[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
స్టేషన్ డైరక్టర్‍గా పదేళ్ళు పూర్తి:
[dropcap]1[/dropcap]987 డిసెంబరులో జరిగిన యు.పి.ఎస్.సి. సెలెక్షన్లో 15 మందిమి స్టేషన్ డైరక్టర్లుగా నేరుగా ఎంపికయ్యాం. 1988 జూన్‌లో ఢిల్లీలోని ఆకాశవాణి స్టాఫ్ శిక్షణా కళాశాలలో పనిచేస్తూ 1990 ఆగస్టులో అనంతపురం తొలి స్టేషన్ డైరక్టర్ నయ్యాను. 1993 మార్చిలో కడప కేంద్రానికి వెళ్ళాను. 1995 ఏప్రిల్‌లో విజయవాడ బదిలీ.
లోగడ చెప్పినట్లు రెండేళ్ళు దాటగానే నేనే స్వయంగా బదిలీ కోరుకుని కొత్త ఊరికి వెళ్ళేవాడిని. ‘మంచివాడు’ అని జనం అనుకునేటప్పుడే ఆ ఊరు లేదా ఆ పోస్టు వదలాలనేది నా ప్రగాఢ విశ్వాసం. అలా ఎన్నో బది’లీల’లు. 1975-78 కడప, 1978-80 విజయవాడ, 1980-82 కడప, 1982-85 హైదరాబాదు మెయిన్ స్టేషన్, 1985-87 వాణిజ్య ప్రసార విభాగం మరియు శిక్షణా సంస్థ, 1987-88 జాతీయ శిక్షణా సంస్థ, 1988-90 డైరక్టరేట్‍లో చీఫ్ ప్రొడ్యూసర్, 1990-93లో అనంతరపుం, 1993-95 కడప, 1995-97 విజయవాడ కేంద్రం – ఇలా సాగుతోంది ఉద్యోగ ప్రస్థానం. అప్పటికి పదేళ్ళ డైరక్టర్ పదవి పూర్తి చేశాను. హైదరాబాద్ కేంద్ర డైరక్టర్‍గా నేను అర్హుడిని.
హైదరాబాదుపై మోజు:
నన్ను రాష్ట్ర రాజధాని కేంద్ర డైరక్టర్‌గా హైదరాబాదులో వేయమని ఐదు సంవత్సరాలుగా అర్జీలు పెడుతూ వచ్చాను. టి.యన్.గణేశన్ రిటైరయ్యారు. ఆ ఖాళీలో కబీర్ అహ్మద్‍ను శ్రీనగర్ నుంచి మార్చారు. ఆయన నాకు మంచి మిత్రుడు. శ్రీనగర్ రేడియోలో ఆయన పనిచేస్తుండగా ఆకాశవాణి కార్యలయంపై ఒక రాకెట్ బాంబు విసిరారు. ప్రమాదం నుంచి ఆయనెలాగో బయటపడ్డారు. ఆ కారుణ్య భావంతో ఆయనను స్వస్థలమైన హైదరాబాద్‍కు మార్చారు.
అప్పటి ఆంధ్ర దేశంలో వున్న డైరక్టర్లలో నేనే సీనియర్‍ని. నన్ను హైదరాబాద్ వేయమని అభ్యర్థించాను. ఖాళీ రాగానే (కబీర్ అహ్మద్ రిటైర్‍మెంట్) తిరుపతిలో పని చేస్తున్న వి.వి. శాస్త్రిని హైదరాబాదుకు మార్చారు. ఆయన నా వద్ద లోగడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‍గా పనిచేశారు. ఆయన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్‌లు రెండేళ్ళు నేనే వ్రాశాను. నన్ను మార్చలేదు. నేను మనసులో బాధపడ్డాను. కేంద్ర మంత్రులు యర్రంనాయుడు, బోళ్ళ బుల్లిరామయ్యలు స్టూడియోకు వచ్చినప్పుడు వారి చెవిలో ఈ బాధ విన్నవించాను. వారు డైరక్టర్ జనరల్‍కు ఫోన్లు చేశారు. అది ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని డైరక్టరేట్ భావించింది. ఔరా! ప్రజాస్వామ్యం!
రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ మీటింగులు జరిగినప్పుడు వి.వి.శాస్త్రి తదితర కేంద్ర డైరక్టర్లు నా మీద అభిమానం చూపేవారు. వారందరికీ నేను ఢిల్లీ లోని ట్రైనింగ్ సెంటర్లో పాఠాలు చెప్పానని గౌరవం. నా వద్ద ఏ నెలలో ఏ డైరక్టరు (దేశవ్యాప్తంగా) రిటైర్ అవుతారో ఒక స్లిప్ నిరంతరం జేబులో వుండేది. నాకు కంఠతా కూడా వచ్చు. అందుకని నన్ను ఫోన్లలో రిటైర్‍మెంట్ల గూర్చి అడిగేవారు.
బెంగుళూరులో డైరక్టర్ల సదస్సు:
నేను కడపలో పనిచేస్తుండగా బెంగుళూరులో జాతీయ స్థాయి ఆకాశవాణి డైరక్టర్ల సమావేశం జరిగింది. ఆ సదస్సులో ప్రసంగించడానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్దిని ఆహ్వానించారు. సభాముఖంగా ఆయన నా ప్రతిభా పాండిత్యాలను ప్రస్తావించారు. భోజన విరామ సమయంలో నేను మా డిప్యూటీ డైరక్టర్ జనరల్ యస్. క్రిష్ణన్ గారిని కలిశాను. త్వరలో దుర్గా భాస్కర్‍ని విజయవాడ నుంచి మదరాసు మార్చే ఆలోచన వుంది గదా! నన్ను విజయవాడ వేయమన్నాను. తప్పకుండా వేస్తాను అని హామీ ఇచ్చారు.
మరో పది నిముషాల్లో మరో డిప్యూటీ డైరక్టరు జనరల్ మధుకర్ గైక్వాడ్ నా భోజనం టేబుల్ వద్దకు వచ్చి – “Seniors like you should come to Delhi on transfer” అన్నారు. నా మీద ఆయనకు అభిమానం ఎక్కువ. “పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి సార్” అన్నాను.
పిల్లల చదువులు:
తరచూ నా బదిలీల వల్ల ఇబ్బంది పడ్డ వ్యక్తులలో మా ఆవిడ శోభాదేవి ప్రథమురాలు. నా వ్యక్తిగత లైబ్రరీ, నేను వ్రాసి ప్రచురించిన పుస్తకాల కట్టలు – అంతా సామాన్లు 40 బ్యాగులయ్యేవి. వాటిని పిల్లి పిల్లల్ని మార్చినట్టు నేను ట్రాన్స్‌ఫర్ అయినప్పుడూ, ఇల్లు మారినప్పుడూ ఆమె మాకు అగర్వాల్ పాకర్స్. అంత శ్రమ పడేది. చదువుల విషయానికి వస్తే 1991 మే లో మా అమ్మాయికి (శైలజ) పెళ్ళి చేశాము. 1992 ఏప్రిల్‍లో పిల్లవాడు పుట్టాడు. ఆమె అత్తారింటికి వెళ్ళిపోయింది. రమేష్‍చంద్ర 1996 ఆఖరు నాటికి షిర్డీ దగ్గర కోపర్‍గాంలో బి.ఇ. పూర్తి చేసి బెంగుళూరులో ఉద్యోగంలో చేరాడు. చిన్నవాడు జనార్ధన్ బళ్ళారిలో బి.ఇ. పూర్తి చేసి అదే సంవత్సరం బెంగుళూరులో ఉద్యోగంలో చేరాడు.
మా అమ్మానాన్నలకు నేనొక్కడినే సంతానం. మా నాన్నగారు లక్ష్మీకాంతరావు స్వగ్రామం చెన్నూరులోనే వుంటూ వ్యవసాయం చూసుకుంటూ ఉండేవారు. నాలుగు నెలలకోసారి నా వద్దకు వచ్చి పదిహేను రోజులు గడిపి ఇంటి ముఖం పట్టేవారు. నగర వాతావరణం ఆయనకు నచ్చదు. నిత్యం మా ఇంటికి రైతులు వచ్చి ‘కాంతం మామ, శారదక్కా’ అంటూ సలహాలు సంప్రదింపులు తీసుకునేవారు. 40 సంవత్సరాలు ఆయన అవిచ్ఛిన్నంగా పంచాయితీ బోర్డు లెక్కలు చూశారు. ప్రెసిడెంట్లు మారారు గానీ పంచాయితీ దస్త్రాలు మా ఇంట్లోనే వున్నాయి.
ఈ విధమైన కుటుంబ జీవన విధానం 1997 సెప్టెంబరు నాటికి కొనసాగుతోంది. విజయవాడకి వచ్చి రెండేళ్ళు పూర్తయ్యింది. హైదరాబాదుకు మార్చమని మా అధికారులను అడుగుతూనే వున్నాను.
ఒకరోజు ఢిల్లీ నుండి ఫోను:
ఓ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మా ఆఫీసుకు మా డిప్యూటీ డైరక్టర్ జనరల్ గైక్వాడ్ ఫోన్ చేశారు. సాధారణంగా నేను మధ్యాహ్నం ఒంటిగంటకు పక్కనే వున్న క్వార్టర్స్‌కి వెళ్ళి భోం చేసి గంట విశ్రాంతి తీసుకుని మూడింటికి ఆఫీసుకొచ్చే అలవాటు చేసుకున్నాను. నా పి.ఏ. శ్రీమతి లక్ష్మి కంగారుగా ఫోన్ చేసింది. నేను విశ్రాంతిగా ఆఫీసుకెళ్ళి గైక్వాడ్ గారికి ఫోన్ చేశాను.
“డాక్టర్ రావ్! డోంట్ గెట్ ది ఆర్డర్స్ క్యాన్సిల్డ్. వియ్ హావ్ పోస్టెడ్ యు టు ఢిల్లీ” అన్నారు తాపీగా.
నాకేమీ బోధ పడలేదు. ఆర్డర్లు క్యాన్సిల్ చేయించేంత పలుకుబడి నాకుందనుకునే వారి ఆలోచనకు ఆశ్చర్యపోయాను.
మరుక్షణంలో ఆయన “మిమ్మల్ని ఢిల్లీ స్టేషన్ డైరక్టర్‌గా వేశాం” అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. 50 సంవత్సరలుగా తెలుగువారెవరూ ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా పనిచేయలేదు. నేను హైదరాబాద్ అడుగుతుంటే, భగవంతుడు ఢిల్లీ వేయించాడు.
ఒక పిట్ట కథ ఈ సందర్భంలో చెప్పాలి. ఓ భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షమై “ఏం కావాలి భక్తా!” అని అడిగాడు. “ఇరవై లక్షలు కావాలి స్వామీ!” అన్నాడు. “నేను నీకు ఐదు కోట్లు ఇద్దామని సంకల్పించాను. నీవు అడిగిందే ‘తథాస్తు'” అన్నాడు. అలా వుంటాయి మనం కోరే వరాలు.
సెప్టెంబరు నెలాఖరులో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వారు నా ఆర్డర్లు జారీ చేశారు. ఢిల్లీ పోస్టింగ్ వెనుక జరిగిన ఉదంతం చెప్తే దాని వివరాలు మీకు అందవు. 1997 జూన్ మాసంలో యు.పి.ఎస్.సి. వారు తొలిసారిగా డైరక్టర్ జనరల్ (ఆకాశవాణి) పోస్టుకు ప్రకటన ఇచ్చారు. సీనియర్ ఏ.డీ.జి అప్లయి చేశారు. ఇంటర్వ్యూలు జరిగాయి. ఇండియన్ ఇన్‍ఫర్మేషన్ సర్వీస్‍కి చెందిన డా. ఓం ప్రకాశ్ కెజిర్వాల్ ఎంపికయ్యారు. అంతకుముందు ఐఎఎస్ అధికారులు పనిచేశారు. ఆయన నియామకంపై ఆకాశవాణి సీనియర్లు కోర్టుకెళ్ళాలని సంకల్పించారు. ఎట్టకేలకు కెజిర్వాల్ గారు డి.జి.గా చేరారు. సెప్టెంబరు మొదటివారంలో ఆయన హైదరాబాద్ ఇన్‍స్పెక్షన్‍కి వచ్చారు. హైదరాబాదు వచ్చి కలవమని నాకు ఫోన్ వచ్చింది.
కెజిర్వాల్ లోగడ పబ్లికేషన్స్ డివిజన్ డైరక్టర్ జనరల్‍గా పనిచేశారు. ఆయన స్వయంగా మంచి రచయిత. ఆయన హయాంలో ఒక కొత్త ఆలోచన చేశారు. భారతీయ భాషలలో ఒక్కొక్క భాషలో గత వంద సంవత్సరాలలో వచ్చిన ఆణిముత్యాలను 10 ఎన్నుకుని వాటిని సరళ వచనంలో ఒక్కోటి 25 పుటలు మించకుండా 250 పుటలలో ఒక గ్రంథం తీసుకురావాలని సంకల్పించారు.
ఆ ప్రయత్నంలో తొలిగా తెలుగు భాషలో పద్యకావ్యేతర ప్రక్రియలు పది ఎంచుకుని వ్రాయమని హైదరాబాదులోని పబ్లికేషన్ డివిజన్, యోజన ఎడిటర్ డా. సి.జి.కె.మూర్తి నన్ను కోరారు. నేను పరిశోధించి పది గ్రంథాలకు లోబడవని 15 గ్రంథాలు ఎంపిక చేసుకుని తెలుగులో 450 పేజీల గ్రంథం వ్రాశాను. అది ప్రచురణ పూర్తి అయి రెడీగా వుంది. దాని ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాదు ఆకాశవాణి కార్యాలయంలో కెజిర్వాల్ చేతుల మీదుగా జరిగింది.
ఆ ఆవిష్కరణ సభలో ఆయన ఇలా ప్రసంగించారు:
“డా. రావు మా పబ్లికేషన్ డివిజన్ సంకల్పించిన ఈ ప్రణాళికలో తొలి గ్రంథం వ్రాసినందుకు అభినందనలు. ఇది 14 భారతీయ భాషలలోకి అనువదింపబడుతుంది. ఢిల్లీ ఆకాశవాణి “Window for Broadcasting” వంటిది. దానికి ఒక రచయిత డైరక్టర్‌గా వుంటే దాని హోదా పెరుగుతుంది. డా. రావు ఢిల్లీ కేంద్ర డైరక్టర్‌గా వస్తే దాని విలువ పెరుగుతుంది. ఆర్డర్లు త్వరలో వస్తాయి” అన్నారు.
సభాసదులు కరతాళధ్వనులు చేశారు.
ఔత్తరాహులు రాజ్యం చేసిన రాజధాని కేంద్రంలో హిందీ భాషేతరుడైన నేను గడ్డకెక్కగలనా? అనే సంశయం కలగకపోలేదు. నాకు ముందు కుమారి నోరీన్ నక్వీ మూడేళ్ళు ఆ పదవిలో ఉన్నారు.
“భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు – తెలుగు” అనే ఆ గ్రంథాన్ని తర్వాతి కాలంలో నేనే ఆంగ్లంలోకి అనువదించాను. 2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర సమాచార శాఖామాత్యులు అరుణ్ జైట్లీ, లోక్‍సభ స్పీకర్ జి.యం.సి. బాలయోగి రాష్ట్రావతరణోత్సవాలలో ఆవిష్కరించారు. హిందీ అనువాదాన్ని మిత్రులు డా. జె. లక్ష్మీరెడ్డి, ఒరియా అనువాదాన్ని డా. జె.కె. దాసు చేశారు. తమిళ అనువాదం నా సన్నిహిత మిత్రుల కప్పగించాం. అది దశాబ్ది కాలమైనా పూర్తి కాలేదు. ఈ పుస్తకం నన్ను ఢిల్లీ పంపే ప్రయత్నానికి నాంది కావడం విశేషం.
ఢిల్లీ సెక్రటేరియట్‍లో కార్యదర్శి వద్ద సెక్రటరీ దీక్షితులు అక్టోబరు 4న నా ఆర్డరు ఫాక్స్ చేశారు. అక్టోబరు 8న ఢిల్లీ ఆకాశవాణి భవనంలో పదవీ స్వీకారం చేశాను.
(సశేషం)