పిల్లలూ! కథ వింటారా?

0
3

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘పిల్లలూ! కథ వింటారా?’ అనే బాలల కథని అందిస్తున్నాము.]

[dropcap]రో[/dropcap]జూ లాగే కథ చెప్పమని అక్క ‘గీత’ చుట్టూ చేరారు పిల్లలు.

“అలాగే చెబుతాను” అంది. కానీ ఏమి చెప్పాలి అని ఆలోచనలో పడింది.

అనగనగా.. అనగానే వద్దు వద్దు. కొత్త కథ కావాలి అంటారు.

పుస్తకాలలో కథలన్నీ చెప్పేసింది.

“చెప్పు అక్కా. చెప్పు అక్కా!” అంటూ మళ్ళీ గొడవ ప్రారంభించారు వాళ్ళంతా.

అప్పుడే నాన్న బజారు నుంచీ తెచ్చిన కూరగాయలు, పండ్లు కనిపించాయి. అమ్మ వాటిని సర్దుతోంది.

“ఈ రోజు మనం కూరగాయలు, పండ్లు ఏం మాట్లాడుకుంటాయో కథగా చెప్పుకుందాం.”

“సరే! సరే!” అన్నారు వాళ్ళంతా.

ఎదురుగా టమోటాలు కనిపించాయి.

“కూరగాయలు కొట్టుకుంటున్నాయి, చింటూ, బింటూ లానే!”

“అక్కా!” అని బుంగమూతి పెట్టాడు చింటు.

“అవునురా! అచ్చం మీలానే!”

“నువ్వు ఆగరా! అక్కా! నువ్వు కథ మొదలుపెట్టు” అంది భవ్య.

“సరే! వినండి.”

~

టమోటా “మేము ఎర్రగా అందంగా, నిగనిగలాడుతూ ఉంటాం. మా అందం ఎవరికీ లేదు. అందుకే నేనే మహారాణిని” అంది.

అంతే! మిగతా వాటికి బుస్సున కోపం వచ్చింది. ఒక్కొక్కటి మాట్లాడటం ప్రారంభించాయి.

ముందుగా పచ్చి మిరపకాయ నిటారుగా లేచి నిలబడింది.

“ఓహోహో పెద్ద చెప్పొచ్చావులే. నేను కూరలో లేకపోతే అసలు కూరకు రుచే రాదు. ఎవరైనా నా దెబ్బకు పరారే!” అంది తడుముకోకుండా.

~

“తడుముకోకుండా అంటే ఏమిటక్కా!” విజ్ఞాన్ అడిగాడు.

“నువ్వు ఆగరా బాబూ! నువ్వు చెప్పు అక్కా!” అన్నాడు అర్జున్.

“ఏమీ లేదురా. ఆలోచించకుండా ఠక్కున సమాధానం చెప్పటం అని అర్థం. అమ్మలకు మీరు చెబుతారే, అలా అన్న మాట.”

అందరూ నవ్వారు ఆ మాటలకు.

~

ఇంతలో సొరకాయ అదే ఆనపకాయ లేచి “నేను పొడవుగా బలంగా ఉంటాను. హల్వా చేస్తే అదిరిపోతారు. నా పులుసుకు అసలు ధీటే ఉండదు” అంది.

దాంతో గుమ్మడికాయకు కోపం వచ్చింది.

“భలే చెప్పావు. ఆ పేరు నాది. గుండ్రంగా, ముద్దుగా ఉంటానని అందరూ నన్ను ముద్దు చేస్తారు. పులుసుకు, హల్వాకు మా తాతల నుంచీ మాకు పేరు” అంది.

దాని బడాయి చూస్తే మిగతా వాళ్ళకి కూడా పౌరుషం వచ్చింది.

~

పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు ఈసారి ఏ కాయ మాట్లాడుతుందో, ఏం చెబుతుందో అని.

~

పొట్లకాయ లేచి “పొడవుగా, పందిరికి మేము వ్రేలాడుతుంటే తోటకే అందం. అంతేనా! నా కూరకు ధీటు మరేదీ ఉండదు” అనటంతో, ఇక ఉల్లిపాయ ఊరుకోలేకపోయింది. బుట్టబొమ్మలా నడుచుకుంటూ ముందుకు వచ్చింది.

“అసలు మేము లేకుండా ఏ వంటైనా చెయ్యగలరా? అన్నిటికీ మేమే! అందాల పోటీ పెడితే నాదే మొదటి స్థానం” అంది. మిగతావన్నీ ఆ మాటలకు పక పకా నవ్వాయి.

“అంతేనా! మాట్లాడకుండానే కోస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు తెప్పించగల ఘన చరిత్ర నాది” అంది.

అప్పటి దాకా మాట్లాడకుండా ఉన్న ఆపిల్ ఉన్న చోటు నుంచీ కదలకుండానే, “మీరంతా ఓ గొప్ప చెప్పేసుకుంటున్నారు. మిమ్మల్నయితే వండాలి. మరి మేమూ.. ఎంచక్కా అలా కొరుక్కుని తినెయ్యటమే” అంది.

“అబ్బా! నీ గొప్పేం గొప్ప. పండిన మామిడి పండుకు పోటీ వచ్చే వాళ్ళు ఎవరున్నారు? దమ్ముంటే రండి. తీయదనానికి మమ్మల్ని మించిన వారు లేరు. బస్తీ మే సవాల్” అంది మామిడి పండు.

కుస్తీ పోటీలకు దిగేవాడిలా ఉంది మామిడి పండు.

కమలా పండుకి ఆ మాటలు తనను చిన్నబుచ్చినట్లుగా అనిపించింది. “ఎవరికైనా జబ్బు చేస్తే ముందు మా రసమే ఇస్తారు. ఆరోగ్యానికి మాదే పెట్టింది పేరు” అందో లేదో

బత్తాయి “పోవే. చిన్నదానివి చిన్నదానిలా ఉండు. ఆ పనికి మేము ఉన్నాం. తరతరాల నుంచీ మా బత్తాయి రసానికి మించినది లేదు ఆరోగ్యానికి” అనేసింది.

ఇక అరటి పండు ఇదంతా చూస్తూ ఊరుకోలేక పోయింది. “పసుపు పచ్చగా ఎంత అందంగా ఉంటాను? ఎవరింట చూసినా నేనే! ఇంతేనా! ఎవరైనా నా తొక్క మీద కాలు వేస్తే జారిపడాల్సిందే. వాళ్ళు ఎంత వస్తాదులైనా నా క్రింద బలాదూరే” తొడ చరిచి చెప్పింది బాలకృష్ణలా.

“ఆగండాగండి. అందరూ భలే చెప్పేసుకుంటున్నారు. బీదవారికి నేను అందే పండును. నన్ను రోజుకొకటి తింటే ఆరోగ్యమే ఆరోగ్యం అని అందరూ చెప్పుకోవటం మీరంతా వినలేదా?” అంది జామపండు.

ఇంతలో ఆపిల్ లేచి “నువ్వు నాకన్నా ఏం గొప్ప కాదు” అని పోట్లాట పెట్టుకుంది.

దాంతో వాళ్ళ మధ్య గొడవ పెద్దదయిపోయింది. మాటలతో యుద్ధం అయిపోయి ఇక నిజంగా కొట్టుకోవటంలా తయారయింది అక్కడ.

“ఆగండర్రా! అలా మనలో మనం పొట్లాడుకోకూడదు. అందరం కలిసి మెలిసి ఉండాలి” అని బంగాళా దుంప రెండు మంచి మాటలు చెప్పబోయింది.

అబ్బే! అక్కడ ఎవరు వినిపించుకుంటారు. ఎవ్వరూ వినలేదు. గొడవ కాస్త కాస్తకి పెరిగిందే కానీ తరగలేదు.

“ఏయ్! ఆపండి మీ గోల. మీరంతా మీ గురించి మీరు చెప్పేసుకున్నారు. మేమేమన్నా పిచ్చోళ్ళమా, మీరు చెప్పింది విని వెళ్ళిపోవటానికి. మా గురించి మేము చెప్పుకోవద్దా” అని గయ్యిమంది ములక్కాడ. దాంతో అక్కడ గొడవ కాస్త సర్దుకుంది.

“అవును. అందరికీ అవకాశమివ్వాలి. అది అందరి హక్కు” అంది అనాస, తీర్పు చెబుతున్నట్లు.

ఒప్పుకుంటున్నట్లుగా అన్నీ తలలు ఊపాయి.

సరే నీ గురించి నువ్వే చెప్పుకో అన్నట్లు చూసాయి అన్నీ అనాస వంక.

మైకు ముందు మాట్లాడే వాళ్ళలా గొంతు సవరించుకుని కాస్త వయ్యారంగా నిలబడటంతో అందరూ కిసుక్కున నవ్వారు.

“అలా నవ్వకండి. నాకు కోపం వస్తుంది. మిమ్మల్ని అందరినీ తిన్నాక అరగాలంటే మా పండ్ల రసం త్రాగాలి. మీకు తెలుసా? దానిని బట్టి అర్థం చేసుకోండి నా గొప్పతనం ఏమిటో?” అంది.

అప్పుడు దానిమ్మ పండు “ఇప్పుడు నా వంతు. చక్కగా పేర్చినట్లు గులాబీ రంగులో ఉంటాం. అమ్మాయిల పలువరుసతో పోలుస్తారు మమ్మల్ని. ఇరాన్‌లో పుట్టానని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్యానికి, ఔషధాలు తయారు చేయటానికి కూడా నన్ను ఉపయోగిస్తారు. తెలుసుకోండి” అంది.

“హే! ఆపండి! అసలు నన్ను సైజులో గానీ, రుచిలో గానీ నా కంటే గొప్ప వాళ్ళెవరన్నా ఉన్నారా? నా పేరే పనసపండు. నా తొనలకు మించిన తియ్యదనం ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదు” అంది పనస పండు.

~

“భలే! భలే! బాగుందక్కా కథ చెప్పు! చెప్పు!” అంది వాణి.

~

ఈసారి మొక్కజొన్న వచ్చింది.

“ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోకూడదు. కానీ అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి చెబుతున్నా. వర్షం వస్తున్నప్పుడు వేడి వేడిగా నన్ను కాల్చుకుని తింటూ మనుషులు పడే ఆనందాన్ని గురించి నేను చెప్పేది ఏముంది, మీరే చూస్తుంటారుగా.” అంది.

కాసేపు ఆగి “నా వంటి మీద ఎవరికీ లేనన్ని పొరలు దుస్తులులా ఉంటాయి. అందంలో నాకు నేనే సాటి” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే

“చాలు! చాలు! ఇంకా చాలా మంది ఉన్నాం. ఆపెయ్యాలి! ఆపెయ్యాలి!” అన్నారు మిగిలిన వాళ్ళు.

“సరే! సరే! వెళ్ళిపోతున్నాను. అరవకండి” అని భయపడిపోయి వెళ్ళి కూర్చుంది మొక్కజొన్న.

~

అక్కడ ఉన్నవీ లేనివీ గుర్తు తెచ్చుకుని చెబుతున్న గీత ఒక్క నిముషం కథ చెప్పటం ఆపింది.

“ఏమయిందక్కా?” అన్నారు. పిల్లలంతా ఆత్రంగా.

“ఈ రోజు కిక చాలు. మీరంతా చదువుకోవాలిగా. ఇళ్ళకు వెళ్ళండి. లేకపోతే అమ్మలు కోప్పడతారు.” అంది.

‘అలాగే’ అంటూ తలలూపారు అందరూ. సరదాగా మాట్లాడుకుంటూ ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు.

‘పుస్తకాంటే నాకు ఎంతో ఇష్టం. అందులో మంచి మంచివి ఇలా పిల్లలకు చెప్పటం మరీ ఇష్టం. వాళ్ళతో కాలం గడపటం, నాకు తెలిసినవి చెప్పటం ఆనందాన్నిస్తాయి’ అనుకుంది గీత సంతృప్తిగా.

***

మరునాడు అదే సమయానికి అక్కడ అందరూ చేరిపోయారు.

“ఈ రోజు అక్క ఎవరి గురించి చెబుతుందో? భలే ఆత్రుతగా ఉంది” అంది లలిత.

“అవును. నాక్కూడా!” అంది లహరి.

“హుష్! అల్లరి చెయ్యకండి. అక్కకు కోపం వస్తే కథ చెప్పనంటుంది” అన్నాడు చింటూ.

“అవునవును. అదీ నిజమే!” అన్నాడు బింటూ.

అవునన్నట్లు అందరూ బుద్దిగా తలలు ఊపి నిశ్శబ్దంగా కూర్చున్నారు.

అప్పుడే అక్కడకు వచ్చిన గీత “అందరూ వచ్చేసారా? బడికి సమయానికి వెళతారో లేదో కానీ ఇక్కడకు మాత్రం ఠంచన్‌గా వచ్చేస్తార్రా మీరు” అంది నవ్వుతూ.

“లేదక్కా! బడికి కూడా పది నిముషాలు ముందే వెళతాం కానీ ఆలస్యంగా మాత్రం వెళ్ళం” అంది శ్రద్ధ.

“మంచిది. పిల్లలంతా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అలానే ఆలస్యంగా వెళితే మాష్టారితో అక్షింతలు పడతాయి. అలాగే పాఠాలూ పోతాయి. అవునా?” అంది అందరినీ చూస్తూ.

“అక్షింతలు అంటే, పండగలప్పుడు కొత్త బట్టలు కట్టుకుని నమస్కరిస్తే అమ్మా నాన్న వేస్తారు. అవేనాక్కా!” అడిగాడు చింటూ.

“ఆ మాత్రం అర్థం కాలా? అక్షింతలు అంటే తిట్లు” అన్నాడు బింటూ పక పకా నవ్వుతూ.

గీత బింటూ వైపు కోపంగా చూసింది.

“స్నేహితులు ఒకరిని ఒకరు అలా వేలెత్తి చూపుకోకూడదు. అన్నీ అందరికీ తెలియవు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పాలి. అంతే కానీ నవ్వకూడదు” అంది సీరియస్ గానే.

“అలాగే అక్కా! ఇంకెప్పుడూ అలా నవ్వను” అన్నాడు బింటూ. చింటూకి క్షమాపణలు కూడా చెప్పాడు.

“ఇంతకీ నిన్న కథ ఎక్కడ ఆపాం?” అంది గీత.

“అదే అక్కా! మొక్కజొన్న దగ్గర ఆపావు” అంది భవ్య.

“మంచిది. భలేగా గుర్తు పెట్టుకున్నావు. ఏ విషయాన్నయినా ఒక్కసారి మనం విన్నామంటే దానిని మరిచిపోకూడదు. ఇక కథ లోకి వద్దాం. ఈరోజు తోటకూర మొదట ప్రారంభించింది.”

~

“నాలో విటమిన్ ‘ఎ’ ఎక్కువుగా ఉంటుంది. అది కళ్ళకు మంచిది. ఆకు కూరలలో నాకే ప్రాధాన్యత ఎక్కువ” అంది తోటకూర.

అంతే! ప్రక్కనే ఉన్న గోంగూరకి పౌరుషం వచ్చేసింది.

“అసలు నాకున్న పేరు నీకుందా? గోంగూర అన్నా, గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అంటే నోరూరని వారు ఎవరన్నా ఉన్నారా?” అంది ఆవేశంగా ఊగిపోతూ.

“ఒప్పుకున్నాం. శాంతించు. శాంతించు” అని మిగతావన్నీ దాన్ని కూర్చోపెట్టాయి.

~

పిల్లలు పక పకా నవ్వారు.

వాళ్ళకి ఈ కధ కొత్తగా సరదాగా ఉందని అనుకుంది గీత.

“ఊఁ. తర్వాత ఏమయ్యింది అక్కా?” అడిగింది నవ్వ,

“చెబుతున్నా! కంగారు పడకండర్రా!” అంటూ చెప్పసాగింది.

~

బెండకాయ, ములక్కాడ నేను ముందు అంటే నేను ముందు వెళ్తానని దెబ్బలాడుకుంటున్నాయి.

అప్పుడు, “దెబ్బలాడుకోకండర్రా! ఒకరి తర్వాత ఒకరు. ముందు చెప్పినా వెనుక చెప్పినా ఒకటే. తోసుకుంటే దెబ్బలు తగులుతాయి. అప్పుడు మీరే బాధపడతారు” అంది సొరకాయ.

దాంతో ములక్కాడ “పోనీలే! నువ్వే చెప్పు” అని బెండకాయకి చెప్పి వెళ్ళి కూర్చుంది. నిన్న కూడా మాట్లాడనివ్వలేదు అనుకుంది మనసులో.

అప్పుడు బెండకాయ “మరేమో మేము ఆడవాళ్ళ చేతివేళ్ళలా ఉంటామని ‘లేడీస్ ఫింగర్స్’ అని బిరుదు ఇచ్చారు. మా వేపుడు అంటే అందరికీ ఎంతో ఇష్టం” అంది.

బంగాళాదుంప నవ్వుకుంది. అది లేచి “నీ వేపుడు బాగుంటుందని చెప్పు. వేపుడు అంటే నేనే. నాలో పోషకాలు కూడా ఎక్కువే” అంది.

ఇక ములక్కాడ ఆగలేనన్నట్లు లేచి “ఏ కూరలో నన్నా, పులుసులోనన్నా వేస్తే వచ్చే సువాసన, రుచి మాకు ఎక్కువని అందరూ అంటారు. వినలేదా? ఔషధాలకు మేము పెట్టింది పేరు. ముఖ్యంగా మగవాళ్ళకు” అంటూ ముగించింది.

ఈసారి నిమ్మకాయ వచ్చింది. “నేనంటేనే ‘సి’ విటమిన్, పుల్లపుల్లగా పుళిహోరల్లో, పప్పుల్లో, పచ్చళ్ళలో అన్నింట్లో నేనుంటా. పసుపు పచ్చగా కళ లాడుతూ” అంది. సినిమా పేరుకు చిన్న టాగ్ పెట్టుకున్నట్లు.

తన రంగు చూసి మురిసిపోయే క్యారెట్ ఇంతలో వచ్చి “కళ్ళకు, మేము ఎంతో బలం, రోజు కొకటి తింటే చాలు” అంది.

బుట్ట పచ్చిమిరపకాయ బుట్టబొమ్మలా వచ్చి “బజ్జీలు.. వేడి వేడి బజ్జీలు.. మా పేరు చెప్పగానే ఎవరికైనా అనే గుర్తు వస్తాయి. మాది అమెరికా” అని చెప్పింది.

దొండకాయ కొత్తిమీరతో “నువ్వు వెళ్ళు” అని చెప్పింది.

“సువాసనకే సువాసన మేము. అన్ని కూరల్లో నేనే. పచ్చడి చేసుకుంటే మజా రావల్సిందే. ఐరన్, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఎక్కువే” అంది కొత్తిమీర.

దొండకాయకు కాస్త సిగ్గు. అందుకే వెనక వెనక ఉంటోంది.

“నేను చెప్పాగా. భయం ఎందుకు? వెళ్లు. భయపడేవాళ్ళు ఏమో సాధించలేరు” అని చెప్పింది కొత్తిమీర స్నేహంగా.

అప్పుడు నెమ్మదిగా వచ్చి “వేపుళ్ళు, పచ్చళ్ళు, కూరలు, ఆవతో ఊరగాయ, ఇవన్నీ కాకుండా కాన్సర్ కణాలు పెరగటాన్ని ఆపుతూ మనసును ప్రశాంతంగా ఉంచుతాను” అంది వినయంగా దొండకాయ. “ఆ, నిరాశను కూడా పోగొడతాను” అని చెప్పి వెళ్ళి కూర్చుంది.

నిగనిగలాడుతున్న వంకాయ ముందుకు వచ్చింది ఇప్పుడు.

‘గుర్తొంకాయ కూరోయ్ మామా’ అని పాట అందుకుంది. “కూరల్లో మా కూరకి మంచి పేరు. పెళ్ళిళ్ళలో మా కూరే ముందు ఉంటుంది. కీళ్ళు దెబ్బతినటాన్ని మేము తగ్గిస్తాం” అని చెప్పి కూర్చుంది.

కాలీఫ్లవర్ వస్తూనే, “ఎవరైనా ఎదుటి వాళ్ళను ఏడిపిస్తుంటే మా చెవుల్లో ఏమన్నా కాలీఫ్లవర్లు కనిపిస్తున్నాయా అని అంటుంటారు తమాషాగా. మమ్మల్ని ఎంత ఎక్కువ తింటే అంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది” అంది.

అప్పుడు ఉప్పు ముందుకు వచ్చి “మనం ఎలాంటి వాళ్ళమైనా అందరం కలిసి మెలిసి ఉండాలి. నేను అన్నిటిలో ఇట్టే కలిసిపోతాను. నేనుంటేనే రుచి అంటారు. కాబట్టి పెద్ద, చిన్న, గొప్ప, తక్కువ భావాలు వదిలేద్దాం” అని మీటింగ్‌ను ముగించేసింది.

~

“మన కథ కూడా అయిపోయింది” చెప్పింది గీత.

“అక్కా! వాటికి మాటలు వస్తాయా?” అంది భవ్య.

“ఆఁ! అన్నీ మాట్లాడుకుంటాయి. కానీ మనకు వినిపించవు. అంతే!”

“ఈ కథ వల్ల మాకు బోలెడు విషయాలు తెలిసాయి అక్కా” అన్నాడు విజ్ఞాన్.

“అక్కా, గరిటెలు, స్పూన్లు కూడా మాట్లాడుకుంటాయా?” అడిగాడు అర్జున్.

“అవునురా! ‘నేను పెద్దోడిని, నువ్వు చిన్న పిల్లాడివి. నా మాటలు నువ్వే వినాలి’ అని మీరెలా కొట్టుకుంటారో అలా అన్నమాట.”

“పాపం స్పూనుల మాట ఎవరూ వినరేమో?” అంది లహరి.

“అదేంటి అలా అనేసావు?” అంది గీత.

“అంతే కదక్కా! మీరు పిల్లలు. మీకేం తెలియదు అని మమ్మల్ని ఇళ్ళల్లో ఎవరూ మాట్లాడనివ్వరు. మా మాటలూ పట్టించుకోరు. అలాగే స్పూన్లూ అనుకున్నా.”

“అలా ఎప్పుడూ అనుకోవద్దు లహరీ. ఒక్కోసారి మాకనిపిస్తుంది, మా కంటే మీరే తెలివైన వారని.”

“నిజమా అక్కా!”

“అవును లహరీ” అంది గీత లహరిని ముద్దు పెట్టుకుంటూ.

“మరి మొక్కల సంగతీ..” అంది లలిత.

“అంటే..?”

“అదే.. మొక్కలు కూడా మాట్లాడుకుంటాయా అని.”

“ఆఁ! చక్కగా కబుర్లు చెప్పుకుంటాయి. మొగ్గలను మనం కోసి పారేస్తే ఏడుస్తాయి. బాధ పడతాయి. కాకపోతే మనలా బయటకు కనిపించవు.”

“అవును. అమ్మ కూడా చెబుతుంది. మొగ్గలు తుంపకండి. చెట్టు తల్లులు తమ పిల్లల కోసం ఏడుస్తాయి అని” అంది శ్రద్ధ.

“అవునర్రా! మరునాడు పూసాక కోసుకుంటే చెట్టు ఎంతో సంతోషిస్తుంది. అంతే కానీ ముందు కోసేస్తే బాధపడదూ!” అంది గీత.

అవునక్కా అన్నట్లు అందరూ తలలూపారు.

“చెట్టును నిలువెత్తు మానవత్వమంటారు. ఎందుకో తెలుసా?” అందరినీ చూస్తూ అడిగింది గీత.

“తెలియదక్కా!” అంటూ తలలు అడ్డంగా ఊపారు.

“వేరు దగ్గర నుంచీ పండు దాకా మనకు సహాయపడుతుందని. ఎండిపోయినా మనం చనిపోయినప్పుడు మనల్ని కాల్చటానికి ఉపయోగపడుతుంది. మీరు రాసుకునే కాగితం కూడా మనకు చెట్ల నుంచీ వచ్చినదే.”

“అవునా?” అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టారు అందరూ.

“నిజమేనర్రా” అంది గీత.

“భలే! భలే!” అన్నారు అందరూ.

“మరి చెట్లకు మనం చప్పట్లు కొడదామా?”

“అలాగే” అంటూ వాళ్ళు చప్పట్టు కొట్టారు.

అక్కడే ఉన్న చెట్లన్నీ సంతోషంగా తలలు ఊపాయి.

పిల్లలంతా చెట్లు మనకు హాయ్ చెబుతున్నాయని గంతులేసారు.

వారి ఆనందంలో తన సంతోషాన్ని చూసుకుంటోంది గీత.

సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here