[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘బెల్లంకొండకు కల వస్తే..?’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
[dropcap]బె[/dropcap]ల్లంకొండకు కల వస్తే..?
వామ్మో! కొంప కొల్లేరు అయి పోదూ? సాపీగా సాగే సంసార నౌక పెను తుఫానులో చిక్కుకు పోదూ? సాగర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ చిoతపల్లి అడవుల్లో లమ్మసింగిలో వున్న మన ప్రణవానంద సేవాశ్రంలో కూడా సునామీ వచ్చెయ్యదూ?
***
దక్షిణామూర్తి వటవృక్షం చాయల్లో ఆ రోజు సత్సంగానికినికి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ శాంతి రెడ్డి, సువర్ణ లక్ష్మీ దంపతులు. మాతా సద్విద్యానంద సరస్వతీ వచ్చి వారి ఆసనంలో కూర్చున్నారు. సమస్యలు – పరిష్కారాలు అనే కార్యక్రమం చేపట్టాల్సి వుంది. ఎప్పుడూ సంసారం గొడవే గానీ సత్సంగం మాటెత్తని మతిమరపు బెల్లంకొండ వెంకట రమణ మూర్తి, భార్య సుబ్బలక్ష్మి హాజరయ్యారు ఆ రోజు. బెల్లంకొండ మొహం ఆనందంతో వెలిగిపోతుంటే – సుబ్బ లక్ష్మి మోహం వాడిపోయి కుంచించుకు పోయి విచారంగా వుంది. అక్కడ వున్న వారందరి మనసుల్లో ఈ మధ్య బెల్లంకొండ స్వప్న లీల మెదిలింది!!
***
రెండవ శనివారం, ఆదివారాలు శెలవు మూలంగా ఆ సోమవారం రోజు చింతపల్లి లోని యూనియన్ బ్యాంక్ చాలా రద్దీగా ఉంది. డ్వాక్రా మహిళలతో, అమ్మ ఒడి లబ్ధిదారులైన తల్లులతో నిండి వుంది బ్రాంచ్.
సరిగ్గా అలాంటి సమయంలో భుజంపై ఒక గోనె సంచి వేసుకొని బ్యాంక్‌లో ప్రవేశించాడు ప్రణవానంద సేవాశ్రమవాసి బెల్లంకొండ వెంకట రమణ మూర్తి. అక్కడున్న అందరూ వింతగా చూసారు, ఎందుకంటే ప్రతివారూ ఒక బాగ్ గానీ, బ్రీఫ్‌కేస్ గానీ తెచ్చుకుంటే ఇతను వెరైటీగా గోనె సంచి తెచ్చుకున్నాడు. నేరుగా మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్లి తన చెక్కు ప్రెజెంట్ చేశాడు.
చెక్కు తీసుకొని చూడగానే షాక్ అయ్యాడు మేనేజర్. అది కోటి రూపాయలకు రాయబడ్డ చెక్కు. ఆ మేనేజర్ కొన్ని రోజుల క్రితమే ఈ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అయి వచ్చాడు. బెల్లంకొండ గురించి ఏ మాత్రం తెలీదు. ఆ చెక్ ఆనర్ చెయ్యాలంటే బ్రాంచ్‌లో వున్న మొత్తం నగదు సరిపోదు. నర్సీపట్నం లేదా వైజాగ్ మెయిన్ బ్రాంచ్ లను సంప్ర దించాల్సి వుంటుంది. తను చూడటంలో పొరపాటు పడ్డానేమో అని చెక్కును మళ్లీ చూసాడు. ఒకటి పక్కన సున్నాలు లెక్కించాడు. ఏడు వున్నాయి. ప్యూన్ తన కోసం తెచ్చిన కాఫీ బెల్లంకొండకు ఇచ్చి, తను అకౌంట్ నంబర్ కంప్యూటర్‌లో ఫీడ్ చేసి చూడగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అందులో బ్యాలన్స్ మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలుగా వుంది. కేసు అర్థమై పోయింది. ఏ విధంగా స్పందించాలో తెలియక అకౌంటెంట్‌తో మాట్లాడటానికి క్యాబిన్ బయటికి వచ్చాడు మేనేజర్.
పోలీసులకు తెలియ చెయ్యడానికి నిర్ణయించుకొని డయల్ చేస్తుండగా లోపలికి వచ్చారు మరో ప్రణవానంద ఆశ్రమవాసి గొల్లపూడి నాగేశ్వర రావు. డయల్ చెయ్యడం మానేసి ఆయనకు విషయం చెప్పారు. అప్పుడు తెలిసింది బెల్లంకొండ వెంకట రమణ మూర్తి గారు ‘డెల్యూషనల్ కన్ఫ్యూజన్ ఆఫ్ డ్రీమింగ్ రియాలిటీ’ అనే డిజార్డర్‌తో బాధ పడుతున్నట్లు.
మేనేజర్, గొల్లపూడి నాగేశ్వర రావు కలసి బెల్లంకొండ కూర్చున్న క్యాబిన్ లోకి వెళ్లి, మేనేజర్ చెప్పారు –
“మీ అకౌంట్‌లో అంత బ్యాలన్స్ లేదు కాబట్టి మీ చెక్ డిజానర్ చేస్తున్నాను.”
“అదేమిటి మేనేజర్ గారూ! నిన్న రాత్రి మీరు నా కలలో కొచ్చి అకౌంట్‌లో లిమిట్ మించిన డబ్బు వుందనీ, కనీసం ఒక కోటి రూపాయలయినా డ్రా చేసి తీసుకుపోండని చెప్పారు కదా? అందుకే గోనె సంచి కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడిలా మాట మార్చేస్తున్నారు. రాత్రి మీరు చెప్పినట్టు నాకు కోటి రూపాయలు ఇస్తేనే నేను ఇక్కడినుండి వెళతా!” అంటూ బైఠాయించాడు బెల్లంకొండ.
“అయితే.. పోలీసును పిలవాల్సి వుంటుంది.” మనేజర్.
“పోలీసునే కాదు మీ ఆర్.మ్.ని, జి.ఎమ్.నీ కూడా పిల్చుకోండి నాకేమన్నా భయమా?” అంటూ ఎదురు తిరిగాడు బెల్లంకొండ!
పరిస్థితి చెయ్యి దాటి పోతుందని భావించిన గొల్లపూడి నాగేశ్వర రావు గారు మొబైల్ నుండి ఆశ్రమానికి ఫోన్ చేసి రెడ్డి గారికి వివరించారు పరిస్దితి.
ఒక గంట లోపు ఆశ్రమ వాన్ బాంక్ ముందు ఆగింది. అందులోంచి దిగిన రెడ్డి గారు నేరుగా మేనేజర్ క్యాబిన్‌కి వెళ్లి బెల్లంకొండను సముదాయించ ప్రయత్నించి విఫలులై వుండగా ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.
“చూడూ! నీకు మేనేజర్ గారు కలలో కనిపించి గదా నిన్ను వచ్చి కోటి రూపాయలు డ్రా చేసుకు వెళ్ళమన్నారు. నువ్వు ఒక పని చెయ్యి! నీవు ఈ రాత్రికి వారి కలలోకి వెళ్లి నీ చెక్కు ఇవ్వు. వారు నీకు క్యాష్ ఇస్తారు. నువ్వు తెచ్చేసుకో!” అన్నారు.
“ఇది బావుంది. ఈ రాత్రికి ఎలా తప్పించుకుంటారో నేనూ చూస్తాను!” అంటూ రెడ్డి గారి వెంట బయలుదేరి ఆశ్రమానికి వచ్చేశాడు బెల్లంకొండ.
***
అక్కడ కూర్చున్న అందరి మనసుల్లో ఆ జ్ఞాపకం మెదిలింది. ముసి ముసిగా నవ్వుకున్నారు!
“మళ్ళీ ఏమిటి మీ సమస్యా?” సూటిగా విషయం లోకొచ్చేసారు రెడ్డి గారు
“నాకూ.. రాత్రి కలల్లో ఇరవై ప్రాయంలో వున్న అమ్మాయిలు వచ్చి ముద్దులు పెడతామంటున్నారు.” చెప్పాడు బెల్లంకొండ. అందరూ పెద్దగా నవ్వారు. సుబ్బలక్ష్మి సిగ్గుతో తల దించుకుoది.
“ముద్దులు పెడితే పెట్టించుకోండి!” అన్నారు రెడ్డి గారు.
“నాకు.. పెట్టించు కోవాలనే వుంది. కానీ.. అదే కలలో మా ఆవిడ.. రోకలి పట్టుకొని తల పగుల గొట్టేస్తానని బెదిరిస్తుంది” అన్నాడు భయoగా భార్య వైపు చూస్తూ.
“సరే.. కలలో మీ వయస్సు ఎంత వుంటుంది?” రెడ్డిగారు
“మామూలే. ..డెబ్బై” చెప్పాడు
“మీ భార్య వయస్సు?” రెడ్డి గారు
“ఒకటి – రెండు తక్కువ డబ్బై” బెల్లంకొండ.
“చూడండి! మీకు కల ఎంత సేపు వస్తుంది.” అడిగారు
“ఐదు నుండి ఇరవై నిమిషాలు” బెల్లంకొండ.
“చూడండి! మీ కలలో వున్నది మీరు కాదు మీ స్వప్న పురుషుడు. అలాగే మీరు చూస్తున్నది వాస్తవ ప్రపంచం కాదు స్వప్న ప్రపంచం! జనరల్‌గా కలలు రెండూ లేదా మూడు సెకన్లలో పూర్తయి పోతాయి. కొన్ని కలలు మాత్రం మీరు చెప్పినట్టు ఐదు నుండి ఇరవై నిమిషాలు వుంటాయి. అలా ఒక రాత్రిలో మాక్సిమం రెండు గంటలకు మించి కలలు రావు. మీ కల పది నిమిషాలు అనుకుంటే మీ స్వప్న పురుషుని వయస్సు, అలానే మీ కలలో కొస్తున్న మీ భార్య వయస్సు, ఆ యువతుల వయస్సు కూడా సమానమే! అంటే పది నిమిషాలు మాత్రమే! యాస్ లాంగ్ యాస్ యు గివ్ రియాలిటీ టూ ది డ్రీమ్స్, యూ హావ్ నో ఫ్రీడమ్ అండ్ యూ బికమ్ స్లేవరీ! జాగ్రత్తులో మీ మనస్సు చేసే భావ వికారములు స్వప్నంగా వస్తాయి. స్వప్న ప్రపంచంలోనే వాటిని అనుభవించాలి గానీ, వాటిని మళ్ళీ జాగ్రత్తు లోకి తీసుకు రారాదు. అలా తీసుకు రావడం ఉన్మాదం అనిపించుకుంటుంది! అర్థం చేసుకోండి! ఈ విధమైన డ్రీమింగ్ మీకు తగదు. అది మీ ఆధ్యాత్మిక ప్రగతికి పెద్ద అడ్డంకి! మీరు హోమియో డాక్టర్ కాటమ రెడ్డి గారి దగ్గర కెళ్ళి ‘ఇగ్నీషియా -200’ అనే మందు తీసుకొని కొన్ని డోసులు వేసుకోండి!
తర్వాత మీరు రాజమండ్రి వెళ్లండి. ప్రకాశ్ నగర్‌లో మానస హాస్పటల్ అని వుంటుంది. అందులో డా. కర్రి రామా రెడ్డి అని వుంటారు. ఆయన బహు శాస్త్ర కోవిదుడు! వారికి మీ విషయం చెప్పి కౌన్సెలింగ్, ట్రీట్మెంట్ తీసుకోండి! వారికి నేను ఫోన్ చేసి మీ గురించి వివరిస్తాను. మీ సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుంది!” అంటూ సంభాషణ ముగించారు శాంతి రెడ్డి గారు.
స్వస్తి.