పరిమళ భరితంగా వీచే మాండలికపు సొబగులు ప్రొ. మహాసముద్రం దేవకి గారి రచనలు

3
3

[ప్రొ. మహాసముద్రం దేవకి గారి ‘మా వొరిగి పల్లి గెవనాలు’, ‘ఇర్లచెంగి కథలు’ పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తున్నారు శ్రీమతి శీలా సుభద్రాదేవి.]

[dropcap]“వా[/dropcap]స్తవానికి ఇందలి ముచ్చట్లను ఎవరికి వారుగా చదువుకొని మురిసిపోవాల్సిందే తప్ప ఎవరూ వ్యాఖ్యానించకూడదు. సాహిత్యంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను చాలా సునాయాసంగా, అందంగా, మధురస నిష్యందంగా సాధించిన రచయిత్రి మహాసముద్రం దేవకిగారు” – అంటారు సింగమనేని నారాయణ.

చిక్కని చిత్తూరు మాండలికంలోని నామిని ‘సినబ్బ కథలు’ కావచ్చు, తెలంగాణా పాలమూరు మాండలికంలోని యశోదారెడ్డి ‘మావూరి ముచ్చట్లు’ కావచ్చు, ముక్కామల చక్రధర్ ‘c/o కూచిమంచి అగ్రహారం’ కథలు కావచ్చు, ఒక స్వచ్ఛమైన ఆయాప్రాంతాల నోష్టాలజీనీ తెలియ జేస్తాయి.

అదే కోవలోని మహాసముద్రం దేవకిగారి చిత్తూరు జిల్లాలోని ‘వొరిగిపల్లి గెవనాలు’, ‘ఇర్లచెంగి కథలు’ చదువుతున్నంత సేపే కాక గుర్తుచేసుకున్నప్పుడు కూడా చిత్తూరు ప్రాంత చిక్కని మాండలికపు సొబగులు పాఠకుల హృదయాలపై పరిమళ భరితంగా వీస్తాయి.

చదువుకోవాలని తపనపడి చదువుకే కాక నచ్చినవానికీ దూరమై సంసార బాధ్యతలకు బందీయై చివరకు ఇహలోకం నుంచే దూరమైన కస్తూరి కథ, అటువంటి పరిస్థితులే అయినా అన్న భరోసాతో, తల్లికి ఇష్టం లేక పోయినా ఇంటినుండి వెళ్ళి తన బతుకును దిద్దుకున్న రాదాబాయి, చేతిలో అరటిపండు పడేసరికి వ్రతాలు, నోములు దండిగా చేసే సంపూర్ణక్క, రాధాబాయి పెండ్లి అనుభవంతో వొరిగిపల్లిలో రెండోదిగా నమోదైన సుశీల వర్ణాంతర వివాహం, యామలత, సాలమ్మ,పుష్పా ఇలాంటి స్త్రీలు తన జీవనయానంలో తటస్థ పడిన, తనతో బాటు అడుగులు వేసిన ఎందరెందరో మహిళల్ని తన జ్ఞాపకాలతో సజీవం చేసారు రచయిత్రి దేవకి.

ఈనాడు పల్లెలన్నీ నగరీకరణలో ఎలా ధ్వంసమయ్యాయో, రాజకీయ కక్షలలో ఎలా ఛిద్రమయ్యాయో తెలియదు. కాని దేవకి మనసు పేటిక లోంచి ఆమె తెరచి చూపిన జ్ఞాపకాలలోని అద్భుతమైన గ్రామీణ దృశ్యాలను పాఠకుల కళ్ళముందు పరిచారు.

పల్లెలోని గంటల మోత, పచ్చని పైరుల శోభలు, ఆడుతూ పాడుతూ తిరిగే అమాయకపు పిల్లల మందహాసాలు, జాతర్ల సంబరాలు, గ్రామీణ పండగల వేడుకలు, సంతలు మొదలైనవన్నీ ఈ కథల్లో కళ్ళ ముందు ప్రత్యక్షమౌతాయి.

ప్రతీ కథ వెనకా వున్న మానవీయ విలువలు, స్నేహపూర్వక మమకారపు అనుభవాలు వొరిగిపల్లి గెవనాలలో చదువుతున్నంత సేపూ పాఠకులకు ఒక కొత్త అనుభవం స్ఫురింపజేస్తాయి. మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ మహిళల జీవితాల చుట్టూరా వుండే సంఘర్షణలు, ఆవేదనలూ, స్నేహాలూ, ప్రేమలూ, పెళ్ళిళ్ళు మొదలగు సంఘటనలతో నడుస్తాయి. పాఠకులూ వాటితో బాటే నడుస్తారు.

సుమారు అరవై ఏళ్ళ నాటి జ్ఞాపకాలు దేవకి గారి మనసులో సజీవంగా వుండటం వలన ఆమె తన అనుభవంలో వున్న ఎన్నెన్నో సంఘటనల్ని దృశ్యమానం చేస్తూ కథలు రాసి ‘మా వొరిగిపల్లి గెవనాలు’గా పాఠకులకు అందించారు.

ఇక నాకు ఎంతగానో నచ్చిన రెండో పుస్తకానికి వద్దాం. చిన్నప్పుడు ఆటలంటే ఆరోప్రాణంగా వుండే దేవకికి స్నానం, తలదువ్వుకోవటం, తినటం వలన కాలం వృథా అవుతుందని చింపిరి తలతో చెట్లంటా పుట్లంటా తిరుగుతుందని తల్లి కోపంతో ‘ఇర్లచెంగి’ అనేదట. ఆ విధంగా తాను సృష్టించిన అల్లరి పిల్ల పాత్రని ఇర్లచెంగిగా తీర్చిదిద్దారు.

ఇర్లచెంగి కేంద్రంగా ఉత్తమ పురుషలో దేవకీ మహాసముద్రం రాసిన చిన్ని కథలే ఈ ‘ఇర్లచెంగి కథలు’. దేవకిగారి ఇర్లచెంగి అల్లరి పిల్ల, తెలివైనది, మొండిది, అనుకున్నది సాధించే రకం.

ఈ కథలన్నీకూడా సుమారు 50-60 ఏళ్ళ నాటి గ్రామీణ వాతావరణం, జీవన విధానం ప్రతిబింబించేలా రాసారు. దండోరా వేయటం, పొంబలోల్లాట, గానుగ పట్టడం ఆ వీథుల్లో తిరిగి చూస్తున్నట్లే వుంటుంది. బడిలో ఇర్లచెంగి పారేసుకున్న రెండు రూపాయిల నోటు కోసం సెంద్రంగాడు మాయల మాంత్రికుడులా ఫోజు పెట్టి వేసే సీమ్మంత్రంకి పాఠకుడు కూడా చీమ ఎటు పోతుందో దొంగనెలా బడుతాడా అని ఊపిరి బిగబట్టి చూసేలా కాస్తంత హాస్యాన్ని పండిస్తూ రాసిన కథ ఎన్నదగినది.

ఇర్లచెంగి అక్కతో బాటు సెరుగ్గానిక్కాడ పనికి బోయి అక్క ఎద్దుల వెనుక తిరిగి తోలుతా వుంటే చెట్టెక్కి కూచుని అమ్మ రావటం చూసి చెంగున దూకి అమ్మ దగ్గర మెప్పుకోసం తానే ఎద్దుల్ని తోల్తున్నాననటంలోని తెలివి చూసీ పాఠకులు కూడా కిసుక్కున నవ్వుతారు.

ఇర్లచెంగితో పాటూ గ్రామాలన్ని పాఠకులు కూడా చేయి పట్టుకు తిరిగి నడిచి విశేషాలన్ని చూసినట్లుగా అనుభూతి చెందుతారు.

 చదువుతున్నవాళ్ళు కూడా ఇర్లచెంగితో పాటూ కొత్త పలకా, బలపం పట్టుకొని ఇస్కూలికి పోతారు.

నీలావతి, అంస, పాండురంగడుతో పాటూ రాగి మాను గట్టుమీద కూర్చుండి బాదమాకులో రాగి సంగటి రుచి అనుభవిస్తారు. ఇర్లచెంగి అయవోరు పలకమీద రాసిచ్చిన అచ్చరాలు దిద్దకుండా కొంచెం కొంచెం బలపం కొరుకుతుంటే రుచి ఎలావుంటుందో అని అబ్బురంగా చూస్తారు.

ఇర్లచెంగి ఏకాసి ఒక్కపొద్దు చేసిన విధం ఎంతచక్కగా చెప్పారంటే ఇది ఈనాటి పిల్లల తీరులో కూడా గమనించొచ్చు.

ఇర్లచెంగి వడలు తింటూ, దొంగతనంగా అన్నం తింటూ చేసిన ఒక్కపొద్దు దేవకిగారు పసిపిల్లల ప్రవర్తనని ఎంత బాగా పరిశీలించారనేది తెలుస్తుంది.

అప్పట్లో వీథిబాగోతాలు, బుర్రకథలు గ్రామాల్లో జరిగేవి. ఆ సమయానికి వొరిగిపల్లె నుండి పొంబలొల్లాట చూడటానికి చాప, బొంత నెత్తినేసుకొని పోవటం, స్టేజికి దగ్గరగా వేసుకు కూర్చోవటం, బొంత పరుచుకుని కాస్తంత సేపు చూసి ఎప్పుడో దానిమీదే పడుకోవడం చాలా సహజంగా కళ్ళ ముందు చలన చిత్రంలా బయలు దేరిన దగ్గర నుండి ఒక్కొక్క దృశ్యమే తెరలు తెరలుగా కనిపించేలా వర్ణన ఉంటుంది. ఆట పూర్తయ్యాక పెద్దలు వాళ్ళని లేపి ఎత్తుకుని తీసుకువెళ్ళేవారుట.

గ్రామీణ జీవితంతో ముడిపడినవే సామెతలు. అందుకనేనేమో దేవకిగారు తన కథలలో సమయానుకూలంగా పుల్లిరిసి పొయిలో పెట్నట్టు, ఆయనే సరి గుంటే మంగలోనితో ఏం పని, మంత్రాలకు సింతకాయలు రాలవు వంటి సామెతలను ఉపయోగించారు.

అ సంగీతమయ్యోరు సంగీతానికేమొచ్చెగానీ అంటూ జంగమోళ్ళాటలో బోడోడు పాడేపాటలు, బాలనాగమ్మ కథలో పొంబలోళ్ళ గోయిందుడి పాటలు, భారతమయ్యోరు కత చెప్తా మద్దిలో పాడేపాటలు నాట్లప్పుడు పాడే పాటలు, మాలోళ్ళు గొబ్బితడ్తా పాడే గొబ్బిపాటలు ఇలా ఎన్నెన్నో మధ్యమధ్యలో దేవకి జానపద పాటలపై పరిశోధన చేయటం వలనేమో జానపద పాటల సొబగు ఈ కథలలో కన్పిస్తుంది.

పిల్లలు ఆటలాడుతూ బుజబుజరేకుల పిల్లుందా అంటూ ఇర్లచెంగికీ, యామలతకు చేసిన పెళ్ళి గురించి సంబరంగా చదువుకోవచ్చు.

ఇర్లచెంగి అక్కని ఇస్కూలు చదువుకి పంపించేందుకు అవ్వా నాయనా తగాదా పడినప్పుడు చదువు కోసం ఆడపిల్లలూ మగపిల్లలు అనే తేడా ఉండకూడదనే విషయాన్ని నాయన మాటల ద్వారా ఆధునిక దృక్పథాన్ని రచయిత్రి వ్యక్తపరుస్తారు.

దేవకి బాల సాహిత్యంలో కూడా విశేషమైన పరిశోధన చేసినవారు కావటాన ఇర్లచెంగి కథల్లో పిల్లల మనస్తత్వాన్ని అద్భుతంగా చిత్రించారు. అంతేకాక జానపద కళారూపాల గురించి అవసరమైన చోట్ల తనకు తెలిసిన పాండిత్యాన్ని ప్రకటించుకోవడం కాకుండా కథాపరంగా వివరించారు.

ఇర్లచెంగి కథలు రాయటానికి ప్రేరణ చిక్కని చిత్తూరు మాండలికంలో కథలు రాసే నామిని సుబ్రహ్మణ్యం నాయుడుగారు అంటారు దేవకి.

ఎవరికైనా బాల్యం అపురూపమైనదే. దేవకి తన బాల్య జ్ఞాపకాల్ని ఇర్లచెంగి అనే అల్లరి పిల్ల చేసే దూడుకు పనులతో సహా ఆనాటి గ్రామీణ జీవన విధానాలు, ఆహారపుటలవాట్లూ, విందులూ, వినోదాలూ, పండుగలూ, పబ్బాలూ, ఆధారాలూ మొదలైన అనేకానేక విశేషాల్ని చిక్కటి మాండలికపు సొబగుతో కథలుగా రాసారు. ఇతర ప్రాంతాల వారికి కొన్ని చోట్ల మాండలిక పదాలు కొరుకుడు పడకపోయినా కథ చెప్పటంలోని శైలి మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

మహాసముద్రం దేవకిగారిది నిరంతరం ఆటపాటల్లో మునిగి తేలిన అమాయకపు బాల్యం. అందులోనూ బాలసాహిత్యంపై పరిశోధన చేసినవారు, బాల గేయాలు రాసిన అనుభవంతో తన బాల్యం జ్ఞాపకాలను ఇర్లచెంగి కథలుగా మనకి అందించారు.

మొత్తంమీద ఈ కథల్ని చక్కని డయాస్పోరా కథలుగా చెప్పుకోవచ్చు.

ఇర్లచెంగి పాత్రని మలిచిన తీరు చాలా బాగుంది. దేవకిగారి ఇర్లచెంగి ఒక ఐకానిక్ పాత్రగా పాఠకులకు గుర్తుంటుంది.

మొదట ప్రచురితమైన ‘వొరిగపల్లి గెవనాల’ నుండి, తర్వాత వెలువడిన ‘ఇర్లచెంగికథల’ వరకూ దేవకి రచనాశైలి చిత్తూరు మాండలీకంలోనే వుంది.

రెండు పుస్తకాలలోను అనేక పాత్రలూ,సంఘటనలు ఒక పుస్తకానికి మరొకటి సీక్వెల్‌లా వుంటాయి.

“మన జీవనవిధానంలోని విభిన్న కోణాలు మన ఆచార వ్యవహారాలలో వ్యక్తమౌతాయి. ఏ తరం వారికైనా జానపద సాహిత్యం దిశానిర్దేశం చేస్తుందనేది నాభావన” అంటారు మహాసముద్రం దేవకి.

నిర్మలమైన ప్రవాహంగా తన జ్ఞాపకాల పేఠికలోని ఒక్కోక్కటే తీస్తూ తనకై తాను అద్భుత మాండలిక శైలిని పుణికి పుచ్చుకొని మా వొరిగిపల్లి గెవనాలు, ఇర్లచెంగి కథలు రాసారు.

దేవకిగారు అతి చిక్కని మండలీకాన్ని రసరమ్యంగా రాయటంవలన చదువుతున్నంతసేపూ పాఠకులను మమేకం అయ్యేలా, ఆసక్తి కలిగేలా వున్న కథనం చదవగా చదవగా ఆ యాసని హత్తుకోగలుగుతాం. ఆ మాండలికంలోని సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతామనేది నా అనుభవంలో గ్రహించిన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here