[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]
[రాఘవ బోధన, భోజనవిభాగపు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఆ ఆవాస విద్యాలయానికి అలవాటు పడుతాడు. ఓ రోజు అల్పాహారంగా ఉప్మా చేస్తే, పిల్లలెవరూ సరిగా తినరు. కొందరు తినకుండా బహిర్భూమి సాకుతో బయటకు వెళ్ళిపోతారు. ఆ రోజు ఉప్మా రుచి కుదరలేదు. ప్రధానాచార్యులు కూడా బలవంతంగా తింటారు. అప్పుడు రాఘవకి ఓ ఆలోచన వచ్చి, ప్రధానాచార్యులుని ఒప్పించి మరునాడు పొంగలి తయారుచేయిస్తాడు. రుచి బాగా కుదరడంతో పిల్లలూ, అధ్యాపకులు చక్కగా తింటారు. రెండు వారాలకి ఒకసారి పొంగలి చేయించేందుకు అనుమతి పొందుతాడు రాఘవ. ఓ రోజు మధ్యాహ్న భోజనాల అయ్యాకా, ఇంకా సమయం ఉండడంతో రాఘవ తన గదిలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. చల్లా రవి బహిర్భూమికి వెళ్ళడానికి అనుమతి తీసుకుని తనతో బాటు బత్తిని అనే కుర్రాడిని తోడు తీసుకువెళ్తాడు. కొద్ది సేపటికి బత్తిని పరిగెత్తుకు వచ్చి, అక్కడ పెద్ద తేలు కనిపించిందని చెప్తాడు. రాఘవ వాడిని తీసుకుని రవి ఉన్న చోటికి వెళ్ళేసరికి ఓ పుల్లతో తేలుని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు రవి. వాడిని హెచ్చరిస్తాడు రాఘవ. అది తేలు కాదు పెద్ద మండ్ర గబ్బ. రవి చేసిన హడావిడికి పుట్టలోంచి పదుల సంఖ్యలో మండ్రగబ్బలు బయటకొస్తాయి. ఈలోపు మిగతా పిల్లలూ, ఇతర ఉపాధ్యాయులు అక్కడికి చేరుతారు. వాటినేమీ చేయద్దని హెచ్చరిస్తూ, పిల్లల్ని వారి వారి నిలయాలకి చేరుస్తారు ఉపాధ్యాయులు. కొంతదూరం అవి వెంబడించి, ఆగిపొతాయి. ఈ లోపు ప్రధానాచార్యులకి విషయం తెలిసి ఆయన అక్కడికి వచ్చి రవిని మందలిస్తారు. – ఇక చదవండి.]
25. అపరిచితుడు?!
ఒకరోజు పిల్లలందరూ ఉదయం అల్పాహారం తిన్నాక ఎవరి తరగతులకు వాళ్లు వెళ్లిపోయారు. ప్రార్థన పూర్తయ్యి తరగతులు కూడా మొదలయ్యాయి. చుట్టూ పరుచుకున్న నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ ఉపాధ్యాయుల గొంతుకలు మాత్రం వినిపిస్తున్నాయి.
దూరంగా రోడ్డుమీద.. బస్సు ఊళ్లో నుండి వరంగల్‌కు వెళుతున్నట్టుంది.
రాఘవ వంటశాలలో ఉన్నాడు. వంటమాస్టరుకు మధ్యాహ్నపు వంటకు కావలసిన సరుకులన్నీ ఇచ్చాడు. రోజువారీ జమాఖర్చుల్ని రాసే రిజిష్టరును ముందుపెట్టుకుని సరుకుల స్టాకును పరిశీలిస్తున్నాడు.
ఇంతలో.. బయట ఎవరో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి వెంకటయ్యను ఏదో అడుగుతున్నాడు.
“నేనీడ వంటచేసే మనిసిని మాత్రమేనండి. మీరు మా ఆచార్జీతో మాట్లాడండి..” అంటూ గుమ్మం దగ్గరికొచ్చి రాఘవను పిలిచాడు వెంకటయ్య.
పనిలో మునిగిపోయి ఉన్న రాఘవ తలపైకెత్తి, ‘ఎవరూ..’ అన్నట్టు వంటవాడి వైపు చూశాడు.
“ఎవరో తెలియదు ఆచార్జీ. ఒకసారి మీరొచ్చి మాట్లాడండి!” అని తన పనిలో పడ్డాడు వెంకటయ్య.
‘ఎవరబ్బా?’.. అనుకుంటూ బయటికొచి చూశాడు రాఘవ.
బయట ఒకవ్యక్తి ప్యాంటూ షర్టూ వేసుకుని ఉన్నాడు. చూడ్డానికి కాలేజీ స్టూడెంట్‌లాగా ఉన్నాడు. ఫుల్‌హ్యాండ్ షర్టును సగానికి మడిచి ఉన్నాడు. సన్నటి గడ్డంతో చూడ్డానికి చురుకైన యువకుడి లాగానే ఉన్నాడు.
రాఘవ, అతణ్ణి అంతకుమునుపు ఎప్పుడూ ఆ పరిసరాల్లో చూడలేదు. ఇదే మొదటిసారి చూడటం.
“మీరేనా ఈ వంటశాలకు ఇన్‌చార్జీ?..” అంటూ అతను వ్యంగ్యంగా ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు కోపం తన్నుకొచ్చినా దాన్ని బయటికి కనిపించనియ్యకుండా.. “నేనిక్కడ పాఠాలు చెప్పే ఆచార్యుణ్ణి.” అని ప్రశాంతంగా బదులిచ్చాడు రాఘవ.
“ఔనా? నాకు తెలియదు లెండి!” అన్నాడతను మళ్లీ వ్యంగ్యంగా.
“తెలుసుకోండి. ఇక్కడ పనిచేసే ఆచార్యులు ఇలా తెల్లటి పంచె, లాల్చీ ధరించి ఉంటారు. ఇది మా పాఠశాల నియమం.”
“ఆహా! ఏ సబ్జెక్టు చెబుతారు మీరు?” తలను అడ్డంగా ఊపుతూ అధికారిలా ప్రశ్నించాడతడు.
“తెలుగు, సోషల్..” అసహనంగా అని, “అదలా ఉంచండి. మీకేం కావాలో అది చెప్పండి ముందు.” అన్నాడు.
“మాకు అల్పాహారం కావాలి.” ఆర్డర్ వేస్తున్నట్టుగా అన్నాడతను.
దాంతో ఒళ్లు మండిపోయింది రాఘవకు. ‘అప్పుడప్పుడూ గొఱ్ఱెల కాపరులూ, కూలీలూ, బాటసారులూ ఇలా వచ్చి తినటానికి ఏమైనా ఉంటే పెట్టమని అర్థిస్తూ ఉంటారు. కానీ ఇతనేం ఏకంగా తనను ఆర్డర్ వేస్తున్నాడు? ఇతనేమన్నా తమకు పైఅధికారా?’
“మాకు అంటున్నారు, ఎంతమందికి కావాలేం అల్పాహారం?” అంటూ అతణ్ణి సూటిగా ప్రశ్నించాడు రాఘవ.
“మేం పదిమందిమి ఉన్నాం. మాకందరికీ కావాలి.”
“చూడండి, ఇక్కడికి అప్పుడప్పుడూ పశువుల కాపరులూ, కూలీలూ వచ్చి తినటానికి మిగిలింది ఏమైనా ఉంటే పెట్టమని అడుగుతుంటారు. మేమూ ఏమైనా మిగిలి ఉంటే పెడుతుంటాం. కానీ మీరు ఏకంగా పదిమందికి కావాలంటున్నారు. పైగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరినైనా ఏమైనా అడిగే తీరు ఇదేనా?” అని అతని ముఖంలోకి సూటిగా చూశాడు రాఘవ.
“ఏం? మిమ్మల్ని కాళ్లు పట్టుకుని అర్థించాలా?” అంటూ హుంకరించాడు ఆ యువకుడు.
“కాళ్లు పట్టుకోమని ఎవరన్నారు. అడిగే మాటలు వినయంగా ఉంటే అంతే చాలు, ఎవరైనా పెడతారు. అయినా ఇవ్వాళ అల్పాహారం అస్సలు మిగల్లేదు. సారీ..” అంటూ తన నిస్సహాయతను తెలియజేశాడు రాఘవ.
“ఎంత నిక్కచ్చిగా లేదంటున్నారు మీరు.” కోపంగా అన్నాడతను.
“నిజాలెప్పుడూ నిక్కచ్చిగానే ఉంటాయి మిస్టర్. నా మాటమీద మీకు నమ్మకం లేకపోతే, వెంకటయ్యా ఆ వంట పాత్రలను తీసుకొచ్చి ఇతనికి చూపించు. అప్పుడైనా నమ్ముతాడేమో చూద్దాం.”
వాళ్ల మాటల్ని వింటున్న వెంకటయ్య.. “ఈపూట అల్పాహారం మాకే చాల్లేదండీ. ఆచార్జీ చెప్పింది నిజమే!” అన్నాడు.
“అలాగా.. అయితే మధ్యాహ్నానానికైనా మాకు భోజనం ఏర్పాటు చెయ్యండి.” అంటూ మళ్లీ హుకుం జారీ చేశాడతను.
‘అతని వ్యవహారమేదో మాంచి జోరు మీదే ఉన్నట్టుంది. మనకెందుకీ తలనొప్పులన్నీ’ అనుకుంటూ.. “చూడండి. మీరు వెళ్లి మా ప్రధానాచార్యులతో మాట్లాడండి. ఆయన ఒప్పుకుంటే నాదేముంది.” అని అతణ్ణి పంపేశాడు రాఘవ.
అతను అటు వెళ్లాక..”చూడు వెంకటయ్యా ఎలా ఉందో అతని వ్యవహారం? పదిమందికి భోజనం కావాలట. అతనేం మనకు చుట్టాలా పాడా? అయినా అడుక్కునేవాడికి అంత అహంకారం పనికి రాదు వెంకటయ్యా. ప్రధానాచార్యులు కూడా ఇందుకు ఒప్పుకోకూడదు. ఒప్పుకున్నారంటే ఇక అదే అలవాటైపోతుంది వీళ్లకు.”
“అవును. ఒకరికీ ఇద్దరికీ పెట్టొచ్చు కానీ, పదిమందికి ఊరికే పెట్టాలంటే, ఇదేం సత్రమా?” అన్నాడు వెంకటయ్య.
ఇంతలో అతను మళ్లీ వంటశాల దగ్గరికొచ్చాడు. “మీ ప్రధానాచార్యుల్ని అడిగాను. ఆయనా అంగీకరించారు. మాకూ కలిపి వంట చెయ్యమని మీతో చెప్పమని చెప్పారు.” అన్నాడు ఏదో సాధించినవాడిలా.
“అలాగే. మధ్యాహ్నం మా పిల్లలందరూ భోజనం చేసి వెళ్లాక మీరందరూ ఇక్కడికి రండి.”
“థాంక్స్. మేమందరం ఇక్కడికొస్తే బావుండదు. మీరే మా పదిమందికి సరిపడా ఒక బేసిన్‌లో అన్నమూ, రెండు బక్కెట్లలో కూరా, రసమూ పోసి ఉంచండి. మేము ఇద్దరమొచ్చి తీసుకెళతాం.” అన్నాడు సావకాశంగా.
“అందరమొస్తే బావుండదు అంటున్నారు. ఏం, మీరేమైనా అంటరానోళ్లా?”
“కాదు, ర్యాడికల్స్!” అన్నాడు ఆ కుర్రాడు.
“అంటే?” అర్థం కాక అడిగాడు రాఘవ.
“అది కూడా తెలియదా? తీవ్రవాదులం! ఇక్కడ ఒక గ్రూపుకు మేము సాయం చేస్తుంటాం.”
‘గ్రూపు’ అన్న పదం వినగానే వెంకటయ్య గబగబా బయటికొచ్చి రాఘవకు ఏదో సైగ చెయ్యబోయాడు.
రాఘవ దాన్ని పట్టించుకోకుండా, “చూడ్డానికి కాలేజీ విద్యార్థుల్లా ఉన్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇవేం పనులు?”
“బుద్ధిగా చదువుకునే పరిస్థితులు ఉన్నాయా ఇక్కడ? ఇక్కడి పరిస్థితులు మీకేం తెలిసినట్టులేవు. అసలు మీరు ఈ ప్రాంతం వారు కాదేమోనని నా అనుమానం?” అన్నాడు ఆవేశంగా.
“ఔను, మాది ఈ ప్రాంతం కాదు, రాయలసీమ.” చెప్పాడు రాఘవ.
“అదీ.. మీ మాటలే చెబుతున్నాయిలెండి మీరు ఇక్కడివాళ్లు కారనీ. అందుకే మా సమస్యలు మీకేమీ పట్టవు. అయినా అక్కడివాళ్లు అక్కడే ఉద్యోగం చేసుకోక ఇక్కడికి ఎందుకొచ్చారు?” సీరియస్‌గా ప్రశ్నించాడతను.
“ఇక్కడా అక్కడా అనేముంది? ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి పొట్టపోసుకోవచ్చు, జీవించవచ్చు. అలాకాదు, ఎక్కడివాళ్లు అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలంటే అది సాధ్యమయ్యే పనేనా? స్థానికులలో అన్ని రకాల నైపుణ్యాలూ ఉండొద్దూ? అందరికీ జీవనోపాథి లభించొద్దూ? బయటికెళితేనేగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవటానికి వీలవుతుంది. అందుకే చదువుకున్నవాడు ఇవ్వాళ ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళుతున్నాడు. అలా వలసలు వెళ్ల బట్టేగా నాగరికతలు వెల్లివిరిశాయి. దీన్ని మీరు కాదనగలరా?” అతణ్ణే సూటిగా చూస్తూ ప్రశ్నించాడు రాఘవ.
అతను సమాధానం చెప్పలేక మౌనం వహించాడు.
తర్వాత ఏదో దీర్ఘంగా ఆలోచించి నిట్టూరుస్తూ.. “బాగా స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నారు. బాగుంది మీ వివరణ. ఏం చదువుకున్నారు మీరు?” అని ప్రశాంతంగా ప్రశ్నించాడతను.
“బి.కాం. డిగ్రీ. మరి మీరూ”
“బి.ఎస్సీ.. సెకెండ్ ఇయర్.”
“ఎక్కడా?..”
“సారీ.. మా విషయాలేవీ చెప్పటం నాకిష్టంలేదు.”
“ఓ.కే. నేనూ బలవంతం చెయ్యను.” అన్నాడు రాఘవ.
“మరిచిపోవద్దు. మాకు పదిమందికీ కలిపి మధ్యాహ్నం వంట చెయ్యించండి, వెళ్లొస్తాను.” అంటూ అతను చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
అతను వెళ్లిపోయాక రాఘవ ప్రధానాచార్యుల గదిలోకి అడుగుపెట్టాడు.
ఆయన తన సీట్లో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు.
“నమస్తే, ఆచార్యజీ! ఇందాకా వచ్చిన వ్యక్తి డిమాండును మీరు అంగీకరించారా?” సూటిగా అడిగేశాడు రాఘవ.
“తప్పదు రాఘవగారూ. ఏం చేస్తాం, మరో మార్గం లేదు.” అన్నాడు నిస్సహాయంగా.
“అయినా అలాంటి వాళ్లను మనం ప్రోత్సహించకూడదు ఆచార్యజీ. మొదట్లోనే వీళ్ల కోరికల్ని తుంచి పడెయ్యాలి. లేకుంటే ప్రతిసారీ ఇలాగే వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు.”
“ఔను, మీరన్నది ముమ్మాటికీ నిజమే! కానీ నేను అంగీకరించటానికి కారణముంది. వాళ్లకు మనం సాయం చెయ్యకపోతే మనపై ఎక్కడ కక్ష కడతారోనన్న భయంతోనే అంగీకరించాను. కానీ, ఈ విషయం ఇక్కడివాళ్లకు తెలిసిందంటే మనల్ని ఊరకే వదిలిపెట్టరు. అందుకే ‘ఇదే ఆఖరుసారి’ అని చెప్పి అతని కోరికను అంగీకరించాను.” చెప్పారు ప్రధానాచార్యులు.
“చదువుకున్నవాడిలా ఉన్నాడు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడో అర్థంకావటం లేదు. ఇందాకా వంటశాలకొచ్చి నాదగ్గర ఏదేదో మాట్లాడాడు ఆచార్యజీ!” ఫిర్యాదు చేస్తున్నట్టుగా అన్నాడు రాఘవ.
“అయ్యాయా, మీకూ అయ్యాయా పాఠాలు. అతను మీకే కాదు నాకూ పాఠాలు చెప్పాడు.”
“ఏం చెప్పాడు ఆచార్యజీ?” కుతూహలంగా అడిగాడు రాఘవ.
“ఈ కార్యాలయంలోని గాంధీ, నెహ్రూ, శాస్త్రి, పటేల్ ఫోటోలన్నీ తీసెయ్యాలట.”
“ఆ..” నోరు తెరిచాడు రాఘవ.
“అంతేనా, అతను కొందరి పేర్లు చెప్పి, వాళ్లే నిజమైన దేశభక్తులట. వాళ్లే ప్రస్తుత సమాజానికి అవసరమట. వాళ్ళ ఫోటోలే ఇక్కడ తగిలించాలట. అని నాతల బొప్పి కట్టించాడు.” అని ఉస్సూరుమని, “మధ్యాహ్నం జాగ్రత్తగా ఉండండి. మనవాళ్లెవర్నీ వాళ్లతో కలవకుండా చూసుకోండి. వాళ్లు ప్రశాంతంగా ఇక్కణ్ణించి వెళ్లిపోతే, మన గండం గడిచినట్టే!” అన్నాడు నిట్టూరుస్తూ.
“అలాగే ఆచార్యజీ..” అంటూ కార్యాలయంలో నుండి బయటపడ్డాడు రాఘవ.
మధ్యాహ్నం భోజనాలయ్యాక రాఘవ ఒంటరిగా వేపచెట్టుకింద నిలబడుంటే, రాజారావొచ్చి కలిశాడు.
“రాఘవగారూ, ఉదయం ఇక్కడికి అన్నలొచ్చారట కదా?” అని సూటిగా ప్రశ్నించేసరికి బిత్తరపోయాడు రాఘవ.
“మీకెవరు చెప్పారు?”
“ఏవరైతే ఏం? వచ్చినమాట నిజమా కాదా?”
‘వెంకటయ్యే చెప్పి ఉండాలి!’ అని ఆలోచిస్తుంటే “మధ్యాహ్నం మళ్లీ భోజనం పట్టుకెళ్లటానికి వస్తారట కదా?”
‘అనుమానం లేదు. వెంకటయ్యే చెప్పినట్టున్నాడు.’
“రాఘవగారూ నాదొక చిన్న మనవి. ఒక సోషల్ ఉపాధ్యాయుడుగా వాళ్లను పరిశీలించటమంటే నాకెంతో ఆసక్తి. దయచేసి మధ్యాహ్నం వాళ్లను కలిసే అవకాశం నాకు కల్పించగలరా?”
అతనేం మాట్టాడుతున్నాడో రాఘవకేమీ అర్థం కాలేదు.
“ఎప్పటినుండో వాళ్లను కలవాలనీ, వాళ్లతో మాట్లాడాలనీ, వాళ్ల విషయాలు తెలుసుకోవాలని నా కోరిక. దాన్ని ఎలాగైనా ఇవ్వాళ నెరవేర్చుకోవాలి. అందుకు మీరే సాయం చెయ్యాలి.”
“మన ప్రధానాచార్యులుగారు వాళ్లతో ఎవరూ కలవకుండా చూడండి అన్నప్పటి నుండి జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు మీరొచ్చి ఇలా అడగటం ఏమీ బాగాలేదు రాజారావుగారు. అసలు వాళ్లంటే మీకేమీ భయంగా అనిపించటం లేదా”
“భయమెందుకు? వాళ్లేం రాక్షసులా? వాళ్లూ మనలాంటి మనుషులేగా!.. చూడండి, వాళ్లు మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లటానికి వచ్చినపుడు నేనూ వాళ్లతో ఎలాగైనా వెళతాను. వెళ్లి వాళ్ల భోజనాలు పూర్తయ్యాక తిరిగొచ్చేస్తాను.”
“ఈ విషయం కనక మన ప్రధానాచార్యులకు తెలిసందంటే ఇంకేమైనా ఉందా?”
“ఆ విషయంలోనే మీరు నాకు సాయం చెయ్యాలి. నేను వెళ్లినట్టు మన ప్రధానాచార్యులకు అస్సలు తెలియకూడదు. అంతేకాదు, నా క్లాసులల్ని మీరు తీసుకోండి. ప్లీజ్!”
“నాకూ క్లాసులున్నాయిగా?..”
“మీకూ నాకూ క్లాష్ వస్తే.. మీరు మీ క్లాసులోని పిల్లలకు ఏదో ఒక పని అప్పచెప్పి, నా క్లాసుకు వెళ్లండి. నేను ఇంటర్వెల్ కంతా వచ్చేస్తాను. ఇదొక గొప్ప అవకాశం. ఇది తప్పితే మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. ప్లీజ్ కాదనకండి.”
సరే అనక తప్పలేదు రాఘవకు. రాఘవ చేతిని పట్టుకుని ఆనందంతో కుదిపేశాడు రాజారావు.
ఆ మధ్యాహ్నం రాజారావు వంటశాలలోనే ఉండి ఆ ర్యాడికల్ వ్యక్తి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూడసాగాడు.
ఈమారు ఆ వ్యక్తితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడు.
ఒక వ్యక్తి అన్నం బేసిన్‌ను అందుకున్నాడు. ఇంకోవ్యక్తి చెరొక చేత్తో సాంబారు, రసం బకెట్లను తీసుకున్నాడు. రాజారావు స్టోర్రూమునుండి బయటికొచ్చి మంచినీళ్ల బకెట్‌ను, స్టీలుగ్లాసుల్ని అందుకుని వాళ్లతోపాటే బయలుదేరాడు. వాళ్లు రాజారావును ఓసారి ఎగాదిగా చూశారు కానీ ఏ అభ్యంతరం పెట్టలేదు. వంటమాస్టరు జాగ్రత్త అని రాజారావుకు సైగచేశాడు.
ఆ సాయంత్రం బడి అయిపోయాక.. రాఘవ రహస్యంగా వెళ్లి రాజారావును కలిశాడు.
“వెళ్లిన పని ఏమైందీ?” అడిగాడు రాఘవ.
“వెళ్లాను, కలిశాను, మాట్లాడాను. నా జీవితంలో ఈరోజు ఒక మరపురాని రోజు!” సంబరపడిపోయాడు రాజారావు.
“సరే, ఇంతకీ ఏం మాట్లాడారూ అని! జరిగినదంతా చెప్పండి.”
“మేము భోజనం తీసుకుని చాలా దూరం తైలంచెట్ల మధ్య నడిచాం. ఒకచోట ఆగాము. అక్కడెవరూ కనిపించలేదు. ఇద్దరిలో ఒక వ్యక్తి ఒక పక్షిలా కూశాడు. వెంటనే ఇంకెక్కడినుండో ఇంకో పక్షి గొంతు వినిపించింది. ఐదునిమిషాలకల్లా పదిమంది వ్యక్తులు తుపాకులు చేతబట్టుకుని అక్కడికొచ్చారు. అందరూ చదువుకుంటున్న విద్యార్థుల్లాగానే ఉన్నారు. ప్యాంటూ షర్టూ వేసుకున్నారు.
తుపాకులన్నీ ఒకచోట పెట్టి నేలమీద వృత్తాకారంలో కూర్చుని కింద ఒక గుడ్డను పరిచారు. అందులోకి అన్నం కుమ్మరించారు. దానిలోకి ఒకవైపున సాంబారును పోసి కలిపారు. తర్వాత అందరూ చేతుల్లోకి అన్నం ముద్దల్ని తీసుకుని తిన్నారు. మళ్లీ మిగిలిన అన్నంలోకి పచ్చిపులుసు పోసి కలిపారు. దాన్నీ అందరూ కలిసి గుంపుగా తిన్నారు. ఎవరికి కావలసినంత వాళ్లు తిన్నారు.
నేను వాళ్లకు గ్లాసుల్లో మంచినీళ్లను పోసి అందించాను. వాళ్లు చాలా సంతోషించారు. నన్ను వాళ్ల స్నేహితుడిగా భావించారు. దాన్ని ఆసరాగా తీసుకుని అమాయకంగా ఏవేవో ప్రశ్నలడిగాను. అన్నింటికీ వాళ్లు జవాబులు చెప్పలేదు. కొన్నింటికి మాత్రమే చెప్పారు.
వాళ్ల తుపాకులను దగ్గరనుండి చూసే అవకాశం కలిగింది. ఒకరి దగ్గర హ్యాండ్‌గ్రనేడ్‌ను కూడా చూశాను. అది ఎలా పనిచేస్తుందని అడిగాను. ఓపికగా అది ఎలా పనిచేస్తుందో చెప్పాడు. కొంతసేపు అక్కడే ఉన్నాను. నన్ను ఖాళీ పాత్రలను తీసుకుని వెళ్లిపొమ్మన్నారు. ఒక్కడివల్లే అన్నీ తీసుకెళ్లటం కష్టమని చెప్పగానే ఒకవ్యక్తి నాకు తోడుగా వచ్చాడు. మేము వస్తూంటే వాళ్లందరూ కలిసి కోరస్‌గా ఒక విప్లవగీతాన్ని పాడటం వినిపించింది. దార్లో ఆ వ్యక్తి ‘తాము అక్కడికొచ్చిన విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు.’ నేను అలాగేనంటూ వినయంగా జవాబిచ్చాను. నాతో వచ్చిన వ్యక్తి పాత్రలను వంటశాలకు చేర్చాక, పిడికిలి బిగించి నాకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. అదీ జరిగింది.” అంటూ ముగించాడు రాజారావు.
అంతా విన్నాక.. దీర్ఘంగా నిట్టూర్చాడు రాఘవ.
26. మందలింపు
ఉదయపు తరగతులు ప్రారంభమై మూడవ (కాలాంశం)పీరియడ్ జరుగుతోంది.
రాఘవ, 6వ తరగతి గదిలో సాంఘిక శాస్త్రం పాఠం చెబుతున్నాడు. పిల్లలందరూ శ్రద్ధగా వింటున్నారు.
ఇంతలో కార్యాలయం గుమస్తా గుమ్మం దగ్గరికొచ్చి.. “ప్రధానాచార్యులు మిమ్మల్ని పిలుస్తున్నారండీ!’ అని చెప్పి వెళ్లాడు. పాఠాన్ని సగంలో కాకుండా చెబుతున్న విషయాన్ని పూర్తిచేసి ప్రధానాచార్యుల గదిలోకి అడుగుపెట్టాడు రాఘవ.
అక్కడ కుర్చీలో మాధవరెడ్డి కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ ఆయనకు నమస్కరించాడు.
“రాఘవగారూ వారు మీకు తెలుసుగా? మిమ్మల్ని కలవటానికొచ్చారు.” అని ప్రధానాచార్యులు రాఘవ వైపు చూశారు.
‘బాబాయ్ ఉన్నపళంగా తనకోసం ఎందుకు వచ్చుంటారు? విషయం ఏమై ఉంటుంది?’ అని మనసులో అనుకుంటూ.. “నేనీ పాఠశాలలో చేరటానికి వారే కారణం, వారిని నేనెలా మరిచిపోగలను?” నవ్వుతూ బాబాయ్ దగ్గరికెళ్లాడు.
“చాలా సంతోషం!” అంటూ.. బాబాయ్ లేచి అతని భుజమ్మీద చెయ్యేసి బయటికి తీసుకెళ్లాడు. బయట కొంతదూరంలో దారిపక్కనున్న వేపచెట్టు కింద నిలబడ్డారు.
“రాఘవా, నువ్వు ఇక్కడికొచ్చి ఎంతకాలమైంది?” సూటిగా ప్రశ్నించాడు బాబాయ్.
“ఎంత బాబాయ్, నెలకు పైగానే అయ్యుంటుందంతే?” తేలిగ్గా అన్నాడు రాఘవ.
“మరి ఈ నెలరోజుల్లో నీకు మీవాళ్లెవరూ గుర్తుకు రాలేదా?”
“ఏమైంది బాబాయ్?”
“నన్ను మరిచిపోని నువ్వు, నీ తల్లిదండ్రుల్ని మరిచిపోవటం దారుణం. నీ నుండి ఉత్తరం రాకపొయ్యేసరికి నువ్వు ఏమైపోయావో, నీకేమైందో, ఏమోనని వాళ్లెంతగా తపించిపోతున్నారో తెలుసా? వాళ్లను అలా ఆదుర్దాకు, అశాంతికి గురిచెయ్యటం నీకు భావ్యమేనా?” కోపంగా అన్నాడు బాబాయ్.
నేరం చేసినట్టుగా తల దించుకున్నాడు రాఘవ.
“మీ నాన్నగారు నా చిరునామాను ఎలా గుర్తుపెట్టుకున్నారో కానీ, నాకొక ఉత్తరమూ, నీకంటూ వేరుగా ఇంకో ఉత్తరమూ రాసి పంపారు. అవి నిన్ననే అందాయి. ఇవ్వాళ మా బావగారితో పనుండి వస్తూ దాన్నీ పట్టుకొచ్చాను. ఇదిగో..”
బాబాయ్‌కి రాసిన ఉత్తరంలో తన గురించి ఏం రాశాడో నాన్న? కానీ ఆ విషయాలేవీ ప్రస్తావించలేదు బాబాయ్. దాన్ని తన దగ్గరే ఉంచుకున్నట్టున్నారు. ఆయన చేతిలో నుండి తన పేరుతో ఉన్న చించని కవరును అందుకున్నాడు రాఘవ.
“మీ తల్లిదండ్రులపట్ల నీకేమైనా కోపముందో ఏమో నాకు తెలియదు. కానీ, ఇన్నిరోజులు గడిచినా వాళ్లకు ఉత్తరం రాయకుండా ఉండటం మాత్రం క్షమించరాని నేరం. ఈ వయసులో వాళ్లకు క్షోభను కలిగించటం అంత మంచిది కాదు. వెంటనే ఇవ్వాళే.. నువ్వు నీ క్షేమసమాచారాలను తెలుపుతూ వాళ్లకు ఉత్తరం రాసి పోస్టు చెయ్యి, సరేనా? అంతేకాదు, ఇక మీదట వారానికి ఒక్కటైనా వాళ్లకు నువ్వు ఉత్తరం రాస్తుండాలి, తెలిసిందా?” హెచ్చరికలా చెప్పాడు మాధవరెడ్డి.
అలాగే అన్నట్టుగా తలూపాడు రాఘవ.
వెంటనే పరిస్థితిని తేలిక పరచాలన్న ఉద్దేశంతో.. “ఆ ఇక్కడి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి రాఘవా? సౌకర్యంగా ఉందా? పాఠశాల నచ్చిందా? మా వంటకాలు నచ్చాయా? ఇబ్బందులేమైనా ఉన్నాయా?” నవ్వుతూ టకటకమంటూ ఆడిగాడు.
“బాబాయ్, ఆగండాగండి. అన్నీ బావున్నాయి. నాకిక్కడ ఏ లోటూ లేదు. పరిస్థితులతో సర్దుబాటు అయ్యేవాడికి సమస్యలేవీ రావన్నది నా అనుభవం. ఒకవేళ ఒకటీ అరా వచ్చినా ఎదుర్కోవాలే కానీ దాన్ని సమస్యగా భావించకూడదు.”
అతని అనుభవపూర్వకమైన మాటలకు ఆనందిస్తూ శెభాష్ అన్నట్టుగా అతని భుజం తట్టాడు మాధవరెడ్డి.
“మంచిది రాఘవ. నీ గురించి ఈ విషయమే చెప్పారు మీ ప్రధానాచార్యులూనూ!”
“ఏం చెప్పారు బాబాయ్?” ఆసక్తిగా అడిగాడు రాఘవ.
“నువ్వు ఏ భేషజమూ లేకుండా వాళ్లల్లో ఇట్టే కలిసిపోయావట. పిల్లల్ని బాగా చూసుకుంటున్నావట. వాళ్లను అస్సలు దండించటం లేదట!” అని అంటున్న ఆయన మాటలకు నవ్వి ఊరుకున్నాడు రాఘవ.
“అన్నట్టు రాఘవా, నీకు భోజన విభాగపు బాధ్యతను కూడా అప్పగించారటగా? మరి దాన్ని నువ్వు ఏ రకంగా భావిస్తున్నావు? నీకు అది అదనపు పని భారమే కదూ?” అంటూ అతని ముఖంలోకి పరీక్షగా చూశాడు మాధవరెడ్డి.
“అలా అనుకుంటే ఎలా బాబాయ్. ఇక్కడ ప్రతి ఒక ఆచార్యుడూ అదనంగా మరొక బాధ్యతనూ నిర్వహిస్తున్నప్పుడు నాకు మాత్రం అది ఎలా అదనపు భారమవుతుంది? అందరూ తలా ఒక పనిని చేస్తేనే కదా వ్యవస్థ సక్రమంగా సాగుతుంది. నేను దాన్ని భారంగా అనుకోవటం లేదు బాబాయ్, అది నా బాధ్యతలో ఒక భాగంగానే అనుకుంటున్నాను.” ఆత్మవిశ్వాసంతో అన్నాడతడు.
“ఔను. నీలో ఆ నిబద్ధత కనిపిస్తోందనే చెప్పారు మీ ప్రధానాచార్యులు కూడా. అన్నట్టు నువ్వేదో ఒక కొత్త అల్పాహారం చేసి అందరినీ మెప్పించావట కదా? ఏంటో ఆ వంటకం?” నవ్వుతూ అడిగాడు మాధవరెడ్డి.
“కొత్తదేం కాదు బాబాయ్, పాత వంటకమే. నెయ్యి పొంగలి! వీళ్లు తినక తినక తినేసరికి అది రుచిగా అనిపించినట్టుంది, అంతే!”
“మంచిది రాఘవ. ఇలాగే అందరినీ నీ ప్రవర్తన ద్వారా మెప్పించి మంచి పేరు సంపాదించుకో, సరేనా! మరి నేనిక వెళ్లిరానా?” అంటూ అతని భుజాన్ని తట్టి ముందుకు కదిలాడు మాధవరెడ్డి.
“అలాగే బాబాయ్.” అంటూ అయన్ను అనుసరించాడు రాఘవ.
వెళుతున్నవాడల్లా మాధవరెడ్డి ఠక్కుమంటూ ఆగి, “నీ బాకీ తీర్చటం మరిచేపొయ్యాను రాఘవా, ఇదిగో తీసుకో?” అన్నాడు. ఆనాడు కన్యాకుమారిలో ఫొటోఫ్రేమ్ కొనటానికిచ్చిన మొత్తాన్ని ఆయన అప్పుగా అనుకుంటున్నారు.
“వద్దు బాబాయ్, డబ్బుతో నాకిప్పుడేమీ అవసరం లేదు.” అని అంటున్నా వినకుండా ఆయన తన జేబులోనుండి కొంత డబ్బు తీసి రాఘవ జేబులో పెట్టాడు.
“సరే, గుర్తు పెట్టుకో! నీకు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా నన్ను అడగటానికి మాత్రం మొహమాట పడొద్దు, తెల్సిందా?” అంటూ తన స్కూటర్ దగ్గరికి నడిచి దాన్ని స్టార్ట్‌చేసి ముందుకు పోనిచ్చాడు.
రాఘవ మెల్లగా నడుచుకుంటూ వెళ్లి తన తరగతి గుమ్మం ముందు నిలబడి స్కూటర్లో వెళుతున్న మాధవరెడ్డి కనుమరుగయ్యేంత వరకూ చూస్తూ ఉండిపొయ్యాడు.
తర్వాత తన తండ్రి రాసిన ఉత్తరాన్ని చించి చదవటం మొదలుపెట్టాడు.
చిరంజీవి రాఘవకు ఆశీర్వాదములు.
నువ్వు వరంగల్ వెళ్లి ఈరోజుటికి 40 రోజులవుతోంది. ఇప్పటివరకూ నీ నుండి ఒక్క ఉత్తరమూ రాకపొయ్యేసరికి, నేనెంతో కంగారుపడుతున్నాను. మీ అమ్మయితే నీమీద బెంగపెట్టుకుని సగమైపొయ్యింది. నీ నుండి ఉత్తరం వస్తుందేమోనని రోజూ పోస్ట్‌మేన్ కోసం ఎదురుచూసీ చూసీ విసిగిపోయి నేనే ఈ ఉత్తరం రాస్తున్నాను.
నువ్వు బాబాయ్ అని పిలిచే మాధవరెడ్డిగారి చిరునామాకు రెండు ఉత్తరాలు రాస్తున్నాను. ఒకటి ఆయనకు, ఇంకొకటి నీకు! ఆయనకు రాసిన ఉత్తరంలో నీ గురించి నేనేమీ చెడుగా రాయలేదు. కంగారు పడొద్దు. ఇన్ని రోజులైనా నువ్వు ఉత్తరం రాయకపోవటంతో మేము కంగారుపడుతున్నామనీ, నిన్ను వెంటనే ఉత్తరం రాయవలసిందిగానూ కోరాను, అంతే!
నువ్వు చిత్తూరులో ఉన్నప్పుడు ఆయన నీకు పంపిన ఉత్తరం వెనకవైపునున్న ఫ్రమ్ అడ్రస్‌ను, ఎందుకైనా మంచిదని నేనొక పుస్తకంలో రాసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఉపయోగపడిరది.
మొన్న మీ పెద్దక్క చిత్తూరుకొచ్చి నువ్వు వరంగల్‌కు వెళ్లావని తెలిసి.. ‘ఉద్యోగం కోసం అంత దూరం వెళ్లటం ఎందుకని’ మొదట కోప్పడింది. తర్వాత నీ పరిస్థితికి బాధపడింది కూడానూ. వచ్చే నెలలో పీలేరులో అమ్మవారి జాతరట చిన్నక్క ఉత్తరం రాసింది. గ్రూపు 1 పరీక్షలు బాగా రాసినట్టు చెప్పాడు చిన్నా. ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఇవీ విషయాలు. ఇకనుండి నువ్వు పదిరోజులకొకసారైనా తీరిక చేసుకుని మాకు ఉత్తరం రాస్తుండు. అప్పుడే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంతే సంగతులు. నీ ప్రత్యుత్తరం కోసం ఎదురుచూస్తుంటాను..
ఇట్లు
శంకరయ్య.
ఉత్తరాన్ని మడుస్తూ.. రాత్రికి తన తండ్రికి తప్పక ఉత్తరం రాయాలని నిర్ణయించుకుని పిల్లలకు పాఠం చెప్పటంలో మునిగియ్యాడు.
ఆ రాత్రి పిల్లలందరూ పడుకున్నాక..రాఘవ తండ్రికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు.
తామరగుంట,
17-7-92.
గౌ. నాన్నకు రాఘవ రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం! అక్కడ నువ్వూ, అమ్మా, తమ్ముడూ క్షేమమని తలుస్తాను.
ఇక్కడ నాకు అన్నీ కొత్త కనుక పనుల ఒత్తిడిలో నీకు ఉత్తరం రాయటం కాస్త ఆలస్యం అయ్యింది. ఇక్కడ నాకు అన్నీ బాగానే ఉన్నాయి. అందరూ నాతో స్నేహంగానే ఉంటున్నారు.
6,7 తరగతులకు తెలుగు, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్ని బోధించమన్నారు. బోధన నాకు కొత్తే అయినప్పటికీ ముందుగానే ప్రిపేర్ అయ్యి చెబుతున్నాను. పిల్లలూ బాగానే వింటున్నారు. వాళ్లకు అర్థం కానివి అడుగుతున్నారు. ఎల్లుండి నుండి పిల్లలకు మాసపరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
ఊరికి దూరంగా మా బడి ఉంది. ప్రశాంత వాతావరణంలో పిల్లల మధ్య గడపటం కొత్త అనుభవంగా ఉంది.
నా విషయంలో అమ్మను అనవసరంగా బెంగపడొద్దని చెప్పు. నేనేమీ చిన్న పిల్లవాణ్ణి కాను. నాకేమీ కాదు. ఇక పెద్దక్కకు నా సమాధానం ఏమిటంటే, వరంగల్‌ను నేను దూరం అని అనుకోవటం లేదు. మరి ఉద్యోగం నిమిత్తం సిపాయిలుగా చేరి సరిహద్దుల్లో యేళ్ల తరబడి ఉండిపోయేవాళ్ల మాటేమిటి? కాబట్టి ఈ రోజుల్లో దూరాభారాలు ఎవరూ లెఖ్ఖచెయ్యటం లేదని చెప్పండి. నేనిక్కడ నిశ్చింతగా, హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. నాగురించి ఎవరూ బాధపడకండి. తమ్ముడు తప్పకుండా గ్రూపు 1 ఆఫీసరుగా ఎన్నికవుతాడు. అందులో అనుమానం లేదు.
మా పాఠశాల చిరునామాను రాస్తున్నాను. ఇకపై ఈ చిరునామాకే నువ్వు ఉత్తరాలు రాయగలవు.
ప్రస్తుతానికి ఇంతే సంగతులు.
ఇట్లు,
రాఘవ.
ఉత్తరం రాయటం పూర్తిచేసి దాన్ని పుస్తకంలో పైన్నే పెట్టి లైటార్పి పడుకున్నాడు.
కొంతసేపటికంతా నిద్రలోకి జారుకున్నాడు.
మరుసటిరోజు సాయంత్రం.. తనతోటి ఆచార్యులతోపాటు వ్యాహ్యాళికి వెళ్లకుండా ప్రధానాచార్యులను కలిసి.. తాను ఊళ్లోకి వెళ్లి రావటానికి అనుమతిని కోరాడు. ఆయన అలాగే వెళ్లి రమ్మని తలూపాడు.
రాఘవ తయారై ఊళ్లోకి బయలుదేరాడు. బజార్లో పోస్టాఫీసు బయటున్న పోస్ట్‌బాక్స్‌లో ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు.
తర్వాత – తమ పాఠశాల కార్యదర్శి.. అదే బాబాయ్ వాళ్ల బావగారింటికి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. వెళ్లి ఒకసారి పలకరిస్తే బావుణ్ణనిపించింది.
కానీ ఒట్ఠి చేతులతో వెళితే ఏం బాగుంటుందని ఆలోచించాడు. కనీసం జత ఆపిల్ పండ్లు అయినా తీసుకెళ్లాలని పండ్ల అంగడి కోసం వెతుకుతూ నడవసాగాడు. కొంతదూరంలో ఒక కొట్లో రకరకాల పండ్లు కనిపిస్తే అటు దారితీశాడు.
ఇంతలో.. పెద్దపెద్ద బాజాలు వాయిస్తూ బ్యాండు మేళం శబ్దం వినిపించింది. అదేమిటో వేడుక చూద్దామని దారి పక్కగా నిలబడ్డాడు. బాజాలకు ముందూ, అటూ ఇటూ కొందరు కూలివాళ్లు తలలమీద పెట్రొమాక్స్ దీపాలను పెట్టుకుని నడుస్తున్నారు.
బాజాలకు వెనుకగా కొంతమంది మహిళలు పళ్లేల్లో రకరకాల పండ్లను, మిఠాయిలను, కొత్త బట్టలను అరచేతులమీద పెట్టుకుని వరసల్లో తీసుకెళుతున్నారు.
వాళ్లందరినీ చూస్తుంటే రాఘవకు కనులకింపుగా అనిపించింది. అదెంతో వేడుకగానూ అనిపించింది.
ఆ పడతుల మధ్యన ఒక ఐదేళ్ళ ఆడపిల్ల నడుస్తోంది. ఆ పిల్ల వేసుకున్న కొత్తగౌను పెట్రొమాక్స్ లైటు వెలుతురులో జిగేల్ మంటోంది. ఆ పిల్లకు చక్కగా జడవేసి, పూలు చుట్టారు. పిల్ల మెడలో పూలమాల వేసి ఉంది. ఆ పిల్ల ఎంతో అమాయకంగా దిక్కులు చూస్తూ చేతిలోని మిఠాయిని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ నడుస్తోంది. ఆ పిల్లకు పక్కనే ఒక మగపిల్లవాడూ నడుస్తున్నాడు. వాడికీ కొత్తబట్టలు వేసినట్టున్నారు. వాడి మెడలోనూ పూలమాల వ్రేలాడుతోంది. వాడు ఆ పిల్లకన్నా కాస్త పెద్దవాడుగా కనిపిస్తున్నాడు. ఇద్దరినీ నడిపించుకుంటూ ఇలా చక్కగా ఊరేగింపుగా తీసుకెళుతున్నారు.
ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. బహుశా వాళ్లు తమ మొక్కు చెల్లించటానికి గుడికి తీసుకెళుతున్నారులా ఉన్నారు. ఇంతకీ ఏ దేవతకు మొక్కో?
బహుశా ఇది తమవైపు.. తల్లిదండ్రులు పిల్లలకు ఆడంబరంగా చేసే పుట్టెంట్రకలు తీసే కార్యక్రమం (కేశ ఖండన-కర్ణ భూషణ) అయి ఉండొచ్చు. అందరూ కలిసి ఇలా వేడుకగా గుడికి వెళుతున్నారులా ఉన్నారు. వాళ్లనే కళ్లార్పకుండా చూస్తుండిపొయ్యాడు రాఘవ.
వాళ్లు దూరంగా వెళ్లిపొయ్యాక.. ఆపిల్‌పండ్లు కొందామని అంగళ్లన్నీ తిరిగినా, అవి దొరక్కపోయేసరికి, డజను అరటిపండ్లు కొనుక్కుని కార్యదర్శి ఇంటికి వెళ్లాడు.
వాళ్లు రాఘవను సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోమని మర్యాద చేశారు.
అరటిపళ్లను వాళ్లకు ఇస్తే వాళ్లు దాన్ని తీసుకోకుండా, “తీస్కచ్చినందుకు మస్తు సంతోషం బాబూ, మాకు అరటిపళ్లకేమీ లోటు లేదు. మాదే పెద్ద అరటి తోటుంది. అన్నీ ఆణ్ణించి తెచ్చుకుంటం. బయట మేమేం కొనుక్కోం. ముక్కెంగా గీ ఊర్ల అమ్మే ఏ వస్తువునూ మేం కొనం. మాకు ఏమైనా గావాలంటే ఓరుగల్లు నుండి తీస్కచ్చుకుంటం. ఏమీ అనుకోకుండా నువ్వే ఆటిని బడికి తీస్కెళ్లి తిను బాబూ..” అని బాబాయ్ చెల్లెలు రాఘవకు వేడివేడిగా టీ తెచ్చిచ్చింది.
టీని చప్పరిస్తూ.. ఇందాకా తాను చూసిన దృశ్యాన్ని చెప్పి, పిల్లలు చూడముచ్చటగా ఉన్నారని ప్రశంసించాడు.
“ఆ పిల్లది గీ పక్కూరే! రేపు పొద్దుగాల మూర్తం.” అంది ఆమె.
ఆమె ఏం చెబుతోందో అర్థం కాలేదు రాఘవకు.
“కాదండి, ఇద్దరు చిన్నచిన్న పిల్లల్ని చూశాను. అది వాళ్ల పుట్టు వెంట్రుకల్ని తీసే కార్యక్రమం అనుకుంటాను.”
“మాకు తెల్వదా, ఊళ్లో ఏం జరుగుతుందో? అది పెళ్లే. వాళ్లు వధూవరులే” అనేసరికి నోటమాట రాలేదు రాఘవకు.
‘అంటే తాను చూసింది బాల్య వివాహం చేసుకోబోతున్న వధూవరులనా? అంటే, ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయా?’ ఆమె చెబుతున్న విషయాలను రాఘవ నోరు వెళ్లబెట్టి వింటూ ఉండిపొయ్యాడు.
కాసేపు అక్కడే ఉండి తర్వాత బడికి బయలుదేరాడు.. అరటిపండ్లతో సహా!
(ఇంకా ఉంది)