[box type=’note’ fontsize=’16’] “సాహిత్య శోధకులకు అందని అంశాలు, కేవలం కైఫియత్తుల మూలంగానే వెలువడిన, వెలువడుతున్న అంశాలు చాలా ఉంటున్నాయన్న సత్యం ప్రపంచానికి తెలిస్తే కైఫియత్తులకు విలువ పెరుగుతుంది” అంటున్నారు కట్టా నరసింహులు “కైఫియత్తులు అందిస్తున్న చాటువుల్లో కొన్ని” అనే వ్యాసంలో. [/box]
[dropcap]క[/dropcap]ల్నల్ కాలిన్ మెకంజీ సేకరించి పెట్టిన కైఫియత్తులు ఆయా గ్రామాల చరిత్రల్ని అందిస్తున్నాయి. చరిత్ర నిర్మాణానికి, పునర్నిర్మాణానికి కైఫియత్తులు ఉపయుక్త ఆధారాలుగా ఉన్నాయి. గ్రామచరిత్రలతో పాటు అక్కడి జీవన విధానాన్ని సంస్కృతిని అందిస్తూ సిసలైన ప్రజల చరిత్ర రచనకు దోహదం చేస్తున్నాయి.
ఒక గ్రామం ఎప్పుడు పుట్టింది, ఆ పేరెలా ఏర్పడింది, ఆ గ్రామం ఎక్కడ నెలకొంది, అది అగ్రహారమా, సాధారణ గ్రామమా, ఆ గ్రామంలో ఏఏ వృత్తులవారున్నారు, అక్కడ పండే పంటలేవి, ఆ గ్రామంలో ఉండే ఆలయాలు, శాసనాలు వాటి స్వరూపస్వభావాలు ఎలా ఉన్నాయి. బావులు చెరుపులు వంకలు వాగులు వనాలు సమీపంలోని కొండలు కోనలు అక్కడ లభించే కలప ఆ అడవుల్లో సంచరించే మృగాలు – ఇలా ఎన్నో విశేషాలు రెండు వందల సంవత్సరాల నాడు మెకంజీ సహాయకులు దేశమంతటా తిరిగి శ్రమకోర్చి సేకరించిన సమాచారం ఆ కైఫియత్తుల్లో ఉంది.
పై విషయాలే కాకుండా అక్కడక్కడా సాహిత్యాంశాలు చోటు చేసుకొని ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్న చాటుపద్యాలు ఈ కైఫియత్తుల్లో కనిపిస్తున్నాయి. చరిత్రకెక్కని సాహిత్యాలు కైఫియత్తుల్లో కనిపించి హురే అనిపిస్తున్నాయి. కైఫియత్తుల్ని సమగ్రంగా శోధించి సాహిత్యాంశాల నన్నింటిని ఒకచోటికి చేర్చే ప్రయత్నం చేయవచ్చు. డాII తిమ్మావజ్ఞల కోదండరామయ్య వంటివారు చేశారు. పండిన రేగుచెట్టు నుంచి కొన్ని బదరీఫలాల్ని సంగ్రహించినట్లు ఈ వ్యాసం సిద్ధం చేస్తున్నాను. సరసులు ఆస్వాదింతురుగాక!
1. ఖడ్గతిక్కన కానుక
ఆవులపుల్లరి కారణంగా కాటమరాజుకు నెల్లూరును పాలించిన నల్లసిద్దికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాటమరాజు మీదికి సైన్యాధిపతి ఖడ్గతిక్కన వెళ్లాడు. మలినాటి యుద్ధంలో ఖడ్గతిక్కన వీరమరణం చెందాడు. అయితే ఈ యుద్ధంకంటే ముందు ఓ సంఘటన చోటుచేసుకుంది.
ఓ భట్టుకవి రణతిక్కన సముఖానికి వచ్చి ఆశువుగా ఓ సీసపద్యం అందుకొన్నాడు.
సీ|| ధైర్యంబు నీ మేన దగిలియుండుట జేసి
చలియించి మందరాచలము తిరిగే
గాంభీర్యమెల్ల నీ కడన యుండుట జేసి
కాకుత్‌స్ఠుచే వార్ధి కట్టువడియె
జయలక్ష్మి నీ యురస్‌స్థలినే యుండుట జేసి
హరి వోయి బలి దానమడుగుకొనియె
ఆకారమెల్ల నీయందే యుండుట జేసి
మరుడు చిచ్చున బడి మడిసి చనియె.
అంతవరకు పద్యం చెప్పాడు. ఆ తరువాత ఎత్తుగీతి ప్రారంభించాలి. ఎత్తుగీతిలో ఇంతవరకు సాగిన పద్యంలోని విషయానికి విపర్యయం వస్తేగాని పద్యం రక్తి కట్టదు. ఆవలి పద్యం ఎలా ముగించాలో ఆలోచించుకుంటూ ఉండగా ఖడ్గతిక్కన కవిని ఆగమన్నాడు. ఖడ్గతిక్కన కేవలం రణవిద్యలోనే కాదు కవి తిక్కన అంతటివాడు కాకపోయినా కవితామర్మం, భాషావైదుష్యం తెలియనివాడు కాదు. తల్లీ అర్ధాంగి ఆ సమీపంలోనే ఉండి భట్టు పొగడ్తను పద్యరూపంలో వింటూ ఆనందిస్తున్నారు. రణతిక్కన ఆ ఇరువురినీ దగ్గరకు పిలిచాడు. కవికి ఎనిమిదివేల వరహాలు బహుమానంగా అందించాడు. “ఈ కవిగారు పద్యం చెప్పిన భాగానికి ఎనిమిదివేలు కానుకగా ఇస్తున్నాను. మరోనాడు వచ్చి తక్కిన ఎత్తుగీతి వినిపిస్తే మరో నాలుగువేలు సమర్పించ వలసి ఉంటుంది” అన్నాడు. అమ్మ, అర్ధాంగి తల ఊపారు. కాని ఖడ్గతిక్కన భవిష్యం వారికి అవగతమయిందో లేదో! వారిద్దరు కూడా అంతో ఇంతో పద్యం అల్లగలవారే!
కాటమరాజుతో పోరాటంలో తొలినాడు ఖడ్గతిక్కన వెనుదిరిగివచ్చాడు. కాటమరాజుమీద గెలుపు సాధించకపోతినే అనే బాధ ఆయనకూ ఉంటుంది. ఈ వార్త ముందుగనే ఇంటికి చేరింది. గెలుపుతో తిరిగి రాలేదే అని అత్తాకోడండ్రిద్దరు ఆవేశానికి లోనయ్యారు. స్నానానికి నీళ్లు తోడినచోట అడ్డంగా తడిక, పసుపుముద్ద ఉంచింది ఇల్లాలు. ఇదేమిటని అడిగాడు భర్త. ఆమె సమాధాన మిచ్చింది.
కం. పగరకు వెన్నిచ్చినచో
నగరే మిము మగతనంపునాయకు లెందున్
ముగురాడువార మైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్.
ఖడ్గతిక్కన కంగుతిన్నాడు.
అన్నానికి కూర్చున్నాడు. అమ్మ వడ్డిస్తూ ఉంది. అక్కడ విరిగిన పాలు కనిపిస్తున్నాయి. అమ్మవైపు చూశాడు. అమ్మ
కం. అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువలేక పందక్రియన్ నీ
వసి వైచి విరిగి వచ్చిన
పసులున్ విరిగినవి తిక్క! పాలున్ విరిగెన్.
అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. ఆపైన అన్నం సహించలేదు. ఉత్తరాపోశనం పట్టి లేచి వెళ్లాడు.
మరునాటి యుద్ధంలో ఖడ్గతిక్కన తన రాజుకు గెలుపు సాధించిపెట్టాడు. తాను శత్రువుల చేత హతమైనాడు. భార్య పతిశిరస్సును ఒడిలో ఉంచుకొని సాగుమానం చేసింది.
ఖడ్గతిక్కన పరలోకగతుడైన పట్టపురావి అనేచోటును ఇప్పటికీ ‘తిక్కనపాడు’ అని పిలుచుకుంటారట. ఇక్కడ ఒకరాతిమీద గుర్రపుస్వారీ ఉంది. తిక్కనమంత్రి ప్రతిమ అంటారు. మరికొన్నాళ్లకు పద్యం మిగిల్చి వెళ్లిన భట్టుతిక్కన ఇంటికి వచ్చాడు. కొండంత దిగులుతో ఉన్న తిక్కన తల్లి భట్టు యోగక్షేమాలడిగింది. తరువాతి పద్యభాగం వినాలనుకుంది. గుండె గొంతులో కొట్టుకొంటూ ఉండగా భట్టు దగ్గుత్తికతో ఎత్తుగీతి చెప్పాడు.
ఆ.వె. తిక్కదండనాథ! దేవేంద్రపురికి నీ
వరుగు టెరిగి నగము తిరుగు టుడిగె
అబ్ధి కట్టు విడిచె అచ్యుతు కొరమానె
మరుడు మరల కలిగే మగలరాజ!
తక్కిన నాలుగువేల వరహాలు తల్లి భట్టుకు కానుక చేసింది.
కైఫియత్తుల్లో కాటమరాజు, ఖడ్గతిక్కనల ప్రసక్తి వచ్చిన చోట ఈ సీసపద్యం కనిపిస్తుంది.
ఆధారం:
- మెకంజీ కైఫియత్తులు, కడప జిల్లా, మూడోభాగం 71,72 పుటలు.
2. తుడుములదిన్నె నాచనసోముడు
నాచన సోమన విజయనగర చక్రవర్తి బుక్కరాయల కొలువులో ఆస్థాన కవి. కడప జిల్లా రైల్వేకొండాపురం సమీపంలోని బుక్కపట్ణం నాచన సోమునికీ మరికొంతమందికీ బుక్కరాయలు అగ్రహారంగా సమర్పించాడు. ఆస్థానకవిగా ఉన్న కాలంలో సోమన ఉత్తరహరివంశం రచించాడు. ప్రౌఢదేవరాయలు చక్రవర్తి కాక మునుపు ఉదయగిరి పాలకుడుగా ఉండేవాడు. నాచనసోముని కోరికపై ప్రౌఢదేవరాయలు తన పరిపాలనా పరిధిలోని పుష్పగిరి సమీపంలో ఒక ప్రాంతాన్ని అగ్రహారంగా సమర్పించాడు. అది తురిమిళ్లదిన్నె గ్రామంలో చెన్నకేశవాలయం నిర్మించుకొన్నాడు. తరిమిళ్లదిన్నె తరువాత కాలంలో తుడుములదిన్నెగా మారింది. చెన్నకేశవాలయం లోని శాసనాలు తురిమిళ్లదిన్నె నాచనసోముని అగ్రహారంగా పేర్కొన్నవి.
నాచనసోముడు ప్రకాశం జిల్లాలోని తురిమిళ్ల నుంచి హంపి విజయనగరానికి ఆస్థానకవిగా వచ్చినట్లు ఈ అగ్రహారం ఆనవాలు పట్టిస్తున్నది. ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఆర్వీయస్. సుందరం గారి సంపాదకత్వంలో వెలువడుతున్న సంశోధన, త్రైమాసిక తెలుగు పరిశోధన పత్రిక ఏప్రిల్ 2018 సంచికలోని నాచనసోముని సొంత ఊళ్ల ఆనవాళ్లు పుటలు 19-25 చూడవచ్చు.
తుడుములదిన్నె అగ్రహారాన్ని సోముని వంశీయులు మహమ్మదీయుల కాలం దాకా అనుభవించినట్లు కైఫియత్తు తెలుపుతున్నది.
ఆధారం:
- ఎ.పి. స్టేట్ ఆర్మెన్స్ ఆర్.నెం.1240 కైఫియత్ తుడుములదిన్నె, పుటలు 173-80.
- పి.వి.పరబ్రహ్మశాస్త్రిగారి కడపజిల్లా శాసనాలు, వాల్యూం -11, పుటలు 32, 129.
3. పెద్దన చౌడూరు నివాసి
ఆంధ్ర కవితాపితామహుడు, శ్రీకృష్ణదేవరాయలవారి చేత గండపెండేరం తొడిగించుకున్నవాడు, మహాప్రబంధం మనకందించినవాడు అయిన అల్లసాని పెద్దనామాత్యుని నివాసం కడపజిల్లాలోని కమలాపురం సమీపంలోని కోకటం అన్నారు. ఆ సమీపంలోని పెద్దనపాడు అన్నారు. కోకటాన్ని అగ్రహారంగా పుచ్చుకొన్నంత మాత్రాన ఆ ఊరు పెద్దనకు సొంత ఊరు కావచ్చు కాకపోవచ్చు. అలాగే పెద్దనపాడు అనుకున్నా అదీ అయ్యే అవకాశం లేదు. పాడు అని చివర ఉంటే ఆ గ్రామం ఒకప్పుడు ఉండి శిథిలమై తిరిగి నిర్మాణమై ఉంటుంది. ఆ గ్రామానికి పెద్దన పేరు ఉంది. పునర్నిర్మాణమైనప్పుడు ఆయన పేరు మీద అయి ఉండవచ్చు గాని ఆయన స్వగ్రామం అది అయి ఉండదు. కైఫియత్తులు చూస్తున్నప్పుడు సమీపంలోని చౌడూరు గురించి చదివాను. అందులో అల్లసాని ఇంటి పేరున్నవారున్నారు. అక్కడున్న ఎనిమిది పేర్ల వరుసలో పెద్దన కూడా ఉన్నారు. ఆ శాసనం కామరుసు పెద్దతిమ్మరుసయ్య గారికి చౌడూరు అగ్రహారం వృత్తిని ఆయనకు ధారపోస్తున్నది. ఆ పెద్దతిమ్మరుసయ్య అరకటవేముల నివాసి. ఆయన చాలా పలుకుబడి గలవారు. విజయనగర చక్రవర్తి కృష్ణరాయలతో బాగా పరిచయం పలుకుబడి ఉన్నవాడు. ఈ అగ్రహారప్రదాన సంవత్సరం క్రీ.శ. 1508. పెద్దన తాను ఆస్థానకవి కాక మునుపటి కాలంలోనే ఈ ప్రదానం జరిగింది. ఊరిపేరు చౌడూరు. చౌడేశ్వరి పేరు మీద ఆ ఊరు వెలసింది. ఇక ఆ ఊళో నందవరీకులు ఉన్నట్లే. పెద్దన నందవరీకుడాయె. కాబట్టి అల్లసాని పెద్దన చౌడూరివాడేనని నిర్ణయించే అవకాశం ఏర్పడింది. చౌడూరు, అరకటవేముల, కోకటం, పెద్దనపాడు – ఈ గ్రామాలన్నీ కేవలం పది పదునైదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నవే. అంతే కాకుండా రాయలవారి ఇంటి పేరైన సంబైట పేరుమీద వెలసిన సంబెటూరు (సంబటూరు) కోకట గ్రామానికి సమీపంలోనే ఉంది. ఇన్ని ఆధారాలు అల్లసాని పెద్దన సొంత ఊరు చౌడూరు అని చెప్పడానికి అవకాశం ఇచ్చాయి. అల్లసాని పెద్దన చెప్పిన ‘అంకముజేరి’ పద్యానికి సంస్కృతరూప శ్లోకం ‘పాయాద్వా…’ అన్నది ఈ ప్రాంతంలోని నాగేశ్వర దేవాలయంలో లిఖితమై ఉన్నది. స్థానిక మండలాధిపతి జూపల్లివారు వేయించిన శాసనంలో ఈ శ్లోకం చోటు చేసుకుంది.
శా. పాయద్వా గణనాయకః పశుపతే రంకేచిరం సంస్థితో
వామార్ధాంగ విరాజితాం గిరిసుతాం జ్ఞాత్వానిజాం మాతరం
తుండాగ్రం ప్రవిసార్య సస్మితముఖః పీత్వా స్తనం చాపరం
పాతుం ప్రీతమనాస్తనం మృగయతే విఘ్నాంతక స్సర్వదా
(చెన్నూరు సమీపం నాగేశ్వర దేవాలయం స్తంభం మీది శాసనం క్రీ.శ.1525)
ఆధారం:
- యం.ఓ.ఎల్.344 పుటలు 521-524 ఆధారం.
- నా కైఫియత్ కతలు పుటలు 140-145 చూడండి.
4. ఊటుకూరు పోటు
మట్ల ఎల్లమరాజు పుత్రులు అళియరామరాయల తమ్ముడు తిరుమల రాయల అనుగ్రహంతో రాజంపేట ప్రాంతాలలో మూడూళ్లను (పొన్నాపల్లె, పొందలూరు, పెనగలూరు) గ్రాసగ్రామాలుగా పొంది జీవనం చేస్తున్నారు. అప్పటికే రాయసామ్రాజ్యం పతనం దిశగా ఉంది. వెంకటపతిరాయలు చంద్రగిరిని పాలిస్తూ రాయసామ్రాజ్యానికి అండగా ఉన్నారు. కాని రాయసామ్రాజ్యాధిపత్యానికి సిద్దవటం పాలిస్తున్న కొండ్రాజు తిరుపతిరాజు తిరగబడ్డాడు. ఎల్లమరాజు కిచ్చిన ఊళ్లను నగరులోనికి కలుపుకున్నాడు. వెంకటపతిరాయలు తిరుపతిరాజు మీద కినుక వహించాడు. వెంకటపతి రాయలు పంపిన సైన్యంతో మట్ల ఎల్లమరాజు ఆయన పుత్రులు తిరుపతి రాజుమీద రాజంపేటకు సమీపంలోని ఊటుకూరు దగ్గర యుద్ధం చేశారు. పోరు ఘోరంగా సాగింది. బ్రతుకుతెరువును తెగగొట్టిన కసితో ఎల్లమరాజు, ఆయన పుత్రులు తిరుపతి రాజును దారుణంగా సంహరించారు. సైన్యాన్ని చెల్లాచెదరు చేశారు. కసి, విజయోత్సాహం పెనవేసికోగా తిరుపతిరాజు శవాన్ని ముక్కలుచేసి భూతప్రేతపిశాచాలకు బలిపెట్టారు. ఎల్లమరాజు విజయాన్ని అప్పటి భట్రాజుకవి ఈ విధంగా పొగిడాడు.
సీ. చక్కుగా నరకవా చొక్కనాథుడెరుంగ
మీరి వైరుల నెందలూరి కడను
కొట్టవా దాపెనగొర్లుగా పోలిలో
రణభూమి పోతుకొండ్రాయని గని
చెండవా పొత్తపినుండి పారగర
దండివీరుల నీరుకొండ లెక్క
కొండూరి మలలమ్మకును ప్రీతిగా దోలి
కొట్టించవా తలల్ గుట్టలుగను
తే.గీ. అహహ గుర్రాలు గొడుగులు అందలాలు
విడిచి పారగ పారగ వెంటనంటి
సమరనిశ్శంక! మట్ల విట్‌శాసనాంక
భాగ్యములకెల్ల కోనభూపాలు ఎల్ల!
నందలూరులో ఉన్న దైవం చొక్కనాథుడు. ఊటుకూరు సమీపంలో పోలిగ్రామం ఉంది. అక్కడనే పోతు కొండ్రాయడు – దైవం ఉన్నాడు.
పొత్తపి చోళులకంటే ముందు కాలం నుంచి ఈ ప్రాంతంలో పొత్తపి రాజధానిగా ఉండేది. నీరుకొండలు ఈ ప్రాంతంలోని కొండలు.
ఊటుకూరు సమీపంలో కొండూరు గ్రామం. ఆ గ్రామంలో మలలమ్మ – దేవత ఉంది.
ఎల్లమరాజు ధైర్యసాహసాలకు మెచ్చుకొన్న వెంకటపతిరాయలు సిద్దవటం ప్రాంతాన్ని ఎల్లమరాజుకు అమరనాయంకరంగా ఇచ్చాడు. మట్లవారి ప్రాభవం అప్పటినుంచి వికసించింది. క్రీ.శ. 1600 ప్రాంతంలో ప్రారంభమయిన వీరి రాజరికం సిద్ధవటం మీద మూడు తరాలు సాగింది.
ఆధారం :
- మెకంజీ కైఫియత్తులు, కడప జిల్లా, నాలుగోభాగం, పుటలు 167-169.
- కైఫియత్ కతలు – మట్లవారు, పుటలు 108-113.
5. అనంతుని అష్టదిగ్గజ కవులు
అష్టదిగ్గజకవులు కృష్ణరాయలకొలువులో ఉన్నట్లు ఏ కావ్యమూ ప్రస్తావించలేదు. మొట్టమొదటి ప్రస్తావన తిప్పలూరు శాసనంలో ఉంది. అష్టదిగ్గజ కవులకు తిప్పలూరును దానం చేసినట్లు ఉంది. ఆ శాసనం చూశాక ఆ దిగ్గజాలు ఎవరా అని అన్వేషించడం సాహిత్య చరిత్రకారుల వంతయింది. ఈ తిప్పలూరు శాసనాన్ని శాసనసంగ్రాహకులు ప్రస్తావించడానికి దాదాపు వంద సంవత్సరాల ముందే తిప్పలూరు కైఫియత్తులో ఉటంకించి ఉన్నారు. కైఫియత్తుల ప్రాధాన్యం ఇంతకంటే ఏం కావాలి. కైఫియత్తుల సముద్రాన్ని మథించాలి గాని విషం మినహా మరెన్నో విషయమాణిక్యాలు వెలికి వస్తాయి.
కృష్ణదేవరాయల తరువాత పేర్కోదగ్గ మరో రాజకవి మట్ల అనంత భూపాలుడు. రాయలవారికి అనంతభూపాలునికి ఎన్నో పోలికలున్నాయి. వైష్ణవాన్ని ప్రతిపాదించే ఆముక్తమాల్యదను రాయలు రచించారు. అనంత భూపాలుడు రఘువంశానికి చెందిన కకుత్‌స్థవిజయం రచించాడు. రెండు కావ్యాలూ ప్రౌఢమైనవే, అటు రాయలుకాని ఇటు అనంతుడు కాని యుద్దరంగంలో ఓటమి చవిచూడనివారు. రాయల కొలువులో అష్టదిగ్గజాలున్నట్లే అనంతుని కొలువులోను అష్టదిగ్గజ కవులున్నారు. రాయలవారి అష్టదిగ్గజాల జాబితాలో స్పష్టత లేదుగాని, అనంతుని దిగ్గజాలలో స్పష్టత ఉంది. రాయలవారి కొలువులోని కవులు అందరూ ప్రసిద్ధులే. అనంతుని కొలువులోని వారు కొందరే ప్రసిద్ధులు. వారు ఉప్పుగొండూరు వెంకటకవి, కుందవరపు కవిచౌడప్ప, ఘంటయకవి, నక్కలపాటి సంజీవప్ప. అల్లసాని పెద్దన రాయలకొలువులోని కవితాపితామహుడయితే, అనంతుని కొలువులో ఉప్పుగొండూరు వెంకటకవి కవితాపితామహుడు. రాయలవారి కుమార్తె మోహనాంగి విదుషీమణి, కవయిత్రి. అనంతుని కూతురు చెన్నమ్మ కావ్యపురాణాలు వల్లెవేసిన భాషాకోవిదురాలు. రాయలవారి కొలువులో చాటువులు పండినట్లే అనంతుని కొలువులోను ఎన్నో చాటువులు పండినవి.
ఆధారం :
- ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మద్రాసులోని 310 సంపుటంలోని పుట 355 లో అనంతుని అష్టదిగ్గజ కవుల ప్రస్తావన.
- నా కైఫియత్ కతలు.
6. కవ(ద)న కుతూహలం
సిద్దవటం మట్లవారి రాజధాని. కకుత్‌స్థ విజయకర్త అనంతభూపాలుడు పాలిస్తున్నాడు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులున్నారు. అందులో నక్కలపాటి సంజీవకవి ఒకడు. ఆ కాలం సంస్థానాధిపతులు, రాజులు దసరా ఉత్సవాలు జరిపేవారు. కవి పండితులను సత్కరించేవారు. ఒక దసరా ఉత్సవాలకు నక్కలపాటి సంజీవుడు వెంకటగిరి కొలువుకు వెళ్లాడు. కవితాచాతుర్యం ప్రదర్శిస్తూ తమ రాజు అనంతుని కొనియాడాడు. సాటిరాజు పరరాజు పొగడ్తను భరించలేక పోయాడు. వెంకటగిరి పాలకుడు యాచమనాయకుడు అనంతుని హేళన చేశాడు. నక్కలపాటి కవికి ఆగ్రహం కలిగింది. మరో పద్యం అందుకొన్నాడు. భయపడలేదు.
ఉ. కొద్దిన రాడు బెట్టురికి కోటలు కొండలు గొన్న శూరుడా
గద్దరి గబ్బిరాచపులి గండరగండడు మట్లనంతుడే
ప్రొద్దున నైన భూభుజుల పొంకము లార్పగ బుట్టినాడు మీ
పెద్దరికాలు సాగవిక ప్రేలకుడీ గడిమన్నె భూపతుల్
రాజుకు ఆగ్రహం రెచ్చింది. ‘మాతో యుద్ధం చేసి జయిస్తే మీ పద్యం చెల్లుబడి అవుతుంది’ అన్నాడు. మాట కోట దాటింది. దొంగలసాని సమీపంలో లడాయి నిశ్చయమయింది. యాచమనాయకుడు స్వయంగా యుద్ధం చేయలేదు. తన ఊడిగం పాపయ్యకు సైన్యాధిపత్యం ఇచ్చి పంపాడు. అనంతుడు తక్కువవాడు కాడు. తన అందలం మోసే బసవనబోయను సైన్యాధిపతిని చేసి పంపాడు. పోరుసాగింది. బసవన గెలిచాడు. పాపయ్య ఓడిపోయాడు. వెలుగోటివారి బిరుదు ‘కరిసింహడాలు’ ను బసవన తీసుకున్నాడు. ఉభయసైన్యాలు వెనుదిరిగాయి.
కరిసింహడాలును బసవనబోయ అనంతుని పాదాల దగ్గర ఉంచి మోకరిల్లాడు. నక్కలపాటి సంజీవకవి మరోసారి పద్యం అందుకొన్నాడు.
కం. బసవన బోయడే బసవడు
బసవన పై నెక్కి నట్టి భవుడవు నీవే
కసువైరి వెలమలెల్లను
రసికాగ్రణీ! మట్లనంత! రణజయవంతా!
కవికి దివ్యాభరణాలు లభించాయి. బసవనబోయనికి నందలూరు సమీపంలోని లేబాక దగ్గర భూమి లభించింది. పరాభవాగ్ని చల్లారని యాచమనాయకుడు దొంగలసాని సమీపంలోని మట్లవారి ఓగూరు కోటను నేలమట్టం చేసి వెళ్లాడు.
ఆధారం :
- ఎమ్.ఓ.యల్. 352లోని 243 నుండి 246 పుటలు.
- మెకంజీ కైఫియత్తులు, కడప జిల్లా మూడోభాగం, పట్టపురావి.
7. ఆదరించిన ఉదాహరణ కావ్యం
సిద్దవటాన్ని పాలించిన మట్ల అనంతరాజు మనుమడు కుమార అనంతరాజు. తండ్రి తాతల వలెనే కుమార అనంతరాజు కూడా స్థానికంగా ఉన్న పాలెగాండ్లను అదుపులో ఉంచుకోవాల్సి వచ్చింది. కుమార అనంతుడు సింహాసనానికి వస్తూనే కలకడ, వేంపల్లి, అనిమెల, పాలగిరి, తంగేడుపల్లి, చెప్పల్లి, పీలేరు, కుమారకాల్వ, శెట్టిపల్లి పాలెగాళ్లు స్వతంత్రించాలనుకున్నారు. కుమార అనంతరాజు తమ్ముడు ఎల్లమరాజును తమ వశం చేసుకొన్నారు. ఇది తెలిసిన అనంతరాజు ఎల్లమరాజును సిద్ధవటం కోటలో బందీచేశాడు. దండు తీసుకొని ఒక్కొక్క పాలెగాణ్ణి అణచివేసి కలకడ నుంచి ఉదయగిరి దాకా నిష్కంటకం చేశాడు. కారాగారంలో ఉన్న ఎల్లమరాజు పశ్చాత్తాప పడ్డాడు. అన్న కుమార అనంతరాజుమీద ఉదాహరణ కావ్యం రచించాడు. అన్నకు పంపించాడు. తమ్ముడి వల్ల ప్రమాదం లేదని తెలుసుకొని వాత్సల్యం చూపించాడు. మైలపల్లె, పొందలూరు, గుండ్లూరు, ఓరంపాడు, రాయవరం అనే అయిదు గ్రామాలను అనుభవించుకొమ్మని అనుగ్రహించాడు. ఎల్లమరాజు మైలపల్లె చేరుకొన్నాడు. అక్కడ ఉంటూ గుంజన ఏటిగట్టున (పాత) చిట్వేలిలో కోటను నిర్మించాడు, ఆలయాలు నిర్మించాడు. అక్కడే ముప్పది సంవత్సరాలు ఉండిపోయాడు.
ఆయన రచించిన ఉదాహరణ కావ్యం అంతా లభించలేదు. కైఫియత్తులో ఒకే పద్యం లభించింది. ఈ పద్యం ఆధారంగా ఆయన ఉదాహరణ కావ్యం రచించినట్లు తెలుస్తూ ఉంది. ఆ పద్యమిది.
శా|| శాంతిన్ మద్దుణదోషసంఘముల నెంచన్ బోకు, కారుణ్యసం
క్రాంతస్వాంతమునన్ శుభాన్వితునిగా గావించి పోషింపు, ధీ
మంతా! మట్ల కుమారనంతనృప! సమ్యగ్వాక్రసూనావళీ
కాంతంబై తగు నీయుదాహరణము గల్పించి పూరించితిన్
ఆధారం:
- మెకంజీ కైఫియత్తులు, కడపజిల్లా, నాలుగో భాగం, చిట్టివేలి.
- కైఫియత్ కతలు ‘మట్లవారు’, 108-113 పుటలు.
8. సీతాపతి వేంకటాచల విహారుడు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి వారు ‘శ్రీవేంకటేశ్వర లఘుకృతులు’ అను పేర పదునాలుగు రచనలున్న పుస్తకాన్ని ప్రచురిస్తూ వస్తున్నారు. ఇందులో మొదటి రచన శ్రీవేంకటాచలవిహారశతకం. ఈ లఘుకృతులకు వివరణం రాస్తూ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు “ఇది మంచి రచనా నైపుణి గలది. రచయిత పేరెరుగరాదు” అన్నారు. చూ. (తి.తి.దే. ప్రతి 2013).
వేంకటాచల విహార శతక కర్త వరకవి నల్లకాల్వ అయ్యప్ప కుమారుడు సీతాపతి. మెకంజీ కైఫియత్తుల నుండి ఈ సంగతి తెలుస్తున్నది. మెకంజీ కైఫియత్తులలో భీమవరం (నెల్లూరు జిల్లా) అగ్రహారికుడు నల్లకాల్వ వరకవి వెంకటరామన్న వ్రాయించి ఇచ్చిన కైఫియత్తులో ఈ సమాచారం ఉంది. ఇందులో వరకవి అయ్యప్ప నుండి తనవరకు ఉన్న వంశావళి నిచ్చాడు. ఆ వంశీయులు తండ్రి తండ్రులందరు కావ్యములు, నిఘంటువులు రచించిన వారే! అందులో అయ్యప్ప కుమారుడు సీతాపతి శత్రుసంహార శతకం చెప్పినట్లున్నది. ఈ వరకవి అయ్పప్ప నల్లకాల్వవాడు. నల్లకాల్వ ప్రకాశం జిల్లాలో ఉంది. అయ్యప్ప ఒంటిమిట్ట కోదండరాముని సేవించాడు. ఆ స్వామి ఈయనను వరకవి అని సంబోధించాడట. అప్పటినుండి నల్లకాల్వ వరకవి అయ్యప్ప అయ్యాడు. రెండవ వెంకటపతిరాయల (చంద్రగిరి) పట్టపురాణి సోదరుడు జగ్గరాజు. ఆ జగ్గరాజు కుమారుడు ఓబరాజు. ఆ ఓబరాజుకు కృతులు చెప్పి అయ్యప్ప సత్కారాలు అందుకొన్నాడు.
క్రీ.శ. 1700 తరువాత మహమ్మదీయులు గోలకొండ ప్రాంతం నుండి తిరుపతి దాకా దండయాత్ర చేశారు. బద్వేలు ప్రాంతం నుండి రెండు శాఖలుగా చీలి తిరుపతి దాకా వచ్చారు. వారు మార్గంలో బీభత్సం సృష్టించుకొంటూ వచ్చారు. సీతాపతి తురుష్కుల దుస్సంఘటనలు కన్నులకు గట్టినట్లు వర్ణించాడు. శత్రుసంహార వేంకటాచల విహార! మకుటంతో సాగే సీసపద్యాలను ఈ శతకంలో చూడవచ్చు.
సీ|| కంటి దొల్దొల్త నుత్కటకూటచుంబిత
గోపురం బడిపడి గోపురంబు
వీక్షించితి జిరత్నవివిధరత్నవినూత్న
మహనీయతపనీయమండపములు
చూచితి బికపికీశుకశుకీకుహుకుహూ
కలనఘూర్ణితము మోకాళ్ల ముణుపు
కాంచితి నా స్వామికమనీయదివ్యమం
గళవిగ్రహానందకరవిమాన
తే.గీ. మంత గనుపట్టి శేషాచలాగ్రభాగ
చకచకద్గారుడస్తంభశాతకుంభ
జృంభితారంభసౌధనికుంభితోరు
హట్టనసముత్కరంబు శేషాచలంబు.
ఇది మొదటిపద్యం. నాలుగోపద్యం నుంచి “శత్రుసంహార వేంకటాచల విహార” అంటూ శతకమకుటాన్ని ఉంచాడు. క్రియతో శతకం ఆరంభం కావడం, ఎక్కడ నుంచి శతకోద్దేశ్యం ప్రారంభమయిందో అక్కడనుంచి “శత్రుసంహార!’ – అంటూ స్వామిని సంబోధించడం శతకకర్త కవితానైపుణి గుర్తుకు తెస్తున్నది.
ఆధారం:
- మెకంజీ కైఫియత్తులు యం.ఓ.యల్.యం.344 పేజీ 19,20.
- నా కైఫియత్ కతలు పుటలు 150-153.
9. గువ్వలచెన్న పట్టాభిరాముడు
తెలుగు సాహిత్యంలో ముచ్చటైన శతకం గువ్వలచెన్న శతకం. గువ్వలచెన్న మకుటంతో నూటచిల్లర పద్యాలు దొరుకుతున్నాయి. ఇందుకు మూలమైన తాటాకుల ప్రతి మాత్రం ఎక్కడా లభించినట్లు లేదు. కొన్ని పద్యాల్లో పాఠాంతరాలు కనిపిస్తున్నాయి. ముచ్చటైన శతకం అనడానికి గుర్తుగా ఈ ఒక్క పద్యం చదువుకొని ముందుకు వెళదాం.
కం. కలిమిగలలోభికన్నను
విలసితమగు పేద మేలు వితరణి యైనన్
చెలమైన మేలుగదా!
కులనిధి అంభోధికన్న గువ్వలచెన్నా!
గువ్వలచెన్నడు మానవుడో గుడిలో కొలువైన దేవుడో స్పష్టంగా తెలియదు. గువ్వలచెన్నుని గూర్చి కృష్ణదేవరాయల కాలం నుంచి కథలున్నాయి. శతకంలోని పద్యాలను పరామర్శిస్తూ వెళితే ఆ కాలంవాడు కాదనిపిస్తుంది. అందులోని చాలా పద్యాలు తెల్లజాతివాళ్లు ఈ ప్రాంతంలో కాలు మోపిన తరువాతివి అని నిరూపిస్తాయి. సురవరం ప్రతాపరెడ్డి గారు “క్రీ.శ.1700 ప్రాంతంలో ఈ శతకరచన జరిగి ఉంటుంద”న్నారు. ఇది వాస్తవం.
గువ్వలచెన్న శతక కర్త ‘పట్టాభిరామకవి’ అని తెలుగు చాటువు పుట్టుపూర్వోత్తరాలులో బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు చెప్పారు. అందులోనే పట్టాభిరామకవి క్రీ.శ.1784 నుండి క్రీ.శ.1814 వరకు జీవించాడన్నారు. ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని మర్రాజు సంస్థానంలో గుండారాయని కాలంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అభిప్రాయం నిలబడదు. ఈ శతకం లోని రెండు పద్యాలు మద్రాసు నగర అభ్యుదయాన్ని గురించి భవిష్యం చెప్పారు. ఆ పద్యాలివి.
చెన్నయను పదము మునుగల
చెన్నగు పురమొకటి నీదు చెంతను వెలయున్
సన్నుతులు వేల్పు నుతులును
గొన్నాతని కరుణచేత గువ్వలచెన్నా!
ధర నీపేర పురంబును
గిరిజేశ్వర పాదభక్తి కీర్తియు నీయు
ర్వర నుతులు గాంతు విదియొక
గురువరముగ నెంచుకొమ్ము గువ్వలచెన్నా!
ఇందులో చెప్పబడిన పురం చెన్నపురియే అవుతుంది. చెన్నపురి అభివృద్ధికి వస్తూ ఉన్న కాలంలో ఈ పద్యాలు వెలువడినట్లు భావించవచ్చు.
క్రీ.శ. 1640 ప్రాంతంలో చెన్నపట్టణంలో ఆంగ్లేయుల గిడ్డంగి కుదురుపాటు అయింది. క్రీ.శ.1700 ప్రాంతానికి క్రమంగా చెన్నపట్లం, మద్రాసు పేర్లతో నగరం అభివృద్ది చెందుతూ వస్తున్నది. నగరాభివృద్దిని శతకకారుడు ఈ కాలంలో ఊహించి భవిష్యం చెప్పి ఉండవచ్చు. కాని బొమ్మకంటివారు చెప్పిన కాలం క్రీ.శ. 1810 ప్రాంతం శతక రచన జరిగిన నాటికి చెన్నపట్టం మునిసిపాలిటీ స్థాయి దాటి విస్తరించి ఉంది. కాబట్టి సురవరం వారు శతకాంతర పద్యాలను ఆధారంగా చేసుకొని క్రీ.శ.1700 ప్రాంతంలో రచన జరిగి ఉందన్నది సత్యమవుతుంది. అట్లయితే క్రీ.శ.1700 ప్రాంతంలో మరో పట్టాభిరామకవి ఉండాలి కదా! ఉన్నాడు, ఆ కవి కైఫియత్తులో దొరికాడు.
కడపజిల్లాకు చెందిన రాజంపేటకు సమీపంలోని ఊటుకూరి కైఫియత్తులో చిన్నసమాచారం ఉంది. క్రీ.శ.1704 ప్రాంతంలో చిట్వేలి, ఎర్రగుంట్ల కోటల్ని తన అధీనంలో ఉంచుకొన్న మట్ల తిరువేంగళనాథరాజు (ఉరఫ్ అప్పయ్యరాజు) క్రీ.శ.1710 దాకా జీవించాడు. ఈ మధ్యకాలంలో ఈ అప్పయ్యరాజు ఘటికాశతగ్రంథిగా పేరు తెచ్చుకొన్న పట్టాభిరామకవికి ఊటుకూరు సమీపంలోని రామసముద్రాన్ని గ్రాసగ్రామంగా ఇచ్చాడు. ఈ పట్టాభిరామకవి క్రీ.శ.1700 కంటే ముందు క్రీ.శ.1710కి తరువాత జీవించి ఉండే అవకాశం ఉంది. మట్లవారికి శ్రీకాళహస్తి, చంద్రగిరి వారితో సంబంధాలు ఉన్నాయి. మట్లవారి కొలువులో ఉన్న ఈ పట్టాభిరామకవి ఈ రెండు సంస్థానాలకు కూడా వెళ్లివస్తూ ఉండే అవకాశం లేకపోలేదు. ఆ సమయంలో ఈ గువ్వలచెన్న శతకం వెలువడి ఉంటుంది.
కైఫియత్తు ఈ పట్టాభిరామకవిని పరిచయం చేయకుండా ఉంటే శతకం వెలువడిన ఏడెనిమిది దశాబ్దాల కాలం తరువాత జీవించిన మరో పట్టాభిరామకవి రచనగా స్థిరపడి ఉండేది. శతకాంతర పరిశోధనకు అవరోధం కలిగిస్తూ ఉండేది.
ఆధారం:
- మెకంజీ కైఫియత్తులు, వై.యస్.ఆర్.జిల్లా, ఆరోభాగం, పూటుకూరు.
- నా కైఫియత్ కతలు “గువ్వల చెన్నపట్టణం” పుటలు 166-178.
10. జల్లివారి చాటువులు
జల్లి మహదేవప్పనాయని కుమారుడు కొండప్పనాయుడు. ఇప్పటి ప్రకాశం జిల్లాలోని బసవాపురం సంస్థానాధిపతి. ధార్మికుడుగా దాతగా పేరు తెచ్చుకొన్నాడు. ఒక జోగి స్త్రీ ఆయన్ని యాచించింది. ఏం కావాలో అడుగు అన్నాడు కొండప్పనాయుడు. ‘నాకేం ఏనుగునిస్తారా, గుర్రాన్నిస్తారా? పొట్టనింపుకోడం కోసం వచ్చానంతే’ అంది ఆ జోగిని. “ఏనుగునిస్తారా గుర్రాన్నిస్తారా అని యాచన ప్రారంభించావు. ఇదిగో మొదట అడిగిన ఏనుగునే ఇస్తున్నాను తీసుకో” అని కొండప్పనాయుడు ఏనుగునిచ్చి వేశాడు. సమీపంలో ఉన్న కవి ఆశ్చర్యపోయాడు. పద్యం అందుకొన్నాడు.
కం. యక్కల జోగివధూటికి
నెక్క గజంబిచ్చె కొండలోర్వీపతి మిగులన్
తక్కిన కవులకు నిచ్చుట
లెక్కింపగ దరమె బ్రహ్మ లేఖకు డైనన్
అని శ్లాఘించాడు. ఆ యక్కల జోగి ఏనుగు నెలా పోషించిందో గాని కవి చెప్పిన పద్యంలోని ధ్వనిని గమనించండి. జోగి నోరు తెరిచి ఏనుగు అన్నదే తడవుగా ఏనుగునే దానం చేశాడే! ఇక కవులకు ఈ దొర చేసే దానం ఎంతై ఉంటుందో. ఆయన దానాలు బ్రహ్మ వ్రాతగాడుగా కూర్చున్నా సాధ్యం కాదేమో అని ధ్వని తోటి ఉత్ర్పేక్షించాడు.
ఈ జల్లి వంశంలోని వాడే అంకప్పనాయడు. బొల్లుపల్లె సంస్థానాధీశుడు. అతిదానశీలుడు, కీర్తిమంతుడు అయిన ఆయన కీర్తిని వర్ణిస్తూ ఒకానొక కవి చెప్పిన పద్యం చూడండి.
ఉ. జల్లి కులావతంస! బలశాసనవైభవ! అంకభూప! నీ
సల్లలితైకకీర్తిరుచిజాలము మిక్కిలి వన్నెబెట్టు జా
బిల్లికి, పాలవెల్లికిని, భీష్ముని తల్లికి, ఆణిముత్యపుం
జల్లికి, కల్పవల్లికిని, సారసగర్భవధూమతల్లికిన్
కీర్తిని తెల్లదనంతో పోలుస్తారు. చంద్రుడు, పాలసముద్రం, గంగ, ఆణిముత్యాల జల్లి, కల్పవృక్షం, సరస్వతీదేవితో పోలుస్తూ గొప్ప చాటువు చెప్పాడు. అంకరాజు ఇంటి పేరు జల్లి. ఆణిముత్యపుంజల్లిలో రాజునేకాక, రాజుగారి గృహనామాన్ని చేర్చి ఆయన కీర్తిని కులానికంతటికీ నింపాడు.
ఈ జల్లి వంశీయ ప్రభువులందరు కీర్తికి ఏతమెత్తినవారే! అంకప్పనాయని కుమారుడు రామప్పనాయడు. ఆయన్ని గూర్చి వెలువడిన చాటువు చూడండి.
ఉ. జల్లి కులావతంస! బలశాసనవైభవ! అంకభూప! నీ
సల్లలితైకకీర్తిరుచిజాలము మిక్కిలి వన్నెబెట్టు జా
బిల్లికి, పాలవెల్లికిని, భీష్ముని తల్లికి, ఆణిముత్యపుం
జల్లికి, కల్పవల్లికిని, సారసగర్భవధూమతల్లికిన్
ఆధారం:
- ఎ.పి. ఆర్కెవ్స్ ఆర్.నెం.1183, పుటలు 14,35,36.
కైఫియత్తులలో లభిస్తున్న సాహిత్యాంశాలను ఇప్పటికే చాలా వాటిని ఇక్కడ ఉంచాను. ఇలా కూర్చుకొంటూ ఒక గ్రంథం చేయవచ్చు. సాహిత్య శోధకులకు అందని అంశాలు, కేవలం కైఫియత్తుల మూలంగానే వెలువడిన, వెలువడుతున్న అంశాలు చాలా ఉంటున్నాయన్న సత్యం ప్రపంచానికి తెలిస్తే చాలు. కైఫియత్తులకు విలువ పెరుగుతుంది. పరిశోధకులకు ఇలాంటి విలువైన పలురకాల రత్నాలు లభిస్తూనే ఉంటాయి.