మరుగునపడ్డ మాణిక్యాలు – 104: సికారియో

0
3

[సంచిక పాఠకుల కోసం ‘సికారియో’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు. ఎవరైనా మనకి హాని చేస్తే మనమూ వారికి హాని చేయొచ్చా? వ్యక్తిగతంగా అయితే అది అమోదయోగ్యం కాకపోవచ్చు. చట్టం అడ్డు వస్తుంది. కానీ సమాజహితం కోసం ఒక్కోసారి చేయకతప్పదు. భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయటం తప్పని భారతీయులు అనరు. వారు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? డ్రగ్స్‌తో సమాజాన్ని నాశనం చేస్తుంటే డ్రగ్స్ ముఠాలతో న్యాయంగా ఉంటామంటే కుదరదు. ఎత్తుకి పై ఎత్తు వేసి మట్టు పెట్టాల్సిందే. అయితే ఈ పోరాటంలో ప్రశ్నార్థకమైన వ్యూహాలు ప్రవేశించాయి. అవి ధర్మమా అధర్మమా అంటే చెప్పలేని పరిస్థితి. ఈ ఇతివృత్తంతో వచ్చిన చిత్రం ‘సికారియో’ (2015). సికారియో అంటే కిరాయి హంతకుడు అని అర్థం. ఈ చిత్రం లయన్స్‌గేట్ ప్లే, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్లాట్‌ఫామ్‌లలో లభ్యం.

కేట్ ఒక ఎఫ్‌బీఐ (అమెరికా దర్యాప్తు సంస్థ) ఏజెంట్. విడాకులైపోయాయి. ఆరిజోనా రాష్ట్రంలో పని చేస్తుంది. కిడ్నాపులు జరిగినపుడు విడిపించే బృందానికి ఆమె సారథ్యం వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకసారి ఒక ఇంటిలో కిడ్నాపయిన వారు ఉన్నారని తెలిసి ఆమె తన బృందంతో వెళితే అక్కడ గోడల్లో శవాలు దొరుకుతాయి. ఆ ఘోరం చూసి అందరూ అవాక్కవుతారు. ఇంటి బయట షెడ్డులో బాంబు పేలి ఇద్దరు ఏజెంట్లు మరణిస్తారు. మాన్యుయెల్ డియాజ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుడికి చెందిన ఇల్లది. అతనికి ఒక మెక్సికన్ డ్రగ్స్ కార్టెల్‌తో సంబంధాలున్నాయని ఎఫ్‌బీఐ అనుమానం. సీఐఏ (అమెరికా నిఘా సంస్థ) నుంచి మ్యాట్ అనే అధికారి వచ్చి కేట్‌పై అధికారితో సమావేశమవుతాడు. అతను డ్రగ్స్ నియంత్రణ విభాగంలో పని చేస్తుంటాడు. కేట్‌ని జాయింట్ టాస్క్ ఫోర్స్‌లో చేరమంటాడు. కేట్ తనకి డ్రగ్స్ నియంత్రణ గురించి ఏమీ తెలియదంటే ఆమె పై అధికారి “వారికి ఇక్కడి పరిస్థితులు తెలిసి, వ్యూహరచనలో అనుభవం ఉన్నవారు కావాలి. బాగా ఆలోచించుకో” అంటాడు. జరిగిన ఘోరానికి బాధ్యులైన వారిని పట్టుకోవాలని కేట్ ఒప్పుకుంటుంది.

మెక్సికో సరిహద్దులో ఉన్న ఎల్ పాసో అనే ఊరికి వెళ్ళి మాన్యుయెల్ డియాజ్ అన్న గియెర్మోని పట్టుకోవాలని మ్యాట్ అంటే కేట్ సరేనంటుంది. ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. విమానంలో వీరిద్దరే కాక అలెహాంద్రో అనే అతను కూడా ఉంటాడు. గంభీరంగా ఉంటాడు. అతనెవరో మ్యాట్ చెప్పడు. అతను “హువారెజ్ వెళ్ళటం మొదటిసారా?” అంటాడు కేట్‌తో. కేట్ అయోమయంలో పడుతుంది. హువారెజ్ మెక్సికోలో ఉంది. మెక్సికో వెళుతున్నామని ఆమెకి తెలియదు. మ్యాట్ వెనక ఉన్న సొఫాలో నిద్రపోతుంటాడు. అలెహాంద్రో కూర్చునే కునుకు తీస్తాడు. నిద్రలో అతని చేయి వణకటం కేట్ చూస్తుంది. నిద్రలో నుంచి అతను ఉలిక్కిపడి లేస్తాడు. ఏదో పీడకల గని అతను ఉలిక్కిపడ్డాడు. అతనికి డ్రగ్స్ కార్టెల్స్ గురించి బాగా తెలుసు. అతను నిద్రలో ఉలిక్కిపడి లేచాడంటే ఎన్ని దారుణాలు చూసి ఉంటాడో! కాసేపటికి మెక్సికో సరిహద్దు దగ్గర విమానం దిగుతుంది. అక్కడ సీఐఏ వాళ్ళు రోడ్డు మార్గంలో మెక్సికో వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. కేట్ అడిగితే అలెహాంద్రో తాను మెక్సికోలో లాయరుగా పని చేసేవాడినని చెబుతాడు. కేట్ ముఖంలో అనుమానం చూసి “మీ అమెరికా వాళ్ళకి అన్నీ అనుమానమే. చివరికి అర్థమవుతుందిలే” అంటాడు. కేట్ మ్యాట్‌ని “అతను సీఐఏ వాడేనా?” అని అడుగుతుంది. “అతనో సలహాదారు. అతను ఏదన్నా చెబితే చేసెయ్” అంటాడు. “అమెరికన్లు కాని వారి ఆదేశాలు పాటించాలని నాకెవరూ చెప్పలేదు. అదీ అమెరికా బయట” అంటుందామె. “మీ ఊళ్ళో ఇళ్ళల్లో బాంబులు పెడుతున్నారు. బాధ్యులైనవారిని పట్టుకోవాలని లేదా?” అంటాడతను. “ఉంది” అంటుందామె. “అయితే ఇదే దారి” అంటాడతను. కేట్ అయిష్టంగానే మెక్సికో వెళుతుంది.

కేట్‌కి గోడల్లో శవాలు దాచటం వంటి దారుణాలు చూడటం అదే మొదటిసారి. ఆమె అర్థం చేసుకోలేనంత ఘోరమది. మ్యాట్ టాస్క్‌ఫోర్స్‌లో చేరమనే ముందు పెళ్ళయిందా అని అడుగుతాడు. ఆమె విడాకులయ్యాయని చెబుతుంది. పెళ్ళయినవారైతే ఈ పనిలో చేరటం గురించి రెండుసార్లు ఆలోచిస్తారని చెప్పటం ముఖ్యోద్దేశమైనా ఆమె ప్రపంచానికీ, డ్రగ్స్ ప్రపంచానికీ మధ్య దూరం ఉందని (దానికి విడాకులు సంకేతం) చెప్పటం ఇంకో ఉద్దేశం. డ్రగ్స్ ప్రపంచం అంటే కేవలం ముఠాల వారే కాదు, ఆ ముఠాలపై పోరాడేవారు కూడా. సీఐఏ వాళ్ళు అలెహాంద్రో లాంటివారి సాయం తీసుకుంటారు. అది కేట్‌కి అర్థం కాదు. ‘అతన్ని ఎందుకు నమ్మాలి?’ అన్నట్టు ఉంటుంది. అదీ నిజమే. కానీ ఇవి ఉన్నతస్థాయి వ్యూహాలు. ఉన్నతస్థాయి వారు అలెహాంద్రోని ఎలా నమ్మారు? అదే ఈ చిత్రంలో ముఖ్యాంశం.

సీఐఏ బృందం కార్లలో రోడ్డు మార్గంలో హువారెజ్ వెళుతుంది. అమెరికా సరిహద్దుకి దగ్గర ఉండటంతో అక్కడ డ్రగ్స్ ముఠాలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఆటవికరాజ్యం సాగుతూ ఉంటుంది. ఒక ఫ్లైఓవర్ కింద శవాలు వేళ్ళాడుతూ ఉంటాయి. దూరంగా తుపాకీ శబ్దాలు వినపడుతూ ఉంటాయి. తప్పిపోయిన అమ్మాయిల కోసం గోడల మీద “కనపడుటలేదు” అనే పోస్టర్లు ఉంటాయి. మెక్సికో పోలీసులు సీఐఏ బృందానికి రక్షణగా ఉంటారు. ఆ పోలీసుల్ని కూడా నమ్మొద్దని అలెహాంద్రో కేట్‌తో అంటాడు. కేట్‌కి అంతా వింతగా ఉంటుంది. కేట్ ప్రేక్షకుల స్థానంలో ఉన్నట్టు స్క్రీన్‌ప్లే రాయటం ఇక్కడ జీనియస్. ఒక కోర్టు వెనక వైపు కార్లు ఆగుతాయి. బేస్‌మెంట్ లోకి వెళ్ళి గియెర్మోని ముసుగు వేసి తీసుకువస్తారు. కారు ఎక్కిస్తారు. కార్లన్నీ తిరుగు ప్రయాణమవుతాయి. వేరే దేశానికి వెళ్ళి ఒక నేరస్థుడిని తీసుకురావటం ఇంత తేలికా అనిపిస్తుంది. అమెరికాయా మజాకా? ఎదురుతిరిగితే ఆంక్షలు ఉండనే ఉన్నాయి. అయితే అంతా సవ్యంగా జరగదు. సరిహద్దు దగ్గర కాల్పులు జరుగుతాయి. సీఐఏ వాళ్ళు కొందరు ముఠా వాళ్ళని చంపుతారు. కేట్ తనని కాల్చబోయిన ఒక పోలీసుని కాల్చేస్తుంది. అయితే ఆమెకి ఇదంతా చట్టవ్యతిరేకమని తెలుసు. అమెరికాలోకి మళ్ళీ ప్రవేశించాక కేట్ మ్యాట్‌ని నిలదీస్తుంది. అతను “ఇదే నేటి న్యాయం” అంటాడు.

గియెర్మో అలెహాంద్రోని గుర్తుపడతాడు. ఇంతకుముందు వారు కలిశారన్నమాట. గియెర్మోని చిత్రహింసలు పెట్టి సమాచారం రాబడతాడు అలెహాంద్రో. ఆరిజోనా రాష్ట్ర సరిహద్దులో మెక్సికో నుంచి అమెరికాలోకి ఒక సొరంగం ఉందని చెబుతాడతను. కేట్‌కి ఎక్కువ సమాచారం ఇవ్వకుండా మ్యాట్ పని చేసుకుపోతుంటాడు. కేట్ సహచరుడు రెజీ అసలు ఈ ఆపరేషన్ ఉద్దేశం ఏమిటని మ్యాట్‌ని నిలదీస్తాడు. “డ్రగ్స్ కార్యకలాపాలు జరగకుండా అడ్డంకులు సృష్టిస్తే మాన్యుయెల్‌ని ముఠా నాయకుడు ఫౌస్టో మెక్సికోకి పిలిపిస్తాడు. మాన్యుయెల్ మీద నిఘా పెడితే ఫౌస్టో ఎక్కడున్నాడో తెలిసిపోతుంది” అంటాడు మ్యాట్. తర్వాత రెజీ కేట్‌తో “మ్యాట్‌తో జాగ్రత్తగా ఉండాలి. సీఐఏ వాళ్ళు అమెరికా బయట నిఘా పెట్టాలి కానీ అమెరికా లోపల కాదు” అంటాడు. “మనం (ఎఫ్‌బీఐ) ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళు (సీఐఏ) చాలా చేస్తున్నారు” అంటుందామె. మ్యాట్ కొందరు వలసదారుల సాయంతో సొరంగం ఎక్కడుందో తెలుసుకుంటాడు. మరో పక్క మాన్యుయెల్ బ్యాంక్ కార్యకలాపాల మీద నిఘా పెడితే అతను రోజూ 9000 డాలర్లు (పదివేలు దాటితే బ్యాంక్ వాళ్ళు ప్రశ్నిస్తారు) బ్యాంక్‌లో వేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇన్నాళ్ళూ అంత పెద్ద మొత్తాలు జమ అవుతుంటే ఎవరికీ తెలియలేదా? అది తెలుసుకుందామని కేట్ బ్యాంక్ లోపలికి వెళుతుంది, మ్యాట్ వద్దంటున్నా వినకుండా. మ్యాన్యుయెల్ తాను తీసుకున్న అప్పు తీరుస్తున్నట్టు  డబ్బు జమ చేస్తున్నాడని తెలుస్తుంది. అప్పు కొంచెమే, తీర్చేది ఎక్కువ. అది బాకీ కన్నా ఎక్కువ తీర్చినట్టు నమోదు అవుతుంది కానీ ఖాతాలో కనపడదు. కాబట్టి ఎవరూ దాన్ని పట్టించుకోరు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు! ఇది బయటపడటంతో మాన్యుయెల్‌కి ఆ డబ్బు తీసుకునే వీలు లేకుండా చేస్తారు బ్యాంక్ వాళ్ళు. దీని ఆధారంగా మాన్యుయెల్‌ని అరెస్ట్ చేద్దామని కేట్ అంటే మ్యాట్ ఒప్పుకోడు. కేట్ తన పై అధికారి దగ్గరకి వెళుతుంది. చట్టప్రకారం పని చేయాలి కదా అంటుంది. అతను “మ్యాట్‌కి అధికారం ఇచ్చినవాళ్ళు ప్రజాప్రతినిధులు. నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు హద్దులు దాటుతున్నావని ఆందోళన పడవద్దు. హద్దులు మారిపోయాయి” అంటాడు.

అమెరికా తన ఆధిపత్యాన్ని, సంపదని ఉపయోగించి తాను అనుకున్నది సాధిస్తుంది. డ్రగ్స్ ముఠాలు కిరాతకంగా ఉంటాయి. వాటితో కిరాతకంగానే వ్యవహరించాలి. అవసరమైతే వారి వేలితో వారి కన్నే పొడవాలి. అన్నీ చట్టప్రకారం జరగాలంటే కుదరదు. ఇబ్బందేమిటంటే అమెరికా ఇతర దేశాల విషయానికి వచ్చేసరికి నీతిపాఠాలు వల్లిస్తుంది. ఇతరులు కూడా తమ దేశాలని కాపాడుకోవాలి కదా? ఇక కేట్ లాంటివారు అమాయకంగా ఉంటారు. అన్నీ పద్ధతిగా జరగాలి అంటారు. భారతదేశంలో ఏదీ చట్టప్రకారం జరగదని చిన్నపిల్లవాడైనా చెబుతాడు. అమెరికాలో చాలావరకు పనులు చట్టప్రకారం జరుగుతాయి. రోజువారీ జీవితంలో అవినీతి తక్కువ. కానీ అంతర్జాతీయ సమస్యల విషయానికి వస్తే చట్టం కంటే వ్యూహం ఎక్కువ వాడతారు. అది కేట్‌కి అర్థం మింగుడుపడదు. ఇంతకీ కేట్ అవసరం లేకుండా మ్యాట్ స్వయంగా పని చేసుకోవచ్చు కదా? అసలు విషయం ఏమిటంటే సీఐఏ వాళ్ళు అమెరికా లోపల ఏమైనా ఆపరేషన్ చేయాలంటే ఏదో ఒక స్థానిక సంస్థతో సంయుక్తంగా చేయాలి. స్వతంత్రంగా చేయకూడదు. అందుకని ఎఫ్‌బీఐని కలుపుకుని వెళతారు. కానీ చివరికి ఎఫ్‌బీఐ ఆపరేషనంతా సవ్యంగా జరిగినట్టు సంతకం పెట్టాలి. అన్నీ సవ్యంగా జరుగుతాయా? జరగవని ఇప్పుడే చెప్పేస్తున్నాను. మరి కేట్ సంతకం పెడుతుందా?

చిత్రంలో ఫొటోగ్రఫీ కూడా ఆలోచింపజేస్తుంది. భూమికి కాస్త పైనుంచి చూస్తున్నట్టు చాలా షాట్లు ఉంటాయి. ఒక షాట్లో అమెరికా-మెక్సికో సరిహద్దు, ఒకవైపు అమెరికా, ఒకవైపు మెక్సికో కనపడతాయి. ఎందుకీ ఎల్లలు ఏర్పడ్డాయి? ఒకవైపు సంపద, ఒకవైపు పేదరికం ఏమిటి? సీఐఏ కార్లు మెక్సికోలోకి వేగంగా వెళ్ళి నిరాఘాటంగా సాగిపోవటం అమెరికా ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఈ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. కొన్ని షాట్లలో  గాలిలో ధూళికణాలు (ప్రొజెక్టర్ వెలుగులో, కిటీకీ నుంచి వచ్చే సూర్యకిరణాలలో) కనపడపడతాయి. ప్రపంచం మలినమైందనే సూచన ఇస్తూ ఉంటాయి. ఫొటోగ్రఫీకి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. కేట్‌గా ఎమిలీ బ్లంట్, అలెహాంద్రోగా బెనీసియో దెల్ తోరో, మ్యాట్‌గా జోష్ బ్రోలిన్ నటించారు. అన్నిటికీ తీవ్రంగా ఆలోచించే కేట్ పాత్రలో ఎమిలీ, అన్నిటినీ తేలిగ్గా తీసుకునే మ్యాట్ పాత్రలో జోష్ అద్భుతంగా నటించారు. అలెహాంద్రో పాత్రలో బెనీసియో నిర్దాక్షిణ్యాన్ని ప్రభావవంతంగా అభినయించాడు. ఈ చిత్రానికి డెనీ విల్నవ్ దర్శకత్వం వహించాడు. ‘డ్యూన్’ చిత్రాల ద్వారా అతను అంతర్జాతీయంగా ప్రసిద్ధి సాధించకముందు తీసిన చిత్రమిది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

బ్యాంక్ మ్యానేజర్ మాన్యుయెల్‌తో కుమ్మక్కయి ఉండటంతో మాన్యుయెల్ అనుచరులు కేట్ మీద నిఘా పెడతారు. మాన్యుయెల్ ఉప్పు తినే టెడ్ అనే ఒక పోలీసు ఆఫీసరు కేట్‌ని వలలో వేసుకుంటాడు. హనీ ట్రాప్ అన్నమాట. మగవాళ్ళకి ఆడవాళ్ళనే కాదు, ఆడవాళ్ళకి మగవాళ్ళని కూడా ఎరగా వేస్తారు! అయితే అలెహాంద్రో ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహిస్తాడు. అతను కూడా కేట్ మీద నిఘా పెట్టి టెడ్‌ని పట్టుకుంటాడు. టెడ్‌ని చావగొట్టి మాన్యుయెల్ కోసం పని చేసే పోలీసు వాళ్ళ వివరాలు రాబడతాడు. కేట్ టెడ్ నుంచి తనని కాపాడినందుకు అలెహాంద్రోకి కృతజ్ఞత చెబుతుంది. తన తప్పటడుగుకి సిగ్గుపడుతుంది. సీఐఏ వాళ్ళు ఎఫ్‌బీఐ ని వాడుకుంటున్నారని తెలిసినా ఆమె కసితో వారితో కలిసి పని చేస్తుంది.

జరిగిన పరిణామాల కారణంగా మాన్యుయెల్‌ని మెక్సికోకి రమ్మని ముఠా నాయకుడు ఫౌస్టో ఆదేశిస్తాడు. మాన్యుయెల్ కారులో ఇంటి నుంచి ప్రయాణమవటం శాటిలైట్ ద్వారా మ్యాట్‌కి తెలుస్తుంది. మరో పక్క సొరంగంలో పనిచేసే వారిని పట్టుకోవాలని సీఐఏ బృందం బయలుదేరుతుంది. సొరంగం అవతల సిల్వియో అనే పోలీసు ఆఫీసర్ డ్రగ్స్ చేరవేస్తూ ఉంటాడు. టెడ్ ద్వారా అతని సమాచారం మ్యాట్‌కి తెలిసింది. సొరంగంలో కాల్పులు జరుగుతాయి. అవి విని సిల్వియో పారిపోవటానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే అలెహాంద్రో సొరంగం నుంచి బయటకు వచ్చి సిల్వియోని పట్టుకుంటాడు. కేట్ అక్కడికి వస్తుంది. అయితే అలెహాంద్రో సిల్వియోని తీసుకుని అతని కారులో మెక్సికోలోకి వెళ్ళిపోతాడు. కేట్ ఆపడానికి ప్రయత్నించినా లాభం ఉండదు. ఇదంతా సీఐఏ వాళ్ళ పథకం. మాన్యుయెల్‌ని వెంబడించటానికి అలెహాంద్రోని పంపించారు. శాటిలైట్ ద్వారా మాన్యుయెల్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుస్తుంది కదా, అలెహాంద్రో వెంబడించటం ఎందుకు? అక్కడే ఉంది కీలకం. అలెహాంద్రో దగ్గర ఉన్న జీపీఎస్ సాధనం ద్వారా అతను ఎక్కడున్నాడో సీఐఏ వారికి తెలుస్తుంది. అతన్ని గైడ్ చేసి మాన్యుయెల్ కారుని చేరుకునేలా చేస్తారు.

ఈ మొత్తం ఆపరేషన్ సొరంగం మీద దాడి చేయటానికీ కాదు, ఫౌస్టో ఎక్కడున్నాడో తెలుసుకోవటానికీ కాదు. గుట్టు చప్పుడు కాకుండా ఫౌస్టోని మట్టుబెట్టడానికి! దానికి సొరంగాన్ని, మెక్సికో పోలీసు సిల్వియోని వాడుకున్నారు. వారి వేలితో వారి కన్నే పొడిచారన్నమాట. సొరంగం ఉందని తెలిశాకే ఈ పథకం రచించారు. కేట్ నిలదీస్తే మ్యాట్ ఈ విషయాలన్నీ చెబుతాడు. “ఇంతకు ముందు కొలొంబియా ముఠా డ్రగ్స్ వ్యాపారాన్ని నియంత్రించేది. వారితో మన సంప్రదింపులు జరిగేవి. ఇప్పుడు ముఠాలు పెరిగిపోయాయి. మన జనాభాలో 20 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారు. వారిని రాత్రికి రాత్రే మాన్పించలేం. నెమ్మదిగా సాధించాలి. ఈలోపల మన మాట కాస్తో కూస్తో వినేవారు డ్రగ్స్ సరఫరా చేస్తే కొంతైనా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించవచ్చు. అది సాధించడానికే అలెహాంద్రో వెళ్ళాడు” అంటాడు. అంటే ప్రభుత్వం మద్దతుతో ఒక హత్య చేయటానికి వెళ్ళాడన్నమాట. చట్టం ప్రకారమైతే ఫౌస్టోని పట్టుకుని న్యాయవిచారణ చేయాలి. కేట్ “ఇది అన్యాయం. నేను ఇదంతా బయటపెట్టేస్తాను” అంటుంది. మ్యాట్ “అంతకన్నా పెద్ద తప్పు ఉండదు” అంటాడు మ్యాట్.

డ్రగ్స్ ఒక మహమ్మారి. ఒకసారి పట్టుకుంటే వదలదు. అమెరికాలో 20 శాతం మంది అలవాటు పడ్డారు. పూర్తిగా సరఫరా ఆపేస్తే ఆ పౌరులకి, వారి కుటుంబాలకే నష్టం. కుటుంబాలు నాశనమైపోతాయి. అర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. మరో పక్క ప్రజలు రాజకీయనాయకుల మీద కోపం చూపిస్తారు. 20 శాతం ఓట్లంటే మాటలా? అందుకని డ్రగ్స్ ముఠాలతో సంప్రదింపులు చేసి వారిని నియంత్రిస్తారన్నమాట. వారి వ్యాపారమూ సాగుతుంది, వీరి పబ్బమూ గడుస్తుంది. ఇది ధర్మమా? కాదు, కానీ వేరే దారి ఏది? ఇతర ముఠాలని తుడిచిపెట్టేస్తే అందరికీ లాభమే. మన దేశంలో కూడా ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తున్నాయో మనకి తెలియదు. మన పిల్లలని రక్షించుకోవటం మన బాధ్యత. వారి మీద నిఘా ఉండాలి. కఠినంగా ఉండాలి. వారి మనోభావాలు అంటూ మెత్తగా ఉంటే మట్టయిపోవటం ఖాయం.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

మ్యాట్ ఇంకో విషయం కూడా చెబుతాడు. “ఫౌస్టో ముఠా అలెహాంద్రో భార్య తల నరికేశారు. అతని కూతుర్ని యాసిడ్‌లో ముంచి చంపేశారు” అంటాడు. అలెహాంద్రోని నడిపించేది ప్రతీకారమన్నమాట. ఒకరకంగా అమెరికా ప్రభుత్వం అతన్ని కూడా వాడుకుంది. ‘మాకు ఫౌస్టో అంతం కావాలి. నీకు ప్రతీకారం కావాలి’ అని అతనితో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం సుపారీ ఇచ్చిన కిరాయి హంతకుడతను! అతను వేరెవరికీ అమ్ముడుపోడని వారికి తెలుసు. చరిత్రలో ఇలాంటి వ్యూహాలు ఎన్నో! చరిత్ర పుస్తకాల్లో మాత్రం ఉండవు! ఎవరూ పూర్తిగా పుణ్యాత్ములు కాదు. అలెహాంద్రో మాన్యుయెల్ కారు దగ్గరకి చేరుకుంటాడు. అలెహాంద్రో ఉన్న కారు పోలీసు కారు కాబట్టి సిల్వియో చేత కారు పైన లైట్లు వేయించి మాన్యుయెల్ కారు ఆపుతాడు. పోలీసులు పై లైట్లు వేస్తే కారు ఆపాలని ఒక నియమం. అలెహాంద్రో సిల్వియోని చంపేసి మాన్యుయెల్ కాలి మీద షూట్ చేసి అతని కారులో వెనుక కూర్చుని ఫౌస్టో ఇంటికి వెళతాడు. అదో పెద్ద బంగళా. రెండంచెల భద్రత ఉంటుంది. మాన్యుయెల్‌ని చూసి గార్డులు గేటు తెరుస్తారు. అలెహాంద్రో మాన్యుయెల్‌ని, గార్డులని చంపేసి లోపలికి వెళతాడు.

ఫౌస్టో భార్య, ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తూ ఉంటాడు. అలెహాంద్రోని చూసి అందరూ స్థాణువులై ఉండిపోతారు. అలెహాంద్రో ఫౌస్టోతో “నువ్వు రోజూ కుటుంబాల్ని నాశనం చేస్తావు. అయినా ఇక్కడ కూర్చుని విందారగిస్తావు” అంటాడు. “నిన్ను పంపినవారు ఏమన్నా ధర్మాత్ములా? మేం వ్యాపారం వారి నుంచే నేర్చుకున్నాం” అంటాడు ఫౌస్టో. అతని మాటలు కొలొంబియా ముఠాని ఉద్దేశించినవి. మళ్ళీ “నువ్వు శోకంలో ఉన్నావు. నీ భార్య నిన్ను చూసి గర్వపడుతుందా? నీ మీద నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు” అంటాడు. “నాకు వ్యక్తిగతంగానే నష్టం జరిగింది” అంటాడు అలెహాంద్రో. చివరికి అలెహాంద్రో నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తాడు. తర్వాత అతను కేట్ ఇంటికి వచ్చి అన్నీ చట్టప్రకారం జరిగినట్టు సంతకం పెట్టమంటాడు. అంటే అతను మెక్సికోలోకి వెళ్ళిన విషయం రిపోర్టులో ఉండదన్నమాట. ఫౌస్టోని ఎవరు చంపారనేది బయటి ప్రపంచానికి తెలియదు. కేట్ సంతకం పెట్టనంటుంది. ఆమెని తుపాకీతో బెదిరించి అతను సంతకం పెట్టిస్తాడు. అతను వెళ్ళిపోతుంటే ఆమె అతని వెనుక నుంచి తుపాకీ గురిపెడుతుంది. అతను వెనక్కి తిరిగి ఆమెని చూస్తాడు. ఆమె తుపాకీ పేల్చలేక దించేస్తుంది.

అలెహాంద్రో వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకుని ఉంటే అతను నేరస్థుడు. కానీ ప్రభుత్వం తరఫున హత్య చేశాడు కాబట్టి అతను నేరస్థుడు కాదు. పైగా అతనికి రక్షణ ఉంటుంది. అతను చంపింది ఒక రాక్షసుడినే. కానీ వేరే రాక్షసుల (కొలొంబియా ముఠా) తరఫున చంపాడు. ఏది ధర్మం, ఏది అధర్మం? చెప్పటం చాలా కష్టం. కేట్ అతన్ని చంపితే ఏం ఒరుగుతుంది? ధైర్యం ఉంటే అతను చేసిన తప్పులు బయటపెట్టి న్యాయవిచారణ చేయించాలి. కానీ ఇది అంత తేలిక కాదు. ప్రభుత్వం ఆమెని ముప్పుతిప్పలు పెడుతుంది. ప్రభుత్వం చేసే తప్పులు చూస్తూ కేట్ ప్రభుత్వ సంస్థలో పని చేయగలదా? బయటకి వచ్చేస్తే డ్రగ్స్ ముఠా ఆమెని వదులుతుందా? ఇంతకీ ఫౌస్టో మరణిస్తే మెక్సికో డ్రగ్స్ ముఠా వ్యాపారం మానేస్తుందా? అన్నీ ప్రశ్నలే. అందుకే దీన్ని కలియుగం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here