నిచ్చెన!

0
4

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన బులుసు సరోజినిదేవి గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు సంచిక వెబ్ పత్రిక.]

[dropcap]“బా[/dropcap]లూ!” పార్వతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కొడుకుని నాలుగోసారి పిలిచింది.

హాల్లోనే ఉన్నా పలకలేదు సరి కదా, సోఫాలో పడుకుని సెల్ ఫోన్‌లో, చూసిన సినిమానే రెండోసారి చూస్తూ కాళ్ళు ఉత్సాహంగా ఎడాపెడా ఊపిపారేస్తున్నాడు.

“బాలూ!” ఈ సారి ఇంకా గట్టిగా కేకేసింది పార్వతి.

తెగ విసుగ్గా బాల్కనీ లోకి వచ్చాడు. బాల్కనీలో ఉన్న అటకకి నిచ్చెన ఆనించి ఉంది.

“ఏంటీ?” అడిగాడు బాలూ అదోలా మొహం పెడుతూ.

“బాగా చలిగా ఉంటోంది కదా? స్వెట్టర్ల సూట్‌కేస్ అటక మీద పెట్టాను. తీసి పెట్టు” అంది.

మొహం చేదుగా పెడుతూ –

“నాన్నఎక్కడికెళ్ళాడు? పనమ్మాయి రాలేదా? ఆ సూట్‌కేసు కిందే ఉంచొచ్చుగా?” అన్నాడు.

“మన ఫ్లాట్ చిన్నది కదరా? ఒక గదిలో నీ సామాన్లు, పుస్తకాలు. ఇంకో గదిలో మా సామాన్లు. అక్కడికీ హాల్లో ఎన్నో కనిపించకుండా అలమార్లలో దాచాను. నువ్వే చెప్పు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి పోయే చోటు కదా? హల్లో అన్నీ పెడితే ఇరుగ్గా ఉంటుందని కొన్ని అటక ఎక్కించాను. తీసి పెడుదూ?”అంది .

“సర్లే కానీ.. ఒక్క అరగంట ఆగు. ఈ సిన్మా అయిపోగానే తీసిస్తా!” అన్నాడు నోరు జారి.

చురుగ్గా చూసింది పార్వతి.

“ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బయటి సౌండ్స్ వినపడకుండా చదువుకుంటున్నావనుకున్నా. సినిమా చూస్తున్నావా?” అంది తీవ్రమైన గొంతుతో .

“అబ్బా! సినిమా కాదు. లెసనే!” అన్నాడు గాభరాగా. తండ్రికి గానీ కంప్లైంట్ ఇచ్చిందో అదో గోల.

‘చత్’ అనుకుంటూ నిచ్చెన ఎక్కుతుంటే పార్వతి నిచ్చెనని గట్టిగా పట్టుకుని..

“ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి ఉన్నత శిఖరాలు అధిరోహించాలిరా! ఇలా సినిమాలు చూసి మా ఆశల్నిఅడియాసలు చేయకు” అంటూ నీరసంతో పట్టు తప్ప బోయింది. అప్పుడే బజారు నుంచి వచ్చిన శంకరం టక్కున కాశాడు.

“వాడికి చదువు రావాలని నువ్వు ఉపవాసాలు చేస్తే ఆరోగ్యమూ పాడవుతుంది. ఇలాగే బండి పట్టూ తప్పుతుంది!” మందలించాడు భార్యని.

***

పది రోజులు గడిచాక కాలేజీలో బాలూ చేష్టలు లెక్చరర్ ద్వారా విని నిర్ఘాంతపోయాడు శంకరం. సెల్ ఫోన్ కాలేజీకి తేవడమే కాకుండా దాన్ని పుస్తకం మధ్యలోపెట్టి సైలెంట్ మోడ్‌లో చాట్ చేస్తున్నాడని విని ఇక మీదట జాగ్రత్త వహిస్తానని వినయంగా చెప్పాడు.

“మనిషికి కోరికలుండాలి శంకరం గారూ.. సౌకర్యం కోరుకోవడం సహజం కూడానూ. కానీ మన గుర్రం మన ఆధీనంలో ఉండాలి. గుర్రం ఆధీనంలో కాదు కదా మనం ఉండాల్సింది?” అన్నాడు ఆయన.

“మీరు కాస్త సరిదిద్దాలి పిల్లవాడిని!” అన్నాడు వినయంగా శంకరం.

“నేనా? వీళ్ళు కాలేజీకి వచ్చారండీ! స్కూల్లో లేరు. కాస్త కోప్పడితే ధ్వజమెత్తి, వెక్కిరించి, వేధించి.. నానా యాగీ చేస్తారు!” అన్నాడాయన.

“మాష్టారూ!” అన్నాడు శంకరం చేతులు జోడించి. అంతకంటే ఇంకేమనాలో పాలుపోలేదు శంకరానికి.

“మేమేం చేయగలమండీ? మీరే ఏదో ఒకలా దారిలో తెచ్చుకోవాలి. అసలు సమస్య ఏమిటంటే – ఇప్పటి యువతకి సమాచారం బాగా తెలుసు. కానీ వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. అసలూ.. సెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు ఆకాశంలో శక్తి ఉందని గుర్తించారా? కొన్ని అక్షరాల మీటలు నొక్కితే దాన్లోని ‘ఎలక్ట్రో మెగ్నటిక్ వేవ్’ మరో దేశం వరకూ వెళ్తుందా? మీరు ఇక్కడ టైప్ చేస్తే అక్కడి ఫోన్‌లో చూసుకోవచ్చు. ప్రెస్ చేసిందంతా శక్తిలో విలీనం అయి అది ఆకాశం గుండా పయనించి మరో చోట యధాతధంగా తిరిగి టైప్ చేయబడిందని గుర్తించాలి. మన సెల్‌కి టవర్ మధ్య ఆకాశం, మరొక అవతలి సెల్‌కి టవర్‌కి మధ్య ఆకాశం పూర్తిగా జ్ఞానంతో, సమాచారంతో నిండి ఉందని వీళ్ళకి తెలియదనుకుంటున్నారా? కానీ జీవితం ఇంకా శక్తివంతమైనదనీ, దాన్ని సెల్‌కే పరిమితం చేసుకోకూడదనీ కదా మనం తెలియజేయాల్సింది?” అన్నాడు.

“అవును. నిజమే!” అని శంకరం దిక్కు తోచక ఆయన వైపే చూస్తున్నాడు.

ఒక ఉపాద్యాయుడిగా ఆయన ఆవేదన అర్థమవుతోంది. మాష్టారుకి బాధ, లెక్చరుతనం ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి.

“ఒకప్పుడు ఆకాశమే శక్తి అనీ ప్రతీ అణువులోనూ జ్ఞానం నిండి ఉన్నదని వివరించడం కష్టం అయ్యేది. మొదట ఫాక్స్ వచ్చి ఇంక తను వివరించగలను అని సంబర పడ్డాడు మనిషి. ఆ తర్వాత సెల్ ఫోను వచ్చిందా? అంతే . ఉపయోగించుకోవడం మానేశారు.

చూడండి ఆకాశాన్ని! ఖాళీ ఆకాశం జ్ఞానంతో, సమాచారంతో నిండి ఉంది. ‘దీని తర్వాత ఏమి కనుగొనగలం?’ అనే ధ్యాస లేకుండా సెల్‌లో చెత్త చూస్తూ.. ప్రేమ సినిమాలు చూసి ఆడ, మగపిల్లలు ప్రేమని, చాట్‌ని అంటించుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి. ఇంటర్ పిల్లలకి ప్రేమలేమిటి? పెంపకలోపం కాదూ? వెధవల్ని చూస్తే చిర్రెత్తుకొస్తుంది. ఒక్కడు పాఠం వినడు. మనం ప్రపంచీకరణ గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడతాం.. వివేకాన్ని ‘ప్రపంచీకరణ చేయాల’ని ఒక్కడికి తట్టదు!” నుదుటి మీద కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు.

***

శంకరం ద్వారా విషయం విన్నాక పార్వతితో పాటు ఇల్లు కూడా గంభీరమైపోయింది. బాలూ గురించి విన్న వెంటనే ఆమె కళ్ళ వెంట నీళ్ళు ధారాపాతంగా జారిపడ్డాయి. ఆమె కనీసం తుడుచుకోలేదు. ఏవేవో జ్ఞాపకాలు మూకుమ్మడిగా చుట్టుట్టాయి.

ఇలాగే.. అచ్చం ఇలాగే అమ్మ ఏడ్చేది. నాన్న గోడ పట్టుకుని ఆకాశం వైపు పిచ్చి చూపులు చూసేవాడు.

నాన్నది మంచి ఉద్యోగం. అమ్మ నాన్నకొచ్చే జీతంతో ఇంటిని తీర్చి దిద్దేది.

“మీరిద్దరూ మా ఇద్దరికీ రెండు కళ్ళు. ఎన్నో కష్టాలకి ఓర్చుకుని మీ నాన్న ఈ స్థాయి కి వచ్చారు. ఒక్కో పైసా కూడబెట్టి జాగ్రత్త చేయమని ప్రతి రోజూ నెమ్మదిగా లాలిస్తున్నట్టు చెప్తారు. అమ్మాయికి ఘనంగా పెళ్ళి చేయాలి కమలా! అబ్బాయిని పెద్ద చదువులు చదివించాలి.. అంటూ పగటి కలలు కనే వారు. అదే ధ్యాస. మరొకటి లేదు!” అనేది అమ్మ.

ఒక రోజు ఇంట్లో అమ్మకి పుట్టింటివారు పెట్టిన కట్టకాసుల పేరు కనిపించలేదు. ఎందుకో పార్వతికి తమ్ముడు మీద డౌట్ వచ్చింది. వాడు చదివేది టెన్త్ క్లాస్. ఇంట్లో చదువుతున్నట్టే యాక్ట్ చేసేవాడు. తను ఇంటర్ కి వచ్చి జూనియర్ కాలేజిలో చేరాక హైస్కూల్ ఒక వైపు, కాలేజి మరొకవైపు ఉండడంతో వాడేం చేస్తున్నాడో తెలియలేదు.

ఎప్పుడూ బుద్దిగా, చిరునవ్వుతో ఉండే వాడు రోడ్డు మీద ఆడపిల్లల్ని చూసి ఈల వేయడం, అసలింతకు ముందు చూసి ఎరగని పాతికేళ్ళ వయసున్న అబ్బాయిలతో స్నేహాలు, స్కూల్‌కి పోతునట్టు ఇంట్లో చెప్పి వెళ్ళకుండా అల్లరి పిల్లలతో గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నట్టు తెలిసి గట్టిగా మందలించింది కూడా. వెక్కిరింతగా చూస్తూ.. “చదువుతో పాటు ఉత్సాహంగా కూడా ఉండాలి. లేకపోతే డల్‌గా మారిపోతుంది జీవితం!” అనేవాడు.

ఆ రోజు అమ్మ బాధ చూడాలి.

బీరువాలో అన్నీ వస్తువులు ఉన్నాయి. ఒకటే వెతుకుతోంది. ఏడుస్తోంది.

నెల రోజుల తరువాత మరోవస్తువు. ఇలా ఒకటొకటిగా మాయం చేస్తూ ఒకసారి దొరికిపోయాడు. ఎంక్వయిరీ చేస్తే సిగరెట్లు, పేకాట లాంటి వ్యసనాలకు మరిగినట్టు తెలిసింది.

నాన్న కుంగిపోయాడు.

త్వరత్వరగా తనకి పెళ్ళి చేసి పంపేశాడు.

ఆ తరువాత తమ్ముడు ఉన్నదంతా ఊడ్చేసి రోడ్డున పడిపోయాడు.

నాన్న బెంగతో పోతే అమ్మ కూడా మరి కొద్ది రోజుల్లోనే ప్రాణం వదిలేసింది.

తమ్ముడికి ఒక్క పని నేర్పక నిరంతరం వండి, దగ్గరుండి ‘మగ పిల్లాడు’ అనే బ్రాండ్ తగిలించి ముద్దు చేసిన అమ్మ గుర్తొచ్చింది. వాడికి ఏ పనీ నేర్పలేదు. వ్యసనాల వెంట పరుగులు తీసిన తమ్ముడు ఏమయ్యాడో తెలియదు.

ఒక అమూల్యమైన జీవితం వృథాగా రాలిపోయింది. తల్లి తండ్రుల్ని పోగొట్టుకున్న తన మానసిక వేదన ఎలా చెప్తే బాలూకి అర్థం అవుతుంది? ఆలోచిస్తూనే ఉంది. భర్త ఒక్కడే బాలూ కోసం అయినా అర్థం చేసుకోగలడని అనిపించింది.

***

రెండు నెలలుగా పార్వతి ఒంట్లో బాగా లేదని పూర్తిగా పడక వేసేసింది. వంట వండడం మానేసింది. అన్ని సౌకర్యాలు సమకూర్చే తండ్రి రాత్రి పొద్దుపోయాక కానీ ఇంటికి రావడం లేదు. ఇంటి వాతావరణం మారిపోయింది.

బాలూ సెల్ పట్టుకుని ఎంతసేపు కూర్చున్నా పట్టించుకునే నాధుడెవడూ లేదు. పనిమనిషి మానేసింది.

రోజులు భారంగా సాగుతున్నాయి.

ఇప్పుడు బాలూయే వంట చేసి కాలేజీకి వెళ్ళి వచ్చాక, అంట్లు తోమి అలసి సొలసి చదువుకునేందుకు కూడా కుదరక చూసీ చూసీ తల్లి దగ్గర బావురుమన్నాడు. మౌనం మాని ఏదో ఒకటి మాట్లాడమని ప్రార్ధించాడు. కాళ్ళావేళ్ళా పడ్డాడు.

“పిల్లలు వింటారేమిట్రా?” అంది పార్వతి.

ఆ ఒక్క మాటతో కళ్ళు గట్టిగా తుడుచుకుని వింటాననీ, చెప్పమనీ ప్రార్ధించాడు. శంకరం అప్పుడే వచ్చి మౌనంగా నిల్చున్నాడు.

పార్వతి చెప్తోంది.

“సాధారణ నదికీ, వరద నీటికి తేడా చెప్తా విను. ఒక నది ప్రవహించడానికి రెండు గట్లు కావాలి. వాళ్ళే తల్లితండ్రులు. ఆ గట్ల మధ్య నది ఒక వైపు నియంత్రణతో ప్రవహిస్తూ ఉంటుంది. వరద వస్తే ఆ నీటికి దిశా, నిర్దేశం ఉండదు. వరద అంటే అదుపు తప్పి వ్యవహరించడం. పిల్లలు తల్లితండ్రుల రక్షణలో సాగాలి. నాలుగు రోజులు తల్లి వండకపోతే, తండ్రి పలకరించకపోతే ఎలా ఉంది నీకు?

మరోసారి చెప్పను. విను. జీవితం విలువ తెలుసుకోకుండా సెల్ పట్టుకు కూర్చుంటే చదువు వస్తుందా? ఏ మనిషైన దేశంతో ముడిపడి ఉంటాం. దేశానికి నువ్వు చేయాల్సిందేమిటో ఆలోచించు!” అంటూ స్వెట్టర్ అందించింది.

ఆలోచనలో పడ్డ బాలూకి కాస్సేపటిలో వేడివేడి అన్నంతో కంచం అందింది. ప్రాణం లేచి వచ్చింది.

తిన్న తరువాత బాల్కనీలో ఉన్న సింక్‌లో కంచం పెట్టబోతూ నిర్లక్ష్యంగా తను విసిరి పారేసిన నిచ్చెనని తీరుగా పెట్టాడు. సెల్ ఆఫ్ చేసి తండ్రి డెస్క్‌లో పడేశాడు.

ఆ సాయంత్రం తండ్రి తన స్వీయ అనుభవంతో కాక తల్లితండ్రులు చెప్పింది విని నేర్చుకోవడం వల్ల సమయం ఆదా అయి భవిష్యత్ ఎంత ‘ఫ్రూట్‌ఫుల్’గా ఉంటుందో సరదాగా చెప్తుంటే మనసారా నవ్వాడు బాలూ.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here