సులభగ్రాహ్యంగా మహాత్ముని జీవన తాత్త్వికత – ‘నేను చూసిన బాపు’

0
3

[డా. కాళ్ళకూరి శైలజ అనువదించిన ‘నేను చూసిన బాపు’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]క[/dropcap]స్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ హైదరాబాద్‌ శాఖ మహాత్మాగాంధీకి సంబంధించిన పుస్తకాలను తెలుగులోకి అనువదించి అందిస్తున్న క్రమంలో వెలువడిన తొలి పుస్తకం ‘నేను చూసిన బాపు’. మను బెన్ గాంధీ వ్రాసిన ‘Bapu – My Mother’ అన్న పుస్తకానికి ఇది అనువాదం. డా. కాళ్ళకూరి శైలజ అనువదించగా, డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం వహించారు.

మను బెన్ (అసలు పేరు మృదుల) కస్తూర్బా బంధువు. గాంధీజీకి మనవరాలి వరస. 14 ఏళ్ళ వయసులో కస్తూర్బాకి సహాయకురాలిగా వచ్చి ఆవిడ జైలులో కన్నుమూసే వరకూ ఆమె వెంటే ఉన్నారు మనుబెన్.

1946 సెప్టెంబరులో హిందూ-ముస్లింల మధ్య సామరస్యం కోసం గాంధీజీ నౌఖాలిలో పర్యటించినప్పటి నుండి, గాంధీజీ మరణించేంత వరకూ మను బెన్ ఆయనతోనే ఉన్నారు. గాంధీజీ మను బెన్ ఒడిలోనే తనువు చాలించారు.

గాంధీజీని అత్యంత దగ్గర నుంచి పరిశీలించిన మను బెన్ తన అనుభవాలను గుజరాతీ భాషలో ‘భావ్‍నగర్ సమాచార్’ అనే పత్రికలో ధారావాహికంగా రాశారు. వాటిని చిత్రా దేశాయ్ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ వ్యాసాలే 1949లో ‘Bapu – My Mother’ పేరిట పుస్తక రూపంలోకి వెలువడ్డాయి.

“నిత్యవ్యవహారంలో గాంధీజీకి సహాయకురాలుగా ఆమెకు అనుభవమైన దృష్టాంతాలూ, అడిగిన ప్రశ్నలకు పొందిన జవాబులు ఆధారంగా ఈ పుస్తకం సాగుతుంది. కనుక, గాంధీజీ ఏమిటో సూక్ష్మంగా మనుబెన్ రచన ద్వారా చూడవచ్చు. గాంధీలో మనుబెన్ మాతృప్రేమ చూసినా అదే సమయంలో మనకు పాఠకులుగా గాంధీజీ ఏమిటో బోధపడతారు. ఈ తెలుగు అనువాదానికి ‘నేను చూసిన బాపు’ అని నామకరణం చేశాం. ఇప్పటి అవసరాలకు తగినట్టుగా కొంత కుదించి అనువాదం చేశాం. గాంధీజీని సవ్యంగా అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ చిన్న పుస్తకం ఎంతో దోహదమవుతుంది” అని వ్యాఖ్యానించారు సంపాదకులు డా. నాగసూరి వేణుగోపాల్.

“ఈ పుస్తకాన్ని చదవడం ఒక గొప్ప అనుభవం. చాలా రోజుల పాటు గాంధీజీ ఆచరణలో చూపిన నిబద్ధత, ప్రతి క్షణాన్ని ఎరుకతో గడిపిన ఆయన క్రమశిక్షణ మనల్ని వెంటాడుతాయి” అన్నారు డా. కాళ్ళకూరి శైలజ.

ఈ పుస్తకంలో పదమూడు వ్యాసాలున్నాయి.

మొదటి వ్యాసం ‘నా తల్లి’లో గాంధీజీ మను బెన్‌కి ఒక తల్లిలా ఏమేమి నేర్పారో చెబుతుంది. కస్తూర్బా గతించాకా దుఃఖంలో ఉండిపోయిన మనుకీ కర్తవ్య బోధ చేస్తూ ఉత్తరం రాశారు గాంధీజీ. చదువు ఎంత అవసరమో ఆమెకి వివరిస్తారు. పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవాల్సిన అనేక మంచి విషయాలను వదిలేసి, అక్కరలేని విషయాలను నేర్చుకుంటున్నామని అంటారు బాపూజీ. సహజ సౌందర్యం అంటే భగవంతుడు మనకేమి ఇచ్చాడో దానితో జీవించడమని సూచిస్తారు.

త్యాగం సంపూర్ణం ఎలా అవుతుందో ‘త్యాగానికి అర్థం’ అనే వ్యాసంలో వివరించారు. “మనమందరం ‘నేను’ అనే అహంకారం వదిలిపెట్టేవరకూ, మన త్యాగం సంపూర్ణం కాదు. అసలు సిసలు త్యాగం అంటే నేను, నాది అనే రెండింటిని పూర్తిగా త్యజించగలగడం” అని బాపూ – మను బెన్‍కి చెప్పారు.

“బి.ఎ., ఎమ్.ఏ. వంటివి చదివినా రానట్టి విద్యను నాకు బాపు అందించారు” అన్నారు మను బెన్ ‘భగవద్గీత పాఠాలు’ వ్యాసంలో. అసలైన చదువు, నిజమైన సేవ అంటే ఏమిటో గాంధీజీ వివరించారు. “బాపు వాత్యల్యం ఎలాంటిందంటే ఏదైనా విమర్శ వస్తే దాన్ని రుచికరమైన పానకం తాగినంత సంతోషంగా స్వీకరిస్తారు” అన్నారు మను బెన్.

అవసరం లేని వాటిని స్వంతానికి వాడుకోవటం హింసతో సమానమని గాంధీజీ మను బెన్‍ని ఎలా అర్థమయ్యేలా చెప్పారో ‘దుబారాయే హింస’ అన్న వ్యాసం చెబుతుంది. ఈ వ్యాసంలో ఉదహరించిన సంఘటనలో – రెండు ప్రయోజనాలు లభించాయి. ఒకటి – క్రిక్కిరిసిన రైలుకి కొత్త బోగీని జోడించారు, గాంధీజీ ఉన్న బోగీలోని ఓ గదిని మెట్లపై వేలాడుతున్న ప్రయాణీకులు కేటాయించారు. రెండవది – వీలయినంత తక్కువ వస్తువులతో, సౌకర్యాలను నియంత్రించుకోవాలనే పాఠం మను బెన్‍కి నేర్పారు.

చెప్పిన సమయానికి అనుకున్న పని మొదలుపెట్టకపోవడం గాంధీజీకి నచ్చేది కాదు. ఓ రోజు ఉదయం ఏడు గంటలకి ప్రారంభమవాల్సిన పాదయాత్ర మను బెన్ వల్ల ఐదు నిమిషాలు ఆలస్యమవుతుంది. తన ఒక్కడిదే కాకుండా, వేచి ఉన్న 500 మంది యొక్క ఐదు నిమిషాల సమయాన్ని చౌర్యం చేసినట్టే అని మను బెన్‌ని మందలించారూ బాపూ. ఒక్క పేజీ వ్యాసమైనా ‘సమయపాలన’ చక్కటి సందేశమిస్తుంది.

ఉపయోగపడే వస్తువుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో మను బెన్‍కు ఒక కఠిన పరీక్ష ద్వారా నేర్పారు గాంధీజీ. ఆ కఠిన పరీక్షలో గాంధీజీ నేర్పిన ‘రామనామ స్మరణ’ అనే మరో పాఠమే తనకి ఉపయోగపడిందని మను బెన్ ‘సమగ్రత’ అనే వ్యాసంలో చెప్పారు.

తన సరదా మాటల్లో సైతం ఒక అంతరార్థం ఉంటుదని మను బెన్‍కి చెప్పారు గాంధీజీ. ఆ సరదా మాటలేమిటో, వాటి నుంచి మను బెన్ ఏం నేర్చుకున్నారో తెలియాలంటే ‘పొదుపరి’ అనే వ్యాసం చదవాలి.

పరిసరాలను శుభ్రం చేయడం తనకెంతో సంతోషమో గాంధీజీ ‘పరిశుభ్రత’ అనే వ్యాసంలో చెప్పారు. తానే స్వయంగా పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా నౌఖాలీలో రెండు లక్ష్యాలను సాధించారు బాపూ.

“భగవంతుడు నాలాగా లంచం ఇస్తే లొంగిపోయే రకం కాదు” అని గాంధీజీ ఏ సందర్భంలో మను బెన్‍తో అన్నారో ‘చిన్న చిన్న విషయాలు’ అనే వ్యాసంలో తెలుస్తుంది. వర్తమానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మను బెన్‍కి ఓ శ్లోకం ద్వారా విశదం చేశారు బాపూ.

తానుండబోయే ఓ గుడిసెని ఇంద్రభవనమని బాపూ ఎందుకన్నారో తెలియాలంటే ‘నిరాశ్రయులు’ వ్యాసం చదవాలి. 1946 లోనే మడిచిపెట్టగల గుడిసెని రూపొందించారు గాంధీజీ అనుచరుడు సతీష్‌బాబు. కానీ గాంధీజీ కేవలం ఒకే ఒక పూట మాత్రమే ఆ గుడిసెని ఉపయోగించారు. ఆ గుడిసెను ఆయన వినియోగించలేదో చదివితే బాపూజీ గొప్పతనం కళ్ళకు కడుతుంది. ఈ వ్యాసంలో రవీంద్రనాథ్ టాగోర్ కవితకి ‘ఒంటరిగా సాగిపో’ అనే పేరిట తెలుగు అనువాదం చక్కగా కుదిరింది.

తన ఉపదేశాలని ఆచరించడమే తన పట్ల చూపే గౌరవమని బాపూ దేవీపూర్ గ్రామస్థులకు ఎందుకు కఠినంగా చెప్పాల్సి వచ్చిందో ‘పూలదండలు’ వ్యాసంలో చదవవచ్చు. ఈనాటి నాయకులు/కార్యకర్తల హడావిడికి ఇది చెంపపెట్టు లాంటింది.

స్వాతంత్ర్యం వచ్చాకా, నౌఖాలీలో శాంతిని స్థాపించగలిగినందుకు తనని అభినందిస్తే, “ఏ మనిషైనా ఒక్కడూ దేన్నయినా సాధించగలడా? మీరంతా నన్ను ఒక్కడినే అభినందిస్తున్నారెందుకు? ఈ విజయం సకల జనుల సహకారం వల్లనే సాధ్యపడింది” అన్నారు గాంధీజీ ‘అరుదైన విజయం’ వ్యాసంలో. ఎంతటి వినమ్రత!

బాపూజీ, సర్దార్ పటేల్ మధ్య ఎంతటి ఆప్యాయత ఉండేదో ‘పుట్టినరోజులు’ వ్యాసం చెబుతుంది. గాంధీజీపై పటేల్ గారు వేసిన హస్యపు చెణుకు పాఠకుల పెదాలపై నవ్వుని పూయిస్తుంది.

ఈ వ్యాసాలు చదువుతుంటే – భగవద్గీతని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో, అర్థం చేసుకున్నదాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో బాపూ మనకే స్వయంగా చెప్పినట్టు అనిపిస్తుంది. గీతా సందేశాన్ని ప్రభావవంతంగా అందిస్తాయీ వ్యాసాలు.

పుస్తకం చివర అనుబంధంలో ఆంగ్ల ప్రచురణ వివరాలు, మను బెన్ గాంధీ జీవిత విశేషాలు, మరణంపై గాంధీజీ అభిప్రాయాలు, కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ కార్యక్రమాలు, కస్తూర్బా గాంధీ గారి గురించి డా. నాగసూరి వేణుగోపాల్ గారు వ్రాసిన చక్కని వ్యాసాన్ని పొందుపరిచారు.

~

మహాత్ముని గురించి సరళమైన శైలిలో ఎన్నో విషయాలు చెప్పిన ఈ చిన్ని పుస్తకం ఏకబిగిని చదివిస్తుంది. డా. కాళ్లకూరి శైలజ గారికీ, డా. నాగసూరి వేణుగోపాల్ గారికి అభినందనలు.

***

నేను చూసిన బాపు
రచన: మను బెన్‌ గాంధీ, అనువాదం: డా. కాళ్లకూరి శైలజ.
సంపాదకులు: డా. నాగసూరి వేణుగోపాల్
ప్రచురణ: కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ, హైదరాబాద్
పేజీలు: 100
వెల: ₹ 100/-
ప్రతులకు: విజ్ఞాన ప్రచురణలు, నెల్లూరు
ఫోన్‌: 94405 03061
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here