సజీవమైన భావనాబలం ‘లోపలి ముసురు’

0
3

[శ్రీమతి అరుణ నారదభట్ల గారి ‘లోపలి ముసురు’ కవితాసంపుటి సమీక్ష.]

[dropcap]శ్రీ[/dropcap]మతి అరుణ నారదభట్ల రచించిన 76 వచన కవితల సంపుటి ‘లోపలి ముసురు’. ముసురు విషాదానికి ప్రతీక. ముసురు ఆలోచనలను సూచిస్తుంది. గాంభీర్యాన్ని సూచిస్తుంది. ‘లోపలి ముసురు’ అన్న పేరు చూడగానే ఇందులోని కవితలు కవయిత్రి అంతరంగ ఘోషను, విషాదాలను, ఆలోచనలను సూచిస్తాయన్న అభిప్రాయం కలుగుతుంది. ముఖచిత్రం ఆ అభిప్రాయాన్ని బలపరుస్తుంది. చుట్టూ చీకటి. కిటికీ అద్దం పైన నిలచిన వాన చినుకులు. అస్పష్టంగా కిటికీకి ఆవలి ప్రపంచం. ఇదీ ముఖచిత్రం. కాబట్టి ఈ పుస్తకంలోని కవితలను మామూలు కవితలుగానో, ఆషామాషీ కవితలుగానో భావించే వీలులేదన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు, ఇప్పుడు వస్తున్న రాజకీయ, ఉద్యమ కవితలకు భిన్నంగా కవి అంతరంగలోతులను ఆవిష్కరించే ఆలోచనాత్మకమూ, భావాత్మకమూ, సున్నితమయిన కవితలను చదవబోతున్నమన్న భావన కలుగుతుంది. ఈ సంపుటిలోని కవితలు ఈ విషయంలో పాఠకుడిని నిరాశ పరచవు.

ఈ సంపుటిలోని కవితల్లో సున్నితమైన భావనలున్నాయి. గంభీరమైన ఆలోచనలున్నాయి. ప్రకృతి దృశ్యాలను చూసి పరవశించటం వుంది. ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకోవటం వుంది. జాలి పడటమూ వుంది. సమకాలీన జీవితం పట్ల ఫిర్యాదులున్నాయి. సాంఘిక పరిస్థితుల పట్ల ఫర్యాదులూ   ఉన్నాయి. లోతయిన చింతన కనిపిస్తుంది. ఇలాంటి కవితల నడుమనే సమకాలీన కవితల సాంప్రదాయాన్ని అనుసరిస్తూ విమర్శలూ, ఆవేశాల కవితలూ ఉన్నాయి. అయితే, ఏ కవితలోనూ, ద్వేషమూ, దూషణలూ లేవు. అందుకే, రచయిత్రిది తటస్థ వైఖరి అన్న వ్యాఖ్య ముందుమాటలో కనిపిస్తుంది.

కవిత ప్రధానంగా రసానందం కోసం పుడుతుంది. కవితకు ఆయువు రసానుభూతి. కవి భావానుభూతి పఠిత హృదయంలో రసానుభూతిని ఉత్పన్నం చేయాలి. రసానుభూతిని కలిగించాలి. కానీ, ఆధునిక సాహిత్య ప్రపంచంలో కవితను చూసే దృష్టి మారింది. అభ్యుదయవాదుల ఆధిక్యం వల్ల, కవిత, సమాజంలోని కుళ్ళును ప్రదర్శించాలి. విమర్శించాలి. సామ్యవాద దృక్పథాన్ని ప్రదర్శించాలి. సాంప్రదాయ వ్యతిరేకత పొంగిపొర్లుతూండాలి. ద్వేషం, క్రోధం, హేళన, అపహాస్యాలు పరవళ్ళు తొక్కాలి. దాంతో కవిత్వ పఠనం రసాస్వాదన కోసం కాకుండా సిద్ధాంత ప్రచారము, రాజకీయ భావనల కోసమూనూ. కవిత నినాదాల, ఆర్తనాదాల వార్తల మయమవ్వాలి. అందుకే ఆధునిక కవిత రసవిహీనమై పాఠక లుప్తమవుతోంది. ఆధునిక కవిత ఒక ఆయుధం. కవితను ఆరాధించటం, అనుభవించటం, కన్నా కవితను ఉపయోగించుకోవటం వల్ల కవిత తన ప్రాభవాన్ని దాదాపుగా కోల్పోయినట్టే. ఆధునిక కవితకుండాల్సిన లక్షణాలేవీ ఈ సంకలనంలోని కవితలకు లేకపోవటం వల్ల, తాము మెచ్చే సిధ్ధాంతాలు కనబడకపోవటంవల్ల బహుశా ఈ కవయిత్రి ఏ భావధారకూ చెందని తాటస్థ్యాన్ని ప్రదర్శిస్తున్నదని అనిపించవచ్చు. కానీ, కవికి ఉండవలసిన ప్రధాన లక్షణం అనుభూతి ఈ సంపుటిలోని కవితల్లో పుష్కలంగా కనిపిస్తుంది.

‘వద్దంటే వాన’ కవితలో ‘రోజుకో నాలుగు గట్టి చినుకులు చాలిక్కడ/ఈ కాలుష్యపు నేలపై అలుకుచల్లడమే పెను తుఫాన్’ అన్న కవయిత్రి, ‘మా పల్లెల నేలన్నా రమ్మనదీ వానను/ చల్లగ తడిసేందుకు’ అంటుంది. పట్నంలో వర్షపు నీరు డ్రైనేజీ పాలు. కుదరకపోతే రోడ్లన్నీ నదులే.

‘వసంతం పలకరించింది’ కవితలో ‘చెట్లెప్పుడూ మనవైపు ఆదరంగా చూస్తూంటాయి/ఆదర్శం నేర్పుతూ/ఉన్నంతకాలం ఆనందాలను పూచి పరిమళాలై కురవాలని’ అంటుంది కవయిత్రి. ‘తడిసిపోతూ’ అన్న కవితలో వర్షాన్ని వినూత్నంగా వర్ణిస్తారు. ‘నీలి మేఘాల కాంతినుండి/నిశ్శబ్దంగా కురుస్తున్న వాన/మౌన భాషలో/పోట్లాడుతున్న చినుకులు/అణువుల మధ్యన చొరబడి/హుష్ష్ అంటూ గాలి/రాలిపోతున్న వాటి గోడు వింటూ’.

‘నీ చుట్టూ’ కవిత ఎంతో లోతైన ఆలోచనలనూ, చింతననూ అతి సులువైన పదాలతో ప్రదర్శిస్తుంది.

‘ఈ భూభాగమొక్కటే
నీ ఉనికని భ్రమపడకు
ఈ నేల నీ పాదాలకు ఆసర
కాసేపు నిన్నిటు లాక్కున్న మట్టి ఇది.
నీ చుట్టూ ప్రవహించే నదులు, పచ్చికబయళ్ళు, పచ్చని వృక్షాలు,
కోండకోనలు, నిండు పున్నమి, తిరిగే గ్రహాలు,
గండరగోళాలు, నక్షత్రాలు, జీవరాశులన్నీ
నీ ఆలోచనలోని నిరంతర సృష్టి.
నీలోని ఈ అనంత విశ్వస్వరూపం
నీవు నీ అణువణువునా నింపుకున్న ఒకానొక మహాశక్తి..’

ఈ కవిత ఉపనిషత్సారాన్ని అత్యంత సరళంగా ప్రదర్శిస్తుంది. ప్రపంచమంతా ఆవరించుకుని ఉన్న ఆ శక్తిలో భాగమే ఈ విశ్వం, ఈ ప్రపంచం, ఈ మనిషితో సహా సకలజీవులన్నీ అన్న సత్యాన్ని ప్రదర్శిస్తుందీ కవిత. ఇలాంటి లోతయిన భావనలతో పరిచయం లేని వారు ఈ కవితలను తటస్ఠ కవితలుగా పరిగణిస్తారు. నిజానికి ఇవి అచ్చమైన కవితలు. ఆలోచనాత్మకమూ, రసప్లావితమూ అయిన కవితలు. కవితాస్వరూపం తెలియనివారికి ఇవి తటస్థమైన కవితలు.

‘నీ చుట్టూ’ కవిత ఈ కవితా సంపుటిలో అత్యుత్తమమైన కవిత.

‘నీ చుట్టూ నీలాగే ప్రయాణించే ఉధృత అణుసముదాయం
గాలిలా శబ్దమై నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది
అది నీ బాహ్య శరీరానికందని శబ్దం.’

ఒక్కో పదం, ఒక్కో వాక్యం, భారతీయ తత్త్వ చింతనలోని అత్యంత నిగూఢమూ, అపురూపమైన సత్యాలను అతి సరళంగా ఆవిష్కరిస్తుంది.

‘ఎన్ని జీవరాశులు ఎన్ని పాలపుంతలు
ఎన్ని మహాలోకాలు ఎన్ని అంతఃసూత్రాలు
ఎన్నెన్నో అగమ్యగోచరాలు
ఇవన్నీ నీకు కనబడీ కనబడని
నిన్నావహిస్తూ వెళుతున్న మహా సాధనాలు.’

ఈ కవితపై ఎంతో వ్యాఖ్యానించవచ్చు. అనేక అత్యద్భుతమయిన వేద మంత్రాలు, ఉపనిషత్ ఉదాహరణలు చూపుతూ వివరించవచ్చు. ఇటీవలి కాలంలో ఇలాంటి కవితను చదవలేదు. అసలిలాంటి కవితలు ఆధునిక కవులు రాస్తున్నారంటేనే నమ్మకం కుదరటంలేదు. మండుటెడారిలో శీతల పవన వీచిక లాంటిదీ కవిత. ఈ కవయిత్రి ఏ భావధారకు చెందనిది అనుకోవటం అజ్ఞానం. ఈ కవయిత్రి కవితకు మూలం ఈ దేశపు అణువణువునా, ప్రతి గాలి తరగలో, ప్రతి నీటి బిందువులో, ప్రతి రక్తపు బొట్టులో విడదీయరాని భారతీయ తత్త్వచింతన. అది తెలియనివారికి మాత్రమే ఈ కవయిత్రి తటస్థ కవయిత్రి.

‘చితిని మోస్తున్నప్పుడు’ కవితలో ‘ఆశను నమ్ముకొని నడిచే ఆకాశానికి/అతుక్కున్న నక్షత్రాలన్నీ/మళ్ళీ కొత్తగా/భావాతీత తీరంలోని మెరపు సూదులు/మార్గం మధ్యలో తాకుతున్న మబ్బు తెప్పలు/ఒక గుణపాఠాలు..’ ఎంత వివరించినా తనివి తీరదు. ఎంత విశ్లేషించినా సరిపోదు. అనుభవించాల్సిందే!

‘ఎందుకీ ముసుగు’ కవితలో ‘పవిత్రతలు మనసున్న మనుషులవా/శరీరాలు తొడుక్కున్న ఆత్మలవా?’ అని ప్రశ్నిస్తారు కవయిత్రి. సమాధానం కోసం ఎద లోలోతుల్లోకి చూసుకోవాల్సివుంటుంది.

‘తప్పిపోతూ’ కవితలో ఇప్పుడు నేనంటే నేను కాదు/ఈ అనంత సముద్రకెరటాల ఆలింగనలో/గెలవాలనుకొని ఓడిపోతున్న/ఓడిపోతూ గెలుస్తున్న/రాలిపోయే నక్షత్రాన్నైన స్వయం ప్రకాశాన్ని’ అంటుంది కవయిత్రి డెస్టినీ అందని పరుగుపందేన్ని వర్ణిస్తూ.

‘నేస్తమా’ కవితలో ‘ఆత్మలకు తొడిగిన ఆడా, మగా దేహాలే కదా ఇవన్నీ!’ అంటారు. ఒక్క వాక్యంలో ఎంతో అర్థాన్ని ఇమడ్చటమే కాదు, అనేక విచ్ఛిన్నకర సిద్ధాంతాలలోని డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తుందీ వాక్యంలో ఇమిడివున్న భావం.

‘వ్యర్థప్రయాస’ కవితలో ‘ఇక్కడే శాశ్వతంగా నిలిచిపోము/అవును మరి ఇంతటి ఘర్షణలెందుకు/సంఘర్షణలెందుకు/నేను నేనుగా దాటిపోలేని/బలహీనతలెందుకో!’ అనటం అహంకారాన్ని అణచి విశ్వసృష్టి ప్రణాళికలో మన పాత్రను గుర్తించమన్న సత్యాన్ని, విశ్వం నుంచి మనిషి ప్రత్యేకం కాదన్న ఆలోచనను అతి సున్నితంగా ప్రదర్శిస్తుంది.

‘వెన్నెల మొక్క’ కవిత అద్భుతమైన కవిత. అక్షర ఆవిర్భావం ద్వారా కవిత సృజన ప్రక్రియను, తాత్వికతను ప్రదర్శిస్తుందీ కవిత.

‘కవిత్వమా! ఎంతటి అందానివో నీవు
అక్షరాలై కురిసే హృదయాలను ఓదార్చే అమ్మవు
కలల సాగులో తడిసి మొలిచే వెన్నెల మొక్కవు.
సంధ్యల నిట్టూర్పులను శృతిచేసి
కొత్తరాగాల తీగలల్లి
పూలను విరబూయించే నిత్యవసంత వేదికవు!’

ఆధునిక కవులెంతసేపూ అక్రమాలూ, అణచివేతలూ, ఉద్యమాల నినాదాల కేకల బాకాల విద్వేషాల గందరగోళాల అక్షర సముదాయాలనే కవిత్వమని భ్రమపడి, భ్రమింపచేస్తూ కవితా ప్రపంచాన్ని విహ్వల ఆక్రందనల విద్వేషాల దుర్గంధ భూయిష్టం చేస్తున్న తరుణంలో ఇలాంటి కవితలను సృజించిన కవయిత్రికి అభినందనలు, ధన్యవాదాలు అందజేయాల్సి వుంటుంది, కవితాభిమానులు, ఉత్తమ సాహిత్య సృజనను ఆస్వాదించి ఆనందించే వారందరూ.

తెలుగు కవుల్లో ఇంకా సున్నిత భావాలు సజీవంగా వున్నాయని, భావనాబలం జీవంతో వుందనీ నిరూపించే ఈ కవితలు, తెలుగు కవిత భవిష్యత్తుపయిన కొంతయినా ఆశలను చిగురింపచేస్తాయి.

ఈ కవిత సంపుటిని ఆదరించి ఇలాంటి కవితలను కవులను ప్రోత్సహించాల్సిన బాధ్యత సాహిత్య ప్రపంచానిది, పాఠకులది.

***

లోపలి ముసురు (కవిత్వం)
అరుణ నారదభట్ల
పేజీలు: 160
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు
~
అరుణ నారదభట్ల
9705015207

 

 

 

 

~

శ్రీమతి అరుణ నారదభట్ల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ :
https://sanchika.com/special-interview-with-mrs-aruna-naradabhatla/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here