[షేక్ కాశింబి గారు రచించిన ‘రక్తం రుచి మరిగిన పులులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఏ[/dropcap]ళ్ళ శ్రమని పేర్చి
సమకూర్చుకున్న
లెక్క లేనన్ని భవనాల్ని
ఉత్పాదక కర్మాగారాల్ని
సేవలందించే ఆసుపత్రుల్ని
అక్షరాలు దిద్దించే విద్యాలయాల్ని
వెదికి వెదికి నేల కూల్చి
తొడలు చరుస్తున్నారు!
సంతోషపు ఆవరణలో
తమదైన జీవితాల్ని గడిపే
శాంతికాముకుల్ని
మానవతామూర్తుల్ని
నెమరేసే పశువుల్ని
ఎగిరే పక్షుల్ని
తరిమి తరిమి కాల్చేసి
మీసాలు మెలేస్తున్నారు!
నందనవనం లాంటి
రసరమ్య సృష్టిలో
రాజీ ఎరుగని ధీరుల్ని
పరిఢవిల్లే ప్రకృతిని
పురోగమనపు దారుల్ని
చివురించే నవ్యాంకురాల్ని
నలిపి నలిపి నాశనం చేసి
వికటాట్టహాసం చేస్తున్నారు!
కక్షల బరువుల్ని మోసుకుంటూ
కసి మంత్రాల్ని నిత్యం జపిస్తూ
బేల చూపుల పసివారి ఎక్కిళ్ళను
కడుపు కాలిన అమ్మల రోదనల్ని
బావురుమంటున్న వృద్ధుల ఆక్రోశాన్ని
అయిన వారికై విలవిల్లాడే ఆప్తుల ఆక్రందనల్ని
పదేపదే విన్నా.. కరగని మంచు గడ్డలై
జబ్బులు చరుచుకుంటున్నారు!
మనో కుహరాన్ని అహంతో నింపుకుని
కారుణ్యాన్ని కదలకుండా కట్టడి చేసి
శిథిలమైన నగరాల్ని
ఎడారులైన ఊర్లని
మోడుబారిన చెట్లని
కాలుడి కరాళ నృత్యాన్ని
గుచ్చి గుచ్చి చూసీ.. గుండెల్ని బండలు చేసుకుని
స్పందన లేని శిలల్లా నిలబడుతున్నారు!
కాదు.. కాదనుకున్నా
కళ్ళ ముందు కదలాడే
తెగిపడిన కాళ్ళు, చేతుల్ని
తలల్లేని మొండాల్ని
ఆఖరి శ్వాసను లెక్కిస్తున్న కళేబరాల్ని
ఆబగా వాటిని చీలుస్తున్న రాబందుల్ని
చూడనే చూడనట్లు నటించడాన్ని
అలవాటుగా మార్చుకుంటున్నారు!
కనురెప్పపాటులో కన్ను మూస్తున్న ఘనుల్ని చూసీ
భవిత నూహించలేని మూర్ఖులు
రాకెట్ల దాడుల్ని మిసైళ్ళ ప్రయోగాల్ని
ఆర్తుల హాహాకారాల్ని
పదే పదే ఆనందిస్తూ.. ఆ
అమానవీయతకే విజయమనే
పేరు పెట్టుకుంటున్నారు!
ఒక్క ప్రాణినీ సృజించ లేని శుద్ధ అసమర్థులు
ఒక్క క్షణం ప్రాణాల్ని ఆపలేని అశక్తులు
అసహనాన్ని ఆభరణంగా ధరించిన మహారాజులు
ఎదుటివారి, కన్నీటితో సంబరపడే కఠినాత్ములు
ఓరిమి విడిచి, దయని మరిచిన హింసావాదులు
భరోసా చేతగాక, భయపెట్టి పాలించే ప్రభువులు
రాక్షసత్వాన్నే రాచరికంగా భ్రమించే అధినేతలు
యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న మమత లేని నియంతలు!
రక్తం రుచి మరిగిన పులులు!!