[box type=’note’ fontsize=’16’] భార్యాభర్తలిద్దరూ ఒడిదొడుకులెన్ని వచ్చినా, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికై ఒకరు బ్రతకడంలోనే జీవితానందముంటుందనీ, అదే ఆలుమగల అన్యోన్యతకు తార్కాణమనీ చెప్పే కథ చల్లా సరోజినీదేవి “వానప్రస్థాశ్రమం”. [/box]
[dropcap]“నీ[/dropcap] కోసం ఏం తెచ్చానో చూడు” అంటూ అకస్మాత్తుగా వెనక నుండి వచ్చి, తన మెడలో చక్కని కెంపులహారం వేస్తున్న భర్త రవీంద్రను ఆశ్చర్యానందాలతో చూసింది అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్న మాధవి.
“ఇన్ని డబ్బులెక్కడివీ? ఇప్పుడెందుకండీ ఇంత ఖరీదైన ఈ నగ తెచ్చారు?” నగను తడిమి చూసుకొంటూనే భర్తవైపు తిరిగుతూ అడిగింది మాధవి.
చటుక్కున ఆమెను దగ్గిరికి లాక్కుని సందిట బంధిస్తూ “అవన్నీ అడగవద్దు. అయినా అది నీడబ్బులేలే. ముద్దుల భార్య ముద్దు తీర్చడం భర్తగా నా బాధ్యత గాదా? ఈ నెక్లెస్‌లో నీవెంత ముద్దొస్తున్నావో తెల్సా? అచ్చం మన తొలిరేయి నాటి అందాల బొమ్మలా వున్నావు” అని చెవి దగ్గిర గుసగుసలాడాడు రవీంద్ర.
భర్తను సున్నితంగా విడిపించుకొంటూ “చాల్లెండి మీ అతిశయోక్తులు. ఇంతకీ డబ్బెక్కడిదో చెప్పుదురూ” అందామె.
భార్యతో పాటుగా మంచం పైన కూర్చుంటూ “అప్పుడెప్పుడో మీ నాన్న యిచ్చిన పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లో నుండి కొన్ని తీసి నీ పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసానుగా మధూ! అవే ఇవి. ఇంకా ఏం తెచ్చానో తెల్సా?” అని దిండు క్రింద దాచిన గిఫ్ట్ పాకెట్ తీసి మాధవి ముందు పెట్టాడు రవీంద్ర.
“అవును. కాని అవి కేవలం వెయ్యిరూపాయలేగా” ఆశ్చర్యంగా అడిగింది మాధవి.
“అబ్బ, ఆఫీస్‌లో లోన్ తీసుకొన్నాను లెద్దూ? అన్నీ ప్రశ్నలే నీకు. నా మూడంతా పాడు చేయకుండా ముందీ పాకెట్ విప్పుదూ” అన్నాడు రవీంధ్ర. భర్త వైపు సందేహంగా చూస్తూనే పాకెట్ విప్పింది మాధవి.
తను ఎన్నాళ్ళనుండో కావాలనుకొన్న లేత పసుపురంగుకు మెరూన్ కలర్ రిచ్ బార్డర్ వున్న కంచి పట్టు చీరెను చూడగానే, ఆమె కళ్ళు మెరిసాయి. “ఆహ్” అన్నది ఆనందంగా. భార్య కళ్ళలోని మెరుపునూ ముఖంలోని ఆనందాన్ని చూసి మురుసి పోయాడు రవీంద్ర.
“నీకు నచ్చిందా?” అన్నాడు ఆసక్తిగా.
“చాలా. ఓసారెప్పుడో షాప్‌లో చూసి బాగుందన్నాను కదూ? అందుకే కొన్నారా?” అన్నది మాధవి.
“అవును. ఆవేళ నా దగ్గిర డబ్బులు లేక కొనలేకపోయాను. ఈ వేళ నీ కోరిక తీర్చగలిగాను” తృప్తిగా చూస్తూ అన్నాడు రవీంద్ర.
“అసలివన్నీ ఇప్పుడెందుకు తెచ్చారో శ్రీవారు?” కుతూహలంగా అడిగింది మాధవి.
“పిచ్చి మొద్దూ, నేనే గుర్తుకు చెయాలా? ఈ నెలేంటి?”నవ్వుతూ అడిగాడు రవీంద్ర. “మార్చి నెల. అయితే ఏంటిట?” అని ప్రశ్నార్థకంగా చూసింది మాధవి.
“అందుకే నిన్ను పిచ్చి ముఖం అంటాను. ఈ నెల 18వ తారీఖు మన పెళ్ళి రోజు కాదూ?” వెక్కిరింతగా అన్నాడు రవీంద్ర.
“ఓ, మరిచేపోయాను సుమా? సారీ… సారీ. అయినా ఇప్పుడివన్నీ చూస్తే యింట్లో అందరూ ఏమనుకుంటారోనండీ, వాళ్ళకేం చెప్పాలో ఏంటో?” దిగులుగా అన్నదామె.
“ఎవరేమనుకొంటే మనకేంటి మధూ? అయినా ఇవి మన డబ్బులు. ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు” గంభీరంగా అన్నాడు రవీంద్ర. ఆశ్చర్యంగా భర్త వంకే చూస్తూండిపోయింది మాధవి.
“ఇంకో సర్ప్రయిజ్ కూడా వుంది చూడు” అంటూ దిండు క్రింద నుండి ఒక పొడవైన సన్నని కవర్ తీసి భార్య చేతికి అందించాడు రవీంద్ర. మాధవి కవర్ తెరిచి చూసి తన కళ్ళను తానే నమ్మలేక పోయింది.
అందులో తామిద్దరికీ బుక్ చేయబడిన విమానం టికెట్స్ వున్నాయి. సరిగ్గా తమ పెళ్ళిరోజు నాటికి చేరే విధంగా కేరళ ట్రిప్ కోసం బుక్ చేసిన టికెట్సవి.
“నిజమా?” ఆశ్చర్యం తీరక భర్త వైపు చూస్తూ అడిగింది మాధవి.
“అవును. నా పిచ్చి మధు కోరిన కోరిక యిది” అంటూ భార్యను దగ్గరికి తీసుకొన్నాడు రవీంద్ర. ప్రేమ నిండిన అతని మాటలకు పరవశిస్తూ, అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతున్న మాధవి “ఏమిటీ ఈ వేళ చపాతీలు చేయలేదా? ఎందుకనీ?” అని గట్టిగా అడుగుతున్న రమేశ్ గొంతు విని చటుక్కున నిలబడింది. “ఈ వేళ తనకు ఓపిక లేదుట” రాగిణి గొంతు కూడా అదే స్థాయిలో వినబడింది. నిలబడిన భార్య చేయి పట్టుకుని లాగుతూ “నువ్వీ ఇంటికి బానిసవు కాదు మధూ. ఎందుకలాగ భయపడతావు? ఎవరికీ కావలసినవి వాళ్ళు చేసుకొంటారు. నువ్వు అనవసరంగా కంగారు పడకు” అన్నాడు రవీంద్ర.
మాధవి బేలగా భర్త వంక చూస్తూ “నిజంగానే నాకీ వేళ అంత పిండి తడిపి నిలబడి చెపాతీలు చేసేందుకు ఓపిక చాలలేదండీ. అందుకే అందరికీ సరిపడా అన్నమే వండాను” అన్నది.
భార్య ముంగురులు ప్రేమగా సవరిస్తూ “మధూ గానుగెద్దులాగా నీవు ఒళ్ళు మరచి చాకిరీ చేయడమూ మిగిలిన వాళ్ళంతా దర్జాగా పెత్తనాలు చేయడమూ యింక చెల్లదు. ఇంక నేనూరుకోను. ఇన్నాళ్ళూ నేను కళ్ళు మూసుకొన్నాను. ఇంక చాలీ ఊడిగం. మనం కేరళ నుండి రాగానే కొన్నాళ్ళు మరెటైనా ట్రిప్ వేద్దాం. నీ విలువ అప్పటికి తెలుస్తుంది అందరికీ” అన్నాడు రవీంద్ర. మౌనంగా భర్త యదపై ఒదిగి బయటి నుండి వినబడే మాటల్ని వినసాగింది మాధవి.
“అయ్యో చపాతీలు లేకపోతే ఎలాగ? ముందే తెలిస్తే బయటి నుండే తెచ్చేవాడిని గదా?” అని రమేష్ అంటే “మాకు మాత్రం ఏం తెలుసూ? ఇందాక వంట గదిలోకెళ్తేనే తెలిసింది, ఈ పూట చపాతీలు లేవని” సాగదీస్తూ జవాబిచ్చింది కవిత.
“నాకు చెపితే నేనన్నా చేద్దును గదా? తీరా తినబోయే ముందు చేపితే ఏంటన్నట్లు?” గద్దిస్తున్నట్లుగా అన్నది కాంతమ్మ.
రవీంద్ర ఆవేశంగా ఏదో అనాలని లేవబోయాడు. మాధవి భర్త చేయిపట్టుకొని అభ్యర్ధనగా చూసింది. మౌనం వహించాడు రవీంద్ర. రాగిణీ, కవితలు తన పిల్లలకు నచ్చ చెప్పుతూ అన్నం తినిపించడం గమనించారు ఆ దంపతులు.
ఆ ఇంట్లో సాయంకాలం పూట చపాతీలు తినడము అందరికీ అలవాటు. ఇంటిల్లి పాదికీ కనీసం 25 పైనే అవి చేయాలి. ఇంట్లో యింకా ముగ్గురాడవాళ్ళున్నా, వాళ్ళెవరూ వంటగది ఛయలకే రారు. మొత్తం వంటంతా మాధవే చేస్తుంది. ఒకప్పుడు అందరూ కలిసి తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి ఆకలేస్తే వాళ్ళు వడ్డించుకుని తింటారు. ప్రతీ రోజూ వంటంతా చేసి మాధవి అన్నీ టేబుల్ పైన సర్దివుంచితే, ఎవరికి వారు వడ్డించుకొంటారు. మాధవి తన గదిలోకెళ్ళి స్నానం చేసి, భర్త రాక కోసం ఎదురు చూస్తూ వుంటుంది. అప్పటికీ అందరూ తినడం ముగుస్తుంది. భర్తకు వడ్డించి, తనూ పెట్టుకుని తినడం మాధవికి అలవాటు. పెళ్ళయినప్పటి నుండీ మంచి కోడలిగా, ఇల్లాలిగా మెప్పును పొందాలనే తాపత్రయంతో, ఇంట్లోని అందరికీ అణిగి, మణిగి వుండడం, మౌనంగా ఎంత చాకిరీ అయినా చేయడం అలవర్చుకొన్నది. రవీంద్రకు అమాయకురాలైన తన భార్యంటే అమితమైన ప్రేమ వున్నప్పటికీ, పరిస్థితులు సహకరించక చాలా సార్లు మౌనాన్నే ఆశ్రయించేవాడు. తొలిసారిగా భర్త ఈ వేళ గట్టిగా మాట్లాడ్తుంటే ఆమెకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది, ఆనందంగానూ వున్నది.
***
ప్రయాణానికి రెండు రోజుల ముందే, దాని గురించి ఇంట్లో ప్రకటించాడు రవీంద్ర.
“మాకు మాట మాత్రమైనా చెప్పలేదే?” అని అందరూ తలా ఒక రకంగా తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. కాంతమ్మయితే మూతి మూడు వంకర్లు త్రిప్పుతూ “దేనికైనా రాసి పెట్టివుండాలిలే” అని మాధవిని కొరకొరా చూసింది. “అవును మరి, ఎవరు ఎంత చేస్తే అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే కదా? ఐనా మా డబ్బు మేము ఖర్చు పెట్టుకొంటుంటే మీ అందరీకీ ఎందుకంత బాధ? మీలో ఎవ్వరినీ నేను రూపాయి కూడా అడగలేదే?” అన్నాడు రవీంద్ర.
“మీ డబ్బులే అనుకోండి అన్నన్ని వేలు పెట్టి అంతదూరం వెళ్ళడం అవసరమా?” అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నొక్కింది రాగిణి.
“నిజమే కదా” అని వంత పాడింది కవిత.
“నాకు అంతే అనిపిస్తున్నది” చిటపటలాడ్తూ అన్నడు రమేశ్.
“ఎవరికేం చెప్పగలంలే? ఎవరిష్టాలు వాళ్ళవి. మన కెందుకు చెప్తారు?” నిష్ఠూరంగా అన్నాడు రమేష్.
“అవును ఎవరిష్టాలు వాళ్ళవే. మీరన్నీ మాకు చెప్పే చేస్తున్నారా? మీ అన్నదమ్ములిద్దరూ మంచి పాష్ ఏరియాలో చెరో అపార్టమెంట్ కొని, అద్దెకిచ్చిన సంగతి మాకు చెప్పారా? అయినా మీకు చెప్పాల్సిన అవసరం, అగత్యం మాకు లేవు. ఇంకో ముఖ్యమైన మాట. మొన్నామధ్య చేతగాక చపాతీలు చేయలేదనే చిన్న విషయానికి మాధవి పైన ఎన్నెన్ని నిష్ఠూరాలాడారు? ఇంత మందికి తానొక్కతే ఎందుకు చేసి పెట్టాలసలు? ఇంక నుండీ అందరూ అన్ని పనులూ కలిసి మెలిసి చేయాల్సిందే. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు” అన్నాడు రవీంద్ర.
అందరూ ఒక్క క్షణం తెల్లబోయారు. తేలుకుట్టిన దొంగల్లాగా సోదరులిద్దరూ మౌనం వహించారు.
కాంతమ్మ అప్పటికప్పడు అర్జంట్‌గా కళ్ళనీళ్ళు నింపుకొంటూ “అవునులే నా దారిన నన్ను వెళ్ళమని ఎంత బాగా చెప్పావురా? ఏ గతీ లేని దాన్నన్నేగా?” అని ముక్కు చీదింది.
“నిన్ను ప్రత్యేకించి ఏమి అనలేదు. ఏ పనులూ చేయకుండా ఐదు వ్రేళ్ళూ నోట్లోకి రావాలని కోరుకొనే వారెవరైనా వెళ్ళవచ్చుంటున్నాను. అన్నింటికీ నేనని ముందుకు రాకు అక్కా. ఎల్లుండే మా ప్రయాణం. నో మోర్ డిస్కషన్స్. మధూ పద” అంటూ మాధవిని తమ గది వైపు నడిపించాడు రవీంద్ర.
సంభ్రమాశ్చర్యాలతో భర్తనే చూస్తూ, బొమ్మలాగా అతడి ననుసరించింది మాధవి. ఎక్కడి వాళ్ళక్కడే చెష్టలుడిగి నిలబడిపోయారు.
మర్నాడు యధాప్రకారం ప్రోద్దున్నే లేచి పనుల్లో చొరబడింది మాధవి. పై పనులకు పనమ్మాయి వున్నప్పటికీ, వంటంతా ఆమే చేస్తుంది. “వంటే గదా?” అనుకోలేము. చాలా వుంటుంది పని. ఎవరికి వాళ్ళు ఆ ఏమంత పననీ ఆ మాత్రం వంట చేయలేరా? అనుకొంటారు. అంత మందికి పెద్ద మొత్తంలో ఏం చేయాలన్నా, మాధవికి భారమే. అయినా ఆమె ఏమీ అనేది కాదు. రవీంద్ర హెచ్చరిక తర్వాత ఆ రోజు రాగిణీ, కవితలతో పాటు కాంతమ్మ కూడా వంట గదిలోకి వచ్చి ఏమైనా చేయాలేమో నని చూసారు. కానీ మాధవి అప్పటికే అంతా చేసింది. ఆ సాయంకాలం మాత్రం ప్రయాణ సన్నాహాలు చేసుకొంటూ మాధవి వంట జోలికి వెళ్ళలేదు. మరునాడు చీకటితోనే టాక్సీ పిలిచి భార్యాసమేతంగా ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాడు రవీంద్ర. కుటుంబ సభ్యులందరికీ ‘వెళ్ళొస్తాం’ అని చెప్పడం మరువలేదు.
తొలిసారిగా విమానం ఎక్కుతూ, భర్త చేతిని గట్టిగా పట్టుకొని చెప్పలేనంత థ్రిల్‌ని అనుభవించిసాగింది మాధవి. లోపలి కెళ్ళి తమ సీట్స్‌లో కూర్చున్నాక, ఎయిర్ హోస్టెస్ సూచనతో సీటు బెల్ట్ బిగించుకొన్నారు దంపతులు. ఎన్నోసార్లు ఆఫీస్ పనులపైన విమానాల్లో ప్రయాణం చేసినందువల్ల రవీంద్రకు క్రొత్తగా ఏమీ లేదు. కానీ మాధవికి అన్నీ వింతగానే వున్నాయి. కిటికీకి బిగించిన గ్లాస్ నుండి బయట క్రిందగా కొంతసేపటి దాకా కనబడిన ఇళ్ళనూ, భవనాలనూ, ఎత్తయిన అనేక నిర్మాణాలనూ, పచ్చని చెట్లనూ, లోయలూ, నదులూ అన్నీంటినీ చూసి చాలా ఉద్వేగానికి లోనైంది మాధవి. కాస్సేపటి తర్వాత అసలేమీ కనబడకుండా దూదిపింజెల్లాంటి మేఘాల్లో నుండీ విమానం దూసుకెళ్ళుంటే, మరింత సంతోషంతో చిన్న పిల్లలా సంబరపడింది.
ఆమె కేరింతలు చూసి ప్రేమగా భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకొంటూ “పిచ్చి మధూ ఇంక నుండి నీకు ఏ ఆనందాన్ని చేజారనీయను. ఇప్పటికే చాలా కోల్పోయాం. నువ్వు నా ప్రాణానివిరా” అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకొన్నాడు రవీంద్ర.
అతని ప్రేమ జలధిలో ఆమె తలమునకలవుతున్నది. కేరళలో అడుగు పెట్టిన దగ్గిర నుండీ ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. దారికిరు వైపులా కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన పచ్చని చెట్లనూ, పొదలనూ, కాఫీ తోటలనూ, రంగు రంగుల పూలనూ కళ్ళు విప్పార్చుకొని చూసారిద్దరూ. రవీంద్రకు కూడా ఆ ప్రదేశం క్రొత్తే మరి…
ఎత్తయిన కొండరాళ్ళ సందుల్లో నుండి చొచ్చుకొని ఉరవడిగా క్రిందికి దూకుతున్న జలపాతాల దగ్గిరికెళ్ళి, జలకాలాడారు. ఫోటోలు దిగారు. అతి పురాతనమైన వాస్కోడిగామా సమాధినీ, ఎన్నెన్నో చర్చీలనూ సందర్శించారు. హిందూ దేవాలయాలకూ వెళ్ళారు. చర్చీల ముందున్న పొడవాటి జేగంటలను అబ్బురంగా చూసింది మాధవి. ప్రతి ఇంటి ముందూ తప్పకుండా కొబ్బిరి, మామిడి అరటి వంటి ఎన్నోరకాల చెట్లల్లో ఏవో కొన్నయినా వుండడము గమనించి, అక్కడి ప్రజలకున్న పర్యావరణ పరిరక్షణ అవగాహనకు సంతోషించారు. అనేక చోట్ల పెద్ద పెద్ద పనస చెట్లు, వాటికి గుత్తులుగా వేళ్ళాడుతున్న పనసకాయలు వారి నెంతో అలరించాయి. చిన్న పాటి షాపింగ్ చేసారు. కథాకళి నృత్యాభినయాన్ని చూసి మైమరచిపోయారు. చివరిగా టాక్సీలో అలెప్పి అనే ప్రాంతాని కెళ్ళారు. అక్కడ బ్యాక్‌వాటరంతా మహాసంద్రాన్ని తలపిస్తున్నది. అందులో వందలాది బోట్స్ విహరిస్తున్నాయి. కొన్ని ఒడ్డనే కట్ట బడి వున్నాయి. మాధవి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు రవీంద్ర. అక్కడి వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా, అందంగా వున్న బోట్ దగ్గిరికి తీసుకెళ్ళాడు. ఒక అబ్బాయి వీళ్ళ లగేజీ తీసుకొని ముందు నడుస్తుంటే అతని వెనకే నడిచి ప్రత్యేకమైన ఒక సూట్‌లోకి అడుగు పెట్టారు దంపతులు. “ఈవెనింగ్ టీ+స్నాక్స్‌కు పైన డైనింగ్ హాల్‌కి వెళ్ళాలి సార్. డిన్నర్ ప్రిపేరవగానే మళ్ళీ వచ్చి చెప్తాను” అన్నాడు అబ్బాయి. “మేము అవన్నీ ముగించుకొనే వచ్చాం గానీ ప్రస్తుతానికేమీ అవసరం లేదు. ఇంకెళ్ళు బాబూ” అన్నాడు రవీంద్ర. ఆ అబ్బాయి సాభిప్రాయంగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. రవీంద్ర కూడా నవ్వి అక్కడి కబోడ్ తెరిచి ఒక చిన్న అట్టముక్క లాంటిది తీసి తలుపుకు తగిలించాడు, అదేమిటోనని చూసిన మాధవికి సిగ్గు ముంచుకు వచ్చింది. దానిపైన “డోంట్ డిస్టర్బ్” అని వ్రాసి వుంది. తలుపు మూస్తున్న భర్తను చిరు కోపంగా చూస్తూ “ఏం చేస్తున్నారు?” అని అడిగింది మాధవి.
“తలుపు లేస్తున్నాను. ఇప్పుడిక వలపు తలుపులు తెరుద్దాం. ముందా రూమ్‌లోకి పద” అంటూ ప్రక్కనే వున్న మరో గది తలుపులు తెరిచాడు రవీంద్ర. అందులోని దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది మాధవి. మల్లెలూ, గులాబీరేకులూ, మరువం, ధవనం వంటి అనేక సుగంధభరిత పత్రాలూ, పుష్పాలతో అందంగా అలంకరించబడిన పానుపు ప్రక్కనే చిన్న బల్లపైన రకరకాల స్వీట్స్, పళ్ళూ పెట్టబడి వున్నాయి. “ఏమిటండీ యిదంతా? మీ కేమైన్నా మతిపోయిందా? ఎందుకివన్నీ చేసారు? అదీ… ఇప్పుడా?” అన్నది మాధవి “ఇప్పుడంటే? ఏమవుతుందీ మధూ? నా కోసం మన కుటుంబం కోసం నువ్వు చేసిన చేస్తున్న వాటి ముందు ఇదొక లెక్కా?” నువ్వు “మనిద్దరం ఎక్కడికైనా ఒక నాలుగు రోజులు వెళ్దామండీ” అని ఎన్నాళ్ళు… కాదు ఎన్నేళ్ళయిందో నీకు గుర్తు లేకున్నా నాకు గుర్తుంది అన్నాడు రవీంద్ర.
“అయితే?” అన్నది మాధవి.
“పెళ్ళయిన దగ్గిరినుడీ మా అమ్మా అక్కా నిన్నెంత కాల్చుకు తిన్నారో నాకు తెలుసు. నేను ఒక్కడినే కొడుకును కావడం వల్లా నీ వైపు మాట్లాడితే వాళ్ళ దాడి నీ మీద మరింతగా పెరుగుతుందన్న భయం వల్లా నేను చూసి చూడనట్లూరుకోన్నాను. నాయనమ్మ గారాబంతో పెరిగిన మన పిల్లలు రాజేష్, రమేష్‌లు నీ పట్ల కనీస గౌరవం చూపకపోయినా, మాట్లాడలేకపోయాను. అమ్మ పోయాక, తప్పయినా సరే నీకు కొంత రిలీఫ్ దొరుకుతుందని ఆశించాను. కాని…” అని ఆగాడు రవీంద్ర.
విప్పారిన కళ్ళతో భర్త వంకే చూస్తూన్నది మాధవి. “కాని, భర్తపోయి అక్క కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటై, ఆవిడ శాశ్వితంగా మన దగ్గిరకే రావడం మన దురదృష్టం. ఆమె ఆరళ్ళు ఇన్నేళ్ళూ మౌనంగానే భరిస్తున్నావు. కొడుకులు పెద్దవాళ్ళయి, పెళ్ళిళ్ళయ్యాకైనా నీకు విశ్రాంతి దొరుకుతుందని ఆశించాను. అదీ అడియాసే అయింది. వచ్చిన కోడళ్ళు కూడా తమ మొగుళ్ళతో పాటు నిన్నొక పని చేసే యంత్రంగానే భావిస్తున్నారు. మనుమళ్ళూ, మనుమరాళ్ళూ వచ్చినప్పటికీ నువ్వింకా వంటింటినే అంటిపెట్టుకొని వుంటున్నావు. ఇన్నాళ్ళూ చాలీ చాలని జీతపు రాళ్ళతో పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికీ, ఇంటిని గడపడానికీ మనం ఎన్నో చిన్న చిన్న కోరికలను కూడా చంపుకొన్నాం. ఇప్పుడిద్దరం జీవితపు మలిపొద్దులోనికి వచ్చాం. మరో సంవత్సరం కూడా నాకు సర్వీస్ లేదు. పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. స్వంత ఆస్తులూ సంపాదించుకొంటున్నారు. ఏదో అద్దే మిగులుతుందని వాళ్ళింకా మనతో కలిసి వుంటున్నారు గానీ, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని వాళ్ళకూ వుంది. నా రిటైర్మెంట్ అవగానే మనం మళ్ళీ యిక్కడే వచ్చి, చిన్న యిల్లు తీసుకొని వుందాం” సుదీర్ఘంగా ఉపన్యసిస్తూన్న రవీంద్ర ఆగగనే “బాగానే వుంది మీ వ్యవహారం ముసలితనంలో దసరా సరదా అని నలుగురూ ఏమముకొంటారు? అయినా ఇంత ఖర్చు పెట్టి ఈ వయస్సులో మనకీ సరదా అవసరమా?” చిరుకోపం ధ్వనింప చేస్తూనే అన్నది మాధవి.
“ఖర్చు ఖర్చు అని వూరికే అనకు మధూ. నా పి.యఫ్‌లో ఇంకా ఇరవై లక్షలున్నాయి. ఇప్పుడు నేను తీసుకొన్నది కేవలం నాలుగు లక్షలే. ఇల్లుంది. పిల్లలకూ సంపాదన వుంది. ఇంకెందుకూ మనకు డబ్బులు. ముసలితనం అని ఎందుకు భాధపడాలి? నాకు 59 నీకు 57. అంతేగా? ఇన్నాళ్లూ ఇల్లునీ, పిల్లలనీ తాపత్రయంతో అన్నింటినీ త్యాగం చేసాం. ఇంకనైనా మన కోసం మనం బ్రతుకుదాం.”
“మధూ, నా ఫ్రెండ్ సహకారంతోనే యివన్నీ ఏర్పాటు చేయగలిగాను. ఇందాక నువ్వు అబ్బ… ఈ అందాలను చూస్తూంటే ఇక్కడే ఏ చెట్టుగానో, పువ్వుగానో వుండిపోవాలని వుందండీ అన్నావు. ఇంత ఆనందం నీలో చూసి ఎన్నేళ్ళయిందో? ఇంక అన్నీ మరిచిపోయి, మనం తొలి నాటి ఆనందాన్ని ఆస్వాదిద్దాం మధూ” అని చిలిపిగా నవ్వాడు రవీంద్ర.
ఆ నవ్వుకు క్షణం పాటు ఆమె గుండె లయతప్పింది. తన పట్ల అతనిలో నిద్రాణంగా దాగి వున్న ప్రేమ వాహిని ఒక్కసారిగా పొంగి పొర్లుతున్నట్లూ, అందులో తను కొట్టుకుపోతున్నట్లూ అనిపించింది మాధవికి.
“సరి సరి, అయ్యగారు మరీ క్రొత్త పెళ్ళికొడకవుతున్నారే?” అని మురిపెంగా భర్తవైపు చూసింది.
“ఇన్నెళ్ళకైనా నా అర్థాంగికి స్వేచ్ఛగా, ఆనందంగా, హాయిగా వుండే అవకాశం కలిగించగలిగి నందుకు నాకెంత గర్వంగా వుందో తెల్సా?” అంటూ మాధవిని ఆప్యాయంగా దగ్గిరికి తీసుకొన్నాడు రవీంద్ర.
తృప్తిగా, సంతోషంగా కళ్ళుమూసుకొంటూ భర్త కౌగిట చేరింది మాధవి.
భార్యాభర్తలిద్దరూ ఒడిదొడుకులెన్ని వచ్చినా, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికై ఒకరు బ్రతకడంలోనే జీవితానందముంటుందనీ, అదే ఆలుమగల అన్యోన్యతకు తార్కాణమనీ అనుకొన్నారు ఆ జంట. ఎలాగైనా తనకు రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో పిల్లలకివ్వగా మిగిలినవి పెట్టి, మాధవి కిష్టమైన చోటెక్కడైనా చిన్న ఇల్లు కొనాలని గట్టిగా నిర్ణయించుకొన్నాడు రవీంద్ర.
“అందేకే పూర్వం వాన ప్రస్థాశ్రమాలుండేవి కాబోలు? ఇంక నుండీ మనం కూడా ఆ ఆశ్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలి” అంటూ భార్యను మరింత పొదివి పట్టుకొన్నాడు అతడు. గువ్వలాగా ఒదిగిపోయింది మాధవి నవ్వుకొంటూ.