ఆపరేషన్ సక్సెస్ – పేషంట్ డైడ్!

2
5

[box type=’note’ fontsize=’16’] చరిత్ర పాఠాలు నేర్పడానికి ప్రైవేటు మాస్టారుని ఏర్పాటు చేసుకుంటే… ఆయన దగ్గరనుంచి ఆ ఇల్లాలు ఏం నేర్చుకుందో మాలాకుమార్ కథ “ఆపరేషన్ సక్సెస్ – పేషంట్ డైడ్!” చెబుతుంది. [/box]

[dropcap]బ[/dropcap]యట మాటలు వినిపిస్తూంటే, ఎవరో వచ్చారు అని, ఏమండీ గారి స్టాండింగ్ ఇంస్త్రేక్షషన్స్ ప్రకారం, నీళ్ళ గ్లాస్ ట్రే లో పెట్టుకొని బయటకు వచ్చాను. అక్కడ పంచెకట్టుతో, నుదుటన కుంకుమ బొట్టుతో ఉన్న ఒక పెద్దాయన కూర్చొని ఏమండీ గారితో మాట్లాడుతున్నారు. ఆయనకు నీళ్ళిచ్చి ఏమండి పక్కన కూర్చున్నాను. “మా ఆవిడండి. బియే ఫైనల్ ఇయర్ చదువుతోంది” అని నన్నూ, “మహదేవ్ గారు అని తెలుగు పండితులు. ఈ మధ్యే తెలుగు మాస్టారిగా రిటైర్ అయ్యారు” అని ఆయనను నాకూ పరిచయం చేసారు.

“నీ గ్రూప్ ఏమిటమ్మా?” అని అడిగారు మాస్టారు.

“ఇంగ్లిష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ”అండి అని వినయంగా సమాధానం ఇచ్చాను.

ఆయనకు ఐదుగురు పిల్లలట. ఒక్క అమ్మాయి పెళ్ళే అయ్యిందిట. ఇంకో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారుట. ముగ్గురు మొగపిల్లలు చిన్నవాళ్ళుట. రిటైర్ ఐనా ఇంకా పాఠాలు చెప్పగలిగే ఓపిక ఉందండి. ఎక్కడైనా ప్రైవేట్ లైనా చూపించండి. లేదా చిన్న ఉద్యోగం ఐనా ఇప్పించండి అని అడుగుతున్నారు. పాపం పెద్దవాడు, ఇబ్బందులల్లో ఉన్నాడు. ఏమండీగారు ఏమంటారో అని జాలిగా, టెన్షన్‌గా చూస్తున్నాను. కాసేపు ఏమండీ నిశబ్దంగా ఉండి, “ప్రస్తుతం నా దగ్గర ఉద్యోగాలేమీ లేవు. ఇంకెక్కడైనా చూస్తాను. అప్పటి వరకు మా ఆవిడకు ట్యూషన్ చెప్పండి” అన్నారు.

నేను ఉలిక్కిపడ్డాను. ఇదేమిటినా నెత్తినే బండ వేసారు. ఈయన నాకు చెప్పే ట్యూషన్ ఏమిటి అని కంగారుగా “నాకు తెలుగు సబ్జెక్ట్ లేదు కదండి” అన్నాను.

వెంటనే మహదేవ్ గారు “పరవాలేదమ్మా, నేను ఇంగ్లీష్ చెప్పలేను కాని, పొలిటికల్ సైన్స్, హిస్టరీ చెప్పగలను” అన్నారు.

 ఏమండీ గారు “సరే అవే చెప్పండి” అన్నారు.

నా మొహం పొలిటికల్ సైన్స్‌కు, హిస్టరీకి ప్రైవేట్ ఏమిటి? ఎవరన్నా విన్నా నవ్వుతారు అని అయోమయంగా చూస్తున్నాను.”సరేనండి. రేపు మంచి రోజే. రేపటి నుంచి మొదలుపెడదాము. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఓ కునుకు తీసి నాలుగింటి వస్తాను” అనేసి మహదేవ్ గారు వెళ్ళిపోయారు.

ఆయన అటెళ్ళగానే “ఈ ప్రైవేట్ ఏమిటండి?” అన్నాను.

“పోనిద్దూ పెద్దవాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ఊరికే ఇస్తే డబ్బులు తీసుకోడు. ఏదో కాస్త సాయం చేసినట్లుగా ఉంటుంది. రోజుకో గంట చెప్పించుకో.మునిగిపోయిందేముంది?”అనేసారు.

ఏడుపు మొహంతో ఏమనలేక చూస్తూ ఉండిపోయాను!

మరునాడు కాలేజ్‌లో మధ్యాహ్నం మొదలు కాబోయే ప్రైవేట్ ఎట్లా తప్పించుకోవాలా అని తల బద్దలుకొట్టుకుంటూ, తప్పించుకునే దారి దొరకక దేభ్యమొహంతో ఓ పక్కన కూర్చొని గోళ్ళు కొరుక్కుంటూ ఉంటే, రాణి వచ్చి “ఏమైందే మీ ఏమండీ గారితో దొబ్బులులేమైనా తిన్నావా?” అని పలకరించింది.

“నీ మొహం. దొబ్బులు కాదు, ట్యూషన్ పెట్టారు హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో. ఎట్లా ఎగ్గొట్టాలో తెలీక చస్తున్నాను” అన్నాను విసుగ్గా.

“అబ్బ. ట్యూషనా, నేనూ చేరనా? ట్యూషన్ అంటే నా కెంత ఇష్టమో. మా అమ్మ వద్దంటుంది. ప్లీజ్ ప్లీజ్ నేనూ వస్తానే” అన్నది సంబరాలు పడిపోతూ.

ఇదేమిటి అంత సంతోషిస్తోంది? ట్యూషన్స్ అంటే ఇష్టం ఏమిటి దాని బొంద. ఎక్కడ దానికన్నా నాకు ఎక్కువ మార్కులొస్తాయో అని ఏడుపు అని మనసులో అనుకొని “సరే ఏడు” అన్నాను చిరాగ్గా.

లంచ్ కాగానే మా కార్ గారేజ్‌లో ఓ పక్కగా టేబుల్, మూడు కుర్చీలు వేసాను. భోజనం కానిచ్చి హాస్టల్ నుంచి రాణి కూడా వచ్చింది. చిన్నగా నాలుగింటికి మాస్టారు గారు వచ్చారు. రాణీ కూడా ట్యూషన్‌లో చేరుతోందని సంతోషించారు. కుర్చీలో కూర్చోవటానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించి “మాష్టారూ ఏమైందండి?” అని అడిగాను. ఆ అడగటం ఎంత పొరపాటో తెలుసుకునేసరికి సమయం నా చేతుల్లో నుంచి జారిపోయింది!

“ఏం లేదమ్మా! ఈ రోజు మా చెల్లెలి స్నేహితురాలు నన్ను భోజనానికి పిలిచింది. చక్కగా పీట వేసి, అరిటాకు మీద వడ్డించింది. ఏదో పెద్దవాడిని కదా, నాకూ కొన్ని నియామాలు ఉన్నాయి. ఒక్కోరోజు ఒక్కో నియమం పెట్టుకుంటాను. ఈ రోజు భోజనం చేసేటప్పుడు, ఏది పారేయకూడదనీనూ, అంటే ఏం లేదమ్మాయి కరివేపాకు, పచ్చిమిరపకాయ లాంటివి తీసి పడేస్తాము కదా అవి ఈ రోజు పారేయనన్నమాట. ఇంకా వాళ్ళు వడ్డించనవి కాదనకుండా తినేయాలి అన్న నియమాలున్నాయన్నమాట. మాములుగా ఎవరు భోజనానికి పిలిచినా వాళ్ళు అడుగుతారు ఏమైనా నియమం ఉందా అని, ఆవిడ అడగలేదు నేను చెప్పలేదు. చక్కగా వంకాయ పూర్ణం, మామిడికాయ పప్పు, కొబ్బరిపచ్చడి, అప్పడాలు, వడియాలు అదిరిపోయాయనుకో. ఎంత రుచిగా ఉన్నా మరీ ఎక్కువగా తినలేముగా. పులుసు వేయమని సైగ చేసాను. వేడి వేడిగా, మునక్కాడ ముక్కలతో, ఘుమఘుమలాడుతున్న పులుసు వడ్డించింది. ఏదీ పారేయకూడదు కదా అందువల్ల మునక్కాడ తొక్కలు కూడా కష్టపడి తినేసాను. ఆవిడ నాకు ములక్కాడలు ఇష్టమనుకొని నేను వారించే లోపలే ఇంకాసిని, మరిన్ని ములక్కాడ ముక్కలు వడ్డించేసింది. అవి తినలేను, పారేయలేను, వద్దని చెప్పలేను. ఏం చెప్పను నా ఇబ్బంది అవన్నీ పారయకుండా, తొక్కలతో సహా తినేసరికి కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయనుకో! మొత్తానికి ఎలాగో పూర్తి చేసి, ఇంటికెళ్ళి కాసేపు పడుకొని వచ్చాను.ఐనా ఇంకా ఇబ్బంది తగ్గలేదు.”అన్నారు దీనంగా.

“ఇలా భోజనాలకి కూడా నియమాలుంటాయా మాష్టారూ?” అడిగింది రాణి.

“అవునమ్మా మన పెద్దవాళ్ళు కొన్ని నియమాలు పెట్టారు కదా! రాను రాను ఎవరూ వాటిని పాటించటంలేదు. భోజనం చేసేటప్పుడు కబుర్లు చెప్పకుండా ప్రతి మెతుకూ ఆస్వాదిస్తూ తింటే చక్కగా అరిగి, వంటికి పడుతుంది. కొంతమంది ఇళ్ళాళ్ళు పెద్దవాళ్ళను, దంపతులను పిలిచి భోజనం పెడితే పుణ్యం అని భోజనానికి పిలుస్తుంటారు. ఇప్పుడు నేను రిటైర్ ఐయి ఖాళీగా ఉన్నాను కదా పిలుస్తుంటారు” అని నీరసంగా చెప్పారు.

ఇంకాసేపు అవే కబుర్లు చెప్పి, రేపటి నుంచి పాఠాలు చెప్పుకుందామమ్మా అని వెళ్ళిపోయారు!

మరునాడు వస్తూనే “మా బుజ్జిగాడికి మూడోనెల వచ్చిందమ్మా, ముచ్చటగా ముద్దలిప్పించారు” అన్నారు మాష్టారు సంబరపడిపోతూ.

“బుజ్జిగాడెవరండీ మాష్టారూ? ముద్దలింపించటమంటే ఏమిటండి?” అడిగింది రాణి.

“మా పక్క వాటాలో అద్దెకున్నవాళ్ళ బాబమ్మా. బుజ్జి వెధవ ఎంత ముద్దొస్తున్నాడో! పిల్లలు పుట్టినప్పటి నుంచీ వేడుకలూ, సంబరాలే కదా! బారసాలతో మొదలనుకో! మూడో నెల రాగానే కొంత మంది వెన్న ముద్దలిస్తారు. కొంతమంది నువ్వు ముద్దలు ఇలా వాళ్ళ ఇష్టం బట్టి ఇస్తారు. మా బుజ్జిగాడితో వెన్నముద్దలిప్పించారు. తెల్లగా మెరిసిపోతూ, సువాసనతో అప్పుడే తీసిన వెన్న ముద్ద పెద్ద వెండి గిన్నెడు ఇచ్చారు.” . . . .

అలా అలా సాగిపోయింది మాష్టారుగారి వాక్ప్రవాహం. రాణి ఒక్కతే కూతురు. పైగా వాళ్ళ అమ్మ ఉద్యోగం చేస్తూ ఉండటంతో ఎక్కువగా ఏ వేడుకలకూ వెళ్ళలేదు. చూడలేదు. అంచేత ఏమీ తెలీవు. దానితో ఇవన్నీ సరదాగా ఉన్నాయి. చాలా ఆసక్తిగా వింటోంది. నేనేమో మాటిమాటికి నా చేతి గడియారంలో టైం చూసుకుంటూ పాపాయికి పాలు పట్టే వేళైంది గాభరాపడుతున్నాను .

“సరేనమ్మా రేపు రాజకీయ శాస్త్రం చెప్పుకుందాం” అని వెళుతూ వెళుతూ ఆగి, “అన్నట్లు రేపు నాకు మౌనవ్రతం. అందుకని రాను. ఎల్లుండి రాజకీయ శాస్త్రం చెప్పుకుందాం” అన్నారు.

సరే అన్నట్లు అయోమయంగా తలూపాను నేను!

ముచ్చటగా మూడోరోజు కాదు కాదు నాలుగో రోజు వచ్చారు మాష్టారు కాస్త భారంగా.”అమ్మాయిలూ ఈ రోజు మా ఆవిడ చింతకాయపచ్చడి చేసింది. భలే రుచిగా ఉండి కాస్త ఓ ముద్ద ఎక్కువ తిన్నాను. కొత్త చింతకాయలు వస్తున్నాయా! అవి కాస్త వగరుగా కాస్త పుల్లగా ఉంటాయా! ఆ పిందెలతో పచ్చడి చేస్తే …”

దేవుడా ఇక ఈ రోజు చింతకాయపచ్చడి ప్రహసనం అన్నమాట. రాణి నోరెళ్ళబెట్టుకొని వింటోంది.

మాష్టారు చింతకాయపచ్చడి గురించి వివరించి వివరించీ “మీ పుస్తకాలు తీయండమ్మా” అన్నారు భుక్తాయసంతో కునికిపాట్లు పడుతూ.

నా మొహం ఇంకేం పుస్తకాలు, ఆయన అప్పుడే కుర్చీలో చేరగిలిపోయారు!

ఇలా కాదని ఆ రోజు మా ఏమండీతో” ఏమండీ ఆయన కథలూ కబుర్లూ తప్ప పాఠాలేమీ చెప్పటం లేదు. ప్రైవేట్ వద్దండీ.”అని నసుగుతూ చెప్పాను.

“పాపం ఐదుగురు పిల్లలు, మంచివాడు, ఊరికే సాయం చేస్తే తీసుకోడు. కబుర్లేగా కాసేపు వింటే పోలా” అని చప్పరించేసారు.

హూం ఇంకేం చేస్తాను. బుజ్జిగాడి మూడోనెల ముద్దల్తో మొదలై, బోర్లాపడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు, మధ్య మధ్య భోజనాల భుక్తాయసాలతో, బుజ్జిగాడికి పలుకులొస్తే పంచదార చిలకల దాకా సాగి, మా పరీక్షలొచ్చేసాయి.

మొదటి పేపర్ ఇంగ్లీష్ లిటరేచర్ సంతృప్తిగా రాసాను. తరువాత చరిత్ర పేపర్ ముందుపెట్టుకొని కూర్చుంటే, మునక్కాడలూ, చింతకాయపచ్చడి తప్ప ఏమీ గుర్తురాలేదు! ఎప్పుడో చదివినవి కొద్దిగా గుర్తొస్తే అవే రాసి వచ్చాను. ఆ తరువాత పాల్టిక్స్ పేపర్ రాద్దామంటే బుజ్జిగాడి వేడుకలు అరిసెలు, బొబ్బట్లూ తప్ప ఏమైనా గుర్తొస్తే ఒట్టు! పరీక్ష హాల్ నుంచి బయటకు వస్తే మా స్నేహితులంతా గలగలా కబుర్లు చెప్పుకుంటూ పరీక్షలైపోయాయి కదా సినిమాకు పోదాం అని ప్లాన్‌లు వేస్తున్నారు. రాణి ఏదా అని చుట్టూ చూస్తే ఓ చెట్టు కింద కనిపించింది. నేను అటెళ్ళగానే నన్ను చూసి భోరుమంది. ఇద్దరమూ ఒకళ్ళనొక్కళ్ళు వాటేసుకొని కాసేపు ఏడ్చి, పైటకొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఇంటిదారి పట్టాము.

రిజల్ట్స్ సంగతి ఇక వేరే చెప్పేదేముంది? ఝాటర్ ఢమాల్! మార్క్స్ తెచ్చుకోవటానికి వెళ్ళక తప్పదుగా! మార్క్స్ షీట్ తీసుకొని మరోసారి నేనూ, రాణీ కాసేపు కళ్ళుముక్కూ ఎగబీల్చాము. మాష్టారుగారి దగ్గర నేర్చుకున్న మౌనవ్రతం పాటిస్తూ, నా మార్క్స్ షీట్ తీసుకెళ్ళి ఏమండీకి ఇచ్చాను. నా మార్క్ షీట్ చూసి ఏమండి కాసేపు గడ్డం కింద రాసుకుంటూ ఉండిపోయారు! ఆ మౌనం చూసి భయం వేసి నత్తి నత్తిగా నసుగుతూ “ఏమండీ, పరీక్షలో మాష్టారు చెప్పిన బొబ్బట్ల వంటకం, చింతకాయ తయారీ, అవీ తప్ప పాఠాలు ఏవీ గుర్తు రాలేదు. అందుకని…” నసుగుతున్న నన్ను చూసి,

“ఐతే మీ మాష్టారు వంటలు బాగా నేర్పారన్నమాట. అందుకే ఈ మధ్య వంటలు బహు రుచిగా ఉంటున్నాయి. ఏదోవొకటి నేర్పారుగా” అంటూ పెద్దగా నవ్వేసారు.

బాగుంది హూం అనుకుంటూ నిట్టుర్చాను. ఏమైతేనేం యూనివర్సిటీలో చరిత్రలో యం.ఏ చేయాలి, యూనివర్సిటీలోని పెద్ద లైబ్రరీలోని పెద్ద పెద్ద పుస్తకాలు చదుకోవాలి అన్న నా కలలు కలలుగా చరిత్రలో కలిసిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here