[శ్రీమతి కానాల సుమంగళి గారి ‘జీవాత్మ – జీవన్ముక్తి’ అనే రచనను అందిస్తున్నాము.]
[dropcap]మా[/dropcap]తృగర్భంలో మహాజ్ఞానిగా అనుప్రవేశం చేసె
అవనిలో అజ్ఞానిగా దేహరూపియై జనించె (1)
మాయావృతమై జీవాత్మగా సర్వస్వం మరిచె
భ్రమలు, బంధాలతో సంసారిగా మారిపోయే (2)
సనాతన సాంప్రదాయ ధర్మాలకు తిలోదకాలిచ్చే
అరిషడ్వార్గాలు, రాగద్వేషాలకు నెలవాయె (3)
విషయవస్తులాలసతో కర్మలెన్నో ఆచరించె
ధనార్జనే పరమావధిగా జీవనయానం సాగించె (4)
నిర్వేదంతో సతతం బాధాతప్తుడై దుఃఖించె
గమ్యంలేని నిరంతరాన్వేషణలో మునిగిపోయే (5)
సంసారం సాగరంలో తీరం కానరాక కొట్టుమిట్టాడె
నిరాశా నిస్పృహలతో స్థాణువుగా మారిపోయే (6)
త్రిగుణాల త్రిపుటిలో చిక్కి విలవిల్లాడె
శాంతి భద్రతానందాలు అందని ద్రాక్షలాయే (7)
నిస్తేజం, నిస్సత్తువతో నిశ్చేష్టుడై జగతి నిలిచె
ఆపన్న హస్తం కోరి నిరంతరం, ప్రతిక్షణం వెతక సాగె (8)
ఆత్మజ్ఞానం అనే ఆశాకిరణమ్ ఉందని తెలిసికొనె
అది గురుశాస్త్ర ఉపదేశంతోనే సాధ్యమని గ్రహించె (9)
నిత్యానిత్య వస్తు వివేకమే మోక్షమార్గమని తెలిసె
స్వస్వరూపా జ్ఞానమే జీవన్ముక్తినిచ్చునని అర్థమాయె (10)
మోక్షసాధనకు ముముక్షువై ముందుకు పయనమాయె
త్రిపుటి నుండి ద్విపుటికి సాధనతో సాగిపోయే (11)
అమరత్వం, పూర్ణత్వం ఆత్మజ్ఞానంతోనేనని జ్ఞానం పొందె
లక్ష్య సాధనతో సాగితే జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని తెలిసికొనె (12)
శ్రవణమనననిధి ధ్యాసనలకై గురువును శరణుపొందె
క్రమంతప్పక సాధకుడై సాధనచతుష్టసంపన్నుడాయే (13)
ద్వంద్వాతీతుడై స్థితప్రజ్ఞుడై, సమత్వం పొందె
సర్వజ్ఞత్వం, సంపూర్ణత్వంతో జ్ఞానిగా భాసిల్లె (14)
సర్వాత్మ భావన, అమృతత్వ సిద్ధితో అలరాలె
జీవన్ముక్తితో ఉదయభానునిగా ప్రకాశించె (15)