చిలుకలు

0
4

[box type=’note’ fontsize=’16’] ప్రకృతిలో పక్షుల మధ్య జీవించడం ఎంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందో చెబుతున్నారు శాఖమూరి శ్రీనివాస్ “చిలుకలు” కథలో. [/box]

[dropcap]గో[/dropcap]పాలపురంలో ఉండే హమీద్ సన్నకారు రైతు. భార్య ఆయేషా, పిల్లలు రఫీ, నస్రీన్‌లు తన కుటుంబం. తనకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఒకరోజు ఉదయాన్నే పొలానికి వెళ్లాలన్న హడావుడిలో ఇంటిముందున్న బురదలో కాలు జారిపడ్డాడు. పడటంలో తన కుడిచేయి ముందుగా నేలను తాకింది. అది చూసిన వెంటనే పొలాలకు వెళుతోన్న వీధిలోని వారు తనను లేపి ఇంట్లోకి తీసుకెళ్లారు. నేలను తాకిన కుడిచేయి కాస్తా వాచి విపరీతమైన నొప్పి పుట్టసాగింది. ఆ చేతికి ఆయేషా వేడినీళ్ళ కాపడం కూడా పెట్టింది. కానీ క్షణక్షణానికి నొప్పి ఎక్కువవుతోందేకాని తగ్గలేదు.

“ఆయేషా ఈ నొప్పి తగ్గేలా లేదులే… రఫీని వెళ్లి రమణయ్యను పిలుచుకురమ్మని చెప్పు” నులక మంచంలో వాలుతూ హమీద్ నీరసంగా చెప్పాడు. రమణయ్య ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఆయుర్వేద వైద్యుడు. రఫీ వెళ్లేసరికి రమణయ్య ఇంటివద్దే ఉన్నాడు. విషయం అంతా విని తన మందుల పెట్టె తీసుకొని హమీద్ ఇంటికి వచ్చాడు.

చేతిని పరీక్షించి చూసి, “హమీదూ… చేయి ఎముక కాస్త చిట్లింది” అన్నాడు రమణయ్య.

“అయ్యో… ఎముక విరిగిందా? ఇక నా పరిస్థితి ఏంటి?” దీనంగా అన్నాడు హమీద్.

“నువ్వు మరీ అంత భయపడాల్సిందేమీ లేదు. చేతికి కట్టుకట్టించుకుని, ఒక నెలపాటు ఏ పనీ చేయకుండా విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది.”

“ఈ ఇబ్బంది తొందరగా తగ్గదా?”

“ఎందుకు తగ్గదు! నువ్వు ఈ దెబ్బను పట్టించుకోకుండా మామూలుగానే ఉండు. త్వరలోనే చెయ్యి మామూలుగా అవుతుంది” ధైర్యం చెప్పాడు రమణయ్య.

“పొలంపనులు నేను చూసుకుంటాలే, బెంగ పెట్టుకోకు” ఆయేషా భరోసాగా చెప్పింది.

రమణయ్య కొన్ని రకాల ఆయుర్వేద మూలికల రసం తీసి దెబ్బ తగిలిన చేతిపై పూసి, కదలకుండా చెయ్యి చుట్టూ వెదురుదబ్బలు ఉంచి గుడ్డతో కట్టు కట్టాడు.

“ఇంకో పక్షం రోజుల తర్వాత మరొకసారి మందు వేసి కట్టు కడతాను” అని చెప్పి రమణయ్య అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

ఒక గంట తర్వాత ఆయేషా పొలానికి, రఫీ నస్రీన్‌లు బడికి వెళ్లిపోయారు. నులకమంచంపై వెల్లకిలా పడుకున్న హమీద్ పైకప్పునే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికే చెయ్యి మళ్లీ నొప్పి పుట్టింది. అప్పుడే హమీద్‌ను పరామర్శించేందుకు పక్కింటి సుందరం వచ్చాడు.

“హమీద్.. చెయ్యి తొందరగానే బాగవుతుందిలే, బెంగ పెట్టుకోకు. ఎప్పుడూ ఆ పనీ ఈ పనీ చేసే నువ్వు కదలకుండా ఉండాలంటే ఇబ్బందిగానే ఉంటుంది.”

“అవును సుందరం…. రెండు రోజులు ఆగి పొలానికి వెళతాను. ఇలా ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం” చేతి నొప్పిని భరిస్తూనే మాట్లాడాడు హమీద్.

“ఈ సమయంలో నిన్ను ఇబ్బంది పెట్టానని అనుకోకుంటే, నాలుగు శేర్ల జొన్నలు అప్పు ఇవ్వు. ఓ వారంలో ఇస్తాను.” తన చేతిలోని సంచీని చూపుతూ అడిగాడు సుందరం.

“భలేవాడివే… అదిగో ఆ మూలనున్న జొన్నల గోతం నుంచి కొలుచుకొని తీసుకుపో. సోల (కొలిచే పాత్ర) కూడా పక్కనే ఉంది” జొన్నల సంచీని వేలితో చూపుతూ చెప్పాడు సుందరం. వెళ్లి సోలతో 4 శేర్ల జొన్నలు తన సంచీలో పోసుకున్నాడు సుందరం. అలా పోసుకునేటప్పుడు చేతికి కొన్ని జొన్నకంకులు తగిలాయి. వాటిని తీసి పక్కన పడేశాడు. పని పూర్తయ్యాక మళ్లీ పురికొసతో గోతాన్ని కట్టేసి వెళ్లిపోయాడు. సుందరంతో మాట్లాడుతున్నంతసేపూ చేయి నొప్పి అనిపించలేదు. అతను వెళ్ళిపోయాక నొప్పి మళ్లీ ఎక్కువైంది. ఆ నొప్పిని అలాగే ఓర్చుకుంటూ కళ్ళుమూసుకుని పడుకున్నాడు హమీద్. కాస్త కునుకుపట్టింది. కాసేపటికే మెలకువ వచ్చింది. మెలకువ రావడానికి కారణం ఒక చిలుక. అది కిటికీలోంచి వచ్చి పడేసిన జొన్నకంకులు తింటూ, మధ్య మధ్యలో చిన్న చిన్న శబ్దాలు చేయసాగింది

హమీద్ కళ్ళుతెరచి దానిని చూడసాగాడు. చిలుక ఒకటి రెండు గింజలు ముక్కుతో పొడుచుకుని తినడం, ఎగిరి కిటికీలోంచి బయటికి వెళ్ళడం, కాసేపటికి తిరిగి రావడం, మళ్ళీ తినడం చేస్తోంది. లేచి కూర్చుని చిలుక ఎక్కడికి వెళుతుందని చూశాడు. అది ఇంటి బయట ఉన్న తొట్టిలోని నీళ్లు ఒక్కొక్క గుక్క తాగి వస్తోంది. అది ఎగిరి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు చేసే రెక్కల చప్పుడు హమీద్‌కు ఎంతో సంతోషం కలిగించింది. అలాగే దాని ఆకుపచ్చటి శరీరం, ఎర్రటి మూతి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాయి. చిలుక చాలాసేపు హమీద్ ఇంట్లోనే ఉంది. ఒక కంకి మొత్తం పూర్తిగా తిని వెళ్లిపోయింది. చిలుక ఇంట్లో ఉన్నంతసేపూ దానిని చూస్తున్నంతసేపూ హమీద్ తన చేతి నొప్పిని మర్చిపోయాడు. చిలుక వెళ్ళిపోగానే నొప్పి మళ్లీ ప్రారంభమైనట్లు అనిపించింది

సాయంత్రం ఇంటికొచ్చిన ఆయేషాకు, పిల్లలకు చిలుక సంగతులు చెప్పాడు. వాళ్లకు కూడా చిలుక తిరిగొస్తే చూడాలనిపించింది. మరుసటిరోజు కూడా…. హమీద్ ఒంటరిగా ఉన్నప్పుడు చిలుక వచ్చింది.అయితే తనతో పాటు మరొక చిలుకను తోడు తెచ్చుకుంది. హమీద్ వాటికొరకు గుప్పెడు జొన్నలు తీసి నేలపై పోశాడు. ఇక రెండు చిలుకలు వాటిని తింటూ, తొట్లో నీటిని తాగుతూ హమీద్‌ను ఎంతగానో సంతోషపెట్టాయి. చిలుకలు రావడం ఆ రోజుతో ఆగిపోలేదు. రోజురోజుకూ వాటి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. హమీద్ కుటుంబం కూడా వాటికి ఆహారం నీళ్ళు ఏర్పరుస్తూ ఇబ్బంది రాకుండా చూసుకోసాగాడు. ఇప్పుడు కొన్ని పదుల సంఖ్యలో చిలుకలు హమీద్ ఇంటికి వస్తున్నాయి

ఓ పదిరోజుల తర్వాత విరిగిన చేతిని చూసేందుకు రమణయ్య వచ్చాడు. కట్టు విప్పి హమీద్ చేతిని నిశితంగా చూశాడు. ఆశ్చర్యం! హమీద్ చెయ్యి బాగయింది.

“హమీద్….నీకిక రెండవసారి చేతి కట్టు అవసరం లేదు. పూర్తిగా తగ్గిపోయింది. అయితే కొంతకాలం ఆ చేత్తో బరువులు ఎత్తవద్దు. ఇంత త్వరగా మానిపోవడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు రమణయ్య.

ఇంటికి రోజు వస్తున్న చిలుకలు… వాటితో గడిపినప్పుడు నొప్పి తెలియకపోవడం, సంతోషంగా ఉండడం,…. ఇవన్నీ త్వరగా కోలుకునేలా చేసి ఉంటాయని కుటుంబం భావించింది.

ఒకరోజు హమీద్ భార్యా పిల్లలతో మాట్లాడుతూ, “ఇంటికొచ్చే చిలుకలు ఎక్కువయ్యాయి. ఇరుగుపొరుగుకు వీటి వలన ఇబ్బంది కలగవచ్చు. మన నివాసాన్ని పొలంలోకి మార్చుకుంటే ఎలా ఉంటుంది?” అని అడిగాడు.

“పొలంలో ఉందామా! మాకు కూడా ఇష్టమే నాన్నా” పిల్లలిద్దరూ ఉత్సాహపడిపోయారు. ఆయేషా కూడా దానికి ఒప్పుకుంది. ఒక నెలలోనే హమీద్ పొలంలో ఒక చక్కటి గుడిసెను ఏర్పాటు చేయించాడు. కుటుంబమంతా ఊర్లోంచి పొలంలోని గుడిసెలోకి నివాసాన్ని మార్చింది. చిలుకలు కూడా వారిని అనుసరించాయి. రఫీ, నస్రీన్‌లు గుడిసె చుట్టూ ఉన్న స్థలంలో, చిలుకలు ఉండేందుకు చెక్కలతో చిన్న గూళ్ళను ఏర్పాటు చేశారు. ఒక ఎకరం పొలంలో పండే పంటనంతా చిలుకల ఆహారానికే వాడాలని నిర్ణయించుకున్నారు. చిలుకలు వారి కుటుంబంలో భాగంగా మారాయి. హమీద్ కుటుంబం చిలుకలు కలిసిమెలిసి జీవిస్తున్న సంగతి గోపాలపురం లోనే కాదు, చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో తెలిసింది. ఆ గ్రామాల ప్రజలు అప్పుడప్పుడు వచ్చి చిలుకలను చూసి కాసేపు మైమరచి, సంతోషపడి వెళ్లేవారు.

కొందరు ఉపాధ్యాయులు తమ విద్యార్థులను క్షేత్ర పర్యటనకు అక్కడికి తీసుకొచ్చేవారు. అలా వచ్చిన పిల్లలకు హమీద్ పొలంలోనే ఉండిపోవాలని అనిపించేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here