[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘మాయా కవచం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నే[/dropcap]ను..
సహజ కవచ కుండలాలతో పుట్టలేదు
నా జననంలో నిగూఢమైన రహస్యమేమీ లేదు.
అయ్యో! సుర వర ప్రసాదిని అంత కన్నా కాదు.
కర్ణుడంతటి వితరణా శీలుడని కాను.
జీవితాన్ని ఛేదించగలిగే అస్త్ర శస్త్ర ప్రావీణ్యమసలే లేదు!
ప్చ్! రాజ్యాలను రాసిచ్చే మానధనుడంతటి ఆప్తమిత్రుడూ లేడు.
ఓ రాజ్యాన్నే బహుమతిగా పొందగలిగేంత
శౌర్య ధనుడని కానీ, స్నేహశీలినీ కానీ కాదు
పాండవులంతటి ఐక్యతా శౌర్యములు కల సహోదరులు లేరు.
అర్జునుడంతటి ప్రత్యర్థులను ఎంచుకునే
సాహసం నేనెప్పుడూ చేయలేదు.
పరశురాముడంతటి గురువులకై
నేనెప్పుడూ శోధించ లేదు
నా అదృష్టం, నాతో విసిగి వేసారిన గురువులు
ఇచ్చిన శాపాలూ నాతో లేవు.
ప్రేరణతోనో, ఇచ్చిన మాటకుగానో నాకుగా
నేను పాల్గొన్న కురుక్షేత్రమంతటి
సమరాలేవీ నా జీవితాన లేవు.
నిజం ఒప్పుకోవద్దూ!
వాటిలో పాల్గొనేటంత పరాక్రమశాలినీ కాదు.
మరి నాకు నేనే ఎందుకు
అభినవ కర్ణుడిగా పరిగణించుకుంటున్నాను ?
పుట్టుకతో వచ్చిన పోలికల వల్ల కాదు సుమా
ఆపై అతనికి అబ్బిన వాటితో అంతకన్నా కాదు.
అయితే నాకూ కర్ణునికి ఓకే ఒక్క పోలిక!
వర ప్రసాదితమైన కవచ కుండలాలతోనైతే నే పుట్టలేదు
కానీ నేల మీద పడ్డ క్షణం నుండే దుర్బేధ్యమైన
మాయా కవచంలో ఇరుక్కున్నాను.
నేనూ, నాది అనే భావనలతో భారమైన కుండలాలలను
ఇరు చెవులకు కడు ఇష్టంతో అలంకరించుకున్నాను.
చిత్రం! అవి నాతోనే పెరుగుతున్నాయి,
బలపడుతున్నాయి అలా అలా.
అయితే అవి సురపతి వచ్చి అడిగినా
దానంగా ఇవ్వబోను,ఇవ్వలేను?
తీసి సునాయాసంగా ఇచ్చేయడానికి..
అవి తనువుకు పట్టిన భావనలు కావుగా..
బుద్దిలో, మనసుతో మమేకమైపోయిన
మాయా కవచ కుండలాలు కదా..!