తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-31

0
4

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

చందమామ రావే..:

[dropcap]‘ఖ[/dropcap]డ్గ వర్మా, ఇంకా ఈ చెట్టు దగ్గరే ఉండటం క్షేమకరం కాదు. పైగా చెట్టుపైన ఏదో పెద్ద కొండ చిలువ ఉన్నట్లు నా బుద్ధికి తోస్తున్నది. పద క్షేమంగా మరో చోటకు వెళదాం’

‘జీవదత్తా, మనం భయపడాల్సిన అవసరం లేదు. పైగా నా చేతిలో ఖడ్గం ఉన్నంత వరకూ ఏ అడవి జంతువూ మనల్ని ఏమీ చేయలేదు. ఆ కొండ చిలువ అంతు చూడకుండా నేను కదలను’

‘బుద్ధికి పదును పెట్టాల్సిన చోట ఖడ్గం తీయడమెందుకు మిత్రమా, సరే నీ ముచ్చటను నేనెందుకు కాదంటాను. పదా ఆ చెట్టు ఎక్కి దాని పని పడదాం’

చెట్టుకు వేల్రాడుతున్న పెద్ద తాడుని ఆధారంగా చేసుకుని ఇద్దరూ పైకి పాకుతున్నారు.

అంతలో..

‘ఒరే.. చాల్లేరా మండుటెండలో ఏమిటా ఆటలు, లోపలకు రండర్రా’ ఇంట్లో నుంచి పిలుపు.

‘అబ్బా ఉండమ్మా, ఎండా కాలం సెలవల్లో కూడా ఆడుకోనీయవా..’ అంటూ మా గిరీష్ లాజిక్ వెతుక్కుని మరీ సమాధానం చెప్పాడు. గిరీష్ – నందిగామలో నాకున్న మంచి మిత్రుల్లో ఒకడు. పైగా బంధువు కూడాను. ఇద్దరం కలసి హైస్కూల్ చదువులు, కాలేజీ చదువులు పూర్తి చేశాము. ఆ తర్వాత చెరో దారి. వాడేమో బ్యాంక్ ఉద్యోగి అయ్యాడు. నేనేమో జర్నలిస్ట్‌గా స్థిరపడ్డాను. రిటైర్ అయ్యాక గిరీష్ మచిలీపట్నంలో విశ్రాంత జీవనం గడుపుతున్నాడు. హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు సెలవలు వస్తే చాలు నేను వాడింట్లోనే పగలంతా మకాం పెట్టేవాడ్ని. వాడింటి పెరట్లో ఓ పెద్ద బాదం చెట్టు ఉండేది. ఇదిగో ఆ చెట్టుకే మేమిద్దరం ఓ తాడు కట్టి ఎగబాకింది. బాదం చెట్టు కొమ్మలు అంత బలమైనవి కావు. పెళుసుగానే ఉంటాయి. అదే గిరీష్ వాళ్ల అమ్మ అసలు భయం. చిటికీ మాటికీ వీళ్ళిద్దరూ తాడుమీద ఎగబాకి చెట్టు కొమ్మ మీదకు చేరడం అక్కడే ఏవేవో కబుర్లు చెప్పుకోవడం ఆమెకు నచ్చేది కాదు. కొమ్మ విరిగి క్రింద పడితే కాళ్లూ చేతులూ విరుగుతాయని భయపడుతుండేది. అయినా ఈ ఒక్క విషయంలో వాడు అమ్మ మాట వినడు.

అలా మేమిద్దరం చెట్టు ఎగబ్రాకుతున్న సమయంలో వాడేమో జీవదత్తుడు, నేనేమో ఖడ్గ వర్మ పాత్రలు పోషిస్తున్నామన్న మాట. అలా అని వాడే ఎప్పుడు జీవదత్తుడిగా ఉండిపోడు. పాత్రధారులు అటూ ఇటూ మారిపోతుంటారు. ఒక రోజు ఆటలో వాడు జీవదత్తుడైతే మర్నాడు కొనసాగింపు ఆటలో ఖడ్గవర్మ అయ్యే వాడు. ఇంతకీ ఈ జీవదత్తుడు, ఖడ్గ వర్మ మమ్మల్ని ఆవహించడానికి ప్రధాన కారణం – ‘చందమామ’లో ఆ రోజుల్లో సీరియల్ గా వస్తున్న ‘రాతిరథం’ .

ఆ రోజుల్లో చందమామ కథలు మా బోటి పిల్లలపై ఎక్కువగానే ప్రభావం చూపేవి. ప్రతి కథకు వేసే బొమ్మలైతే నాకు బాగా ఇష్టం. రాతిరథంలో ఖడ్గవర్మ, జీవదత్తుడు పాత్రలతో పాటుగా మరికొన్ని కూడా మేము పోషించే వాళ్లం. వాటిలో కొన్ని (పద్మసేన మహారాజు, మంత్రి సోమదేవుడు, విఘ్నేశ్వర పూజారి) ఇప్పటికీ గుర్తున్నాయి.

నందిగామలో ఈ ఆటలన్నీ 1960 దశకం చివర్లోనో, 70 దశకం తొలినాళ్లలోనో ఆడినవి. ఆ నాటి ఆటల్లోని క్రియేటివిటీ గురించి ఇప్పుడు ఎవరితోనైనా చెబితే ఆశ్చర్యపోతుంటారు. బాదం చెట్టు క్రిందనే అనేక ఆటలు ఆడేవాళ్లం. దాని ప్రక్కనే ప్రహరీ గోడకు ఆనుకునే నాపరాళ్లను, కాసిన ఇటికలను, బంక మట్టి తీసుకుని ఓ ఇంటి లాంటి నిర్మాణం కూడా చేశాము. దీనికి ‘ఖడ్గ-జీవదత్తుల ఆశ్రమం’ అని పేరు పెట్టాము. ప్రతి నెలా వస్తున్న చందమామ సీరియల్ – ‘రాతిరథం’ రచనలో ఉన్నట్లుగానే ప్రాపర్టీస్ తయారుచేయడానికి తెగ ఉత్సాహపడే వాళ్లం. ఈ విషయం తెలుసుకున్న మా మిత్రుల్లో కొంత మంది మా ఇద్దరినీ ‘ఖడ్గ – జీవదత్తు’లనే పిలిచేవారు. అంతే కాదు, మేము ఆడుతున్న సమయంలో వచ్చి చూసేవారు. కానీ అలా వారు రావడం మా ఇద్దరికీ నచ్చేది కాదు. మా ఆటకి అంతరాయం కలిగిచే గిరీష్‌కి కోపం వచ్చేది. ఆ సమయంలో వాడు ఖడ్గవర్మ పాత్ర అయితే అరిచేసేవాడు. అదే జీవదత్తుడు పాత్రలో ఉంటే శాంతంగా, లాజికల్‌గా వాళ్లకు ఏదో చెప్పి పంపించేవాడు. ఈ భిన్న పోకడల్లోని మేజిక్ ఏమిటో తెలియక పాపం ఫ్రెండ్స్ వాడిని సరిగా అర్థం చేసుకోలేక సతమతమయ్యేవారు.

చందమామ బుక్ లోని డైలాగ్ లే కాకుండా మేము అదనంగా కొత్తవి చేర్చి ‘రాతిరథం – పెరటి డ్రామా’ ఆడేవాళ్లం. ఇంటి పెరట్లో ఆడాము కనుక అది ‘పెరటి డ్రామా’ అయింది. అలా ఆ రోజుల్లోనే కొత్త పదాలు సృష్టించేవాళ్లం. పేరడీలు చేసేవాళ్లం. ‘పదాలు ఎవ్వరూ సృష్టించకపోతే ఎలా’ – అంటూ మాయాబజార్ సినిమాలో ఎస్వీఆర్ అనడం మాకో స్ఫూర్తి. ఇకనేం కొత్తకొత్త పదాలు సృష్టిస్తూ, మా ఫ్రెండ్స్‌ని తికమక పెట్టేసే వాళ్లం. అప్పట్లో, అంత్యప్రాసతో కొన్ని సినిమాల్లో రావుగోపాల రావు వంటి వాళ్లు తమాషాగా మాట్లాడటం చూశాక మేమూ అంత్యప్రాసలో మాట్లాడటానికి ప్రయత్నించే వాళ్లం. ఈ విషయంలో ఈ గిరీష్, విజయ్, నేను ఓ జట్టు. ఇందులో మిగతా ఫ్రెండ్స్ కలసి రాలేదు. మరికొన్ని సార్లేమో తెలుగు భాషనే తిరగేసి మాట్లాడేసుకునే వాళ్లం.

ఔరా పింగళి:

కొత్త పదాలు సృష్టించడానికి మాకు పింగళి గారు ఆదర్శమనే చెప్పాలి. ముఖ్యంగా ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ వంటి సినిమాలు చూసినప్పుడు – ‘ఔరా పింగళి’ అనుకునే వారం. పింగళి నాగేంద్రరావు వారి పూర్తి పేరని ఆ తర్వాత తెలిసింది. నాకైతే ‘చందమామ’ మీద వారు వ్రాసిన బోలెడు పాటలు భలేగా నచ్చేవి. వారు వ్రాసిన మాటలు సినిమా హాల్లో టపాకాయల్లా పేలిపోయేవి. వాటిని గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు వాడే వాళ్లం. ఉదాహరణకు – ‘వేసుకో వీరతాడు’, ‘సాహసం సేయరా డింభకా, ‘అలమలం’, ‘నరుడా ఏమి నీ కోరిక’, ‘ఘాటు ప్రేమ’, ‘యుగయుగాలుగా, జగజగాలుగా’, ‘డింగరీ’.

చందమామ లోని రాతిరథం గురించీ, మా డ్రామా గురించి చెబుతూ కాస్తంత ప్రక్కకు జారిపోయాను కదా, మళ్ళీ అక్కడకే వెళదాం..

చందమామ కథలో లేని కొన్ని డైలాగ్‌లు గిరీష్ సృష్టించేవాడు. అలాగే కొన్ని సీన్లు కూడానూ. మొత్తానికి టివీలు లేని రోజుల్లోనే సెట్ ప్రాపర్టీస్‌తో సీరియల్ రన్ చేసేవాళ్లమని మా పిల్లలకు , మనవళ్లకు చెబుతుంటే – ‘అవునా.. నిజమా.. మీరు గ్రేట్ ..’ అంటూ ప్రశంసిస్తుంటే మా ఛాతీలు పొంగిపోతుంటాయి.

ఇదంతా చందమామ బుక్స్ చదవడం వల్లనే. కాకపోతే చాలా మంది చదువుతారు. మేము ఆ కథల్లో లీనమై పాత్రల్లోకి దూరేవాళ్లం. సరదాసరదాగా ఆడుకునే వాళ్లం. అలా చందమామ బుక్స్ మాలో క్రియేటివిటీని పెంచింది. అదే కాలేజీ చదువులప్పుడు మా చేత నాటకాలు ఆడించింది. డైరెక్షన్ చేయించింది .

చందమామకు కష్టాలు:

చందమామ కథల గురించి చెబుతున్న నేను ఇప్పుడేమో నిజం చందమామ గురించిన కథలు, విశేషాలు చెబుతానే..

నిండు జాబిల్లిని చూస్తే నాకెంతో ఆనందం వేసేది. అలాంటి నేను చిన్నప్పుడు జాబిల్లికి కష్టం వచ్చిందని చెబితే కలవరపడే వాడ్ని. చందమామకు కష్టమా!! అంటూ ఆశ్చర్యపోతున్నారా?

మా బామ్మ చెబుతుండేది, ‘ఒరే, కష్టాలు దేవుళ్లకి కూడా వస్తుంటాయి తెలుసా..’ అలా చెబ్తూ తన మాటలకు సపోర్ట్‌గా బోలెడు కథలు చెప్పేది. శివుడేమో ఓసారి శనికి భయపడి చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడట. ఇంకో కథలో ఇదే శివుడు ఓ రాక్షసుడు (భస్మాసురుడు)కి వరం ఇస్తాడు. కానీ కథ అడ్డం తిరిగి ఆ రాక్షసుడేమో శివుని తలమీదనే చేయి పెట్టి మహాదేవుడ్నే భస్మం చేద్దామనుకుంటాడు. దీంతో శివదేవుడు పరుగుపెట్టి విష్ణువుని ఆశ్రయిస్తాడు. విష్ణువేమో మోహినీ అవతారం ఎత్తి రాక్షసుడి చేత నాట్యం చేయిస్తూ వాడి చేతిని వాడి తల మీదనే చేయి పెట్టుకునేలా చేసి అతగాడ్ని బూడిదగా మార్చేస్తుందట. ఈ కథ వింటుంటే, విష్ణువు తెలివితేటలు చూసి తెగ ఆశ్చర్యపోతుండే వాడ్ని. ఇలాంటి కథలతో పాటుగా చందమామ కథలు కూడా చెబుతుండేది మా బామ్మ. చందమామ బింబంలో జాగ్రత్తగా చూస్తే ఓ చెట్టు, ఆ చెట్టు క్రింద ఓ ముసలావిడ కూర్చుని రాట్నం వుడుకుతుంటుంది తెలుసా అనో, ఇంకో సారేమో ఆ ముసలావిడ పేదరాశి పెద్దమ్మ అనీ, అట్లు పోస్తుంటుందని చెప్పేది. ఇలా ముసలావిడ గురించి రెండు విధాలుగా చెప్పడంతో నేను తికమక పడేవాడ్ని. చంద్రుడికో నూలుపోగు అన్న సామెత బహుశా ఈ కథ నుంచే వచ్చిందేమో. బామ్మ రెండు కథల్లో చెప్పిన ఆ ముసలావిడ మాత్రం నాకు కనిపించలేదు. బహుశ బామ్మలాంటి పెద్దవారికే కనబడుతుందేమో, నా బోటి చిన్నవాళ్ల కళ్లకు కనిపించదేమో అని సరిపెట్టుకున్నాను. ఇంకో సారి, ‘చందమామకు ఈ రోజు గండం. పాపం పిచ్చి తండ్రి తల్లడిల్లిపోతాడు, ఎలా బయటపడతాడో ఏమిటో..’ అంటూ కళ్లు వొత్తుకుంది. ఆకాశంలో హాయిగా తిరిగే చందమామకు కష్టం ముంచుకు వస్తున్నదని నేనూ నమ్మేశాను. దీంతో నా కళ్లంబటి కూడా నీళ్లు వచ్చేశాయి. దీంతో బామ్మ ఇంకా హూషారుగా కథ కొనసాగిస్తూ – ‘రాహువు గాడనే రాక్షసుడు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్నాడ్రా, పాపం చంద్రుడు కరిగిపోతాడు’ అంటుంటే,

మా అన్నయ్య పెద్దవాడు కదా, సైన్స్ బుక్స్ చదుతున్న వాడాయె, అడ్డు తుగులుతూ, ‘భయపడకురా, చంద్రుడికి కష్టమొచ్చినా కచ్చితంగా బయటపడతాడు. ఇదంతా మామూలే’ అన్నాడు. బామ్మమే వాడివైపు అదోలా చూసింది. వాడేమో అంతకంటే వివరాలు నాకు చెప్పలేదు. ఈ చిన్న బుర్రకు అర్థం కాదని అనుకున్నాడేమో.. ఏమో..

నేను బోలెడు పెద్దయ్యాక చంద్రుడికి అప్పుడప్పుడు వచ్చే కష్టమే గ్రహణమని అంటారని తెలిసింది. మా బామ్మ పడిన ఆదుర్దా తలుచుకుని ఇప్పటికీ నవ్వుకుంటాను.

ఇలాంటప్పుడే సాక్షి సినిమాలోని ఓ పాట గుర్తుకు వస్తుంటుంది. –

‘పరిగెత్తి వస్తోంది రాహువు,

అయ్యో తరిగిపోతున్నాది ఆయువు’

ఇలాంటి విషయాలు మా మనవళ్లకు చెబితే, ‘తాతా, ఇలాంటి, ఇన్నోసెంట్స్ ఉండేవాళ్లా ఆ రోజుల్లో..’ అంటూ డౌట్ వ్యక్తం చేశాడు. మేము బీఎస్సీలో చదివిన డైనోసార్ల గురించి వాడి తరం వాళ్లు నాలుగో ఏట నుంచే క్షుణ్నంగా తెలుసుకోవడం మొదలుపెడుతున్నారు. అసలు ఉయ్యాల ఊగే చంటి పిల్లాడు వేసుకునే టీ షర్ట్ మీద కూడా డైనోసార్ల బొమ్మలే కనబడుతుంటే మరి నేర్చుకోరా ఏమిటీ? మా చిన్నప్పుడు ఆవు, ఏనుగు, చిలక, కోతి వంటి బొమ్మలతో ఆడుకునే వాళ్లం. అందుకే అవంటే మాకు ఇప్పటికీ బోలెడు ఇష్టం. వీళ్లేమో డైనోసార్లు బొమ్మలతో ఆడుకుంటున్నారు. అవే వాళ్ల ఇష్టమైన బొమ్మలైపోయాయి. మా అబ్బాయి చిన్నప్పుడు ఏనుగు రబ్బరు బొమ్మతో ఎక్కువగా ఆడుకునే వాడు. దానికి వాడు ‘రాజా’ అని పేరు పెట్టాడు. ఆ బొమ్మే వాడి లోకం.

చంద్ర గ్రహణం:

ఎంత సైన్స్ చదువుకున్నా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చంద్ర గ్రహణం వచ్చినప్పుడల్లా ఆ కాసేపు నాకు దిగులే. ఎంతైనా కళ్లముందు ప్రకాశిస్తున్న వాడు కాస్తా కళావిహీనమైతే దిగులే కదా. సంపూర్ణ సూర్యగ్రహణమైతే మరీనూ. ఉన్నట్లుండి సూర్యుడు మాయవడం చూసి నా చిన్న నాటి రోజుల్లోనే కాదు, ఇప్పటికీ ఆందోళన పడే వారు ఉన్నారు. ఈ ఆందోళనే అనేక భయాలను, ఆచారాలను తీసుకొచ్చింది. గ్రహణాల విషయంలో మూఢనమ్మకాలు మాత్రం పూర్తిగా తొలిగిపోలేదు. సైన్స్ ఏమి చెప్పినా కొన్ని ఆచారాలను సమాజం నుంచి పూర్తిగా తొలిగించలేము. ఈ భయాలను సొమ్ము చేసుకునే వాళ్లు తయారయ్యారు. గ్రహణం ఎప్పుడు వచ్చినా టివీల్లో జ్యోతిష శాస్త్రవేత్తలమంటూ ఓ బ్యాచ్ దిగుతోంది. వారితో గంటల తరబడి చర్చలు. ఆధునిక సమాజం అని చెప్పుకుంటున్న మనలోనే ఎన్నో చీలికలు, పేలికలు.

నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ గ్రహణాల గురించి భయపడనక్కర్లేదనీ, అవి గ్రహాల భ్రమణంలో వచ్చే సుందర దృశ్యాలని ఇంట్లో వాళ్లకు చెబితే నన్ను అదోలా చూసేవాళ్లు. ప్రాక్టికల్‌గా వివరిద్దామని ఇంట్లో పిల్లల్లో ఒకరిని సూర్యునిగా, మరొకరిని చంద్రుడిగా, ఇంకొకరిని భూమిగా నిలబెట్టేవాడ్ని. భూమి తన చుట్టూ తిరుగుతుంటే ఉపగ్రహమైన చంద్రుడేమో భూమి చుట్టూ తన ఫేస్ మాత్రమే చూపిస్తూ తిరుగుతుంటాడని చెప్తూ, పౌర్ణమి నాడు చంద్ర గ్రహణం ఎలా వస్తుందో వివరించే వాడ్ని. కానీ, ఈ సైన్స్ గట్రా ఇంట్లో వాళ్ల బ్రెయిన్లకు ఎక్కేవి కాదు. గ్రహణం రోజున ప్రారంభ స్నానం, విడుపు స్నానం చేయించేవారు. ఈ రెంటి మధ్యలో పచ్చి మంచినీళ్లు కూడా త్రాగనిచ్చే వారు కారు. గ్రహణం మనం పుట్టిన నక్షత్రంలో వస్తే ఇక చూడండీ, బోలెడు ఆంక్షలు. జపం చేయమంటారు. గ్రహణం చూడకూడదనే వారు. ఒక వేళ మనం ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే, పొరపాటున ఏదైనా ఇబ్బంది తలెత్తితే, చూశావా గ్రహణం చూడటం వల్లనే ఇలా జరిగిందంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చేవారు. నా బోటి యువ శాస్త్ర వేత్తలను (పదం మరీ ఓవర్‌గా ఉంటే మీరు మార్చుకోవచ్చు) ఎదగనీయకుండా చేసేవారు. ఒకటి మాత్రం నిజం, చదువుకునే రోజుల్లోనే ‘విశ్వదర్శనం’ వంటి సైన్స్ పుస్తకాలు కొని చదవడం మూలాన గ్రహణాల గురించి లెక్చర్స్ ఇస్తుండేవాడ్ని.

చంద్రుడిపై కాలు మోపిన క్షణం:

అది 1969 జూలై 16 – చంద్రుడి మీద మానవుడు కాలు మోపిన రోజు అది. అపోలో-11 అనే రాకెట్ నుంచి విడివడిన లూనార్ మాడ్యూలర్ చంద్రుడి ఉపరితలం తాకి అందులో నుంచి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలెట్ గా ఉన్న బజ్ ఆల్డ్రిన్ చంద్రుడి మీద కాలు మోపిన రోజు. ఈ ప్రాజెక్ట్ లోనే ఉన్న మూడవ వ్యక్తి మైకిల్ కొలిన్స్– లూనార్ ఆర్బిటర్ లో ఉన్నాడని చెప్పేవారు. ప్రపంచ మీడియా ఈ వార్తను బాగా హైలెట్ చేసింది. అప్పుడు నేను హైస్కూల్ విద్యార్థినే. కానీ నాకు బాగా గుర్తు ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు తాటికాయంత అక్షరాలతో హెడ్డింగ్‌లు పెట్టి చాలా గొప్పగా ఈ అద్భుత ఘట్టం గురించి వ్రాశారు. కొన్ని హెడ్డింగ్‌లు నాకెంతో నచ్చాయి. ఆంధ్రప్రభలో చేరిన తర్వాత దీని గురించి ప్రస్తావిస్తే పురాణపండ రంగనాథ్ గారు ఓ అద్భుత హెడింగ్ పెట్టారని చెప్పారు. ఆ హెడ్డింగ్ ఏమిటో నాకు ఇప్పుడు ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. ఎవరైనా గుర్తు చేస్తే సంతోషిస్తాను.

ఈ మధ్యనే గూగుల్ లో సెర్చ్ చేస్తుంటే కొన్ని ఇంగ్లీష్ పేపర్లలోని హెడ్‌లైన్స్ కనిపించాయి వాటిని ఇక్కడ ఇస్తున్నాను.

Man Walks on The Moon (డైలీ మిర్రర్ పత్రికలో)

LAND ON THE MOON – Dream of ages comes true (THE HINDU)

MEN WALK ON THE MOON (NEWYORK TIMES)

తెలుగు పేపర్లు నాకు గుర్తునంత వరకు ఆ సమయంలో ఉన్నవాటిలో పాపులర్ అయిన పత్రికలు- ఆంధ్రప్రత్రిక, ఆంధ్రప్రభ. ఇదంతా మీకోసం వ్రాస్తుంటే నాకు ఓ చక్కటి పాటలోని ఒక వాక్యం హెడ్‌లైన్‌గా పెడితే బాగుంటుంది కదా అనిపిస్తున్నది. అది –

‘అందని జాబిలి, అందెను నేడు’

సినిమాల్లో చాలానే చంద మామ పాటలు ఉన్నాయని చెప్పాను కదా. వాటిలో ఇప్పటికీ నాకు బాగా గుర్తిండి పోయిన పాత పాటల్లో కొన్ని..

‘రావోయి చందమామ’ (పాతాళ భైరవి) ఈ పాట ఎప్పుడు వచ్చినా మొదట్లో చాలా సంతోషమేసినా సైన్స్ బాగా వంటబట్టాక మాత్రం నవ్వుకునే వాడ్ని. ఎందుకంటారా, నిజంగా చందమామ వచ్చేస్తే, ఇంకేమైనా ఉందా? భూమికి పెద్ద గండమే. భూమి గతి తప్పుతుంది. అల్లకల్లోలం. ప్రళయమే మరి. ఇక ‘వింత గాథ’ చెప్పేది ఎవరట? అయితే ప్రేమికులు మాత్రం ఎక్కడో దూరాన ఉన్న చందమామ రావాలని, అతగాడితో కబుర్లు చెప్పాలని నేటికీ అనుకుంటూనే ఉన్నారు.

ఆలాంటి పాట మరొకటి..

‘ఒక సారి ఆగుమా,

ఓ చందమామ, నా చందమామ..’

(అమ్మో.. ఆగితే ఇంకేమైనా ఉందా, ప్రేయసీ ప్రియులారా ఇలాంటి పాటలు పాడకండి, చందమామ ఎవరో అదే పనిగా నన్ను పిలుస్తున్నాడని అనుకుంటూ నిజంగా భూమి వైపు ప్రయాణం కట్టేస్తే..)

ఇక్కడో చిన్న విషయం చెప్పాలి. తెలుగు రైమ్స్‌లో సైన్స్ పరంమైన రీజనింగ్, లాజిక్‌లు ఉండటం లేదని, పైగా వాయిలెన్స్ ఉంటుందని మా అమ్మాయి వాదనకు దిగింది. అందుకే తన కొడుక్కి తెలుగు రైమ్స్ నేర్పించనని అంది. మొదట్లో నేను అడ్డంగా వాదించినా ఆ తర్వాత దాని వాదనలోనే పస ఉందని అనిపించింది. అదే ఇంగ్లీష్ రైమ్స్ తయారు చేసేవారు, రచయితల్లో మార్పు వస్తున్నది. గతంలోని రైమ్స్‌ని తిరగరాస్తున్నారు. కోకోమిలన్ వంటి సంస్థలు ఈ వాస్తవికతకు పెద్దపీట వేస్తున్నట్లు అనిపిస్తోంది.

చిట్టి చిలకమ్మా

అమ్మ కొట్టిందా (ఈ రైమ్‌లో కొట్టడం – వాయిలెన్స్‌కి సింబల్)

పడమటింటి కాపురంబు చేయన్నది.

మొగుడి చేత మొట్టి కాయలు తింటనన్నది. (డొమెస్టిక్ వాయిలెన్స్)

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. సరే, మనం చందమామ గురించి కదా చెప్పుకుంటున్నది..

ఆమె మోము చంద్రబింబం:

చాలా పాటల్లో చంద్రుడు చాలా అందగాడనీ, కోవా బిళ్లలా నునుపుగా ఉంటాడని వ్రాశారు. కానీ సైన్స్ పుస్తకాలు చదివాక మరో సారి నవ్వుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జాబిల్లి దూరం నుంచి చూస్తేనే నునుపుగా, అందంగా ఉంటాడు. కానీ దగ్గరకు వెళితే అన్నీ గుంటలే. పర్వతాలు, లోయలు, ధూళి. చంద్రుడి మీద మానవుడు కాలుపెట్టాక చంద్రుడి అసలు అందం బయటపడింది. దీంతో కొంత మంది కార్టునిస్ట్‌లు వేసిన వ్యంగ్య కార్టూన్లలో ఒకటి – మా అమ్మాయి చందమామలా ఉంటుందండి – అంటూ పెళ్ళి చూపులప్పుడు పిల్ల తండ్రి అంటే నిజమే అని పెళ్ళి కొడుకు మురిసిపోతుంటాడు. తీరా కర్టెన్ వెనక నుంచి పెళ్ళి కూతురు ముందుకు వస్తే, ఏమందీ.. పిల్ల ముఖం నిండా మొటిమల మచ్చలు, గుంటలు.

సరే, అసలు చందమామ సంగతేమో కానీ చందమామ పుస్తకం మాత్రం చిన్నప్పుడు మా మీద చాలానే ప్రభావం చూపిందని చెప్పాను కదా. ఆకాశంలోని చందమామ కంటే ఈ చందమామే మాకు ముద్దు. చందమామ కథలు చదివి చాలా మంది, కథలు వ్రాయాలనుకున్నారు. అలాంటి వారిలో కొందరు నిజంగానే కథలు వ్రాసేశారు. వాటిలో కొన్ని చందమామ మేగజైన్ లోనే అచ్చవడం నేను ఎరుగుదును. చందమామతో పాటుగా బుజ్జాయి, బాలమిత్ర వంటి పిల్లల కథల పుస్తకాలు మంచి ఆదరణ పొందాయి. చివరగా మరో విషయం – ‘చందమామ’ మేగజైన్ ప్రేమికులు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. వారంతా సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆనాటి కథలను షేర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చందమామ పాత పుస్తకాలను డిజిటలైజ్ చేశారు కూడా.

చందమామ చుట్టూ తిరిగిన అనేక సంఘటనలు మీతో పంచుకున్నాను కదా.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here