తల్లివి నీవే తండ్రివి నీవే!-54

0
4

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

కృష్ణం వాసుదేవం జగద్గురమ్-1

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే।

అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ॥

ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది।

పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్॥

(వాల్మీకి మహర్షి ప్రసాదించిన శ్రీ రామాయణం, యుద్దకాణ్డ – అత్యంత ప్రసిద్ధి చెందిన శ్లోకాలు)

భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ।

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా॥7.4॥

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము – ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.

ఈ జగత్తుని కూర్చిన భౌతిక శక్తి, అద్భుతమైన వైవిధ్యం కలది. ఎంతో నిగూఢమైనది. దీనిని వర్గీకరణ చేసుకుంటే, మన పరిమితమైన బుద్ధులకి కాస్త అర్థం అవుతుంది. కానీ, ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా అసంఖ్యాకమైన ఉప-వర్గాలు ఉన్నాయి. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏమిటంటే, పదార్థాన్ని మూలకముల సమ్మేళనముగా పరిగణిస్తారు.

ప్రస్తుతం, 132 (పాఠ్యపుస్తకాలలో 118 అని ఉన్నది) మూలకాలు కనుగొనబడి/వివరించబడి పీరియాడిక్ టేబుల్లో పొందుపరచబడ్డాయి. భగవద్గీతలో సాధారణంగా వైదిక తత్త్వజ్ఞానంలో, సమూలమైన వేరే పద్ధతి వాడబడింది. పదార్థాన్ని ప్రకృతి అంటారు, అంటే భగవంతుని శక్తి, మరియు ఈ శక్తి యొక్క ఎనిమిది అంగాలని ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఆధునిక శాస్త్ర పద్ధతి యొక్క సహాయంతో ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో మనం అర్థం చేసుకోవచ్చు.

1905లో, తన Annus Mirabilis సంకలనంలో, ఆల్బర్ట్ ఐన్స్టైన్, మొదటిసారి ద్రవ్యరాశి-శక్తి యొక్క సమత్వాన్ని ప్రతిపాదించాడు. Mass Energy Equivalence. ద్రవ్యాన్ని శక్తిగా మార్చుకోగలిగే అవకాశం ఉంది అని చెప్పాడు.

ఇది E = mC2

అన్న సూత్రం ప్రకారం జరుగుతుంది. ఈ దృక్పథం, అంతకు క్రితం వరకూ న్యూటన్ పరంగా, విశ్వమంతా ఘన పదార్థము తోనే ఉంది అన్న అవగాహనని సమూలంగా మార్చివేసింది. తర్వాత 1920 దశకంలో నీయెల్స్ బోర్ (Neils Bohr) మరియు ఇతర శాస్త్రవేత్తలు క్వాంటం సిద్ధాంతం ప్రతిపాదించారు.

దీనిలో కణ-తరంగ ద్వంద్వత్వం గురించి (the dual particle-wave nature of matter) ప్రతిపాదించారు. అప్పటి నుండి, శాస్త్రవేత్తలు, అన్ని పదార్థాలను, శక్తులను కలిపి ఒకే పరంగా అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక ఏకీకృత సిద్ధాంతం ‘యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ’ (Unified Field Theory) కోసం అన్వేషిస్తున్నారు.

శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఐదువేల సంవత్సరముల క్రితం, ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందక ముందే చెప్పిన విషయం, ఒక సంపూర్ణ ‘యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ’ (Unified Field Theory). ఆయన చెప్పిన విధంగా చూస్తే, ‘అర్జునా, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమే.’

ఐన్ ర్యాండ్ వ్రాసిన మహోన్నత నవల అట్లాస్ ష్రగ్డ్ లో జాన్ గాల్ట్ అనే కథానాయకుడు స్థిర విద్యుత్తును చలనశక్తిగా మార్చే మోటార్ ను కనుగొంటాడు. (Static Electricity to Kinetic Energy – SE2KE problem). ఆ మోటార్ ను అతను తయారు చేసిన చోటు Twentieth Century Motors అనే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ తన ల్యాబ్‌లో.

ఆ తరువాత నవలలో ప్రధాన ప్లాట్ పాయింట్ – ఆ మోటార్‌ను ఎవరికీ అంతుపట్టని విధంగా చెడగొట్టి (తాను తప్ప ఇతరులకు నిరుపయోగం కావాలని) Strike ను ప్రారంభిస్తాడు. ఆ తరువాత దాదాపు దశాబ్ద కాలం గడిచాక The John Galt Line ను కథానాయిక డేగ్నీ టేగార్ట్ రేర్డన్ మెటల్ తో నిర్మించాక, మరో కథానాయకుడైన Hank Rearden తో సెలవు మీద వెళ్తుంది. Celebratory Holiday trip.

అక్కడ వారు అనుకోకుండా గతంలో Twentieth Century Motors ఉన్నచోటుకు వస్తారు. అక్కడ అన్వేయిస్తుంటే వారికి ఆ జాన్ గాల్ట్ సృష్టించిన మోటార్ కనబడుతుంది.

ఆ మోటార్ ఏమిటి, ఎందుకలా వదిలేయబడింది అన్నది తెలియకపోయినా స్వయంగా ఇంజనియర్ అయిన డేగ్నీ దాని గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని గుర్తిస్తుంది.

దాన్ని రేర్డన్ సహాయంతో బైటకు తెచ్చి పనిచేసేలా చేయాలని చాలా ప్రయత్నాలు చేసి చివరకు దాన్ని కెన్టిన్ డేనియల్స్ అనే యువ భౌతిక శాస్త్రవేత్తకు అందజేస్తుంది.

తను దాని రహస్యం కనుగొనే ప్రయత్నంలో ఎన్నో విధాలుగా ఆలోచిస్తాడు. కానీ ఆనాటికి ఉన్న భౌతికశాస్త్రం సూత్రాలు సరిపోవు. తెలియని ఏవో నియంత్రణలు (Constraints) అడ్డుపడుతుంటాయి.

ఆ సందర్భన్ని అతని మాటల్లోనే తరువాత డేగ్నీ టేగార్ట్ కు చెప్పిస్తుంది ఐన్ ర్యాండ్.

<<<“I had been toiling away for months on that one hypothesis, and the deeper I delved, the more impossible it seemed. For the last two days, I’d been confined to my laboratory, wrestling with a mathematical equation that felt insurmountable. I felt as though I might perish at that blackboard, but quitting was not an option. It was late at night when he entered. I barely noticed him at first. He said he wished to speak with me, and I asked him to wait, continuing with my work. I don’t recall how long he stood there watching me, but suddenly, he reached over, wiped all my figures off the blackboard, and wrote a brief equation. That’s when I truly noticed him. I screamed—because while it wasn’t the complete solution to the motor, it was the key, a path I hadn’t seen or even suspected, but instantly recognised. I remember exclaiming, ‘How could you know it?’. He pointed to a photograph of the motor and said, ‘I’m the man who made it in the first place.’ That’s the last thing I remember, Miss Taggart. After that, we delved into discussions about static electricity, energy conversion, and the motor itself”>>>.

పంచభూతాలకు సంబంధమున్న అన్ని సూత్రాలను ఆ క్వెన్టిన్ డేనియల్స్ అనే యువ శాస్త్రవేత్త ప్రయత్నించాడు. అప్పటికి ఉన్న భౌతికశాస్త్ర సూత్రాలను దాటి ఆలోచిస్తే తప్ప ఆ మోటార్ ఎలా పని చేస్తుందో అతను గ్రహించలేడు అని అతని గ్రహింపుకు రాలేదు. అదే క్షణాన ఒక వ్యక్తి అక్కడకు వస్తాడు. ఇతని ప్రయత్నాలను చూసి వాటిని అన్నిటినీ తుడిచేది ఒకే ఒక్క సమీకరనం అక్కడ బ్లాక్‌బోర్డు మీద రాస్తాడు. అది ఆ మోటార్ పని చేసే విధానం పూర్తిగా చెప్పదు. కానీ, దానిని కనుగొనటంలో నిజమైన మొదటి అడుగుగా ఉపయోగ పడుతుంది.

తరువాత కూడా జాన్ గాల్ట్ అప్పటికున్న భౌతికశాస్త్రం నియమాలను దాటి ఆలోచిస్తేనే ఈ మోటార్ సాధ్యమౌతుందని గట్టిగా చెప్తాడు.

ఆ తరువాత ఒకానొక సందర్భంలో కథానాయిక డేగ్నీకి ఆ మోటార్ పనితనాన్ని చూపిస్తాడు. ఆ మోటార్‌ను ఆపరేట్ చేయాలంటే మనసుతో సాధ్యం ఉవుతుంది.

మనసు!

గుర్తుపెట్టుకోండి.

“I SWEAR BY MY LIFE AND MY LOVE OF IT THAT I WILL NEVER LIVE FOR THE SAKE OF ANOTHER MAN, NOR ASK ANOTHER MAN TO LIVE FOR MINE.”

నవలలో ఈ మాటలను మనస్పూర్తిగా (సనాతన పద్ధతిలో చెప్పాలంటే త్రికరణశుద్ధిగా), నిర్వికారంగా చెప్తేనే ఆ మోటార్ ఉంచబడిన తలుపులు తెరుచుకుంటాయి.

ఐన్ ర్యాండ్ నాస్తికురాలు. దైవశక్తిని నమ్మదు. కానీ, తనకు తెలియకుండానే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ ఎనిమిది విధాలైన భౌతిక ప్రపంచంలో పమచభూతాల తరువాతవైన మనస్సు, బుద్ధి అన్నవాటిని స్పృశించింది. దానివల్ల ఆమె వాస్తవికతకు భంగం వాటిల్లకుండా పోయినా, ఇప్పుడున్న ఫిజిక్స్ సూత్రాలు పూర్తిగా చాలవు భగవచ్ఛక్తిని చేరాలంటే లేదా అవగాహన చేసుకోవాలంటే అని తనకు తెలియకుండానే నొక్కి వక్కాణించింది.

ఆమె ఆ పైన ఎలాంటి సూత్రాలు అవసరమో చెప్పలేదు. She’s not a physicist. కానీ ఆ స్థాయిని గట్టిగా అందుకోగలిగింది. ఎందుకంటే స్థిర విద్యుత్తును చలనశక్తిగా మార్చాలంటే ఇప్పుడున్న భౌతికశాస్త్రాన్ని నియమాలు చెల్లవు. దాటి ఆలోచించాలి.

పంచభూతాలను కేంద్రంగా చేసుకుని నడిచే సైన్స్ ఆ పైన ఉన్న మిగిలిన మూడింటినే కాదు, తరువాత రాబోయే ఐదవ శ్లోకంలో చెప్పబోయే విషయాన్ని కూడా అవగతం చేసుకోవాలి.

If we observe closely, Galt’s Motor is nothing but a form of physical manifestation of the Divine Vibhuti.

కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తి యే ఇన్ని వివిధ రకాల ఆకారములు, స్వరూపములు, మరియు పదార్థములుగా రూపాంతరం చెందింది. ఇదే విషయం తైత్తిరీయ ఉపనిషత్తులో విస్తారంగా వివరించబడింది.

తస్మద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృధివీ పృధివ్యా ఔషధయః ఔషధీభ్యోరన్నమ్ అన్నాత్పురుషః స వా ఏషః పురుషః పురుషో అన్నరసమయః॥ (2.1.2)

భౌతికశక్తి యొక్క ప్రప్రథమ మూల స్వరూపము ‘ప్రకృతి’. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు, ఆయన అలా దాని వంక చూస్తాడు, దీనితో అది కదిలించబడి, మహాన్‌గా వికసిస్తుంది. ఈ మహాన్ మరింత వికసించి అహంకారముగా వ్యక్తమౌతుంది. ఈ మహాన్, అహంకారము రెండూ కూడా ఆధునిక శాస్త్రము కన్నా సూక్ష్మమైనవి. అహంకారము నుండి పంచ-తన్మాత్రలు, అంటే ఐదు గ్రాహ్యతలు – రుచి, స్పర్శ, వాసన, దృష్టి, మరియు శబ్దములు వస్తాయి, వాటి నుండి (ఐదు) పంచ మహా-భూతములు జనిస్తాయి – ఆకాశం, గాలి, అగ్ని, నీరు, మరియు భూమి.

ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పంచ మహా భూతములను తన శక్తి యొక్క రూపాంతరములగా పేర్కొనటమే గాక, మనస్సు, బుద్ధి, మరియు అహంకారములను కూడా తన విశిష్ట శక్తి స్వరూపాలుగా ఇందులో జోడించాడు. ఇవన్నీ కేవలం తన భౌతిక శక్తి, మాయ, యొక్క విభాగాలే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. వీటన్నిటి కన్నా అతీతమైనది ‘జీవ శక్తి’ (ఆత్మ శక్తి), లేదా భగవంతుని ఉన్నతమైన శక్తి – దీనిని తదుపరి శ్లోకంలో కృష్ణుడు వివరిస్తున్నాడు.

దానికంటే ముందు మనం తెలుసుకోవలసిన విషయం..

ఆయన అష్టమ గర్భుడైనా, దశావతారాలలో- ఒక విధానం ప్రకారం చూస్తే ఎనిమిదవ అవతారమైనా (..రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కిరేవచ), ఇక్కడ ఈ భౌతిక జగత్తు యొక్క అంగాలు 8 అవటం అయినా యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్।

జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్॥7.5॥

ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా (మహాబాహో అని ఎందుకు వాడాడో పరిశీలించాలి), నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి (ఆత్మ శక్తి), అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.

బాహువుల ద్వారానే భౌతిక కర్మలు అన్నీ చేయగలము. ఒకపక్క అర్జునుడిని భౌతిక కర్మకు ప్రేరేపిస్తూనే, ఆ కర్మను ఎలా సన్న్యసించాలో కర్మ యోగంలోకి కర్మ సన్న్యాస యోగంలో తెలిపి ఉన్నాడు. ఆ విషయాన్ని అర్జునుడికి (అనగా నరునకు) మరొక్కసారి నొక్కి చెప్తున్నాడు.

శ్రీకృష్ణుడు ఆ తరువాత పూర్తిగా భౌతిక శాస్త్ర పరిధి దాటి పోతున్నాడు. ఇంతకు క్రితం శ్లోకంలో పేర్కొన్న ఎనిమిది అంగముల ప్రకృతి తన తక్కువ స్థాయి భౌతిక శక్తి అని వివరిస్తున్నాడు. కానీ, ఉన్నది అది మాత్రమే కాదు. అది ఆయన మాయ వల్ల సృయ్టింపబడినది అయినా అది కూడా ఆయన విభూతి కనుక అదియును సత్యమే.

ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఇంకోటి కూడా ఉంది, ఇది జడ పదార్థం కంటే పూర్తిగా అతీతమైనది. ఈ శక్తియే ‘జీవ శక్తి’, ఇది జగత్తు లోని సమస్త ఆత్మలను కలిగి ఉంటుంది.

జీవుడికి (జీవాత్మ), మరియు భగవంతుడికి (పరమాత్మ) మధ్య ఉన్న సంబంధం భారతదేశపు మహోన్నత తత్త్వవేత్తలచే ఎన్నో రకాల దృక్పథాల ద్వారా వివరించబడింది. అద్వైత తత్త్వవేత్తలు ఇలా పేర్కొంటారు: జీవో బ్రహ్మైవ నాపరః, ‘ఆత్మయే భగవంతుడు.’ కానీ, ఈ వాదన ఎన్నో జవాబు ఇవ్వలేని ప్రశ్నలను కలిగిస్తుంది:

  • భగవంతుడు సర్వ శక్తిమంతుడు. మాయ ఆయన అధీనంలో ఉండే శక్తి. జీవాత్మయే భగవంతుడయితే, అది మాయకి ఎలా వశం అయిపోయింది? మాయ అనేది భగవంతుని కంటే శక్తివంతమయినదా? (ద్వైతము)
  • మనందరికీ, ఆత్మ అజ్ఞానంచే బాధించబడుతున్నదని తెలుసు. కాబట్టి, దానికి భగవద్గీత వంటి శాస్త్రముల మరియు సత్పురుషుల ఉపదేశం యొక్క అవసరాన్ని అది గ్రహిస్తుంది. ఈ అజ్ఞానపూరితంగా ఉండే ఆత్మ సర్వజ్ఞుడైన భగవంతునిలా ఎలా అవుతుంది?
  • భగవంతుడు జగత్తులో సర్వ వ్యాపి. ఇది వేదాల్లో పదే పదే చెప్పబడింది. ఒకవేళ ఆత్మయే భగవంతుడైతే ఆత్మ అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉండాలి. కాబట్టి మరణించిన పిదప స్వర్గానికి పోవటం లేదా నరకానికి పోవటం అన్న ప్రశ్న ఎక్కడిది?
  • ఆత్మలు అసంఖ్యాకముగా ఉంటాయి, మరియు వాటన్నిటికీ తమతమ వ్యక్తిగత అస్తిత్వం ఉంది. కానీ, భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు, ఆత్మయే దేవుడయితే, మరి ఎన్నెన్నో దేవుళ్ళు ఉండాలి.

ఈ విధంగా, ఆత్మయే భగవంతుడు అన్న అద్వైత తత్త్వవేత్తల ప్రతిపాదన, అర్థరహితమైనదిగా మనం గ్రహించవచ్చు. అదే సమయంలో, ద్వైత తత్త్వవేత్తలు ఆత్మ భగవంతుని కంటే వేరైనదిగా చెప్తారు. ఇది పైనున్న వాటిల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది, కానీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్న దానితో పోలిస్తే, అది అసంపూర్ణ అవగాహనే అవుతుంది. ఆత్మ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలో భాగమే అని ఆయన అంటున్నాడు.

వేద శాస్త్రములు మనకు ఉపదేశించేది ఏంటంటే, భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు. ఉన్నదంతా – ఆధ్యాత్మికమైనా, భౌతికమైనా – ఆయన నిమ్న స్థాయి లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నదే.

ఏక-దేశ-స్థితస్యాగ్నేఃజ్యోత్స్నా విస్తారిణీ యథా।

పరస్య బ్రహ్మణః శక్తిః తథేదమ్ అఖిలం జగత్॥

(విష్ణు పురాణం 1.22.53)

‘ఎలాగైతే సూర్యుడు ఒక చోటే ఉన్నా, కానీ, తన సూర్య కిరణములచే ఈ సౌర కుటుంబమంతా ఎలా వ్యాపిస్తాడో, అదే విధంగా ఉన్నది ఒక్కడే భగవంతుడు, తన అనంతమైన శక్తులచే ఈ మూడు లోకాలలో వ్యాపించి ఉంటాడు.’ చైతన్య మహాప్రభు అన్నాడు:

జీవ-తత్త్వ శక్తి, కృష్ణ-తత్త్వ శక్తిమాన్

గీతా-విష్ణుపురాణాది తాహాతే ప్రమాణ

(చైతన్య చరితామృతము, ఆది లీల, 7.117)

‘ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపము, మరియు ఆయనే సర్వోన్నత శక్తిమంతుడు.’

ఒక్కసారి, మనం ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపమని ఒప్పుకున్నప్పుడు, ఆ తదుపరి, సమస్త సృష్టి యొక్క అద్వైతం అవగతమవుతుంది. ఏదేని శక్తి, ఏకకాలంలో శక్తివంతుని కన్నా భేదమే మరియు అభేదమే. ఉదాహరణకి, అగ్ని మరియు దాని వేడిమి, వెలుగులను – అగ్ని కంటే వేరుగా చూడవచ్చు లేదా ఈ రెంటినీ ఒకటిగానే చూడవచ్చు. ఈ విధంగా మనం ఆత్మను, భగవంతుడిని – శక్తి, శక్తిమంతుడు అన్న దృక్పథం తో ఒక్కటి గానే చూడవచ్చు, కానీ, ఆత్మ, భగవంతుడు – లను వేరువేరుగా కూడా చూడవచ్చు, ఎందుకంటే శక్తి, శక్తిమంతుడు విభిన్న అస్తిత్వములే కాబట్టి.

శ్రీ కృష్ణుడు 7.4వ మరియు 7.5వ శ్లోకాలలో చెప్పినమాటని పొందుపరుస్తూ, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు, తన భక్తి శతకంలో, ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు:

జీవు, మాయా దుఇ శక్తి హైఁ, శక్తిమాన్ భగవాన్

శక్తిహిఁ భేద్ అభేద్ భీ, శక్తిమాన్ తే జాన్

(భక్తి శతకము, 42వ శ్లోకము)

‘జీవాత్మ మరియు మాయ రెండూ కూడా భగవంతుని శక్తులే. కాబట్టి, అవి రెండూ భగవంతునికి అభేదమే మరియు భగవంతుని కంటే వేరు కూడా.’

శక్తులు మరియు శక్తిమంతుడు ఒకటే అన్న దృక్పథంతో, సమస్త జగత్తు కూడా భగవంతుని కంటే అభేదమే. ఈ విధంగా, సమస్త జగత్తు యదార్థ భగవత్ స్వరూపమే అని చెప్పబడింది.

సర్వం ఖల్విదం బ్రహ్మ (ఛాందోగ్య ఉపనిషత్తు 3.14.1)

‘సర్వం బ్రహ్మమే.’

ఈశావాస్యం ఇదం సర్వం (ఈశోపనిషత్తు 1)

‘ఈ జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే.’

పురుష ఏవేదగ్0 సర్వం (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.15)

‘ఉన్నదంతా ఆ సర్వోన్నతమైన దివ్య మంగళ స్వరూపమే’

ఇవన్నీ వేద మంత్రములు కూడా, ఉన్నది ఒక్కడే భగవంతుడు, మరివేరే ఇతరమైనది ఏదీ లోకంలో లేదు అని పేర్కొంటున్నాయి. అదే సమయంలో, శక్తి మరియు శక్తిమంతుడుకి ఉన్న భిన్నత్వం పరంగా, ఈ ఏకత్వం లోనే బ్రహ్మాండమైన వైవిధ్యం కూడా ఉంది, అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవాత్మ వేరు. పదార్థం వేరు. భగవంతుడు వేరు. పదార్థం అచేతనమైనది (జడమైనది), అదే సమయంలో ఆత్మ చైతన్యవంతమయినది, కానీ భగవంతుడు సర్వోత్కృష్ట చైతన్యవంతమై ఉండి, ఆయనే సమస్త పదార్థద్రవ్యములకు, ఆత్మలకు రెంటికీ మూల ఉత్పత్తిస్థానము. సృష్టిలో ఉన్న మూడు అస్తిత్వాల గురించి చాలా వేద మంత్రములు చెప్తున్నాయి:

క్షరం ప్రధానమమృతాక్షరం హరః

క్షరాత్మానావీషతే దేవ ఏకః।

తస్యాభిధ్యానాద్ యోజనాత్ తత్త్వభావద్

భూయశ్చాంతే విశ్వమాయానివృత్తిః॥

(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.10)

‘మూడు అస్తిత్వాలు ఉన్నాయి: 1) పదార్థము/ద్రవ్యము, ఇది నశించేది. 2) జీవాత్మలు, ఇవి నాశము లేనివి. 3) భగవంతుడు, ఈయన పదార్థము మరియు ఆత్మ లను కూడా నియంత్రించే వాడు. భగవంతుని పై ధ్యానం చేయటం వలన, ఆయనతో ఏకమవటం వలన మరియు ఆయనలా అవటం వలన, ఆత్మ, ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది.’

అద్వైత, ద్వైత మంత్రముల రెంటినీ కూడా వేదములు అర్థవివరణచేయటం మనం గమనించవచ్చు.

ఇక ఈ శ్లోకాలను భగవద్రామానుజులవారు ఎలా వ్యాఖ్యనించారో చూద్దాము.

॥4వ శ్లోకము॥

రామానుజ భాష్యము:

అస్యవిచిత్రానన్తభోగ్యభోగ్యోపకరణ భోగస్థానరూపేణావ స్థితస్య జగతః పేరకృతిరియం గన్ధాదిగుణక పృథివ్య్తేజో వాయుఃఆకాశాది రూపేణ మహదహంకారేణచాష్టధా భిన్నా మదీయేతి విద్ధి.

ఈ జగత్తు చేచనాచేతనాత్మకము. ఈ జగత్తు విచిత్రము. అనన్తము. ఆశ్చర్యకరమైనది. భోగ్యము. భోగోపకరణముగా ఉన్నది. భూమి మొదలైనవి ప్రకృతి కార్యములు. వ్యష్టి సృష్టియందు ఇవన్నియు సృష్టి కార్యములు.

అష్టౌప్రకృతయః అని అంటారు. ప్రకృతి ఒక్కటే నిజానికి. కానీ అది మనకు 8 రకములుగా విశదమౌతుంది.

వాటి గురించి పరిశీలిద్దాము.

కృష్ణ, ఇంతకుముందు శాశ్వతః అనే నామముల దగ్గర మనం భగవద్గీతలో చెప్పిన భగవత్తత్వమును గురించి చూస్తున్నాము. ఇక్కడ నుంచీ మనకు కృష్ణ అన్న నామమునకు ఉన్న విశేషత తెలుస్తుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here