[శ్రీమతి గీతాంజలి రచించిన ‘తనది కాని ఋతువు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]వి[/dropcap]రిగి పోయిన వంతెన ఒకటి..
నీ పాదాల కోసం దుఃఖిస్తున్నది.
చెప్పలేని ప్రేమ ఒకటి
కాలుతున్న గుండె వాసన వేస్తున్నది.
పిలవలేని నీ గొంతు అణుచుకున్న ప్రేమతో
లోలోపలే ఛిద్రమవుతున్నది.
నిన్ను పొందలేని రాత్రి ఒకటి.,
ఏకాంతాన విరహపు ఆవిరిలో
చంద్రుడ్ని కౌగిలిస్తున్నది.
మంచు గడ్డలాంటి చలిలో
కాగుతున్న మంట లాంటి
అతగాడి పాట స్మృతుల
బూడిదను నిద్ర లేపుతున్నది.
మోహంతో వణుకుతున్న ఆమె మోటు పెదాలు
అతని రాతంచు గరుకు ముద్దు కోసం తపిస్తున్నవి.
కలలో కూడా అతన్ని
రానివ్వని రాత్రిని ఆమె వెలివేసింది.
ఏమి కల ఇది.. పోనీ ఏమి వాస్తవం ఇది?
కావాలి.. వద్దు.. దొరకదుల మధ్యని
నిరీక్షణా సమయాల్లో పిగులుతున్న
అకాల ప్రేమ ఒకటి
ఊపిరి అందక పెనుగులాడుతున్నది.
తనది కాని ఋతువుని
ఆమె గుమ్మం బయటే ఆపేసి
దుఃఖంతో తలుపులు మూసేసుకుంది.
ఇక.. మెలకువని భరించలేని ఆమె
ఒంటరి నావలా సముద్రాన్ని
మద్యంలా తాగేసి నిద్రపోయింది.