[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన బలభద్రపాత్రుని ఉదయ శంకర్ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు శ్రీమతి పుట్టి నాగలక్ష్మి.]
[dropcap]ఆ[/dropcap]కాశంలో వెలుగు రేఖలు విచ్చుకునే వేళ, ఆ ప్రభాత ప్రశాంతతని భగ్నం చేస్తూ మేఘాలు గర్జిస్తున్నట్లుగా రాఘవరావు ఇంట్లో నుంచి జానకి గొంతు గట్టిగా వినిపిస్తుంది. “రాత్రంతా మా తమ్ముడిని పోలీసు స్టేషన్లో పెట్టినా చీమ కుట్టినట్లు లేదు ఈ మానవుడికి. మనిషి జన్మ ఎత్తగానే సరా! పరోపకార బుద్ధి ఉండొద్దూ..!?” అంటూ భర్తని దుమ్మెత్తి పోస్తుంది.
ఇది దాదాపు రోజూ ఉండే తంతే. భార్య ఏదో అడగటం రాఘవ చెయ్యకపోవటం. ఆమె నోరు చేసుకోవటం, వీడు దులుపుకోవటం.. సర్వసాధారణం ఐపోయింది.
‘పక్క ఇంట్లోనే ఉన్నందుకు ఈ గోల భరించక తప్పదు’ అనుకుంటూ టెర్రస్ మీదకు వెళ్ళాను. రాఘవ సిగరెట్ తాగుతూ నింపాదిగా డాబా పైకి వచ్చాడు. “మళ్ళీ ఏమైందిరా? మీ ఆవిడ భూపాల రాగంలో తిడితే కానీ రోజూ నీకు తెల్లారదా?” అన్నాను నవ్వుతూ.
ఆమె అంత గొంతు చించుకుంటున్నా రాఘవ మాత్రం నిశ్చల తపోనిమగ్నుడైన యోగిలా ఉన్నాడు. నా వైపు ప్రశాంతంగా చూసి “మా బావమరిది ఇల్లు అమ్మేసి, ఆ డబ్బు తీసుకుని కారులో వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు” అని అటూఇటూ పచార్లు చేస్తూ మరో సిగరెట్ ముట్టించాడు. రాఘవకు ఉన్న అవలక్షణాల్లో ఇదొకటి. ఏ విషయమూ పూర్తిగా చెప్పడు. మిగతాది మనమే ఊహించుకోవాలి.
ఎన్నికల సమయంలో డబ్బు రవాణా చేస్తే పోలీసులకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. రాఘవకు అధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయని గుర్తొచ్చి “అది విక్రయ ధనమే కదా! పోలీసులకు ఒక మాట చెపితే నీ సొమ్మేం పోయింది?” అన్నాను ఏదో మాట వరుసకు.. వాడి తత్త్వం తెలిసి కూడా! రాఘవ నవ్వి ఊరుకున్నాడు. లక్ష్మణస్వామి నవ్వులా వాడి నవ్వు కూడా ఎదుటి వారిలో ఎన్నో అనుమానాలకు బీజం వేస్తుంది.
రాఘవ గురించి ఆలోచిస్తుంటే నా మనసు గతంలోకి తొంగి చూసింది. వాడు చిన్నప్పటి నుంచి అంతే! సాటి మనిషికి సాయపడటం అన్నది వాడి చరిత్రలోనే లేదు. “ఒఠ్ఠి పనికి మాలిన వెధవ!” అని కొందరు బిరుదు ఇస్తే, ఇంకొందరు “వాడిది రాతి గుండె” అని ఖాయం చేశారు. మా ఉపాధ్యాయులైతే “వీడొక ఆత్మయోగిరా!” అని నవ్వేవాళ్ళు. ఎవరెన్ని అన్నా వాడు చలించకుండా, ఓ పర్వత శిఖరంలా చూసేవాడు.
ఒకసారి రాఘవ పది రోజులు బడికి రాలేదు. నేను ఉండబట్టలేక వాళ్ళింటికి వెళ్ళాను. వాడు ఇంట్లో లేడు. రాఘవ తన కుటుంబం గురించి మాకు ఎప్పుడూ చెప్పలేదు. ఇదే మంచి అవకాశమని నేను అక్కడే తిష్ట వేసి వాళ్ళమ్మ గారి నుంచి నాకు కావాల్సిన వివరాలు రాబట్టాను.
వాళ్ళమ్మ గారికి పసుపుకుంకుమ కింద వచ్చిన ఆ పాత పెంకుటింట్లో రాఘవ తల్లి, తమ్ముడు, చెల్లితో ఉంటున్నాడు. పెరట్లో రెండు నులక మంచాలు పరిచి వాటి మీద అప్పడాలు ఎండబెట్టారు. ఓ పక్క నాపరాళ్ళ మీద పరిచిన గుడ్డపై వడియాలు ఎండబెట్టారు.
ఇంటి ముందు రకరకాల పూలమొక్కలు వెనుక దొడ్లో ఆకు కూరలు, కాయగూరల మొక్కలు పెంచుతున్నారు. కాస్త ఎడంగా మామిడి, సపోటా, వేప, జామ వగైరా చెట్లు ఉన్నాయి. రంగు వెలిసి వైభవం కోల్పోయిన ఆ పాత పెంకుటిల్లు పేద ముత్తైదువులా దీనంగా ఉంది.
పెద్దదిక్కు లేని ఆ కుటుంబాన్ని రెక్కల కష్టంతో గుట్టుగా లాక్కొస్తుంది దేవమ్మ గారు. తెల్లారు ఝామున ఐదు గంటలకు న్యూస్ పేపర్లు వేయటంతో మొదలయ్యే రాఘవ దినచర్య, ఆవిడ తయారు చేసే అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు రాత్రుళ్ళు కొట్లకి, హోటళ్ళకి వేయటంతో ముగుస్తుంది.
బాదం ఆకులతో విస్తళ్ళు కుడుతూ “మా దొడ్లో పండిన కూరగాయలు, ఆకు కూరలు అమ్ముతాం. మీ అమ్మకి చెప్పు.. మా దగ్గర తీసుకోమని! మీకైతే తక్కువకే ఇస్తాంలే” అని నవ్వింది దేవమ్మ గారు. బదులుగా నవ్వి ఊరుకున్నాను.
సంతానం లేని ఒక వృద్ధురాలు కాలం చేస్తే రాఘవే కర్మ కాండ చేస్తున్నాడని, అందుకే స్కూల్‌కి రావటం లేదని దేవమ్మ గారు చెప్పింది. “ఆవిడ మీకు ఏమవుతుంది?” అన్నాను ఆశ్చర్యంగా. “ఎత్తి కుదేస్తే రెండవుతుంది” అని భళ్ళున నవ్వి “నేను పచ్చళ్ళు పెడుతుంటే నాకు సాయంగా వస్తుండేది.. అంతే!” అంది దేవమ్మ గారు. ఇంత సరదాగా ఉండే తల్లి కడుపున ఈ మబ్బుగాడు ఎలా పుట్టాడో నాకు అర్థం కాలేదు.
రాఘవకి ఆ రోజుల్లోనే సిగరెట్లు తాగటం అలవాటైంది. వాడు సిగరెట్లు తాగుతున్నాడని చెప్తే ఆవిడ నవ్వుతూ “వాడొక్కడేనా.. నువ్వు కూడానా?” అంది. వాడిని తిట్టించాలన్న నా కోరిక తీరనేలేదు. రాఘవలో ఉన్న సంకుచిత మనస్తత్వం గురించి చెప్పి “ఎందుకు రాఘవ ఎప్పుడూ గిరి గీసుకుని ఉంటాడు? ఎవరితో కలవడు” అన్నాను తిట్టించటానికి మరో ప్రయత్నంగా.
దేవమ్మ గారి గొంతు గంభీరంగా మారిపోయింది. “వాళ్ళ నాన్న అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి సన్యాసుల్లో కలిసినప్పుడు చుట్టాలు మాకు అండగా నిలబడలేదు. వాడి మనసులో అదే నాటుకు పోయింది. పైకి అలాగే కనిపిస్తాడు కానీ నిజంగా కష్టాల్లో ఉన్న వారికి వాడు అండగా ఉంటాడయ్యా!” అంది. బహుశా రాఘవ బయట ఎలా ప్రవర్తిస్తాడో ఆవిడకి తెలియదల్లే ఉంది.
మేం మాటల్లో ఉండగానే రాఘవ వచ్చాడు. వస్తూనే నన్ను, వాళ్ళమ్మనీ మార్చి మార్చి చూశాడు. ఆమె ఏదో అర్థమైనట్లు “ఫర్వాలేదులేరా! ప్రకాశం నీ స్నేహితుడేగా” అని కాళ్ళు, చేతులు కడుక్కుంటున్న కొడుకుతో “వెళ్ళిన పని ఏమైంది?” అడిగింది నా ముందే. వాడిలో ఉన్న గుట్టు, దాపరికం ఆవిడలో లేనట్లున్నాయి.
రాఘవ నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసి, నా వైపు లిప్త కాలం చూసి “బామ్మ గారి సామాన్లు అద్దె కింద చెల్లేసుకున్నాడు ఇంటి యజమాని. ఇక కిరాణా కొట్టు బాకీ మాత్రం మిగిలింది. నెలాఖరులో ఇస్తామని చెప్పాను” అన్నాడు ఎరుపు రంగు ముతక టవల్తో తుడుచుకుంటూ.
ఒక పళ్ళెంలో రెండు గుప్పిళ్ళ ధాన్యం, ఒక బేసిన్లో నీళ్ళు పోసి బావి పక్కన పెట్టాడు. నేను వింతగా చూస్తుంటే “పక్షుల కోసం..” అంది వాళ్ళమ్మ. రాఘవ నాతో పొడిపొడిగా మాట్లాడి “పనుండి వచ్చావా..?” అన్నాడు. వాడి భావం గ్రహించి జేగురించిన మొహంతో “బజారుకి వెళ్తూ ఇలా వచ్చాలే.. వస్తా!” అని అక్కడ నుంచి బయట పడ్డాను.
కాలంతో పాటు వాడిలో మార్పు వస్తుందేమో అని ఆశించిన మా మిత్రులకి నిరాశే ఎదురైంది. కాలేజీలో చేరినా రాఘవ ప్రవర్తన మారలేదు. ఎవరైనా పుస్తకమో, పెన్నో అడిగితే నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పేవాడు. వాడి ధోరణి చూసి అందరూ వాడిని దూరం పెట్టేవారు. వాడు కూడా సహాయం అర్ధించటం నేను చూడలేదు.
వాడితో కాస్తోకూస్తో చనువుగా ఉండేది నేనే. అనంత జలరాశుల్లో ఒంటరి నావలా సాగిపోతున్న రాఘవని చూస్తే ఒక్కొక్కసారి నాకు జాలి కలిగేది. “మనమేమీ అడవిలో జీవించట్లేదు. పెద్దవాళ్ళం కూడా ఔతున్నాం. ఇప్పటికైనా నీ ధోరణి కాస్త మార్చుకోరా!” అన్నాను ఒకసారి. వాడు పెడసరంగా చూసి “నా జీవితం నాది. ఎవరి కోసమో నేను ఎందుకు మారాలి? నేనేమైనా ప్రజాసేవ చేయటానికే పుట్టాననుకుంటున్నావా?” అని ఎదురు ప్రశ్నించాడు.
మేము కాలేజీలో చేరిన కొత్తలో ఆఫీసులో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. విద్యార్థుల సర్టిఫికెట్లు కాలిపోతాయేమోనని అందరూ ఆందోళన పడుతుంటే రాఘవ మొండి ధైర్యంతో మంటల్ని తప్పించుకుంటూ వెళ్ళి సర్టిఫికెట్ల కట్టలను బయటికి విసిరేసి, తిరిగి అదే వేగంతో బయటికి వచ్చాడు. వాడి కాళ్ళు చేతులు కాలి బొబ్బలెక్కినా లెక్క చేయలేదు.
ప్రిన్సిపాల్ రాఘవను చూసి “ఎందుకంత సాహసం చేశావు? సర్టిఫికెట్లు కాలిపోతే డూప్లికేట్‌వి తెప్పించే వాళ్ళం కదా!” అని మందలించి, “నీకేమన్నా ఐతే లేనిపోని కేసులు..” అంటూ గొణుక్కున్నాడు. అది రాఘవ విన్నట్టున్నాడు. “నాకేమైనా జరిగితే నాదే పూర్తి బాధ్యత సార్” అన్నాడు. పరోపకారం చేసే విషయంలో వాడిలో మార్పు వచ్చిందేమోనని సంతోషించాం. కానీ అదంతా మా భ్రమని ఆ తర్వాత జరిగిన సంఘటనల్లో తేలింది.
మా క్లాస్‌మేట్లు ఇద్దరమ్మాయిలు మొదటి ఆట సినిమా చూసి వస్తుంటే ఎవరో ఆకతాయిలు వాళ్ళ వెంటబడి వేధించారు. అదే సమయానికి అటుగా వస్తున్న రాఘవ వాళ్ళని చూసి కూడా చూడనట్లే వెళ్ళిపోయాడు. ఆ పిల్లలే ఎలాగో తప్పించుకొని వచ్చేశారు.
మర్నాడు ఆ అమ్మాయిలు ఈ విషయం కాలేజీలో చెప్తే అందరూ వాడిని తిట్టిపోశారు. నాక్కూడా కోపం వచ్చి “ఎందుకురా.. ఇంత సంకుచితంగా ఉంటావు? ఆడపిల్లలకు కూడా సాయం చేయలేని నీదీ ఒక జన్మేనా!.. ఛీ.. ఛీ!!” అని ఈసడించుకున్నాను.
ఎన్ని తిట్టినా చలించకపోవటం వాడి ప్రత్యేకత. నావంక వంకరగా చూస్తూ “కట్టిపెట్టరా ఈ నీతులన్నీ! అసలు లోకంలో తొంభై శాతం సహాయాలు కోరేది అనర్హులే! ఎవరికి వారు నిజాయితీగా ఉంటే ఎవర్నో సహాయం కోసం దేబిరించటం ఎందుకు?” అంటూ వాదించి నా నోరు మూయించాడు.
***
కాలం వేగంగా పరిగెడుతుంది. మేము చదువులు పూర్తి చేసి వృత్తి, ఉద్యోగాల్లో స్ధిరపడ్డాం. నాకు మా ఊళ్ళోనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. రాఘవ తాను ఉంటున్న ఇల్లు అమ్మేసి, తమ్ముడిని, చెల్లెలిని ఫై చదువుల కోసం అమెరికా పంపించాడు.
వాడు ఒక పెద్ద కంపెనీలో చేరి క్రమంగా సీఈవో స్ధాయికి ఎదిగాడు. వాళ్ళమ్మ గారు పోయినప్పుడు ఉత్తరం రాశాడు. దరిమిలా వాడితో పెద్దగా సంబంధాలు లేవు. మరి వాడేమో మానవ లోకంలో బతుకుతున్న అంతరిక్ష జీవిలా ఉంటాడాయే!
నేను వాడిని దాదాపుగా మర్చిపోతున్న దశలో మా పెద్దమ్మ మనవడు వచ్చి “ఒక కంపెనీలో క్లర్క్ పోస్టులు పడితే దరఖాస్తు చేశాను. దాని సీఈవో నీకు తెలిసిన వాడే.. రాఘవ రావు! నువ్వో మాట చెప్పు బాబాయ్!” అన్నాడు ఆశగా. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. “వాడో పనికిమాలిన వెధవరా.. అయినా అడిగి చూస్తాను” అన్నాను, మా వాడిని నిరాశ పరచటం ఇష్టం లేక.
అయిష్టంగానే రాఘవకు ఫోన్ చేశాను. ముందు బాగానే మాట్లాడాడు. నేను ఉద్యోగం విషయం ఎత్తేసరికి “అది హెచ్చార్ వాళ్ళు చూసుకుంటారు. క్లరికల్ పోస్టులు నా దాకా రావు. ఐనా మేమిచ్చే పన్నెండు వేల కోసం సిటీ దాకా రావటం దేనికి.. చాలీచాలని జీతంతో ఇబ్బంది పడటం దేనికి? అక్కడే ఏదొక పని చూసుకోవచ్చుగా!” అన్నాడు. ఇది నేను రాఘవలో గమనించిన చిన్నపాటి మార్పు. వాడిలో సాయం చేసే గుణం లేకపోవటంతో పాటు సలహాలిచ్చే అలవాటు కూడా లేదు.
వాడిలో వచ్చిన మార్పు మంచిదో కాదో బేరీజు వేసే స్థితిలో లేను నేను. నాకు వళ్ళు మండి “నీ బోడి సలహా ఎవడిక్కావాలిరా? ఐనా నువ్వు సహాయం చేస్తావని ఆశించటం నాదే బుద్ధి తక్కువ” అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాను.
రాఘవ మీద కొన్నాళ్ళు కోపం పెట్టుకుని తర్వాత ఆ సంగతి మర్చిపోయాను. ఒకరోజు రాఘవ ఫోన్ చేసి “నేను ఉద్యోగం మానేశాను. మన ఊరిలో ఒక పరిశ్రమ పెట్టాలని అనుకుంటున్నాను” అన్నాడు. ‘ఈ తలతిక్క వెధవని కంపెనీ వాళ్ళే తీసేసి ఉంటారు. పైకి బింకంగా తనే మానేశానని చెప్పుకుంటున్నాడు. లేకపోతే యాభై లక్షల పేకేజీ ఉన్న కొలువు వదులుకునే దద్దమ్మ ఎవడు ఉంటాడు?’ అనుకున్నాను.
మా ఇంటి పక్కనున్న చిన్న డాబా కొని అందులో గృహప్రవేశం చేశాడు రాఘవ. కొత్తగా కడుతున్న పారిశ్రామికవాడలో వాళ్ళమ్మ పేరుతో ‘దేవీ ఫుడ్స్’ అనే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాడు. వాడి కంపెనీలో ప్రత్యక్షంగా వంద మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. చుట్టుపక్కల ఊళ్ళలో నిరుద్యోగులకు ఏజెన్సీలు కట్టబెట్టాడు. రాత్రింబవళ్ళు కష్టపడి అనతి కాలంలోనే లాభాలు ఆర్జించాడు.
ఎంత సంపాదించినా డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండేవాడు రాఘవ. ఎవరికన్నా ఒక్క రూపాయి దానం చెయ్యటం నేను చూడలేదు. ఐతే ఆశ్చర్యంగా అంత పీనాసి వెధవ కూడా ప్రతిభ ఉన్న పేద విద్యార్థులను, ఫీజులు కట్టి చదివించేవాడు. వాడి మనస్తత్వం అర్థం కావాలంటే మరో జన్మ ఎత్తాలేమో!
సాంస్కృతిక సంఘాల వాళ్ళు, స్వచ్ఛందసంస్థల వాళ్ళు విరాళాలు అడిగితే “సేవ చేయాలని ఉంటే మీ డబ్బుతో చేసుకోండి. నా డబ్బుతో మీరు సేవ చెయ్యటం ఏంటి?” అంటూ విచక్షణ లేకుండా మాట్లాడేవాడు. అలా అడిగే వాళ్ళలో రాజకీయ ప్రముఖులు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉండేవారు.
రాజకీయ నాయకులు చందాలు ఇవ్వలేదన్న కోపంతో రాఘవకి ఏం ద్రోహం తలపెడతారో అని నాకు భయం వేసేది. “వాళ్ళతో పేచీ ఎందుకురా? ఎంతో కొంత వాళ్ళ మొహాన కొడితే నీ జోలికి రాకుండా ఉంటారు కదా!” అని నేను నచ్చజెప్పాలని చూస్తే “నన్నేం చేస్తార్రా.. ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు” అని తేలిగ్గా నవ్వేసేవాడు.
***
అమెరికాలో ఉన్న మా పిల్లలు బలవంతం చేస్తే నేను, మా ఆవిడా వెళ్ళాము. ఆరు నెలలు ఆరు నిమిషాల్లా గడిపి, సొంత ఊరికి తిరిగి వచ్చేశాం. ఈ ఆర్నెల్లలో నన్ను ఆశ్చర్యపరిచే సంఘటనలు చాలానే జరిగాయి. రాఘవ ఇల్లు అమ్మేశాడు. వాడు మంచాన పడ్డాడని, ఫ్యాక్టరీ కాలిపోయిందని తెలిసింది. నా మనసు బాధతో మూలిగింది. ఉండబట్టలేక ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆరోజు ఆదివారం కావడంతో ఎవరూ లేరు. నేను నిరాశగా వెనక్కి వచ్చేస్తుంటే జానకి కనిపించింది. ఒకప్పుడు మహారాణిలా వెలిగిన జానకి ఇప్పుడు చితికిపోయిన జమీందారీలో దాసిలా ఉంది.
నేను అడిగేలోపే “ఎమ్మెల్యే కాసుల నాయుడు పార్టీ ఫండ్ కోసం విరాళం అడిగాడు. మేం ఇవ్వకపోవటంతో రకరకాలుగా వేధించారు. ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేశారు. చివరకి ఇల్లు అమ్మి ఫ్యాక్టరీని బాగు చేయించాం” అంది జానకి. నేను భయపడినంతా జరిగింది. కానీ ఇప్పుడు వాడిని దెప్పి ఇంకా బాధ పెట్టలేను.
“ఇప్పుడు రాఘవ ఎక్కడున్నాడు?” అని ఆందోళనగా ప్రశ్నించాను. జానకి నన్ను మేడ మీదకి తీసికెళ్ళింది. ఆఫీసు టెర్రస్ మీద రెండు గదులు కట్టించి, అందులోనే ఉంటున్నామని చెప్పింది. కాలిన గాయాలతో మంచం మీద పడుకుని, ముఖేష్ పాటలు వింటున్న రాఘవ మేము రావటం గమనించలేదు. “ప్రకాశం అన్నయ్య వచ్చారు” అంది జానకి భర్త చెవి దగ్గర నోరుపెట్టి.
రాఘవ నెమ్మదిగా కళ్ళు తెరిచి నన్ను చూసి “ఎప్పుడు వచ్చావురా.. అమెరికా నుంచి?” అన్నాడు నీరసంగా.
వాడిని ఆ స్థితిలో చూసి నాకు దుఃఖం ఆగలేదు. వాడు పేలవంగా నవ్వి “నేనే ఏడవటం లేదు. నువ్వెందుకురా ఏడవటం?” అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నేను సానుభూతిగా చూసి “ఇప్పుడున్న పరిస్థితుల్లో నువు ఫ్యాక్టరీ నడపలేవు.. విశ్రాంతి తీసుకో” అన్నాను. చెప్పిన మాట వింటే వాడు రాఘవ ఎందుకవుతాడు!?
వాడి కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. “మంటలను ఆర్పే ప్రయత్నంలో నేను గాయపడ్డానే కానీ చావలేదు. నన్ను దొంగదెబ్బ తీయాలని చూశారు పిరికిపందలు. వంద కుటుంబాలకి అన్నం పెట్టే ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి నా ప్రాణాలైనా ధారపోస్తాను” అన్నాడు. మొదటిసారి వాడిలో మానవత్వం చూశాను. ఐతే ఇది నిలకడగా ఉంటుందన్న నమ్మకం లేదు. పరిస్థితులు వాడి చేత ఇలా మాట్లాడిస్తున్నాయేమో!
వాడి కళ్ళలో ఉన్న ఆవేశం గొంతులో లేదు. వాడికి ఇంకా వ్యాపారం మీద యావ చావలేదు. ఆక్కడ ఉండలేక నేను బయల్దేరబోతుంటే నా చెయ్యి పట్టుకొని “నాకో సాయం చేస్తావురా ప్రకాశం!” అంటూ ఆపాడు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వాడి నోటివెంట ‘సాయం’ అన్నమాట రావటం ఏమిటి.. వింత కాకపోతే!
జానకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆమెని ఓదార్చి, నా చెయ్యి నిమురుతూ “పిల్లల్లో వృత్తి నైపుణ్యం పెంచి, తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయాలి. దీని కోసం ఒక ట్రస్టుని స్ధాపించి, ఫ్యాక్టరీతో సహా నా ఆస్తినంతా ట్రస్టుకు రాశాను. దాని బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఫ్యాక్టరీ వ్యవహారాలు జానకి చూసుకుంటుంది. నేను ఎప్పటికి లేచి తిరగ్గలనో చెప్పలేను. అప్పటిదాకా మాట దక్కించు” అన్నాడు మాటలు కూడదీసుకుంటూ.
నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. ‘సాయం’ అంటే తన కోసం ఏదో అడుగుతాడు అనుకున్నాను. “అందరి దృష్టిలో పనికిమాలిన వాడుగా, స్వార్థపరుడిగా ముద్ర పడిన రాఘవలో ఇప్పుడు పరివర్తన కలిగిందా? లేక మేమే వాడిని సరిగా అర్థం చేసుకోలేకపోయామా?” నా మనసు గందరగోళంలో పడిపోయింది.
నా మొఖంలో భావాలు చదివినట్లు “ఆయన అర్ధాంగిని నాకే అర్ధం కావట్లేదు అన్నయ్యా! బహుశా ఆయన జీవితంలో అర్ధించిన సాయం ఇదొక్కటేనేమో!” అంది జానకి, భర్త మూసిన రెప్పల కింద ఉబుకుతున్న కన్నీటిని చూస్తూ. “ఔనమ్మా! శిలల్లో కూడా నీటి జాడ ఉంటుందని వినటమే కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను” అన్నాను రాఘవ వంక తదేకంగా చూస్తూ.