[ఇటీవల మిత్రుల కుటుంబాలతో రాయలసీమలోని దివ్యక్షేత్రాలను సందర్శించి ఆ అనుభూతులను పంచుకుంటున్నారు శ్రీమతి పైడిమర్రి పద్మ.]
[dropcap]మా[/dropcap] ఫెడరల్ బ్యాంక్ రిటైర్డ్ స్నేహితులం అందరం కలసి నాలుగు రోజులపాటు రాయలసీమలో చూడవలసిన ముఖ్య ప్రాంతాలు కొన్నింటిని చూసి వచ్చాము.
మనకి కొన్ని గంటల ప్రయాణ దూరంలోనే ఇంత అద్భుతమైన ప్రదేశాలు వున్నాయా? అనిపించింది చూసాకా.
సరే! ఎవరికైనా ఉపయోగ పడుతుందేమోనని నేను చూసినవి, విన్నవి, గుర్తున్నవి, రాస్తున్నా.
***
మొదటి రోజు:
మాలో కొందరు బెంగుళూరు నుంచి, కొందరు హైదరాబాదు నుంచి బయల్దేరాము. అందరం నంద్యాలలో కలుసుకున్నాం. అక్కడ నుంచీ మహనంది చేరుకున్నాము. మహనంది చుట్టుపక్కల మొత్తం తొమ్మిది నందులు కొలువై వున్నాయి. వీటిని నవ నందులు అంటారు. ఇందులో ముఖ్యమైనది మహానంది.
ఇన్ని నందులు కొలువై వున్నాయి కాబట్టి ఈ వూరికి నంద్యాల అని పేరు వచ్చిందని అనుకుంటారు.
7 వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించ బడిందని అంటారు.
ఇక్కడ శివుడు నందీశ్వరుని పేరుతో మహానందీశ్వర స్వామిగా వెలిశారు. అమ్మవారు కామేశ్వరీ దేవి.
ఈ ఆలయ చరిత్ర గురించి అక్కడ చెప్పిన దాని ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని నందనుడు అనే రాజు పరిపాలించే వారుట. ఆయన దగ్గర వున్న ఆవుల్లో ఒక ఆవు రోజూ అడవిలో వున్న ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలోకి పాలు వదిలేసేదిట . అలా ఎందుకు చేస్తోందో అని రాజు ఒకరోజు ఆవుని వెంబడించారుట.
రాజుని చూసిన ఆవు కంగారులో పుట్ట మీద కాలు వేసి తొక్కి మాయమైపోయిందిట. అది చూసి రాజు బాధపడుతుంటే శివుడు కలలో కనిపించి అక్కడ పుట్ట రూపంలో వెలుస్తానని చెప్పారుట.
అందుకే మనకి ఇక్కడ శివలింగం పుట్ట ఆకారంలో కొంచం తప్పటగా ఆవు పాదం గుర్తుతో కనబడుతుంది.
ఇక్కడ అమ్మవారు కామేశ్వరీ మాతగా దర్శనమిస్తారు. నవాబుల దండయాత్రలో అమ్మ వారి ముక్కు కొంచం విరిగిందిట. తరువాత శ్రీ ఆది శంకరాచార్యుల వారు ప్రస్తుతం వున్న విగ్రహాన్ని, శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారుట.
ఇక్కడ గుడిలో వున్న శిల్పాలు చాలా అందంగా వుంటాయి. ముఖ్యంగా అమ్మ వారి గర్భగుడి వద్ద పైన సరస్వతీ దేవి వీణ పట్టుకున్న విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు.
నెమ్మదిగా చూస్తో వెడితే ఇవన్నీ చెక్కిన బాలాచారి అనే ఆయన చిత్రం గూడా కనిపిస్తుంది.
పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు గూడా వున్నాయి.
నందీశ్వర వినాయకుడు గూడా వున్నాడు.
ఇంకా ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇక్కడ వున్న కోనేరు గురించి. ఇందులోకి నీరు గర్భగుడిలో వున్న శివలింగం కిందనుంచీ వస్తుందిట. చాలా స్వచ్ఛంగా వుంటుంది.
~
మహనంది నుంచీ యాగంటికి బయలుదేరాము. ఒక గంట ప్రయాణం. ఇది సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఉమా సహిత మహేశ్వరులు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
ఈ గుడి 15 శతాబ్దానికి చెందినది. విజయనగర రాజులు నిర్మించినట్టు చెబుతారు.
చరిత్ర కథనం ప్రకారం ఇది ముందు వైష్ణవ క్షేత్రం.
అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠిద్దామని అనుకున్నారుట. కానీ ఆ విగ్రహానికి కాలి బొటనవేలు విరిగిపోయిందిట.
దానితో ముని బాధపడి శివుని గురించి తపస్సు చేసారుట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇది ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని, అక్కడ తను పార్వతీ దేవితో కలసి స్వయంభువుగా వెలుస్తానని చెప్పారుట.
అలాగే మనకి గర్భగుడిలో ఒకే శిలపై విభూతితో శివుడు, పక్కనే పసుపు రాసుకుని పార్వతీ దేవి కనిపిస్తారు. ఇలా మరి మనం మరెక్కడా చూడం.
ఈ గుడి ప్రాంగణంలో అతి ముఖ్యమైనది స్వయంభువుగా వెలసిన యాగంటి బసవన్న. ఇన్ని వందల సంవత్సరాల నుంచీ కొంచం కొంచంగా పెరుగుతోందిట. కలియుగం అంతమయ్యే సమయంలో ఈ బసవన్న లేచి రంకె వేస్తారుట.
ఇంకా ఇక్కడ కొండలలో మూడు ముఖ్యమైన గుహలు వున్నాయి.
అగస్త్య ముని తపస్సు చేసిన గుహ. బ్రహ్మం గారు తపస్సు చేసిన గుహ. వెంకటేశ్వర స్వామి కొలువైన గుహ. ఇందులో వున్న స్వామి విగ్రహం తిరుమలలో వున్న వెంకటేశ్వర స్వామి కన్నా ముందు ప్రతిష్ఠించినదిట.
ఎంత పురాతనమైనదో. దర్శించడం మా అదృష్టం.
చుట్టూ కొండలూ, అడవులూ, ఎంత సేపు చూసినా చూడాలనిపించింది.
~
యాగంటి నుంచీ సుమారుగా గంటన్నర ప్రయాణం చేసి అహోబిలం చేరాము.
అహోబిలం ప్రముఖ నరసింహ క్షేత్రం.
విష్ణుమూర్తి హిరణ్య కశ్యపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించిన క్షేత్రం .
సుమారుగా 1830 నుంచీ ఈ ఆలయం వున్నట్టుగా చెబుతారు.
హిరణ్య కశ్యపుడుని సంహరించేటప్పుడు స్వామి బలం చూసి దేవతలు అందరూ ‘అహో ఏమి బలం’ అని స్తుతించారుట.
కాలక్రమేణా అది అహోబిలంగా మారింది.
ఇక్కడ కింద వున్న గుడిని దిగువ అహోబిలం అని, పైన వున్న గుడిని ఎగువ అహోబిలం అని పిలుస్తారు.
ముందు దిగువ అహోబిలం చూసాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిచే ప్రతిష్ఠించబడిన లక్ష్మీ నరసింహులు పూజలు అందుకుంటున్నారు. ప్రహ్లాద వరద నరసింహుడు శాంతమూర్తిగా దర్శనం ఇస్తారు.
ఎగువ అహోబిలంలో స్వామి స్వయంభువుగా వెలిశారు. ఉగ్ర నరసింహమూర్తిగా కొలుస్తారు.
ఇంకా ఇక్కడ నవ నరసింహ క్షేత్రాలు వున్నాయి.
ఉగ్ర స్తంభం గూడా వుంది. ఇందులోంచి విష్ణుమూర్తి నరసింహ అవతారంలా వచ్చి హిరణ్య కశ్యపుడిని సంహరించారని చెబుతారు.
మాకు తగిన సమయం లేక మేము ఇవి చూడలేదు.
***
రెండో రోజు:
రెండో రోజు అహోబిలం నుంచీ కడపకి బయలుదేరాము.
కడపలో ముందుగా దేవుని గడప వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లాము. దీనిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం అని గూడా అంటారు.
ఈ ఆలయం కృపాచార్యునిచే స్థాపించబడినదని అంటారు.
తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు ఇక్కడ స్వామిని దర్శించుకునే వారుట. అందుకే ఈ ప్రాంతాన్ని దేవుని గడప అంటారు.
ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనకాల ఆంజనేయ స్వామి వుంటారు. మనకి గర్భ గుడిలో లైట్ తీసేసి హారతి వెలిగించి ఆ వెలుగులో ఆంజనేయ స్వామిని చూపిస్తారు. ఇక్కడ ఆయన క్షేత్ర పాలకుడు.
పద్మావతీ అమ్మవారు గూడా చూడ ముచ్చటగా వున్నారు.
కంచిలో లాగానే ఇక్కడ గుడిలో గోడ మీద రెండు రాతి బల్లులు వుంటాయి. వాటిని మనం తాకవచ్చు. మన మీద ఎప్పుడైనా బల్లి పడితే ఆ దోషం పోతుంది.
అన్నమాచార్యులవారు తొలిగడప వెంకటేశ్వర స్వామి గురించి కీర్తనలు రచించారు.
ఇక్కడ దర్శనం అయ్యాకా ప్రపంచ ప్రసిద్ది చెందిన ‘అమీన్ పీర్’ దర్గా చూసి వచ్చాము.
అక్కడ నుంచీ ఒంటిమిట్ట రామాలయానికి బయలుదేరాము. మార్గమధ్యంలో నందలూరులో వున్న సౌమ్యనాధ ఆలయానికి వెళ్లాము.
11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చోళులు, పాండ్యులు, నిర్మించినట్టుగా వుంటుంది. ఆలయంలో శిల్పాలు చాలా బాగున్నాయి.
ఒకసారి నారద మహర్షి కోరికపై విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి ఈ పరిసరాలను చూసి చాలా ప్రశాంతత పొంది ఎంతో సౌమ్యంగా కనిపించారుట.
అప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తిని అదే రూపంలో ఇక్కడ కొలువుండమని అడిగారట. అందుకే స్వామి సౌమ్యనాథుడు అనే పేరున ఇక్కడ వెలిసారుట.
గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా ఎప్పుడూ వెలుతురుగానే వుంటుంది. అలా నిర్మించారు ఆలయాన్ని.
అన్నమాచార్యులు వారి వూరు తాళ్ళపాక ఇక్కడకు చాలా దగ్గర. అందుకే ఆయన ఇక్కడకు వచ్చిస్వామి పై కీర్తనలు రచించే వారుట.
సౌమ్యనాథ ఆలయం చూసేసాక ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లాము. ఈ గుడి 16వ శతాబ్దానికి చెందినది. విజయ నగర నిర్మాణ శైలి కనబడుతుంది.
ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హనుమంతుడు లేని రాముడు, లక్ష్మణుడు, సీత వుంటారు. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇది వక్కటే.
ఇక్కడ ఏకశిల మీద రామ, లక్ష్మణ, సీత, విగ్రహాలను చెక్కారు. అందుకే ఏకశిలా నగరమని గూడా అంటారు.
బమ్మెర పోతన గారు గూడా మహాభాగవతాన్ని ఇక్కడే రచించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారుట.
కడప జిల్లాకే చెందిన అన్నమాచార్యుల వారు ఇక్కడి రామునిపై కీర్తనలు రచించారు.
ఆంధ్రా తెలంగాణా విడిపోయాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమిని అధికార లాంచనాలతో ఇక్కడే జరుపుతున్నారు.
ఆలయం మొత్తం శిల్పకళతో చాలా అద్భుతంగా వుంది. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
1356 వ సంవత్సరంలోని శిలా శాసనాలు ఆలయ ప్రధాన ద్వారం వద్దనే వున్నాయి.
అవి చూడడం మన అదృష్టం.
ముఖ్యంగా ఇవన్నీ కొంచం ఇష్టంగా శ్రద్ధగా గమనిస్తేనే చూడగలం.
ఒంటిమిట్ట నుంచీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి మఠానికి చేరుకున్నాము. ఈయన 1608 లో జన్మించారు.
దగ్గరలోనే వున్న రవ్వల కొండలో కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేసారు. 1693లో సజీవ సమాధి నిష్ఠ వహించారుట.
***
మూడవ రోజు:
మూడవ రోజు కర్నూలు నుంచీ ఆలంపూర్ చేరుకున్నాము.
ఆలంపూర్‌లో అమ్మవారు జోగులాంబ. అష్టాదశ పీఠాలలో ఒకటి.
శివుడు బాల బ్రహ్మేశ్వరులుగా పూజలు అందుకుంటున్నారు.
సతీదేవికి చెందిన పై పళ్ళు పడిన ప్రదేశంగా చెబుతారు.
ఈ గుడి ఏడు, ఎనిమిది, శతాబ్దాలు మధ్య బాదామీ చాళుక్యులచే నిర్మించబడిందని చెబుతారు. తుంగభద్రా నది ఒడ్డున వుంది.
బహమనీ సుల్తానుల దాడిలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం అయిపోయిందిట. మళ్ళీ విజయనగర రాజులు పునర్నిర్మించారుట.
ఇక్కడ గతించిన చరిత్రకి సాక్ష్యాలుగా చాలా శిల్పాలు వున్నాయి.
ఆలంపూర్ లో అమ్మవారి దర్శనం తరువాత మంత్రాలయం చేరుకున్నాము.
మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి పూజలు అందుకుంటున్నారు. తుంగభద్రా నది ఒడ్డున వుంది.
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 16వ శతాబ్దంలో జీవించారు. 1671లో ఆయన సజీవ సమాధి చెందారు. ఆ స్థలాన్ని బృందావనం అంటారు.
దానికి ఎదురుగుండా వెండి తొడుగు తొడిగిన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వుంది.
గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా వుంది
***
నాలుగవ రోజు:
నాలుగవ రోజు మంత్రాలయం నుంచీ హిందుపూర్ చేరుకున్నాము. అక్కడ్నుంచీ లేపాక్షీలో వున్న వీరభధ్రేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము.
ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయ నగర నిర్మాణ శైలిలో నిర్మించారు. అద్భుతమైన శిల్ప కళా చాతుర్యానికి ఇది గొప్ప ఉదాహరణ.
ఈ ఆలయంలో కొలువైన దేవుడు వీరభద్ర స్వామి. అమ్మవారి పేరు విరూపాక్ష.
రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుపోతుంటే జటాయువు ఎదిరించిన ప్రాంతమని చెబుతారు. రాములవారు రెక్కలు తెగి పడిపోయిన జటాయువును ‘లే పక్షీ’ అన్నారని, అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి గా పేరు వచ్చిందని చెబుతారు.
ఇంక ఈ ఆలయంలో అద్భుతమైన మండపాలుచాలా వున్నాయి. గుడి పై కప్పు మీద కలంకారీచిత్రాలు చిత్రించి వుంటాయి.
గుడిలోపల వేలాడే స్తంభం మరో ప్రత్యేకత.
గుడిలోపాల ప్రతీ స్తంభం మీదా ఎంతో అందమైన శిల్పాలు వున్నాయి. వర్ణించడానికి మాటలు సరిపోవు.
గుడి బయటకు వస్తే అది మరో ప్రపంచమే.
దాదాపు 30 అడుగుల ఎత్తున పాము ఏడు సిరస్సులతో చుట్టలు చుట్టుకుని పడగ విప్పి మధ్యలో శివలింగంతో చెక్కబడి వుంటుంది.
దానికి కొంచం పక్కగా పెద్ద రాయి మీద శివలింగాన్ని పూజిస్తున్న వేటగాడు. మరోపక్క పూజ చేస్తున్న ఏనుగు, సాలీడు, ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.
వీటిని చూసుకుని ముందుకు వెడితే 60 కాళ్ళ మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో వున్న ప్రతీ స్తంభం పైన అద్భుతమైన చిత్రాలు చెక్కి వుంటాయి. శివపార్వతుల కళ్యాణం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వినాయకుడు, నందీ, ఇలా చాలా వున్నాయి.
ఈ మండపం అసంపూర్తిగా మిగిలిపోయింది.
కృష్ణదేవరాయల అభిరుచి ఈ కట్టడాలు చూస్తే అర్థమైపోతుంది. విజయనగర రాజుల వైభవానికి లేపాక్షి అద్దం పడుతుంది. శిల్పకళ అంటే ఇష్టముంటే లేపాక్షి చూడవలసిందే.
గుడి బయటకు వచ్చేసాకా కొంచం దగ్గరలోనే ఏకశిల మీద చెక్కిన 15 అడుగుల నంది వుంటుంది. అది చూడవలసినదే. మెడలో గంటలు దగ్గర్నుంచీ అద్భుతంగా చెక్కారు.
ప్రపంచం లోనే అతి పెద్ద రాతి శిల్పాలలో ఇది ఒకటి.
దానికి దగ్గరలోనే చిన్న కొండపై ఒక రాయి మీద పెద్ద జటాయువు బొమ్మ వుంటుంది.
ఇన్ని వందల సంవత్సరాల నుంచీ ఎండలకు ఎండి, వానలకు తడిసి, ఎన్నో దెబ్బలకు ఓర్చుకుని ఇంకా ప్రాణాలతో సజీవంగా వున్నట్టే వున్నాయి ఈ శిల్పాలన్నీ.
***
ఇలా రాయలసీమలో నాలుగు రోజులపాటు పర్యటించి పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని, మిత్రుల కబుర్ల మధ్య ఆహ్లాదంగా గడిపి, దివ్యానుభూతులు ప్రోది చేసుకుని ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరాము.