దివినుంచి భువికి దిగిన దేవతలు 1

0
4

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞానరహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వ్యాస పరంపరని అందిస్తున్నారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

ప్రకృతి మనిషి

1.0  ధార్మిక భారతీయులకు దేవుళ్ళున్నారని నమ్మకం:

[dropcap]స[/dropcap]నాతన వేదధర్మాన్ని నమ్ముకున్న భారతీయులకి దివికి చెందిన దేవుళ్ళున్నారని, వారివల్లే ఈ భూమ్మీద ప్రజాభివృద్ధి జరిగిందని, ఒకప్పుడు దేవతలకీ మానవులకీ సంబంధ బాంధవ్యాలుండేవన్ననమ్మకం పురాణాల వల్ల కలిగింది. సృష్టి కంతటికీ మూలపురుషుడు, విష్ణునాభికమలంలోంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడని పురాణాల్లో ఉంది. ఈ బ్రహ్మ నుండి సృష్టి ఎలా కల్పించబడిందో తెలుసుకోవాంటే ముందుగా మనముంటున్న ఈ బ్రహ్మాండ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మన పురాణాల్లో ఉన్నా చాలామందికి అర్థం కావు. అర్థంకాక పోవడానికి గూడా చాలా కారణాలున్నాయి. ఇవన్నీ తెలుసుకోవాంటే ముందుగా ఆధునిక మానవుల వ్యవహార శైలి ఈ ప్రకృతిలో ఎలా ఉందో తెలుసుకోవాలి.

1.1  అందమైన ప్రకృతి:

పగటి పూటగానీ రాత్రిపూటగానీ ఒకసారి తపైకెత్తి ఆకాశంలోకి  చూపు నిలిపి ఉంచితే ఏమనిపిస్తుంది? పగలు కావాలంటే, చీకట్లను తరుముతూ వెలుగును వెదజల్లే సూర్యుడు రావల్సిందే! రాత్రి పూట చిమ్మచీకట్లో చిరువెలుతురుతో పాటు చల్లదనాన్ని నింపే వెన్నెల రేడైన చంద్రుడు రావల్సిందే.

ప్రకృతిలో సూర్యుడు లేకపోతే భూమ్మీద జీవజాతులు పుట్టగలవా? ఈ జీవకారణం తండ్రిలాంటి సూర్యుడు కాడా? అమృత కిరణాలతో ప్రకృతి ప్రతీ జీవినీ పులకింపజేస్తూ, ఓషధుల ద్వారా భూమిని సస్యశ్యామలం చేస్తూ తల్లిలా పోషిస్తున్నది చంద్రుడు కాదా? భారతీయ ఋషుల బుద్ధులతో ఆలోచిస్తే ఈ సూర్య చంద్రులు మానవుల పాలిటి ప్రత్యక్ష దేవుళ్ళే! విపరీత బుద్ధులతో ఆలోచిస్తే ప్రకృతిలోని ఈ సూర్య చంద్రులు కేవలం మానవుకు పనికి వచ్చే పదార్థాలు మాత్రమే.

ఒకసారి అమావాస్య నాటి రాత్రి ఆకాశంకేసి చూస్తే ఎలా కనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ప్రకృతిమాత బంగారు జరీపూ తాపడం చేసిన నల్లటి చీరె ధరించి ధగ ధగ మెరిసిపోతూ మానసికోల్లాసాన్ని కలిగించే సౌందర్యనిధిలా కనిపించదా?ఇంతకన్నా బ్రహ్మనందం ఎక్కడుందనిపించదా ఒక్క క్షణమైనా! ఈ నీలాకాశంలో మిలమిల మెరిసే చంద్రుడు, తారలు లేకపోతే ఎలా ఉంటుంది? చిమ్మ చీకటి మాత్రమే. మరి సూర్యుడు లేకపోతేనో? తమస్సే! ఈ తమస్సనే సముద్రాన్ని ఛేదించడానికే ఈ సూర్య, చంద్ర, గ్రహ నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఈ నక్షత్ర మండాలాలు ఎన్నున్నాయో ఎవరైనా లెక్కపెట్టగరా?ఇవన్నీ జారిపడిపోకుండా, ఒకదానితోనొకటి ఢీ కొట్టుకోకుండా ఈ విశ్వంలో ఎలా నిలుస్తున్నాయి? వీటిని ఎవరు సృష్టించారు?

ఎవరైనా ఏదైనా బొమ్మగానీ, వస్తువుగానీ తయారు చేయాంటే ఎంతో విషయపరిఙ్ఞానం, వస్తుపరిఙ్ఞానం ఉండాలి. మరిఈ ఖగోళంలో కనపడుతున్న చుక్కలన్నిటినీ సృజించాంటే ఎంత శాస్త్రసాంకేతిక పరిఙ్ఞానమవసరమో! అలాటి మహాజ్ఞానం కలవాడు ఎవరో ఓ పెద్ద సృష్టికర్త ఉండి ఉండచ్చుగా! ఇవన్నీ ఈ భూమ్మీద నివసిస్తున్న మట్టిబుర్రలు కల మనబోంట్లకు అర్థం అవుతాయా? అందులోను ఆధునిక శాస్త్రజ్ఞులలు అనబడే కుహనా మేధావుల బుద్ధికి ఇవన్నీ అంతుబట్టని విషయాలు కావా?ఎందుకంటే ఆస్తికులైతే భగవంతుడనే సృష్టికర్త ఉన్నాడు, ఆయనే ఈ చరాచర సృష్టికి కారకుడు, ఆధారం అని నమ్ముతారు.

ఆధునిక శాస్త్రజ్ఞులలో ఎక్కువ మంది నాస్తికులే. వాళ్ళకు ఇవన్నీ ఈ ప్రకృతిలో వాటంతటవే ఏర్పడ్డాయని అనిపిస్తుంది. ఎవరి కోసం? కేవలం మనలాంటి మనుష్యుల కోసం అంటారు. మానవుడి కోసం ఈ ప్రకృతి ఏర్పడిందా లేక ప్రకృతిలో మానవుడు శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం లాంటివాడా? ఎవరికి తెలుసు? అసలు ఈ కలియుగ మానవుల ప్రపంచ పరిజ్ఞానమెంత?

1.2  ఆధునిక శాస్త్రజ్ఞుల స్థూల పదార్థాల అధ్యయనం:

ఆధునిక శాస్త్రజ్ఞులైతే కేవలం స్థూల పదార్ధానికి సంబందించిన విషయాలనే ఆధ్యయనం చేస్తున్నారు. కొత్త కొత్త యాంత్రిక ఆవిష్కరణలు చేస్తున్నారు. వారి కంటికి కనపడే వాటిని గురించే అన్వేషిస్తున్నారు. వాటిని దాటి పోలేక పోతున్నారు. అందులోనూ ఖగోళ శాస్త్రజ్ఞులైతే ఎంతసేపూ ఆకాశంలో కనిపించే సౌరమండలానికి సంబందించిన గ్రహాల గురించిన అన్వేషణే చేస్తున్నారు. ఇలాంటి సౌరమండలాలు ఎన్నున్నాయో అంచనా వేయగలరా వారు?ఇప్పుడిప్పుడే దూరదర్శిని యంత్రాల సాయంతో ఎన్నో సౌరమండలాలను, నక్షత్ర మండలాలను కనుగొంటున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలను సేకరిస్తున్నారు. కొత్త కొత్త విహంగ యంత్రాలను తయరుచేసి వాటిని రోదసిలోకి పంపుతున్నారు అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి. ఆకాశం అనంతం. ఈ యంత్రాలు పరిమితులకు లోనై ఉంటాయి కాబట్టి ఆకాశంలో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవు? ఏం తెలుసుకోగలవు? నాసా శాస్త్రఙ్ఞుల ‘హబ్‌ల్‌’ దూరదర్శిని యంత్రం ద్వారా  తీసిన చిత్రం (universe) బ్రహ్మాండంని అంతర్జాలంలో ప్రదర్శిస్తున్నారు. అది చూస్తుంటే ఎంతో అద్బుతంగా ఉంది. ఒకటే యూనివర్స్‌ ఉందా లేక అనేకం ఉన్నాయా అన్నది ఆధునిక శాస్త్రజ్ఞులకు కలిగిన ప్రశ్న. ఎలా తెలుస్తుంది?

1.3  భారతీయ ఆధ్యాత్మిక గ్రంధాల్లో బ్రహ్మాండాల గురించి ప్రస్తావన:

మన వద్దగల ఆధ్యాత్మిక సాహిత్యంలో – పురాణాలు మొ॥ వాటిలో కోటాను కోట్ల బ్రహ్మాండాలున్నాయని ఉంది. మనలో చాలామంది దేవుడ్ని నమ్మేవాళ్ళున్నారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుణ్ణి ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని’ అంటాం. లలితా సహస్రనామావళిలో అమ్మవారిని ‘అనేకకోటి బ్రహ్మాండ జనని’ అన్నారు.

అంటే మనవారి వద్ద బ్రహ్మాండాల గురించిన వివరాలున్నాయన్నమాట. అలాగే లోకాలు అనేకం ఉన్నాయన్నారు. మన మహర్షులు తపస్సమాధిలో దర్శించిన అనేక అంతరిక్ష రహస్యాలను మన పురాణాలు తెలియజేస్తాయి. వాటిలో సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన లోకాలను గురించిన విషయాలనేకమున్నాయి. మనం పురాణాలు మొ॥నవి చదువుతుంటాము లేదా ఎవరైనా పండితులు ప్రవచనాలు చేస్తుంటే వింటుంటాం. కానీ అవి మనకు అర్థం కావు. ఈ ఘోషంతా ఎందుకంటే మనవారిలో కొందరు మన శాస్త్రాలను, వాటిని మనకందించిన బుషులను కించపరిచేట్టు మాట్లాడుతుంటారు: విదేశీ శాస్త్రజ్ఞులు భౌతికప్రపంచానికి సంబంధించిన కొత్త విషయాలను ఎన్నో కనిపెడుతున్నారు. భారతీయుకు ఆధునిక శాస్త్రపరిజ్ఞానం ఉన్నా వారు ఏ కొత్త ఆవిష్కరణలూ చేయలేక పోతున్నారు, సనాతన భారతీయ శాస్త్రాల్లో విజ్ఞాన రహస్యాలేమి లేవు, ఏమైనా ఉన్నా అవి  విదేశీయుల నుండి ‘‘సంగ్రహించారు’’ అని.

1.4  మన శాస్త్రాలంటే ఏమిటి? అందులో ఏముంటాయి?

మనకు శాస్త్రాలెన్నో ఉన్నాయి: వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొ॥నవి.

ఎందుకంటే వాటిలో ఈ క్రింది విషయాలుంటాయి: బ్రహ్మాండం యెక్క ఆవిర్భావం, ప్రపంచసృష్టి, సూక్ష్మప్రకృతి, స్థూల ప్రకృతి, సూక్ష్మ లోకాలైన దివ్యలోకాలు దేవతలు, దేవతావ్యవస్థలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, లోకపాలకులు, మనువులు, మానవుల్లో ఉత్తములు, దేవతలకు మానవులకు గల సంబంధాలు, దేవతలకు గల దివ్యశక్తులు మానవులను ఉద్ధరించటానికి ఉపయోగపడటం, స్వర్గాది భోగలోకాలు, అమృతపానం, రంభాది అప్సరసలు, ఇంకా పాపుల కోసం యమలోకం, రక రకాల నరకాలు ఇత్యాది విషయాలుంటాయి. వ్యాసుల వారందించిన ఏ పురాణం తీసుకున్నా దేవతల గురించే ఎక్కువ ఉంటుంది. ఇవి మనకు అర్థం కావు. నమ్మ బుద్ధి గూడా పుట్టదు. ఇవి అర్థం చేసుకోలేక, నమ్మలేక వాటిని పుక్కిటి పురణాలు, కల్పితాలు అని తక్కువ చేసి మాట్లాడుతున్నదీ మనవారే. వేదవ్యాసుల వారు సామాన్యులు కారు, ఒక ఋషి, ఆయన తపస్సమాథిలో దర్శించిన విషయాలను మనకు పురాణాల ద్వారా అందించారు. మామూలు మనుష్యులు తెలుసుకొలేని వేద రహస్యాలను  మనకు అందించారు. వేదరహస్యాలు తెలుసుకోవాలంటే వేదమంత్రార్థాలను తెలుసుకోగల వేదవిజ్ఞానం ఎంతో ఉండాలి. అది లేని మామూలు మనుష్యులమైన మనకు వేద రహస్యాలు అంత తేలికగా అర్థంకావు. అర్థం కాకపోవడానికి గూడా చాలా కారణాలున్నాయి. అవి:  వేదాలు, పురణేతిహాసాలు మామూలుగా అందరూ అధ్యయనం చేయలేరు. అవి అధ్యయనం చేయాలంటే కొందరు నిష్ణాతులైన పండితులకే సాధ్యం. సనాతన గురుకులాల్లో అన్నీ నోటి ద్వారా వల్లె వేసేవారు. భూర్జపత్రాలలో, తాళపత్రాలలో  నిక్షిప్తం చేసేవారు. అవి అధ్యయనం చేయటానికి, పరిరక్షించడానికి వేదపండిత వర్గం అని ఉండేది. అది వారికే సాధ్యం. వేదవిజ్ఞానం కలుషితం కాకుండా కాపాడే బాధ్యత ఈ వర్గంపై ఉండేది.

1.5  విదేశీ దాడుల్లో నష్టపోయిన మన సంసృతి:

రాను రాను కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. బౌద్ధం, జైనంలాంటి కొత్త అవైదిక మతాలేర్పడి భారతదేశాన్ని నిర్వీర్యం చేశాయి. విదేశీయులు జొరబడి నిర్వీర్యులైన భారతీయును ఓడించారు. విదేశీ దాడుల్లో భారతీయ సంసృతి ఛిన్నాభిన్నమై పోయింది. విదేశీయులు భారతీయుల్ని ఊచకోతకోసి బలవంతపు మతమార్పిడ్లు చేసి రక్తచరిత్రను సృష్టించారు.

1.6  ఆంగ్లేయుల వలన భ్రష్టుపట్టిన మన సంసృతి, సాంప్రదాయాలు:

ఈ క్రమంలో యూరపు దేశీయులైన ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చి మన సంపదను, సంసృతిని చూసి ఈర్ష్యాసూయలకు లోనై మతం ద్వారా మాత్రమే భారతీయులను మార్చవచ్చని తలాతోకా లేని వారి మతాన్ని మన దేశంలో చొప్పించి మత మార్పిడు చేశారు. తుపాకి మందుతో మనల్ని భయభ్రాంతులకు గురిచేసి మనల్ని లొంగదీసుకుని మన రాజ్యాలను, ప్రాంతాలను కొల్లగొట్టి వాటిని లాక్కోని మనకు పాలకులుగా మారి మనల్ని బానిసలుగా చేశారు. మన భారతదేశాన్ని వలస దేశంగా మార్చారు. అంతా అయిపోయింది. మన సంసృతి సాంప్రదాయాలు భ్రష్టుపట్టాయి. ఇదెలా జరిగింది? ఆంగ్ల ముష్కరులు మన వేద విజ్ఞానాన్ని, పురాణేతిహాసాలను అధ్యయనం చేసే నెపంతో సంస్కృతం నేర్చుకుని మిడి మిడి జ్ఞానంతో వేదపురాణేతిహాసాలను ఆంగ్లంలోకి అనువదించారు.

1.7   అచ్చుయంత్రాల వల్ల జరిగిన అనర్థం:

అచ్చుయంత్రం వాడుకలోకి వచ్చేసరికి మన శాస్త్రాలను అచ్చు వేయించడానికి  సాహసించారు ఆంగ్లేయులు. ఐతే మన శాస్త్రాలను చదివితే వారికి అబ్బురపరిచే విషయాలు ఎన్నో కనిపించాయి. వాటిలో ముఖ్యమైనది ప్రపంచ సృష్టిని గురించి విషయాలు చాలా ఆశ్యర్యం కలిగించాయి. మన లెక్క ప్రకారం సృష్టి జరిగి యుగాలు, మన్వంతరాలు, కల్పాలు దాటిపోతున్నాయి. వారి లెక్క ప్రకారం సృష్టి మెదలై 4 లేక 5 వేల సం॥ మించి ఉండదు. మన శాస్త్రాల్లో విషయాలు వారి బైబిల్‌ లోని విషయాలతో ఏకీభవించట్లేదు. వారికి వారి బైబిల్‌ ఒక్కటే నమ్మదగ్గ గ్రంథమని, మన శాస్త్రాలు తప్పుల తడికలని వాటిలోంచి కొన్ని భాగాలను తీసివేసారు. అక్షరాలు మార్చేసి తప్పులతో నింపేసారు. మన శాస్త్రాలను మనవారిచేతే వికృతీకరించారు. అవి చదివితే మనలో మనకే భేదాభిప్రాయాలు కలిగేలా చేశారు. అన్నీ విషయాల్లో వేలుపెట్టి  గందరగోళం సృష్టించి హేళన కలిగేలా చేసారు. అందుకే మనకిప్పుడు మన పురాణాలు అర్థం కాకుండాపోయాయి. పురాణాల్లోని దేవతా వ్యవస్థను నమ్మలేక పోతున్నాం.  మనం భూమ్మీద నివసిస్తున్నాం. కానీ మనకు ఒక మహా భూమి ఉందని అందులోనే మనువు నివసిస్తారని తెలీదు. ‘భూమి’ ని ‘మహాభూమిని’  కలిపి భూలోకం అంటారు అన్న సంగతి గూడా మనకి తెలీదు. దేవతలూ మానవులూ ఒకే బంధువర్గంలోని వారని గూడా తెలీదు.

1.8  నక్షత్ర విజ్ఞానం:

మన పురాణాన్నీ కల్పితాలైతే అందులో ఎందుకు అంతరిక్షంలోని  నక్షత్రాలు, గ్రహాల గురించిన వివరాలుంటాయి? మన పురాణాల్లో వివిధ లోకాల గురించిన ప్రస్తావన ఎందుకుంటుంది? మనపండితులెందుకు మనకు పంచాంగ విజ్ఞానాన్నందించారు? రోజూ పూజ చేసేవారు పంచాంగం చూసి సంకల్పం చెప్పుకుంటారు. ఏమని? అద్య బ్రహ్మ ద్వితీయ పరార్ధే…. బ్రహ్మ కాలమానం (సృష్టి జరిగి ఎంత కాలమైందో)… ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం… అయనం(ఉత్తరాయణమా, దక్షిణాయణమా) ఋతువు… మాసం… పక్షం… రోజు… తిథి… నక్షత్రం మొ॥వి. అంటే నక్షత్ర విజ్ఞానమంతా మనకు అరచేతిలోకి వచ్చేసింది మన సంకల్పంలోనే. మరి మూడు సంవత్సరాలకొచ్చేఅధిక మాసం వివరాలు గూడా మనవారికి తెలుసు. ఆధునిక యంత్ర సామగ్రి లేకపోయినా గ్రహణాల పట్టు, విడుపులు గూడా ఎంతో ఖచ్చితంగా చెప్తున్నారు. ఇవన్నీఎలా లెక్కలు వేసి చెప్తున్నారు ఏ విజ్ఞానం లేకపోతే?

సృష్టి ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ జరిగిన కాలమాన లెక్కల మన పండితుల వద్ద ఉన్నాయి. మనవద్ద మనదేశానికి సంబంధించిన కాలమాన వివరాలు పంచాంగం రూపంలో ఉన్నాయి. ఇప్పుడైతే విదేశాల్లో ఉంటున్న భారతీయులకు గూడా పనికొచ్చేట్టు పంచాంగాలు తయారు చేస్తున్నారు మన పండితులు. మనం దైవంగా భావించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో పుట్టారో అన్నవాటికి గూడా లెక్కలున్నాయి  మన వారి వద్ద. వాళ్ళ జాతకచక్రాలు గూడా ఉన్నాయి. మరి వాటిని ఎవరైనా ఊహించి రాయగలరా? మరి విదేశీయులకి వారి కాలమానం ఎప్పటినుండి వ్యవహారంలోకి వచ్చిందో గూడా వారికే తెలియదు సరిగా.

1.9   శ్రీపాదవల్లభుల దివ్యలోకాల సంచారం:

ఇంకా మన ఆధ్యాత్మిక సాహిత్యం చదివితే కొన్ని దివ్యలోకాలకు సంబందించిన కొన్నివిషయాలు తెలుస్తాయి.

ఉదా: శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అన్న పుస్తకంలో నక్షత్రాలకు సంబంధించిన కొన్ని వివరాలున్నాయి. శ్రీదత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో దాదాపు 700 సం.క్రితం శ్రీ రాజశర్మ, సుమతి దంపతులకు జన్మించారు. వారి మాతామహులైన శ్రీబాపనార్యులగారు వేదవేదాంగ శాస్త్రాలను అధ్యయనం చేసిన మహాపండితుడు. ఆయన గొప్ప మంత్ర శాస్త్రవేత్త గూడాను. వారు శ్రీశైలంలో ఒక మహా యజ్ఞం చేసి సూర్యమండలం నుండి సూర్యుని శక్తిని కొంత గ్రహించి శ్రీమల్లికార్జున లింగంలో ప్రవేశ పెట్టారు. అంటే శక్తిపాతం చేశారు. దానికి ఫలితంగా శ్రీపాదుల వారి జన్మ సంభవించింది. దత్తావతారమంటే త్రిమూర్తుల కలయిక. అందువల్ల శ్రీపాదులు కూడా సృష్టి, స్థితి, లయ కార్యాలు చేయగల సమర్థులు. ఆయన అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు. దానివల్ల ఆయన తన ఇచ్ఛానుసారం నక్షత్రలోక సంచారం చేసేవారు.

ఈ సందర్భంలో ఈ  పుస్తకంలో వాటి వివరం కొంత ఇచ్చారు: శ్రీపాదులవారు 16 సంవత్సరాలు పిఠాపురంలో నివసించారు. తర్వాత భక్తులనుద్ధరించడానికి గృహత్యాగం చేసి బయటి ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో ఆయన అనేక క్షేత్రాలు దర్శించారు. అందులో శ్రీశైలం, గోకర్ణం వెళ్ళారు. శ్రీశైలం నుండి యోగమార్గాన సశరీరంతో మహాగ్నిగోళంలాగ సూర్యమండలానికి వెళ్ళారు. అక్కడ నుండి ధ్రువ నక్షత్రంలోకి, సప్తర్షి మండలంలోకి, ఆర్ద్రా నక్షత్రంలోకి వెళ్ళి తిరిగి 4 నెలల తర్వాత వచ్చారు. ఆర్ద్రానక్షత్రంలోని మహఋషుల కోరిక మేరకు అత్యంత నూతనమైన దివ్యజ్ఞానయోగాన్నొకదాన్ని ప్రభోదించారు శ్రీశైలంలో సిద్ధపురుషులను సమావేశపరచి. ఆ సిద్ధపురుషులను తిరిగి ఆర్ద్రానక్షత్రంలోకి పంపారు. కొంతకాలమయ్యాక శ్రీపాదులు కురుంగడ్డ అనే ప్రదేశానికి చేరారు. వారు ఎవరికీ అర్థంకాని ఇలాంటి పనులెన్నో చేసేవారు.

1.10 నాసా శాస్త్రవేత్తల సందేహాలు తీరుస్తున్న మన స్వామీజీలు:

అమెరికాలోని ‘నాసా’ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తల కేవైనా సందేహాలొస్తే మన స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. ఆ మధ్య ‘ఙ్ఞానయోగి’ ఛానల్‌ వారు ప్రసారం చేసిన శ్రీ ప్రతాప దక్షిణామూర్తి దీక్షితుల గారి ప్రసంగాలను   వినడం జరిగింది. వారు మెదక్‌ జిల్లా, కొహీర మండలం, జహీరాబాదులో గల ఓంకారేశ్వర పీఠాధిపతి. వారి ప్రసంగాల్లో వారే చెప్పారు నాసా శాస్త్రవేత్తలకి సందేహాలొస్తే తమని సంప్రదిస్తారని. ఆశ్చర్యకర విషయమేంటంటే ఈ నాసా శాస్త్రవేత్తల వద్ద మనదేశంలో గల వేదపండితుల వివరాలున్నాయట. మనదేశంలో 15000 మంది పండితులే ఉన్నారుట. కానీ అమెరికా, జర్మనీల్లో కలిపి 100000 (లక్ష) మంది దాకా ఉన్నారుట.

ఒకసారి నాసా వారే స్వామీజీని అడిగారుట: సూర్యమండలానికి ప్రయాణించాంటే ఎంత దూరం వరకూ వెళ్ళొచ్చని. ఆయన చెప్పారుట లక్ష యోజనాలని. ఆయన చెప్పినంత దూరం వరకూ వెళ్ళగలిగారట. ఆపైన సాధ్యం కాలేదుట. కానీ సూర్య మండలం నుండీ వస్తున్న ఒక నాదాన్ని మటుకూ వారు రికార్డు చేసారుట. అది ఓంకారనాదంగా వినిపించిందిట. అంటే మన ఋషులు చెప్పిన శబ్దబ్రహ్మం సూర్యునికి సంబంధించిందేనన్నమాట.

1.11   మహాత్ములకు పుట్టినిల్లు మన భారతదేశం:

మన భారతదేశంలో ఎందరో మహాత్ములు పుట్టారు. ఇప్పుడు గూడా పుడుతున్నారు. ఇంకా పుడుతూనే ఉంటారు.

భారతదేశమంటేనే మహాత్ములకు పుట్టినిల్లు. వారి ద్వారానే మనకు సత్యాసత్యా అవగాహన కలుగుతోంది.

మన పండితుల నుండే శాస్త్ర విజ్ఞాన రహస్యాలను అరబ్బులూ, గ్రీకుల్లాంటి విదేశీయులు సంగ్రహించారు. కానీ మనవారికి వారి నుండి గ్రహించాల్సిన అగత్యం పట్టదు. ఎందుకంటే మన ఋషులకూ, పండితులకూ

కనపడే స్థూలప్రపంచ విషయాలే కాదు, కనపడని సూక్ష్మప్రపంచ విషయాలు గూడా తెలుసు. ఇలా ఎందరో మహానుభావుల్లో కొందరు మనకు సాహిత్యపరంగా చేసిన మేలుని స్మరించుకుందాం:

  1. నడిచే దేవుడు అని పేరుగాంచిన కంచి కామకోటి పీఠానికి చెందిన, పూర్వపీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖరసరస్వతీమహాస్వామి తమ ప్రసంగాల ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు.
  2. భారతదేశ చరిత్రను ఆంగ్లేయులు వక్రీకరించి రాస్తే, ఎంతో పరిశోధించి, వారి తప్పును సరిచేసి, నిజమైన భారతదేశ చరిత్రను తిరగరాసి మనకందించిన వారు భారత చరిత్ర భాస్కర అన్న పేరుగాంచిన శ్రీ కోట వేంకటాచలం గారు.
  3. భారతదేశ గొప్పతనాన్ని తమ ప్రసంగాల్లో తెలియచేసినవారు సద్గురు డా. శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారు.

ఈ మహాత్ములు ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా, వారి ప్రసంగాలు పుస్తక రూపంలో ఉన్నాయి.

వాటి ద్వారానే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం, విజ్ఞాన రహస్యాలను గురించి ఇంతవరకూ తెలియని కొత్తకోణాలు ఇప్పుడు ఆవిష్కృతమవుతున్నాయి.

1.12  మన శాస్త్రాల్లోని విషయాలు:

మన శాస్త్రాల్లో ఏ విషయాలు ముఖ్యంగా ఉంటాయో తెలుసుకోవాలి. మన శాస్త్రాల్లో ముఖ్యంగా బ్రహాండసృష్టి విజ్ఞానమంతా నిక్ష్మిప్తమై ఉంది. ఈ విశ్వమంతా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించబడింది. ఇందులో ఒక నియతి ఉంది. అన్నిటికీ నియామకుడైన పరమేశ్వరుడున్నాడు. ఈ విశ్వంలో అనేక బ్రహ్మాండాలున్నాయి. ఈ భూమ్మీద నివసించే మనం గూడా ఒక బ్రహాండానికి చెందుతాం. మనకు ప్రస్తుతం జరుగుతున్న ఈ సృష్టి గురించే ఏదో కొద్దిగా తెలుసు. కానీ మన శాస్త్రాల్లో పూర్వం జరిగిపోయిన అనేక సృష్టుల గురించిన సమాచారం గూడా ఉంది. బ్రహ్మదేవునికి ఒక రోజంటే ఒక కల్పం కింద లెక్క. ఈ బ్రహ్మకల్పంలోనే సృష్టి, స్థితి, లయ అన్నీ జరుగుతాయి. ఇలా అనేక కల్పాల్లో అనేక సృష్టులు జరిగి లయించిపోయాయి ఇప్పటికి.

ఇలాంటివన్నీ వినడానికి విడ్డూరంగా ఉంటాయి. ఈ బ్రహాండమంటే ఏమిటి? అందులో ఏమేముంటాయి? మన భూమి అందులో ఎంత? అది ఎక్కడుంది? ఇలాంటివాటి గురించి మామూలు మానవులకేం తెలుస్తుంది? మహాత్ములకు తెలుస్తుంది కానీ. అందుకే కొందరు మహాత్ములందించిన మన బ్రహ్మాండానికి సంబంధించిన విజ్ఞాన విషయాలను పుస్తకాల ద్వారా గ్రహించి ఇక్కడ అందజేస్తున్నాం. దేవుడంటే నమ్మకముంటే చదివి ఆనందించగలరు.

ఈ రచన ఉద్దేశం, మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞానరహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావడమే. అవి:

  • పరమాత్మ-బ్రహాండసృష్టి
  • మన బ్రహాండంలో ఏమేమున్నాయి?
  • లోకాల ఉనికి.
  • గ్రహ, నక్షత్రాదులు
  • భూలోకం ( భూమి + మహాభూమి)
  • మనువు, ప్రజాపతులు
  • దేవతలు, మానవులు.
  • దివ్యలోకమైన మణిద్వీపంలోని దేవతావ్యవస్థ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here