థలాలను కొని, ఆశ్రమాన్ని విస్తరింపజేయాలని అనుకున్నాడు శంకరదాసు. తాను అనుకున్నట్లే శంకరదాసు ఆ స్థలాల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి సొమ్మును కూడా ఇచ్చేశాడు. కానీ ఆ స్థలాలకు సంబంధించిన కాగితాలు ఆశ్రమంవారి ఆధీనంలోకి రావడంలో కొన్ని చిక్కులు ఏర్పడ్డాయి. శంకరదాసు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. వ్యవహారం ఒక కొలిక్కి రావడానికి చాలా కాలమే పడుతుందని చెప్పారు న్యాయవాదులు. శంకరదాసు దగ్గర పోగైన ఆస్తి మొత్తం చూస్తూండగా హారతి కర్పూరంలా కరిగిపోయింది.
ఒకరోజు శంకరదాసు తన గదిలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. అంతలో అతడికి ఒక స్త్రీ ఏడుపు వినపడింది. ఎవరైఉంటారోనని గది బయటకొచ్చి చూస్తే అక్కడొక యువతి ఏడుస్తూ కనపడింది శంకరదాసుకి.
“ఎవరు తల్లీ నువ్వూ?! ఎందుకేడుస్తున్నావు? నీకొచ్చిన కష్టమేమిటీ?”, అని ఆప్యాయంగా అడిగాడు శంకరదాసు.
ఆ స్త్రీ శంకరదాసువంక చూస్తూ ఉన్నట్లుండి స్పృహ తప్పి కిందపడబోయింది. శంకరదాసు చటుక్కున ఆ స్త్రీ చేతిని పట్టుకున్నాడు.
ఆ దృశ్యం చూసిన ఒక నలుగురు వ్యక్తులు, “ఒరేయ్! ఆగరా!! ఆ అమ్మాయిని ఏం చేస్తున్నావ్?”, అంటూ శంకరదాసు మీదికి కర్రలతో వచ్చారు.
శంకరదాసుకి ఏమీ అర్థం కాలేదు.
“ఎవరు మీరంతా? ఈ అమ్మాయి ఏదో కష్టంలో ఉంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను!”, అని చెప్పాడు శంకరదాసు.
“నీ మాయ మాటలు మాకు చెప్పకు! నువ్వు ఆ అమ్మాయిని పాడుచేసే ప్రయత్నం చేస్తున్నావు! మర్యాదగా ఆ అమ్మాయి ఎంత డబ్బడిగితే అంత ఇచ్చేయ్! లేకపోతే..”, అంటూ శంకరదాసుని బెదిరించారు ఆ వ్యక్తులు.
వాళ్ళు చేస్తున్న గొడవకి అక్కడికి వచ్చిన ఆశ్రమవాసులు ఆ వ్యక్తులకు ఎలాగో సద్ది చెప్పి, శంకరదాసువంక ఒక అపరాధిని చూసినట్లుగా చూస్తూ, ఆశ్రమంలో ఉన్న డబ్బునూ, కొన్ని ఖరీదైన వస్తువులనూ ఆ యువతికి ఇచ్చి ఆమెను అక్కడినుండి పంపేసి, “ఇక సెలవు స్వామీ! మేము మీతో ఉండలేం!”, అంటూ అక్కడినుండీ వెళ్లిపోయారు.
శంకరదాసుకి జరిగినదంతా నిజమా అబద్ధమా తెలియడం లేదు! పరిస్థితులన్నీ అతడి చెయ్యి దాటిపోయాయని మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది. ఏంచెయ్యాలో పాలుపోని స్థితిలో అడుగులో అడుగు వేసుకుంటూ పూజా మందిరంలోకి ప్రవేశించి అక్కడున్న అమ్మవారి విగ్రహం ముందు కూలబడిపోయి, చిన్నపిల్లవాడిలా కన్నీరు మున్నీరుగా విలపించడం మొదలుపెట్టాడు శంకరదాసు.
“తల్లీ! నా జీవితం నీ సేవకు అంకితమని అనుకున్నాను! నా ఆశ్రమాన్ని విస్తరింపజేసి, భక్తుల సంఖ్యను మరింతగా పెంచి, వారిచేత మంచి పనులను చేయిస్తూ, వారు ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకునేలా చేద్దామని అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికి పూర్తి భిన్నంగా జరిగింది! ఇన్నాళ్లూ నేను సంపాదించిన ఆస్తి, పేరూ అన్నీ పోయాయి! ఆడవారిలో నిన్ను చూసే ప్రయత్నం చేసే నాకు, ఆ ఆడవారి పట్ల నీచమైన భావన ఎందుకు కలుగుతుంది తల్లీ? నువ్వే నాకు మార్గం చూపించు!”, అంటూ రోదించాడు శంకరదాసు.
అంతలో, “స్వామీ! స్వామీ!”, అంటూ ఎవరో చిన్న పిల్లవాడి పిలుపు వినిపించింది శంకరదాసుకి.
కళ్ళు తుడుచుకుని ఆ పిలుపు వినపడింది వైపు చూశాడు శంకరదాసు. అక్కడొక పదేళ్ల వయసున్న బాబు భక్తితో చేతులు జోడించి నిలబడి ఉన్నాడు.
“ఏం నాయనా?”, అడిగాడు శంకరదాసు.
“స్వామీ! మా అమ్మ నాకొక స్తోత్రం నేర్పింది. అందులో ఉచ్ఛారణ దోషాలేమైనా ఉన్నాయేమో మిమ్మల్ని అడిగి తెలుసుకోమంది. మరి ఆ స్తోత్రం చెప్పమంటారా?”, వినయంగా అడిగాడు ఆ బాబు.
“ఊఁ!”, అన్నాడు శంకరదాసు.
ఆ బాబు ఆదిశంకరాచార్యులవారి ‘నిర్వాణషట్కమ్’ శ్రావ్యంగా పాడి వినిపించాడు. అందులోని ఒక్కొక్క చరణం వింటూ ఉంటే ముప్పయ్యేళ్ల క్రితం చిదంబరనాథుడు చెప్పిన అర్థం శంకరదాసు చెవుల్లో ప్రతిధ్వనించింది. శంకరదాసు కళ్ళవెంట నీళ్లు జలజలా రాలాయి. స్తోత్రం పూర్తి కాగానే చిరునవ్వుతో ఆ బాబు వంక చూశాడు శంకరదాసు!
“శివోహం!”, అన్నాడు ఆ బాబు నవ్వుతూ.
సరిగ్గా ముప్పైఏళ్ళ క్రితం ఆ స్తోత్రం వినగానే తన నోటివెంట వచ్చిన ‘శివోహం’ అన్న పదం ఇప్పుడు ఈ బాబు నోటి వెంట వినేసరికి శంకరదాసుకి ఒళ్ళు గగుర్పొడిచింది.
“ఇంతకీ మీరు సన్యాసి కదా?! వైరాగ్యానికి అర్థం కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకోమంది మా అమ్మ!”, అన్నాడు ఆ బాబు.
“వై..రా..గ్యం..!”, ఒక్కొక్క అక్షరం శంకరదాసు నోటివెంట అతడి చిన్ననాటి వాంఛను గుర్తుచేస్తూ, సన్యాసాశ్రమ జీవిత పరమార్ధాన్ని తెలుపుతూ వచ్చింది. శంకరదాసుకి జ్ఞానోదయమైంది!
“నిజమే! నేను సన్యాసిని!! ఈ ఇహలోకపు విషయాలలో పడి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి దూరమవుతున్నాను! అలా కాకూడదు!”, అన్నాడు శంకరదాసు.
అందుకు ఆ బాబు నవ్వి, “మరి ఆ జగన్మాతను ఉపాసిస్తే శివానుగ్రహం కలుగుతుంది. కానీ, చిత్రమేమిటంటే అమ్మవారి ఉపాసనవల్ల శివజ్ఞానానికన్నా ముందు డబ్బు, కీర్తి వంటివి లభిస్తాయి. వాటి మాయలో పడి ఆ పరమాత్మ సేవకు దూరమైతే ఇక అంతే సంగతులు! ఈ ఐహిక సుఖాలు ఎంత ఆకర్షించినా వాటిని వదిలిపెట్టి ఆ అమ్మ పాదాలను పట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది!”, అన్నాడు.
ఆ క్షణం ఆ బాబులో చిదంబరనాథుడు కనిపించాడు శంకరదాసుకి.
“గురుదేవా! నన్ను సరైన మార్గంలో నడిపించడానికి మీరే స్వయంగా వచ్చారా?!”, అంటూ ఆ బాబు పాదాలకు నమస్కరించాడు శంకరదాసు.
“విజయోస్తు!”, అని దీవించి ఆ బాబు అంతర్ధానమయ్యాడు!
శంకరదాసు, ‘నేను ఇక అశాశ్వత సుఖాలను వదిలిపెట్టి శాశ్వతుడైన ఆ పరమేశ్వరుని సేవకు నా జీవితాన్ని అంకితం చేసి ఆయన కృపను పొందుతాను!’, అని అనుకుంటూ ఆ ఆశ్రమాన్ని విడిచి జనసంచారానికి దూరంగా, తపస్సుకోసం అనుకూలమైన చోటికి వెళ్ళిపోయాడు.