[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘చల్లని చెట్టు నీడ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఇ[/dropcap]ద్దరు ప్రేమికులు
తమ కళ్ళతో సంభాషిస్తారు
ప్రేమల్ని పంచుకుంటారు
ఇద్దరు స్నేహితులు
కరచాలనంతో మాట్లాడుకుంటారు
అరచేతుల స్పర్శతో బాగోగులు తెలుసుకుంటారు
భార్యాభర్తలిద్దరూ
కౌగిలిలో పెనవేసుకుని
కష్టసుఖాలు కలబోసుకుంటారు
మాట్లాడడానికి ఇద్దరు మనుషులుండాలి
పంచుకోవడానికి రెండు మనసులుండాలి
చెప్పుకోవడానికి రెండు మాటలుండాలి
చిగురించడానికి రెండు కలలుండాలి
కానీ
హైవే రహదారిలో
తుఫానులాంటి పరుగులో
మనుషులంతా వన్ వే ట్రాఫిక్
ఒకరికొకరు ఎదురుకారు
ఎవరి వేగం వారిదే
ఇవ్వాళ
ఇద్దరు ఎదురుకావడమంటే
ఎడారి దాహంలో
ఒయాసిస్సు కనిపించినట్టు
ఎర్రటి ఎండలో
చల్లని చెట్టు నీడ దొరికినట్టు