సంక్లిష్టమైన జీవనయానానికి ప్రతీక హరీష్ కవిత

1
3

[ఇటీవల డా. తండ హరీష్ గౌడ్ గారి ‘గాలి లేని చోట’ కవితా సంపుటికి ‘రొట్టమాకు రేవు’ అవార్డు లభించిన సందర్భంగా, ఆ పుస్తకాన్ని శ్రీ గోపగాని రవీందర్ సమీక్షిస్తున్నారు.]

[dropcap]“ఇ[/dropcap]క్కడ/ఒకప్పుడు మనిషి ఉండేవాడు, అనే మాట తలుచుకుంటేనే భయమేస్తుంది/ పూర్వం/అడవిలోంచి మనిషి పుట్టాడు/ఇప్పుడు/మనిషిలోంచి పచ్చని అడవి పుట్టాలి” ఈ వాక్యాలు ‘ఒకప్పుడు అడవి ఉండేది’ అనే కవిత లోనివి. పర్యావరణ విధ్వంసం పట్ల కవి ఆక్రోశానికి సాక్ష్యం ఈ కవిత్వ పాదాలు. ప్రకృతిలోని సహజ వనరులను ఇష్టానుసారంగా ధ్వంసం చేసుకుంటూ పోతే భవిష్యత్ మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలను జారీ చేస్తున్నాడు కవి.

ప్రకృతి పట్ల, మానవ జీవనం పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన యువ కవి డాక్టర్ తండా హరీష్ గౌడ్. యాభై మూడు కవితలతో తన మూడో కవితా సంపుటిని ‘ గాలిలేని చోట’ అనే శీర్షికతో ఛాయ ప్రచురణగా వెలువరించారు. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సృజనకారునిగా, ఒక ఉన్నత విద్యావంతుడిగా ఈ కవితా సంపుటి ద్వారా బహు కోణాల్లో మనందరికీ దర్శనమౌతున్నాడు హరీష్. జీవనయానంలోని అనేక దుఃఖాలను భరిస్తూనే భరోసా కోసం బహువచనంలా పలకరిస్తున్నాడు. బాల్యపు జ్ఞాపకాలనే కాదు నడిచివచ్చిన దారుల్ని అక్షరీకరిస్తూ కవిత్వ సృజన రంగంలో యువ కవిగా ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆశావాహ జీవన యానానికి కవితా వాక్యాలతో పిలుపునిస్తున్నాడు కవి హరీష్.

నిత్యం మనకు సామాన్యుని బాధామయమైన బతుకు చిత్రాలు దర్శనమౌతుంటాయి. అనేక సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న కానీ చివరి శ్వాస వరకు ధైర్యాన్ని విడిచిపెట్టరు. ఆ మొండితనమే వాళ్ళలో జీవన కాంక్షను రగిలిస్తుంది. ఆ పేద ప్రజల దీనస్థితులకు కలత చెంది రాసిన కవితనే ‘తీరమొకటి కావాలి’. ఎక్కడ చూసినా వాళ్ళు మోసం కోరల్లో చిక్కిపోయి, కబ్జాదారుల దాడులతో నలిగిపోతున్న తీరును అక్షరాల్లో వర్ణించారు కవి. కష్టాల కడలి నుండి సేద తీరడానికి తీరమొకటి వాళ్ళకు కావాలని ఆకాంక్షిస్తున్నారు ఈ కవితా చరణాల ద్వారా కవి.

‘ప్రశాంత నది ఒడ్డున/తలదాచుకోవడానికి
తీరమొకటి కావాలిప్పుడు
తెలియని వైపుగా ఎగురుతున్న
ఈ గాలిపటపు జీవితానికి
దారమొకటి సహాయంగా రావాలి
మూలమూలన బరువెక్కుతున్న
జీవితాన్ని మోయడానికి
భుజాలు కావాలి/కాల కాలానికి
కొత్త రూపాన్ని సంతరించుకుంటున్న
బాధల చిరునామాను చెరిపేయడానికి
నేను కలలు కన్నా సౌదానికొక
ఆధారాన్నిచ్చే పునాదివయి
నాలాంటి నువ్వు/ఇక్కడే పాతుకుపోవాలి’

భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లోనే జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఒక ఉపాధ్యాయుడుగా విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే తపన కనిపిస్తుంది. ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థుల కుటుంబాల్లోని దయనీయమైన దుస్థితులను ఆవేదనాత్మకంగా రాస్తారు. తల్లిదండ్రులు ఇద్దరు పట్టణంలో ఉపాధి కోసం వలస పోతే, ఊర్లో నాయనమ్మ దగ్గర ఆకలితో ఉండలేక ఒక విద్యార్థి హాస్టల్‌కి పోతాను టీసీ ఇమ్మని అడిగినప్పుడు కరుణాత్మకమైన చూపుతో ‘మూలుగు రాగం’ కవితను మానవీయమైన స్పర్శతో రాశాడు కవి. ‘సారూ/జరా టీసీ ఇయ్యి/ముందైతే/ కంటి నిండ నిద్ర/కడుపునిండ బువ్వ దొరికే/తావుకు బోతన్నా/గొందిలో ప్రాణమున్నప్పుడే కదా/అక్షరంతో/మాట ముచ్చట కుదిరేది’ ఈ వాక్యాలతో కళ్ళల్లో నీటి తెరలు కమ్ముకుంటాయి.

కరోనా కాలంలో కొన్ని రోజులు పాఠశాలలో విద్యా బోధన జరగని కాలాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లాడిలా విలవిలాడుతాడు. పాఠశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రాంగణంలోని చింత చెట్టు గాలివానకు కూలిపోతే ఆ చెట్టుతో తనకున్న జ్ఞాపకాలను ‘ఊపిరి శకలం’, టీ షాట్ ద్వారా వస్తున్న డిజిటల్ పాఠాలు విద్యార్థులు వింటున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇల్లిలు తిరిగిన అనుభవాన్ని ‘న్యూ టైం టేబుల్’ కవితల్లో తలుచుకుంటారు. ఒక తెలంగాణ దినపత్రికలో ఉపాధ్యాయులను కించపరుస్తూ ప్రచురించిన వ్యాసానికి స్పందిస్తూ ‘సోకంటే’ వ్యంగ్యార్థాలతో కూడిన నిష్ఠూరమైన కవితను ఆగ్రహంతో రాశారు. ‘అక్షరం అక్షరం/అందంగా కూర్చుకొని/పిల్లల ముఖంలో నవ్వుల్ని/ఏరుకోవడమే/మాకు సోకంటే’ అని మొదలుపెట్టి ఒక ఉపాధ్యాయుడి పనితనాన్ని మొత్తం ఈ కవిత నిండా వ్యక్తం చేశారు. ‘ఇయ్యాల/నువ్వు రాసిన అక్షరాలను మనం చేసుకో/ఈ మాత్రం సోకే/నీ ఒడిలో అక్షరమై/నిన్నో దివ్వెగా మార్చిందన్న/విషయం గుర్తు తెచ్చుకో’ అంటూ సుతిమెత్తని మందలింపులతో ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ రాశారు.

సారవంతమైన సామాజిక నిర్మాణంలో కవులది,రచయితలది ప్రముఖమైన పాత్ర. సంక్లిష్టమైన సంక్షోభంలో కూరుకపోతున్న సమాజానికి దిశా నిర్దేశం చేయడానికి అవసరమైన రచనలను అందిస్తుంటారు. ఒక అర్థవంతమైన చైతన్యం అనేక మార్పులకు శ్రీకారమౌతుంది. అందుకనే సాహిత్యానికి సామాజిక చరిత్ర నిర్మాణంలో అగ్రస్థానం దక్కింది. సృజనకారుల భావాలు సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. కవిత్వాన్ని గురించి కవిత్వం రాయని కవులైతే సాహిత్యంలో నిలబడలేరు. అందుకు ఈ కవి కూడా మినహాయింపు కాదు. ఈ కవితా సంపుటిలో కవిత్వాన్ని గూర్చి ‘కవి, నా ప్రేయసి’ అంటూ రెండు ప్రేమ గీతాలను రాస్తాడు కవి. ‘నా ప్రేయసి’ కవితలోని వాక్యాలను గమనిస్తే కవిత్వంతో ఎంతగా ఈ కవి మమేకమైపోయాడో మనకు అవగతమవుతుంది.

‘కన్నీటి చుక్కల్ని/తుడిచే కవితా అక్షరమయి
కాగితాన్నో పిడికిడిగా మారుస్తుంది
నాలోనే/నాతోనే ఉంటూ/నిద్రపోనివ్వదు
మెలకువగా ఉండనివ్వదు
నా మెదడును/నా చేతులను/నా కళ్ళను
నా కాళ్ళను/నేను అమితానందంగా ప్రేమించే
నా అంగంగాన్ని /తనదిగా చేసుకున్న
పద్యాన్ని ఏమనాలి/పద్యం నా లైలా
పద్యం నా అనార్కలి/పద్యమే నా ప్రేయసి
అనకుండా/ఇంకేమనాలి’

వర్తమానంలో అంతటా ఒక అభద్రతాభావం విస్తరించి పోయింది. ఎవరికి ఎవరు తోడు నీడ ఇవ్వలేని అయోమయ పరిస్థితిలు రాజ్యమేలుతున్నాయి. ఎవరి మాట నమ్మాలో కూడా అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్లోబలీకరణ వలన మానవ సంబంధాల్లోని అనుబంధాల పట్ల స్పష్టమైన చీలికలు ఏర్పడ్డాయి. ఈ పోటీ ప్రపంచంలో అనైతికమైన విధానాలను పాటించడం వల్ల నష్టపోతున్నవారు రోజురోజుకు అధికమవుతున్నారు. అందుకే కవి కలత చెందుతూ కవిత్వమై వర్షిస్తున్నాడు. మనిషి జీవితం సామూహికత లోనే ఉందని అంటున్నారు కవి. ఒంటరి దుఃఖాన్ని ఛేదించాలంటే సమాజంతో జీవితంతో నిత్యం పోరాటం చేయాలని తపిస్తున్నాడు కవి.

మానవ సంబంధాల్లో కుటుంబ బంధాలు అత్యంత ముఖ్యమైనవి. ఒక నైతిక విలువల సమాజం నిర్మాణం కావాలంటే అది కుటుంబం నుండే మొదలు కావాలి. కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటేనే మిగతా బాంధవ్యాలన్నీ దృఢంగా ఉంటాయి. ఏ ప్రాంతానికి చెందిన కవి అయినప్పటికీ పురోగమనమైన సమాజాన్ని కాంక్షిస్తాడు. ఈ కవితా సంపుటిలో ‘ఎప్పటికీ పూర్తి చేయలేని గొప్ప కావ్యం/అమ్మేనని అర్థమయ్యాక/మొదటి వాక్యం దగ్గరే/చిన్నపిల్లాడినయి తచ్చాడుతున్నాను’ అని అమ్మ గురించి ‘అమ్మ కావ్యం’ అంటూ కలవరిస్తాడు. రాఖీ కట్టడానికి చెల్లి ఇంటికి రాకపోతే ‘పండుగెట్టయితది’దని దుఃఖపడతాడు. తన వాళ్లందరికీ ‘దిక్సూచి’ అయిన నాన్న గురించి తలుచుకుంటాడు. ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు సహచరి సంధ్యారాణికి నున్నటి బండల మీద కాలుజారి భుజానికి గాయమైనప్పుడు ‘త్యాగమయి’ అని తన ప్రేమను ఒలుకబోస్తాడు. అమ్మమ్మ ప్రేమ గురించి, ఆ జ్ఞాపకాలను గురించి ఈ సంపుటిలో ఒక ప్రత్యేకమైన కవితనే ఉంది. దసరా బతుకమ్మ పండుగలు వచ్చాయి అంటే ఆడబిడ్డలను వారి పిల్లలను ఇంటికి తీసుకపోవడం తెలంగాణలో ఒక ఆనవాయితీ. బిడ్డల పిల్లలను అపూర్వంగా చూస్తారు. ఆ ప్రేమను అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ‘ముఖాన పెద్ద బొట్టు బిళ్ళ పెట్టుకుని/గోచిపెట్టి/నశాలంకంటేటట్టు నశం పీలుస్తూ/పండుగకు తీసుకుపోదామని వచ్చే/మా అమ్మమ్మ చంద్రమ్మను/ఎంతమందిలో ఉన్న/నా కళ్ళు ఇట్టే పట్టేవి’ అంటూ ‘అమ్మమ్మ ప్రేమ కన్న’ కవిత అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఈ రకంగా ఇంట్లోని బంధాలను, ఊరితో పెనవేసుకున్న అనురాగాలను చాలా కవితల్లో గమనిస్తాము. ఒక తెలంగాణ గ్రామీణ ప్రాంత పిల్లాడి హృదయ గానం ఈ కవితా సంపుటి.

కులాధిపత్యంతో మదమెక్కిన ఒకడు కన్ను మిన్ను గానక ముఖం మీద మూత్రం పోస్తే ఈ భూ ప్రపంచం మీద వాడు ‘నాలుగో రకం మనిషి’ అంటూ నిరసన వ్యక్తం చేస్తాడు కవి. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సామాన్యుల ఇండ్లలో కోళ్లను, మేకలను, బర్లను, ఆవులను పెంచుకొని వాటితో స్నేహం చేసే అలవాటు ఉంటుంది. పిల్లలకు వాటికి పేరు పెట్టి ముద్దుగా పిలుచుకుంటారు. ‘ఎండ/వాన/ చలి/తగలకుండా/పిల్లలకు/రెక్కల దుస్తులు తొడుగేది/చేతిలో నూకలుంచుకొని/బో బో బో అంటూ పిలిస్తే/నా కాళ్ళ చుట్టూరుగా/హచ్ కుక్కై తిరిగేది’ అంటూ కోడిపెట్ట గురించి ‘మచ్చలపెట్ట’ అని రాసిన ఈ కవిత ప్రత్యేకతను తెలుసుకుంటాం. ఏ రోజు కా రోజు మన వయసు పెరుగుతుందే కానీ తగ్గదు. ఒకవేళ తిరిగి బాల్యం లోకి వెళ్ళిపోతే కల్లాకపటం లేని బాల్యజీవితాన్ని మరోసారి అనుభవించ వచ్చునన్న ఆశావాహ దృక్పథంతో చెప్పిన ‘తిరోగమనం’ కవితా మనల్ని ఆలింగనం చేసుకుంటుంది.

సమకాలీన సమాజంలో జరుగుతున్న అన్యాయాల పైన అధర్మాలపైన తనదైన కోణంలో స్పందిస్తూ రాస్తున్న కవితలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం జరగాలనే పట్టింపు బలంగా ఉన్న కవి. వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తున్న హరీష్ గౌడ్ కవిత్వాన్ని మనమంతా అక్కున చేర్చుకుందాం. అనుభవంతో రాటుదేలుతున్న ఈ యువ కవి అక్షరాలు మరింత పదునుతో మునుముందున పలకరిస్తుంటాయని ఆశిద్దాం.

***

గాలిలేని చోట
కవి: డా. తండ హరీష్ గౌడ్
పుటలు : 165
వెల: ₹ 175
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఛాయ బుక్ స్టోర్
ఆన్‌లైన్‌లో
https://chaayabooks.com/product/gaalileni-chota/
https://www.amazon.in/GALILENI-CHOTA-THANDA-HARISH-GOUD/dp/B0CMXQZZS7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here