[box type=’note’ fontsize=’16’] “ముందుగా మనస్సులో ఒక ఆలోచన చేసికొని దానిని స్థాపించుటకు గ్రన్థాన్ని బలాత్కారముగా కొత్త వర్ణకముతో ముంచి వేయడం సమంజసము ఏమాత్రము కాదు” అంటున్నారు డా. వి. ఎ. కుమారస్వామి “అప్రస్తుత వర్ణకాలు”లో. [/box]
[dropcap]‘వ[/dropcap]ర్ణనలు’ అనబోయి ‘వర్ణకాలు’ అన్నట్లు కనబడవచ్చును. కాదు. వర్ణకములు అనగా రంగులు వేయుట అని అర్థము. దీనిని interpretation అను అర్థములో ప్రాచీన సంస్కృత గ్రంథములలో పెద్దలు వాడియున్నారు. Interpretation (coloring) అంటే గాని అర్థంగాని పరిస్థితిలో భారతీయులున్నారు.
సమంజసముగా అనగా నప్పినట్టుగా తోచితే, సరే, ఫరవాలేదు అనుకోవచ్చును. అలాగాకుండా అక్కడ అయిదు ఉన్నది అక్కడ అయుదు సంఖ్య ఉన్నది కాబట్టి ముడి పెట్టడం ముఖ్యము అనుకోను వ్యాఖ్యానకర్తలు ఎక్కువయినారు, అగుచున్నారు.
గాయత్రికి అయిదు ముఖాలు. పంచభూతాలు అయిదుకదా! అయిదింటికి అయిదు తగిలించుచున్నారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయలు – పంచభూతాలకు ఎలాగా సమన్వయం కాగలవు? సరే ఏ ముఖము ఆకాశము? ఏ ముఖము భూమి? ఏ వర్ణములో (ఏ రంగులో) ఉన్నది చెప్పగలమా? ఆకాశము నీలవర్ణము అయితే తక్కనవానికి ఏయే వర్ణాలను తగిలించగలము? ఒక గ్రంథకర్త వేదానికి అంగము లయిన శిక్ష, వ్యాకరణం, ఛన్దస్సు, జ్యోతిషము ముఖాలు అన్నాడు. వేదాంగాలు కల్పముతో బాటు ఆరు అని సర్వప్రసిద్ధ మయితే ఒక దానిని తొలగించి అయిదు ముఖాలకు అయిదు తగిలించడము సమంజసమా? ఆ మధ్య ఒక గ్రంథములో, గాయిత్రి సూర్య శక్తియే గనుక light (ప్రకాశము) heat (వేడిమి) magnet (ఆకర్షణ) Electricity (విద్యుత్తు) sound (శబ్దము) అనునవి ఆమె అయిదు ముఖంబులు అని చదివియున్నాను. కావచ్చును అని మనస్సుకు తృప్తి కలిగినది.
శ్రీమద్రామాయణములో కౌసల్య, సుమిత్ర అను ముగ్గురు రాణులున్నారు. సత్వ రజస్తమోగుణాలు మూడు ఉన్నవి గనుక ముగ్గురకు తగిలించారు. కౌసల్య సత్వగుణము, కైక రజోగుణము, సుమిత్ర తమోగుణము. సుమిత్ర చేసిన అపరాధమేమి? అమె వంతు తమోగుణము ఏల రావలె? అలాగ అయితే కైక తమెగుణము, సుమిత్ర రజోగుణము అని చెప్పుకొందాము. ఇంతకు చెప్పడం వల్ల ఏమి జరిగినది? వికల్పంతో చెప్పుతున్నపుడు చెప్పే వానికే నిర్ధారణ లేనపుడు చెప్పకుండా ఉంటే నష్టమేమిటి? భగవద్గీతలో గుణత్రయ విభాగములో వాటి లక్షణాలు చక్కగా వివరింపబడ్డాయి. దానిలో మూడు ఉన్న చోటల్లా వాటిని తగిలించి వ్యాఖ్యానిస్తున్నారు. సత్వరజస్తమోగుణాలను గుర్తించి చతుర్వర్ణములను నిర్ధారణ చేయడము అసంభవము. అది ఆచరణయోగ్యము కాదు. ముప్పది మందిని కూర్చుండబెట్టి ఈ పది మంది రజోగుణం వాళ్ళు, ఈ పది మంది తమోగుణం వాళ్లు అని చెప్పబోతే వాళ్లు ఎందుకు? అని ప్రశ్నించి కర్రలు తీసుకొన్నను ఏమి చేయలేము. అలాగా అని నవ్వి వదిలినచో వాళ్ళను కూడా సత్వగుణ సంపన్నులు అని లెక్కించినను వచ్చే ప్రయోజనమేమిటి? ఏమియు కనబడుట లేదు. బ్రహ్మదేవుడు రజోగుణ నిష్టుడు. శివుడు తమోగుణ భూయుష్టుడు, భద్రకాళి తమోమయి అని గ్రహించి వాళ్నను నిందించుట తప్పు కాదా? సృష్టి తమోమయమగు ప్రళయము నుండియే ఆవిర్భవించును.
“తడుము కొనుచుండుటే కదా ధరణిమీద
సమము నుండియె విశ్వమ్ము తరలుకతన” అన్నాడొక కవి.
తమసోమాజ్యోతిర్గమయ = అనగా మనము, తమస్సు (అజ్ఞానము) నందే ఉన్నాము. జ్యోతిస్సును= జ్ఞాన ప్రకాశమును కొరుకొనుచున్నాము. మూడు గుణముల మిశ్రమమే జగత్ సృష్టి. మిశ్రణము లేక విలయములో ఉన్నది మూల ప్రకృతి. ఒక్కొక సందర్భంలో ఒక్కొక్కటి స్పుటము కావచ్చు. అంత మాత్రము చేత ఆ వ్యక్తి ఆ గుణము తాలూకవాడని ముద్ర వేయడము న్యాయ సమ్మతం కాదు.
ప్రస్తుతము రామాయణములో విభూషణుడు సత్వప్రధానుడు. శ్రీరామ ప్రభువును ఆశ్రయించాడు. కుంభకర్ణుడు తమోగుణ ప్రధానుడు. ఎక్కువ కాలం నిద్రించుచుండెను. రావణుడు దురహంకారి రజోగుణ విజృంభణము కలవాడు అని చెప్పగా నప్పులటుండును.
ముందుగా మనస్సులో ఒక ఆలోచన (presupposition) చేసికొని దానిని స్థాపించుటకు గ్రన్థాన్ని బలాత్కారముగా కొత్త వర్ణకముతో ముంచి వేయడం సమంజసము ఏమాత్రము కాదు కదా!
ఉదా- హనుమంతుడు గురువు, సీతాదేవి జీవుడు. శ్రీరామ ప్రభువు గూర్చి తెలియజేసిన కారణంగా హనుమంతుడు గురువెట్లు కాగలడు? ఇది ఎంత అసంబద్ధము?
సీతారామ గుణగ్రామపుణ్యారణ్య విహారి అయి, సీతారాములకు శాశ్వత దాసుడయిన హనుమంతుడు సీతమ్మకు గురువగుట సమంజసమా? అశోకవనములో సీతను బాధ పెట్టిన రాక్షస స్త్రీల పని పట్టుటకు హనుమంతుడు అమె అనుమతిని అర్థించాడు (యుద్ధకాండలో). “న కశ్చిత్ నాపరాధ్యతి” తప్పుచేయని వారెవరయ్యా అన్నది ఆ తల్లి. హనుమంతుడు తెల్లబోయి తాను లంకాదహనమును ముందు వెనుకలు చూడక చేసితినే అని గుర్తుకు తెచ్చుకొన్నాడు. అంతట క్షమాగుణరాశి అయిన తల్లికి తెలిసియే ఉన్న శ్రీరాముని వర్ణించెనా, కొత్తగా ఆమెకు తెలియని విశేషమును విన్పించెనా? తాతకు దగ్గలు నేర్పినట్లు సీతమ్మ ముందర శ్రీరాముని గూర్చి హనుమ వినిపించుట గురూపదేశ మెట్లగును? లక్ష్మణుడు జీవుడు. సీతారాముల వెంట నడచుచుండగా శ్రీరాముని దర్శనము లక్ష్మణునకు కావడం లేదు. “అమ్మా కొంచెం తప్పుకో తల్లీ” అని లక్ష్మణుడు సీతను ప్రార్థించుతాడు. కొంచెం సీతమ్మ (మాయ) తప్పుకొనగా లక్ష్మణునకు (జీవునకు) శ్రీరామ దర్శనమయినది. ఇట్లు చెప్పిన శ్రీరామ కృష్ణ పరమహంస బోధామృతమెంత బాగున్నది!