అద్వైత్ ఇండియా-34

0
4

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ప్రసవమయ్యాకా, మూడో రోజున సీతని ఇంటికి తీసుకువస్తారు. సుల్తాన్ వచ్చి నరసింహశాస్త్రిగారిని కలుస్తాడు రాబర్ట్ ఆండ్రియాకు విడాకులిచ్చి, లిల్లీని పెళ్ళి చేసుకున్నాడన్న విషయం, గూడెంలో ఫారెస్ట్ ఆఫీసర్ రిచర్డ్ మరణం సంగతి సుల్తాన్ ద్వారా తెలుసుకుంటారు శాస్త్రిగారు. రాబర్ట్ రాఘవపై అనుమానంతో ఉద్యోగంలోంచి తొలగించాడని చెప్తాడు సుల్తాన్. అతన్ని భద్రాచలం వెళ్ళి రాఘవని తీసుకురమ్మని అడుగుతారు శాస్త్రి. రాఘవని, గంటన్నని పట్టుకోవడానికి గుడేం చుట్టూ వందమంది పోలీసులను పెట్టాడని, ఈ పరిస్థితుల్లో తానెక్కడికి వెళ్ళినా రాఘవని కలవలేనేమోనని అంటాడు సుల్తాన్. పోనీ, రాఘవ ఇంటికి యజమానిని కలిసి – సీతకు పాప పుట్టిందని చెప్పి రమ్మంటారు. రాఘవ ఉద్యోగం పోగొట్టుకుని పరారీలో ఉండడం ఆయనకు బాధ కలిగిస్తుంది. అటు అద్వైత్ జాతకంలో గోచరించిన సమస్యల దృష్ట్యా – అద్వైత్‍ ఇక్కడే ఉంటే సమస్యల్లో చిక్కుకుంటాడని లండన్ పంపేసిన సంగతి గుర్తుచేసుకుంటారు. అద్వైత్ వస్తే బాగుంటుందని సావిత్రి, సీత భావిస్తే, వస్తే చిక్కుల పాలవుతాడేమోనని శాస్త్రిగారు ఆందోళన చెందుతారు. రాబర్ట్ సుల్తాన్ కొడుకు అంజాద్, తహసిల్దార్ మార్టన్, డ్రైవర్ కరీమ్ తో కుట్ర చేస్తాడు, రాఘవని చంపే బాధ్యత అంజాద్‍కు, శ్రీ మహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని అపహరిచే పని కరీమ్‍కు అప్పగిస్తాడు. ఆ పనులు విజయవంతంగా పూర్తి చేస్తే వాళ్ళు జీతాలు పెంచుతాననీ, హోదా మార్చేస్తానని ఆశచూపుతాడు. అంజాద్ శాస్త్రి గారింటికి వచ్చి రాఘవ గురించి అడుగుతూ ఆయనతో దురుసుగా మాట్లాడుతాడు. శాస్త్రిగారు కోపగించుకుని అతన్ని పంపేస్తారు. భద్రాచలం నుంచి సుల్తాన్ వచ్చి శాస్త్రిగారిని కలిసి – రాఘవ ఇంటి యజమానికి కలిసి కబురందించాననీ, రాఘవ పదిహేను రోజులుగా ఇంటికి రాలేదని చెప్తాడు. అంజాద్ వచ్చి బెదిరించి వెళ్ళిన విషయం చెప్తారు శాస్త్రి. కొడుకు ప్రవర్తనకి సుల్తాన్ క్షమాపణ అడుగుతాడు. ఇంతలో కరీమ్ వచ్చి, శాస్త్రి గారిని రాబర్ట్ పిలుచుకు రమ్మన్నాడని చెప్తాడు. అవసరం రాబర్ట్‌ది కాబట్టి అతన్నే, సాయంత్రం అమ్మవారి గుడికి రమ్మంటారు శాస్త్రిగారు. అమ్మవారి గుడి ప్రాంగణంలో రాబర్ట్, శాస్త్ర్తి గారి మధ్య వాదన జరుగుతుంది. రాబర్ట్ కోపంతో శాస్త్రిగారిని నానా మాటలు అని వెళ్ళిపోతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 67:

[dropcap]రా[/dropcap]బర్ట్ శ్రీమహాలక్ష్మి దేవి బంగారు విగ్రహాన్ని చూచి ఆ విగ్రహాన్ని ఎలాగైనా తస్కరించి నాకు యివ్వాలని కరీమ్‌కు చెప్పిన నాటి నుంచీ.. అతను ఆ పనిని చేసేటందుకు సహాయంగా మరో ఇద్దరు మిత్రులతో జత కట్టాడు. సాయంత్రం ముగ్గురూ కలసి మందు తాగేవారు. విగ్రహాన్ని ఎలా లేపేయాలని ఆలోచించేవారు. ఆ ఇరువురిలో ఒకనికి – రాత్రి ఆలయానికి రెడ్డిరామిరెడ్డిగారు నియమించిన కాపలాదారులు (వాచ్‌మెన్) ఇరువురిలో.. ఒకతను బాగా పరిచయం. రాత్రి పొద్దుపోయాక కరీమ్ స్నేహితుడు.. వారి వద్దకు కల్లు సీసాలతో వెళ్ళేవాడు. అతని పేరు జాలయ్య. అతను తీసుకొని వెళ్ళిన కల్లును ఆ ముగ్గురూ.. ఊరి విషయాలను గురించి మాట్లాడుకొంటూ సేవించేవారు. కల్లు సీసాలు ఖాళీ కాగానే జాలయ్య ఇంటికి వెళ్ళిపోయారు. వారిరువురూ మత్తులో నిద్ర పోయేవారు.

ఆ అమావాస్య రాత్రి పదిన్నరకు జాలయ్య కల్లు సీసాలతో ఆలయ కాపలాదారులను కలిశాడు. ఆలయం ముందున్న వేప చెట్టు క్రింద కూర్చొని తమ కలాపాన్ని ప్రారంభించారు. సమయం చూచి.. కరీమ్ అతని మరో సహచరుడు చలమయ్యలు ఆలయంలో ప్రవేశించారు. ఆలయ ద్వారానికి వున్న తాళపు బుఱ్ఱను పగలగొట్టారు. తలుపును మూసి.. అమ్మవారు విగ్రహాన్ని గునపంతో పెకలించి.. గోనె సంచిలో వేసికొని ఆలయం బయటికి వచ్చి అమావాస్య చీకటిలో కలసిపోయారు.

జాలయ్య తన ఇద్దరు మిత్రులు.. పూర్ణయ్య.. చంద్రయ్యలతో కల్లు తాగుతూ.. మాంస భక్షణ చేస్తూ వారిరువురి దృష్టిని తన వైపు.. ముందున్న కల్లు సీసాలు.. తాను తెచ్చిన తినుబండారాల మీద లగ్నం అయ్యేలా వారితో మంతనాలు ప్రారంభించాడు. కల్లు సీసాలను ఆ ముగ్గురూ ఖాళీ చేశారు. అతను తెచ్చిన ఆహారాన్ని ఆరగించారు. కైపులో తేలిపోయారు. జాలయ్య చూపంతా ఆలయం మీద. కరీమ్ అతని హితుడు దొంగ చలమయ్యలు విగ్రహంతో ఆలయాన్ని దాటడం చూచి.. ఆనందంగా వారు అనుకొన్న పని ముగిసినందుకు నవ్వుకుంటూ.. తన ఇంటివైపుకు నడిచాడు జాలయ్య.

కరీమ్.. రాబర్ట్ బంగళాకు వెళ్ళి విగ్రహాన్ని అతనికి అప్పగించాడు. రాబర్ట్ ఆ విగ్రహాన్ని.. కరీమ్ చలమయ్యలతో.. ఆ రాత్రికి రాత్రి కలకత్తాకు తరలించాడు. తన కోర్కె నెరవేరినందుకు రాత్రి రెండు గంటల ప్రాంతంలో.. రెండు పెగ్గుల రమ్మును తాగి లిల్లీతో ఆనందంగా శయనించాడు రాబర్ట్.

అదే సమయానికి.. నరసింహశాస్త్రికి చిత్రంగా ఆలయంలో దొంగలు జొరబడి అమ్మవారి విగ్రహాన్ని పెకలించి గోనె సంచిలో వేసికొని పారిపోయినట్లు ‘కల’ వచ్చింది. తొట్రుపాటుతో లేచారు నరసింహశాస్త్రి.

చాలా పొద్దుపోయే వరకు సావిత్రి మేల్కొని.. తన కుమారుడి రాక విషయాన్ని గురించి నరసింహశాస్త్రితో చర్చించి.. వారి.. చేత అద్వైత్‍ను వెంటనే బయలుదేరి రావలసినదిగా ఉత్తరం వ్రాయించి నిద్రకు ఉపక్రమించింది.

శాస్త్రిగారు కలగని.. లేచేసరికి సావిత్రి గాఢ నిద్రలో వుంది. మెల్లగా మంచం దిగి శాస్త్రిగారు సింహద్వారాన్ని తెరచుకొని వరండాలోకి వచ్చారు.

‘ఏమిటి అలాంటి కల వచ్చింది!.. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బంగారు విగ్రహాన్ని దొంగలు దోచారా!..’ ‘తల్లీ.. ఏమిటి ఆ దుస్వప్నం.. నా కల నా భ్రమనా!.. లేక నిజమా!..’ అయోమయస్థితిలో శాస్త్రిగారు..

కొన్ని నిముషాల తర్వాత ఆలయానికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని చూచి రావాలనే నిర్ణయానికి వచ్చారు. సింహద్వారాన్ని మూసి.. ఆలయం వైపుకు వేగంగా నడిచారు. వారి మనస్సులో అనుమానం.. ఆవేదన.. నడుస్తూ.. ‘ప్రస్తుతంలో రామిరెడ్డిగారు ఊర్లో లేరు కదా!.. తల్లీ జగన్మాతా!.. నీవు సాయంత్రం నాకు ఆలయంలో గోచరించిన రీతిగానే.. ఇప్పుడు నాకు కనుపించాలి. కనుపించాలి..’ ఆ తల్లిని తలచుకొంటూ పావుగంటలో శాస్త్రిగారు ఆలయాన్ని చేరారు. మూసి వున్న గుడి తలుపులో వున్న రంధ్రం గుండా లోనికి చూచారు. అమ్మవారి విగ్రహం వారికి గోచరించలేదు. తలుపు మెల్లగా తోశారు. తస్కరులు తాళపు బుఱ్ఱను పగులగొట్టిన కారణంగా తలుపు తెరుచుకొంది. గాలికి రెపరెపలాడుతూ గుడిలోని దీపం వెలుగుతూ వుంది. ప్రక్కన వుండవలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బంగారు విగ్రహం లేనందున శాస్త్రిగారు ఆశ్చర్యపోయారు.

“అమ్మ విగ్రహాన్ని దొంగలు దోచారు.. దొంగలు దోచారు..” గద్గద స్వరంతో అన్నారు శాస్త్రిగారు.

వారి హృదయంలో ఎంతో ఆవేదన.. ముఖలో దుఃఖం.. కన్నీరు. ఆలయం బయటికి వచ్చి కాపలాదారుల కోసం చూచారు గుడి నాలుగు వైపులా.. వెదికారు శాస్త్రిగారు.

“పూర్ణయ్య!.. చంద్రయ్యా!..” బిగ్గరగా పిలిచారు.

జవాబు లేదు..

అప్రయత్నంగా ఆలయ ముఖ్యద్వారానికి ముఫై అడుగుల దూరం వున్న వేపచెట్టుకు వైపుకు వారి చూపు మళ్ళింది. తప్ప తాగి శవాల్లా పడి వున్న కాపలా వాళ్ళను చూచారు శాస్త్రిగారు. ఆశ్చర్యంతో వారిని సమీపించి ఆత్రుతతో నాలుగైదు మార్లు వారి పేర్లతో పిలిచారు. వారిలో చలనం లేదు. శాస్త్రిగారికి విషయం అర్థం అయింది.

ఆలయానికి.. ఐదు నిముషాల నడకలో వున్న పూజారి శంకరశర్మ గారి యింటికి వెళ్ళి తలుపు తట్టి.. “శంకరా!..” పిలిచారు శాస్త్రిగారు.

గాఢ నిద్రలో వున్న శంకరశర్మ.. శాస్త్రిగారి ఐదవ పిలుపుకు ఉలిక్కిపడి మేల్కొన్నాడు.

వేగంగా లేచి వచ్చి తలుపు తెరిచాడు శంకరశర్మ.

“అన్నా!.. యీ వేళప్పుడు..”

“శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకపోయారు శంకరా!..” ఆవేదనతో చెప్పారు నరసింహశాస్త్రిగారు.

శంకరశర్మ ఆశ్చర్యపోయాడు.

“అన్నా!..”

“అవును శంకరా!..”

తనకు వచ్చిన కలను గురించి.. తాను ఆలయానికి వచ్చి చూచిన యథార్థాన్ని గురించి.. కాపలా వారి గాఢ నిద్రను గురించి శాస్త్రిగారు శంకరశర్మకు చెప్పారు.

ఏం చేయాలనే విషయాన్ని గురించి యిరువురూ తర్జనభర్జన పడి.. ఉదయాన్నే యితర పెద్దలతో మాట్లాడి.. పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు. శాస్త్రిగారు ఆవేదనతో తన ఇంటికి బయలుదేరారు.

నరసింహశాస్త్రిగారు ఇంటికి చేరే సమయానికి సావిత్రి నిద్రపోతూ వున్న ఎవరినీ లేపకుండా.. వారి రాక కోసం వరండాలో కూర్చొని వుంది. యీ సమయంలో ఎక్కడికి వెళ్ళారా అని ఆందోళనతో ఆలోచిస్తూ వుంది.

‘అద్వైత్ లండన్ వెళ్ళినప్పటి నుంచీ నాతో మాటలు పూర్తిగా తగ్గించారు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఏదో ఆలోచన.. బహుశా దైవాన్ని ధ్యానిస్తూ కూడా వుండవచ్చు. ప్రతి ఒక్కరూ వయస్సులో వెర్రి వేషాలు వేసినా.. జీవిత పరాభాగ ప్రారంభ దశ నుంచీ.. రోజులో కొంతకాలం దైవ సంకీర్తన.. జపంతో గడపటం ఎంత ముఖ్యమో వారు అనేకసార్లు నాకు చెప్పారు. నేనూ పాటించాను. ఆ కారణంగా నాలో కలిగిన మార్పును గమనించాను. సహనం.. శాంతం పెరిగింది. ఆందోళన ఆర్భాటం తగ్గింది. ఆ కారణంగానే యీ సమయంలో ఒంటరిగా యిక్కడ కూర్చొని వారి రాకకై ఎదురు చూడకలుగుతున్నాను. నాతో మాట చెప్పకుండా వెళ్ళారంటే.. ఏదో ముఖ్యమైన పని మీద.. లేక ఎవరన్నా వచ్చి పిలిచి వుంటే వారితోటే వెళ్లి వుండవచ్చు. యీ అర్ధరాత్రిలో నాకు తెలియకుండా వారికి పని ఏమిటి?.. బహుశా నేను నిద్రలో వున్నప్పుడు.. ఎవరో ఏదో అవసరరీత్యా వారిని కలసి వుండవచ్చు. వచ్చిన వారితో వారు కలసి వెళ్ళి వుండవచ్చు!..’ ఎంతకూ తెగని యీ ఆలోచనలతో వాకిటి వైపు.. ఆకాశం వైపు చూస్తూ కూర్చుండిపోయింది సావిత్రి.

నరసింహశాస్త్రిగారు.. వీధి గేటు తెరచుకొని లోనికి వచ్చారు. వారిని చూచిన సావిత్రి లేచి ఎదురేగి వారిని సమీపించి..

“ఎక్కడికి వెళ్ళారండీ!..” ఆందోళనగా అడిగింది.

“రా చెబుతా!..”

వరండాలో ప్రవేశించి.. కూర్చున్నారు శాస్త్రిగారు. వారి ముందు నిలబడింది సావిత్రి.

“సావిత్రి!.. మన శ్రీ మహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని దొంగలు తీసికొని వెళ్ళిపోయారు” బాధతో చెప్పారు శాస్త్రిగారు.

సావిత్రి ఆశ్చర్యపోయింది. తనకు వచ్చిన కలను గురించి.. తాను ఆలయానికి వెళ్ళి చూచిన దృశ్యాలను గురించి ఎంతో వేదనతో శాస్త్రిగారు సావిత్రికి తెలియజేశారు.

అధ్యాయం 68:

మరుదినం ఉదయం ఏడుగంటలకు కొందరు పెద్దలు.. నరసింహశాస్త్రి.. పూజారి శంకరశర్మ.. ఆలయంలో సమావేశమైనారు. రెడ్డిరామిరెడ్డిగారు వూరిలో లేనందున విషయాన్ని వారికి తెలియజేసేటందుకు ఒక వ్యక్తిని మద్రాస్‍కు పంపేదానికి నిర్ణయించుకొన్నారు.

కాపలాదారులుగా వుంటున్న పూర్ణయ్య.. చంద్రయ్యలను పిలిపించారు. రాత్రి ఏం జరిగిందని ప్రశ్నించారు. వారిరువురూ మాకు ఏమీ తెలియదని అబద్దం చెప్పారు.

వారి మాటల మీద విశ్వాసం కుదరని పెద్దలు రెండు మూడుసార్లు అడిగారు. వారు అదే మాటను మరలా చెప్పారు.

రెడ్డిగారి పినతండ్రి కొడుకు రాఘవరెడ్డికి వారు అబద్ధాన్ని చెబుతున్న కారణంగా కోపం పెరిగింది. పనివాళ్ళను పిలిచి.. పిడకలను గడ్డపారను తెప్పించి.. గడ్డపార (గునపం) నేల వుంచి దానిపై పిడకలను పేర్చి కిరోసిన్ చల్లి నిప్పంటించారు. ముక్కాలు గంటలో నల్లని గునపం ఎఱ్ఱగా మారిపోయింది. పిడకలు కాలి బూడిదగా మారింది.

“మీరు చెప్పింది నిజం అని మేము నమ్మేదానికి మీ యిరువురూ ఆ గడ్డపారను చేతుల్లోకి తీసుకొండిరా!..” గర్జించాడు రాఘవ రెడ్డి.

మిగతావారు.. “కానియ్యండి” అని ఏకకంఠంతో చెప్పారు.

విగ్రహం దొంగల పాలైనందుకు ఎంతో వేదనతో వున్న నరసింహశాస్త్రిగారు జరుగుతున్న సన్నివేశాన్ని మౌనంగా తిలకిస్తున్నారు.

కదలని పూర్ణయ్య.. చంద్రయ్యలను నలుగురు యువకులు ముందుకు త్రోశారు. వారు మోకాళ్ళపై నేల వాలారు. ఇరువురూ బోరున ఏడ్వసాగారు.

“ఏడుపును ఆపి.. గడ్డపారను చేతుల్లోకి తీసుకొండిరా..” శాసించాడు రాఘవరెడ్డి.

వారిరువురూ ఒకరి ముఖాలను ఒకరు చూచుకొని.. నిజం చెప్పకపోతే.. చేతులను కాల్చుకోవలసి వస్తుందనే భయంతో రాఘవ రెడ్డి కాళ్ళమీద పడి గత రాత్రి జరిగిన విషయాన్నంతా కన్నీటితో వారికి ఏకరువు పెట్టారు.

రాఘవరెడ్డి.. పోలీస్ స్టేషన్‌కు ఆ ఇరువురిని.. మరో నలుగురితో కలసి వెళ్ళి పూర్ణయ్య చంద్రయ్య జాలయ్య మీద కేసు పెట్టాడు. పూర్ణయ్యను చంద్రయ్యను పోలీసులు జైల్లో తోశారు. విషయం విన్న జాలయ్య పరారైనాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here