[dropcap]1[/dropcap]5వ శతాబ్దపు చారిత్రక నవలను నేహల పేరిట అందిస్తున్నారు సాయి బ్రహ్మానందం గొర్తి.
***
“నేహల ఒక నవల. తెలుగులో నవలాప్రక్రియ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. పైగా, నేహల చారిత్రిక నవల కూడా, చరిత్ర అనంగానే, ‘తారీఖులూ దస్తావేజులూ’ కాదన్న మాట పూర్తిగా నిజంకాదు. రాజులూ యుద్ధాలూ, గెలుపూ, ఓటమీ, ఓడిపోయిన రాజులు గెలిచిన రాజులకి వియ్యాలవారు కావటం మనకి చరిత్రాంశమే. అందుకనే కాబోలు, రాజుల ప్రేమకలాపాలన్నీ చరిత్రలో భాగాలయినాయి. కొన్ని సందర్భాలలో అది సారస్వతం కూడా అయ్యింది. ఈ ప్రేమ వ్యవహారాలు కాల్పనిక సాహిత్యాన్ని మరొక మలుపులోకి తీసుకొనిపోవటానికి సహకరించాయి.
చారిత్రిక నవలలన్నింటిలోనూ (పాశ్చాత్య నవలలతో సహా!) ప్రేమికుల కథ ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకని, నేహాల నవలని ఒక ప్రేమకథగా చదవండి, చరిత్ర కోసం చదవకండి. ప్రేమకథ అనంగానే విశ్వనాథ సత్యనారాయణగారి ఏకవీర గుర్తుకురాక మానదు, ఏకవీర తెలుగు చారిత్రిక నవలకి ఒక పెద్దమలుపు తెచ్చి పెట్టింది. నేహల చదివేటప్పుడు నాకు ఏకవీర గుర్తుకి రావటం కాకతాళీయం కాదు. కథలో నేహల పడిన కష్టాలు ఊహించరానివి. అయితే ఇప్పటికీ సాధారణ స్త్రీలు అటువంటి కష్టాలు ఎదుర్కొంటూనే వున్నారు,
నేహల నవలలో చాలా పాత్రలు వస్తాయి. ప్రాతినిధ్యం వున్న వాళ్ళు కేవలం పాత్రధారులుగా మాత్రమే రారు; వాళ్ళు ముఖ్య పాత్రలుగా కథని నడిపిస్తారు. నవల పొడుగూతా కుట్ర, కుతంత్రం, అప్పుడప్పుడు కావలసిన చమత్కృతీ ఆకట్టుకుంటాయి” అన్నారు వేలూరి వేంకటేశ్వర రావు “నేహల గురించి నాలుగు మాటలు” అనే ముందుమాటలో.
***
“నేహల ఓ అందమైన ఆడపిల్ల మాత్రమేకాదు; తండ్రి చాటు కూతురే కాదు, ఒక శృంగార నాయికేగాదు; గురువుగారి ప్రేమాభిమానాలు చూరగన్న శిష్యరాలే కాదు: మొక్కవోని అత్మగౌరవంతో జీవితాన్ని దిద్దుకోవాలని ఆశించిన ధీరోదాత్త నాయిక.
ఆ రోజుల్లో అంతఃపుర స్త్రీలు మరబొమ్మలేగాని మనసున్న మనుషులుగా బ్రతకలేరని ఆ పిన్నవయసులోనే అకళింపు చేసుకుని, రాచరికాన్ని అలవోకగా తిరస్కరించిన నేహల, తిరిగి అదే రాచరికపు గోడల మధ్య బందీ అయ్యి, విధి వంచితగా మారిన తీరు ప్రతి పాటకుడికీ కన్నీరు తెప్పిస్తుంది.
గురుశిష్య సంబంధం భారతీయ జీవన విధానంలో ఎంతటి ఉన్నతమైన స్థానంలో విరాజిల్లేదో చెప్పటానికి సజీవ ఉదాహరణలు వేదరాయశర్మ, నేహల అనుబంధం. శిష్యురాలు నేహలపట్ల గల ప్రేమాభిమానాలు అంత ఇంతా కాదు. ఆమె జీవితంలో ఉన్నత శిఖరాలకి సాగిపోవాలనే అతని తపన కూడా. అదే ఆమె పాలిట శాపంగా పరిణమించింది. ఇది అద్వితీయంగా చిత్రీకరించిన విధానం రచయిత సాధించిన పెద్ద విజయం.
ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ నవల ఆద్యంతమూ మనల్ని అలరిస్తుంది. అందుకు రచయిత బ్రహ్మానందం అభినందనీయుడు.
సాధారణంగా చారిత్రాత్మక నవలలు కల్పన చుట్టూ తిరుగుతాయి. కానీ ఈ నవలలో కల్పననీ, చరిత్రనీ విడదీసి చూడడం అంత సులభం కాదు. నవల చదివాక నా అభిప్రాయంతో మీరూ ఏకీభవిస్తారని నా నమ్మకం” అని వ్యాఖ్యానించారు జొన్నలగడ్డ శేషనారాయణ రావు తన “ఆప్తవాక్యం”లో.
***
నేహల (చారిత్రక నవల)
రచయిత: సాయి బ్రహ్మానందం గొర్తి
పేజీలు: 373
వెల: రూ. 250/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు