[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]
భక్త రామదాసు – రెండవ భాగం:
[dropcap]రా[/dropcap]మదాసు కీర్తనలలో పల్లవి, అనుపల్లవి, చరణం అనే 3 అంగాలు ఉన్న కీర్తనలు 41 కాగా, అనుపల్లవి లేనివి 77, పల్లవి, అనుపల్లవి, చరణం అనే భాగాలు లేనివి 3, చరణంతో మొదలైనవి 2 ఉన్నాయి. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలలో 3 అంగాలు ఉన్నాయి. రామదాసు, త్యాగరాజు వ్రాసిన ద్రవ్యనామ సంకీర్తనలు కొన్నింటిలో అసలు అనుపల్లవి, చరణం తేడా లేక ఒకే ధాతువుతో ఉన్న కీర్తనలు కూడా ఉన్నాయి.
అన్నమయ్య, రామదాసు కీర్తనలకు స్వర కల్పన చేసి ఉండక పోవటం వలన వారు కూర్చిన స్వర రచన ఏదో తెలియటం లేదు. అన్నమయ్య పదాలు రాగి రేకులమైన వ్రాసి ఉన్నాయి. ప్రతి కీర్తనకు మొదట దాని రాగం సూచితమై ఉన్నదే తప్ప వాటి గాన పద్ధతిని తెలివే ఆధారమేది లేదు. తూము నరసింహదాసు వ్రాసిన ‘రామదాసు చరిత్ర’ తప్ప రామదాసు కీర్తనలను గురించి తెలుసుకోదగ్గ ఇతర ఆధారమేం లేదు. ప్రబంధకం తరువాత కీర్తనకు మార్గదర్శి అయింది.
దరువులను, పదాలను ఒరవడులుగా పెట్టుకుని వాటికి వాడుకలో ఉన్న రాగతాళాలలోనే తమకు తోచిన సంకీర్తనలన్నీ పాడి వుంటారని రాళ్లపల్లి భావన (ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం. 139 పుట).
శ్రీ శ్రీనివాస అయ్యంగార్ తమ ‘గాన భాస్కరం’లో కీర్తనను ఈ విధంగా నిర్వచించారు. “అఖిల భువన సృష్టి స్థితి లయకారకుండైన సర్వేశ్వరుని నామ సంకీర్తనము చేయుటకై ఒక ధాతు శైలిని అనుసరించి వ్రాయబడిన సాహిత్యం కీర్తన”. కీర్తన మాకు ప్రాధాన్యతను కోల్పోయి ధాతు ప్రాధాన్యతను పొంది కృతిగా రూపుదిద్దుకొంది.
అన్నమయ్య, రామదాసు రచించిన కొన్ని కీర్తనలు మంచి సంగీతపు విలువలతో కూడిఉన్నాయి. అయినప్పటికీ కీర్తనకు ప్రాణం ‘సాహిత్య భావం’. అదే కృతికి ప్ర్రాణం గాన రసాభివ్యక్తి అని చెప్పటంలో వైపరీత్యమేమీ ఉండదు.
రామదాసు అందరికీ తెలిసిన ప్రఖ్యాత రాగాలలో కీర్తనలు రచించాడు (1). ఉదా॥ ఆహిరి, వరాళి, ధన్యాసి, సౌరాష్ట్ర, యదుకుల కాంభోజి, కాంభోజి, సురటి, నాదనామక్రియ, కళ్యాణి, శంకరాభరణం, బిలహరి, పునాగవరాళి, నీలాంబరి, ముఖారి, నవరోజ మొదలైనవి. ఉత్తరాది రాగాలైన కాపీ (2), ఖమాస్, దర్బారు, బేగడ, కానేడ, యమునా, కల్యాణి వంటి వాట్ని రామదాసు ప్రయోగించాడు. అన్నమయ్య 14 వేల కీర్తనలలో వాడబడిన రాగాలు కేవలం 89 మాత్రమే. ఎక్కువగా ప్రయోగించనివి 25 మాత్రమే (3). [1. ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర- బాలాంత్రపు రజనీకాంతరావు పుట 76. 2. ఈ ఠాగానికి కాపీ, కాపి అని రెండు పేర్లు. ఎక్కువగా కాపీ, వాడుకలో ఉంది. అందుకే అదే గ్రహించబడింది. 3. ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర, రజనీకాంత రావు పుట- 138.].
కీర్తన అన్నమాచార్యుల రచనలో కేవలం సంకీర్తనగా ఉండి, రామదాసు చేతిలో ఆత్మాశ్రయం రసావేశ యుక్తం అయింది. రామదాసువి నామ సంకీర్తనలు మాత్రమే కావు. ఆయన హృదయపు లోతుల నుంచి వెల్లుబికి వచ్చిన భావావేశ ప్రతిరూపాలు.
రామదాసు భావావేశంతో కీర్తనలకు ఒక మహనీయమైన వ్యక్తిత్వాన్ని చేకూర్చి పెట్టాడు. సంగీత పరిణామ క్రమంతో రామదాసు కీర్తన ఒక మలుపు. ఒక ముఖ్య ఘట్టం. ఈ కారణం చేతనే ప్రొఫెసర్ సాంబమూర్తి గారు రామదాసు గురించి – “He is a link between the ‘Kirtana’ composers of the earlier period and the ‘Kirti’ composers of the later period” అని అన్నారు (The great composers: Volume II. Prof P. Samba Murthy, Page 53).
అన్నమయ్య కీర్తనలు మధుర కవితారచన విశేషాలు, జాజరలు, చందమామలు, కోవెల, చిలుక, తుమ్మెద పధములు, లాలి, సువ్వి, గొబ్బి, ఉయ్యాల, లాలి జోల జోజో, జయ జయ, విజయీ భవ, శోధన, మంగళ వైభోగములు, మేల్కొలుపులు, నలుగులు, దంపుళు, కోట్నాలు, కూగూగులు, గుజన గూళ్లు, చందమామ గుటకలు, నివాళులు, ఆరతులు, మంగణారతులు, జయ జయ మంగళాలు, అల్లో నేరేళ్ళు, చాంగు భళాలు, అవధానములు, తందనాలు, వెన్నెలలు, తత్త్వ గేయాలు మొదలగునవి.
~
స్థూలంగా రామదాసు కీర్తనలను 3 వర్గాలుగా విభజించటానికి వీలున్నది. అవి:
- ఆయన చెరసాలలో ప్రవేశించక ముందు వ్రాసినవి.
- చెరసాలలో గడిపిన పన్నెండు సంవత్సరాల కాలంలో వ్రాసినవి.
- చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత వ్రాసినవి.
భగవదర్శనా కాంక్షతో భగవత్కరుణా కటాక్షం కోసం సంకీర్తన చేసినట్లుగా ఉన్న కీర్తనలు ఉత్సాహాభావంతో కూడి ఆయన చెరసాలలోకి పోకముందు వ్రాసినవిగా చెప్పుకోవచ్చు. ఉదా: కబీరు తారక మంత్రోపదేశం చేసినప్పుడు హర్ష పారవశ్యంతో రామదాసు పాడిన
1.
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా
మీరిన కాలుని దూతల పాలిటి
మృత్యువు మది నమ్ముక యున్న
2.
ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా
సంకీర్తన రూపంలో వున్నది మరియొక ఉదా॥
3.
కోదండరామా కోదండరామా
కోదండరామా కోట్యర్కధామ
నీ దండ నాకు నీ వెందు బోకు
వాదేలనీకు వద్దు పరాకు
ఈ విధంగా పరిశీలిస్తే, మొత్తం లభిస్తున్న కీర్తనలు 133 లో 37 కీర్తనలు చెరసాల ప్రవేశానికి ముందు వ్రాసినవిగా ఊహించుకోవచ్చు!
చెరసాలలో ఉండగా వ్రాసిన కీర్తనలు గుర్తించటం అతి సులభం. కరుణ రస భరితములైన కీర్తనలు, రామదాసు పడిన బాధలను మనసు కరిగేటట్లు వర్ణించటమే గాక, ఆపద నుండి రక్షించ వలసినదిగా శ్రీరాముని రామదాసు వేడుకొన్నట్లు, తన్ను రక్షించనందుకు రాముని ఆక్షేపించినట్లు, తన దుస్థితికి కారణమైన పూర్వ కర్మను నిందించినట్లు ఉంటాయి.
ఉదా॥ రామదాసు తాను పడ్డ బాధలను వరించిన కీర్తనః
పల్లవి:
అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
జబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా
చరణం:
అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో
కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య
~
చెరసాల అనుభవాన్ని కళ్లకు కట్టినట్లుంది. ఇలాంటిదే ఇంకొకటి:
పల్లవి:
అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప
గొబ్బున నన్నేలుకోరా
చరణం:
పరులకొక్కరువ్వ యీయలేదుగదరా ఓ
పరమాత్మ నీ పాదముల్ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా
హరనుత గోవింద హరితాళలేరా
~
తన్ను రక్షించమని శ్రీరాముని వేడుకుంటున్న కీర్తనః
రక్షింపు మిది యేమొ రాచకార్యముపుట్టె రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర
~
ఆక్షేపణకు ఉదాహరణ:
పల్లవి:
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా
చరణం:
కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా
~
ఎత్తి పొడవటానికి ఉదాహరణ:
పల్లవి:
రామా నీచేతేమి కాదుగా సీతాభామకైన చెప్పరాదుగా
అనుపల్లవి:
సామాన్యులు నన్ను సకలబాధలుపెట్ట
నామొరాలకించి మోమైన జూపవేమిరా
చరణం:
శరచాపముల శక్తిదప్పెనా నీశౌర్యము జలధిలో జొచ్చెనా
కరుణమాలి పైకముతెమ్మనుచు భక్తవరుల బాధింప నీ ధైర్యమెక్కడ బోయె
~
ఆత్మసమర్పణకు ఉదాహరణ:
పల్లవి:
రామ రామ నీవే గతిగద సంరక్షణంబు చేయ
వేమనందు హా దైవమ నీ మనసింక కరుగదాయె
చరణము:
పుడమిలోన నావంటి అభాగ్యుడు
పుట్టడింకనంటి రామ
విడువబోకు మయ్యాయని మున్నే
విన్నవించుకొంటినయ్యా రామ
~
అలాంటి కీర్తనలు 65 కలవు.
***
జైలు నుండి విడుదల అయిన తర్వాత రామదాసు వ్రాసిన కీర్తనలలో ప్రబోధన, వైరాగ్య భావన, తాత్మిక చింతన ప్రధానంగా కన్పిస్తూ వుంటాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించి అగ్ని పరీక్షలను తట్టుకొని, భగవంతుని యందు చెక్కు చెదరని విశ్వాసంతో జీవిత పరమార్థాన్ని కాచి వడపోసిన రామదాసు వైరాగ్య భావాన్ని ప్రశాంత మనోః స్థితిని పొందటం సహజమే.
ఆయనలో కలిగిన వెరాగ్య భావం వ్యక్తం చేస్తున్న కీర్తనలలో ఒకటి.
పల్లవి:
భళి వైరాగ్యంబెంతో బాగైయున్నది చం
చలమైన నామనసు నిశ్చలమైయున్నది
చరణము(లు):
అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ
హరినామస్మరణ జిహ్వకు అనువైయున్నది
గురుధ్యానమున మనసు కుదురైయున్నది చిత్త
మిరువది యారింటిమీద నిరవైయున్నది
పరమశాంత మెన్నగను బాగైయున్నది మాకు
పరతత్త్వమందే మా బుద్ధిపట్టియున్నది
గంభీర శాంతమైన ప్రవృతి, కీర్తన అంతటా వ్యాపించినది. అలాగే మరొక కీర్తన.
పల్లవి:
అంతా రామమయంబీ జగమంతా రామమయం
చరణము:
అంతరంగమున నాత్మారాముం డ
నంతరూపమున వింతలు సలుపగ
– చక్కటి ఉదాహరణ.
~
పల్లవి:
తర్లిపోదము చాలా దయ యుంచండి ఇక
మరలి జన్మకు రాము మదిలో నుంచండి
చరణము:
బార్లుగట్టి భక్తవరులు భజనలు చేయగను మూడు
ఏర్లు గలసినట్టి దారి నెరిగి వేగముగ
– ఈ కీర్తన ఆయన జీవిత చరమదశకు చెందినదిగా తోస్తున్నది. ఈ దశకు చెందినవిగా మనము భావించు కీర్తనలు 32 కన్పిస్తున్నాయి.
ఆ విధంగా ఆయన కీర్తనలను 3 దశలుగా విభజించుటకు అవకాశం కలిగింది.
మరే ఇతర వాగ్గేయకారుని రచనలోను లేని ఆర్తి, ఆవేదనలు రామదాసు రచనలో కన్పించటానికి, ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పిన కారాగార వాసమే కారణమని చెప్పక తప్పదు.
(ఇంకా ఉంది)