[ఎర్ల్ నైటింగేల్ గారు 1956లో అమెరికన్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా డా. రాయపెద్ది వివేకానంద్ అందిస్తున్న ప్రేరణాత్మక రచన.]
అదృష్టం – దురదృష్టం:
[dropcap]ఎ[/dropcap]టువంటి అనుమానాలకి తావు లేకుండా నిశ్చయంగా చెప్పాలి అంటే ఇలా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి తన మనసులో బలంగా ఏదైతే లక్ష్యాన్ని (గోల్) ని నిర్ణయించుకుని ఆ దిశగా ఎల్ల వేళలా ఆలోచిస్తూ ప్రతి అడుగు ఆ గోల్ దిశగా వేస్తాడో అతన్ని తన లక్ష్యం చేరుకోకుండా ఆపగల శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఇది సత్యం.
అతని ఆలోచనలు అతన్ని గోల్ దిశగా నడిపిస్తాయి, ఎందుకంటే అతని ఆలోచనలన్నీ గోల్ గూర్చే ఉన్నాయి కాబట్టి.
అసలు గోల్ అంటూ లేని వ్యక్తి విషయానికి వస్తే, అతని జీవితం నిరాశ నిస్పృహలతో నిండి ఉంటుంది. భయం, ఆందోళన, దిగులు వీటితో అతని జీవితం తెల్లారిపోతుంది. ఎందుకండీ అలా మీరు మరీ వెటకారంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? నిజమండి. గోల్ అంటూ లేని వ్యక్తికి తను ఎటువెళుతున్నాడో తెలియదు. గమ్యం అంటూ లేని ప్రయాణం భయం, ఆందోళన, దిగులు లాంటి నెగెటివ్ ఫీలింగ్స్‌తో నిండి ఉంటుంది. చివరికి నిరాశతో అతని జీవితం ముగుస్తుంది. అతని మాటల్లో ఈ నిరాశ మనకి కనిపిస్తూనే ఉంటుంది.’
అదృష్టం, దురదృష్టం అనే మాటలు మీరు వినే ఉంటారు. స్పష్టమైన గోల్స్ ఉన్న వ్యక్తికి అదృష్టం ఎప్పుడూ తోడు ఉన్నట్టే కనిపిస్తుంది. గోల్స్ అంటూ లేని వ్యక్తి జీవితన్ని దురదృష్టం వెంటాడి వేటాడినట్టే కనిపిస్తుంది. దీనికి కారణం చాలా క్లియర్‌గా చెప్పవచ్చు. గోల్స్ ఉన్న వ్యక్తుల యొక్క ప్రతి ఆలోచన ఆ గోల్స్‌ని అందుకోవడం గూర్చే ఉంటాయి.
అందుకే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్నే అదృష్టం అని మనం భావిస్తుంటాము.
ఇక గోల్సే లేని వ్యక్తులకి ఆలోచనలు గోల్స్ వైపుకి ఎలా వెళతాయి.
వారికి ఏది లభించినా అది గాలివాటుగా లభిస్తుందే గానీ ఒక ప్లాన్ వల్ల కాదు కద. ఇలాంటి పరిస్థితులలో వారికి ఓటమి పాలయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి.
ఇలాంటప్పుడే మనము అంటూ ఉంటాము “వాడిని దురదృష్టం వెంటాడింది” అని.
సూక్ష్మంగా చెప్పాలంటే మనిషి దేనినిగూర్చి ఆలోచిస్తూ గడుపుతాడో దాన్నే పొందుతాడు.
దేని గూర్చి ఆలోచించకుంటే ఏదీ పొందడు. ఏది లభిస్తే అదే గతి అన్నట్టు ఉంటుంది వాడి జీవితం.
***
అదెలాగండి, దేని గూర్చి ఆలోచిస్తే దాన్నే పొందుతామా, ఇది నమ్మశక్యం కాకుండా ఉందే అని అనుకుంటున్నారా?
సరే. అదెలా సాధ్యమో నాకు తెలిసినంతలో చెప్పే ప్రయత్నం చేస్తాను.
మనిషి మెదడుతో దగ్గరిపోలిక ఉండే ఒక అంశం తీసుకుని మీకు అర్థం అయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఒక రైతు వద్ద సారవంతమైన కొన్ని ఎకరాల భూమి ఉంది అనుకుందాం. ఆ సారవంతమైన భూమిలో రైతు తనకు కావాల్సిన పంట పండిచ్చుకోవచ్చు. ఆ విషయంగా ఆ భూమికి ఏ అభ్యంతరం ఉండదు. ఏ విత్తనాలు నాటుకోవాలనే విషయంలో ఆ రైతుకి పూర్తి స్వేచ్ఛ ఉంది.
బాగా అర్థం చేసుకోండి మనం ఆ భూమిని మనిషి యొక్క మెదడుని పోలుస్తున్నాము ఇక్కడ.
ఏమిటి ఆ భూమికి మనిషి మెదడుకి ఉన్న పోలిక అంటే, మన మెదడులో ఎలాంటి ఆలోచనలు మనం పెంచుతున్నామో అన్న విషయంగా మన మెదడుకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. మనం ఏ రకమైన ఆలోచనలతో మన మెదడుని నింపుతున్నామన్న విషయం పట్ల మన మెదడుకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అది మన ఇష్టం. మనం ఎటువంటి ఆలోచనలతో మన మెదడుని నింపుతామో, అదే తరహా ఫలితాలని మన మెదడు మనకి అందిస్తుంది.
అదే విధంగా ఆ సారవంతమైన భూమిలో ఎటువంటి విత్తనాలని నాటామో ఆ తరహా పంటనే మనకి ఆ భూమి అందిస్తుంది. ఏ విత్తనాలని నాటాము అన్న విషయంగా భూమి మనల్ని నిందించదు.
ఆ రైతు వద్ద రెండు విత్తనాలు ఉన్నాయని అనుకుందాము.
ఒకటి చక్కటి నాణ్యమైన మొక్కజొన్న విత్తనం.
రెండవది విషవృక్షాన్ని ఇచ్చే విత్తనం.
ఇప్పుడతను రెండు గుంతలు తవ్వి ఒక దాంట్లో మొక్కజొన్న విత్తనాన్ని, రెండవ దాంట్లో విషవృక్షం తాలూకు విత్తనాన్ని నాటాడనుకుందాం.
ఆ తరువాత ఆ గోతిని చక్కగా కప్పి పెట్టి పాదు చేసి, నీరు ఎరువు వేసి క్రమ పద్దతిలో ఆ విత్తనాలని సంరక్షించాడని అనుకుందాం.
కొంత కాలం తరువాత ఏమి జరుగుతుంది?
ఎటువంటి అనుమాలకి తావు లేకుండా ఏది నాటామో అదే మొలకెత్తుతుంది. ఇందులో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు కద.
మనం ఇది వరకే చెప్పుకున్నట్టు ‘యద్భావో తద్భవతి ‘ కద.
ఆ సారవంతమైన భూమికి ఎటువంటి పట్టింపు లేదు. నీవు ఏ విత్తనం నాటితే ఆ విత్తనం తాలూకు పంటను విస్తారంగ పండించి నీకు అందించడం మాత్రమే దానికి తెలుసు.
ఇక మనిషి మెదడు విషయానికి వస్తే అది సారవంతమైన ఆ భూమి కంటే కూడా అత్యంత సారవంతమైనది, ఆశ్చర్యజనకమైనది, దుర్భేద్యమైన రహస్యాలతో నిండినది, సరిగ్గా ఆ భూమి లాగే మనం ఏదైతే దాంట్లో నాటుతామో దానినే మనకి అందిస్తుంది.
అందులో ఏ తరహా ఆలోచనలు నాటున్నామో అన్న విషయంలో దానికి పట్టింపు లేదు. మనకి విజయాన్ని అందజేసే ఆలోచనలు చేస్తున్నామా, మనల్ని అపజయం వైపుకి తీసుకువెళ్ళే ఆలోచనలని చేస్తున్నామా అన్న విషయాన్ని అది పట్టించుకోదు.
చక్కటి ప్లానింగ్‌తో కూడిన పథకమా, లేదా అయోమయంతో నిండిన అరాకొరా నిర్ణయాలా?
అపార్థాలు, భయాలు, ఆందోళనలా?
ఏ తరహా ఆలోచనలతో మనం మన మెదడుని నింపుతున్నాము అన్నది మన మెదడు పట్టించుకోదు. మనం ఏ తరహా ఆలోచనలతో మన మెదడుని నింపామో ఆ ఆలోచనలకి అనుగుణమైన ఫలితాలని ఇవ్వటం మాత్రమే దానికి తెలుసు.
మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతాను. ఖండాలు, ఉపఖండాలు, సముద్రాలు వీటిని మానవుడు పూర్తిగా పరిశోధించి అన్ని విషయాలు కనుగొన్నాడని చెప్పలేము. ఇంకా ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఈ భూగోళం మీద ఉన్నాయి. అలా అంతు చిక్కని రహస్యాలతో నిండిన ఒక ఖండం లాంటిది మానవుడి మెదడు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
సరిగ్గా ఉపయోగించగలిగితే మానవ మేధస్సు మనకి అందించబోయే ఐశ్వర్యాలకి సిరిసంపదలకి అంతే లేదు. అది మనల్ని ఎంతటి ఐశ్వర్యవంతులని చేయగలదు అన్న విషయాన్ని మనం కలలో సైతం ఊహించలేము. మన మెదడులో ఆలోచన అన్న బీజాన్ని నాటాలే గానీ మనం ఊహించనన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని మనకి సాధించి పెడుతుంది.
ఇప్పుడు మీరు అడుగుతారు.
“అదే నిజమైతే మరి మనుషులందరూ ఎందుకు తమ మేధస్సుని ఉపయోగించి గొప్ప వాళ్ళుగానో అత్యంత ఐశ్వర్యవంతులుగానో మారటం లేదేమిటి” అని.
మంచి ప్రశ్నే వేశారు మీరు.
దీనికి నేను చెప్పేదేమిటంటె, ఎవరికి వాళ్ళు ఆలోచించి చాలా నిజాయితిగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది.
ఈ అత్యంత విలువైన మెదడుని మనకి పుట్టుకతోటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రకృతి అందించింది.
ఇది ఉచితంగా లభించింది కద. అదీ అసలు సమస్య. మానవుల ధోరణి ఎలా ఉంటుందంటే, ఎంత విలువైన వస్తువైనా సరే ఉచితంగా లభించింది అంటే మానవులు దానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వరు.
మనం డబ్బు పోసి కొనుక్కున్న వస్తువులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము.
ఇక్కడ ఒక చిత్రమైన విషయం చెబుతాను.
ఈ సృష్టిలోకెల్లా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – మనం పెద్దగా గుర్తింపుని ఇవ్వని వస్తువులే నిజానికి అసలు వెలకట్టలేనంత విలువైనవి. అవి ఉచితంగా లభిస్తున్నాయి.
మనం డబ్బుపోసి కొనుక్కున వస్తువులు నిజానికి ఏ విలువా లేనివి.
అత్యంత అమూల్యమైనవన్నీ ఉచితంగానే మనకి ప్రకృతి అందిస్తోంది.
మన మెదడు, మన అంతరాత్మ, మన శరీరాలు, మన ఆశలు, ఆశయాలు, మన మేధస్సు, మన ప్రజ్ఞ, ప్రేమించే కుటుంబ సభ్యులు, కుటుంబం, ప్రాణం ఇచ్చే స్నేహితులు, దేశం – ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఉచితంగా లభించిన ఇవన్నీ కూడా అత్యంత విలువైనవి, వెల కట్టలేనివి.
డబ్బు పోసి మనం కొనుక్కునే వస్తువులన్నీ చౌకబారువి నిజానికి. వాటిని ఏ క్షణంలోనైనా మార్చి పారేసి వేరే సరికొత్త వాటితో భర్తీ చేయవచ్చు వాటి స్థానాన్ని.
శక్తి సామర్థ్యాలు మెండుగా ఉన్న ఒక వ్యక్తి పూర్తిగా దెబ్బతిని కుప్పకూలిపోయినా, వెనువెంటనే లేచి శక్తి పుంజుకుని తిరిగి సంపదలని ఐశ్వర్యాలని పొందవచ్చు. ఎన్నో ఒడిదుకుడులని ఎదుర్కుంటూ ఎన్నో సార్లు అతను తన జైత్ర యాత్రని కొనసాగించవచ్చు.
ఇల్లు తగలబడిపోయినా మరొక కొత్త ఇంటిని నిర్మించుకోవచ్చు. డబ్బుతో కొనగలిగిన వస్తువులని ఎన్నో మార్లు మరల మరల పొందవచ్చు.
కానీ ప్రకృతి మనకి ఉచితంగా ఇచ్చిన అమూల్యమైన వస్తువులని ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సాధించలేము.
అలాంటి అరుదైన, అత్యంత విలువైన, అమూల్యమైన వాటిలో మానవుడి మెదడు ఒకటి.
కానీ చిక్కేమిటంటే అది మనకి ఉచితంగా లభించింది కద. అందుకే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తాము. పట్టించుకోము. దాన్ని తగిన విధంగా ఉపయోగించుకోము.
అదంటే మనకి బహుశా చులకన.
మనం ఎంత కఠినమైన పని అప్పజెప్పినా మన మెదడు చేసి పెడుతుంది.
కానీ దురదృష్టకరమైన విషయ ఏమిటంటే మనం దాన్ని చాలా అల్ప ప్రయోజనాలకి వాడుకుంటూ ఉంటాము.
పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. మానవులు కేవలం పది శాతం కూడా తమ మెదడు యొక్క పనితనాన్ని వాడుకోవడం లేదని.
సూటిగా చెబుతున్నాను.
ఇప్పుడే నిర్ణయించుకోండి. “మీకు నిజంగా ఏమి కావాలి?”
మీ మెదడులో లక్ష్యం (గోల్) అనే విత్తనాన్ని నాటండి.
జీవితంలోకెల్లా అత్యంత గొప్ప నిర్ణయం తీసుకున్న వారవుతారు మీరు ఈ క్షణంలో.
“మీకు నిజంగా ఏమి కావాలి?”
– “అతి గొప్ప సేల్స్‌మన్ అవ్వాలనుకుంటున్నారా?”
– “ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తిలో బాగా రాణించాలనుకుంటున్నారా?”
– “మీ సాటి ఉద్యోగులందరిలో లేదా మీ సామాజిక వర్గంలో అందరికన్నా మిన్నగా అత్యంత ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవలనుకుంటున్నారా?”
– “అత్యంత ధనవంతులవ్వాలనుకుంటున్నారా?”
మీ లక్ష్యం ఏదైనా కావచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని.
“మీ లక్ష్యం అనే ఆలోచన తాలూకు విత్తనాన్ని మీ మెదడులో నాటండి. ఆ ఆలోచనని బలంగా విశ్వసించండి. ఆ ఆలోచనని చెదిరిపోకుండా కాపాడుకోండి. ఆ ఆలోచనని వాడిపోకుండా సంరక్షించుకోండి.
మీ గోల్ దిశగా నిర్భయంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి. మీ కలలన్నీ నిజం అవుతాయి”
మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ఇదే. మనసు ఉంటే, మార్గం ఉండటమే కాదు. మనసుంటే మిమ్మల్ని విజేతగా మారకుండా ఆపగలిగే శక్తి ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు.
తిరుగులేని ప్రకృతి నియమం అది. అంతే.
మీరొక ఎత్తైన భవనాన్ని ఎక్కి ఓ రాయి విసిరితే అది భూమి మీదకే దిగుతుంది కానీ, గాల్లో పైకి ఎగరదు కద.
సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇదే కద చెబుతుంది.
సరిగ్గా ఇలాగే మీ ఆలోచనలు మీ గమ్యానికి మిమ్మల్ని చేరుస్తాయి అనేది కూడా ఒక ప్రకృతి నియమం.
ప్రకృతి నియమాలన్నీ అంతే. వాటిని మార్చలేము. వాటిని ఉల్లంఘించలేము.
విజేతగా మారాలనుకుంటున్నారా?
మీకు వేరే దారి లేదు. మీ గోల్ ఏమిటి అన్న విషయం గూర్చి ఒక సారి ఆలోచించండి.
ఇదేదో హడావిడిగా చేసే పని కాదు. తూతూమంత్రంగా చేసే పని అసలు కాదు.
కాస్త నింపాదిగా కూర్చుని విశ్రాంతిగా ఆలోచించండి. మీ లక్ష్యాలు ఏమిటి?
మీరు ఏమి పొందాలనుకుంటున్నారు జీవితంలో?
మీరు ఏమవ్వాలనుకుంటున్నారు?
మీ కలలు నిజం అయినట్టు బలంగా ఊహించుకోండి. ఆ ఊహే ఎంత ఆనందంగా ఉంది కద.
మీరు అనుకున్న గమ్యాలని చేరుకున్నట్టు, మీరు సాధించాలనుకున్న లక్ష్యాలని మీరు ఛేదించినట్టు బలంగా ఊహించుకోంది.
సరిగ్గ అర్థం అయ్యేలా చెప్పాలంటే, మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే మీరు అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాక ఎలా జీవించాలని ఊహించుకుంటున్నారో ఆ జీవితాన్ని మీ మనసు తెరపై ఒక సినిమా లాగా చూసుకోండి ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణం నుంచే. ఆ ఊహని ఉత్తి ఊహగా కాకుండా నిజంగా మీ మనసు తెర మీద ఒక సినిమా లాగా ఊహింఛుకోండి.
ఇలాగే మీ ప్రతీ కలని, ప్రతి గమ్యానికి సంబంధించిన ఊహల్ని అవి నిజంగా జరుగుతున్నట్టు, మీరు ఆ కలని నిజం చేసుకుని ఆ కలల ప్రపంచంలోకి నిజంగా చేరిపోయినట్టు మీ మనసు తెరపై పదే పదే సినిమాలాగా చూసుకోంది.
ఇదే మీ మనసుకి మీ కలలని గూర్చి, మీ లక్ష్యాల గూర్చి తెలియజెప్పే విధానం.
మానసిక సమస్యలు, డిప్రెషన్లు రాజ్యం చేస్తున్న కాలం ఇది. ఒక వంక వైద్య శాస్త్రం ఆధునిక చికిత్సని అందించటంలో రోజు రోజు కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళుతూ ఉంది. మనిషి ఆయుష్షుని పెంచే దిశగా ప్రతి రోజువైద్య శాస్త్రం పురోభివృద్ధి చెందుతూనే ఉంది.
మరోవంక చిన్న చిన్న సమస్యలకే కృంగి పోయి మనోవ్యథలతో అతి చిన్న వయసులోనే ప్రాణాల మీదకి తెచ్చుకునే వారు కూడా ఎక్కువ అవుతున్నారు. నిజం చెప్పాలంటే మనం ఏం సాధించాలనుకున్నా సాధించగలం. దీనికి అవసరమైన మానసిక శక్తి మనకి అందుబాటులోనే ఉంది. ఈ విషయాన్ని ఎన్నో శాస్త్ర గ్రంథాలు గట్టిగా చెపుతున్నా కూడా వాటిని తెలుసుకుని జీవితాలని చక్కబెట్టుకునే అవకాశం తమ ముందున్నా అనేక మంది నిరాశ నిస్పృహలతోనే కాలం వెళ్ళబుచ్చుతుంటారు.
మన ఆలోచనలో చిన్న చిన్న మార్పులతో మనం మన జీవితాల్ని ఆనందమయం చేసుకోగలము. ఏది కావాలన్నా పొందగలం.
మన ఆలోచనలే మన జీవితాలని శాసిస్తాయి. మన కళ్ళ ముందు కనపడే ప్రతి ఒక్కరూ తమ తమ ఆలోచనలకి ప్రతిఫలంగా లభించిన జీవితాలని జీవిస్తున్నారు.
ఆలోచన మారితే జీవితం మారుతుంది.
ఒక చేదు నిజం. ఏ వ్యక్తి అయినా సరే తన మనసులో కలిగే ఆలోచనలకి ప్రతిఫలంగా లభిస్తున్న జీవితాన్ని జీవిస్తున్నాడు. అది అతనికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. పేదరికం, దుఃఖం, భయం, ఐశ్వర్యం, ఆనందం, వ్యాధి, ఆరోగ్యం ఇలా ఒకటేమిటి, ప్రతి జీవిత విధానం, మొదట అతని ఆలోచనల్లో కలిగి ఆ తరువాత భౌతిక రూపంలో అతనికి లభిస్తున్నాయి. అది అతను ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అదే నిజం.
మన ఆలోచనలు మన జీవితాలని శాసిస్తాయి. మన ఆలోచనల తాలూకు ఫలాల్ని మనం అందుకునే తీరాలి. ఈ వేళ కాకుంటే, రేపు. రేపు కాకుంటే ఎల్లుండి. ఎల్లుండి కాకుంటే వచ్చే నెల లేదా వచ్చే సంవత్సరం అయినా సరే మీరు పొందబోయే జీవితం ఈవేళ్టి మీ ఆలోచనలకి ఫలితంగా మాత్రమే వస్తుంది. ఇది సత్యం. ఇదే సత్యం.
(మళ్ళీ కలుద్దాం)