వసంత లోగిలి-1

1
4

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[dropcap]“మా[/dropcap]మయ్యగారు!.. ట్రైన్ దిగండి.. ప్లీజ్.. మీరలా వెళ్ళడం ఏమీ బాగాలేదు.. అత్తమ్మా మీరైనా చెప్పండి.. అయినా మీరింత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?.. కోపంలో ఏదో అన్నారనుకోండి అలా ఎలా వెళ్ళిపోతారు?.. ట్రైన్ కూతకి ఇంకా కొద్ది నిమిషాలే ఉంది.. దిగండి!” అంటూ సరాసరి బతిమాలుతోంది నిత్య.

‘ససేమిరా’ అంటూ మొండి పట్టుపట్టారు మామయ్య గారు.

ట్రైన్ మరి కొద్ది నిమిషాలలో బయలు దేరడానికి సిద్ధంగా ఉంది అని మైక్ లో వినిపిస్తోంది.

“చాయ్.. చాయ్.. చాయ్ తప్పుకోండమ్మా” అంటూ చాయ్ వాడు అడ్డం పడ్డాడు. “దోశ, ఉప్మా, పెసరట్టు, కట్లెట్”.. అంటూ మీద మీదకే వస్తున్నా వాళ్ళను తప్పించుకుంటూ నిత్య పడ్డ బాధని చూసి అత్తయ్యగారు బెర్త్ కింద లగేజీని తియ్యడానికి కిందకి వంగుతూ.. మామయ్యగారికి వినపడేలా.. “కోడలు అంతగా బతిమాలుతుంటే ‘బింకం’ పనికిరాదు.. కిందకి దిగి, పదండి” అన్నారు.

అత్తగారు లేవడంతో గుర్రుగా చూస్తున్న మామయ్యగారు కూడా దిగక తప్పలేదు.

‘హమ్మయ్య.. ముసలివాళ్ళు ఇద్దరూ శాంతించారు.. ఇప్పుడు వీళ్ళను ఇంటికి తీసుకు వెళ్ళాక ఆయన గారి ముఖం చూడాలి.. ఏమి యుద్ధం చేస్తారో.. ఏమో! ఆయనకి నోటి దురుసు మరీ ఎక్కువైపోయింది.. పెద్దవాళ్ళు కదా! వాళ్లకి గౌరవం ఇవ్వాలి కదా!.. పాపం పెద్దవాళ్ళిద్దరూ ఎంత చిన్నబుచ్చుకున్నారో కదా!..’ అనుకుంటూ వారి లగేజి ఎత్తడానికి పోర్టర్‌ని పిలిచి.. కార్లో పెట్టించమని చెబుతూ.. మామయ్య గారి చెయ్యిని పట్టుకోబోయింది నిత్య.

“నన్నెవరూ పట్టుకోనవసరం లేదు” అంటూ బలంగా విసిరికొట్టిన నిత్య చెయ్యి ఎదురుగా కాఫీ తీసుకు వస్తున్న వ్యక్తి మీద పడటంతో అతని చేతిలో కాఫీ నిత్య చీరంతా ఒలిగింది.

అది చూసిన అత్తగారు, మామయ్య గారిని చెడామడా తిడుతుంటే.. నిత్య అయ్యో అత్తయ్యగారూ, మామయ్య తప్పేమీ లేదు.. నేను చూసుకోకుండా ఆయన చెయ్యిని పట్టుకోబోయాను” అంది నిత్య.

ఎదురుగా కాఫీ పట్టుకు వస్తున్నతనిని ఉద్దేశించి ‘‘సారీ బ్రదర్.. చూసుకోలేదు.. రండి ఇంకో కప్పు కాఫీ తీసుకోండి. నేను ‘పే’ చేస్తాను” అంటుండగానే..

“భలే వాళ్ళే సిస్టర్ మీరు, ఏం కాదు లెండి.. నేను వెనక్కి వెళ్లి మళ్ళీ కాఫీ తీసుకుంటా. సిస్టర్.. పాపం మీ శారీ.. కాఫీ పడి ఖరాబైంది, మీరు పెద్దవాళ్ళతో వెళ్తున్నారు కదా!.. జాగ్రత్తగా వెళ్ళండి” అంటూ దారి ఇచ్చాడు ఆ వ్యక్తి.

“చూసుకోలేదు నిత్యా” అంటూ మామయ్యగారు నొచ్చుకుంటూ అని, “అలా చూస్తావేం? ఆ బాటిల్ తీసి అమ్మాయికివ్వు.. చీర మీద పడ్డ కాఫీ కడుక్కు వస్తుంది” అని అత్తగారి మీద అరిచారు.

“ఆ.. ఆ అదే పనిలో ఉన్నా.. నీళ్ళ సీసా.. ఎక్కడ పెట్టారు?.. వెతుకుతున్నా” అని సంచిలో ఆ మూల ఈ మూల చూసి,

“ఆ అన్నట్టు నీళ్ళ సీసా బెర్త్ ఎనకాల స్టాండ్‌లో పెట్టి మరిచారు.. మీ మతిమరుపు పాడు కానూ” అంటూ “ట్రైన్ వెళ్లిపోయిందా!” అని వెనక్కి చూసిన అత్తగారితో ..

“ఆ.. చెంగు చెంగున పరిగెత్తి వెళ్లి తెచ్చేయ్.. పడచు బాలా కుమారివి కదా!.. నీ కోసం ఆ ట్రైన్ ప్లాట్‌ఫారం నంబర్-2లో వేచి ఉంటుంది మరి!” అన్నారు మామయ్యగారు .

వాళ్ళిద్దరి వాదనని విన్న నిత్య.. నవ్వు ఆపుకోలేక పోయింది.

***

ఎలా అయితేనేమి? పెద్దవాళ్ళిద్దర్నీ అలక పానుపు దించి ఇంటికి తీసుకువచ్చిన నిత్య సరాసరి వంటగదిలోకి వెళ్లి కాఫీ కలిపి ఇద్దరికీ ఇచ్చింది.

ఇంతలో బయట బండి శబ్దం విని బయటకు వచ్చిన నిత్యకి ఎదురుగా నవీన్ ఇంట్లోకి వస్తూ.. “వీళ్లు ట్రైన్ ఎక్కారా! లేరా!” అంటూ లోపలి వస్తుంటే..

“ష్.. ష్..” అంటూ అతని మాటలు పెద్దవాళ్ళ చెవులో పడకుండా మానేజ్ చేస్తూ.. “గదిలో అత్తయ్య మామయ్యా ఉన్నారు.. మీ మాటలు వింటే నొచ్చుకుంటారు” అని సైగ చేస్తూ.. “నవీన్ అటునుంచి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి రండి ప్లీజ్” అంటూ బతిమాలుతున్న నిత్య వైపు గుర్రుగా చూస్తూ బాత్రూమ్ లోకి దూరాడు నవీన్.

“ఆ బడుద్దాయ్ వచ్చాడా!”.. అంటూ మామగారి కేకలు విన్ననిత్య, “ఆ ఆ.. వచ్చారు మామయ్యా.. ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నట్టుంది.. గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు” అని అనగానే, “అమ్మాయ్ కాస్తా కాఫీ కలిపి ఇవ్వు వాడికి.. పాపం పని ఒత్తిడి.. కదా!” అంటూ తల్లి ప్రేమని చూపిస్తున్న అత్తగారిని చూసి ముచ్చటేసింది.

“ఆ.. ఆ.. నిత్యా అదే చేత్తో ఏమన్నా చేసి పెట్టు” అంటున్న అత్తగారికి సమాధానంగా..

“అలాగే అత్తయ్యా.. ఇంట్లో జంతికలు ఉన్నాయి ఇస్తాను.. మీకు కూడా ఇవ్వనా” అంది నిత్య

కాసేపట్లో అందరికీ కాఫీలతో పాటు సీసాలో ఉంచిన జంతికలను స్నాక్స్‌గా ఇచ్చి సాయంత్రం వంటకి చెయ్యాల్సిన పనులు మొదలు పెడదామని లేచింది నిత్య.

ఇంతలో నవీన్ వచ్చి పక్కనే నిలబడ్డాడు.

“ఏంటి శ్రీమతి గారు.. ఇంతకీ మీ అత్తామామల కోపం తగ్గినట్టేనా?”

“ఊరుకోండి.. మీరు మరీను.. వాళ్ళని ఏదో ఒకటి అనకుండా ఉండలేరా!”

“నేను ఏమన్నా నిత్యా.. చెప్పు? నాన్నగారి స్నేహితుడి దగ్గరకి తీసుకుని వెళ్ళమన్నారు.. ఈ వారం కుదరదు అన్నాను. ఇప్పుడే వెళ్ళాలి, వాడ్ని కలవాలి అని మంకు పట్టుదల పడితే ఎలా? అంత అర్జెంట్ అయితే, నిత్య తీసుకుని వెళ్తుంది లెండి కావాలంటే అన్నాను.. నువ్వే రావాలి, నువ్వే కావాలి అంటే ఎలా చెప్పు? అసలే నా ఆఫీస్ వర్క్‌తో తల మునకలవుతున్నాను. నా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా! అయినా అంత వెళ్ళాలని ఉన్నప్పుడు.. నీతో వెళ్ళచ్చు కదా!” అన్నాడు నవీన్.

“అవును నవీన్, మీ సమస్య నాకు అర్థం అవుతుంది.. కాని వాళ్లకు అర్థం అయ్యేలా మీరు చెప్పచ్చు కదా! అన్నిటికీ అలా నోరేసుకుని అరుస్తూ ఉంటే పెద్ద వాళ్ళు హర్ట్ అవ్వరా! చెప్పండి.

వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు అంటే!.. ఎలా?.. వాళ్ళు పెద్దవాళ్ళైపోయిన చిన్న పిల్లలు లాంటి వాళ్ళు.

‘నువ్వే కావాలి’ అంటున్నారంటే బహుశా వాళ్ళు మిమ్నల్ని ‘మిస్’ అవుతున్నారని ఎందుకు అనుకోరు నవీన్? మీతో వెళ్లాలని.. కొడుకు తీసుకొచ్చాడని గర్వంగా స్నేహితుడికి చెప్పుకోవడానికి రమ్మన్నారేమో! అలా అనుకోవచ్చుగా” అంది నిత్య.

“నిత్యా!.. నీకు మరీ ఎక్కువైపోయింది. వాళ్ళని అలా వెనకేసుకొస్తూ.. సమర్థిస్తూ ఉంటావ్.. తిరిగి నాకే ఎదురు తిరుగుతావ్.. నాదే తప్పు అంటావ్” అంటూ అలిగి వెళ్ళిపోయాడు రూమ్ లోకి నవీన్.

‘అబ్బా.. మీరు తప్పితే వాళ్ళు, వాళ్ళు తప్పితే మీరు, అలకపానుపు ఎక్కుతూ ఉంటే దించడం బహు కష్టంగా ఉంది మహానుబావా!.. మీకో నమస్కారం. నాకు పిచ్చి ఎక్కేలా ఉంది’.. అనుకుంటూ గుమ్మం లోకి వచ్చిన నిత్యకి ఎదురుగా పక్కింటి పిన్ని గారు దర్శనమిచ్చారు.

“ఏంటి నిత్యా.. అత్తామామలని రైల్వే ప్లాట్‌ఫారం నుంచి తీసుకు వచ్చావా!.. నడుస్తున్న ట్రైన్‌ని ఆపి, దింపి తీసుకు వచ్చావా!”

“ట్రైన్ ఎక్కేసారు పిన్ని గారూ. కాకుంటే ట్రైన్ ఇంకా కదలలేదు అదృష్టం కొద్దీ..” అంది నిత్య.

“నువ్వు కాబట్టి తీసుకోచ్చావ్ బతిమాలి, బామాలి.. నేనైతేనా! ఆ ట్రైన్ పట్టాల మీదకి తోసేసి వచ్చేసేదాన్ని, పీడా పోయే” అంది పిన్నిగారు.

“అదేంటి పిన్ని గారు అలా అంటారు.. మీరు పెద్దవారు.. అలా అనచ్చా మీరు?”

“లేకపోతే ఏంటి నిత్యా.. ఉదయం లేచిన దగ్గర నుంచి కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసి కూర్చుంటారు.. ఈ కూర బాగాలేదు, ఆ రసం బాగాలేదు, ఈ అన్నం గట్టిగా ఉంది, ఆ ఉప్మా గట్టిగా ఉంది అంటూ ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు.. పాపం నువ్వు ఎంత కష్టపడి చేస్తావ్ వాళ్ళ కోసం.. మీ అమ్మానాన్నల కంటే ఎక్కువగా చూస్తావ్.. ప్రేమగా చూస్తావ్.. ఆదరిస్తావ్.. ఎక్కడికి కావాలంటే అక్కడకి తీసుకుని వెళ్తావ్.. ఈ రోజుల్లో కోడళ్ళు అత్తామామలని ఎవరు ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారో చెప్పు?.. అందరూ ఓల్డ్ ఏజ్ హోంలో పడేసి చేతులు దులుపేసుకుంటున్నారు. నువ్వు కాబట్టి..” అని కంటిన్యూ చెయ్యబోతున్న పిన్నిగారిని స్టాప్ చెయ్యకపోతే టాపిక్ ఎక్కడ వరకు లాక్కుని వెళ్తారో అని భయమేసి..

“పిన్ని గారు.. ప్లీజ్.. వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు ప్లీజ్.. వాళ్ళు నా వంట బాగాలేదు అంటున్నారంటే.. వాళ్ళ నాలికపై టేస్ట్ బడ్స్ బాగాలేక పాపం అలా అంటున్నారు.. నా మీద కోపంతో కాదు.. పైగా నన్ను ఏమీ అనేవారు కాదు వాళ్ళు.. ఒక వేళ ఏదైనా అన్నా నేను పెద్దగా పట్టించుకోను. మీరు అలా అనటం నాకు నచ్చలేదు పిన్ని గారు. వాళ్ళు పెద్ద వాళ్ళైపోయారు కదా!.. చాదస్తం కొద్ది ఏదో అంటూ ఉంటారు. పిల్లల తరాన్ని, పెద్ద తరం ఎప్పుడు వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది అది సహజం. తరానికి తరానికి మద్య దూరం ఈ నాటిది కాదు.. ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది.. దాన్ని ఎవరు కాదనలేరు.. ఆ దూరాన్ని ఎవరూ తగ్గించలేరు” అంది నిత్య.

“అవునులే నిత్యా.. కోపంలో ఏదో అనుకుంటాం కాని.. ఆయన అమ్మానాన్న.. ఆయనిష్టం.. వాళ్ళు అనుకుంటారు.. కలిసిపోతారు.. ఆ మాత్రానికే అలిగి బయలుదేరిపోవాలా! అని నా ఉద్దేశ్యం. అయినా, నీకు చెప్పేది ఏముంది. పెద్ద పెద్ద చదువులు చదివినదానివి.. కుటుంబాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలిసినదానివి” అంది దీర్ఘాలు తీస్తూ, అన్నీ తెలిసిన దాన్లా, ఎదురింటి పిన్నిగారు వనజ.

ఇంతలో ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ మోగింది.

“అబ్బా.. ఆ ఫోన్ ఇవ్వు నిత్య” అని బెడ్ రూమ్ లోనుంచి అరిచాడు నవీన్.

“ఆ.. అలాగే అలాగే”.. అంటూ ఒక చేత్తో గరిటె, ఇంకో చేత్తో ఫోన్ పట్టుకుని వెళ్తూ “పిన్నిగారు సాయంత్రం మాట్లాడదాం” అంటూ.. వెళ్ళిపో౦డి ప్రస్తుతానికి అన్న అర్థం వచ్చేలా చెప్పింది నిత్య.

“అలాగేలే.. వెళ్ళక చస్తానా!” అంటూ నిష్క్రమించింది పిన్ని గారు వనజ.

రాత్రి భోజనాలు పూర్తయ్యాక ..

“అత్తయ్యగారూ!.. రేపు మామయ్య గారి స్నేహితుని దగ్గరకి నేను తీసుకు వెళ్తాను.. మీ అబ్బాయికి ఆఫీసులో”.. అని పూర్తి కాకుండానే..

“వద్దులేమ్మా! ఆమాట అన్నందుకేగా వాడికి కోపం పొడుచుకొచ్చింది.. మేము ఎక్కడికి వెళ్ళం.. ఈ గదిలోనే మగ్గిపోతాం.., ఇక్కడే చచ్చిపోతాం”.. అంటున్న అత్తగారితో ..

“ఛ.. ఛ.. అవేమి మాటలు అత్తయ్య గారు.. అలా ఎవరైనా అంటారా! మీ బాబుకి మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి?” అంటూ ఏదో సర్ది చెప్పినా, అత్తయ్యగారి మాటలకు నిత్య నొచ్చుకుంది.

***

పక్కింట్లో నుంచి ఒకటే ఏడుపు ఏడేళ్ళ తపస్వి.. ఏమిటి అంత అల్లరి పెడుతోంది అనుకుంటు కిటికీ లోనుంచి చూసింది నిత్య.. కాసేపటికి వాళ్ళమ్మ కేకలు..

“నీకు.. బాగా అల్లరి ఎక్కువైపోయింది” అంటూ బెల్ట్ పట్టుకుని తిరుగుతున్నాడు తండ్రి వాసు.

“ఇంత మంకు పట్టు.. ఎలా అబ్బింది దీనికి.. ఈ రోజు వీలు కాదు, రేపు పోదాం అంటే వినదే?”

“మా ఫెండ్స్ అందరూ చూసేసారు.. ఎగ్జిబిషన్ రేపు ఉండదు.. నన్ను ఈ రోజే తీసుకువెళ్ళాలి అంతే” అంటూ గ్లాస్ విసిరేసింది.

“వేలెడంత లేవు.. నీకే అంతుంటే.. నిన్ను ‘కన్నవాడ్ని’ నాకెంత ఉండాలి?” అంటూ పోటీగా అరుస్తున్నాడు వాసు

ఇదంతా చూసి.. “పోనీ ఈ రోజు సాయంత్రం”.. అని మాట పూర్తి కాకుండానే.. “నోర్ముయ్.. నీ ముద్దు ఎక్కువై ఇలా తయారైంది” అని భార్య మీద అరుస్తున్నాడు వాసు.

“అమ్మా! ఈ రోజే నన్ను తీసుకెళ్ళాలి, అంతే.. ” అని తలుపు గట్టిగా వేసుకున్న చప్పుడు,

“దాన్ని పట్టికెళ్ళి హాస్టల్‌లో వేసెయ్.. తిక్క కుదురుతుంది” అన్నాడు కోపంతో వాసు.

అయ్య బాబోయ్.. యుద్ధం చేస్తోంది తపస్వి.. వాళ్ళ నాన్నతో.

తన వయసు ఏడేళ్ళు.. మామయ్య గారి వయసు డెబ్బై.. ‘ఇద్దరు చిన్నపిల్లలే’ అనుకుంది మనసులో నిత్య.

నాన్న ‘సమస్య’ ఏంటో అలోచించే వయసు రాలేదు తపస్వికి. కొడుకు ‘సమస్య’ ని అర్థం చేసుకునే స్థితిలో లేరు మామయ్యగారు.. మొత్తానికి ఇద్దరూ పసిపిల్లలే.

‘చిన్నప్పుడు మనం వాళ్ళని ఏడిపిస్తాం.. వాళ్ళు భరిస్తారు.. అందుకే వాళ్ళు అమ్మానాన్నలు అయ్యారు. పెద్దయ్యాక వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు. కాని మనం వారిని భరించడం కష్టంగా ఫీల్ అవుతాం అందుకే మనం పిల్లలం’ మనసులో అనుకుంది నిత్య.

 ఏ ఓల్డేజ్ హోమ్ లోనో పడేస్తే బాగుండు అనుకుంటాం. కాని, వాళ్ళని ఏ ఓల్డేజ్ హోమ్ లోనో పడేయాలనుకోకుండా, వాళ్ళని మనమే చూసుకోవాలి. మనతోనే ఉంచుకోవాలి. ఎందుకంటే, మనం కూడా తల్లితండ్రులం అవుతాం కదా! ముసలివాళ్ళం అవుతాం కదా!.. మనల్ని మన పిల్లలు అలా చేస్తే! అని మనం కూడా ఆలోచించాలి. మనం కూడా ఇలాగే బాధపడాల్సి వస్తుంది కదా! మరి.. ఈ ‘చిన్న లాజిక్’ తెలిసి కూడా ఎందుకో వాళ్ళమీద మనం, మనమీద వాళ్ళు చిరాకు పడుతూనే ఉంటాం.. ఇది ‘లైఫ్ సైకిల్’ అని మనసులో నవ్వుకుంది నిత్య.

సాయంత్ర ఆరు దాటింది.. “నిత్యక్కా, మా మేనల్లుడు వస్తే ఈ తాళాలు ఇవ్వు.. తపస్విని బయటకు తీసుకెళ్తున్నాం” అంటూ వచ్చింది పక్కింటి రాధిక.

“అబ్బో.. మొత్తానికి తపస్వి గట్టిదే.. సాధించింది” అంది నిత్య.

“ఏం చేస్తాం నిత్యా.. పిల్ల బాధ పడితే చూడలేక.. అయినా, పిల్లల కోసం కాకపొతే.. ఎవరికోసం ఈ సంపాదన చెప్పు నిత్యా.. వాళ్ళు అడిగింది ఇవ్వకుంటే ఎలా?” అంది రాధిక.

“అవునవును.. అదీ నిజమే రాధికా” అంది నిత్య.

అత్తగారు ఉదయాన్నే నొచ్చుకుంటూ అన్న మాటలు నవీన్‌తో చెప్పి, “నవీన్.. ఇదేమి బాగాలేదు మీరు ఈ వారమే లీవ్ పెట్టి వాళ్ళని వాళ్ళ స్నేహితుల వద్దకు తీసుకువెళ్ళాల్సిందే”.. అంది నిత్య

“తప్పదా!”

“తప్పదు నవీన్.”

“సర్లే తప్పుతుందా!” అన్నాడు.

ఉదయాన్నే లేచి.. వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిన నవీన్..

“నాన్నా, ఒక గంటలో బయలుదేరుదాం. రడీగా ఉండండి. ఆనంద రావు అంకుల్ దగ్గరకి తీసుకు వెళ్తాను” అనగానే.. వాళ్ళ ముఖాల్లో ఆనందం వెళ్లి విరిసింది ఒక్కసారిగా.

‘అయ్యో! అడిగిన వెంటనే ఆఫీస్‌కు సెలవు పెట్టి తీసుకు వెళ్తే.. ఇంత సంతోషం వాళ్ళ ముఖాల్లో చూసి ఉండేవాడిని.. అనవసరంగా కుదరదని చెప్పి వాళ్ళ మనసుని బాధ పెట్టాను’ అని నొచ్చుకుంటూ.. తానూ రడీ అయ్యాడు.

ఆనంద రావు అంకుల్ అంటే ప్రాణం అమ్మకి, నాన్నకి. ఎందుకంటే వీళ్ళ పెళ్లి ఆయనే దగ్గరుండి చేసాడని, పైగా బాల్య మిత్రుడు. ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. ఆయనకీ ఈ మద్య ఆరోగ్యం అంత బాగాలేదు అన్నారు. తీసుకుని వెళ్తే కాసేపు ఆయనతో ఆయన కుటుంబంతో గడుపుతారు అనుకున్నాడు నవీన్.

వాళ్ళ ముఖాలు ట్యూబ్ లైట్‌లా వెలిగిపోతున్నాయి. పాపం మిత్రుడిని కలసుకోవాలని ఎంత ఆత్రుత ఉందో. సరదాగా అత్తయ్య మామయ్యలను కారు ఎక్కించి.. “అక్కడ భోజన సదుపాయాలూ ఉండచ్చు లేకపోవచ్చు, అంకుల్‌కి మీకు కూడా సరిపడా భోజనం పెట్టాను. వెళ్ళగానే బయటకి తీసి పెట్టండి” అంటూ జాగ్రత్తలు చెప్పి పంపుతూ.. “వేగంగా వచ్చేయండి. ఆనంద రావు అంకుల్ని వారి అబ్బాయిని, కోడల్ని అడిగినట్టు చెప్పండి” అంటూ సాగనంపింది నిత్య. హమ్మయ్య!.. మళ్ళీ ముగ్గురు ఒకటయ్యారు. ‘ఇది కదా సంతోషం’ అనుకుంటూ తలుపు వేసుకుని సోఫాలో కూలబడింది నిత్య.

***

“ఒరే.. నవీన్ నువ్వు ఇబ్బంది పడనంటే ఒక మాట.. ఈ రోజంతా ఆనందరావుతో గడపాలని ఉందిరా!” అన్నాడు తండ్రి జగన్నాథం.

“సరే నాన్నా.. మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారో ఫోన్ చెయ్యండి. వీలయితే నేనే వచ్చి తీసుకెళ్తా.. లేదంటే నిత్యని పంపుతాను సరేనా!” అన్నాడు నవీన్.

“ఆ.. అలాగే” అంటూ ఆనందరావు అంకుల్ ఉండే మేడమీదకి అమ్మా నాన్నని మెల్లిగా ఎక్కించి.. అంకుల్‌కి ఓసారి కనిపించి వెళ్దామని వాళ్ళ వెనకాల వాళ్ళతో పాటు వెళ్ళాడు నవీన్.

చిందర వందరగా ఉన్న ఇల్లు, తిన్న ప్లేట్లు గ్లాస్‌లు, మంచి నీళ్ళ బాటిల్స్, మంచం మీద నిస్సత్తువుగా పడి ఉన్న ఆనందరావ్.. మెల్లగా శరీరంలో శక్తిని కూడగట్టుకుని, కళ్ళద్దాలు సవరించుకుంటూ లేచి..

“ఎవరు?.. ఇక్కడకు వచ్చింది” అని మెల్లిగా అన్నాడు.

ఇంతలో ఏదో స్ఫురణకు వచ్చిన వాడిలా.. “జగ్గూ నువ్వా! జగ్గు.. జగ్గు.. నన్ను చూడడానికి వచ్చావా!.. సావిత్రిని తీసుకుని మరీ వచ్చావా! నిజమేనా!.. నిజమేనా!”.. అంటూ లేని ఓపికని తెచ్చుకుంటూ లేచి కౌగలించుకున్నాడు.

ఇంతలో సావిత్రమ్మ మూలన ఉన్న చీపురు పట్టుకుని ఇల్లంతా ఊడ్చుతూ.. “కోడలు పిల్ల ఊర్లో లేదా!” అంది.

“ఏమో! నాకేం తెలుసు” అన్నాడు ఆనంద రావ్.

“అంకుల్ బాగున్నారా!” అని కౌగలించుకున్నాడు నవీన్.

“బాగున్నా.. ఎంతైనా చాలా అదృష్టవంతులు వీళ్ళు.. నా కోసం నువ్వు వాళ్ళని తీసుకువచ్చావ్ చూడు మనసు ఉప్పొంగి పోతోంది అనుకో” అన్నాడు ఆనందరావ్ సంబరంగా.

“ఈ ఫోన్‌లో సీతమ్మ హోటల్ నంబర్ ఉంటుంది చూడు. చేసి నాకివ్వు.. మంచి భోజనం తయారు చెయ్యమని చెబుతా..” అన్నాడు ఆనంద రావు

“అంత శ్రమ అవసరం లేదు.. మీకు కావలసిన ఫుడ్ నిత్య ప్రిపర్ చేసి పెట్టింది. హాయిగా కబుర్లు చెప్పుకోండి అంకుల్” అంటూ కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయాడు నవీన్.

“నీ కొడుకు, కోడలు చాల మంచి వాళ్ళు రా! కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నా కోడలు, కొడుకు పైన ఉన్న నన్ను చూసి ఎన్ని రోజులైందో! భోజనం తెచ్చి పనమ్మాయి ఇక్కడ పెడుతుంది.. ఆకలేస్తే తింటాను, లేకుంటే లేదు” అంటూ తన బాధ వెళ్ళగక్కుకున్నాడు ఆన౦దరావ్. అలా ఆ రోజంతా అక్కడే ఉన్నారు.. స్నేహితులిద్దరూ మనసారా కబుర్లు చెప్పుకున్నారు.. “చాలా సంతృప్తిగా ఉందిరా.. మళ్ళీ కలవగలమో! లేదో?” అన్నాడు ఆనoదరావు.

“అదేంటి అలా అంటావ్.. ఎన్ని శ్వాసలతో మనం ఇక్కడ ఉండాలో.. అంతవరకూ ఉండాలి కదా! బాధ పడకురా” అన్నాడు జగన్నాథం.

సాయంత్రం అయిపొయింది.

నవీన్ వచ్చి జగన్నాథం, సావిత్రమ్మలను తీసుకు వెళ్ళిపోయాడు.

‘అమ్మా, నాన్నా చాలా సంతోషంగా ఉన్నారు.. ఒకవేళ నేను తీసుకుని వెళ్ళకపోయి ఉంటే.. పాపం చాలా బాధ పడేవాళ్ళు కదా!.. ఈ మాత్రానికే నేను వాళ్ళ మీద అరిచాను.. ఛ.. ఛ.. ఎంత మూర్ఖత్వం నాది’ అని మనసులో అనుకున్నాడు నవీన్.

‘పోనీలే.. ఈ వారమంతా నాకు క్యాంప్‌లు ఉంటాయి.. ఇప్పుడు కాకపోయుంటే.. తీసుకు వెళ్ళడానికి అయ్యేది కాదు. పైగా ‘నేను’ తీసుకెళ్లడం అయ్యేది కాదు.. నిత్య అన్నట్టు వాళ్ళని తీసుకుని వెళ్లి మంచి పని చేసాను’ అనుకున్నాడు మనసులో నవీన్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here