[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘అమవసి నాటి వెన్నెల’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]తె[/dropcap]ల్లని కాగితం మీద
నల్లని అక్షరాలు మెరిసినట్లు
నల్లని ఆకాశాన భూమాత
రచించిన అక్షరాల వలే
చుక్కలు మెరుస్తున్నాయి
అజ్ఞానాన్ని తొలగించి
జ్ఞానప్రకాశాన్ని కలిగించేవి అక్షరాలు
చీకటిని చీల్చి వెన్నెల
వెలుగులు నింపుకుని
ప్రకాశించే దీపాలు నక్షత్రాలు
ప్రతిరోజు లోకాన వెలుగుల
పున్నమి కావాలని
అమవశ నిశినాడు
దీపాలు వెలిగించి
జీవితమంతా వెలుగులతో
నిండాలని కోరుతూ
ఆకాశాన చందమామ వలే
కాంతిపూలను నింపే రాకెట్లను వదలి
నాడు పరమాత్మ సలిపిన
దుష్టసంహారమునకు జోతలర్పిస్తూ
చెడును తొలగించి మంచిని నిలిపి
అవనిపై ధర్మం నాలుగు
పాదాల నడయాడాలని
మానవత్వం పాదుకొలపాలని
పిల్లాపాప చిన్నా పెద్దా కలిసి
టపాసుల మోతలతో
ఆనంద సంబరాలతో
దీపాల వరుసలతో
స్వాగతం పలుకుతూ
ఆ భగవంతుని ఇలకు
పిలిచి కొలిచే పండుగే
దీపావళి పండుగ.