పత్ర సుందరీమణులు

0
3

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘పత్ర సుందరీమణులు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]చె[/dropcap]ట్టు చెక్క భాగాలలో నేను బొమ్మలు చేయడం మొదలు పెట్టి చాలా ఏళ్ళయింది. కానీ ఇప్పుడు అందరికీ పరిచయం చేస్తున్నాను. ఈ రోజు ఆకులతో తయారైన అందమైన ఆడపిల్లల్ని చూపిస్తాను. ఆకులు పచ్చగా ఉండటం వల్లే ఆ రంగుకు ఆకుపచ్చ అనే పేరు వచ్చింది. కొన్ని చెట్ల ఆకుల్ని మనం ఆకుకూరలుగా తింటూ ఉంటాము. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని డాక్టర్లు చెపుతారు. మొక్కలో కిరణ జన్య సంయోగ క్రియ జరిపే భాగాలు ఆకులే. ఇందులో పత్రహరితం ఉండడం వల్లనే ఇవి పచ్చగా కనిపిస్తాయి. ఆకుకు పత్రం, దళం అంటూ పేర్లున్నాయి. ఆకులో పత్ర పీఠం, పత్ర పుచ్ఛం, పత్రవృంతం, పత్రదళం అనే నాలుగు రకాలుంటాయి. పత్ర దళంలో చాలా రకాలుంటాయి. అలాగే పత్రపుటంచులో కూడా రంపపుటంచులతో, కంటక అంచులతో, దంతాకారపు అంచులతో, వలయు దంతాకారపు అంచులతో ఉంటాయి. రంపపుటంచుకు మందార ఆకును ఉదాహరణగా చెప్పవచ్చు. వారాగ్రం, గురు అగ్రం, రెట్యూజ్ అగ్రం, సిర్రోజు, అగ్రం నాభి అగ్రం అంటూ పత్రాగ్రాలలో రకాలు ఉన్నాయి. ఆకులో ఈనెలు, తమ్మెలు కూడా ఉంటాయి.

కరివేపాకుతో ముస్తాబైన మా పాపను చూపిస్తాను. ఘుమఘుమలాయే వాసనతో పెర్‌ఫ్యూమ్ అవసరం లేకుండా సువాసనలు వెదజల్లుతోంది. కరివేపాకు రెమ్మలతో పరికిణి కుట్టాను. జాకెట్టు కోసం రంగులు మారే పూలచెట్టు ఆకును ఉపయోగించాను. ఇది ఐదు భాగాలుగా విడినట్లు కనిపిస్తుంది గానీ పూర్తిగా గోంగూర ఆకువలె విడిపోదు. ముఖానికి ముళ్ళ గోరింట పూలను వాడాను పచ్చని పసుపు ముద్దల్లా ఉండే ముళ్ళ గోరింట పూలు అయితే ముఖానికి చక్కగా నప్పుతాయి. చింతాకు లాంటి చిన్న ఆకులతో కళ్ళు పెట్టాను. ముక్కు కోసం ఒక ఎండు పుల్లను పెట్టాను. చెవులకు లోలాకులు పెట్టాను. చేతులకు కొబ్బరి పిందెల్ని పెట్టాను. రోజూ చెట్ల నుంచి రెండు మూడు కొబ్బరి పిందెలు రాల్తాయి. వాటికో ఎండు కొమ్మను గుచ్చి చేతుల్లా అమర్చాను. గరుడ వర్ధనం పూలను ములగా కట్టి నడుముకు చుట్టాను. ఈ పూలు కూడా కోయవలసిన పనిలేదు. ఉదయాన్నే నక్షత్రాల్లా రాలి ఉంటాయి. ఆకుపచ్చని గడ్ది లాన్ మీద తెలుపు, పసుపు రంగుల్లో పువ్వులు మనోహరంగా కనిపిస్తుంటాయి. దానిమ్మ పూలు చక్కని ఎరుపు రంగుతో మిలమిల మెరుస్తూ ఉంటాయి. ఒక్క రెబ్బను విడదీసి అమ్మడి మూతి కోసం పెట్టాను. లిప్‌స్టిక్ వేసుకున్న పెదవులు తయారయ్యాయి. కరివేపాకులో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఫాస్పరస్, ఫైబర్ కూడా ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది.

కాగితం పూల చెట్లు ఇప్పుడైతే డివైడర్ల మీద చాలా కనిపిస్తున్నాయి. మా హైదరాబాద్ ఇంట్లో వెనకవైపు కాగితం పూల చెట్లు వనమే ఉంటుంది. ఎక్కువ చెట్లు కనిపిస్తే నాకు బొమ్మలు చెయ్యాలనిపిస్తుంది కదా! వెంటనే ఆకులు పూలు కోసుకు వచ్చాను. ఆకులు బాగా పచ్చగా మెరుస్తున్నాయి. అందుకే ఆకుపచ్చ వనితను చేద్దామునుకున్నా. ఈ ఆకులతో చాలా అలంకారాలు, జంతువులు తయారు చేశాను. ఇప్పుడు ఆడపిల్లల్ని చేస్తున్నాను. తెలుపు, పింక్ రంగుల్లో ఆకులే కనపడకుండా విరగబూసే పువ్వుల్లో కాగితం పూలు కూడా ఒకటి. ముళ్ళతో, ఉబ్బిన కొమ్మలతో పొదలా పెరుగుతుంది. పొడుగు పొడుగు కొమ్మలతో మెడ సాచి చుట్టు పక్కల స్థలమంతా నాదేనని ఆక్రమమిచేస్తుంది దీనిని శాస్త్రీయంగా ‘బోగాన్ విల్లా గ్లాబ్రా’ అంటారు. ముధ్యలో తెల్లని పువ్వులు ఉంటాయి. దీనిని చుట్టు ముట్టి పసుపు, తెలుపు, పింక్ రంగుల్లో ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఈ ఆకర్షణ పత్రాలను పట్టుకున్నపుడు కాగితంలా అనిపించటంతో వీటికి కాగితం పూలు అనే పేరు వచ్చింది. ఆకులతో తల, శరీరం తయారుచేశాను. కళ్ళ కోసం లేత పల్లవాలను పెట్టాను. ముక్కు కోసం నూరు వరహాల పువ్వును అమర్చాను. అందంగా అమరిపోయింది. నోరు కోసం అతి చిన్న పల్లవాన్ని పెట్టాను. లేత చీగురుల్లాంటి పెదవులు అనే వర్ణనకు సరిపోయింది చెవులకు పూల లోలాకులు వేలాడదీశాను.

గోంగూర ఆకులతో పాపను చేశాను. మా ఇంటి కుండీలలో గోంగూర చెట్లు మొలిచాయి. ఎర్రని రంగుతో అందమైన కాయలు, పువ్వులు వచ్చాయి. వాటితోనూ అలంకారాలు చేసుకున్నాను. మరోసారి వాటి గురించి వివరిస్తాను. పువ్వులో వేద్దామని గోంగూర ఆకుల్ని కోసుకొచ్చాను. పప్పు కన్నా ముందు పాప తయారయింది. “నువ్వు వంటింట్లోకి వస్తే కూరగాయలన్నీ జంతువులు గానో, మనుష్యులు గానో మారేస్తావు. వంటింట్లోకి రాకు, నువ్వో మెజీషియన్‌వి” అని మా అమ్మ ముద్దుగా విసుక్కునేది గానీ నేను చేసే పనులకు ఆమెనే స్ఫూర్తి. గోంగూర ఆకులు తెచ్చుకుని అమ్మాయి శరీరంగా తయారు చేశాను. గోంగూర చెట్టులో ఆకులుగా విడివడని కొన్ని ఆకులను తలగా, తల మీది వెంట్రుకలుగా మార్చాను. చెవులకు ఎర్ర మిరపకాయల జూకాలు పెట్టాను. కళ్ళ కోసం పిస్తా తొక్కుల్ని వాడాను. చేతి వేళ్ళ కోసం గోంగూర పుల్లల్ని వాడాను. ఈ ఆకులు ఇంకా పెద్దవయ్యాక గానీ అయిదు రెక్కలుగా మారవు. గోంగూరలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని ఆంధ్రమాత గోంగూర పచ్చడిగా అభివర్ణిస్తారు.

క్రోటన్ ఆకులు, గద ఆకారపు ఆకులు కలిపి ఒక అమ్మాయిని సృష్టించాను. ఇప్పుడు ఎక్కడ చూసినా డివైడర్ల దగ్గర కనిపించే తెల్లని పువ్వుల చెట్టుకు ఈ గద ఆకారపు ఆకులుంటాయి. ఈ పేరు నేను పెట్టినదే. అసలు పేరేంటో తెరియదు. నేను ఈ బొమ్మలన్నీ తయారు చేసి ఎగ్జిబిషన్ పెట్టినపుడు “వీణ ఆకులతో కూడా బొమ్మ చేశారుగా మేడమ్” అని ఒకావిడ అడిగారు. దీనికా పేరు ఉందని అప్పుడే తెలిసింది. మా బెంగుళూరు ఇంటి గార్డెన్‌లో ఈ చెట్లు విపరితంగా ఉండటంతో బొమ్మ చేద్దామనుకున్నాను. రెండు క్రోటన్ ఆకులలో అమ్మాయి తల, శరీరం చేశాను. ఇప్పుడు అంబ్రెల్లా కట్‌తో ఉన్న ప్రాకును గద ఆకారపు ఆకులతో కుట్టాను. ఫ్రాకు అందంగా అమరింది. దీనికి తోడుగా క్రిస్మస్ చెట్టు ఆకుల్ని కూడా డిజైన్‌తో భాగంగా కుట్టాను. ఎండి రాలిన కొబ్బరి పిందెలు, కుంకుడు గింజలు, ఎండిన దానిమ్మ పూలు అన్నీ అమ్మాయి తయారీలో ఉపయోగించాను.

ఒకసారి అరకు వెళ్ళినపుడు కాఫీ చెట్ల కొమ్మలు తెచ్చుకున్నాను. కాయలు, విత్తనాలు, ఆకులు విడదీసి ఎండబెట్టాను. కాఫీ విత్తనాలు కాఫీ పొడికి మాత్రమే కాదు అమ్మాయి కళ్ళ కోసం కూడా పనికొస్తాయి. కాపీ ఆకులతో అమ్మాయిని తయారుచేశాను. విత్తనాలు, కాయల్ని తలకు జుట్టుగా పెట్టాను. ఇంకా పత్తి చెట్టు కాయల్ని కూడా వాడేశాను. ఎన్ని చెట్ల ఆకులు దొరికితే అన్ని చెట్ల ఆకుల్ని వాడటం నాకిష్టం. మిరియాల ఆకుల్ని కోసుకు రావాలని ప్రయత్నించినా దొరకలేదు. కాఫీ ఆకులు చక్కని ఆకుపచ్చ రంగుతో నిగనిగలాడుతున్నాయి. ఇవీ రకరకాల ఆకులతో అమ్మాయిలను తయారుజేసిన అందాలు చూసి ఆస్వాదించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here