శ్రీవర తృతీయ రాజతరంగిణి-33

4
4

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ సర్గ

కరుణాకులియో రాజా స్వధాన్త్యైః పుత్రవత్ ప్రజాః।
పోపయామాస మాసేపు కేపుచిద్ యావదాకులాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 28)

దయాళువైన ప్రభువు ప్రజల కడగండ్లు చూసి తల్లడిల్లిపోయాడు. కరువు కాటకాలతో బాధపడుతున్న ప్రజలను కన్న బిడ్డల్లా భావించి, స్వధాన్యంతో వారి కడుపు నింపాడు. కొన్ని నెలలు వారికి ఆహారాన్ని అందించాడు.

భారతదేశ చరిత్రలో కరువు కాటకాలు కొత్తవేమీ కాదు. క్రమం తప్పకుండా వచ్చే కరువు పరిస్థితి ఎదుర్కొనేందుకు కౌటిల్యుడు సూచనలు చేశాడు. కోటలు కట్టాలి. నీటి వనరులను ఏర్పాటు చేయాలి. ఇదంతా ప్రజల అందుబాటులోకి తేవాలి. ఏ రాజయితే కరవు కాటకాల పరిస్థితిలో ప్రజలను పట్టించుకోడో ఆ రాజును అధికారం నుంచి తొలగించాలి.

చారిత్రకంగా కూడా కరువు సమయంలో రాజులు ఆహారధాన్యాలను పంచేవారు. పన్నులను తగ్గించేవారు. సామూహిక వంటశాలలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారాన్ని అందించేవారు. వీటికి తోడుగా నీటి వనరులపై దృష్టి పెట్టేవారు. బావులు తవ్వించేవారు. ఆహారధాన్యాన్ని దాచుకునే ధనవంతులపై దాడి చేసి వారి నిల్వలను కొల్లగొట్టి ప్రజలకు పంచిపెట్టలని సూచించాడు కౌటిల్యుడు. ఇపుడు ‘విప్లవం’గా, ధనవంతులను కొల్లగొట్టి పేదలకు పంచాలని  వామపక్షాల వారు చేస్తున్న ప్రచారానికి స్పష్టమైన రూపును ఆనాడే కౌటిల్యుడు అందించాడు.

అయితే భారతదేశంలో ఇస్లామీయుల పాలనలలో కరువు కాటకాల సమయంలో రాజులు సరిగ్గా పట్టించుకునేవారు కాదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కరువు కాటకాల సమయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదు. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరువు కాటకాల సమయంలో మనుషులు ఆకలికి తాళలేక ఒకరినొకరు పీక్కుని తినేవారని అబ్దుల్-ఖాదిర్ బదాయుని రాశాడు.

కశ్మీరులో సైతం 16వ శతాబ్దం తరువాత, అంటే, ముఘలులు, అఫ్ఘన్లు పాలించిన కాలంలో ఘోరమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుల్తానులు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేకపోయారు.

బ్రిటీష్ పాలన కాలంలో కరువు కాటకలకు కొదువ లేదు. 1850 నుండి 1899 నడుమ సంభవించిన 24 పెద్ద కరువుల్లో 15 మిలియన్ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1770లో బెంగాల్ కరువులో దాదాపుగా 10 మిలియన్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అంచనా.

కరువు కాటకాలకి కొదువ లేని దేశం కాబట్టి భారతీయ ధర్మసూత్ర నిర్మాతలు, కరువు పరిస్థితులలో ప్రజలను కన్నబిడ్డలుగా భావించి వారికి రాజు సహాయ సహకారాలు అందించాలన్న నియమం విధించారు. అందుకే కరువు పరిస్థితిలో భారతీయ రాజులు త్వరగా, నిర్ణయాత్మకంగా స్పందించటం కనిపిస్తుంది. 1791-92 నాటి దోజి బారా కరువులో పీష్వా రెండవ సవాయ్ మాధవరావు నిర్ణయాత్మకంగా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దాడు.

కశ్మీరులో జైనులాబిదీన్ భారతీయ రాజులలాగే దయతో, జాలితో వ్యవహరించటం, ప్రజలను కన్నబిడ్డలుగా భావించి వారికి ధాన్యపు రాశుల ద్వారాలు తెరవడం కనిపిస్తుంది. జైనులాబిదీన్ ఇలా వ్యవహరించటం వెనుక అతని మౌలిక స్వభావంలోని మంచితనానికి, భారతీయ పండితుల సంపర్కం తోడయిందని ఊహించటం కష్టం కాదు.

జైనులాబిదీన్ సమర్థంగా కరువు పరిస్థితిని ఎదుర్కోవటాన్ని తవాకత్ అక్బరీ కూడా ప్రస్తావించింది. ‘కశ్మీరులో తీవ్రమైన కరువు కాటకాల పరిస్థితులు సంభవించాయి. ఆహరం లభించక ఆకలితో ప్రజలు పెద్ద సంఖ్యలో మరణించారు. అందుకని సుల్తాన్, ఆహార ధాన్యాలను పేద ప్రజలకు, ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టాడు’.

ఈ వర్ణనలో ఒక గమ్మత్తును గమనించవచ్చు.

శ్రీవరుడి వర్ణనలో జైనులాబిదీన్ దయాళువు, ప్రజల కష్టాలు చూడలేకపోయాడు. ప్రజలను కన్నబిడ్డల్లా భావించాడు. స్వధాన్యం ప్రజలకు అందించాడు.

కానీ పర్షియన్ రచయితలు జైనులాబిదీన్ దయాళువు అని పొగడలేదు. ఎలాంటి విశేషణాలు వాడలేదు. కరువు కాటకాల పరిస్థితిలో ప్రజలకు ఆహారం పంచిపెట్టాడు అని మాత్రం రాశారు.

సుల్తాన్ జైనులాబిదీన్‍ చర్యను శ్రీవరుడు అంతగా పొగడటానికి, పర్షియన్ రచయితలు ఉదాసీన వైఖరి ప్రదర్శించటానికి ప్రధానంగా ఒక కారణం తోస్తుంది.

శ్రీవరుడి దృష్టిలో జైనులాబిదీన్ దేవుడు. విష్ణుమూర్తి. దయాళువు. అతడి దయ వల్ల కశ్మీరు వదిలి వెళ్ళిన కాఫిర్లంతా కశ్మీరు తిరిగి వచ్చారు. సురక్షితంగా ఉన్నారు. ఇస్లామీయుల దైవాన్ని నమ్మని  ద్వితీయ శ్రేణి పౌరులలా కాక ఇస్లామీయులతో సమానంగా గౌరవాభిమానాలు పొందారు. ఉన్నత పదవులు నిర్వహించారు. ఇది ఇస్లామీయులకు నచ్చలేదు.

ఇస్లామీయుల ప్రకారం ‘అల్లాహ్’ని నమ్మనివాడు, ఉపవాసం ఉండనివాడు, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయనివాడు ‘కాఫిర్’. ‘కాఫిర్’ అంటే ‘నమ్మనివాడు’ అని అర్థం. అలాంటి కాఫిర్ ‘అశుభ్రం’.

‘నమ్మని వాడి’ శరీరమంతా మలినాల మయం. అతని వెంట్రుకలు, గోళ్ళు, శరీరం లోని తేమ సర్వం మలినమైనది. అలాంటి వారికి దైవాన్ని నమ్మినవారితో సమానమైన స్థాయిని ఇవ్వటం – ఆగ్రహాన్ని, ద్వేష భావాన్ని కలిగించటం స్వాభావికం. అందుకే పర్షియన్ రచయితలు జైనులాబిదీన్ గురించి రాశారు, కానీ అతని గొప్పతనం గురించి రాయలేదు ఎక్కువగా. ఒక రకమైన ఉదాసీనతను ప్రదర్శించారు. అది కరువు వర్ణన విషయంలోనూ వర్తిస్తుంది. అందుకే శ్రీవరుడు అంత గొప్పగా వర్ణించిన జైనులాబిదీన్‌ను పర్షియన్ రచయితలు మామూలుగా ప్రస్తావించారు. పర్షియన్ రచయితలను ప్రామాణికంగా తీసుకున్న భారతీయ చరిత్ర రచయితలు జైనులాబిదీన్‍కు అంత ప్రాధాన్యతనివ్వలేదు. ఫలితంగా ‘జైనులాబిదీన్’లా నిజాయితీగా కాక, రాజకీయ కారణాల వల్ల పరమత సహనాన్ని ప్రదర్శించిన ‘అక్బర్’ గొప్ప రాజుగా చరిత్రలో నిలబడ్డాడు. జైనులాబిదీన్ అక్బర్ నీడలో ఒదిగాడు.

తావదస్వైవ మాహాత్మ్యాత్ సస్యసంపదూయజృంభత్।
సత్యవ్రతానం భూపానం క్కావకాశ్చిరం శుచామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 29)

సత్యవ్రతులైన రాజుల శోకం తాత్కాలికమే, చిరకాలం నిలవదు. కొద్ది కాలానికి కశ్మీరులో పంటలు పుష్కలంగా పండాయి.

‘ప్రజాపుణ్యైః సంభవంతి మహీభుజాః’ అంటాడు కల్హణుడు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్నది మనకు అలవాటు. ప్రజల పుణ్యం కొద్దీ రాజు అన్నా; రాజు ఎలాంటి వాడయితే ప్రజలు అలాంటి వారవుతారు అన్నా భావం ఒక్కటే. ఇక్కడ ప్రజల పుణ్యం కొద్దీ వారికి జైనులాబిదీన్ లాంటి రాజు దొరికాడని అనుకోవచ్చు.

మన్యేథవా విధిర్భూహ కారుణ్య ప్రథనేచ్ఛయా।
దౌర్భిక్ష్య దౌశ్యాద్ భూలోకం సశోకమకరోత్ తదా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 30)

మేఘాలకు నీరు అందివ్వకుండా సముద్రం కశ్మీరంలో కరువుకు కారణమయింది. ఎందుకంటే ఇలాంటి దుర్భిక్షమైన పరిస్థితులు కల్పిచటం ద్వారా జైనులాబిదీన్ గొప్పతనాన్ని, మానవత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శించేందుకు. కవిత్వపరంగా శ్రీవరుడి ఊహ గొప్పగా ఉంది. రాజు గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియబరచేందుకు కరువు సంభవించింది కశ్మీరులో అంటున్నాడు శ్రీవరుడు.

 ఇలాంటి వర్ణనల వల్ల ఆధునికులకు – భారతీయ చరిత్ర రచయితలు అతిశయోక్తులు, అనౌచిత్య వర్ణనలను ప్రయోగిస్తారని విమర్శించే వీలు చిక్కుతుంది. ఈ విమర్శల వల్ల మొత్తం కావ్యంలోని ‘చరిత్ర’ను విస్మరించే  వీలు చిక్కుతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, భారతీయులకు చరిత్ర రచన  రసవిహీనమైన నిజాల్ని మాత్రమే ప్రదర్శించే రచన కాదు. చరిత్ర మానవుల జీవితాలలోని ఆనంద విషాదాలను ప్రదర్శించే రసమయమైన కావ్యం. భావితరాలకు గుణపాఠాలు నేర్పిస్తూ, తమ పూర్వీకుల ఔన్నత్యాన్ని, నైచ్యాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రదర్శించే వ్యక్తిత్వ వికాస కావ్యం. మానవ జీవితంలోని కార్యం, కారణాల నడుమ సంబంధాన్ని బోధపరుస్తూ కర్మ సిద్ధాంతాన్ని నిరూపిస్తూ, మానవ ప్రపంచంలోని క్షణభంగురత్వాన్ని, అనంతత్త్వాన్ని వివరించే ఆధ్యాత్మిక రచన. కానీ పాశ్చాత్య భావాల ప్రభావంతో చరిత్ర అంటే ఎండిపోయిన ఎడారి లాంటి రచన, అస్థిపంజరంలా, సత్యాల్ని మాత్రమే ప్రదర్శించే రచన,  అన్న దురభిప్రాయంతో భారతీయ చారిత్రిక కావ్యాలను చూసేవారికి సత్యం ఎలాగో బోధపడదు, అసలు విషయం కూడా  వారి దృష్టికి అందదు. కశ్మీర రాజతరంగిణుల పఠనం, విశ్లేషణలు ఈ సత్యాన్ని తేటతెల్లం చేస్తాయి.

కరువు కాటకాలతో సతమతమయిన ప్రజల కష్టాలను తొలగించి, సాంత్వన నిచ్చేందుకు జైనులాబిదీన్ చేపట్టిన చర్యలను కూడా పర్షియన్ రచయితలకు భిన్నంగా వర్ణించాడు శ్రీవరుడు. గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ సంఘటలన్నికీ శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. ప్రత్యక్ష సాక్షి మాత్రమే కాదు, జైనులాబిదీన్ కు సన్నిహితంగా వుంటూ, జరుగుతున్న ప్రతి సంఘటననూ, జైనులాబిదీన్ స్పందననూ అతి సన్నిహితంగా చూసిన వ్యక్తి కూడా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here