కమనీయం, స్మరణీయం – శివస్తుతి

5
3

[2024 నవంబర్ 2 నుంచీ డిసెంబర్ 1 వరకూ కార్తీకమాసం సందర్భంగా ‘సీతారామకళ్యాణం’ సినిమాలోని ‘కానరార కైలాస నివాస’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]రా[/dropcap]వణాసురుడు అనగానే సీతను అపహరించటం గుర్తుకు వస్తుంది సాధారణంగా అందరికీ! దుర్మార్గుడు, కాముకుడు అనుకుంటారు. నిజానికి రావణుడు గొప్ప శివభక్తుడు. పరమేశ్వరుడిని మెప్పించి ఎన్నో వరాలు పొందాడు. శ్రీమహావిష్ణువు అవతారం అయిన శ్రీరాముడి చేతిలో మరణించి, ముక్తి పొందటం కోసమే సీతను అపహరిస్తాడు తప్ప ఆమెను తాకనైనా తాకడు.  రావణుడి పుట్టుక, తపస్సు, విజయాలు మొదలైన విషయాలు రామాయణం-ఉత్తరకాండలో వస్తాయి. ఉత్తరకాండ ఆధారంగా తీసిన చలనచిత్రాలు మనకు చాలా తక్కువగానే ఉన్నాయి. అందులో ఒకటి ‘సీతారామకళ్యాణం’ (1961).

కథ ప్రారంభంలోనే రావణుడి శివభక్తిని తెలియజేసే ఒక మంచి పాట ఉన్నది. ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రచించగా, గాలిపెంచల నరసింహారావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల గానం చేశారు. ఈ పాట తర్వాత వచ్చే పద్యం, దండకం కూడా సముద్రాల వారే రచించారు. మధ్యలో రావణ ప్రోక్తమైన శివతాండవ స్తోత్రాలు రెండు కలిపారు. వీటన్నిటినీ ఘంటసాల వారే గానం చేశారు. ఈ పాటలో రావణాసురుడుగా యన్.టి.రామారావు, కుంభకర్ణుడుగా కన్నడ నటుడు ఉదయ కుమార్, విభీషణుడుగా ఏ.వి.సుబ్బారావు (జూనియర్), నారదుడుగా కాంతారావు, శివుడుగా గోపాలకృష్ణ, పార్వతిగా శాంతి నటించారు.

ఒకనాడు రావణుడు సోదరులతో కలసి పుష్పకవిమానంలో విహారానికి వెళుతుండగా హటాత్తుగా విమానం ఆగిపోయింది. “అనుజా! కుంభకర్ణా ఏమి ఆశ్చర్యం?” అన్నాడు రావణుడు. “అది నాకు అంతు చిక్కటం లేదు అన్నయ్యా! నీవేమైనా యోచించావా విభీషణా!” అడిగాడు కుంభకర్ణుడు. “అప్రతిహతమైన శక్తి ఏదో పుష్పకవిమానాన్ని ఆపివేస్తుంది చిన్నన్నా!” అన్నాడు విభీషణుడు.

ఇంతలో హరినామస్మరణ చేస్తూ నారదుడు ఎదురయ్యాడు. రావణుడు తనకు వచ్చిన ఇబ్బంది చెప్పి, కారణం అడిగాడు. “ఇప్పుడు పరమేశ్వరుడు కైలాసం మీద పార్వతీ సహితుడై ప్రేమలీలా వినోదంలో నిమగ్నుడై ఉన్నాడు. ఈ సమయాన భూచర, ఖేచర, జలచర జీవులు ఏవీ ఆ పర్వతోపరి భాగాన ప్రయాణించరాదు, ప్రయాణించలేరు. ఆ లీల ముగిసేదాకా ఆగవలసినదే!” అని చెప్పాడు నారదుడు. “వెళ్లి సర్వేశ్వరుని సందర్శించుకో! కాలకంఠుని అనుగ్రహం లభిస్తుంది” చెప్పి చక్కా వెళ్ళిపోయాడు.

‘మంచి ఆలోచన, మహాదేవుని సాక్షాత్కరించుకుని దానవజాతి ఋణం తీర్చుకుంటాను’ అనుకుని లోపలికి వెళ్లబోతుంటే వాకిట కావలిగా ఉన్న నందీశ్వరుడు అడ్డగించాడు. “దేవదర్శనానికి ఇది సమయం కాదు. నటరాజు ఉమాసహితుడై నాట్యోత్సవంలో ఉన్నాడు. నా అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు” అన్నాడు. లెక్క చేయకుండా లోనికి పోబోయిన అతడిని శపించాడు నంది.

చేతులు జోడించి ప్రార్థిస్తే శివుడు అనుగ్రహిస్తాడు అనుకుని తమ్ములను పుష్పకాన్ని లంకకు పంపించేసి, రత్నాభరణాలను, కిరీటాన్ని తీసేసి, రుద్రాక్షమాలలు ధరించి,  శుచిగా కుర్చుని ఇలా ప్రార్థిస్తున్నాడు రావణుడు.

కానరార కైలాస నివాసా, బాలేందు ధరా, జటాధరా, హర!

భక్తజాల పరిపాల దయాళా, హిమశైల సుతా ప్రేమలోలా!”

ఇక్కడ ఇందుడు అంటే చంద్రుడు, జాలము అంటే సమూహము, హిమశైలము అంటే చల్లని పర్వతం (హిమవంతుడు) అని అర్థాలు. కైలాసంలో నివసించే వాడా, బాలచంద్రుడిని ధరించిన వాడా, జటాజూటం గలవాడా,  భక్తజనులను దయతో పరిపాలించే వాడా, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి ప్రేమను చూరగొన్న వాడా, పరమేశ్వరా, కనిపించవా అని అడుగుతున్నాడు.

నిన్ను చూడ మది కోరితిరా, నీ సన్నిధానమున చేరితిరా!

కన్నడ సేయక, కన్నులు చల్లగ, మన్ననసేయరా, గిరిజారమణా!”

కన్నడ అంటే ఉపేక్ష అని అర్థం. నిన్ను చూడాలని మనసులో కోరిక కలిగి, నీ సన్నిధికి చేరుకున్నాను. నా పట్ల ఉపేక్ష చూపించకుండా, నా కంటికి చల్లదనం కలిగేటట్లుగా, నీ భక్తుడినైన నన్ను మన్నించు గిరిజాపతీ అని వేడుకుంటున్నాడు రావణుడు. ఇంకా ఇలా ప్రార్థిస్తున్నాడు.

సర్ప భూషితాంగా! కందర్బ దర్పభంగా!

భవపాశ నాశ, పార్వతీ మనోహర,

హే మహేశ, వ్యోమకేశ, త్రిపుర హరా”

కందర్భుడు అంటే మన్మథుడు, దర్పము అంటే గర్వం, భవపాశాలు అంటే ఇహలోక బంధాలు,  వ్యోమము అంటే ఆకాశము అని అర్థాలు. సర్పాలను ఆభరణాలుగా ధరించినవాడా, మన్మథుడి గర్వం అణచినవాడా, ఇహలోక బంధాలను నశింపజేసేవాడా, పార్వతీదేవి మనసుని హరించినవాడా, ఆకాశమే కేశాలుగా కలవాడా [దిక్కులే అంబరాలు (దిగంబరుడు)గా కలవాడికి ఆకాశమే కేశాలు అనటం అతిశయోక్తి కాదు. ఇది కవి హృదయం], త్రిపురాసురులను సంహరించిన వాడా, మహేశ్వరా! అని స్తుతిస్తున్నాడు రావణుడు.

ఎంత ప్రార్థించినా ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. అది చూసి నందీశ్వరుడు ఫక్కున నవ్వాడు. రావణుడి ముఖం జేవురించింది. “నందీ! నా భక్తినే పరిహసిస్తున్నావా! ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే, బలిమితో ఈ కైలాసాన్నే పెకలించి, నా లంకా ద్వీపానికి తరలించుకు పోతాను” అంటూ శివస్తుతి చేస్తూ కైలాస పర్వతాన్ని పెకలించి, భుజం పైకి ఎత్తుకోవటానికి ప్రయత్నించసాగాడు.

జయత్వద భ్రవిభ్రమత్ భ్రమద్బుజంగ మస్ఫుర

ద్ధగ ద్ధగ ద్వినిర్గమ త్కరాళ ఫాల హవ్యవా

ధిమిద్దిమి ద్ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళా

ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః! ఓం! నమశ్శివాయ!”

ఇక్కడ విభ్రమభ్రమత్ అంటే వేగంగా పరిభ్రమిస్తున్న, కరాళము అంటే పాము,  ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ అంటే ధిమిధిమిధిమి మనే ధ్వని చేస్తున్న, మృదంగం అంటే మద్దెల, ప్రవర్తిత అంటే సాగింపబడిన అని అర్ధాలు. “పరమేశ్వరుడు తాండవం చేసే సమయంలో అత్యంత వేగంతో తిరుగుతున్నప్పుడు తలమీద, మెడ మీద, చేతులకు గల పాములు బుసలు గొడుతూ, కాంతులు వెదజల్లుతున్న ఫాలనేత్రంతో, ధిమి ధిమి ధిమి ధ్వనులు చేస్తూ, చేతిలోని ఢమరుకం మ్రోగిస్తూ ప్రచండ తాండవం చేస్తున్న శివా, నీకు జయమగు గాక!” అని స్తుతిస్తున్నాడు లంకేశ్వరుడు.

అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ!

రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతమ్

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంథ కాంతకం, తమంత కాంతకం, భజే! ఓం నమఃహరా!”

అఖర్వ అంటే ఏ లోటూ లేని, సర్వమంగళ అంటే పార్వతీదేవి, కదంబ మంజరి అంటే పూలగుత్తి, మధుపం అంటే తుమ్మెద, అంతకాంతకం అంటే అంతకుడిని (మన్మథుడిని) సంహరించిన వాడా అని అర్ధాలు. ఏ లోటూ లేని పరిపూర్ణురాలైన పార్వతీదేవి సౌందర్యం అనే పూలగుత్తి యొక్క రసప్రవాహంలో తుమ్మెదలా విజృంభించేవాడు, త్రిపురాసులనీ, గజాసురుడినీ, మన్మథుడినీ అంతమొందించిన వాడు అయిన శివుని భజిస్తున్నాను.

ప్రపుల్ల నీల పంకజ ప్రచండ కాలి మచ్చటా

విడంబి కంఠ కందలీ రుచిప్రబంధ కంధరమ్

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం

గజచ్ఛికాంథకచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే, ఓం నమఃశివాయ!”

ప్రపుల్ల = విరబూసిన, నీల పంకజాలు = నల్లకలువలు, కంఠరుడు = కంఠం కలవాడు, స్మరుడు = మన్మథుడు, అంధకుడు = అంధకాసురుడు అనే రాక్షసుడు అని ఇక్కడ అర్థాలు. విరబూసిన నల్లకలువల మధ్యనున్న గాఢమైన నల్లధనంతో పోలిన కంఠం కలవాడు, మన్మథుడు, త్రిపురాసురులు,  గజాసురుడినీ, అంధకాసురుడిని సంహరించినవాడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు,  ఇహలోక బంధాలు తొలగించేవాడు అయిన శివుని భజిస్తున్నాను అని ప్రార్థిస్తున్నాడు  రావణుడు.

ఇలా ప్రార్థిస్తూ కైలాసాన్ని పెకలించి దశమస్తకాల మీద పెట్టుకున్నాడు రావణుడు. ఆనంద తాండవం చేస్తున్న శివపార్వతులకు కైలాస గిరి అటూ ఇటూ ఊగినట్లు అనిపించింది. శివుడు ఆగ్రహంతో కాలిబొటనవేలుతో నొక్కిపట్టాడు. రావణుడి శక్తి నశించిపోయి, బొక్కబార్లా పడ్డాడు. అతడి కళ్ళ నుంచీ కన్నీరు స్రవించింది. ‘శివా! పరమ శివా! కరుణార్ద్ర హృదయం కాఠిన్యం వహించిందా స్వామీ!’ అనుకుంటూ ఇలా అన్నాడు.

చిత్రకారిణి శ్రీమతి గోనుగుంట సరళ

పరమ శైవాచారపరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు

తల్లికోరిక తీర్పదలచి వేడగ ఆత్మ లింగమ్ము ప్రేమనొసంగినావు

మును కుబేరుడు దోచుకొనిన లంకాపురీ విభవమ్ము మరల ఇప్పించినావు

తలచుటే తడవుగా దర్శన భాగ్యమ్ము కరుణించి నీడవై కాచినావు

స్వామీ! భవదీయ దర్శనోత్సాహినగుచు దరియ ఈ వేళ ఈ నిషేధమ్ములేల

వైరమేలయ్య మరచి, నా నేరములను, కరుణ గనవయ్య కైలాస గిరినివాస!”

శివుడే దేవుడు అని నమ్మేవారిని శైవులు అని అంటారు. “పరమ శైవులందరిలో నేనే నీకు అతి ప్రియతముడిని అనే పేరు నాకు వచ్చేటట్లు చేశావు. ఆనాడు నా తల్లి కైకసి పూజించుకోవటానికి నిన్ను వేడుకుంటే నీ ఆత్మలింగాన్ని నాకు ప్రేమతో ఇచ్చావు. ఒకప్పుడు నేను పుట్టకముందు లంకానగరం రాక్షసులదే! లంకను జయించి కుబేరుడు స్వాధీనం చేసుకుంటే మళ్ళీ నేను సాధించగలిగే శక్తిని ఇచ్చావు. నేను ఎప్పుడు తలచుకున్నా నీడలా నా వెన్నంటే ఉంటూ దర్శనం ఇచ్చేవాడివి. ఇప్పుడు కూడా నిన్ను దర్శించుకోవాలనే ఉత్సాహంతో వచ్చిన ఈ వేళ నాకు ఈ నిషేధం ఎందుకు? నామీద విరోధం ఎందుకు చూపిస్తున్నావు? తెలియక నేనేమైనా అపరాధం చేస్తే మన్నించి, దయతో చూడు స్వామీ!” అని ఈ పద్యానికి అర్థం. ఇలా ఎన్నో విధాల వేడుకున్నా ఈశ్వర కటాక్షం లభించలేదు.

“స్వామీ, కరుణించవా? సాక్షాత్కరించవా? నీ అనుగ్రహానికర్హం కాని ఈ తనువు వృథా, ఈ జీవితం వ్యర్ధం, నీకే సమర్పిస్తాను. నాదమూర్తి వైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను” అంటూ కుక్షిలోని పేగులను చీల్చి వీణ తీగల లాగా మీటుతూ ఉన్నాడు. శరీరం రక్తసిక్తమైంది. అయినా లెక్క చేయకుండా తదేక ధ్యానంతో ఉన్నాడు లంకేశ్వరుడు.

ఇంతలో కళ్ళముందు కోటి మెరుపులు మెరిసినట్లు మిరుమిట్లు గొలిపాయి. అక్కడ పన్నగభూషణుడు, తిశూలం ధరించి, ప్రసన్నవదనంతో, చిరు దరహాసంతో చూస్తూ ప్రత్యక్షమైనాడు. రావణుడి గాయాలు మాయమైనాయి. మునుపటి జవసత్వాలతో, రత్నాభరణాలతో ఉన్నాడు. “వత్సా! ధశకంధరా!” అంటూ ఆశీర్వదించాడు ఈశ్వరుడు. చేతులో జోడించాడు రావణుడు.

హే పార్వతీనాథ కైలాస శైలాగ్రవాసా, శశాంకార్ధ మౌళీ. ఉమాదేవతోల్లాసిత వ్యాంగ భాగా, శ్రితానంద దాయీ స్మితా పాంగా భస్మీకృతానంగ, గంగాధరా, సర్వ సంతాపహరా, హరా! శివా, సదాశివా, నీయున్న చందమ్ము నేనెంత యూహింపగావచ్చు? వేదమ్ములున్నీవ, వాదమ్ములున్నీవ, ధైర్యంబులున్నీవ, మర్మంబులున్నీవ, సర్వంబులున్నీవ, నీ లెంక నైనట్టి, దాసుండనైనట్టి నన్నున్ దయాళుండవై ప్రీతి రక్షింపవే, తప్పు సైరింపవే, దేవ, మన్నింపవే దేవదేవా, మహాదేవ దేవా, నమస్తే నమస్తే నమః !”

“ఓ పార్వతీ పతీ, కైలాస శిఖరం మీద నివశించే వాడా, అర్ధ చంద్రుడిని శిరసు మీద ధరించిన వాడా, శరీరం వామ భాగాన ఉమాదేవిని నిలుపుకున్నవాడా! ఆశ్రితులకు ఆనందం కలిగించే వాడా, చిరునవ్వు మోముతో ఉన్నవాడా, శరీర అవయవాలన్నిటినీ భస్మంతో అలంకరించుకున్న వాడా, శిరసు పైన గంగను ధరించినవాడా, సర్వ జనులకు బాధలను తొలగించే వాడా, సదాశివా! నీవు ఎక్కడ ఏవిధంగా ఉంటావు అనేది ఊహింప శక్యం కానివాడివి, సర్వ వ్యాపకుడవు. వేదాలన్నీ నీవే, వాదాలన్నీ నీవే, భక్తులందరిలో అంతర్లీనంగా ఉన్న ధైర్యం నీవే,  మర్మాలు అన్నీ నీవే, నువ్వు సర్వాంతర్యామివి. నీ బిడ్డను, నీ దాసుడను, నా మీద దయతో రక్షించు దేవా, నా తప్పులు మన్నించు స్వామీ, నీకు అనేక నమస్కారాలు చేసుకుంటున్నాను” అంటూ పరిపరి విధాల వేడుకున్నాడు.

భక్త సులభుడు, భోళా శంకరుడు ప్రసన్న వదనంతో చూస్తూ “భక్త పరీక్షలో భయపడతావనుకున్నాను. వెన్ను చూపకుండా వన్నెలు దిద్ది, నీ రుద్రవీణా గానంతో నన్ను ఆనంద పరిచావు. జయించావు. నన్ను ఎలుగెత్తి పిలిచిన నీవు ఇక ‘రావణ’ బిరుదంతో వర్ధిల్లు. నీ అభీష్టం ఏదో అర్థించు. ప్రసాదిస్తాను” అన్నాడు.

“ధన్యుణ్ణి స్వామీ!” అంటూ నందీశ్వరుడి వంక ఓరకంటితో చూశాడు. నంది తల వంచుకున్నాడు. “నరుల వల్ల, వానరుల వల్ల దానవుల కెన్నడూ ప్రమాదం లేదు స్వామీ! అసురుల పెంపు సహించలేని యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యారధాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి నివ్వు” అన్నాడు. “తథాస్తు” అని దీవించి అదృశ్యుడయ్యాడు శంకరుడు.

నందీశ్వరుడి వంక విజయగర్వంతో చూస్తూ “ఇక ముల్లోకాలకూ నేనే సామ్రాట్టును” అని అడుగులు ముందుకు వేశాడు లంకేశ్వరుడు.

ఇదీ ఈ పాట విశ్లేషణ, అందులో ముడివడిన సన్నివేశాలు. ఇందులో శివపార్వతుల తాండవ నృత్యం చాలా అద్భుతంగా చూపించారు. ఈ అపురూప దృశ్యం ‘సీతారామకళ్యాణం’ (1961) చిత్రంలోనిది. ఈ చిత్రంలో సముద్రాల వారు రచించిన సంభాషణలు చాలా బాగుంటాయి. పాటలు కూడా మంచి సాహితీ విలువలతో కూడుకున్నవి. ఈ సినిమా అఖండ విజయం సాధించింది. యన్.టి.ఆర్. రావణుడిగా భూకైలాస్ (1958), శ్రీకృష్ణ సత్య (1972), శ్రీరామ పట్టాభిషేకం (1978) చిత్రాల్లో కూడా నటించారు. ఉమ్మడి కుటుంబం (1967)  సినిమా అంతర్నాటకంలో రావణుడిగా కొద్దిసేపు కనిపిస్తారు. తన అభిమాన  పాత్ర రావణుడు అని పలు సందర్భాలలో చెప్పారు యన్.టి.ఆర్. రావణుడు ఆశువుగా చెప్పిన శివతాండవ స్తోత్రాలు మరికొన్ని ‘సంపూర్ణ రామాయణం’ (1972) చిత్రంలో కూడా వస్తాయి. అందులో రావణుడిగా యస్.వి.రంగారావు నటించారు. అవి రావణుడి పూజామందిరంలో జపించినట్లుగా చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here