వందే గురు పరంపరామ్-3

0
4

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల – ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, తెలుగు విభాగం అధ్యక్షులుగా పదవీవిరమణ చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి గారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

[dropcap]గు[/dropcap]రువు యొక్క మహిమను తెలుపడానికి వేయి నాలుకలున్న ఆదిశేషునికే తరం కాదు. అంతగొప్పది. అయినా మన ప్రయత్నం మనది కదా!

గురు-శిష్య సంబంధం ఎటువంటిది అంటే తనకు మంచి గురువు దొరకాలని శిష్యుడు వెతుకుతూ ఉంటాడు. అదే విధంగా గురువు కూడా తనకు సరియైన శిష్యుడు లభించాలని వెతుక్కుంటూ ఉంటాడు.

గురు మహత్యం ఎంత గొప్పది అంటే సద్గురువు శిష్యుడు కోరిన దానికి శతకోటి రెట్లు అధికంగా అనుగ్రహించి తన శిష్యునిగా అంగీకరిస్తారు. అందువలన గురుకృప ఉంటే అన్నీ సాధ్యమే! అని పెద్దలు అంటారు.

ఈ రోజు మనం అటువంటి గురువుని గురించి తెలుసుకుందాం.

“ఈతడు ఏ కళాశాలలో అధ్యాపకుఁడయినను అచటి బాలురకు మేలు చేకూరుతుందని నా విశ్వాసము” అని తన గురువైన విద్వాన్ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారిచే ప్రశంసించబడిన, విద్యార్థుల పక్షపాతి అయిన ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి గురించి తెలుసుకుందాం.

నా యీ ప్రయత్నం సింధువుని బిందువులో చూపడం లాంటిది.

వీరు విజయనగరం జిల్లాలో కొత్తవలస ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాడ అగ్రహారంలో 22-09-1942న జన్మించారు.

తాతముత్తాతలు వేదం చదువుకుని తపస్సులు చేసుకునేవారు. దేవాడలో మహామహులైన సంస్కృత పండితులు ఉండేవారు. పెదనాన్నగారు వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు సంస్కృత పండితులు. వీరి పేరే ఈనాటి మన ఆచార్య సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి పెట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి వేదుల రాజ్యలక్ష్మి శ్రీ వేదుల కృష్ణమూర్తి గారు.

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో తాతా సుబ్బరాయశాస్త్రిగారు, అప్పల జోగేశ్వరశర్మగారు, పేరి వెంకటేశ్వరశాస్త్రిగారు, వఝ్జల చినసీతారామశాస్త్రిగారు వంటి మహనీయులు ఎందరో అక్కడ అధ్యాపకులుగా ఉండేవారు. శ్రీ కృష్ణమూర్తిగారు అక్కడ ఎనిమిది సంవత్సరాలు చదువుకున్నారు.

శ్రీ బులుసు వెంకటరమణయ్యగారితో కలిసి ఒకే గదిలో ఉండేవారు. చిన్నాన్నగారు మరియు పెదనాన్నగారి అబ్బాయి కూడా ఈ కళాశాలలోనే చదువుకున్నారు. ఆ విధంగా వేదులవారి కుటుంబం నుండి ముగ్గురు సంస్కృత పండితులు వచ్చారు.

సంస్కృత, ఆంధ్ర సాహిత్య తత్వోపదేశికులు, ‘ఉభయ భాషాప్రవీణ’, పట్టభద్రులు అయినశ్రీవేదుల కృష్ణమూర్తిగారు విశాఖపట్నంలోని సి.బి.ఎం.హైస్కూల్లో పనిచేస్తూ ఉండేవారు. తండ్రిగారి ఉద్యోగం, ఇల్లు, వాకిళ్లు అన్ని విశాఖపట్టణంలోనే ఉండేవి. అయినప్పటికీ పండగలకు, సెలవులకు దేవాడ గ్రామం వెళుతూ ఉండేవారు.

దేవాడ గ్రామీణ వాతావరణం. పండిత కుటుంబాలు ఎక్కువ నిత్యము వేదఘోషతో ‘ఋషివాటిక’ వలె ఉండేది. చెరువులు, మామిడితోటలు, స్నేహితులతో ఆటలు చాలా చక్కని బాల్యాన్ని అనుభవించే అవకాశం శాస్త్రిగారికి కలిగింది. సెలవుల్లో హోంవర్కులు, టీచర్ల దండనలు, పెద్దవాళ్ల అదిలింపులు లేని స్వేచ్ఛతో కూడిన బాల్యం అది.

“మాతృదేవోభవ!

పితృదేవోభవ!

ఆచార్య దేవోభవ!”

ప్రథమ గురువుగా తల్లి పెద్ద బాలశిక్షలోని అవసరమైన విషయాలను నేర్పుతూ ఇంగ్లీషులోని అక్షరాలు నాలుగుబళ్ళూ వ్రాయడం కూడా నేర్పారు.

తండ్రి కృష్ణమూర్తిగారు, పెదనాన్నగారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు సంస్కృత గ్రంథాలలోని విషయాలు, శ్లోకాలు, మొదలైనవి సవివరంగా నేర్పించారు. ఆ విధంగా ఎలిమెంటరీ పాఠశాలకు వెళ్లకుండానే ఐదవ తరగతి ఎంట్రెన్స్ పరీక్ష రాసి ఆరవతరగతిలో తండ్రి పనిచేస్తున్న సి.బి.ఎం. కళాశాలలో చేరారు. అక్కడి నుండి ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ చదివి, 1956 సంవత్సరంలో పరీక్ష రాసి, మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అటువంటి పండితుల వంశంలో తండ్రి పేరుకి వన్నె తెచ్చినట్లుగా అంచెలంచెలుగా స్వయం కృషితో, గురుకృపతో ఎదిగారు.

ఇక్కడ మనందరం తెలుసుకోవలసిన ఒక మార్పు వారి జీవితంలో ఉన్నది. ఏమిటంటే ఆ రోజుల్లో తెలుగుభాష చదువుకోవడం లేదా సంస్కృత పండితులు కావడం సంస్కృతి సంప్రదాయం అయితే కావచ్చునేమోగాని పొట్టనింపడానికి మాత్రం అది ఉపయోగపడే విద్య కాకపోయింది. అందువలన తండ్రిగారు వీరిని ఇంగ్లీష్ చదువులు చదివించాలని మంచి డాక్టరుని చేయాలని భావించారు. ఆ రోజులలో పిల్లల యొక్క చదువుల బాధ్యత ఏం చదవాలి? అన్నది తల్లిదండ్రులే నిర్ణయించేవారు. అందువలన మన సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కూడా అంగీకరించి ఇంగ్లీష్ చదువులో చేరారు. ఎ.బి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్ బై.పి.సి. గ్రూప్ తీసుకొని చేరడం జరిగింది. అంతకు ముందు వరకు సంస్కృతము, ఆంధ్రము, కావ్యాలు, పద్యాలతో కుటుంబ నేపథ్యం ఉన్న పరిస్థితులలో ఈ ఇంగ్లీష్ చదువు చాలా కష్టపడ వలసి వచ్చింది.

ఒకరోజు ఒక జ్యోతిష్యుడు వీరి ఇంటికి వచ్చి వీరిని చూస్తూనే “ఇతడు మహా పండితుడవుతాడని” చెప్పారు. అతని మాటలు నమ్మి, నా కుమారుడు ఒక గొప్ప పండితుడు అవుతాడు అంటే అంతకంటే కావలసినది ఇంకేముంటుంది? అనుకున్నారు. అందువలన అదే కళాశాలలో బి.ఎ. తెలుగు చదవడానికి సిద్ధపడి, బి.ఎ. ఆనర్స్ నాలుగు సంవత్సరాలు ఎం.ఏ. ఒక సంవత్సరం మొత్తం ఐదు సంవత్సరముల చదువుకి చేరారు.

అప్పుడు అక్కడ శ్రీ గంటి జోగి సోమయాజులుగారు తెలుగు శాఖాధిపతిగా ఉండేవారు. వారు నడిచే విజ్ఞానసర్వస్వం. పురాణాలు, దర్శనాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు అన్నిటిని గురించి అద్భుతంగా చెప్పేవారు. ఎవరు సెలవు పెట్టినా ఆయన ఆ క్లాస్ తీసుకునేవారు. “తెలుగు సంస్కృతాలల్లో కొంత ప్రవేశం ఏర్పడడానికి నా గురువుల కృపయే కారణము.” అంటారు శాస్త్రిగారు. అతను భాషా వికాసం పాఠం చెప్పినప్పుడు భాషను ఎలా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? మొదలైన విషయాలను చాలా చక్కగా చెప్పేవారు.

విద్వాన్ దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారి ప్రియ శిష్యుడిగా వారి వద్ద బాల వ్యాకరణం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. అంతే కాకుండా ఆంధ్ర శబ్ద చింతామణి కూడా ఉండేది.

ఆచార్య ఎస్.వి.జోగారావుగారు విద్యార్థులతో చాలా చనువుగా ఉండేవారు. వీరే కాకుండా ఆచార్య తూమాటి దోణప్ప గారు, శ్రీరామ్మూర్తిగారు సంస్కృత ఆంధ్రాలలో ఎన్నో విషయాలను బోధించారు.

‘వ్యాకరణాలంకార చక్రవర్తి’, ‘సాహిత్య విశారద’, ‘సర్వజ్ఞ శేఖర’, ‘వాచస్పతి’ బిరుదాంకితులైన అప్పల జోగి సోమేశ్వరశర్మగారు విజ్ఞానకౌముది, వ్యాకరణము, మీమాంస, వేదాంతం, శంకరభాష్యం మొదలగునవి ఇంటికి వచ్చి 15 రోజులలో చెప్పారు. వారి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.

సంస్కృతాంధ్ర భాషలను ఎంతో ఇష్టంగా నేర్చుకున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారు బి.ఏ. ఆనర్సులో అన్ని సబ్జెక్టులలో ప్రథమునిగా ఉత్తమ బహుమతి లభించింది. ఎ.బి.ఎన్. కళాశాలలోనే చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావడం జరిగింది.

అదే విధంగా యూనివర్సిటీలో కూడా ప్రథమ బహుమతి లభించింది. 22 సంవత్సరాల వయసులో 1965లో ఎ.బి.ఎన్. కాలేజీలో అధ్యాపకునిగా చేరారు.

అంత చిన్న వయసులో అధ్యాపకునిగా ఉద్యోగం రావడం విద్యార్థుల దగ్గర మంచి పేరు తెచ్చుకుందుకు ఎక్కువగా కష్టపడేవారు. చెప్పబోయే పాఠాన్ని ముందుగానే తండ్రి దగ్గర చెప్పించుకుని వెళ్ళేవారు. అవసరం ఏదైనా నేర్పుతుంది అని అంటారు కదా! ఈ విధంగా తెలుగు, సంస్కృత భాషలలో మంచి పాండిత్యం లభించింది. అంతేకాక కళాశాలలో అన్ని భాషల విభాగాల ప్రముఖులతో మంచి పరిచయాలు ఉండేవి.

శాస్త్రిగారు పాఠం చెప్పే విధానం వారికి నచ్చి, మంచి అధ్యాపకునిగా పేరు వ్యాప్తి చెందింది. అప్పటినుండి నగరంలో జరిగే సాహిత్య సమావేశాలలో ప్రసంగించడానికి పిలిచేవారు. పుస్తకాలకు పీఠికలు కూడా వ్రాసేవారు. గ్రంథరచన పట్ల ఆసక్తి, వ్యాసాలు రాయడం, ప్రసంగాలు చేయడం ఇలా సాగిపోతున్న జీవితం.

వీరిది ఉమ్మడి కుటుంబం. తమ్ముడైన వేదుల రామకృష్ణ సూర్య శివప్రసాదు బి.కాం. చదివి, ఫుడ్ కార్పొరేషన్‌లో పనిచేసారు. వీరిరువురికి 16 సంవత్సరములు తేడా ఉన్నది. ఇతని భార్య వేదుల పద్మావతి వీరికి ఇద్దరు పిల్లలు.

కుమార్తె గంటి నాగలక్ష్మి దీప్తి. అల్లుడు గంటి వెంకట రామచంద్ర ఫణీంద్ర ఎమ్మెస్ చేశారు వీరు అమెరికాలో ఉంటారు. వీరి అమ్మాయి వేదుల రాజ్యలక్ష్మి సౌమ్య బి.టెక్. సరోజకి ఇంకా పెళ్లి చేయవలసి ఉన్నది.

వివాహాలు దైవనిర్ణయాలుగా, తల్లిదండ్రులు అంగీకరించిన వారిని పెళ్లి చేసుకోవడం ఆనాటి కుటుంబ సంప్రదాయం.

ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉన్న ఉభయ భాషా ప్రవీణుడైన సుబ్రహ్మణ్యంగారికి, బాల్యం నుండి ఒరిస్సాలో ఉంటూ, తండ్రి ఉద్యోగం కోసమై అనేక ఊర్లు తిరుగుతూ ఒరియా మీడియంలో చదువుకున్న బరంపురంలో ఉంటున్న ప్రభావతిగారికి మంచి సంబంధం అని బరంపురంలో ఉన్న బంధువులు, పెద్దలు కుదిర్చారు. ప్రభావతి గారి తల్లిదండ్రులు శ్రీమతి మరువాడ రామలక్ష్మి శ్రీమరువాడ వెంకటరమణగారు.

శ్రీమతి ప్రభావతిగారి తాతగారు కటక్ లో హైకోర్టులో పనిచేసేవారు. అమ్మమ్మ, తాతగారు నియమనిష్ఠలు కలిగిన సంప్రదాయ కుటుంబం. తండ్రి డివిజనల్ అకౌంటెంటుగా ఒరిస్సాలోని అనేక ఊర్లు ప్రతి మూడు సంవత్సరములకు బదిలిపై తిరుగుతూండేవారు. ఆమె తన విద్యాభ్యాసాన్ని ఒరియా మీడియంలోనే కొనసాగించారు. వీరి తల్లి గృహిణి. మంచి సంప్రదాయంగల కుటుంబం.

ఇటువంటి కుటుంబం నుండి వచ్చిన ప్రభావతిగారు వేదుల వారి ఇంట్లో ఒద్దికగా ఒదిగిపోయారు. అత్తవారి ఇంటిని ఒక ఆశ్రమంలాగా భావిస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటూ మరిదిని, ఆడపడుచుని, అత్తమామలను చూసుకుంటూ ఉండేవారు.

‘వివాహం విద్య నాశాయ’ అని నానుడిని తిరగరాస్తూ ఆమె ఇంటి వద్దనే ఉండి ప్రైవేటుగా మెట్రిక్ పరీక్ష నుండి ఎం.ఎ. తెలుగు పరీక్ష వరకు చదువుకొని విజ్ఞానవంతురాలయ్యారు.

భవిష్యత్తులో శాస్త్రిగారి సాహితీ ప్రయాణంలో కూడా చేయూతను అందించారు ఆమె.

2021సం.లో ‘సాహిత్య సామ్రాట్’ శ్రీ విక్రమదేవువర్మ డి.లిట్.(గౌ) ఒరిస్సా, జయపూర్ సంస్థానం ప్రభువుల 150వ జయంతి సందర్భంగా ఒరియా కథలకు తెలుగు అనువాదం చేసి ‘కథామంజరి’ పేరుతో వెలువరించారు. తన మాతృమూర్తి అయిన శ్రీమతి మరువాడ రామలక్ష్మిగారికి ఎంతో భక్తిప్రపత్తులతో అంకితం ఇచ్చారు. దీని వెల మాతృభక్తి.

కృష్ణమూర్తిగారు పదవీ విరమణ చేసిన తర్వాత ఇంటి పనులన్నీ అతనే చూసుకుంటూ ‘విజ్ఞానము సంపాదించు’ అని కుమారునికి బోధించేవారు. వారి సలహాలను సూచనలను పాటిస్తూ వారి వద్దనే సందేహాలు నివృత్తి చేసుకుంటూ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నందు తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఎం.ఎ. పరీక్షలలో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులైనారు.

1965 నుండి 75 వరకు ఏ.బి.ఎన్. కళాశాలలో అధ్యాపకునిగా ఎంతో అనుభవాన్ని గణించారు.

ఆంధ్రయూనివర్సిటీలో 1975లో తెలుగు అధ్యాపకులుగా చేరారు. తెలుగు శాఖాధిపతి పదవిలో ఆచార్య ఎస్.వి. జోగారావుగారు ఉండగా కె.శ్రీరామమూర్తిగారు, సి.హెచ్. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, చక్రధరరావుగారు, సూర్య ప్రకాశరావుగారు; మలయ వాసిని గారు వీరందరూ తెలుగు భాషకు అత్యున్నత సేవ చేసిన ఆచార్యులు.

1976లో విస్మాన్సిన్ స్టేట్ యూనివర్సిటీ అమెరికాలో విజిటింగ్ ప్రొఫెసరుగా పని చేశారు.

ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో సుమారు 25 ఏళ్లు శ్రీ దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారి శిష్యునిగా అభ్యసనము గావించి మొదటిశ్రేణి విద్యార్థిగా, అధ్యాపకునిగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందడానికి కారణము వీరి యొక్క నిరంతర కృషియే!

పరిశోధనలు:

తెలుగులో ‘పంచతంత్ర చంపువు’ పరిశోధనాంశంగా (ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ పట్ట పరిశోధన నిబంధము) తీసుకున్నారు.

వీరికి పరిశోధనలో ఆచార్య కె.వి.ఆర్.నరసింహంగారు; ఆచార్య తూమాటి దోణప్పగారు పరిశీలకులుగా వ్యవహరించడం వీరి అదృష్టం. 1986లో పరిశోధక పట్టా అందుకున్నారు.

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారి అనుమతితో, పితృదేవులు అందించిన ఆర్థిక సహాయంతో ఇది పుస్తక రూపంలో వెలువడడం తన తల్లిదండ్రులైన శ్రీమతి వేదుల రాజ్యలక్ష్మి & శ్రీ వేదుల కృష్ణమూర్తి గారికి అంకితం చేసారు. ఈ సందర్భంగా

“సాధ్వి! శ్రీ రాజ్యలక్ష్మి మజ్జనని కృష్ణ

మూర్తి జనకుఁడు వాత్సల్య మూర్తి బుధుఁడు

కంటినిన్ ఱెప్పలనఁగ నన్గాచి ప్రోచు

తల్లిదండ్రులకిది యంకితమ్ము భక్తి.”

ఈ గ్రంథరాజమునకు ‘సహృదయ భూమిక’ వ్రాసి అందించిన ప్రొఫెసర్ ఎస్వీ జోగారావు గారు; ‘పరోచన’ పేరుతో ‘కళాప్రపూర్ణ’ డా.దివాకర్ల వెంకటావధాని గారు;

“పంచతంత్రానువాదానాం

చంపూనాం సద్విమర్శనమ్

సుబ్రహ్మణ్యకృతం జీయాత్

జగత్యాచంద్ర తారకమ్.”

అని ఆశీస్సులు అందించారు.

మిత్రులైన డాక్టర్ లకంసాని చక్రధరరావుగారు ప్రశంసించారు.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో చిన్ననాడే సాహిత్య మంత్రోపదేశం చేసిన తండ్రి బ్రహ్మశ్రీ వేదుల కృష్ణమూర్తిగారితోపాటు అందరికీ పేరుపేరునా స్మరించుకుని కైమోడ్పులు సమర్పించారు.

చిన్ననాటి నుండి సంస్కృతం పై ఉన్న అభిమానంతో ఇందులో కూడా పరిశోధన చేయాలని అనుకున్నారు. అందుకు తనకు ఎంతో ఇష్టమైన రామాయణంలో నుండి “శ్రీమద్రామాయణే పురుషార్థ వివేకః” అను అంశముపై డా.అక్కుభొట్ల శంకర్ గారి పర్యవేక్షణలో 1996వ సంవత్సరంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

తరువాత కాలంలో దీనిని ‘రామాయణంలోపురుషార్థాలు’ అనే పేరుతో 2008 సంవత్సరంలో పుస్తక రూపంలో తెలుగులో ప్రచురించారు. దీనిని తన అర్ధాంగి అయిన శ్రీమతి వేదుల ప్రభావతి గారికి అంకితం ఇచ్చారు.

రామాయణంలో పురుషార్థాలు పేరుతో ధర్మార్థ కామ మోక్షాల మీద వీరు ఇచ్చిన ప్రసంగాలు ఆ ప్రసంగాలను తిరిగి అందరికీ అందించే విధంగా పుస్తక రూపంలో వెలువరించారు. ఈ కావ్య విలువలను గురించి శ్రీ శ్రీ భాష్యం అప్పలాచార్యులు వారు తమ ప్రసంగంలో ప్రశంసించారు.

ఈ విధంగా ఆంధ్రము, సంస్కృతము రెండు భాషలలోను పి.హెచ్.డి. చేసినవారు అరుదు. బహుశా వీరే ఈ ప్రాంతములో మొదటి వారు కావచ్చు.

సంస్కృతమునందు మిక్కిలి కృషిచేసి వ్యాకరణమునందు మరియు ఇతర పరీక్ష పాఠ్య గ్రంథములయందు మంచి జ్ఞానమునుసంపాదించగలిగారు.

వీరి గురించి పెద్దలు ఇలా అంటారు. బుద్ధిశాలి, విద్యావ్యాసంగంలో మిక్కిలి శ్రద్ధాళువు. జ్ఞాన సంపాదనములో నిరంతరాసక్తుడు. సౌశీల్యము, సత్ప్రవర్తన కలవారు.

డా. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వద్ద అనేకమంది పరిశోధనలు చేసి డాక్టరేటుని పొందారు. వారిలో ప్రధమ పరిశోధక పండితుడు విజయనగరానికి చెందిన ‘ఆంధ్ర వైయాకరణ వాచస్పతి’ ‘వైయాకరణ సార్వభౌమ’ ‘ప్రవచన ప్రవీణ’ ‘నేత్రావధాని’ అయల సోమయాజుల గోపాలరావు గారు. వీరు వఝ్జల చిన సీతారామశాస్త్రిగారిపై పరిశోధన చేసి సువర్ణ పతకము పొందారు.

వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తాను నివసించే ఇంటిని శారదాపీఠంగా భావించి ఆమెను ప్రార్థించిన తరువాతనే రచనకు శ్రీకారం చుట్టే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సరస్వతీపుత్రులు.

“శారదాపీఠమైన మా సదనమందు

నందుకొలువయి యుండెడు నీరజాక్షి

జ్ఞాన విజ్ఞాన నిధులనొసంగు దేవి

అమ్మ శారద పాదమ్ము లాశ్రయింతు”

అలాగే సుమారు సహస్రాధిక ప్రసంగములు చేసినా ముందుగా

“ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం

ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం

అంటూ అమ్మవారి ప్రార్థనతోనే ప్రారంభిస్తారు.

ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో 1975లో చేరిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 2002 లో పదవీవిరమణ చేసేవరకూ లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు పదవులను నిర్వహించి, ఏ పదవిలో తానున్నా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా సేవలు అందించారు.

నిత్యవిద్యార్థిగా, సమయపాలనతో అనేక పత్ర సమర్పణలు, పుస్తక ప్రచురణలు గావించి ఆధ్యాత్మిక భావనలతో అనేక చోట్ల ప్రసంగాలు చేసి శ్రోతలను అలరింప చేశారు.

వీరికి ఇరువురు పుత్రులు. వారు మంచి విజ్ఞానవంతులు. వీరి ప్రమేయం లేకుండానే వారంతట వారే చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగారు.

చి.వేదుల వెంకటసుబ్రహ్మణ్యం పెద్ద కుమారుడు ఐ.ఐ.టి.లో బి.టెక్. ఎం.బి.ఎ. చేసారు. ఇతని భార్య చి.సౌ.వేదుల హైమవతి వీరికి ఇద్దరు పిల్లలు. కుమారి.వేదుల నాగదీక్షిత: చి.వేదుల వెంకటకార్తీక్.

డా.వేదుల రామకృష్ణ రెండవ కుమారుడు బి.టెక్. పి.హెచ్.డి. చేసారు. ఇతని భార్య వేదుల ఫణి శ్యామల బి.టెక్. చేశారు. వీరంతా అమెరికాలో ఉన్నారు.

వీరి కుమార్తె చి.సౌ.వడ్లమాని శారద; అల్లుడు చి.వడ్లమాని వెంకట సోమశేఖర్ ఎం.టెక్. ఓ.ఎన్.జి.సి. లో పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు. వడ్లమాని లావణ్య; ఆదిత్య.

డా. వేదుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మరియు ప్రభావతి దంపతులకు చిరంజీవి ఆరాధ్య ముని మనుమరాలు.

ఈ దంపతులకు అమెరికా అయినా భారతదేశం అయినా ఒక్కటే! అందుకే ఎక్కడికి వెళ్ళినా శిష్యులు వీరిని గుర్తించి తాము నేర్చుకున్న పద్యాలను వెంటనే విన్నవాళ్ల హర్షాతిరేకాల మధ్య పద్యాలను, శ్లోకాలను పోటీపడి చెపుతూ ఉంటారు. ఏ గురువుకైనా ఇంతకంటె గొప్ప గౌరవం, సంపద ఏముంటుంది?

సాహిత్య ప్రస్థానం:

సంస్కృతము, తెలుగు భాషలందు గల అపార పరిజ్ఞానము వలన అనేక కావ్యాలను పఠించేవారు.

కావ్యాలను అధ్యయనం అధ్యాపనం చేయడం సులభం. కానీ కావ్యంలోని అంతర్గత భావాలను అందుకోవాలంటే నిరంతర సాధన అవసరమని తలచారు. అందువలన సద్గురువులు అనేక మందిని ఆశ్రయించి వారి ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటూ కావ్యములో కవి ఆశించిన రసాన్ని ఆస్వాదించేవారు. కావ్యములోని బాహ్యాంశాలను కాక విశేషాంశాలను రససిద్ధికి చేర్చగలిగేవారే సాహిత్యం యొక్క పరిపూర్ణ రససిద్ధి పొందినవారు. కవులు ఎందరో ఉంటారు. కానీ మహాకవులు కొందరే ఉంటారు. వారి కోవకు చెందిన వారే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.

యూట్యూబ్ ద్వారా విద్యార్థులలో భాష పట్ల అభిరుచిని పెంచడానికి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు మరియు ఆదికవి నన్నయ యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన అంతర్జాల వేదికపై తన గురువైన ‘భాషా చతురానన, కళాప్రపూర్ణ’ తొలితరానికి చెందిన భాషాశాస్త్రవేత్త, నిరంతర అధ్యయనశీలి అయిన శ్రీ గంటిజోగి సోమయాజులుగారి గురించి అద్భుతమైన ప్రసంగాన్ని చేసి శ్రోతలను అలరించారు.

తన గురువుల పేరులను స్మరించకుండా వారి గొప్పతనాన్ని చెప్పకుండా ఈయన ప్రసంగాలు ఉండవు అన్నది అతిశయోక్తి కాదు. అధ్యాపకునికి ఉండవలసిన లక్షణాలను గురించి కాళిదాసు ఈ విధంగా చెప్పారు.

కవికులగురు: కాళిదాసు:

శ్లిష్టా క్రియా కశ్చిత్ ఆత్మసంస్థా సంక్రాతిరన్యస్య విశేషయుక్తా।

యస్యోభయం సాధు స శిక్షాణాం ధురి ప్రతిష్టాపయితవ్య యేవ।।

భావం:

కొందరికి సబ్జెక్టులో మంచి పరిజ్ఞానం ఉంటే, మరికొందరు బాగా బోధించగలుగుతారు. కానీ మంచి జ్ఞానం మరియు బాగా బోధించేవాడు అన్నింటికంటే ఉన్నతంగా ఉంచబడతాడు.

ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి గల బిరుదములు:

ఆచార్య సార్వభౌమ; విజ్ఞాన వివేకవిభూషణ; వాణి విభూషణ; ఆధ్యాత్మికరత్న; వాజ్ఞ్మయ కళాప్రపూర్ణ; సాహితీ కళాసామ్రాట్; ఆంధ్రరత్న; విద్యా వాచస్పతి మొదలైనవి

ప్రధాన పురస్కారములు:

  • సువర్ణ సింహలలాటం

శ్రీ కంచి కామకోటి మహా సంస్థానం శంకరమఠం విశాఖపట్నం

  • శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్
  • సువర్ణ కంకణం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ప్రదానం

ముద్రిత గ్రంథాలు:

వీరు ప్రచురించిన గ్రంథాలు వెల చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ గ్రంథం మనం పొందడానికి కావలసిన అర్హతయే దాని వెల.

తొలి రచన :1974

  • ఏకాంకికా ద్వయం. సాహిత్య పిపాసయే దాని వెల. (వరూధినీ ప్రవరమ్, కల్యాణమ్ సంస్కృత రూపకాలు)
  • జానపద గేయ సాహిత్య ప్రభ 2002 షష్టిపూర్తి ప్రచురణ అంకితం ఆచార్య శ్రీ ఎస్వీ జోగారావు గారు

జానపద గేయ సాహిత్య ప్రభ

జానపద గేయ శాఖలోని వీరగాథ సాహిత్యాన్ని ఐచ్ఛిక పాఠ్యాంశంగా తీసుకున్న విద్యార్థులకి పాఠం చెప్పవలసి వచ్చింది. ఆ సందర్భంలో జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాల అధ్యయనం చేశారు. జానపద సాహిత్య స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘తెలుగు జానపద గేయ సాహిత్యము’ అనే గ్రంథం;

ఆదిశేషువుగారి ‘జానపద గేయ వాజ్ఞ్మయ పరిచయం’ వీరగాథా సాహిత్యానికి సంబంధించి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారి గ్రంథాలు.

ఆచార్య ఆర్. వి. ఎస్. సుందరం, డా.జి.ఎస్.మోహన్ వీరి రచనలన్నీ చదివి విద్యార్థులకు సాహిత్యాన్ని బోధిస్తూ ఈ వ్యాసాంగానికి అక్షరాకృతి ఇవ్వాలని జానపద సాహిత్య స్వరూప స్వభావాలను పరిచయం చేసే గ్రంథం తయారైంది.

పౌరాణికం, సాంఘికం, తాత్వికం, వీర గాధలు, కురుక్షేత్ర యుద్ధం, పల్నాటి యుద్ధం, బాలచంద్రుని వీర గాధ, బొబ్బిలి కథ, ఓరుగల్లు కోటకు చెందిన సర్వాయి పాపని కథ, చేబ్రోలుకు చెందిన చిన్నపరెడ్డి కథ

వీటిని జానపదులు గేయ రూపంలో పాడడంలో అనుసరించిన విధానాలు బుర్రకథలు, నాటకాలు, యక్షగానాలు, పల్లె పాటలు, అనేక రూపాలలో ఈ కథలు ప్రజలలో ప్రచారంలోకి వచ్చాయి.

  • శివానందలహరి వివరణ శంకర భగవత్ పాదులు (2004 & 2006)

అంకితం: గట్టు నారాయణ గురూజీకి

రామాయణం పై గల ఇష్టంతో సుమారు ఐదు గ్రంథాలు వ్రాసి ప్రచురించారు.

  1. బాల రామాయణము(2007) రామభక్తియే దాని వెల. అంకితం: సీతారాములు
  2. అద్భుతరామాయణం అనువాదం(2007) పితృభక్తియే దీని వెల అంకితం: తల్లిదండ్రులైన రాజ్యలక్ష్మిగారికి కృష్ణమూర్తిగారికి శత జయంతి సందర్భంగా ప్రచురించారు.
  3. రామాయణ ప్రసంగలహరి (2009) రామభక్తియే దాని వెల. అంకితం:శ్రీ గట్టు సీతారామన్న శతజయంతి ప్రచురణ
  4. భాగవత రసాయనం (2007), పితృ,గురుభక్తియే దాని వెల అంకితం: పద్మసోలల పాపారావుగారు సుబ్బలక్ష్మిగారు శతజయంతి ప్రచురణ. భాగవత రసాయనం – వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ముముక్షువులకు కల్పవృక్షమైన భాగవతాన్ని భాగవత రసాయనం పేరిట అందరకు అందించడం ఆయన భాష సామాన్యులు, మాన్యులు, ధీమాన్యులు, అసామాన్యులు, అందరి హృదయాలలోనికి నేరుగా వెళ్లి ఆనందపరచి తల ఊపించే రమ్యమైన అక్షర వాక్య భాష, అర్థ సందేశ సముదాయం.

భాగవత భక్తిని పర్యావలోకనం చేసి పరిశోధన పర్యాలోచన, పరిశోధనాయుతమైన పరమార్ధ గ్రంథముగా రచించారు.

భాగవతము సమస్త పురాణాల సారము. మూల గ్రంథాలను క్షుణ్ణంగా చదివి తాను రసానుభూతిని పొంది పాఠకులకు సులువైన పదాలతో అరటిపండు వలిచి నోట పెట్టినట్టు రాయటం అనేది సూర్యనారాయణశాస్త్రిగారికి వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే తాను రససిద్ధి కోసం అందరకు తెలిసిన పద్యాలను ఎంపిక చేసుకుని వాటిలోని గొప్పదనాలను చెప్పడానికి వ్రాయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి చెప్తూ తాను రాయటం నవవిధభక్తి మార్గాలలో భగవత్ సేవ మోక్షప్రదమని, భక్తులకు ఉండవలసిన లక్షణాలను గురించి భాగవతంలో అనేక సందర్భాలలో చెప్తారు. వాటికి సంబంధించిన పద్యాలను కిరీటంలో వజ్రాలను పొదిగినట్టుగా పద్యాలను ఎంపిక చేసుకున్నారు.

  1. ఆధ్యాత్మ రామాయణం అనువాదం (2007) అంకితం: ఆదర్శగృహిణి చూడామణిగారికి
  2. సౌందర్యలహరి ముద్రణ (2004; 06;12;14) పితృభక్తి; లలితాంబికాదేవి దయయే దీని వెల
  3. శంకర భగవత్పాదుల వివేక చూడామణి (2009) అంకితం: అప్పల సోమేశ్వర శర్మ దంపతులకు (శంకర జయంతి) – “మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తి రేవ గరీయసీ” అని శంకర భగవత్పాదులు ‘వివేక చూడామణి’లో పేర్కొన్నారు. శివానందలహరిలోని అన్ని శ్లోకాలుభక్తిరసానుభవానికి పరమలక్ష్యంగా ఉదహరించబడ్డాయి.
  4. ఆదిశంకరుల 5ప్రకరణములు (2012) జిజ్ఞాసయే దీని వెల. అంకితం:శ్రీగంటి లక్ష్మీనారాయణ దంపతులకు
  5. ఆదిశంకరుల అపరోక్ష అనుభూతి-ఆత్మబోధ(2012) 70వ పుట్టినరోజు కానుకగా బ్రహ్మజిజ్ఞాసయే దీనివెల. శ్లో: వేదులాన్మయవారాశేః వాకా పూర్ణ సుధాకరః/సుబ్రహ్మణ్య సుధీః భ్రాతా తస్మైభక్త్యా సమర్పతే//
  6. శంభూ శతకం (2012) చంద్రశేఖరాష్టకానువాదము. శివ భక్తియే దీని వెల. 70వ పుట్టినరోజు కానుక
  7. ఉత్తరకాండసంక్షిప్త వచనానువాదం(2014) అంకితం:శ్రీమతి ఎన్.పద్మావతిగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా. అనురాగమే దీని వెల.
  8. మాఘ కావ్యామృతం (శిశుపాలవధ సమీక్ష-2014), అంకితం: తల్లిదండ్రులకు
  9. శివ మహిమ్నః లఘు కావ్యం (2016). వెల: శివభక్తి. ఈ రచనను శ్రీ పుష్ప దంతాచార్యకృత “శ్రీ శివ మహిమ్నః స్తోత్రం” సౌరదీక్షా సార్వభౌమ, దత్త పీఠ బంధు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, కర్మయోగి, మహామహోపాధ్యాయ, పరమ పూజ్య సద్గురు శ్రీ కృష్ణయాజి గారి ధర్మపత్ని, సాధ్వీమణి, మాతృమూర్తి శ్రీమతి శుభలక్ష్మి గారికి తే.16-10-2016 దిన. సమర్పణ చేయడం అనేది వీరి యొక్క విశాల హృదయానికి ఒక మచ్చుతునక.
  10. భారవిభారతి (కిరాతార్జునీయ కావ్య సమీక్ష 2018) – అంకితం: వివాహ స్వర్ణోత్సవం 75వ జన్మ దినోత్సవం రాళ్లబండి చంద్రశేఖరరావు కమలాదేవి దంపతులకు
  11. వ్యాస కదంబం (2022) వెల: సాహిత్య రస పిపాస – 80వ జన్మ దినోత్సవ జ్ఞాపిక అంకితం: తూమాటిదోణప్పగారికి

అముద్రిత గ్రంథాలు:

  • శ్రీమద్రామాయణే పురుషార్థ వివేకః (సంస్కృతం)
  • అష్టదిగ్గజాలు
  • భాగవతసుధ
  • ఆధ్యాత్మికవ్యాసమంజరి *భారతంలోశాంతిపర్వం
  • ఆధ్యాత్మ రామాయణంలోని అపూర్వ కల్పనలు
  • బ్రహ్మవైవర్త పురాణ అనువాదం (టీటీడీ)
  • భారద్వాజవ్యాసావళి *కవిత్రయ భారతంలో కర్మతత్త్వ విచారం
  • ఆదిశంకరులఅవతారవిశేషాలు- కొన్ని లఘుకృతులు

అభిరుచులు:

  • వాగ్దేవతా పరివస్య -సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రసంగాలు సహస్రాధికం చేశారు.
  • అపురూప గ్రంథాలను రసహృదయులకు అందించడంలో సహకరించిన నిత్యస్మరణీయులు:
  • నాలుగు దశాబ్దాలు వీరి శిష్యరికాన్ని అనుగ్రహించిన ‘వాచస్పతి’ అప్పల సోమశేఖర శర్మ గురుచరణులు
  • అద్వైత భాషోపదేశం చేసిన గురుదేవులు శ్రీగంటి లక్ష్మీనారాయణ గురుపాదులు
  • వీరి యొక్క రచనలకు ఆర్థికంగా, హార్దికంగా ప్రోత్సహించిన మహా మహోపాధ్యాయ, సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు
  • నిత్యమూ ‘త్వమేవాహమ్’ అనే అద్వైత భావాన్ని చూపుతూ అనేక విధములుగా సహకరిస్తున్న ఆత్మీయ సోదరులు శ్రీ గట్టు నారాయణ గురూజీ మహోదయులు నిత్య స్మరణీయులు.

~

అనేక గ్రంథములను రచించడమే కాకుండా వాటిని ప్రచురించారు. అదే విధంగా ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు వాటిని అందరికీ అందుబాటులో అంతర్జాలంలో ఉంచారు. ప్రతి ఒక్క రచన కూడా ఆధ్యాత్మిక తో కూడిన మహనీయుల ప్రశంసలను పొందింది.

తరగతిగదిలో పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా సమాజానికి ఎంతో అవసరమైన ఆధ్యాత్మిక పరమైన ప్రసంగాలు యూట్యూబ్ ద్వారా కూడా చేశారు.

వాటిలో కొన్ని:

మాసానాం కార్తీకం శ్రేష్టః అని ప్రతీతి. ప్రతిరోజు కూడా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి బహుళ అమావాస్య వరకు ప్రతి దినము కూడా విశిష్టమైనది. అంటూ ఆ విశేషాలను వివరంగా చెప్పారు.

అదే విధంగా శంకరాచార్యుల వారి నిర్వాణ శతకం, భజగోవిందం, శరన్నవరాత్రులలో గాయత్రీదేవి వైభవం, కార్తీక మాస పూజలు,

శ్రీ భాష్యం అప్పలాచార్యుల శత జయంతిఉత్సవాలలో ‘హనుమత్ రామ సమాగమము’ అనే అంశముపై ప్రసంగించారు.

ఆశుకవిత్వంలో అగ్రగణ్యులు అవతార పురుషులైన ‘కొప్పరపు సోదరులు’ వారి వారసులు స్థాపించిన కళాపీఠం నిర్వహించిన కళాపీఠంలో సత్సంకల్పానికి ప్రతిరూపం ఈ కళా పీఠం అంటూ వారు చెప్పిన పద్యాలను రాగయుక్తంగా పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పద్మశ్రీ’ గరికపాటి నరసింహారావుగారి అవధానంలో అప్రస్తుత ప్రసంగం చేశారు.

గాయత్రి విద్యా పరిషత్ సంస్థలు ‘గురుపూర్ణిమ’ సందర్భంగా నిర్వహించిన సభలో సంస్కృత, తెలుగు భాషాపండితులైన డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని సభాధ్యక్షులుగా గౌరవించారు.

విశాఖపట్నంలో రావిశాస్త్రి గారి 94వ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని రా.వి.శాస్త్రిగారి రచనలు వాస్తవ సంఘటనలతో కూడిన సన్నివేశాలు, నిజజీవితంలో కనిపించే పాత్రలు, తెలుగు భాషకు సజీవ రూపాలని ప్రశంసించారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారు నిర్వహించే ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ అనే కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని అనేక విషయాలను ఇరువురూ ముచ్చటించి శ్రోతలను ఆనందపరిచారు.

డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు పరిపూర్ణ భాషా పరిజ్ఞానము, వేదాంత విజ్ఞానం, అద్భుత రచనా కౌశలము, మరియు పరిణతి చెందిన బోధనా శక్తి, మేళనము చేసి పరమాత్మకు నైవేద్యము మనకు ప్రసాదము అనదగిన రచనలు అందిస్తున్నారు. తాను ఇంత ఉన్నత స్థితికి చేరడానికి సాహిత్యంపై 60 సంవత్సరాలు చేసిన కృషి, విస్తారమైన తన సాహిత్య ప్రస్థానం గురువుల పరిపూర్ణ అనుగ్రహం వలన మాత్రమే సాధ్యపడిందని వారిని స్మరించుకోవడం ముదావహం.

చిరునామా:

‘ఆచార్య సార్వభౌమ’ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శారదాపీఠం

46-15-35; దొండపర్తి; విశాఖపట్నం-16

ఫోన్: 9890084217.

***

(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here