ఐశ్వర్య రహస్యం-6

0
4

[ఎర్ల్ నైటింగేల్ గారు 1956లో అమెరికన్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా డా. రాయపెద్ది వివేకానంద్ అందిస్తున్న ప్రేరణాత్మక రచన.]

[dropcap]క[/dropcap]ఠినమైన అని ఎందుకంటున్నానంటే ఒక కొత్త అలవాటుని అలవర్చుకోవటం అంత సులభమైన విషయమేమీ కాదు కద.

ఒకసారి ఒక అలవాటు అంటూ ఏర్పడితే అది ఇక జీవితాంతమూ మీతోనే ఉంటుంది, అదొక్కటి గుర్తుంచుకుని పట్టు వదలక మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి.

ఇందాకే చెప్పుకున్నట్టు ‘గొప్ప విజయాల్ని సాధించగలనా’ అన్న భయం మీలో నిస్సందేహంగా కలుగుతూ ఉంటుంది.

మీ భయాల్ని పక్కన పెట్టండి.

మీ మనసులో సందేహాలు, భయాలు కల్గినప్పుడల్లా మీ గోల్ తాలూకు అందమైన ఊహలతో మీ మనసుని నింపుకోండి. గోల్ సాధించిన తరువాత లభించబోయే అందమైన జీవితం తాలూకు ఆలోచనలతో మీ మనసుని నింపుకోండి. మీ భయాలు పారిపోతాయి.

ఈ ముఫై రోజుల చాలెంజ్‌లో – ‘చ! ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదు, దీన్ని ఇంతటితో వదిలేద్దాం’ అనే తరహా ఆలోచనలు కూడా కలుగుతాయి. పాజిటివ్ థింకింగ్ కన్నా నెగెటివ్‌గా ఆలోచించటం సులువుగా అనిపిస్తుంది మన మెదడుకి. చాలా మంది సామాన్యులు ఇలాంటి నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు తమ ప్రయత్నాన్ని అంతటితో ఆపేసి పలాయనం చిత్తగించటం మామూలే.

అందుకే కద విజేతలు ఎప్పుడు 5% కంటే ఎక్కువ మంది ఉండరని చెప్పుకున్నాం. పలాయనం చిత్తగించే ప్రబుద్ధులే ఎక్కువ. మీరు 5% మంది మాత్రమే ఉండే విజేతల జాబితాలో ఉండాలనుకుంటున్నారా లేదా పలాయనం చిత్తగించే 95% అతి సామాన్యుల జాబితాలో మొదటి ర్యాంకుకై పోటీకి వెళతారా? నిర్ణయం మీది.

ఈ ముఫై రోజుల చాలెంజిని ఒక దీక్ష లాగా భావించండి.

కేవలం పాజిటివ్ ఆలోచనలతో మీ మనసు నిండేలా నియంత్రణ పాటించండి. మీ మెదడు మీరు కోరుకున్న అంశాల గూర్చి మాత్రమే ఆలోచించేలా కఠిన నియంత్రణ పాటించండి. మీరు రోజు చేసే పనులకన్నా ఎక్కువ సమయాన్ని పని చేయటానికి కేటాయించండి. ఎప్పటికన్నా అధికంగా శ్రమించండి.

ఆనందంగా చిరునవ్వుతో పనులు చేస్తూనే, సకారాత్మక దృక్పథంతో మీకు పని చేసి పెట్టేలా మీ మెదడుని వాడుకోండి.

మీరు ఇప్పుడు పడుతున్న ఈ శ్రమ వృథా పోదు అని మాత్రం గుర్తుంచుకోండి. మీరు పడుతున్న కష్టానికి కోటిరెట్లు ఫలితం మీకు వస్తుంది. పడ్డ వాడు చెడ్దవాడు కాదులే అని మనకు సామెత ఉండనే ఉంది కద.

మీ గోల్‌ని కార్డ్‌పై వ్రాసుకుని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి ఈ ముఫై రోజుల దీక్ష చేపట్టిన క్షణం నుంచే మీరు ఒక విజేత కిందే లెక్క. నిబద్ధతతో చేసుకుంటూ వెళ్ళిపోవటమే.

మీరు ఏమి చేస్తున్నారో, ఎటు వెళుతున్నారో మీకు స్పష్టంగా తెలుసు. కేవలం 5% మందికి మాత్రమే దక్కే అరుదైన అదృష్టం ఇది. వాళ్ళనే ప్రపంచం విజేతలు అని పిలుస్తుంది. అవుంనండీ ప్రతి వంద మందిలో కేవలం అయిదు మందికి మాత్రమే ఈ కీలకం తెలుసు. మీరు అత్యంత అరుదైన ఆ అయిదు శాతం మంది ఉండే జాబితాలో ఉన్నారు.

‘నేను గోల్ ఎలా అందుకుంటానబ్బా’ అనే ఆలోచనతో మీరు సమయాన్నంతా గడిపేయకండి. మనల్ని అందర్ని నడిపిస్తున్న ఒక అద్భుతమైన విశ్వశక్తి ఈ సృష్టిలో ఉంది. ఆ శక్తి మీకన్నా, నాకన్నా, మన అందరికన్నా అత్యంత శక్తివంతమైనది. మీరు ఆ శక్తిని విశ్వసించినా విశ్వసించకున్నా అది తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది. మీరు చేయాల్సిందల్లా మీరు ఏ దిశగా వెళుతున్నారు అన్న విషయంలో ఒక స్పష్టమైన అవగాహనతో మీ పనులు మీరు నిబద్ధతతో చేసుకుంటూ వెళ్ళటమే.

సరయిన ఫలితాలు, సరయిన సమాధానాలు మీకు వచ్చి తీరతాయి.

అన్నీ మీకు అనుకూలంగా ఒనగూడుతాయి. ఎందుకు అలా అని అడిగితే, అది అంటే, అది ప్రకృతి నియమం. అంతే.

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకోండి.

“పని యందు మాత్రమే నీ దృష్టి పెట్టు ఫలితాలని ఆశిస్తూ పని చేయటం హీనమైనది. ఫలితం అనేది ఖచ్చితంగా అందజేయబడుతుంది. ఆ విషయం గూర్చి బెంగ వద్దు”

గొలగమూడిలో వెలిసి ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి వారి సూక్తులలో ఇది కూడా చెప్పబడింది “నువ్వు ఏదన్నా కోరుకో వాటంతట అవే వస్తాయి, సముద్రాల మీద ఈ చూపుకు అడ్డే లేదు”

కొండ మీద ప్రసంగంలో క్రీస్తు చెప్పింది కూడా ఇవే మాటలే

“నీవేమన్నా కోరుకో అవంతట అవే లభిస్తాయి” (అడుగుడీ ఇవ్వబడును)

“దేనినైతే అన్వేషిస్తావో అది నీకు తప్పక లభిస్తుంది” (వెదకుడీ మీకు దొరకును)

“తట్టి అడిగితే అవకాశాలు అవే తెరచుకుంటాయి” (తట్టుడీ తెరవబడును)

“అడిగిన ప్రతి వానికి సమృద్ధిగా లభిస్తాయి” (అడుగు ప్రతి వానికి ఇయ్యబడును)

అన్ని మత గ్రంథాలలో చెప్పబడిన ఈ మాటలు ఎంత సులభంగా అనిపిస్తాయో, అవి అంతే నిజం కూడాను.

గందరగోళంతో నిండిన ఆధునిక జీవితంలో జీవిస్తున్న మనకు ఇంత సులభంగా మన గమ్యాన్ని చేరుకోవచ్చా అనే సందేహం వస్తుంది.

కావాలసిందల్లా మనపై మనకు నమ్మకం, ఈ విశ్వ శక్తి పై సడలని విశ్వాసం. మీరు ఏ మతానికి చెందిన వారైనా సరే నిశ్చయంగా ఒక గొప్ప విశ్వ శక్తి అనేది ఉందని నమ్మి తీరాలి. మీ ఆరాధనా పద్ధతులు వేరైనా, మీ పూజా విధానాలు వేరైనా మీ సంకల్పాలు, మీ కోరికలు, మీ ప్రార్థనలూ చేరేది ఆ ఒకే ఒక విశ్వ శక్తికే.

దాన్ని నేను పరమాత్మ అంటాను, శ్రీకృష్ణుడు అంటాను, విష్ణువు అంటాను, పరబ్రహం అంటానూ, దత్తాత్రేయుడు అంటాను. నాకు తోచినట్టు నేను నమ్మకంతో ప్రేమతో విశ్వాసంతో నేను ప్రార్థించుకుంటాను. నువ్వు నీకు తోచిన విధంగా ప్రార్థించుకో. నీకు తోచిన పేరు పెట్టుకో. కానీ నిస్సందేహంగా ఆ పరమాత్మ ఉన్నాడు. నీ మొరలాలకిస్తున్నాడు.

కుల మతాలతో సంబంధం లేదు, పేద గొప్ప తారతమ్యం లేదు, మీరు ఎవరైనా సరే చేస్తున్న పనిని పూర్తి ఏకాగ్రతతో నమ్మకంతో దీక్షగా చేసుకుంటూ వెళ్ళటమే మీరు చేయాల్సింది.

ఈ ముఫై రోజుల దీక్షని పట్టు వదలకుండా చేయటమే మీరు చేయాల్సింది.

మీరు సేల్స్‌మాన్ అయితే, అసలు ఇదే మొదటి రోజు అన్నంత ఉత్సాహంగా మీ పని మొదలెట్టండి.

హాయిగా చిరునవ్వుతో ఎటువంటి తొట్రుపాటు లేకుండా నింపాదిగా ప్రశాంతమైన చిత్తంతో, భవిష్యత్‌పై పూర్తి విశ్వాసంతో, సమృద్ధితో కూడిన ఫలితాలు రాకుండా ఎక్కడికి పోతాయి అన్న భరోసాతో, అసలు ఫలితం గూర్చి ఆలోచనే లేకుండా హాయిగా మీ పని ప్రారంభించండి.

మీకు కాకుండా విజయం ఎవరికి లభిస్తుంది అన్న భరోసా మది నిండా ఉంటే ఇక ఫలితం గూర్చి బెంగ ఎందుకు?

మీరు ఒక గృహిణి అనుకుందాం. నేను సాధించాల్సింది ఏమీ లేదు. నా పిల్లలు, నా భర్త వాళ్ళే నా లోకం. వాళ్ళ విజయాలే నా విజయాలు. నేను ప్రత్యేకంగా సాధించాల్సిందేమి ఉంటుంది అని అనుకోకండి.

మీరు పూర్తి అంకిత భావంతో ఈ ముప్ఫై రోజుల ఛాలెంజి స్వీకరించండి. అది మీ జీవితంలో ఎన్ని మంచి మార్పులు తీసుకు వస్తుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు. నేను ఏమి సాధించగలను, నా వల్ల ఏమి అవుతుంది అనే తరహా ఆలోచచన్లు మానేసి, నిశ్చింతగా ఈ రోజే మీ జీవితంలో మొదటి రోజు అన్న భావనతో కొత్త జీవితాన్ని మొదలెట్టండి. ఈ ముప్ఫై రోజుల పరీక్షా కాలంలో మీ జీవితంలో సంభవించే మంచి మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు.

మీరు ఏ వయసు వారైనా కావచ్చు, ఏ వృత్తిలో ఉన్న వారైనా కావచ్చు, మీరు ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ ముప్పై రోజుల ఛాలెంజిని స్వీకరించి ప్రతి రోజుని ఒక కొత్త రోజులాగా ఆస్వాదిస్తు మీ జీవితాన్ని పూర్తిగా పాజిటివ్‌గా మలచుకుంటే మీ జీవితంలో కలిగే మంచి మార్పులని, మీరు అనుభవించబోయే అనిర్వచనీయమైన అనుభూతులతో నిందిన జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్య పోతారు.

‘వేకప్ అండ్ లివ్’ అనే పుస్తకాన్ని వ్రాసిన డోరతీ బ్రాంద్ ఒక చక్కతి రచయిత్రి మరియు పత్రికా సంపాదకురాలు. ఆమె ఇదే విషయన్ని తనకై తాను కనుగొని, జీవితం ఎంత ఆనందభరితమైనదో అని ఆశ్చర్యపోయింది. ‘వేకప్ అండ్ లివ్’ అనే పుస్తకంలో ఇదే విషయాన్ని ఆమె పేర్కొంటారు.

ఆమె వ్రాసిన ఆ పుస్తకం యొక్క సారాన్ని చిన్న చిన్న పదాలతో ఒకే వాక్యంలో చెప్పాలంటే ఇలా చెప్పుకోవచ్చు. “మీరు ఏ పని చేపట్టినా అందులో ఫెయిల్ అవ్వటం అసాధ్యం అన్నంత నమ్మకంతో ఆ పని మొదలెట్టండి”. ఆమే ఇదే స్ఫూర్తితో తన ముప్ఫై రోజుల చాలెంజిని రాజీ పడకుండా పూర్తి చేసి, గొప్ప విజయాన్ని ఎగిసిపడే కెరటాల్లాంటి ఆనంద తరంగాల్ని మనసారా అనుభవించారు.

మీ ముప్ఫై రోజుల ఛాలెంజిని ఈ రోజే స్వీకరించండి. తొందరపడి ఛాలెంజిని స్వీకరించాలసిన పని లేదు సుమా.

‘నేను పట్టు వదలకుండా, ఎటువంటి రాజీ పడకుండా ఈ ఛాలెంజిని పూర్తి చేస్తాను’ అన్న కృత నిశ్చయంతో మీరు సిద్ధంగా ఉంటేనే ఈ ఛాలెంజిని స్వీకరించండి.

రాజీ లేని ధోరణిలో, పట్టువదలకుండా నేను ఈ ఛాలెంజి స్వీకరించి పూర్తి చేస్తాను అన్న రోజే మీలో ఆత్మ విశ్వాసం, ఈ విశ్వ శక్తి పట్ల విశ్వాసం మరీ ముఖ్యంగా ఈ ఛాలెంజి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నట్టు లెక్క. విశ్వాసం కొండలనే కదిలిస్తుంది కద.

పట్టువదలక పోరాడే గుణమే విశ్వాసానికి ప్రతిక. ఏదో నామకార్థం ప్రయత్నం చేయటం కాదు. సంపూర్ణ విశ్వాసంతో ఈ చాలెంజీ స్వీకరించి మొదలెట్టండి.

మీరు ఈ ఛాలెంజిని పూర్తి చేయలేకపోయారు అనుకుందాం. అంటే మీలో నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ అయిపోయి, “అయ్య బాబోయ్ నేను ఎన్నటికన్నా అనుకున్నది సాధించగలనా!” అనే విధమైన అనుమానాలు మీలో మొదలయ్యాయి అనుకుందాం. అంటే ఏమిటన్నమాట, మీరు మొదలు పెట్టినపుడు ఉన్నంత ఉత్సాహంగా ఇప్పుడు లేరు. కాబట్టి తక్షణమే, మీరు మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ సరికొత్తగా 30 రోజుల ఛాలెంజిని మొదలు పెట్టాల్సిందే.

క్రమంగా మీకే తెలియకుండా కొత్త పాజిటివ్ అలవాటు మొదలవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న అతి అరుదైన విజేతల జాబితాలోకి మీరు చేరుకుంటున్నారు. విజేతల శాతం అతి తక్కువ అని చెప్పుకున్నాం కద. మీరు ఆ జాబితాలోకి చేరిపోతున్నారు.

ఈ విజేతలకి అసాధ్యం అన్నది ఏదైనా ఉందా అని ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అలాంటి వారిలో మీరు ఒకరు అవబోతున్నారు.

ఎట్టి పరిస్థితిలోనూ మీరు వ్రాసి పెట్టుకున్న గోల్ కార్డుని మరవకండి. మీ విజయంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది ఆ కార్డే కద.

కార్డ్కి ఒక వైపు మీ గోల్‌ని స్పష్టంగా వ్రాసుకోండి.

రెండవ వైపు ఈ క్రింది వాక్యాలు వ్రాసుకోండి.

“పని యందు మాత్రమే నీ దృష్టి పెట్టు. ఫలితం అనేది ఖచ్చితంగా అందజేయబడుతుంది. ఆ విషయం గూర్చి బెంగ వద్దు”

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు

“నువ్వు ఏదన్నా కోరుకో వాటంతట అవే వస్తాయి, సముద్రాల మీద ఈ చూపుకు అడ్డే లేదు”

-గొలగమూడిలో వెలిసి ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి

“దేనినైతే అన్వేషిస్తావో అది నీకు తప్పక లభిస్తుంది”

ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు సాధించిన విజయాలైనా, సంపదలైనా, ప్రేరణ అన్నది లేకుండా సాధ్యపడలేదు.

ప్రేరణ, అది కూడా నిరంత్రమైన ప్రేరణ ఉంటే కానీ గొప్ప గొప్ప విజయాలు ఒనగూడవు.

కాబట్టి ఈ ముప్ఫై రోజుల ఛాలెంజి సమయంలో మీరు గొప్ప ప్రేరణతో రగిలిపోతూ ఉండాలి. ఆ ప్రేరణని ఎటువంటి నెగెటివ్ థాట్ కూడా చల్లారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.

అన్నిటికన్నా అతి ముఖ్యమైనది.. దిగులు అన్న మాటే మీ దగ్గరకి రానివ్వకండి.

దిగులు అన్నది భయాన్ని కలగజేస్తుంది.

భయం అన్నది మిమ్మల్ని ముందడుగు వేయనివ్వకుండా నిర్వీర్యులని చేస్తుంది.

ఇంత పెద్ద లక్ష్యాన్ని నా మూందు ఉంచుకున్నానే నేను ఒక్కడినే అన్నీ చేసుకోగలనా, నా విజయాన్ని నేను అసలు భరించగలనా అన్న ఆలోచన కూడా దిగులుపుట్టిస్తుంది.

మీరు అందుకే వేరే ఏ ఆలోచనా లేకుండా మీ గోల్ మీదనే దృష్టి పెట్టి మీ పని మీరు చేస్తు పోవడమే. ప్రకృతిలోని అన్ని శక్తులు కూడబలుక్కుని మీ కలల్ని నిజం అయ్యేలా చేస్తాయి.

ప్రశాంత చిత్తంతో చిరునవ్వుతో ఉండండి. చిన్న చిన్న అప్రాముఖ్యమైన విషయాలతో మీ మానసిక ప్రశాంతతని చెడగొట్టుకోకండి.

“ఎందుకొచ్చిన తలనొప్పి ఇదంతా” అని కూడా అనిపిస్తుంది మీకు మొదట్లో. ఎదుగుదల అంత సులభంగా వస్తుందా చెప్పండి. కొత్త అలవాటు అందునా మంచి అలవాట్లు అలవాటవడం ఎప్పుడూ కాస్త కష్టంగానే ఉంటుంది.

మళ్ళీ ఇది వరకటి లాగా సుఖంగా ఉందాం ఏ కష్టం లేకుండా అని కూడా అనిపిస్తుంది.

“కంఫర్ట్ జోన్ ఈజ్ ది వరస్ట్ అడిక్షన్” అంటారందుకే మానసిక శాస్త్రవేత్తలు. హాయిగా టీవీ చూసుకుంటూనో, వీడియో గేములు ఆడుకుంటూనో, వాట్సాప్‌లోనో, ఫేసుబుక్కులోనో అర్థం లేని కామెంట్లు పెట్టుకుంటూ గడిపేయడమో, లేదా హాయిగా ముసుగు తన్ని పడుకోవడమో, రేపటి గూర్చి ఆలోచన అన్నది లేకుండా కారో బైకో వేసుకుని బలాదూరు తిరగడమో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి?

అందుకే అంటున్నాను, కంఫర్ట్ జోన్ ఈజ్ ది వరస్ట్ అడిక్షన్ అని. ఆ ఊబిలో కూరుకుపోతే బయటకి రాలేము.

కంఫర్ట్ జోన్ ఎప్పుడూ మిమ్మల్ని ఎదగనివ్వదు. మీమ్మల్ని విజయాలని సాధించనివ్వదు.

నిఖార్సైన నిజం ఏమిటంటే, మీరు ఒక విజేతగా ఎదగాలని బలంగా అనుకుంటున్నారు. కలలు కంటున్నారు. మీరే కాదు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ విజేతగా ఎదగాలని కలగంటారు. ఏ ఒక్కరూ పరాజయం పాలవ్వాలని ఆశించరు. ఏదో సాదా సీదాగా జీవితాన్ని ఈడుస్తూ బ్రతికేదానికి ఏ ఒక్కరు ఇష్టపడరు. భయం, దిగులు, ఆందోళన లతో బ్రతకాలని ఏ ఒక్కరు అనుకోరు. అందరికి విజయం అంటే ఇష్టమే. అందరికీ డబ్బు కావాలి. అందరికీ ఐశ్వర్యం కావాలి.

కానీ మన కలలని నిజం చేసుకోవడానికి ఖచ్చితంగా కొంత కష్టపడాలి. క్రమశిక్షణ అనే ఈ చిన్ని కష్టాన్ని సహిస్తే మనం ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అధిక ఆదాయం, ఐశ్వర్యం, సుఖ సంపదలూ, గౌరవ మర్యాదలతో కూడిన జీవితం మన స్వంతం అవుతాయి.

ఒక మామిడి టెంకని నాటామని అనుకుందాం. దాన్ని చక్కగా పోషించి పెద్ద చెట్టుగా ఎదిగేలా చేశాం. ఇప్పుడు మీకు ఒక్కటే మామిడి పండు లభిస్తుందా? వందలాది మామిడి పండ్లు అనేక సంవత్సరాలు పరిమితి అనేది లేకుండా మీకు లభిస్తాయి కద.

కాబట్టి క్రమశిక్షణతో మొదలు పెట్టి ఛాలెంజిని పూర్తి చేయాలి అనే ఆలోచనకి విఘాతం ఏర్పడేలా మీలో ఏదైనా నెగెటివ్ థాట్ వచ్చినప్పుడల్లా మీరు భవిష్యత్తులో పొందబోయే ఐశ్వర్యాన్ని, సుఖ సంపదలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.

నెగేటివ్ ఆలోచనలతో మీ మెదడుని నింపితే మీకు ఫలితాలు కూడా ఇబ్బడిముబ్బడిగా నెగెటివ్ ఫలితాలే వస్తాయి. వ్యాధులు, దారిద్ర్యం, కష్టాలు, సంకుచిత మనస్తత్వం, ఒకర్ని నిందించే గుణం, మన తప్పుల్ని ఒప్పుకోకపోవడం అనే దుర్గుణం, ‘నేను కరెక్టే నా అపజయానికి విధి, ఇతరులు, పరిస్థితులు కారణం’ అని తప్పుని ఎదుటి వాడి పైకి నెట్టేసే గుణం ఇవన్నీ నెగెటివ్ థాట్స్ తాలుకు ఫలితాలే.

“యూ గెట్ వాట్ యూ సో” నీవు ఏ విత్తుని నాటుతావో అవే ఫలితాలు వస్తాయి సుమా!

అలా కాకుండా మన బుర్రని పాజిటివ్ థాట్స్‌తో నింపితే మనకు ఫలితాలు కూడా నూటికి నూరు పాళ్ళు పాజిటివ్‌గా వస్తాయి.

ఆరోగ్యం, విజయ పరంపర, చిరునవ్వుతో కూడిన జీవితం, ఎదుటి వారిని అర్థం చేసుకునే హృదయవైశాల్యం ఇవన్నీ పాజిటివ్ ఫలితాలు సునాయాసంగా మన జివితంలో భాగం అయి కూర్చుంటాయి.

ఇవన్నీ మీకు తెలుసు. కానీ క్రమంగా ఈ మంచి విషయాలని మరిచిపోయే అవకాశం అయితే ఉంది. దానినే పెద్దలు మాయ అంటారు కద.

కాబట్టి ఈ పుస్తకాన్ని తరచూ చదవండి. మీరు చదవడమే కాదు మీ కుటుంబ సభ్యులని కూడా చదవమని చెప్పండి.

మీ గోల్స్‌ని పదే పదే గుర్తు తెచ్చుకోండి.

ఇంగ్లీష్ భాషలో ‘మేకింగ్ మనీ’ అనే పద ప్రయోగం ఉంది. అంటే డబ్బు సంపాయించటం అని ఒక అర్థం వస్తుంది. డబ్బుని తయారు చేయటం అని ఇంకో అర్థం వస్తుంది. కష్ట పడకుండా డబ్బు సంపాయించాలని కలలు కనే వాళ్ళు ప్రభుత్వ ముద్రణా కర్మాగారంలో డబ్బుని తయారు చేయవలసిందే.

డబ్బు సంపాయించాలి అంటే కష్టపడాలి తప్పదు. ఇక్కడ మనం చెప్పుకున్న ఈ ముప్ఫై రోజుల ఛాలెంజిని కష్టంగా అనుకోకుండా ప్రేమతో మొదలెట్టండి.

డబ్బు సంపాయించటం గూర్చి మీకు ఒక ప్రకృతి నియమం చెబుతాను. డబ్బు సంపాయించాలంటే మీ ముందున్న ఒకే ఒక మార్గం ఏమిటో తెలుసా?

“ఇతరుల అవసరాలని తీర్చే ప్రాడక్టు గానీ, సర్వీస్ గానీ అందిచటం ద్వారా మాత్రమే ఎవ్వరైనా డబ్బు సంపాయించగలరు.”

వినటానికి కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది కద.

‘నేను వ్యాపారమో, మార్కెటింగో చేయాలంటారా ఏమిటి?’ అని అడుగుతున్నారు కద.

అదేమి అక్కర లేదు. మీరు ఇప్పుడు ఏ పని చేస్తున్నారో ఆ పనే చేయండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు ఏ పని అయినా సరే అది ఇతరుల అవసరాలు తీర్చటానికి సృష్టించబడిన పనే కద.

మన ప్రాడక్ట్‌ని, సర్వీసుని, సమయాన్ని, మేధా సంపత్తిని ఇలా మన దగ్గర ఏది ఉంటే అది దాన్ని వెచ్చించి మనం ఇతరుల అవసరం తీరే లాగా ఉపయోగపడతున్నాం. వాళ్ళ డబ్బుని, మన వస్తువుకో, సర్వీసుకో, మన సమయానికో, మేధా సంపత్తికో ఎదుటి వాడు ఇస్తున్నాడు మనకి.

కాబట్టి డబ్బు సంపాయించటానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు.

కాబట్టి దీన్ని ఒక సైన్స్ ఫార్ములా రూపంలో చెప్పాలి అంటే “మనకి ఎదుటి వాడు ఇచ్చే డబ్బు మనం ఎదుటివాడికి అందించే సర్వీసుకి అనులోమానుపాతంలో (డైరెక్ట్లీ ప్రొపోర్షనల్) ఉంటుంది.”

డబ్బు సంపాయించటం వల్ల విజయం రాదు.

విజయం సాధించటం వల్ల డబ్బు వస్తుంది.

ఎంత ఎక్కువ మంది వ్యక్తుల అవసరాలు తీర్చగలిగే సర్వీసు గానీ, ప్రాడక్టు గానీ, ఐడియా గానీ మీరు తయారు చేయగలుగుతారో అప్పుడు మీకు విజయం అంత త్వరగా వస్తుంది.

ఎంతో మంది వ్యక్తులకి, ఎంతో తక్కువ సమయంలో మీ ఉత్పత్తి గానీ, సర్వీసు గానీ, సమయం గానీ మీరు ఉపయోగపడేలా చేర్చగలిగితే అంత ఎక్కువ విజయం లభిస్తుంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here