తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-27

0
3

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
261.
ఆటయో, పడుపాట్లో, వీడగరాని యగచాట్లో
ఆట యెయ్యదియో! వలదన వలదు చిక్కిన యుపచారంబుల
ఆట పాట లెన్ని యుండినన్, తత్త్వముపై సారించుము దృష్టి
పాటించుము సమన్వయము – మంకుతిమ్మ!

262.
ఒక కంట నీరు తెప్పించి, ఇంకొకట నూరడించు, ఈ
లోకపు యంద చందముల నరయగా విచిత్రమే; ఈ
లోకము బంధించు మము మోహ, వైర, విభవంబుల చేత
ఇక నీరీతిగ సాగిపోవలె జీవనము – మంకుతిమ్మ!

263.
బహు కష్టతరమీ బ్రదుకనువారు, విడిచి పోవుదురే!
సహనముతో ఇష్టంబుగ జేసికొనరె, మున్ముందు రోజులు మనవని
బహుళంబు యాశ తోడుత కొనసాగింతురు జీవనము
బహు నిరీక్ష తోడ – మంకుతిమ్మ!

264.
వగవ వలదు, మిడిసిపాటు వలదు దేనికైన
బాగుగ పరికింప నియ్యది యొక యాటమే సుమ్ము
భాగస్వామివి నీ వాట యందని దెలిసి యాడుము;
భాగ్యమిది, ధర్మమనియు దెలియుము – మంకుతిమ్మ!

265.
ఆట నియమముల పాటించవలె నేయాటగాడైనను
పాటించని వాడు శుంఠ, కఠినాత్ముడరయ
ఆట రక్తించుచు యాడువాడే మేటి యాటగాడు
పోటమి గల రసికుడు – మంకుతిమ్మ!

266.
అందరు నియ్యాట యాడియే తీరవలె; తప్పించుకొనగ
రాదు, ఈసడించుకొన్నను తప్పుదు, బ్రహ్మ యాడించు యాట యిది
నీదు పాత్రను పోషించియే తీరవలయు తప్పదు
కాదన్నను వలదన్నను – మంకుతిమ్మ!

267.
ఆటయా ఈ జీవన మెల్ల ఛీ.. ఛీ.. నవ్వులాట గాదె
ఆటలాడగ బాలురమా మేమని పళ్ళు గొఱికి, యాడము మేమీ
యాటయన; విధి యూరకుండునే, నవ్వి నిను బంధించి
ఆట యాడించు నీ చేత – మంకుతిమ్మ!

268.
మేలుగ జీవనంబు సాగింప సిగ్గుపడనెల? ఆత్మ తన
నాలుకన్ చాచియున్నది నల్దిక్కులకున్ యమృతంబు గ్రోల
కోలుపోకు మీయవకాశము, మలచుకొనుము నీ కొఱకు
పలు రీతుల, ఎన్ని ఎదురైన – మంకుతిమ్మ!

269.
సాహసించి ననే గాని సుందరము కాదీ జీవనము
సాహసించుట కేదియు అడ్డు రాదు
సాహసమే సాధనము ముందుకు సాగిపోవ
సాహస జీవనమే సొగసైనది – మంకుతిమ్మ!

270.
ఎల్లరకు తానై, ఎల్లరును తన కొఱకై
ఎల్లవేళల ఒకరికొకరై జీవనంబు సాగించ
కల్లకపట మెఱుగని సమభావంబు తోడ జీవించువానికి
ఎల్లెడల జీవనంబు సుఖమయమె యగు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here