[గోనుగుంట మురళీకృష్ణ గారి ‘మరణ సమయం’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]రణ సమయంలో మనిషి మానసిక పరిస్థితి ఏమిటి? ఎలా ఉంటుంది? తినలేక, తాగలేక, కదలాలనిపించినా కదలలేక కొట్టుమిట్టాడుతూ ఉంటాడా! ఏమో! తెలియదు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నవాడు తన మానసిక పరిస్థితి గురించి మనతో వివరంగా చెప్పలేడు. అసలు ఆ స్థితిని చూడటానికి మనం ఇష్టపడము. అవతలకి వెళతాము. వార్త తెలిసిన తర్వాత చూడటానికి వస్తాము. మరణించిన తర్వాత ఆ జీవి ఏమైపోతుంది? ఎక్కడికి వెళుతుంది? అప్పుడు భార్యాపిల్లలు, అన్నదమ్ములు, స్నేహితులు అందరూ గుర్తుంటారా! ఏమో! అది కూడా చెప్పలేము. ఎందుకంటే పైకి వెళ్ళినవాడు తిరిగి వచ్చి మనతో చెప్పడు కనుక! అసలు ఇలాంటి విషయాలు ఆలోచించటానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే శరీరం మీద మమకారం ఉన్న వారందరికీ మరణభయం వెంటాడుతూ ఉంటుంది. శరీరం మీద మమకారం లేని సర్వసంగ పరిత్యాగులు మాత్రం పాత వస్త్రాన్ని విడిచినట్లు ఈ దేహాన్ని సునాయాసంగా విడిచేస్తారు. వ్యాసమహర్షి, వాల్మీకి మహర్షి వంటి మహాయోగులు మానవుడి చివరి సన్నివేశం కళ్ళతో చూడకపోయినా తపోశక్తితో గ్రహించి గ్రంథాలలో తెలియజేశారు.
అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరకు బాణాలు పెరికివేయటంలో నిపుణులు అయిన వైద్యులు తమ పరికరాలతో పాటు చికిత్స చేయటానికి అక్కడకు వస్తారు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో “ఈ దశకు చేరుకున్నాక నాకు వైద్యులతో పనేముంది? వీరిని పంపించివేయి” అని చెబుతాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు ధర్మరాజుకి అనేక రాజధర్మాలు ఉపదేశించి, శ్రీకృష్ణుడిని స్తుతించి, ఈ దేహాన్ని విడిచి పెట్టటానికి భగవానుడి అనుమతి కోరతాడు. అనంతరం కొంతసేపు మౌనంగా ఉండి, మనసుతో పాటు ప్రాణవాయువును కూడా నిరోధిస్తాడు. ఇలా యోగక్రియ ద్వారా నిరోధించబడిన భీష్ముడి ప్రాణం క్రమంగా పైకి లేచి, ఒక్కొక్క శరీర భాగాన్ని విడిచిపెడుతూ ఉంటే ఆయా భాగాలలో గుచ్చుకున్న బాణాలు వాటంతట అవే ఊడిపోతూ, ఆ గాయాలు పూడిపోతూ ఉంటాయి. ఇలా అక్కడ ఉన్న వారందరూ చూస్తూ ఉండగానే శరీరం మొత్తం బాణరహితం అయిపోతుంది. చివరికి ఆయన ప్రాణవాయువు శిరసుని (బ్రహ్మరంధ్రాన్ని) ఛేదించుకుని ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో దేవతలు దుందుభులు మ్రోగిస్తారు. పూలవాన కురిపిస్తారు. మహర్షులు సాధువాదాలు చేశారు. భీష్ముడి ప్రాణం ఉల్కలా ఆకాశంలోకి ఎగిరివెళ్లి అంతరిక్షంలో విలీనమైపోతుంది. ఇదంతా క్షణకాలంలో లోనే జరిగిపోతుంది. ఆ విధంగా కురుకుల పితామహుడు జీర్ణవస్త్రంలా మానవదేహాన్ని విసర్జించేస్తాడు. కుమారుడి మరణానికి శోకిస్తున్న గంగాదేవితో శ్రీకృష్ణుడు “నీ కుమారుడు వశిష్ఠమహర్షి శాపం వలన భూలోకంలో జన్మించిన అష్టవసువుల్లో ఒకడు. ఇప్పుడు శాపవిమోచనం అయి అత్యుత్తమ లోకాలకు వెళ్ళాడు. అతడిని గురించి చింతించటం తగదు” అని ఓదార్చుతాడు.
రామాయణంలో శబరి తపస్సిద్ధురాలు. రామదర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై వచ్చినప్పుడు అతిధి సత్కారాలు చేసి, “పురుషోత్తమా! నిన్ను పూజించే భాగ్యం కలగటం వలన నా జన్మ ధన్యమైనది. ఇక నీవు అనుమతిస్తే పునరావృత్తి రహితమైన పరంధామాన్ని పొందుతాను” అని చెబుతుంది. “అమ్మా! భక్తితో నువ్వు చేసిన పూజలకు నేను ఎంతో సంతోషించాను. నీ ఇష్ట ప్రకారమే చేయి” అని అంటాడు. అప్పుడు ఆమె అగ్ని రగిల్చి అందులో తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. వెంటనే ఆమె దివ్యదేహంతో అగ్నిలో నుంచి పైకి లేచి, దివ్యమైన ఆభరణాలతో, సుగంధ లేపనాలతోను, అద్భుతమైన వస్త్రాలు ధరించి విద్యుల్లత లాగా మెరుస్తూ, ఆ ప్రదేశమంతా ప్రకాశవంతం చేస్తూ పుణ్యలోకాలకు వెళ్ళిపోతుంది.
అదేవిధంగా శరభంగ మహర్షి కూడా – బ్రహ్మదేవుడి ఆజ్ఞపై ఇంద్రుడు స్వయంగా భూమికి దిగివచ్చి బ్రహ్మలోకానికి మహర్షిని ఆహ్వానించినా వెళ్ళడు. రాముడిని దర్శించిన తర్వాతే వస్తాను అని చెబుతాడు. రాముడిని కళ్ళారా చూసిన తర్వాత “రామా! నిన్ను దర్శించటం కోసమే ఈ శరీరంతో ఇప్పటిదాకా ఉన్నాను. ఇప్పుడు నిన్ను దర్శించి ధన్యుడను అయ్యాను. ఇక పాము కుబుసము విడిచినట్లుగా ఈ శరీరాన్ని త్యజిస్తాను. అనుమతించు” అని ప్రార్థించి అగ్నిని ప్రతిష్ఠించి, బ్రహ్మ మంత్రాలను పఠిస్తూ అగ్నిలో ప్రవేశిస్తాడు. మహర్షి శరీరంలోని రోమాలు, కేశాలు, శిధిలావస్థకు చేరిన చర్మము, రక్తమాంసాలు, ఎముకలు క్రమక్రమంగా అగ్నికి ఆహుతి అయిపోతాయి. వెంటనే పదిహేను సంవత్సరాల వయసు బాలుడి రూపంలో అగ్నితేజస్సుతో విలసిల్లుతూ శరభంగ మహర్షి అగ్నిగుండంలో నుంచి బయటకి వచ్చి దివ్యలోకాలకు వెళ్ళిపోతాడు.
కబంధుడు అనే రాక్షసుడు తలలేని మొండెంతో ఇరుపక్కల రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టుకుని భక్షించబోతే రెండు చేతులు నరికేస్తారు ఆ అన్నదమ్ములు. చేతులు తెగటంతో భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్లు, దిక్కులు పిక్కటిల్లేటట్లు అరుస్తూ నేలమీద పడిపోతాడు. వారిద్దరూ రామలక్ష్మణులు అని తెలుసుకుని, ఇంద్రుడి మాటలు గుర్తు వచ్చి, శాపవశాత్తూ ఈ రూపం పొందానని, తనని గోతిలో ఉంచి దగ్ధం చేస్తే పూర్వరూపం వస్తుందనీ చెబుతాడు. ఆ ప్రకారంగా లక్ష్మణుడు పెద్దగొయ్యి తీస్తాడు. అన్నదమ్ములిద్దరూ అతడిని గోతిలో వేసి నిప్పు అంటిస్తారు. అగ్నిలో నుంచి స్వచ్ఛమైన, నిర్మలమైన వస్త్రాలు, దివ్యమైన పూలమాలను, సమస్తాభరణాలు ధరించి పొగలేని అగ్నిలా బయటకి వస్తాడు కబంధుడు. వారికి తగిన ప్రత్యుపకారం చేసి (సుగ్రీవుడితో సఖ్యం చేస్తే సీతను అన్వేషించటంలో సాయపడతాడు అని చెప్పి), హంసలు పూన్చిన దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు.
అంతేకాకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇలా చెబుతాడు.
“దేహినోస్మిన్ యథా దేహే, కౌమారం యౌవనం జరా
తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్త్రత్ర న ముహ్యతి”
(జీవులకు దేహము నందు బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఎట్లో మరొక దేహము పొందుట కూడా అట్లే! కనుక ఈ విషయము గురించి ధీరులు మోహము నొందరు.)
అంటే ఈ మార్పులన్నీ దేహధర్మములే గానీ ఆత్మ ధర్మములు కావు. కాబట్టి బాల్యం నుంచీ యవ్వనం లోకి, యవ్వనం నుంచీ వృద్ధాప్యం లోకి మారేటప్పుడు మనం ఎలా విచారించమో అలాగే ఈ దేహాన్ని వదలి వెళ్ళేటప్పుడు కూడా విచారించకూడదు. అది అత్యంత సహజమైన క్రియగా భావించాలి.
ఈ విధంగా పురాణాలలో, ఇతిహాసాలలో మానవుల అంతిమ క్షణాలను గురించి మహర్షులు ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. ఇలాంటి సబ్జెక్ట్ మీద ఎక్కువ మంది ఆసక్తి చూపించరు కనుక, ఈ వ్యాసాన్ని సంక్షిప్తంగానే ముగిస్తున్నాను.