సిరివెన్నెల పాట – నా మాట – 69 – రెండు విభిన్న దృక్పథాలను చాటిన పాట

1
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఓ గమ్యమున్న చరణం..

~

చిత్రం: ఆవిడే శ్యామల

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: మాధవ పెద్ది సురేష్

గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం.

~

పాట సాహిత్యం

పల్లవి:
ఓ గమ్యమున్న చరణం.. అది సవ్యమైన చలనం..
గగనానికైనా ఎదురిదే..గువ్వలా సాగడం..
ఏ దారి లేని పయనం.. అది గాలివాటు గమనం..
దరితెంచుకుంటు చెలరేగే.. వెల్లువై దూకడం..

చరణం:
నేల తల్లి ఒడిలోన వున్న పసి గరిక బెదురుతుందా..
ఎంత పెద్ద సుడిగాలికైన తలవంచి ఒదుగుతుందా
నీలి మబ్బులతో బేరమాడగల మర్రి కొమ్మ కూడా..
పిల్ల గాలి కొన వేలు తగిలినా తన ఉనికి వూగిపోదా..
బడబాగ్నితో కడుపు రగిలినా.. బయటపడని కడలి గుణం..
పడమరలో మునిగిన రవినే.. తూర్పున తేల్చే గొప్పతనం..
ఓ మిణుగురంత మిగిలి వున్న చాలు.. చీకటి చీల్చే ఆశాకిరణం.. ॥ ఓ గమ్యమున్న చరణం ॥

చరణం:
గద్దె నెక్కి గర్జించుతున్న రారాజు నీతి కూడా.. తెగ విర్రవీగి పెడదారి పడితే నడి వీధిపాలు కాడా..
ఏటికొక్క అమవాసకైన దీపావళి ఒకటి రాదా.. కటిక చీకటి కంటి కాటుకై కళలు దిద్దిపోదా.. దారం అధారం వదలి మిడిసిపడె గాలిపటం..
ఏ తీరం చేరకె ఊరికే ఊరేగే వెర్రితనం..
చీమంత చినుకులో చలువదనం.. ఊరంత బ్రతికే పచ్చదనం.. ॥ ఓ గమ్యమున్న చరణం ॥

ఓ గమ్యమున్న చరణం.. అది సవ్యమైన చలనం..
గగనానికైనా ఎదురిదే.. గువ్వలా సాగడం..
ఏ దారి లేని పయనం.. అది గాలి బాటు గమనం.. దరితెంచుకుంటు చెలరేగే.. వెల్లువై దూకడం..

ఇటివలే మనం ఆనందాల హరివిల్లులు విరజిమ్మే, వెలుగుల పండుగ దీపావళిని జరుపుకున్నాం.. నిండు అమావాస్య నాడు.. ఆకాశంలోని చిమ్మ చీకట్లను చీలుస్తూ.. బాణాసంచా కాలుస్తూ, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే జ్ఞానపు దివ్వెలను వెలిగించే సంకేతాలను, అందుకున్నాం.. దీపావళి అనగానే మనందరికీ ఆచార్య ఆత్రేయ గారి ఈ గీతం తప్పక గుర్తుకు వస్తుంది..

చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి@2
మన జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల
ఆశల వెలిగించు దీపాలవెల్లి
చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి..

~

నలుగురి సంతోషం మన సంతోషంగా తలచి, పదుగురి ఆనందానికి మనం కారణమై, అందరి జీవితాలలో ఆనందాన్ని పూయించడమే దీపావళి అంటారు సిరివెన్నెల.. ఆయన పాటల్లో నుండి కొన్ని దీపావళి నిర్వచనాలు..

  1. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా అనే పాటలో- ‘నవ్వే నీ కళ్ళలో రోజు దీపావళి’
  2. ‘చిందాడే కిరణంలో మా ముందు నీవుంటే ప్రతి పూట దీపావళి..’
  3. రవ్వల రించోలి, ‘సిరిదివ్వల దీవాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి..’
  4. ‘పాపా నీ నవ్వుల్లో పూచే దీపావళి పలికే సిరిమువ్వలై తుళ్ళే ఈ అల్లరి..’
  5. ‘మా మధ్య వెలిశాడు ఆ జాబిలి ముంగిట్లో నిలిపాడు దీపావళి..’
  6. ‘ఏటికొక్క అమవాసకైన దీపావళి ఒకటి రాదా.. కటిక చీకటి కంటి కాటుకై కళలు దిద్దిపోదా..’

అందుకే ఈవారం, ఎంత చిమ్మ చీకట్లు కమ్ముకున్న జీవితాల్లోనైనా ‘ఏటికొక్క అమవాసకైన దీపావళి ఒకటి రాదా’.. అనే పండుగ సందేశాన్ని తనలో నింపుకున్న, ‘ఓ గమ్యమున్న చరణం..’ అనే గీతాన్ని విశ్లేషించుకుందాం.

ఈ పాట పూర్తిగా అర్థం కావాలంటే కథా నేపథ్యం కొంత తెలుసుకోవాలి. ప్రకాష్ రావు (ప్రకాష్ రాజ్) ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు. ఇతడు నేల విడిచి సాము చేసే తరహా మనిషి. ఎన్నో ప్రణాళికలు వేస్తూ, వ్యాపారాలు చేయాలనీ, అందలాలు ఎక్కాలనీ, ఒక రాబందులాగా గగనంలో విహరించాలనీ కలలు కంటూ ఉంటాడు. అతడి ప్రమేయం లేకుండా శ్యామల (రమ్యకృష్ణ)తో బలవంతంగా పెళ్ళి చేస్తాడు వాళ్ళ నాన్న. వాళ్లకి ఒక కూతురు కూడా పుడుతుంది. అయినా ప్రకాష్ రావు చాలా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రకాష్ రావును గురించి అందరూ విమర్శిస్తున్నా శ్యామల మాత్రం అతన్ని వెనకేసుకొస్తూ, ఇంట్లో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలాగోలా సంసారం నెట్టుకొస్తుంటుంది. అయినా అందరాని లోకాలేవో అందుకోవాలని ఆరాటంతో, ప్రకాష్ రావు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అప్పటివరకు ఎంతో ఆమాయకంగా ఉన్న శ్యామల, తన కష్టాన్ని కడుపులో పెట్టుకొని సంసారాన్ని ఒడ్డుకు చేర్చడానికి తన వంతు ప్రయత్నం మొదలు పెడుతుంది. అప్పుడు శ్యామల చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి, అంచలంచలుగా ఎదిగి, ‘ఆవిడే శ్యామల’ అని గుర్తింపు పొందే స్థాయికి చేరుకుంటుంది.

ఈ నేపథ్యంలో విశ్వాసంతో కూడిన శ్యామల జీవన పోరాటాన్నీ, పగటి కలలు కంటూ, వాటి వెంట పరుగులెత్తే ప్రకాష్ రావు జీవిత గమనాన్నీ విశ్లేషిస్తూ సాగే సిరివెన్నెల గీతమిది. ఇది రెండు విభిన్న మనస్తత్వాలకు అద్దం పడుతూ, సాగుతుంది.‌

పల్లవి:
ఓ గమ్యమున్న చరణం.. అది సవ్యమైన చలనం..
గగనానికైనా ఎదురిదే..గువ్వలా సాగడం..
ఏ దారి లేని పయనం.. అది గాలివాటు గమనం..
దరితెంచుకుంటు చెలరేగే.. వెల్లువై దూకడం..

శ్యామల, మిషన్ తొక్కుతూ, బట్టలు కుడుతూ ఉన్న సందర్భంలో పల్లవి చిత్రీకరణ జరుగుతుంది. ఎత్తుగడలోనే, శ్యామల నిర్ణయాన్ని, ఆ స్థిరత్వాన్ని తెలియజేస్తూ ఆమె జీవన యానం సవ్యమైన దిశలో వెళుతోందని, ఎందుకంటే ఆమె గమనానికి ఒక గమ్యం ఉందని నిర్వచిస్తారు సిరివెన్నెల. ఆమె నిర్ణయంలో ఎంత స్థిరత్వం ఉందంటే, గగనానికి ఎగిరే గువ్వలాగా, తను చేరుకోవలసిన గమ్యం ఎంత పెద్దదైనా, దాని గురించి ఆలోచించకుండా, తను వేసే చిన్న చిన్న అడుగులను ప్రణాళిక బద్ధంగా వేసుకుంటుంది శ్యామల. మనల్ని కూడా అలాగే చేయమన సూచన అది!

పల్లవిలో మొదటి రెండు లైన్లు శ్యామల గమనాన్ని వర్ణిస్తే, మిగతా రెండు వాక్యాలు ప్రకాష్ రావు జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఒక దారి – తెన్నూ లేకుండా, గాలివాటుగా, కనిపించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూ, ఏ ప్రయోజనం లేని ఒడిదుడుకుల జీవితాన్ని సిరివెన్నెల పాటలో చిత్రీకరిస్తూ, తీరాన్ని తెంచుకుంటూ వెల్లువై దూకే నీటికి ఉపమానాన్ని అందంగా ఇక్కడ ప్రయోగిస్తారు. ఒక తీరుగా, కావలసినంత మేరకే పంటకు అందించే నీరు మాత్రమే దానికి ఉపయోగపడుతుంది. దరీ, తెన్నూ లేకుండా పొంగిపొర్లే నీటి ప్రవాహం ఆ పంటలను పూర్తిగా ముంచి వేస్తుంది. Watched pot never boils, అన్నట్టు, ఒక పరిధికి లోబడి పనిచేసేవి ఏవైనా ప్రయోజనకారిగా ఉంటాయి, అన్నది సిరివెన్నెల గారి ఉపదేశం.

Is No Place Safe? అనే Jeremy Betts poem లో జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు boundaries ఎలా ఉపకరిస్తాయో వివరిస్తారు.

I took a quarter of a lifetime to create Boundaries with an impenetrable gate That I could fall back to at a later date Who knew I wouldn’t have to wait Because as soon as I challenged fate And tried to break this family trait

And shift from the pattern of self-hate..

చరణం:
నేల తల్లి ఒడిలోన వున్న పసి గరిక బెదురుతుందా..
ఎంత పెద్ద సుడిగాలికైన తలవంచి ఒదుగుతుందా
నీలి మబ్బులతో బేరమాడగల మర్రి కొమ్మ కూడా..
పిల్ల గాలి కొన వేలు తగిలినా తన ఉనికి వూగిపోదా..
బడబాగ్నితో కడుపు రగిలినా.. బయటపడని కడలి గుణం..
పడమరలో మునిగిన రవినే.. తూర్పున తేల్చే గొప్పతనం..
ఓ మిణుగురంత మిగిలి వున్న చాలు.. చీకటి చీల్చే ఆశాకిరణం..॥ ఓ గమ్యమున్న చరణం ॥

ఇక మొదటి చరణంలో శ్యామలను ఒదిగే గుణం వల్ల, ఎదురీదే శక్తిని పొందిన గరికతోనూ, అహంకారంతో తనకి తానే కీడు చేసుకొనే మర్రి కొమ్మతో, ప్రకాష్ రావుని పోలుస్తూ చక్కటి సామ్యాన్ని అందిస్తున్నారు సిరివెన్నెల. నేల తల్లి ఒడిలో, భూమిని విశ్వాసంగా హత్తుకున్న లేత గడ్డిపరక, సుడిగాలికి బెదరకుండా, తలవంచి ఒద్దికగా నిలబడి, ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతుంది.‌

Humility is a thorned crown.
It breaks you down.
It confounds arrogance
And runs it into the ground.

Humility is a perspective changer.
It changes you through and through.
..

ఎంతో ఎత్తుకు ఎదిగి అహంకారంతో, ఆకాశం అంచులను తాకే మర్రి కొమ్మ.. పిల్ల గాలి కొన వేలు తగిలినా వూగిపోతూ.. తన ఉనికినే కోల్పోతుందంటూ, ప్రకాష్ రావు మనస్తత్వాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు సిరివెన్నెల.

Can You See Pride’s Face?
Can you see the pride in Pride’s face?
Boastful & frivolous.
Pride’s intentions are not of good will..
– Sincurlyxbaki

బడబాగ్నిని కడుపులో దాచుకొని కూడా ఏమాత్రం తొణకని ఓర్పు ఉన్నప్పుడే, సముద్రానికి పడమటింట అస్తమించిన రవిని.. మళ్లీ తూర్పున తేల్చగల గొప్పతనం అలవడుతుందంటారు సిరివెన్నెల. అయితే దానికి కావాల్సినది, కాస్తంత ఆశ, నమ్మకం.. అదే ఎంతటి చీకటినైనా చీల్చి, వెలుగును మనకు వరంగా అందించగలుగుతుంది. మనిషి ఆశావహంగా ఉన్నప్పుడు ఓర్పు అలవాడి జీవితం స్థిరంగా కొనసాగుతుంది.

HOPE is the thing with feathers
That perches in the soul,
And sings the tune without the words, And never stops at all.. అంటారు Emily Dickson..

చరణం:
గద్దె నెక్కి గర్జించుతున్న రారాజు నీతి కూడా.. తెగ విర్రవీగి పెడదారి పడితే నడి వీధిపాలు కాడా..
ఏటికొక్క అమవాసకైన దీపావళి ఒకటి రాదా.. కటిక చీకటి కంటి కాటుకై కళలు దిద్దిపోదా.. దారం అధారం వదలి మిడిసిపడె గాలిపటం..
ఏ తీరం చేరకె ఊరికే ఊరేగే వెర్రితనం..
చీమంత చినుకులో చలువదనం.. ఊరంత బ్రతికే పచ్చదనం.. ॥ ఓ గమ్యమున్న చరణం ॥

అహంకారంతో విర్రవీగిన రారాజు దుర్యోధనుడు చరిత్ర ఏమైందో మనందరికీ తెలుసు. అధికార మదంతో ఎవరూ మిడిసి పడకూడదు.. అలా పడితే వీధుల పాలై పోతారు, జాగ్రత్త! అని హెచ్చరిస్తున్నారు సిరివెన్నెల.

అయితే, ఎంతో కష్టనష్టాలకు ఓర్చుకున్న శ్యామల జీవితంలో కూడా వెలుగులు పరచుకునే తరుణం వచ్చింది. ఎన్ని చీకటి అమావాస్యలు వచ్చినా, ‘ఏటికొక్క అమవాసకైన దీపావళి ఒకటి రాదా..’ అంటూ, మనిషి ఎంత ఆశావహంగా ఉండాలో చెప్పే, హత్తుకునే ఉపమానాన్ని, నిరాశను జయించే మంత్రాన్ని మనకు ఇస్తున్నారు సిరివెన్నెల. అలా ఓర్మితో ఉన్నప్పుడు, ఆ కటిక చీకటి కూడా అందమైన కళ్ళకు కాటుకలాగా అమరి మరింత వన్నెలు దిద్దుతుంది అంటున్నారు.

కుటుంబం అనే దారాన్ని, ఆధారాన్ని వదిలి వీధిలో పడిన ప్రకాష్ రావు జీవితం, గమ్యం చేరలేని ఓ వెర్రి పరుగు లాంటిదని తర్వాత వాక్యంలో వివరిస్తున్నారు సిరివెన్నెల.

మళ్లీ తర్వాత వాక్యంలో, శ్యామల చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలను వివరిస్తూ.. చీమంత చినుకులో చలువదనం.. ఊరంత బ్రతికే పచ్చదనం.. అంటారు. అసలు ఆ చీమంత చినుకు అనడంలోని అంతర్యాన్ని ఒకసారి ఆలోచిద్దాం! ఆయన పదాల కూర్పుకు.. ఆ నేర్పుకు.. శిరసాభివందనం!

చీమలు వాటి శరీర బరువు కన్నా ఎన్నోరెట్లు అంటే 10 నుండి 50 రెట్లు, ఎక్కువ బరువును మోయగలవు. వాటికున్న ఆ సామర్థ్యాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే! సృష్టిలో చీమ అంత నిర్దుష్టమైన ప్రణాళికతో బతికే జీవి మరొకటి లేదు. సమిష్టి జీవనానికీ, సహజీవనానికీ, ముందుచూపుకీ, సంఘశక్తికీ, సంఘటిత కార్యదక్షతకీ మానవుడు ఊహించనయినా ఊహించలేనంత బలమైన ప్రాణి చీమ. టెడ్ విల్సన్ ఒక జీవితకాలం పరిశోధనలు జరిపి వీటి గురించిన ఎన్నో వివరాలు తెలియచేశాడు.

కాబట్టి, చీమంత చినుకులో కూడా చల్లదనం.. అంటే.. నలుగురికి మేలు చేయాలనే ఉపకార బుద్ధి, ఉంది కాబట్టి, ఆ చినుకులన్నీ కలిసి పిల్ల కాలువలా, నేలమ్మకు తడిని అందించి.. ఊరంతా పచ్చదనాన్ని పెంచగలవు.. పంచగలవు, ఈ కథలోని శ్యామలలా!

ఈ విధంగా రెండు విభిన్న దృక్పథాలను, జీవనశైలులను, ఒకే పాటలో వరుసలుగా, ముత్యాల సరాల్లాగా కూర్చి, సినిమా నేపథ్యానికి పాటగా అందించడమే కాక, అందరికీ ఉపయోగపడే.. జీవన సత్యాలను.. అలవోకగా మనందరికీ అందించే ఏకైక గమ్యంతో ముందుకు సాగడమే సిరివెన్నెల శైలిలోని ఘనత!

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here