[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘నైరాశ్యం..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]స[/dropcap]ర్వం నేనే నని విడవకుండా వెంబడి తిప్పుకున్నావు
అందలం ఎక్కగానే అసలు నన్నే మరచి పోయావు
సమస్యల పరిష్కారంలో సమయం లేకుండా నీవు
సామాజిక ప్రగతిలో సంక్షేమ ఫలాలనందిస్తున్నావు
ప్రజా గళంలో తిరుగులేని నాయకుడవయ్యావు
నీళ్ళూ నిధులు అందిస్తున్నావు, నేనున్నాని మరచావు
ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళూ గడపలేదు
గడప గడపకూ తిరిగి నీ విజయం కోసం అర్థించలేదు
నన్ను చూసి మిగతా జనం, నీకు దగ్గరా అని పెదవి విరవలేదు
ఇప్పుడు ఎగతాళిగా, నా వైపు నువ్వు అంతే అన్నట్లు గా
నిష్ఠూరాలు పలుకుతూ సానుభూతి చూపిస్తున్నారు
పని ఒత్తిడి అనుకునే సర్దుకున్నాను
మాటలు తూటాల్లా , వినలేకుండా ఉన్నాను
నిజం ఏమిటో తెలియకుండా నిన్ను నిందించలేను
నిరీక్షించే సహనాన్ని ఇంకా పెంచుకుంటూనే ఉన్నాను
ఎన్నటికీ వ్యతిరేకించను
ఎందుకంటే నిన్ను పూర్తిగా చదివిన వాణ్ణి
నీ పైన అభిమానమే నాకు సహనాన్ని నేర్పుతుంది
సంపూర్ణ అవగాహనతో నీ అపాయింట్‌మెంట్ కోసమే
నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తున్నా
నీ సహచరగణంలో, నీకు శ్రేయోభిలాషిగా, సదా నీ సేవలో..