వంతుల్లో అమ్మ

0
3

[డా. సి. భవానీదేవి రచించిన ‘వంతుల్లో అమ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]క సంవత్సరం తమ్ముడి ఇంట్లో ఉన్నాక
అమ్మ మళ్ళీ మా ఇంటికి వచ్చింది!
నా దగ్గర ఒక సంవత్సరం ఉన్నాక
మళ్ళీ తమ్ముడింటికి వెళ్తుంది!
వాళ్ళు రావద్దని సూటిగా చెప్పకపోయినా
అస్సలు నడవలేక పారాడుతున్నానంటూ
కీట్టీపార్టీల్లో వజ్రాల మెరుపులతో మరదలు వాపోతున్నా
మళ్ళీ తమ్ముడింటికి తప్పని తంతుగా వెళ్తుంది!
నేనొక చోట.. తమ్ముడొక చోట
మేం వృక్షాలం కాము.. ఒకే చోట పాతుకుపోవటానికి
మాకేం ఆస్తులు లేవు.. పంచుకోటానికి
మాకేం తగాదాలులేవు.. పరిష్కరించుకోటానికి
అయినా ఇద్దరం దూరం… దూరంగానే
అమ్మ మాత్రం మారుతున్న సంవత్సరాల్లాగా..
కాలం బోగీలో మా వూరికి వస్తుంది
అసౌకర్యంగా.. బాధగా.. దిగులుగా.. దీనంగా
చేతిసంచీతో తోకచుక్కలా ఇంటిముందు రాలుతుంది
ఇప్పుడీ అమ్మ తన వంతు కోసం
నిత్యమూ ఎదురుచూస్తున్నది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here