డైరీ

4
3

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన సింగీతం ఘటికాచల రావు గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు డా. అమృతలత.]

[dropcap]ఇ[/dropcap]ప్పుడంతా వారాంతాలలో బయటినుంచి ఏదైనా చిరుతిండ్లు ఆర్డర్ చేసుకుని స్విగ్గీ జొమాటో అంటూ ఎంజాయ్ చెయ్యడం చాలామందికి అలవాటుగా పరిపాటిగా మారింది.

అదే కోవలో, తాము ఆర్డర్ చేసిన పార్సిల్ రావడంతో దాన్ని తీసుకునేందుకు బయటికి వెళ్ళాడు డెబ్భై ఏళ్ళ సదాశివం.

పార్సిల్ ఇచ్చేందుకు వచ్చిన సుమారు పాతికేళ్ళ యువకుడు పార్సిల్ ఇచ్చాక కొద్దిసేపు సదాశివం వంక తదేకంగా చూసి “ఏరా సదా, బాగున్నావా?” అన్నాడు.

పాతికేళ్ళ ఆ యువకుడు డెబ్భై ఏళ్ళ తననలా సంబోధించడంతో ఉలికిపడ్డ సదాశివం కొద్దిగా తికమకపడి అంతలోనే “ఎవర్రా నువ్వు. ఏంటా సంబోధన?” అన్నాడు తీక్షణంగా.

ఉదాసీనంగా అతనివంక చూసిన ఆ యువకుడు తల అడ్డంగా ఊపుతూ “నిజమే. ఇది నీ తప్పు కాదుగా. తప్పు నాదే. మళ్ళీ పుట్టడమే నేను చేసిన తప్పు” అని ముందుకు కదిలాడు.

హటాత్తుగా సదాశివం మదిలో ఏదో ఆలోచన మెదిలింది. ‘సదా అని పిలిచాడేంటీ. నాకు తెలిసిన, నన్ను తెలిసిన వాళ్ళందరూ అంటే శివం అంటారు లేకుంటే సదాశివం అని పూర్తి పేరుతో పిలుస్తారు. కేవలం నాన్న మాత్రమే సదా అని పిలుస్తాడు’ అనుకుని మళ్ళీ ఉలికిపడ్డాడు. అప్పటికే ఆ యువకుడు వీధి చివరికి వెళ్ళిపోయాడు.

‘వాడేదో గొణుక్కుంటూ వెళ్ళాడు. మళ్ళీ పుట్టడమే నేను చేసిన తప్పు అన్నట్టు వినబడింది. అంటే.. నాన్న!.. నాన్న మళ్ళీ పుట్టాడా? నిజమా!’ తనలోని ఉత్సుకతను అణచుకోలేక “ఓ అబ్బాయ్” అంటూ గట్టిగా అరిచాడు. కానీ అప్పటికే ఆ యువకుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. చేతిలోని పార్సిల్‌తో చిత్తభ్రమ కలిగినవాడిలా లోపలికి వచ్చిన భర్తను గాభరాగా చూసింది భార్య వైదేహి. “ఏమైందండీ, ఎందుకలా ఉన్నారు?” అనడిగింది గబగబా.

ఐతే అతనిలో చలనం లేదు. శూన్యంలోకి చూస్తూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు.

వైదేహికి ఏం చెయ్యాలో తోచలేదు. “ఒరేయ్, శంకర్. మీ నాన్న చూడరా ఏదోలా ఉన్నారు” అంటూ అరిచింది. అప్పుడే స్నానం చేసి వచ్చిన శంకర్ తండ్రి వంక చూశాడు.

మతి భ్రమించిన వాడిలా కూర్చున్న తండ్రిని చూసి “ఏమైందమ్మా?” అనడిగాడు.

“ఏమోరా. స్విగ్గీ పార్సిల్ తీసుకుని లోపలికి వచ్చారు. లోపలికి రావడమే ఇలాగే వచ్చారు” అన్నది వైదేహి ఆందోళనగా నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ.

తండ్రి పక్కన కూర్చుని అతన్ని పట్టి కుదుపుతూ “నాన్నా. ఏమైంది?” అన్నాడు శంకర్. అంతలో శంకర్ పదేళ్ళ కూతురు, సదాశివం మనవరాలు జాహ్నవి కూడా అక్కడికి వచ్చింది.

“తాతయ్యా. ఏమైంది?” అంటూ అతని గడ్డం పట్టుకుని కుదిపింది.

అందరివంకా ఒకసారి చూసి “మా నాన్న మళ్ళీ పుట్టాడురా” అన్నాడు నిదానంగా.

తల్లీ కొడుకులిద్దరూ ఉలిక్కిపడ్డారు. జాహ్నవికి సదాశివం చెప్పిన విషయం అర్థంకాక తదేకంగా వాళ్ళందరివంక చూసింది.

“ఏం మాటలవి? తాతయ్య మళ్ళీ పుట్టడమేంటీ? ఈ కాలంలో పునర్జన్మ కాన్సెప్టా?”

“అదేంటండీ. మామగారు మళ్ళీ పుట్టారా?” వైదేహి కూడా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది.

“మీరెక్కడ చూశారు?” అడిగాడు శంకర్.

“ఇందాక స్విగ్గీ డెలివరీకి వచ్చిన అతనేరా” అన్నాడు ఇంకా భ్రమించినవాడిలా చూస్తూ.

“నాన్సెన్స్. వాడేదో అన్నాడని మీరెందుకిలా అయ్యారు. సంథింగ్ రాంగ్. వాడెవడో చెప్పండి. ఎందుకిలా చేస్తున్నాడో కనుక్కుంటాను. పునర్జన్మట పునర్జన్మ” శంకర్ కోప్పడ్డాడు.

అంతటితో ఆగక తండ్రి మొబైల్ తీసుకుని అందులో అంతక్రితం వచ్చిన స్విగ్గీ ఫోన్ నంబర్‌కు మళ్ళీ డయల్ చేశాడు. ఐతే ఏవిధమైన ప్రతిక్రియ రాలేదు. ‘మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు’ అన్న మాటలు వినిపించాయి.

“ఇదేంటీ. ఈ ఫోన్ నంబర్ నుంచే కదా రింగ్ వచ్చింది. ఇప్పుడు ఉపయోగంలో లేదని వస్తూంది. ఇదెలా సంభవం? ఎలాగైనా ఆ డెలివరీ బాయ్ వివరాలు కనుక్కోవాలి” అంటూ మళ్ళీ ఈసారి స్విగ్గీ కస్టమర్ కేర్‌కు డయల్ చేశాడు శంకర్.

అప్పటికి తేరుకున్న సదాశివం వెంటనే కొడుకు చేతిలోనుంచి ఫోన్ లాక్కుని కట్ చేసి “ఇప్పుడీ పనెందుకు? ఐనా మరోసారి ఏదైనా ఆర్డర్ చేస్తే మళ్ళీ వస్తాడు కదా” అన్నాడు.

“ప్రతీసారీ వాడే వస్తాడన్న గ్యారెంటీ ఉండదు” అన్నాడు శంకర్.

“ఫరవాలేదు. ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేద్దాం. నిజంగా నాన్నే ఐతే ఈ స్విగ్గీ డెలివరీ లేకుండానే మళ్ళీ తప్పకుండా వస్తాడు”

“అలా కాదు నాన్నా. కనీసం పోలీసులకు ఇన్ఫామ్ చేద్దాం”

“ఏమని చేస్తావు? మనదగ్గర్నుంచేమైనా లాక్కెళ్ళాడా? మనల్నేమైనా మోసం చేశాడా?”

శంకర్ మాట్లాడలేదు. కాస్సేపటికి “ఏమో ప్రస్తుతం నీ మనసులో ఇలాంటి ఆలోచన రేకెత్తించి, తరువాత సెంటిమెంటల్‌గా బ్లాక్ మెయిల్ చేసే అవకాశముందిగా” అన్నాడు.

తల అడ్డంగా ఊపిన సదాశివం “వదిలెయ్యండని చెప్పానుగా. మళ్ళీ అతను తారసపడితే అప్పుడు చూసుకుందాం” అన్నాడు అలాగే శూన్యంలోకి చూస్తూ.

పదేళ్ళ జాహ్నవి అందరివంకా మార్చి మార్చి చూస్తూంది అయోమయంగా.

వైదేహికి మనసులో భయం గూడుకట్టుకుంది. అపరిచితుడు మామగారిలా రావడం ఎలా సాధ్యమనేదే అర్థమవ్వలేదు.

***

రెండు రోజులు గడిచాయి. సదాశివం ఇంకా క్రితం జరిగిన సంఘటన మర్చిపోలేదు. తలుపు ఏ మాత్రం చప్పుడైనా మళ్ళీ అతనే వచ్చాడేమోనని భావిస్తున్నాడు.

శంకర్ మాత్రం ఆ విషయం అప్పుడే మర్చిపోయాడు. వైదేహి కూడా మర్చిపోయింది. ఐతే మరో రెండు రోజులు గడిచాకగానీ మళ్ళీ మామూలు స్థితికి రాలేకపోయాడు సదాశివం.

మరుపు మనిషికి లభించిన అద్భుతమైన వరం. గతాన్నంతా మర్చిపోయి స్విగ్గీలో ఏదో ఆర్డర్ చేశాడు శంకర్. సుమారు అరగంట గడిచాక కాలింగ్ బెల్ మోగింది. సదాశివం తలుపు తీశాడు. తలుపు తీసి చూస్తే ఎదురుగా క్రితం వారం వచ్చిన అదే వ్యక్తి!

“నువ్వా?.. మీరా?” అంటూ అయోమయంలో కీచుగా అరిచాడు సదాశివం. అంతటితో ఆగక “నాన్నా శంకర్. తొందరగా రా” అంటూ కేకపెట్టాడు.

శంకర్, వైదేహి పరుగుపరుగున వచ్చారు.

“ఇదుగో మళ్ళీ వచ్చాడు” అన్నాడు సదాశివం. అతనివంక ఎగాదిగా చూశాడు శంకర్.

“అరె. మర్చిపోకుండా నా పేరే నా మనవడికి పెట్టావన్న మాట” అన్నాడా వ్యక్తి.

శంకర్‌కు అప్పుడు షాక్ తగిలినట్టైంది. అంటే అతని పేరు శంకర్ అని అర్థమైంది. ఇదేదో నిజంగానే పునర్జన్మ కథా, లేకపోతే భవిష్యత్తులో జరిగే దోపిడికి పునాదిగా జరిగే సంఘటనా అని ఆలోచించ సాగిందతని మెదడు.

“ఇల్లూ వాకిలీ పిల్లా పాపలతో నిండుగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందిరా సదా. ఇంతకన్నా ఇంకేం కావాలి. ఇలా చూసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు” అన్నాడు పార్సిల్ అందిస్తూ.

“ఏయ్. ఏయ్. ఏంటా మాటలు. అసలు నువ్వెవరు? మా ఇంటి విషయాలు నీకెలా తెలుసు?” అంటూ మీదికొచ్చాడు శంకర్.

“ఆగరా మనవడా. ఇప్పుడు నేనేమన్నానని. మీరిలా ఆనందంగా ఉండడం నాకు సంతోషంగా ఉందన్నాను. అదీ నిజమేలే. ఈ జన్మలోని బంధాలే తెంపేసుకుంటున్న ఈ కాలంలో గతజన్మ బంధాల కోసం పాకులాడడం, అంగలార్చడం సమంజసం కాదుగదా. ఉంటాను” అంటూ బయలుదేరాడతను. కాళ్ళీడ్చుకుంటూ నిదానంగా వెళ్తున్న ఆ యువకుడిని కన్నార్పకుండా చూశాడు శంకర్.

“నాన్నా. ఎందుకైనా మంచిది, మనం పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేద్దాం” అన్నాడు.

“వద్దురా. ఏమని ఇవ్వాలి. ఇతనెవరో ఎందుకిలా చేస్తున్నాడో తెలీదు. పైగా మనకేమీ అపకారం తలపెట్టలేదు కదా. ఏదైనా ఆపద వచ్చినప్పుడు చూసుకుందాం” అంటూ వారించాడు సదాశివం.

“అంటే వచ్చే ఆపద కోసం కాచుకుని కూర్చుంటామా?” అన్నాడు. అంతటితో శంకర్ ఊరుకోక తీవ్రమైన ఆలోచనలో మునిగాడు. అలా ఆలోచిస్తూండగా హటాత్తుగా అతనికో అనుమానం వచ్చింది. పోలీసుల దగ్గరికి వెళ్ళేముందు తనకున్న ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నాడు.

వెంటనే తల్లి దగ్గరికెళ్ళి, “అమ్మా, మనింట్లో ఉండే పాత పుస్తకాలన్నీ ఈ మధ్యన నువ్వేమైనా పాత పేపర్ల వాడికి వేసేశావా?” అనడిగాడు.

“ఈ మధ్యన అంటే రెండు వారాల క్రితం వేసుంటాను. ఎందుకురా?” అనడిగింది.

కొద్దిగా ఆలోచిస్తూ, “తాతయ్యకు డైరీ రాసే అలవాటుండేది కదా. ఆయన పాత డైరీలేవన్నా ఉండిఉంటే వాటిని కూడా వేసేశావా?” అన్నాడు.

“తాతయ్య డైరీ పాతది ఒకటి మాత్రమే ఉండేది. అది బాగా జీర్ణించుకు పోయినందువల్ల దాన్ని వేసెయ్యాలనే అనుకున్నాను. వేసిన వాటిల్లో అది ఉందేమో గుర్తులేదు. ఎందుకు అడుగుతున్నావు?”

“అవన్నీ నాన్ననడిగే వేశావా. లేకుంటే పాతబడ్డాయని నీ అంతట నువ్వే వేసేశావా?”

“ఆయన వెయ్యమంటేనే వేశాను. విషయం చెప్పరా”

“ఈ డైరీ రాయడమనే అలవాటు ఒక విధంగా మంచిది మరో విధంగా చాలా చెడ్డది. అందులో రాసిన విషయాలు మనం మర్చిపోతాం కానీ దాన్ని చూసిన వాళ్ళెవరైనా మన గురించి ఇట్టే అంచనా వేసేస్తారు. దానివల్ల లేనిపోని అనర్థాలు జరిగే అవకాశముందని నా అనుమానం. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండొచ్చనుకుంటున్నాను. వాడి చేతికి ఆ తాతయ్య డైరీ దొరికుంటుంది. దాన్ని పట్టుకుని వాడీ పనులన్నీ చేస్తున్నాడు. ముందు ఇలాగే అమాయకంగా ఏమీ పట్టనట్టుగానే ఉంటాడు. కొన్నాళ్ళయ్యాక దాన్ని మనకు వ్యతిరేకంగా మనల్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఉపయోగించుకుంటాడు”

వైదేహి అయోమయంగా కొడుకువంక చూసింది. ఆమె మనసులో ఏదో భయం మొదలైంది. “ఐతే ఇప్పుడేమంటావురా. ఒకవేళ ఆ డైరీ వాడికి దొరికుంటే ఎలా?” అన్నది.

“తప్పదు. పోలీసులకు చెప్పాల్సిందే. వాళ్ళ సహాయంతోనే ఆ డైరీ ఏదైనా ఉంటే మనం దాన్ని దక్కించుకోవాలి. లేకపోతే ఎప్పటికైనా అది ప్రమాదమే”

శంకర్ మనసు మనసులో లేదు. ఇదమిత్థంగా ఏ నిర్ణయానికీ రాలేక పోతున్నాడు.

‘ఇన్నాళ్ళూ ప్రశాంతంగా గడిచిన జీవితం హటాత్తుగా ఈ మలుపులేమిటి? ఈ వయసులో నాన్నకు ఈ ఇబ్బందులేమిటి? నిజంగానే ఆ పాత డైరీ ఏదైనా వాడి చేతికి దొరికిందా? ఈ పునర్జన్మ కథా కమామీషు ఏమిటి? అసలీ పునర్జన్మ గాడెవడు?’ అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు.

సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో వీధిలో “పాత పేపర్లు, పుస్తకాలు కొంటాం” అన్న అరుపు వినబడింది. వెంటనే వైదేహి పరుగున వచ్చి చూసింది.

‘వీడే. వీడికే పాత పేపర్లు వేసింది. వీణ్ణడిగితే ఏమైనా తెలుస్తుందేమో చూడాలి’ అనుకుంటూ “ఒరేయ్ శంకర్. వీడికేరా నేను పాత పుస్తకాలు వేసింది. వీణ్ణడిగితే తెలిసిపోతుంది” అన్నది.

వెంటనే శంకర్ ఒక్కంగలో వీధిలోకి చేరుకుని వాణ్ణి ఆపి “బాబ్బాబూ, కొద్దిరోజుల క్రితం పాత పేపర్లన్నీ నీకు వేశాం. అందులో డైరీ ఏదైనా ఉన్నదా?” అనడిగాడు.

వాడు శంకర్ వంక ఎగాదిగా చూసి “నాకెలా గుర్తుంటుంది బాబూ. అవేవీ ఉంచుకోను. ఏరోజుకారోజు నేను కూడా వాటన్నింటినీ తీసుకెళ్ళి కొట్లో వేసేస్తాను” అన్నాడు.

అలా అన్న కాస్సేపటికే “అరెర్రే, ఔను ఔను. గుర్తొచ్చింది. ఆ పేపర్లతోబాటు ఒక పాత డైరీ కూడా వచ్చింది. ఇంచుమించు చినిగిపోయే స్థితిలో ఉన్న ఆ పుస్తకాన్ని ఎవరో ఒకబ్బాయి తీసుకుని వెళ్ళాడు. ఆ ఒక్క పుస్తకానికే నాకు యాభై రూపాయలిచ్చాడు” అన్నాడు ఆనందంగా. శంకర్ ముఖం వికసించింది.

వెంటనే లోపలికి పరుగు తీసి “అమ్మా, నా అనుమానం నిజమే. ఈ స్విగ్గీగాడే ఆ పుస్తకాన్ని తీసుకున్నాడట. అది తీసుకుని అందులోని సమాచారమంతా బట్టీబట్టి మనల్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకే వస్తున్నట్టుంది. ఈసారి రానీ చెప్తాను. వెంటనే పోలీసులకు పట్టిస్తాను” అన్నాడు వీరావేశంగా.

కాస్సేపటికి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే ఎదురుగా ఆ యువకుడు!

“ఏయ్. మళ్ళీ ఎందుకొచ్చావు?” అంటూ అరిచాడు సదాశివం.

ఆ యువకుడి చేతిలో పుస్తకం. పాత డైరీ.

అది చూడగానే “ఈ డైరీ నీచేతికెలా వచ్చింది?” అన్నాడు కీచుగా.

“ఇంతటి విలువైన వస్తువును పాత పుస్తకాల వాడికి వేసేందుకు మనసెలా వచ్చిందిరా” అన్నాడా యువకుడు దీనంగా. అంతలో కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చారు. అందరికన్నా వెనకగా జాహ్నవి వచ్చింది. ఆ అమ్మాయి అతనివంక తదేకంగా చూడసాగింది. అతను అందరివంకా పరిశీలనగా చూసి తృప్తిగా నిటూర్చాడు.

అతని చేతిలోని డైరీ చూసిన శంకర్ “నాన్నా. అదుగో. అది తాతయ్య డైరీయే కదా. అందులో ఉన్న విషయమంతా బట్టీబట్టి మనల్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి చూస్తున్నాడు” అన్నాడు శంకర్.

“అదేమిట్రా. నా బిడ్డలతో నేనలా ఎందుకు ప్రవర్తిస్తాను? దీన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్పి పోవడానికే వచ్చాను. అన్నట్టు రాజమహేంద్రంలోని పాత ఇల్లు అమ్మేశారా?” అన్నాడు.

ఇక ఉండబట్టలేక శంకర్ పోలీసులకు ఫోన్ చేయగా అరగంటలో ఎస్సై వచ్చాడు.

పరిస్థితిని క్లుప్తంగా వివరించి “వీణ్ణి మీ స్టైల్లో విచారించండి సార్. అప్పుడే నిజం చెప్తాడు. పునర్జన్మ అంటూ వారం రోజులుగా ఒకటే టార్చర్” అన్నాడు శంకర్ అసహనంగా.

సదాశివం మాత్రం ఇబ్బందిగా చూశాడు ఆ యువకుడి వంక. చాలా దీనంగా ఉన్నాయతని చూపులు. అతనిది తన తండ్రి పేరే. అదే పేరు తన కొడుక్కు పెట్టుకున్నాడు.

అతని మనసులో ఎక్కడో కించిత్ బాధ కలుగుతూంది. అదే సమయంలో ఈ పునర్జన్మ అన్న మాటలు నమ్మేట్టుగా కూడా లేవు.  వచ్చిన ఎస్సై ఆ యువకుడిని లాక్కెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ అందరివంకా దీనంగా చూశాడతను.

“తాతయ్యా. ఎందుకలా అతన్ని లాక్కెళ్తున్నారు?” అంటూ అడిగింది జాహ్నవి అమాయకంగా.

“అతను తప్పు చెయ్యాలని చూస్తున్నాడమ్మా. అందుకే వాళ్ళు వాణ్ణి తీసుకెళ్ళి బాగా బుద్ధి చెప్తారు. ఇంకోసారి మళ్ళీ తప్పు చెయ్యడు” అన్నాడు శంకర్ జవాబుగా.

సదాశివం మనసంతా కకావికలమైంది. ఎందుకిలా జరుగుతూంది. ఈ పునర్జన్మ గురించి గతంలో కూడా చాలామందికి అనుభవమైంది. పదేళ్ళ పిల్లవాడు గతజన్మ వివరాలన్నీ చెప్పడం, నాలుగేళ్ళ పాప గతజన్మలోని తన సంతానాన్ని గుర్తించడం వంటి వార్తలు సుమారుగానే వచ్చాయి. ఐతే ఇప్పుడు స్వయంగా తనకే అలా జరగడంతో అతని మనసు అల్లకల్లోలమైంది. నమ్మాలా వద్దా అన్న మీమాంస మనసును పట్టి పీడిస్తూంది. పోనీ ఎవరైనా సిద్ధాంతిని పునర్జన్మలంటూ ఉంటాయా ఉండవా అన్న విషయాలన్నీ వివరంగా అడిగి తెలుసుకుంటే బాగుంటుందేమో అని కూడా అనిపించింది.

కొడుకు శంకర్ మాత్రం “హబ్బ, ఒక పెద్ద సమస్య తీరింది. నాన్నా. ఇక నిశ్చింతగా ఉండొచ్చు. రేపీపాటికి ఆ ఎస్సై వాణ్ణి ఒక దారికి తెస్తాడులే. మళ్ళీ వాడు మనింటి ఛాయలకే రాడు” అన్నాడు.

సదాశివం ఉదాసీనంగా ఉన్నాడు. ఎస్సై వచ్చి ఆ యువకుడిని పట్టుకెళ్ళాక దిగులు మరింత అధికమైంది సదాశివంకు. పైగా అతన్ని లాక్కెళ్ళిన తీరు మరింతగా బాధించింది. వైదేహి కూడా భర్తను అంత నిస్సహాయంగా ఎప్పుడూ చూడలేదు. ఆమె మనసులో కూడా ఆందోళన చోటు చేసుకుంది.

***

“ఏరా, ఈ డైరీ చదివేసి వాళ్ళింటికెళ్ళి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేద్దామనుకున్నావా?”

నవ్వేశాడా యువకుడు.

“నవ్వుతావేంట్రా. వేళాకోళంగా ఉందా?”

“ఎస్సై గారూ. నేను చేసిన తప్పేమిటో చెప్తారా?” అడిగాడా యువకుడు.

ఉలికిపడ్డాడు ఎస్సై. ‘అవునూ. ఇంతకూ ఇతను చేసిన నేరమేమిటి? తనకు గత జన్మ గుర్తొచ్చింది. దాని తాలూకు జ్ఞాపకాలను తన అనుకున్నవాళ్ళతో పంచుకోవాలనుకున్నాడు. ఏ విధంగా చూసినా ఇది నేరం కాదే. నేను తొందరపడ్డానా’ అన్న ఆలోచనలో పడ్డాడతను.

“ఎస్సై గారూ. నా స్థానంలో మీరుండి ఉంటే గత జన్మ జ్ఞాపకాలు ఎంత భయంకరమైనవో, మనం ఎంతటి నరకయాతన అనుభవిస్తామో అర్థమౌతుంది. నా అనుకున్న వాళ్ళు మనల్ని నమ్మరు. వాళ్ళను కళ్ళెదురుగా ఉంచుకుని నన్ను నేను నిరూపించుకోలేని పరిస్థితుల్లో నా మనసు ఎంత క్షోభకు గురౌతుందో తెలుసా? ఐనా ఇది నేను కావాలని కోరుకున్నది కాదండీ. వారం క్రితం మా ఇంట్లోని పాత పుస్తకాలన్నీ షాపులో వేసేద్దామని వెళ్తే అక్కడ ఈ డైరీ కనిపించింది. దీన్ని చూడగానే మనసంతా అదోలా అయింది. డైరీ చేతిలోకి తీసుకోగానే ఏదో విద్యుత్ ప్రవహించినట్టైంది. పాతికేళ్ళ క్రితం మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. నా వాళ్ళనుకుని వెదుక్కుంటూ అక్కడికి వెళ్తే ఇక్కడి అడ్రస్ ఇచ్చారు. ఐనా ఇవన్నీ మీకు చెప్తే అర్థం కావులెండి. మీరేం చెయ్యదల్చుకున్నారో చెయ్యండి. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను” అంటూ ఆపాడా యువకుడు. ఎస్సై తల విదిలించాడు.

***

ఆరోజు రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతానికి సదాశివం ఉలికిపడి లేచాడు. లోపల శంకర్ గదినుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

పక్కనే వైదేహి గాఢ నిద్రలో ఉంది. సదాశివం మెల్లగా లేచి వెళ్ళి చూశాడు. శంకర్ అతని భార్య ఇద్దరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఐతే పక్కనే ఉన్న మరో పక్కమీద పడుకుని ఉన్న జాహ్నవి మాత్రం ఏవో మాట్లాడుతూంది. కలవరింత లాగుంది.

మెల్లగా ఆ పాపను సమీపించాడు సదాశివం. గదిలో లైట్ వేసి ఫ్యాన్ స్పీడ్ తగ్గించడంతో మాటలు కొద్దిగా స్పష్టంగా వినిపించసాగాయి. మాటలు జాగ్రత్తగా విన్న సదాశివం నిర్ఘాంతపోయాడు. వెంటనే కొడుకును లేపాడు.

“..ఒరేయ్ శివుడూ. శంకరాన్ని వదిలెయ్యమని ఆ ఎస్సైకి చెప్పరా. వాణ్ణి ఇబ్బంది పెట్టొద్దని చెప్పరా. వాడేం తప్పు చేశాడు. నిన్ను కనడమేనా వాడు చేసిన తప్పు? నీకిష్టం లేకపోతే ఇంటికి రావద్దని చెప్పు అంతేగానీ కొట్టించడమేంటీ. ఐనా తప్పు తెలుసుకోకుండా శిక్ష వేసేస్తారా పోలీసులు?.. వాళ్ళు పోలీసులా రాక్షసులా. అసలు వాడు నీకేదైనా అపకారం చేశాడా?”  అంటూ కలవరిస్తూంది జాహ్నవి.

సదాశివం కవరపాటుగా “బాబూ శంకర్. నన్ను మా నాన్న మాత్రమే సదా అని పిలిచేవాడని తెలుసుకదా. అలాగే నన్ను శివుడూ అని పిలిచేది మా నాన్న చెల్లెలు, అంటే మా మేనత్త జాహ్నవి మాత్రమేరా. మా మేనత్త పోయిన నెల రోజులకు మీ పాప పుట్టింది. ఆమె జ్ఞాపకార్థం ఆ పేరే పాపకు పెట్టాం, జాహ్నవి అని. ఒరేయ్. ఏం జరుగుతూందిరా మన చుట్టూ. ఇదంతా నిజమేనా. నమ్మాలా వద్దా? నాకేదో భయంగా ఉందిరా. అనవసరంగా ఆ డెలివరీ బాయ్‌ని పోలీసులకు అప్పగించాం” అన్నాడు.

“అంటే గత జన్మ జ్ఞాపకాలు నిజమేనంటారా నాన్నా?” అన్నాడు భయంగా.

“ఏమో చెప్పలేం. ఏమైనా తెల్లవారగానే ముందుగా స్టేషన్‌కు ఫోన్ చేసి అతన్ని వదిలెయ్యమని ఆ ఎస్సైకి చెప్తే చాలు. మనమింకేమీ చెయ్యనక్కర్లేదు. గత జన్మను గురించి ఆలోచించడం నాక్కూడా భయంగానే ఉంది. ఏం చేద్దాం”

***

“హలో ఎస్సై గారూ. నేను శంకర్ మాట్లాడుతున్నాను. నిన్న పట్టుకెళ్ళారు గదా, డెలివరీ బాయ్, శంకర్. అతన్ని వదిలెయ్యండి సర్. ప్లీజ్. ఏదో అనవసరమైన కన్ఫ్యూజన్‌లో అలా జరిగింది” అన్నాడు.

“మీరా. నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. అతని కథంతా నిన్న రాత్రే విన్నాను. అతను చెప్పినదంతా నిజమనే నమ్మాల్సి వస్తూంది. ఐనా కేవలం అనుమానం మీద ఎవరినీ పట్టి ఉంచలేమండీ. అందుకే అప్పుడే వదిలేశాను. మరో ముఖ్యమైన విషయం, అతనే మీకు చెప్పమన్నాడు. ఇక ఎప్పటికీ మీ ఇంటి ఛాయలకు రాడట. మిమ్మల్ని నిశ్చింతగా ఉండమన్నాడు. మీరంతా సుఖంగా ఉంటే చాలని తన ఆశీస్సులు ఎప్పటికీ మీకుంటాయని చెప్పి వెళ్ళి పోయాడు. పాతికేళ్ళ కుర్రాడు, ఎనభై ఏళ్ళ వృద్ధుడి లాగా మాట్లాడుతూంటే నాకే ఏదోలా అనిపించింది. అతని మాటలు నమ్మవచ్చేమో అనిపించింది. ఐనా ఇదంతా మీ స్వీయ నిర్ణయాలు. ఇటువంటి విషయాల్లో ఎవరినీ బలవంత పెట్టలేం. ఉంటాను” అంటూ ఫోన్ పెట్టేశాడు ఎస్సై. స్పీకర్ ఫోన్‌లో ఆ మాటలన్నీ సదాశివం కూడా విన్నాడు. అతని మనసంతా వికలమైంది. శంకర్ వైదేహిల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.

అప్పుడే లోపల్నుంచి పరుగెత్తుకుంటూ వచ్చింది జాహ్నవి. ఆ పాపను చూసిన తండ్రీ కొడుకుల ముఖ కవళికలు మారిపోవడం వైదేహి దృష్టిని దాటి పోలేదు. వాళ్ళ చూపులకర్థం అర్థం కాలేదు. వైదేహి మాత్రం భర్త కళ్ళల్లో అభిమానం పొంగడం గమనించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here