[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘కొత్త కలం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నే[/dropcap]నొక కొత్త కలాన్ని
వెతుకుతున్నాను
కొత్త విషయాలు
అన్నీ రాసి పడేసిన
విషయాలే..
కులం మతం
వర్ణ వివక్ష
లింగ వివక్ష
రాజకీయ దోపిడీ
రాజ్య హింస
నోటు కు ఓటు
అమ్మే జనం
దోచుకునే దొరలు
దాచుకునే ఆసాములు
నోరు లేని మూగ మనసులు
అర్థ రాత్రి సంగతి అటుంచండి
పట్ట పగలే స్త్రీలు తిరగలేని
పరిస్థితి రోడ్ల మీద
మెరుగైన వైద్యం
ఉన్నోడి సొంతం
నాణ్యమైన విద్య
పేదలకు అది మిద్య
అన్నీ రాసి పడేసిన విషయాలే
రాసినవి రాస్తే
చదివేదెవరు
అచ్చేసేదెవరు
కొత్త కలానికి
మేత లేదు
కొత్త సీసాలో
పాత సారా
పోయడం తప్ప