ప్రేమ లేఖలు

0
4

[మణి గారు రచించిన ‘ప్రేమ లేఖలు’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]హృ[/dropcap]దయపు పొత్తిళ్ళలో,
మాటలు ఎరుగని ప్రేమలేఖలు ఎన్నో!
అన్నీ విప్పి నీ ముందు పెడదామంటే
కాస్త కూడా సిరా అంటని కాగితాలే అన్నీ!
అక్షరాలన్నీ రంగు రంగు సిరాలతో నింపి,
మాటల మాలలు చేసి అందముగా లేఖలు చేద్దామంటే,
ఎక్కడ?!
ఏ రంగు సిరాతో, అక్షరాలకు రంగు దిద్దను?
ఏ రంగు అయినా అక్షరాలకి దిద్దబోతే,
పేలవము అవుతూంటే!
ఈ లేఖలు ఎప్పుడని నీముందు పెట్టగలను?!
రంగులతో అలంకరించుకుందామనుకున్న
అక్షరాలు ఎదురుచూసి, ఎదురుచూసి ,
మళ్ళీ నిశ్శబ్దపు గోడల గూడు ల్లోకి,
మాయమయ్యేలోపే ,
రంగులతో పట్టుకొని మాటలు
మాలలుగా గుచ్చి, అందంగా అలంకరించి,
ఈ లేఖలు నీ ముందు పెట్టాలని!
కానీ,..
ఎప్పుడూ ఇలానే ఏ రంగూ, ఏ అక్షరానికీ సరిపోదు!
ఏ రంగూ అక్షరానికి, అద్దుకోదు,
అందంగా అలంకరించడానికి!
అక్షరాన్ని రంగుతో దిద్దేలోపే,
రంగు కాస్తా కాంతివిహీనమవుతుంది.
పేలవమై, కింద రాలుతుంది.
ఏ అక్షరమూ కుదురుగా కూర్చోదు!
ఏ మాటలోనూ ఒద్దికగా ఇమిడిపోదు!
ఎందుకో,
గూటిలో చిలకలా బయటకి రానంటుంది.
గొంతు లోకే కాదు,
కలం లోకి కూడా!
ఏ అక్షరమూ వెల్లుబికి రాదే, అని విసుక్కుంటుందే గాని,
ఎన్ని రంగులతో, నింపినా కలమూ వ్రాయనంటుంది!
తెల్లని కాగితాలు!
వ్రాయని కలం!
బయటకి రాని, అక్షరాలు!
అందుకే,
అజ్ఞాతంలోనే వుండిపోయాయి, నా ప్రేమలేఖలు!
వెలుపలకి రాకపోతే మాత్రం ఏం!
హృదయపు పొత్తిళ్ళలో పొందికగానే వున్నాములే!
అంటూ గారాలు పోతాయి.
అసహాయంగా చూస్తున్న నన్ను,
“నీ హృదయపు పొత్తిళ్ళలో, ఒదిగివున్న
ప్రేమలేఖలు
రోజూ నన్ను పలకరిస్తూనే వున్నాయిగా” అంటూ,
లీలగా నువ్వు నవ్వుతావు!
వెన్నెలని హృదయాంతరాలల్లో నింపుతూ,
బంగారు రంగులు దిద్దుకుని,
అందంగా మెరిసిపోయే చంద్రునిలా,
చాలా మోహనంగా, ఆహ్లాదంగా వుంటుంది, ఆ నీ నవ్వు.
హృదయపు పొత్తిళ్ళ మధ్య, అక్షరాలు నాట్యం చేస్తూంటే,
పలుకు అయినా రాని నేనూ,
పులకరిస్తూ నువ్వూ,
ఇవి,
వ్రాయని, వ్రాయలేని ప్రేమలేఖలు, ప్రియతమా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here