[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అడవుల్ని నరికేస్తూ
కాంక్రీట్ జంగిల్స్ నిర్మిస్తున్నారు!
అవసరానికి మించి
ప్రతి చిన్న పనికి ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు!
కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటు చేసి
వెదజల్లుతున్న రసాయనాలతో
నదీజలాలను విషతుల్యం చేస్తున్నారు!
రోడ్లపై విపరీతంగా వాహనాలు నడుపుతూ
కార్బన్ మోనాక్సైడ్ విడుదల చేస్తూ
స్వచ్చమైన గాలి రసాయనాల
మిళితం అవడానికి కారణమవుతున్నారు!
అడ్డూ అదుపు లేకుండా నిర్మాణాలు చేపడుతూ
నాలాలను, చెరువులను ఆక్రమిస్తూ
వరదలు రావడానికి కారకులవుతూ,
ప్రకృతి ప్రకోపానికి చేరువవుతూ
ఇబ్బందులు పడుతూ మానవులు జీవిస్తున్నారు!
ఓ మనిషి..
ప్రకృతిని పరిరక్షించుకున్నప్పుడే నీకు మనుగడ!
ఈ అనంత విశ్వంలో ప్రతి జీవి సంతోషంగా బతకాలంటే
ఆలోచించగల సామర్థ్యం గల,
ఎటువంటి పనినైనా బుద్ధితో
సాధించుకో గల నీకు మాత్రమే సాధ్యం!
ఓ మనిషి..
ఇకనైనా మారు..
మనిషిగా నీ కర్తవ్యాన్ని గుర్తించి
పర్యావరణ పరిరక్షణపై పాటుపడు!
రేపటి తరాల మేలుకై..
స్వచ్చమైన గాలి, నీరు, భూమి అందేలా కృషి చేయి!