[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది తొలి భాగం. [/box]
[dropcap]నా [/dropcap]హృదయగత కథనం ఎలా విప్పి చెప్పను?
ప్రియమైన ప్రభాకర్!
ఎన్నో ఏళ్లుగా నీ పట్ల నా అతి సన్నిహితమైన ఆలోచనల ఉద్వేగం కలవరపరచిన అలలు నా హృదయంలో ఉవ్వెత్తున ఎగిసిపడటం దానివల్ల కలిగే విపరీతమైన బాధ నాలోలోపలె అనుభవిస్తున్నాను. కాని ఇంత కాలం గడిచాక అవే భానాలు నా ఈ ప్రస్తుత ప్రశాంతజీవనంలో ఆహ్లాదకరమైన సజీవ పులకలు మొలకెత్తేలా చేస్తున్నాయి. అదీ ఇలా గతాన్ని ప్రేమగా గౌరవంగా చప్పరిస్తుంటే…
ఈ స్థితి -నీతో దీన్ని పంచుకోవాలన్న ఒక నిజమైన అభిలాష – అవ్యక్త ఆనందాన్నిచ్చే ఒక ఆహ్లాదకరమైన అనుభవం. అదీ ఈ ఉత్తరం రాయడానికి కారణం.
నా తొలి ప్రేరణ నా సుఖ దుఃఖాలు నీతో పంచుకోడం. నువ్వు నా హృదయానికి ఎంతో ప్రియమైన వాడివి. నన్ను నేను నీతో వేరుపరచలేనంతగా కలగలసిపోయిన ఏకత్వంగా గమనించాను.
నేనిక్కడ క్షణం తీరికలేకుండా ఉత్తరాల ద్వారా ప్రతి వివరణా నీకు చెప్తూనే ఉన్నాను.
కాని ఆ దిశలో నా కార్యక్రమం కొనసాగించటం అంత సులువేమీ కాదు. నేను ఎంతో ఆసక్తితో ధృఢ నిశ్చయంతో రాయాలని కూచుంటాను. కాని నా పెన్ను నిరాకరిస్తుంది. దూసుకొస్తున్న ఉద్వేగాలు ఆపేస్తాయి. భాష మూగదైపోతుంది.
నీకు తెలుసా ఈ పెళ్లి కుదిరిన నాటి నుండీ నా గాఢమైన ఆలోచనలు రాయడమే అసాధ్యమైపోయింది, లోలోపలి నుండి ఒక ఆగలేని తపన ఒకటి ఉండాలి కదా?
ఇంత వరకూ నామనసును ఎవరికీ ఎప్పుడూ తెలియబరచనే లేదు. అంతే కాదు ఈ విషయం వినడానికి ఎవరూ లేరు కూడా.
మనం ఎలాటి వాతావరణం లోనైనా రాజీ పడగలం. మనం మన గతం మరచిపోతాం. అందువల్లనే మనం ఎవరినీ ప్రేమి౦చలేం. మన భావాలు ఎంత అసత్యాలు. ఇది నాటకాల్లో వేషం వెయ్యడం లాటిదే.సినిమా కధలాగే ఉంది.
కాని రోజు గడచిపోగానే జ్ఞాపకం చెరిగిపోదు. మాట్లాడినంత సులభం కాదు అనుకున్నది కాగితమ్మీద పెట్టడం.
నా ఉద్వేగాలు నా కోరిక పదాల మిశ్రమంతో కలగలిసి వ్యక్తీకరణ వైపు ఒరుగుతాయి. ఐహిక విషయాల తెలియజెప్పడానికి పదాలు వ్యక్తం చేసే భాష ఒక్కటే మార్గం కాదు. మనుషులు ఇతర జీవాలు లోలోపల గాఢ౦గా పొదిగిన అభిలాష , ఒక అనివార్యత ఉబికివచ్చే వ్యక్తీకరణ.
నిజమైన కారణం ఎక్కడో మునిగిపోయి ప్రపంచం మొత్తం మనను ప్రేమిస్తో౦దనో లేదా ద్వేషిస్తోందనో అనుకుంటాము. భాషకి అంత శక్తి ఉంది మరి. మన భాషా శక్తి ఎంత మ౦ది ఇతరులను చెడగొట్టగలదు?
మనిషికీ మనిషికీ మధ్యన అనుబంధాన్ని అది తుడిచేయ్యవచ్చును, లేదూ అదొక బలమైన ఏకం చేసే శక్తి కానూ అచ్చును. మనలో అంతర్గతంగా పాతుకుపోయిన భావాలను దాచడమో లేదా నగ్నంగా చూపడమో కాదు దాని కర్తవ్యం.
అందుచేత నేనిలా భాష ఆసరాతో వ్యక్తీకరణ ఎంచుకున్నాను.
నా ఉత్తరం నీకు ఆశ్చర్యం అనిపించవచ్చును, ఆశ్చర్యపోలేదా?
ఈ విషయాలు జరిగాయా, లేక జరుగుతాయా అని నీకు అనుమానం రావచ్చును. నేను సవినయం గా నిజాయితీగా చెప్పేది ఒకటే , ఇవేవీ మా కల్పనలో ఊహలో కాదు. ఇవి నేను నిజాయితీగా అంగీకరించే విషయాలు.
నాకు సృజనాత్మక శక్తి లేదు. నీకా సంగతి తెలుసు.
సృజనాత్మక ప్రోత్సాహం వల్ల తలెత్తే వ్యక్తీకరణ ఆదర్శప్రాయంగా ఉ౦డనూ వచ్చు లేదా ఒక అసహాయురాలైన పిచ్చిపిల్ల యౌవన ప్రేమావేశంలో చేసే రోదనగా మిగిలిపోనూ వచ్చును.
అందరికీ మంచి మనసు నివ్వు దేవుడా.
ఇంటర్యూ జరిగే రోజది. సైకాలజీ విభాగంలో మనం కలుసుకున్నాం. నాకప్పుడు నీ పేరు తెలియదు. చాలా మంది అబ్బాయిలూ అమ్మాయిలూ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇంటర్వ్యూ సాగుతూనే ఉంది. ఒకరి తరువాత ఒకరు పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. నీకు తెలుసా ఎందుకు నీ గురించి అంతగా ఆత్రుత చూపానో, నువ్వు తెల్లటి పాంట్ షర్ట్ వేసుకున్నావు. నీ మొహం కూడా ఎంత తెల్లని తెలుపో మంచులాగా. అది చాలదూ యౌవనంలో అమ్మాయిలను ఆకర్షి౦చే౦దుకు? ఇద్దరమ్మాయిలు బహుశా పేరొందిన కాలేజీ వాళ్ళు కావచ్చును, నిన్ను ఆ డ్రెస్ లో చూసి ఏడిపిస్తున్నారు.
నిన్ను ‘టినోపాల్’ అని పిలుస్తున్నారు. వారి మగరాయడితనం చూసి విసుగొచ్చింది. నేను తప్పో ఒప్పో నాకు తెలియదు.
నేను ఆధునిక ఫాషన్ ప్రపంచ౦ ఆక్రమణకు దూరంగా ఉన్న ఒక మారు మూల గ్రామం నుండి వచ్చిన దానను. నా అభిప్రాయం తప్పో ఒప్పో నాకు తెలియదు. తరువాత తరువాత ఆ మగరాయడితత్వం ధైర్యం అని తెలిసింది నాకు. పెన్ను పెదవుల మధ్య పెట్టుకు కొరుకుతూ నిన్ను పిలిచే బెల్ శబ్దం కోసం, నీ ప్రత్యేక విలక్షణంగా ఎదురుచూస్తున్నావు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీ పెన్ కూడా తెల్లనిదే. నువ్వు ఆ అల్లరిపిల్లలు నిన్ను ఎగతాళి చెయ్యడం గమనించావా లేదూ వాళ్ళ చిలిపితనం పట్టి౦చుకోలేదా? నీ పట్టి౦చుకోనితనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంటర్వ్యూ ముగిసింది. మూడు రోజుల తరువాత సీట్ దొరికిన వారి పేర్లు ప్రకటిస్తామన్నారు.
ఇరవై ఎనిమిది సీట్లలో ఎంపికయిన వారిలో ఇరవై అయిదుగురు అమ్మాయిలు. ముగ్గురు అబ్బాయిలు. వారిలో నువ్వున్నావో లేదో నాకు తెలియదు. ఎన్నికయిన ముగ్గురిలో నువ్వు ఉండటం నా ఊహకు అందని విషయం. దానికి కారణం కూడా తెలియదు నాకు. ప్రతి ఊహకూ ఒక మంచి కారణమో , అర్ధమో ఉండాలి కదా.
ఈ నిజం నేను తెలుసుకున్నది నా ఎం ఎ పూర్తయాకే.
చేర్చుకునే ప్రక్రియ మొదలైంది. జులై ఇరవై ఎనిమిది నుండి క్లాస్ లు మొదలు.
ఓహ్! నువ్వు క్లాస్ కి వచ్చావు. ఇరవై ఎనిమిది మందిలో అమ్మాయిల డామినేషన్ ఉన్న క్లాస్. తొలి రోజున ఆ గోలా ఆ గందర గోళం-ముఖ్యంగా అమ్మాయిల గోల.
ఎప్పటిలా పరిచయాలు, ఊరు , పేరు, ఎక్కడ డిగ్రీ చదివారో వగైరా వివరాలతో.
ఒకరి కొకరు తెలియడం అంటే ఇంతేనా ప్రభాకర్, చాలా రోజుల తరువాత కూడా నాకు నీ సుఖ దుఃఖాలు, నీ ఆలోచనా ధోరణి, స్వభావం, వ్యక్తిత్వం పూర్తిగా అర్ధం కాలేదు మరి. మనం మానసిక శాస్త్ర విద్యార్ధులం. అయినా మనకు మన మనసే ఒక విస్మృతి.
ఇహ మిగతా వారి మనసులను ఎలా శోధి౦చగలం? అవును కదా?
సమయం గడిచింది. రోజులు రోజులు, వారాలు వారాలు కదలిపోయాయి. సోమవారం నుండి ఆదివారం వరకూ జనవరి నుండి డిసెంబర్ వరకూ అనంతంగా …
వాళ్ళ డ్రెస్ లే చెప్తాయి వాళ్ళంతా ఎంత నాగరికులో ఎంత ఆధునికులో . వస్త్రధారణ లోలోపలి సహజత్వానికి ప్రతిబింబం కదా. నువ్వూ వారిని అనుసరిస్తున్నావు. నేను డిపార్ట్మెంట్ కిటికీ అద్దం గుండా చూస్తున్నాను.
ఎవరి మీద కోపంతో అలా ఊగిపోయాను నేను?
ఎందుకు? ఏ౦ చెయ్యాలో తెలియక. ఎదురుగా ఉన్న తెల్లకాగితం మీద ఏదేదో రాస్తున్నాను.
ఇప్పుడనిపిస్తుంది, చెదిరిపోయిన మనసుకు అది చిహ్నం ఏమో అని. నేను ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. మొదటి సారి ఇల్లు వదిలి, మా అమ్మను మా నానమ్మను బంధు బలగాన్ని వదిలిరావడం అది.
నేను ఒంటరిగా ఫీలయేదాన్ని. కూర్గ్ నుండి వచ్చిన శబీనా నా రూమ్ మేట్. ఆమె ఎంతో అభ్యుదయం ఉన్న అమ్మాయి. ఆమె జీవన ధృక్పధం పూర్తిగా వేరు. బెల్ బాటం పాంట్ వేసుకునేది. శరీరాన్ని యధేచ్చగా అందరికీ ప్రదర్శించేది. ఆమె స్త్రీత్వపు స్పష్టత మగవారికి ప్రదర్శించి వారిని ఆకర్షించటం ఆహ్లాదంగా భావించేది. ఆమె ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ మనిషి.
నేను మాత్రం చీర కట్టుకుని, భర్త సజీవతకు గుర్తుగా, స్త్రీల సౌభాగ్య చిహ్నంగా ధరించే నుదుటిపైన రూపాయి కాసంత గుండ్రటి కుంకం బొట్టుతో సంప్రదాయ స్త్రీలా ఉండేదాన్ని.
శబీనా నా బుగ్గలు పిండి , నా నుదుటిపై గుండ్రటి కుంకం బొట్టును పరీక్షగా చూసి “ గౌరమ్మా, గౌరమ్మా “ అని ఏడిపి౦చేది.
అవునా ప్రభాకర్? నేనంత అమ్మవారిలా పాతకాలపు దానిలా కనిపించే దానా? నిజం చెప్పు ప్రభాకర్!
మన కాలేజీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది.
సెక్రెటరీ పదవికి నువ్వూ ఒక పోటీదారుడివి.మరొక పోటీ దారు బెంగుళూరు సుధ. ఎన్నికల గురి౦చి అంతం లేని మాటలు మాట్లాడి మాట్లాడి మమ్మల్ని నిద్రపోనివ్వకు౦డా చేసింది సుధ. గోలగోలగా అనిపి౦చి౦ది మాకు. నువ్వు పోటీ చేస్తున్నావని తనే మాకు చెప్పింది.
ఎన్నికలకు మిగిలినది నాలుగు రోజులే. ఆ రాత్రి, ఆ ప్రత్యేకమైన రాత్రి, లైబ్రరీ రిఫరెన్స్ సెక్షన్ లో ఏదో పుస్తకం వెతుకుతున్నాను. నల్లటి షర్ట్ నల్లటి సూట్ లో నువ్వు వచ్చావు. ఒక చిరునవ్వును బలవంతాన విసిరాను. నన్ను అర్ధం చేసుకోగలవా ప్రభాకర్, నేను కాలేజీ కాంపస్ లో ఏ అబ్బాయితోనూ మాట్లాడలేదు.
గట్టిగా నీ స్వరం ‘హలో’ అనగానే ఎంత ఉద్విగ్నతకు లోనయ్యానో, వెంటనే చెమటలు పట్టి నా నుదుటి నుండి కిందకు జారాయి. ఎన్నికల గురించీ, ఓటు, గౌరవం ఏవేవో మాట్లాడావు. నా బొటనవేలితో నేలను రాస్తూ ఉండిపోయాను. నేను అంతగా ఉద్రేకపడి, సిగ్గుపడిపోయాను.
కాస్సేపాగి తలపైకెత్తాను. ఏదో అనేసి నువ్వు వెళ్ళిపోయావు. నా శరీరం మొద్దుబారిపోయింది. ఆ భవనం వదలడానికి నాకు మరికాస్సేపు పట్టింది. ఒక ఆహ్లాదకరమైన గగుర్పాటు నా ఒళ్లంతా పాకిపోయింది.
ప్రేమలో పడిన స్త్రీకి ఒక పురుష స్వరం ఎంత ప్రియమైనది. ఏదో అర్ధం కాని తీయదనం ఆ మనిషి ఊపిరిలో కనిపిస్తుంది. ఆ రోజు ఎంత ఆనందం లో మునిగి పోయానో .
అమ్మ, నాన్న , నానమ్మ ఎవరూ లేకుండా అందరికీ దూరంగా ఉండటం ఎప్పుడూ నన్ను బాధించలేదు. లైబ్రరీలో ఏ పుస్తకమూ ఎంచుకోలేక పోయాను. ఎంత తీవ్రంగా వెతికినా నాకు కావలసిన పుస్తకం దొరకనే లేదు. హాస్టల్ కి తిరిగి వచ్చాను. వేలాది ఆలోచనలు ఏ సంబంధం లేనివి తలలో పరుగులు తీసాయి. ఒక దగ్గు ఆకస్మికంగా గొ౦తులోంఛి బయటకు వచ్చింది.
ప్రేమించిన వ్యక్తి కనిపిస్తే ఒక స్త్రీలో ఎంత చిత్రమైన అలజడి.
ఎంత అంతర్మధనం. తొలి చూపును అమ్మాయిలు అందరూ ఇంత ఉత్సుకతతోనూ తీసుకుంటారా? నీ పదాలు, మాటలు, మొహం, పెదవులు, గడ్డం నా మనసులో ప్రవహిస్తూ ఊరేగాయి.
నా బ్లాంకెట్ లోకి దూరి నన్ను కప్పినట్టు అనిపించింది. అవే పెదవులు, అవే మాటలు
మనసు వేగం ఎంతో ఎక్కువ అంటారు. కాదు ప్రేమకు మించిన వేగం ఏముంటుంది?
మనసుకన్నా వేలవేల రెట్లు వేగవంతమైనది ప్రేమ కదూ.
ఎన్నికలు పూర్తయాయి. ఆరోజున ఎంత టెన్షన్. నేను నీ పెరు ప్రపోజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మాట గొ౦తులో పెనుగులాడి౦ది. హసన్ నుండి వచ్చిన ప్రశాంత్ నీ పేరు ప్రతిపాదనకు తొందర పడుతున్నాడు .సరోజినీ నీ పేరు బలపరిచింది. లెక్క మొదలయింది. నేను నీ పేరు ఒళ్లంతా చెవులుగా ఎదురు చూస్తున్నాను.
ఎంతో పెద్ద తేడాతో నువ్వు గెలిచావు.
అందరూ నీ చుట్టూ మూగిపోయారు అభినందనలు కురిపిస్తూ. ఎంత గొప్ప గౌరవం.
నేనే ముదు అభినందనలు చెప్పాలనుకున్నాను. ఆ పరవశంలో నా పిరికిదనం నన్ను ఆపింది. ఆ జనాలలో నా స్వరం మునిగిపోయింది.
నువ్వు క్లాస్ నుండి బయటకు వచ్చాను. నేను నిన్ను కారిడార్లో కలుసుకున్నాను. నా పెదవులు తొణికి కదిలాయి. “అభినందనలు”.
ఆ పరవశం కమ్మేసిన క్షణాన సిగ్గు , భయం నన్ను కమ్మేశాయి. చెమట చుక్కలు మొహం మీద నుండి కిందకు జారాయి.
ఒక నవ్వు విసిరి, థాంక్స్ చెప్పి వెళ్లి పోయావు. నువ్వు కాస్సేపు ఆగి,” థాంక్యూ నా విజయం మీ సహాయం వల్ల ఇతర శ్రేయోభిలాషుల వల్లే “ అని అంటారని ఎదురు చూసాను.
కాని ఆగకుండా వెంటనే ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళిపోయావు. నీకు అహంభావం అనుకున్నాను. నీతో మాట్లాడవలసినది ఎంతో ఉంది. కాని నువ్వు ఆగితే కదా? నా సాన్నిహిత్యం నాలో ఆయుక్తమయిన ఉత్సుకత కలిగిస్తోంది. కాని గంభీరమైన నీ కళ్ళు భయపెడుతూ ఉన్నాయి. మీ మగవాళ్ళు స్త్రీల వా౦చలకు ఎంత నిశ్చలంగా ఉంటారు. ఒక్క నిమిషంలో అన్నీ మరచిపోయే మగతనపు అహం, ఆధిక్యతా భావ౦.
ఇంతకు మునుపు నాతో ఎ౦దుకంత మెత్తగా, తియ్యగా మాట్లాడావు. ఇతరుల్లా నన్ను నన్నుగా కూడా ఉ౦డనివ్వలేదు.
శబీన నా రూమ్ మేట్ కావడం నా జీవితం పూర్తిగా వేరే మలుపు తీసుకుంది. నేనూ భౌతిక సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చూసాను. నేను క్రమంగా నా విధానం మార్చుకుని ఆధునికత వైపు కదిలాను.
అయినా అదేమిటో స్లీవ్స్ లేని జాకెట్లు వేసుకోలేకపోయాను. నా అంతరాత్మ ఎదురు తిరిగేది. ఒక సంస్కారవంతమైన భౌతిక ప్రదర్శన అనేది ఒక కళ.
రోజులు గడిచాయి. వ్యక్తిగతంగా మన ఆలోచనలు కలబోసుకు౦దుకు నువ్వు నాకెప్పుడూ దొరకలేదు.
(సశేషం)